'Samagamanam' New Telugu Story
Written By Kasivarapu Venkatasubbaiah
సమాగమనం తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అనంతపురం ఎక్స్ ప్రెస్ బస్ ప్రొద్దుటూరు మీదుగా వేగంగా వచ్చి అల్లాడుపల్లె క్రాస్ దగ్గర ఆగింది. అదే సమయంలో తిరుపతి నుంచి కడప మీదుగా సూపర్ ఫాస్ట్ బస్ అంతే వేగంతో వచ్చి అక్కడే ఆగింది.
అనంతపురం బస్ నుండి రామకృష్ణ బ్యాగ్ భుజానికి తగిలించుకుని క్రిందికి దిగి ఏటూరు పోయె దారిని సూచించే బోర్డు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. తిరుపతి నుంచి వచ్చిన బస్ నుండి సీతాలక్ష్మి తన బ్యాగ్ తో దిగింది. రెండు బస్సులు దేని దారిన అవి వెళ్లి పోయాయి.
రామకృష్ణ రెబాన్ కళ్ళజోడుతో, టక్ చేసిన ఆధునిక దుస్తులతో వెలిగిపోతున్నాడు. సీతాలక్ష్మి లేటెస్ట్ ఫ్యాషన్ పంజాబీ డ్రెస్ లో మెరిసిపోతున్నది..
సీతాలక్ష్మిని బస్సు దిగుతున్నప్పుడే రామకృష్ణ చూశాడు. సీతాలక్ష్మి కూడా బస్సు దిగుతూ రామకృష్ణను ఏటూరు నేమ్ బోర్డు దగ్గర నిలబడి ఉండడాన్ని గమనించింది.
రామకృష్ణను చూస్తూనే ప్రాణం లేచి వచ్చినట్లు మనస్సంతా ఆనందంతో నిండిపోయింది సీతాలక్ష్మికి. సీతాలక్ష్మిని చూసిన రామకృష్ణకు అదే పరిస్థితి. ఆపాదమస్తకం పులకరింపుతో మైకం క్రమ్మినట్లైంది. మనస్సు ఉప్పొంగింది. చాల కాలం తరువాత కలుస్తున్నందుకు ఇద్దరూ ఉద్వేగానికి లోనయ్యారు. అయినప్పటికీ ఇద్దరిలోనూ ఏదో తెలియని హుందాతనం తిష్టవేసింది. రామకృష్ణ నిలబడ్డ చోటికి అడుగులు వేసింది సీతాలక్ష్మి.
"రామకృష్ణ చిన్నప్పటి నుండి చూస్తున్న వ్యక్తి. అయినప్పటికీ చాల కొత్తదనంతో కనిపిస్తున్నాడు. రామకృష్ణ లో శారీరక మార్పులు బాగా చోటు చేసుకున్నాయి. మనిషి ఎంతగానో తీరినాడు. ఎర్రటి శరీరఛాయ, ఆరడుగుల ఎత్తు ఆకర్షణీయంగా అందంగా ఉన్నాడు. " తన్మయంగా అనుకుంది సీతాలక్ష్మి.
"సీతాలక్ష్మి తనతోపాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితురాలు. వయసు తెచ్చిన మార్పులతో అపురూప సౌందర్యరాశిగా మారిపోయింది. ఎరుపు తెలుపు పసుపు కలిపితే వచ్చే రంగు ఆమె మేనిఛాయ " ఆ ఛాయతో వచ్చిన అందంతో తనవైపే వస్తున్న సీతాలక్ష్మిని తలచుకుని తాదాత్మ్యం చెంది చూస్తూ ఉండిపోయాడు రామకృష్ణ.
ఇంతలో తేరుకున్న రామకృష్ణ, "ఏమ్మీ సీతాలక్ష్మి! బాగున్నావా? " అన్నాడు పలకరింపుగా.
"ఆ.. బాగున్నానబ్బీ! నువ్వెలా వున్నావు " అంది సీతాలక్ష్మి సమాధానం తోపాటు ప్రశ్న వేస్తూ.
"బాగున్నానమ్మీ! ఇప్పుడేనా రావడం? రామకృష్ణ కూడా జవాబులో ప్రశ్న మిలితం చేసి అడిగాడు.
"ఇప్పుడేబ్బీ! నువ్వు వస్తున్నట్లే నేనునూ" అంది.
