'Sakshi - Manassakshi' - New Telugu Story Written By Singeetham Ghatikachala Rao
Published In manatelugukathalu.com On 22/06/2024
'సాక్షి - మనస్సాక్షి' తెలుగు కథ
రచన: సింగీతం ఘటికాచల రావు
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
దూరంగా ఎవరో వస్తున్నట్టు అనిపించింది. చూపు ఆనడం లేదు. పెట్టుకున్న కళ్ళద్దాలు తీసి బాగా రుద్ది మళ్ళీ పెట్టుకుని చూశాడు డెబ్భై ఏళ్ళ సింహాచలం.
అతని మానస ఘోష మౌనంగా మూలిగింది.
‘లాభం లేదు. అబ్బాయికి చెప్పి వేరే జోడు మళ్ళీ కొనుక్కోవాలి. వాడేమంటాడో. ఎవరన్నారోగానీ ఆ మాట మాత్రం నిజమే. తండ్రి సంపాదన కొడుకు యథేచ్చగా ఖర్చు పెట్టగలడు. కానీ కొడుకు సంపాదన తండ్రి అలా ఖర్చు పెట్టలేడు. సర్వేన్ద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కానీ లోకంలో ఇలాంటి పరిస్థితులు చూడవలసిన దౌర్భాగ్యం ఆ కళ్ళకు కలుగుతూందంటే అది బిడ్డల లోపమా, తన పెంపకమే తనకిచ్చిన శాపమా? ఐనా వాణ్ణని మాత్రం ప్రయోజనమేమిటి? లోకం తీరే అంత. పూర్వం ఒక్కరి సంపాదనతో అరడజను సభ్యులున్న కుటుంబం నిశ్చింతగా జీవనం సాగించేది. ఇప్పుడు ఇద్దరున్న కుటుంబమైనా భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనే బండి నడిచేది’ అంతులేని ఆలోచనలతో మెల్లగా లేచి గుమ్మం వద్దకు వచ్చాడు.
ప్రహరీ గేటు తెరుచుకుని కొడుకు రమేష్ లోపలికి వస్తున్నాడు. అతని వెనకే వేరే ఎవరో వస్తున్నారు. బహుశా అతని ఆఫీసులోని వాళ్ళేమో. భవాని ఇంకా రాలేదు. భవాని అంటే కోడలు. ఇద్దరూ ఉద్యోగం పేరుతో ఉదయం వెళ్తే ఎప్పుడొస్తారో వాళ్ళకే తెలీదు. ఇంట్లో ఇద్దరూ వయసు మళ్ళిన వాళ్ళు. ఏదైనా అవసరానికి తోడు కూడా ఎవరూ ఉండరు.
ఈ మధ్యన కొడుకు కోసం ప్రతి రోజూ కాకున్నా రోజు విడిచి రోజు లేదా వారానికి కనీసం రెండు మూడు రోజులు ఎవరో ఒకరు వచ్చి వెళ్తూనే ఉన్నారు. అలా వచ్చినప్పుడల్లా వాళ్ళ చేతుల్లో ఏవో బ్యాగ్గులు, లేదా సూట్ కేసులు ఉంటాయి. వాటిని కొడుకుకిచ్చేసి వెళ్ళిపోతున్నారు.
వాళ్ళేమిస్తున్నారో ఇతనేం తీసుకుంటున్నాడో అర్థం కాకున్నా వాడేదో తప్పు చేస్తున్నాడన్న విషయం అర్థమౌతూంది. ‘అలాంటి తప్పు చెయ్యమని తప్పుడు మార్గంలో నడవమనీ వాడికి నేర్పలేదే నేను’ అనుకున్నాడు సింహాచలం అమాయకంగా.
ఆ ఊళ్ళో ఆర్ అండ్ బీ విభాగంలో ఇంజనీరుగా ఉన్నాడు రమేష్. అతని భార్య ఏదో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం. ఇద్దరికీ కలిపి కనీసం నెలకు రెండు లక్షలైనా ఉంటుంది సంపాదన. తనకు ఏ లోటూ రాకుండా బాగా చూసుకుంటున్నా ఈ కళ్ళద్దాల విషయంలో కొడుకును అడిగి డబ్బులు తీసుకోవాలంటే సంకోచంగానే ఉందతనికి.
