కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Samanam Kante Ekkuve' New Telugu Story
Written By K. Lakshmi Sailaja
రచన: కే. లక్ష్మీ శైలజ
ఆ రోజు రవళి తో పాటు ఆమె ఇంటికి రమ్య కూడా వెళ్ళింది, వాళ్ళ పాపను చూడటానికి. తల్లీ కూతుళ్ళు ఇద్దరికీ వారం రోజులనుంచి జ్వరమని సెలవు పెట్టి రవళి ఆ రోజే ఆఫీస్ కు వచ్చింది.
'ఆడవాళ్ళు ఎప్పుడూ సెలవు పెడ్తారు. అలాంటప్పుడు ఇంట్లో వుండొచ్చు కదా. పని చెయ్యకుండా జీతం తీసుకుంటారు' అని ఆఫీసర్ బాగా అరిచేటప్పటికి రవళి బాగా ఏడ్చేసింది. అందుకని రమ్య కూడా రవళి తో పాటు వాళ్ళింటికి వచ్చింది, రవళిని ఇంట్లో వదిలి, బాబు ను చూసి పోవచ్చని.
అప్పుడు రవళి ఆఫీస్ లో జరిగిన విషయాన్ని భర్త రమేష్ కు చెప్పి, కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
రమ్య కూడా "మేము ఎదిరించి మాట్లాడలేక పోతున్నాము. ఇలాంటి మాటల వల్ల ఆఫీస్ పని సరిగా చెయ్యలేక పోతున్నాము. ఇంటికి వెళ్ళినా మనసుకు కష్టంగానే వుంటోంది. ఆఫీస్ లో పనిచేసే ముప్ఫై మందిలో మేము ఇద్దరమే అమ్మాయిలమవడం కూడా మగవాళ్ళు మమ్ములను ఇలా ఎగతాళి మాటలు మాట్లాడే దానికి కారణమయ్యిందేమో. కేరళ, ఉత్తరప్రదేశ్ లల్లో పనిచేసే అధికారులలో ఆడవాళ్ళే ఎక్కువట. అక్కడికి వెళ్ళి పనిచేస్తే మాకు గౌరవంగా వుంటుందని అనిపిస్తోంది, " అంది ఆవేదనగా.
"దిగులు పడకండి. మీరు బాధపడుతున్నారని తెలిస్తే అవతలి వాళ్ళు ఇంకా ఎక్కువ మాటలు అనగలరు. అతను మారాలంటే ముల్లును ముల్లుతోేనే తీద్దాం. మీ ఆఫీసర్ కూతురు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ప్రిన్సిపల్ గా చేసే కాలేజ్ లో సైన్స్ లెక్చరర్ గా పని చేస్తోంది. ఆ అమ్మాయి ద్వారా మనం అతనికి బుధ్ధి చెబ్దాం, " అన్నాడు రమేష్.
" కొంచెం త్వరగా మాట్లాడండి, " అని రవళి బ్రతిమిలాడింది.
"అలాగే. ఇప్పుడే మా ఫ్రెండ్తో మాట్లాడతాను, " అన్నాడు రమేష్ మొబైల్ చేతిలోకి తీసుకుంటూ. రమ్య ఇంటికి వెళ్ళింది.
మర్నాడు సాయంత్రం ఆఫీసర్ కూతురు మౌనిక కాలేజ్ నుంచి ఎనిమిది గంటలకు లేటుగా ఇంటికి వచ్చింది.
వస్తూనే, హ్యాండ్ బ్యాగ్ సోఫాలో విసిరేసి ఏడుస్తూ కూర్చుంది.
అక్కడే టి.వి. చూస్తున్న ఆఫీసర్,
"ఏమైంది మౌనికా, "అన్నాడు ఆదుర్దాగా.
"చూడు నాన్నా, మా ప్రిన్సిపల్ ఈరోజు, 'మీరు వంటింట్లో వంట చేసుకుంటూ వుండక, తగుదునమ్మా అని ఉద్యోగాల కెందుకు వస్తారు?' అన్నాడు, " అంది గట్టిగా అరుస్తూ.
ఆ అరుపులకు కిచెన్ లో నుంచి వాళ్ళమ్మ మహేశ్వరి బయటకు వచ్చింది. "అదేమిటి? ఎమ్మెస్సీ చదివావు, ఉద్యోగం చేస్తే తప్పేంటి?" అంది.
"ఎవరామాట అన్నది? " కోపంగా అన్నాడు ఆఫీసర్.
"ఇంకెవరూ! మా ప్రిన్సిపల్, " అంది రోషంగా.
"ఏం జరిగిందో కాఫీ తాగి నిధానంగా చెప్పమ్మా, " అందామె అనునయంగా.
ఒక పది నిముషాల తరువాత ఇలా చెప్పింది మౌనిక.
"ఈ రోజు మా కాలేజ్ లో మీటింగ్ జరిగిందమ్మా. ఒక్కో సబ్జెక్ట్ లో ఏ పద్ధతి లో ఎలా టీచ్ చేస్తున్నారు... లాస్ట్ మంత్ జరిగిన ఎగ్జామ్స్ కు ఈ మంత్ జరిగిన ఎగ్జామ్స్ కు స్టూడెంట్స్ ఎంత ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారు... ఇంక వేరే ఏ పద్దతి లో ఉన్నతంగా మనం విద్యను అందించవచ్చు... అనే విషయంగా చర్చించాము.
అప్పుడు నేను స్టూడెంట్స్ ను కఠినంగా దండించకుండా ఎలా సులభమైన రీతిలో సిలబస్ ఇచ్చి ఎగ్జామ్స్ పెడితే బాగుంటుందో చెప్పాను.