ఎంత చదువుకున్నప్పటికీ తన ఊరివాళ్ళు పలకరించినా! తన సమవయస్కులు కనిపించినా! తన ఊరి భాషలోనే అనుకోకుండనే మాట్లాడుకోవడం జరిగిపోతుంది. అలా లేకపోతే చిత్రంగా చూస్తారు తమ ఊరివాళ్ళు. అలాంటిది బాల్యం నుండి కలిసిమెలిసి తిరిగినోళ్ళ సంభాషణ, సంబోధన ఇలాగే ఉంటాయి. అది వారి చనువుకు గుర్తు. అదే పరాయి వ్యక్తితో మాట్లాడాల్సి వస్తే సంభాషణ ఆసాంతం పాలీస్డుగా మారిపోతుంది అప్రయత్నంగానే.
"సబ్జెక్టు లేమి మిగిలిపోలేదు కదా?" రామకృష్ణ సందేహాత్మక ప్రశ్న.
" సబ్జెక్టులు మిగలడమా! ర్యాంకు కూడా వచ్చింది అబ్బాయి " అనీ భుజాలు ఎగురవేస్తూ " మరి నీ విషయమూ! చదువు పూర్తైనట్లేనా?" అడిగింది సీతాలక్ష్మి అనుమానం వ్యక్తంచేస్తూ.
"పూర్తి కావడమే కాదు! చెన్నైలోని ఒక కంపెనీ నుంచి జాబ్ లో చేరమని కాల్ లెటర్ కూడా వచ్చింది తెలుసా!" ఉత్సాహంగా చెప్పాడు రామకృష్ణ.
"మరేం! జీవితం గాడిలో పడినట్లే" ఆనందాన్ని వెల్లడించింది.
"ఏం. నువ్వు చేయవా జాబ్" సందేహం వ్యక్తం చేశాడు.
"ఎందుకు చేయనూ.. చేసుకున్నవాడు ఒప్పుకుంటే?" రామకృష్ణను ఓరగా చూస్తూ అం.
"ఇంత చదువు చదివింది ఊరక ఉండడానికా?" చిరుకోపంగా అంటూ "అన్నట్లు మన ఊరి బస్ యిప్పుడే పోయిందట. ఏదన్న ఆటో వస్తుందేమో చూడాలి. " రామకృష్ణ అటుఇటూ చూస్తూ అన్నాడు.
"ఏమబ్బా రాంకిట్నా! బాగున్నావా!" చంద్రయ్య రామకృష్ణను చూసి పలకరించాడు. పక్కనే ఉన్న సీతాలక్ష్మిని చూసి "నువ్వూ ఇప్పుడేనామ్మా! రావడం?" అంటూ చంద్రయ్య తనతో వున్న వ్యక్తితో "వీళ్ళదీ మా ఊరే! మా చుట్టుపక్కల ఊర్లల్లో ఇంత చదువు చదినోళ్ళు లేరు. మా ఊరి పేరు నిలబెట్టినారు " పట్టరాని సంబరంతో చెప్పాడు చంద్రయ్య.
"బాగుండాం పెద్దబ్బా! ఊర్లో అందరూ బాగుండారా? " అన్నారు ఇద్దరూ.
"బాగుండారుగానీ నేను కేతారానికి పోతాండా! ఏదన్నా మన ఊరి ఆటో కనిపిస్తే పంపిస్తాను ఉండండి" అని చంద్రయ్య తనతో వచ్చిన వ్యక్తితో కలిసి వెళ్లి పోయాడు.
"అరే అన్నా! ఏమన్నా! అక్కడ నిలబడ్డారు! రండన్నా! కాఫీ తాగుదురూ" అని కేకేశాడు రాముడు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ నుంచి.
వాడు అందులో నెల జీతానికి పని చేస్తున్నాడు. పేరు పెట్టి పిలుస్తున్నది రామకృష్ణనైనా! ఇద్దర్నీ రమ్మనే వాడి అర్థం. ఇద్దరూ అటుగా వెళ్ళారు.
"అన్నా! మిమ్మల్ని సూచ్చాంటే కన్నుల పండుగ్గా ఉందన్నా!" ఇద్దర్నీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాడు రాముడు.
వాడి ఆప్యాయతకు ప్రయాణ బడలిక పోయి మనసు తేలిక బడింది ఇద్దరికీ. అక్కడి నుండి రామకృష్ణ ఊరు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. తమ ఊరికి పోవాలంటే కిలోమీటర్లకు ఒక ఊరు వంతున ఐదు ఊర్లు దాటాలి. సింగిల్ రోడ్డైనా చాలా బాగుంటుంది. ఇంతలో తమ ఊరివే రెండు ఆటోలు ఒకదాని వెనుక ఒకటి తమ ఊరి నుంచే వచ్చాయి. ముందొచ్చిన ఆటో చెంగయ్యది.. ఏవో మూటలు ఆటోలో నిండుగా ఉన్నాయి.