అతను చేసింది ప్రభుత్వ ఉద్యోగం కాదు. కాబట్టి పెన్షన్ ఆదాయం సున్నా. కొద్దో గొప్పో రిటైర్మెంట్ ఫండ్ లా చేర్చిపెట్టుకున్న సొమ్ము చెప్పుకునేంత పెద్ద మొతం కాదు.
ఆ విధంగా ప్రస్తుతం పూర్తిగా కొడుకు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. జీవితంలో మొదటిసారిగా చింతించాడు. తానొక్కడే ఐతే బహుశా చింతించేవాడు కాదేమో. తనకు తోడుగా జీవిత భాగస్వామిని ఉంది. ఇలా ఆధారపడడం వల్ల ఎవరైనా తన భార్యను అవమానిస్తే అది మాత్రం తను సహించలేడు. ‘వృద్ధాప్యంలో ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. స్వతంత్రంగానే బతికే పరిస్థితులు కల్పించుకోవాలి. కానీ అది ఇప్పుడనుకుని ఏం లాభం’ అంటూ చింతించాడు.
ఇంట్లోకి వచ్చిన కొడుకు దగ్గరికి ఒక అరగంట తరువాత వెళ్ళాడు సింహాచలం. మనసులో అనేకమార్లు తర్జన భర్జనలు చేసుకున్న మీదట ‘ఐనా పరాయి వాళ్ళనెవర్నైనా అడుగుతున్నానా, నా బిడ్డనే కదా అడిగేది, నిజానికి వాడు బాగానే చూసుకుంటున్నాడు’ అనుకుని మెల్లగా వెళ్ళి కళ్ళద్దాల గురించి చెప్పాడు సింహాచలం.
తండ్రి వంక కొద్ది క్షణాలు చూసి “ఏంటి నాన్నా, ఎన్నాళ్ళుగా ఉందిలా? ఈ విషయం ముందే చెప్పొచ్చుగా, బయలుదేరు” అంటూ వెంటనే బయలుదేరదీశాడు.
తనతోబాటు తన భార్యని కూడా పక్కనే ఉన్న డాక్టర్ దగ్గరికెళ్ళి కంటి పరీక్షలు చేయించి మరో రెండ్రోజుల్లో ఇద్దరికీ కొత్త కళ్ళద్దాలు వచ్చేలా ఏర్పాటు చేశాడు రమేష్.
ఫర్వాలేదు. కొడుకు తమను బాగానే చూసుకుంటున్నాడు. తమపట్ల శ్రద్ధ వహిస్తున్నాడు అంటూ మరోమారు అనుకుని సంతృప్తి చెందాడు.
***
ఆరోజు ఉదయమే సిటీ అంతా ఒకటే గోలగోలగా, గందరగోళంగా ఉంది. ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆందోళన! విషయమేమిటని ఎవర్నడగాలో తెలియలేదు.
ఓపిక తెచ్చుకుని లేచి బయటికి నడిచాడు సింహాచలం. ఇంటికి కొద్ది దూరంలోని నాలుగు రోడ్ల కూడలిలోని టీ కొట్టు దగ్గర జనం గుంపుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు.
నిదానంగా అక్కడికి వెళ్ళి నిలబడి వాళ్ళ మాటలు వినసాగాడు.
‘బ్రిడ్జ్ కింద ఒక బస్సు ఇరుక్కుపోయింది. అందులో చాలామంది ఇరుక్కుపోయారు. బ్రిడ్జ్ పైన వచ్చే బస్సు చీకట్లో విరిగిన బ్రిడ్జ్ చూసుకోక పైనుంచి కిందికి పడిపోయింది. అందులోని వాళ్ళందరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు ముగ్గురి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది’ అదీ వాళ్ళ మాటల సారాంశం.