అప్పుడు అందరి ముందు నన్ను 'అందుకే.. ఆడవాళ్ళు వంట చేసుకోకుండా ఉద్యోగాలకు వస్తే ఇలాగే వుంటుంది, అంత లలితంగా చెప్తే స్టూడెంట్స్ వినరు. కఠినంగా చెప్పి వాళ్ళను దారిపెట్టడము మీకు తెలియదు' అని అవహేళన చేశాడు ప్రిన్సిపల్, " అంది మౌనిక.
మళ్ళీ వాళ్ళ నాన్న తో "నాన్నా! మీ ఆఫీస్ లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా. మీరు వాళ్ళను ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? మీకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం కదా. అందుకే కదా, చిన్నవయసులో చదువు ఆపేసి పెళ్ళిచేసి పంపించకుండా అన్నయ్యతో పాటు నన్నూ పీ.జీ. దాకా చదివించారు. ఆ మాత్రం జ్ఞానం, మర్యాద మా ప్రిన్సిపల్ కు లేవెందుకు నాన్నా!" అంది మౌనిక.
"ఆడవాళ్ళను తక్కువ చేసి మాట్లాడితే పురుగులు పట్టి పోతారులే, " అని వాళ్ళమ్మ అంటోంది.
ఆఫీసర్ కు ఆఫీస్ లో తను ఆడపిల్లలను ఎలా నీచంగా మాట్లాడతాడో, వాళ్ళు తలవంచుకొని కన్నీళ్ళతో వెళ్తుంటే ఎంత పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడో గుర్తొచ్చింది. తనను పై అధికారులు వత్తిడికి గురి చేస్తే తను ఆ వత్తిడిని తగ్గించుకోవడానికి అలా ఆడవాళ్ళను మాట్లాడేవాడు.
ఇప్పుడు తన కూతురిని ఇంకొక ఆఫీసరు హేళన చేశాడు. తను చేసిన పాపం తన కూతురికి తాకిందా. 'అయ్యో....ఆ ఆడపిల్లలు కూడా ఇలాగే బాధ పడి వుంటారు, ఇక నుంచి వాళ్ళను గౌరవంగా చూడాలి' అనుకుంటూ పశ్చాత్తాపం తో పచార్లు చేయసాగాడు ఆఫీసర్.
ఆ తెల్లవారి రవళి, రమ్య ఆఫీస్ లో ఎంతో నెమ్మదిగా తమకు సూచన లిస్తూన్న ఆఫీసర్ ను చూస్తూ పులి ఇలా పిల్లిలాగా ఎలా మారిందబ్బా అని ఆశ్చర్య పోసాగారు. అప్పుడు రవళి రమేష్ కు ఫోన్ చేసి ఆఫీసర్ లో మార్పును చెప్పింది, రహస్యంగా.
"అవునా... ఓ. కే. సాయంత్రం మనం వివరంగా మాట్లాడుకుందాం. నేనిప్పుడు ఒకరికి ఫోన్ చేసి థాంక్స్ చెప్పాలి, " అంటూ రమేష్ మౌనిక కు ఫోన్ చేసి, " థాంక్యూ, మేడం. మీరు మీ నటనా చాతుర్యం తో కాలేజ్ లో ఏమీ జరగకుండానే, మా మాట మన్నించి, ఈ నలుగురే కాదు, ఎంతోమంది ఆడవారి పక్షంగా నిలబడి, ప్రిన్సిపల్ గారు మిమ్ములను ఎగతాళి చేసి మాట్లాడినట్లు చెప్పి, మీ నాన్నగారిలో మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు మా రవళి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీకు శ్రమ ఇచ్చాము. మీకు మరొక్కసారి కృతజ్ఞతలు, " అన్నాడు.
ఆ మాటలకు " అలా ఏమీ అనుకోవద్దు. మా నాన్నేకాదు. అందరు మగవాళ్ళ లో ఆడవారిని మనతో సమానంగా చూడాలి అనే భావన కలగాలి. ఆడవారు కూడా ఎంతో పెద్ద హోదాలల్లో ఉన్నారని వాళ్ళు మరచిపోతుంటారు.
ప్రతిభాపాటిల్ గారు, ఇందిరాగాంధీ గారు, మీరా కుమార్ గారు, పి.టి. ఉషగారు, మల్లీశ్వరిగారు, ఇంద్రనూయి గారు, చందా కొచ్ఛర్ గారు ఇలా చెప్పుకుంటే పోతే ఎంతో మంది ఆడవారు ఎంతో మంది మగ వాళ్ళ కంటే ఎక్కువ నైపుణ్యం తో వాళ్ళ రంగాల్లో రాణిస్తున్నారు. మగవాళ్ళల్లో కొందరికి ఆడవాళ్ళను గౌరవించడం ఇష్టం ఉండదు.
ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ సమానమే నని వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం కాదు, మగవాళ్ళ కంటే ఎక్కువ సమానం. వాళ్ళు జీవితం లో ఎదుగుతూ కూడా, పసిపిల్లలను ప్రపంచానికి అందిస్తున్నారు.
నా వంతు కర్తవ్యంగా మా నాన్న గారిని మార్చగలిగాను. నేనే మీకు థాంక్స్ చెప్పాలి. నాకూ చాలా సంతోంగా వుంది, " అంది మౌనిక, కనీసం ఒక మగవానిలో నైనా మార్పు తేగలిగి నందుకు ఎంతో తృప్తిగా.
కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.
నెల్లూరు లో ఉంటాను.
నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.
ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.
జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.
యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.
Comments