వచ్చీరాగానే చంగయ్య రామకృష్ణతో " రామక్రిష్ణా! శనక్కాయ మూటెలు ఎత్తుకొని మైదుకూరు పోతాండా!నేనొచ్చేయాలకు ఆచ్యం కావొచ్చు! యనక రాజు ఆటో వొచ్చాంది. దాంట్లో పోండి ఊరికి " అన్జెప్పి చంగయ్య ఆటో తీసుకుని ఆపసోపాలు పడుతూ వెళ్లిపోయాడు.
నిండా మనుషుల్తో రాజు ఆటో వచ్చి వాళ్ళ ముందు నిల్చింది. రామకృష్ణను సీతాలక్ష్మిని చూసి ఆనందంతో మురిసిపోయాడు రాజు. " రామకృష్ణ వీళ్ళను చాపాడులో విడిచి వస్తా! ఇక్కడే ఉండండి. లేదా నిదానంగా పోతూ ఉండండి. నేను మిమ్మల్ని వెదుక్కంటాను. " అన్జెప్పి వెళ్ళిపోయాడు రాజు.
"మనం పల్లెలో పుట్టిన వాళ్ళమే కదా! మనకు నడక కొత్తేమీ కాదు. పద పోదాం " అని రాముడి దగ్గర సెలవు తీసుకుని రామకృష్ణ తమ ఊరి దారి పట్టాడు.. సీతాలక్ష్మి వెంట కదిలింది.
రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూములు కేసి కెనాల్ ఆయకట్టు కావడం వల్ల పసుపు చెరకు వేరుశనగ వరి పైర్లతో పచ్చగా కళకళలాడుతున్నాయి. పైర్లు పైనుండి వీస్తున్న గాలి చల్లగా శరీరాలకు తగిలి ఇద్దరి మనసులకు ఉల్లాసం కల్గిస్తుంది. సీతాలక్ష్మి చేయి పట్టుకొని నడవాలని రామకృష్ణ మనసు ఉవ్విళ్ళూరుతున్న ది. రామకృష్ణ భుజాలు రాసుకుంటూ పోవాలని సీతాలక్ష్మి కోరిక ఉవ్వెత్తున ఎగసిన పడుతున్నది. అయితే ఏదో పెద్దరికం అడ్డుపడుతున్నది.
సీతాలక్ష్మి రామకృష్ణ లిద్దరూ చిన్ననాటి సంఘటనలను, పెద్దయ్యాక తమతమ కాలేజీల అనుభవాలు అనుభూతులను ఒకరినొకరు చెప్పుకుంటూ తమకు తెలియకుండానే బెట్టుతనం పోయి చిన్ననాటి చనువు వారి మధ్య ప్రవేశించి భుజాలు నడుములు రాసుకుంటూ నడవసాగారు.
పొలాల్లో పని చేసుకుంటున్నవారు వీళ్ళను గమనించి "ఓయ్" అంటూ చేతులు ఊపారు. " "ఓహోయ్" అంటూ వీళ్ళూ చేతులు ఊపారు. ఓ ట్రాక్టర్ జనంతో పోతూ ఉత్సాహంగా "హాయ్" అంటే వీళ్ళూ రెట్టింపు ఉత్సాహంతో " హాయ్" అన్నారు. చుట్టూ ఉన్న ఊర్లందరికి తెలిసి ఉండడం వల్ల ఎదురైనా ప్రతి ఒక్కరూ ప్రేమతో పలకరిస్తున్నారు. వీళ్ళూ అంతే అభిమానంతో సమాధానం ఇస్తూ తమ ఊరి వైపు నడక సాగిస్తూ మాటల్లో పడ్డారు.
"సీతా! నీకు కాలేజీ తిండి బాగా ఒంటబట్టినట్లుంది. మాంచి రంగుదేలి అప్సరసలా తయారైనావు" చిలిపిగా అన్నాడు రామకృష్ణ.
"ఏం పాపం! నీకేం తక్కువ బాబు? సినీ హీరో మహేష్ బాబు లా నవ మన్మధుడిలా వెలిగిపోతున్నావు" అంది రామకృష్ణ వైపు మోహనంగా చూస్తూ.
"నిజమా! నన్ను ఎవరైనా ఇష్టపడతారంటావా? నీదేమో యక్ష గంధర్వ కన్యలకు తీసిపోని అందం. నీకే సమస్యా రాదు. నాకే సమస్యంతా" రామకృష్ణ నిరాశ పడుతున్నట్లు చెప్పాడు.