“ఏ బ్రిడ్జ్ బాబూ” అంటూ మాట కలిపాడు సింహాచలం. అక్కడికి వచ్చిన సింహాచలం వంక ఎగాదిగా చూశారు అక్కడున్న మనుషులు.
“ఏంటి పెద్దాయనా. ఈ విషయం కూడా తెలీదా? బైపాస్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు రైల్వే గేటుంది కదా. ఆ గేటు తీసి అక్కడ ఫ్లై ఓవర్ కడుతున్నారు కదా. అదే బ్రిడ్జ్ కూలిపోయింది. ఇంకా నయం. ఆ టైమ్ కు ట్రైన్ ఏదీ రాలేదు. వచ్చుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది” అన్నాడొక వ్యక్తి.
“ఇంజనీరెవడో వాణ్ణి తన్నాలి ముందు” అంటూ ఉచిత సలహా ఇచ్చాడు మరొకడు.
“ఇంజనీర్ని వాడితోబాటు ఆ కాంట్రాక్టర్ గాణ్ణి కలిపి బొక్కలో తొయ్యాలి. కొంచెం కూడా సిమెంటు లేకుండా ఇసకతోనే బ్రిడ్జ్ కట్టాలంటే ఎట్లా? వాడు కట్టుకునే ఇల్లు అట్లాగే కట్టుకుంటాడా?” మరొక వ్యక్తి లాజిక్ తీశాడు.
సింహాచలానికి జరిగిందేమిటో అర్థమైంది. ఆ బ్రిడ్జ్ ని పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ తన కొడుకే. ఏదో తేడా జరిగి అది కుప్పకూలింది. కచ్చితంగా వీడి మీద చర్య తీసుకుంటారు. సుమారుగా మూడు వారాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది సింహాచలానికి.
***
“సార్, మీ కష్టాన్ని ఉంచుకోను. నా కష్టాన్ని కూడా గుర్తించండి. జరిగిన తప్పును రివర్స్ చెయ్యలేం. ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. అలాగని పనులు మానేసి కూర్చుని ఉంటామా” అంటూ ఒక వ్యక్తి రమేష్ తో మాట్లాడుతున్నాడు, తన ఇంట్లోనే. అతని చేతిలో ఒక బ్రీఫ్ కేస్ ఉంది. సింహాచలం అక్కడే సోఫాలో కూర్చుని ఉన్నాడు.
“చూడండి. మీరు చేసింది చిన్న తప్పు కాదు. నేను మీకు ఏవిధంగానూ సహాయం చెయ్యలేను. ఏమాత్రం తేడా వచ్చినా ప్రజల ప్రాణానికే ముప్పు. మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తే ఆ బ్రిడ్జ్ ఎక్కువ కాలం నిలవదనిపిస్తూంది”
“మీ పై వాళ్ళను కూడా మేనేజ్ చేశాను. వాళ్ళే మీతో మాట్లాడుతారు. ఐతే ఇక్కడ వాళ్ళ కన్నా మీ సంతకమే ముఖ్యం. అందుకే వాళ్ళకిచ్చిన దానికి రెండింతలు ఇస్తున్నాను”
తల పంకించాడు రమేష్. “ఇంతలా అందరికీ ఈ లెక్కన ఇస్తున్నారంటే దీంట్లో మీకొచ్చిన లాభమెంతో నాకు అంతుబట్టకుండా ఉంది”
“మేము లాభాలు లెక్కవేసుకునేది మీలాంటి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకునే కదా. కాబట్టి మీరు దేనికీ ఆలోచించొద్దు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా మీ పేరు ఎక్కడా బైటికి రాకుండా నేను మేనేజ్ చెయ్యగలను” అంటూ బ్రీఫ్ కేస్ ముందుకు తోశాడతను.
రమేష్ బ్రీఫ్ కేస్ తెరిచి చూశాడు. కరెన్సీ వాసన కమ్మగా తగిలింది. అతని కళ్ళముందు ఊరికి కొద్ది దూరంలో నాలుగు గ్రౌండ్ల స్థలంలో తాను నిర్మిస్తూన్న విల్లా కదులాడింది. అప్పుడే అతని ఫోన్ మోగింది. ఒక్క నిముషమే. అతనివైపు చూస్తూ బ్రీఫ్ కేస్ మూశాడు రమేష్.