"రామూ! నన్ను పరీక్షించడానికి అంటున్నావో! మరేం ఉద్దేశంతో అంటున్నావోగానీ ఎవరి ముఖం వాళ్ళు చూసుకోలేరు, అద్దంలో చూసుకొనే వరకు. నీ అందం కిన్నెర కింపురుషులంటారే, వారికేం తీసిపోవు. ఇంద్రుడూ చంద్రుడూ కూడా నీ ముందర దిగదుడుపే. ఇది నేనిస్తున్న సర్టిఫికెట్ అనుకో! " తన మనసులోని భావాన్ని బయటి పెట్టింది సీతాలక్ష్మి.
"అద్సరేగాని సీతా! నీ ఏమైనా ఎక్సర్సైజ్ చేసేదానివా? శిల్పి చెక్కిన శిల్పంలా అందమైన అవయవాలు ఏర్పడ్డాయి"
ఒకింత ఆశ్చర్యాన్ని ముఖంలో ప్రతిఫలింపజేస్తూ అన్నాడు.
"ఇదుగో రామూ! నన్ను మరీ పొగడమాకు. నీ మనసులో ఏముందో అది చెప్పు " అంది కూపీ లాగడానికి ప్రయత్నిస్తూ.. చిరుకోపం నటిస్తూ..
ఔనుగానమ్మీ! నీ జుట్టుకు ఏమి రాసేదానివి ? తుమ్మెద రెక్కల్లా నల్లగా నిగనిగలాడుతున్నాయి. అదీగాక కోటేరులాంటి ముక్కు కలవరేఖులాంటి కన్నులు దొండపండ్లలాంటి పెదాలు మృదువైన నున్నటి బుగ్గలు అందమైన చిన్ని గెడ్డం శంకులాంటి మెడ అందంగా అమరిన భుజాలు.. " రామకృష్ణ అంటుండగా సీత "ఆపాపు బాబు! చాల్చాలు నీ వర్ణన. నేను వర్ణించాలంటే నీకు గొప్ప విశేషాలే ఉన్నాయి. " అంటూ రామకృష్ణ వర్ణనను సీత అడ్డుకుంది. లేకుంటే రామకృష్ణ వర్ణన ఎందాక పోయ్యేదో!
రామకృష్ణ తన మాటలను కొనసాగిస్తూ "సౌందర్యమూ, చదువు, సంస్కారమూ, ప్రేమించే తత్వమూ ఉన్న నువ్వు ఎవరి భాగస్వామి అవుతావో గాని, అతడు అదృష్టవంతుడు. అన్నట్లు నా నామీద నీ అభిప్రాయం ఏమిటి?" అన్నాడు చిరునవ్వు మోముతో, విషయం రాబట్టుకోవాలన్న తపనతో.
"అందానికి అందం, స్త్రీని సమానస్థాయిలో గౌరవించే స్వభావం, ఎవరికి తీసిపోని సుగుణం ఉన్న నిన్ను భర్తగా పొందే స్త్రీనే నిజమైన అదృష్టవంతురాలు" మనస్పూర్తిగా అంది ఆరాధన భావంతో.
మాటల్లో పడి అప్పుడే ఐదు ఊర్లల్లో ఒక ఊరు దాటారు.
రామకృష్ణ సీతాలక్ష్మిల ఊరు ఏటూరు. పెన్నా కుందూ నదులు సంగమించే అందమైన ప్రదేశం. ఇద్దరూ బాల్యం నుంచి ఒకరి విడిచి ఒకరు ఉండేవారు కాదు. పొద్దస్తమానం ఏదో ఒక ఆట ఆడుకుంటూ పొద్దు గడిపేవారు. ఆడుకుంటూ ఇద్దరి ఇండ్లల్లో ఏదోక ఇంట్లో నిద్రపోయే వారు. రామకృష్ణ ఇంట్లో సీతాలక్ష్మి నిద్రపోతే సీత తల్లి వచ్చి ఎత్తుకు పోయేది. సీత ఇంట్లో రాము నిద్రపోతే రామకృష్ణ అమ్మ వచ్చి భుజాన వేసుకొని పోయేది.
వంకల్లో, వాగుల్లో, తోటల్లో ఎక్కడ చూసిన వీరే. చెట్లు ఎక్కుతూనో, చేపలు పడుతూనో వీళ్ళే కనిపించేవారు. కేసి కెనాల్ కు నీళ్ళు వొదిలినప్పుడు కెనాల్ లాకల దగ్గరికి పోయి నీళ్ళు పైనుండి పడుతుండడాన్ని కేరింతలు కొడుతూ చూసేవారు. ఊర్లో అంతమంది పిల్లలు ఉన్నా! వీరిద్దరే ప్రత్యేకంగా కలిసి ఉండడాన్ని చూసి ఊర్లో అందరూ అది విశేషంగా చెప్పుకునేవారు. పిల్లలు కదాయని తల్లిదండ్రులు కూడా పట్టించుకునేవారు కాదు.
ఎలిమెంటరీ స్కూలు చదువు ఏటూరులో సాగింది. అటు తర్వాత హైస్కూల్ చదువు పక్కనేవున్న పంచాయతి కేంద్రమైన ఖాజీపేటలో ముగిసింది. ఇంటర్మీడియట్ చదువు కోసం పెన్నానది ఆవలి వైపు ఉన్న చిన్న టౌన్ కమలాపురంలో ఇద్దరినీ చేర్పించారు వీరి తల్లిదండ్రులు.
ఏటూరు నుంచి కమలాపురం మూడు కిలోమీటర్లు దూరం ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఆవూరికే పోతుంటారు. అప్పటికింకా పెన్నానదిపై బ్రిడ్జి నిర్మించలేదు. ఏట్లో నీళ్ళు మోకాళ్ళ లోతు, నడుంలోతు ఉన్నప్పుడు ఏట్లో దిగిపోతుంటారు ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు ఏటికి నాటు పడవ నడిపేవారు.
రామకృష్ణ, సీతాలక్ష్మి ఇద్దరూ ఉదయమే అన్నం క్యారియర్లతో బయలుదేరి సాయంత్రానికి ఏట్లో దిగి నడుచుకుంటూ వచ్చేవారు. ఏటికి బాగా నీళ్ళు వచ్చినప్పుడు పడవపై ఏరు దాటేవారు.
సంక్రాంతికి ముందు రోజు రాముడూ సీతా కూడబలుక్కుని కుందూ ఆవలి వైపు ఉన్న రంగనాయక తువ్వకు రేగిపండ్ల కోసం పోయారు, భోగి రోజు భోగిపండ్లు పోసుకోవడానికి కావాల్సివచ్చి, రంగనాయక తువ్వన రేగిపండ్ల చెట్లు అధికంగా ఉన్నాయి. రామకృష్ణ చెట్టు ఎక్కి రేగిపండ్లు కోసి కింద పడవేస్తుంటే సీతాలక్ష్మి ఒడి పట్టింది. చాలినన్ని పండ్లు కోశాక తిరుగుముఖం పట్టారు. కుందేట్లో దిగి వస్తున్నప్పుడు సీత నీటిలో లోతైన చోట అడుగు పెట్టడంతో అదుపు తప్పి మునుగుతూ తేలుతూ నీళ్ళంబడి కొట్టుకపోతూ "రామూ" అని భయంతో గట్టిగా అరిచింది. రాము కంగారుపడి వెంటనే నీటిలోకి దూకి ఈతాడుతూపోయి సీత రెట్ట అందుకొని ఏటి ఒడ్డుకు లాక్కొచ్చాడు. సీతాలక్ష్మి భయంతో బిగిసుకొని పోయింది.
"అందుకేనమ్మా! నే చెప్పేదీ, ఆడైనా మగైనా ఈత నేర్చుకోవాలనేది. " ఎగతాళిగా నవ్వి రామకృష్ణ ఇంటి దారి పట్టాడు. సీత వణుకుతూ రాము వెంట నడిచింది.
మరో రోజు రామకృష్ణ పెన్నలో ఈత కొడుతూవుంటే సీతాలక్ష్మి ఒడ్డున నిలబడి గమనిస్తూ ఉంది. ఉన్నట్టుండి పైనీళ్ళు రావడం వల్ల నీటి ఉరవడి పెరిగి రామకృష్ణ నిలతొక్కుకోలేక ప్రవాహంలో కొట్టుకపోతూ " సీతా" అని కేకేశాడు. సీత గాబరాపడి పక్కనే ఉన్న పొడవైన కర్ర తీసుకొని రాముకు అందించి బయటికి లాగింది. గుండం గడచినందుకు సంతోషపడ్డాడు రామకృష్ణ.
"కుందూలో నన్ను రక్షించినందుకు నిన్ను పెన్నలో కాపాడిన, సరికి సరీ సరిపోతుంది " గేలి చేస్తూ నవ్వింది సీత.
"నాకేం భయం లేదు. ఈత వచ్చినవాడు నీళ్ళల్లో కొట్టుకపోతున్నా ! ఎక్కడో ఒకచోట ఆధారం దొరికి బయట పడతాడు"ధీమాగా అన్నాడు.