అతని మౌనాన్ని అంగీకారంగా అర్థం చేసుకున్న ఆ వ్యక్తి “ఉంటాను సర్” అంటూ బయటికి నడిచాడు గంభీరంగా. వెళ్తూ సింహాచలం వంక కూడా చూసి “నమస్కారం సార్” అంటూ అతనిక్కూడా నమస్కరించి వెళ్ళాడు. సింహాచలం ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు.
ఆ వ్యక్తి వెళ్ళిపోయాక “ఏమిట్రా ఇదంతా?” అన్నాడు ఆందోళనగా.
తండ్రి అక్కడే ఉండడం చూసి కొద్దిగా తొట్రుపడ్డ రమేష్ “నాన్నా. అనవసరమైన విషయాల్లో తల దూర్చవద్దు” అన్నాడు కొద్దిగా అసహనంగా.
“నువ్వేదో తప్పు చేస్తున్నావు. వచ్చిందెవరు?” అనడిగాడు ఐనాగానీ.
“పట్టించుకోవద్దన్నానా. ఈ విషయం బయటికి తెలియనివ్వొద్దు” అంటూ తన అసహనాన్ని మరింతగా వెళ్ళగక్కాడు.
***
ప్రసుతం అదే సమస్యగా మారిందన్న విషయం అర్థమైంది. అనుకున్నట్టుగానే రమేష్ ను, అతనితోబాటు అతని పై అధికారులను కూడా విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. ఆ కాంట్రాక్టర్ తాను రమేష్ కు, ఇంకా పై అధికారులకు కూడా బాగానే ముట్టజెప్పానని కుండబద్దలు కొట్టాడు. అంతటితో ఆగక ఆ సమయంలో రమేష్ తండ్రి సింహాచలం కూడా అక్కడే ఉన్నారు. అతను లంచం తీసుకున్నాడనేందుకు అతని తండ్రే సాక్షి అని కూడా చెప్పేశాడు.
సింహాచలాన్ని పిలిచి విచారించారు. కన్నకొడుకు పరిస్థితి తలుచుకుని తండ్రి హృదయం తల్లడిల్లింది. అతను చేసింది సామాన్యమైన తప్పు కాదు. కానీ ఒకవైపు కన్నపేగు. మరోవైపు కర్తవ్యం, మనస్సాక్షి. వీటీ మధ్యన జరిగిన సంఘర్షణలో కర్తవ్యం ఓడిపోయింది.
“అయ్యా, నాకు వయసైపోయింది. ఆరోజు నేనక్కడే ఉన్న మాట నిజమే కానీ నాకు చూపు ఆనదండీ. పైగా నా కళ్ళద్దాలు కూడా పగిలిపోయాయి. అతనేమిచ్చాడో నాకు కనబడలేదు”
“అబద్దం సార్. అంత పెద్ద బ్రీఫ్ కేసిచ్చాను. దాన్ని కనబడలేదంటే ఎలా? ఆరోజు అద్దాలు వేసుకునే ఉన్నాడితను” అన్నాడా కాంట్రాక్టర్ కోపంగా.
“ఆయన చెప్పింది నిజమే. అంతకు రెండు రోజులముందే కొత్త కళ్ళద్దాలు కొన్నాడితను” అన్నాడు కాంట్రాక్టర్ తరఫున వాదించే లాయర్. దానికి సంబంధించిన కళ్ళద్దాల షాపు తాలూకు రసీదు కూడా సమర్పించాడు.