"ఇక్కడెక్కడా బయట పడలేవు. ఆదినిమ్మాయపల్లె లాకల దగ్గర తప్పు" అంది హేళన చేస్తూ.
"సరే సరే పదా పోదాం! పరీక్షలు దగ్గర పడినై, ప్రిపేర్ కావాలి" అంటూ గబగబా ఇంటికి నడిచాడు. రాముని అనుసరించింది సీత.
ఆతరువాత ఇద్దరూ ఇంటర్ ప్రథమ శ్రేణిలో పాసవడం, పై చదుల కోసం సీతాలక్ష్మి కడపలో తన బాబాయి ఇంట్లో ఉంటూ బి. టెక్. చేయడం, రామకృష్ణ ప్రొద్దుటూరులో పెద్దనాన్న ఇంట్లో ఉండి బి. టెక్ చదవడం, పూర్తి కాగానే సీతాలక్ష్మి ఎస్వీ యూనివర్సిటీ తిరుపతిలో, రామకృష్ణ ఎస్కే యునివర్సిటీ అనంతపురంలో ఎం. టెక్ లో జాయిన్ కావడం జరిగిపోయాయి. పనిలోపనిగా ప్రాక్టికల్స్ కోసం సీతాలక్ష్మి బెంగుళూరుకు పోతే, రామకృష్ణ హైదరాబాద్ పోయాడు. దాదాపు ఆరేడు సంవత్సరాలు పాటు ఇద్దరూ పెద్దగా కలిసింది లేదు. అప్పుడప్పుడు సెలవుల్లో తప్ప.
అంత సుధీర్ఘ కాలం తరువాత అల్లాడుపల్లే క్రాస్ దగ్గర ఒకరినొకరు చూసుకున్నప్పుడు ప్రాణంలో ప్రాణం కలిసి పోయినంత మహానందపడి పోయారు. మళ్లీ ఇంత కాలానికి ఇప్పుడు ఇద్దరూ పెన్నలో కుందూ కలిసినట్లు కలిసి ప్రయాణిస్తున్నారు. ఎద ఊసులు చెప్పుకుంటూ, అనురాగాలు, ఆత్మీయతలు పంచుకుంటూ, సంతోషపు అంచులపై నడుస్తున్నారు.
"భవిష్యత్తు ప్రణాళిక గురించి ఏమాలోచిస్తున్నావమ్మీ? " ఆగిపోయిన మాటలు మళ్లీ మొదలు పెడుతూ రామకృష్ణ సీతను కలిపాడు.
"ఇందాకే చెప్పాను కదబ్బీ! నన్ను కట్టుకున్నాడు ఉద్యోగం చేయమంటే చేస్తా! ఇంట్లో వుండు అంటే ఉంటా!" అంది యధాలాపంగా.
"అయితే నీకు సొంత ఆలోచన లేదన్నమాట" రామకృష్ణ మాటల్లో కరుకుదనం ధ్వనించింది.
"భర్త మాటే వేదం వాక్కు కదా భారతీయ స్త్రీకి " దీర్ఘం తీస్తూ ఒకరకమైన యాసతో అంది సీత, ఆమె మాటల్లో వ్యంగ్యం తొంగి చూసింది.
"చూడు సీతా! ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. దాన్ని చేరుకోవడానికి దీక్షతో కృషి చేయాలి. ఎవరి మీద ఆధారపడకూడదు ఒకరిపై భారం వేసి మనం నిశ్చింతగా బ్రతకాలి అనుకోవడం తప్పు. మనకు జీవితం పట్ల ఒక అవగాహన ఉండాలి. ఎలా సాగాలి అనేదానిపై ఒక చక్కని ప్రణాళిక ఉండాలి. భార్య భర్తకు బానిస కాదు. ఇద్దరూ సమానమే. ఒకర్నొకరు గౌరవించుకుంటూ ఒకర్నొకరు అభిమానించుకుంటూ ప్రేమను పంచుకుంటూ సంసారం సాగిచాలి. అదే అందమైన సంసారం. ఉదాహరణకు భార్య చిత్రకారిణి, భర్త సాహితీకారుడు అయితే ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోవాలి, ఒకరి విజయం ఒకరిదిగా భావించాలి. అదీ అరమరికలు లేని జీవనం" చెప్పాడు జీవితం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయం ఉన్న రామకృష్ణ.
"అయితే నువ్వే చేసుకో మరి" మనసులో అనుకుంది సీత.
"రామూ! నీ లాంటి అభ్యుదయ భావాలు గల భర్త అందరికీ దొరకొద్దూ" అంది బయటికి.
"కాస్త ఆలస్యమైనా భావాలు కలిసిన వ్యక్తినే భర్తగా ఎన్నుకోవాలి. ఆలోచనలు ప్రగతిశీలంగా ఉండాలి" చెప్పాడు బోధిస్తున్నట్లు. ఇంతలో వెనుక నుంచి రాజు ఆటోతో వీళ్ళను అందుకున్నాడు.
"చాల దూరమే నడిచారు గాని ఆటో ఎక్కండి త్వరగా పోదాం" రాజు మెచ్చుకోలుగా అన్నాడు. రాజు టెంత్తు వరకు తమతో పాటు చదువుకున్నాడే.
ఇద్దరూ ఆటో ఎక్కి రాసుకుంటూ పూసుకుంటూ కూర్చున్నారు. ఆటో వేగంగా కదిలింది.
"మన ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఊర్లల్లోని జనం మీ ఇద్దరి గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? రాజు అన్నాడు సస్పెన్స్ కొనసాగిస్తూ.
"ఏమనుకుంటున్నారు రాజూ?" ఇద్దరూ ఒకేసారి అడిగారు ఒకింత ఆసక్తిని కనబరుస్తూ..
"మీ ఇద్దరి జంట బాగుంటుందని, ఈడు జోడు సరిగ్గా సరిపోతుందని, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే చూడాలని అందరూ అమితాసక్తిగా చెప్పుకుంటున్నారు" సస్పెన్స్ విడదీస్తూ రాజు అన్నాడు ఆత్రం ఆపుకోలేక.
రామకృష్ణ, సీతాలక్ష్మి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మెరిసే కళ్లతో, ఆ చూపుల్లో పరిపూర్ణమైన ప్రేమైక భావం తొణికిసలాడింది.
"మరి మీ సీతాలక్ష్మి గారు ! ఏమీ చెప్పలేదే ఇంతసేపు కలిసి నడుస్తున్నా! " నగుమోముతో అన్నాడు. రెచ్చగొడుతూ.
"ఏంది రామకృష్ణా! మగాడే కదా! ముందడుగు వెయ్యాల్సింది. ఆడ మనిషి సిగ్గు విడిచి ఎలా చెప్పుతుంది? చెప్పు! " రాజు మగాడి బాధ్యతను గుర్తుచేశారు.
"రాజు! ఇంకా నేనే చెప్పుతాను సిగ్గు విడిచి. ఎందుకో తెలుసా? ఎవరి ప్రాణం వారికి తీపిగనుక. నా ప్రాణమే దూరమైతే నేను ఎలా బ్రతకాలి! అందుకే సిగ్గు విడిచి నేనే చెప్పుతున్నా! " సీతాలక్ష్మి చెప్పలేనంత ఉద్వేగంగా చెప్పుకొచ్చింది.
"చూడు రామకృష్ణా! నువ్వు నా ప్రాణానివి. నీకోసమే పుట్టాను. నీకోసమే బ్రతుకుతున్నాను. నీవు లేని జీవితాన్ని ఊహించలేను కూడా. నేను యింత చదువు చదివింది కేవలం నీకోసమే. నీ కోరిక తీర్చడానికే. నీకు గుర్తుందా? మనిద్దరం ఇంటర్ పాసైనప్పుడు కమలాపురం నుంచి సర్టిఫికెట్స్ తీసుకుని పెన్నలో పడవలో వస్తూ నువ్వు అన్నమాటలు నీకు జ్ఞాపకం లేవా?
"సీతా! ఇప్పుడు నీవేం చేయాలను కుంటున్నావు " అన్నావు
"ఇంకేం చేస్తాము!. ఆడవాళ్ళు! పెద్ద చదువు చదువుతామా ఏమీ! పెళ్లి చేసుకుంటాం!" అన్నాను. అప్పుడు నువ్వేమన్నావో తెలుసా?
'అవకాశం ఉండీ, చదివించగల స్తోమత తల్లిదండ్రులకు ఉండీ కూడా చదువుకోలేని ఆడవాళ్ళంటే నాకిష్టం ఉండదు. ఆడవారు ప్రతి విషయానికి మగవారిపై ఆధారపడకూడదు. స్త్రీలు స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి ఉండడాన్ని నేను గౌరవిస్తాను. నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. ఇద్దరూ సంసారం విషయంలో, పిల్లల విషయంలో, సంపాదన విషయంలో సమాన బాధ్యతలు తీసుకోవాలి. భార్యాభర్తలు సంసారమనే బండికి రెండు చక్రాల వంటివారు. ఏం చక్రం దెబ్బ తిన్నా బండి నడవదు. జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. దానికి ఒక చక్కని ప్రణాళిక ఉండాలి' అన్నావు.