“అసలా పెద్ద పెట్టెలో ఏమున్నాయో కూడా తెలీదు. రెండు రోజులముందే కొత్త కళ్ళద్దాలు కొనుక్కున్న మాట నిజమే కానీ మర్నాడే అవి కిందపడి పగిలిపోయాయి. రెండ్రోజులు కూడా కాలేదు, ఇంతలోనే మళ్ళీ కొత్త అద్దాలు కొనమంటే అబ్బాయి ఏమంటాడోనన్న బెదురుతో విరిగిన అద్దాలు నాజేబులోనే ఉంచుకున్నానండీ. కాబట్టి ఆ టైమ్ లో అద్దాలు పెట్టుకోలేదు. నిజమండీ” అన్నాడు జేబులోనుంచి పగిలిన అద్దాల ముక్కలు తీసి చూపిస్తూ.
“ఈ ముసలాయన అబద్ధం చెప్తున్నాడు సార్. నా మాట నమ్మండి. కన్న కొడుకును కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళింటికెళ్ళి సోదా చెయ్యండి. విడతలు విడతలుగా నేనిచ్చిన ఇరవై లక్షలపైనే దొరుకుతాయి” అన్నాడు కాంట్రాక్టర్.
“దూరపు చూపు ఆనదు కాబట్టి వాళ్ళ మధ్య జరిగిన విషయాలేవీ నాకు తెలీదండీ. అక్కడ కూర్చుని ఉన్నమాట నిజమేగానీ వాళ్ళ మాటలమీద దృష్టి పెట్ట లేదండీ. వీళ్ళు చెప్పే విషయాలేవీ నాకర్థం కావడం లేదు. ఇంతకన్నా నాకేమీ తెలీదు” అన్నాడు సింహాచలం.
ఐతే లాయర్ వాదనతో ఏకీభవించిన జడ్జి రమేష్ ఇల్లు సోదా చేసేందుకు ఉత్తర్వులిచ్చాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సింహాచలం ఇంటిని అణువణువూ అంగుళం వదలకుండా సోదా చేశారు.
అనుమానం వచ్చినచోట గోడలు సైతం బద్దలు కొట్టారు. ఇంటివెనక చెట్ల పాదులను కూడా తవ్వేశారు. ఇంట్లో బీరువాలో రోజువారీ ఖర్చులకుగాను ఉంచుకున్న మూడు వేల రూపాయలు మినహా ఎక్కడా వంద రూపాయలు కూడా కనిపించలేదు.
సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట అందులో రమేష్ లాంటి కింది స్థాయి ఇంజనీర్ల ప్రమేయం లేదనీ పైస్థాయి అధికారులు, కాంట్రాక్టరే పూర్తి బాధ్యులనీ నిర్ధారించి వారిమీద చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
పెద్ద ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్న సంతోషంలో ఆ సమయంలో రమేష్ కు తాను కట్టుకోవాలనుకుంటున్న కలల సౌధం ఇంకా ప్రారంభం కానందుకు ఎంతో సంతోషంగా, మరింత తృప్తిగా అనిపించింది. ఐతే దాన్ని పూర్తి చేసేందుకు చెయ్యాల్సిన ఖర్చు అంతా కళ్ళముందు కదులాడుతూంది.
ఇంట్లో ఉంచిన డబ్బంతా ఎక్కడికెళ్ళినట్టు? ఎవరికీ తెలియని, అనుమానం రాని ప్రదేశంలోనే కదా ఉంచింది. మరి ఏమైనట్టు? అన్నదే అర్థం కాలేదు.
మనసు చంపుకుని తప్పుడు సాక్ష్యం చెప్పిన సింహాచలం కోర్టు బయటకు రాగానే కొడుకు వంక చూశాడు. తండ్రితో చూపులు కలపలేక పోయాడు రమేష్. ఐనా ఆ పశ్చాత్తాపం కొంతసేపే. అతని మనసంతా కనబడకుండా పోయిన రెండు బ్రీఫ్ కేసులమీదే ఉంది. ఒకటా? రెండా? ఒక్కొక్కదాంట్లో పది లక్షలు పైమాటే.
“నాన్నా. ఇంట్లో ఉన్న డబ్బంతా ఏమైనట్టు? నువ్వేమైనా చూశావా?” ఇబ్బందిగానే అడిగాడు రమేష్.
“ఎన్నో చూడకూడని విషయాలన్నీ ఈ కళ్ళతో చూస్తున్నాను. నా కన్నకొడుకు ఇంతగా దిగజారిపోయాడన్న విషయం నువ్వు కొనిచ్చిన కళ్ళద్దాలతోనే స్పష్టంగా, కళ్ళారా చూశాను. అంతకన్నా మరేమీ చూడలేదు. ఆ పాపిష్టి డబ్బును చూడలేను కూడా. కన్నపేగు కాబట్టి మొదటి తప్పుగా క్షమించమని అంతరాత్మ ఘోషించింది. అదే నా బలహీనత. అందువల్లే అబద్దం చెప్పాల్సి వచ్చింది. నామీద నాకే చాలా అసహ్యంగా అనిపిస్తూంది. ఈ పాపం ఏం చేస్తే పోతుందో అర్థం కావడం లేదు”
ఇబ్బందిగా చూస్తూనే మాట మార్చి “అద్దాలు ఎప్పుడు పగిలాయి. మరి నాకు చెప్పలేదే. మళ్ళీ వెంటనే కొనేవాణ్ణిగా” అన్నాడు.
కొడుకువంక తదేకంగా చూసి “కళ్ళద్దాలు పగిలిపోలేదు. నేనే పగలగొట్టేశాను. నువ్వు చేసిన, చేస్తున్న పనిని ఈ కళ్ళతో చూడలేక ఆ పని చేశాను”
ఉలికిపడి చుట్టూ చూశాడు రమేష్, తమ మాటలెవరైనా వింటున్నారేమోనన్న ఉద్దేశ్యంతో. ఆ చుట్టు పక్కల ఎవరూ లేరు. అతని మనసు నెమ్మదించింది.
“ఇది నా పెంపకంలో లోపమే. నీలో నిజాయితీ చచ్చిపోతుందని కలలో కూడా అనుకోలేదు. నేను వేసుకున్నది నీ అవినీతితో కొన్న కళ్ళద్దాలు కదా. అందువల్లేనేమో ఈ కళ్ళలో సక్రమమైన కలలు కూడా రావడం లేదు. అందుకే అద్దాలు విరగ్గొట్టేశాను. ఫర్వాలేదు, నేను బ్రతికున్నంత కాలం నా స్వంత కళ్ళతోనే బతుకుతాను. అవినీతితో అరువు తెచ్చుకున్న ఈ కొత్త చూపు నాకక్కర్లేదు. నిజం చెప్పాలంటే నా జీవితానికి చుక్కాని, నా కున్న రెండు కళ్ళు మీ అమ్మే. తనుండగా నాకిక ఈ అరువు కళ్ళెందుకు? అసలు కళ్ళు లేకున్నా ఆమె కళ్ళతో నేను చూడగలను. తనే నాకు దారి చూపిస్తుంది. ఎప్పుడు నీ మనసులో పశ్చాత్తాపం కలిగి, పోయిన ప్రాణాలకు పరిహారం ఇవ్వగలుగుతావో అప్పుడు ఒకవేళ నా మనసు మారుతుందేమో ఆలోచిస్తాను. న్యాయస్థానంలో నువ్వు నిర్దోషిగా బయడపడడం నా తప్పే. అందుకు నాకు నేనుగా విధించుకున్న శిక్ష ఇదే అనుకో” అంటూ జేబులోని పగిలిన కళ్ళద్దాల ముక్కలు తీసి విసిరేసి వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాడు సింహాచలం.