అందుకే చదివాను. కేవలం నీకోసమే చదివాను. నిన్ను భర్తగా పొందడం కోసమే చదివాను. ఇక నీకు దూరంగా ఉండలేను రామూ! కాలేజిలో చదివేటప్పుడు కూడా నీ ఊసులు, నీ ఊహలే ఊపిరిగా గడిపాను. కుందూ పెన్నా కలిసి ప్రవహిస్తంన్నట్లు ఇంకా మనిద్దరమూ కలిసి జీవన ప్రయాణం సాగించాల్సిన సమయం వచ్చింది రామూ" అప్పటివరకు ఉగ్గపట్టిన ప్రేమంతా సీతాలక్ష్మిలో వెల్లువలా పొంగి బయటికొచ్చింది.
"సీతా! నాపై యింత ప్రేమ ఉంచుకుని ఎలా దాచుకున్నావు ఇన్నాళ్లు. నేను మాత్రం నిన్ను వదిలి ఎలా ఉండగలను? ఈ రోజు వస్తున్నదే నీకోసం. " ఆర్ద్రత నిండిన గొంతుకతో అన్నాడు రామకృష్ణ.
"అసలు విషయం చెప్పనా! మన ఇద్దరి గురించి మనం వెనుక ఏమి జరిగిందో! మీ నాన్న మా నాన్న దగ్గరకొచ్చి, 'మా యమ్మినీ మీ యబ్బికి చేసుకోమని' మన పెళ్లి ప్రస్తావన తెచ్చాడట. ' మీ యమ్మి మా ఇంటి కోడలు కావడం మాకు ఆనందమే, కానీ పిల్లోడిని అడిగి అభిప్రాయం కనుక్కోవాలి కదా! అలాగే మీ పిల్ల మనసులో ఏముందో తెలుసుకున్నావా! ' అన్నాడట మా నాన్న. ' తెలుసుకుంటాగానీ, నీ కొడుక్కు ఫోన్ చేసి అభిప్రాయం కొనుక్కొని వెంటనే రమ్మను ' అని చెప్పాడట మీ నాన్న.
మా నాన్న ఫోన్ చేసి విషయం చెప్పితే 'ఒప్పేసుకో ' అని చెప్పి పయనమై వస్తున్నా. లేకుంటే ప్రొద్దుటూరు నుండి అటే చెన్నై పోయి మల్లెప్పుడో వచ్చేవాడిని. " రామకృష్ణ తాపీగా చెప్పాడు జరిగిన విషయాన్ని.
"అమ్మ దొంగా! ఎంత నాటకమాడినావు! నీకు ముందే విషయం తెలుసన్నమాట! నన్ను పిచ్చిదాన్ని చేసినవే! అందుకేనేమో! మానాన్న ఏ మాట చెప్పకుండా, ఫోన్ చేసి వెంటనే రమ్మన్నాడు. ఇందాకటి నీ వ్యవహారం చూస్తే 'మనుసులో ఏదో పెట్టుకుని పిల్లా గడ్డికి పోదాం రా!' అన్నట్లు ఉంది" అంది సంబ్రమాశ్చర్యాలతో.
"మీ పెళ్లి నాలుగూర్లకు పండుగ. పెళ్లి వైభవంగా చేయాలని మీ నాన్నోళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నాకు ముందే తెలిసినా! మీ మనసులో ఏముందో తెలుసుకోవాలని నేను చెప్పలేదు "రాజు సంబరపడిపోతూ చెప్పుకొచ్చాడు.
"సీతా! నీ రెస్యూమ్ నాకియ్యి. నేను రేపు చెన్నై పోయి జాబ్లో జాయినై, నీ రెస్యూమ్ కంపినీ వాళ్ళకు ఇచ్చి వస్తాను" అని చెప్పుతూ.. అంతలోనే రామకృష్ణ "అయితే ఒక కండిషన్ సీతా! పెళ్ళైయ్యక నన్ను అబ్బీ గిబ్బీ అనొద్దు". బుంగమూతి పెట్టి అన్నాడు.
సీతాలక్ష్మి నవ్వి "అననుగాని, నన్ను కూడ అమ్మిగిమ్మి అనకూడదు, సరేనా! " అని రాముడి గుండెలపై మైమరచి వాలిపోయింది.
ఇద్దరి మధ్య అనురాగం పెన్నా వరదైపోయింది. ఆటో ఏటూరిలోకి ప్రవేశించింది.
---------------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.
Commentaires