రమేష్ అవమానభారంతో కుంగిపోతున్నా అతని మనసు మాత్రం ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందన్న ఆలోచన అనుక్షణం పట్టి పీడిస్తూనే ఉంది. దూరంగా వెళ్ళి వెనక్కు తిరిగి చూసిన సింహాచలానికి కొడుకు అంతర్మథనం స్పష్టంగా కళ్ళకు కట్టింది. అంతలోనే అతని పెదవిపై చిరునవ్వు విరిసింది. అందుకు కారణం –
రమేష్ ను కస్టడీలోకి తీసుకున్న రోజున రాత్రి, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఊహించి, అతను దాచి ఉంచిన రెండు బ్రీఫ్ కేసుల డబ్బు ఎవరికంట పడకుండా తీసుకెళ్ళి పక్కనున్న పేదల గూడెంలో చెల్లా చెదురుగా విసిరేశాడు సింహాచలం. మర్నాడు ఉదయం పనిగట్టుకుని అటువైపుగా వెళ్ళినప్పుడు గూడెంలోని జనమంతా సంబరాలు చేసుకుంటూండడం చూసి అతని మనసెంతో తృప్తి పొందింది. కళ్ళు చెమర్చాయి. కళ్ళల్లో సంతోషం తొణకిసలాడింది. చూపు సరిగ్గా ఆనడం లేదన్న దిగులు లేదిప్పుడతనికి.
***
సింగీతం ఘటికాచల రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/grsingeetham
నా పేరు సింగీతం ఘటికాచల రావు. మా తండ్రిగారి పేరు సింగీతం వెంకటరమణ రావు, జడ్.పి హైస్కూల్ హెడ్మాస్టర్ గా పనిచేశారు. తల్లిగారు కృష్ణవేణీబాయి, గృహిణి.
ఆరుగురు సంతానంలో నేను మూడోవాణ్ణి. పుట్టిన స్థలం నెల్లూరు పట్టణం. పదవ తరగతి పూర్తి చేశాక నెల్లూరు పాలిటెక్నిక్ కళాశాలలో 1981 లో మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాను.
1989 లో చెన్నైలోని “ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)” లో చేరి అక్కడే అంచెలంచెలుగా ఎదిగి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గా ఏప్రిల్ 2024 లో పదవీ విరమణ చేశాను. ప్రస్తుతం చెన్నైలోనే స్థిర నివాసం.
1996 లో అనంతపురం వాస్తవ్యులైన శ్రీ గురురాజారావు, శ్రీమతి చంద్రకాంతగార్ల కుమార్తె విజయలక్ష్మితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు ప్రద్యుమ్న రావు, చిన్నవాడు ప్రద్యోత రావు.
సాహితీ ప్రస్థానంః నా రచనా వ్యాసంగం పన్నెండో ఏట ఛందోబద్ధమైన కవిత్వంతోనే ప్రారంభమైంది. అలా వ్రాయడంలో ఏకైక గురువు తండ్రిగారే. ఆ చిన్న వయసులోనే “సరస వినోదిని” సమస్యా పూరణం విరివిగా పాల్గొన్నాను. 1997 లో “ఐదు పైసలు” అనే శీర్షికతో రాసిన సింగిల్ పేజీ కథ స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైనది. మొదటి పారితోషికంగా యాభై రూపాయలు వచ్చాయి. 2005 లో తిరిగి మొదలైన సాహితీ ప్రయాణం ఇప్పటివరకూ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. హాస్య, సామాజిక, థ్రిల్లర్, సరసమైన అంటూ అన్నిరకాల కథలనూ రాశాను.
2007 లో “పెంకుల వసారా” కథ అనిల్ అవార్డ్ కన్సొలేషన్ బహుమతి, “పిచ్చుక గూళ్ళు” కథ 2010 సంవత్సరంలో స్వాతి మాసపత్రికలో అనిల్ అవార్డ్ గెలుచుకుంది.
మొదటి నవల “మనసున మనసై”, 1997 లో స్వాతి మాస పత్రిక అనుబంధ నవలగా ప్రచురింపబడింది. బహుమతి పొందిన నవలలలో “అజాత శత్రువు” (స్వాతి 16 వారాల సీరియల్), “రాగ విపంచి” (నవ్య వీక్లీ, సిపి బ్రౌన్ అకాడమీ అవార్డు రెండవ బహుమతి) “సారేజహాసే అచ్ఛా” (స్వాతి 16 వారాల సీరియల్) ముఖ్యమైనవి. ఇప్పటివరకూ 130 కథలు, 15 నవలలు అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతం స్వాతి సపరివార పత్రికలో “సారేజహాసే అచ్ఛా” సీరియల్ ప్రచురితమౌతూంది.
Comments