సమస్యకు పరిష్కారం
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- 5 days ago
- 4 min read
#SamasyakuParishkaram, #సమస్యకుపరిష్కారం, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #పిల్లలకథలు, #TeluguChildrenStories

Samasyaku Parishkaram - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 10/04/2025
సమస్యకు పరిష్కారం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
తెనాలి రామకృష్ణ కవి వీధి వసారాలో నిలబడి పరధ్యానంతో ఆందోళనగా కనిపిస్తున్నారు. గాయత్రి జపించేటప్పుడు రోజూ మాదిరి కాక ఏకాగ్రత లోపించింది. ఇదంతా గమనిస్తున్న కాత్యాయనికి భర్త ఆందోళనకి కారణం తెలియడం లేదు.
మధ్యాహ్నం భోజనం అయాక తమలపాకుల తొడిమలు చిదిమి, ఈనెలు తీసి సున్నం రాసి వక్కముక్కలు పెట్టి ఆప్యాయంగా ఇస్తుంటే రామకృష్ణ కవి అవి నోట్లో పెట్టుకున్నా మనసు మాత్రం దీర్ఘాలోచన ఉంది.
భర్తని నిశితంగా గమనిస్తున్న కాత్యాయని ఉండబట్టలేక "మీ ఆందోళనకి కారణమేం"టని అడిగింది.
"మా రాజ దర్భారులో జరిగే సమస్యలకూ, సమావేశాలకు ఇంటి వద్దుండే మీ ఆడవాళ్లేం పరిష్కరించ గలరు?" అని తేలిగ్గా మాట్లాడాడు రామలింగ కవి.
"అలాగే అనుకోండి. మీ మగవారికున్నంత తెలివితేటలు మా ఆడవారికి లేకపోవచ్చు. కనీసం సమస్య ఏంటో తెలిస్తే మా పరిధిలో సహాయం చెయ్యగలమో లేదో తెలుస్తుంది. కనక మిమ్మల్ని వేధిస్తున్న సమస్యకు గల కారణం చెప్ప"మని భార్య వత్తిడి చేస్తుంటే రామకృష్ణ కవికి చెప్పక తప్పలేదు.
"నిన్నటి రోజున రాయలవారి భువన విజయం నిండు సభలో కవితాగోష్టి , సంగీత లహరి పూర్తయిన తర్వాత కృష్ణ దేవరాయలవారు ఒక జటిల సమస్యను సంధించారు. ఎవరైన వ్యక్తి నూరు వరహాల్ని ఒకరోజులోనే కడుపుకి ఖర్చు చెయ్యాలి. మరొక రీతిన వాటిని ఖర్చు చెయ్య కూడదట. ఇంకొకరి భాగస్వామ్యం ఉండకూడదు, అని షరతులు పెట్టి అలా సమస్యను పరిష్కరించిన వారిని సభలో ఘనంగా సన్మానిస్తామన్నారు. నూరు వరహాలు చాలా పెద్ద రాశి. అంత డబ్బును ఒక్క రోజులో కడుపుకి తినడమంటే కష్ట సాధ్యమే కదా!"
అని వివరిస్తూ “నిండు సభలో రాయల వారు అకస్మాత్తుగా ఇటువంటి జటిల సమస్య చెప్పగానే అందరూ ఆశ్ఛర్య చకితులయారు. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
వెనకటికి ఎన్నో కఠినమైన సమస్యల్ని పరిష్కరించిన నావైపు అందరి చూపులు మళ్లాయి. నేను మాత్రం మౌనంగా ఉండిపోయాను.
కృష్ణ దేవరాయలవారు సభ ముగిస్తు , ఎవరైన ఈ సమస్య పరిష్కరించ దలిస్తే ఎప్పుడైనా సభా ముఖంగా తెలియచేయాలన్నారు. నాకు పరిష్కార మార్గం తోచక ఆలోచనలో పడ్డాను " అని తన ఆంధోళనకి కారణం భార్యకు వివరించి తెలియచేసాడు రామకృష్ణ కవి.
భర్త చెప్పిన నూరు వరహాలు ఒకే వ్యక్తి ఒకేరోజున కడుపుకి ఖర్చు చెయ్యలనగానే కాత్యాయని కొంచంసేపు ఆలోచించి ఏదో స్ఫురించి భర్త చెవిలో పరిష్కార మార్గం చెప్పింది.
భార్య చెప్పిన ఆలోచన విని రామకృష్ణ కవి కళ్ళు ప్రకాశించాయి. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. భర్త లో వచ్చిన మార్పుకు కాత్యాయని సంతోషించింది.
మర్నాడు కృష్ణదేవరాయల వారి భువన విజయం సభ యధావిధిగా మొదలైంది. మహామంత్రి తిమ్మరుసు , అష్టదిగ్గజ పండితులందరు వారి వారి స్థానాలలో ఆశీనులయారు.
రామకృష్ణ కవి రోజు మాదిరి గాయత్రి జపించి దేవి విభూతిని లలాటం భుజ స్కందాలు ఛాతిపై పూసుకుని ఎర్రని శాలువ భుజ స్కందాలపై కప్పుకుని ప్రత్యేకంగా కనిపిస్తున్నారు.
రాయలవారు యధావిధిగా సభాకార్యక్రమాలు వీక్షిస్తు, గతంలోని తన సమస్యని పునరుధ్గాటించారు.ఎవరి నుంచైన సమాధానం వస్తుందేమోనని సభవైపు దృష్టి సారించారు.
రామకృష్ణ కవి తన ఆసనం నుంచి లేచి నిలబడి రాయల వారికి నమస్కరించి తన అంగీకారం తెలిపి, తమరు సభలో కోరిన విధంగా నూరు వరహాల్ని కొన్ని క్షణాల్లో సభలో భుజిస్తాను. నూరు వరహాల్ని ఇప్పించండనగానే రాయల వారు, సభలో ఉన్న పండిత గణం ఆశ్ఛర్యంగా రామకృష్ణ వైపు చూడసాగారు.
రాయలవారి ఆజ్ఞ ప్రకారం మహామంత్రి తిమ్మరుసు వారు వంద వరహాల్ని చిన్న పట్టు సంచిలో ఉంచి రామకృష్ణ కవికి అప్పగించారు.
సభానంతరం రామకృష్ణ కవి వరహాల మూట తీసుకుని రాయల వారి ఆభరణాలు తయారు చేసే వజ్రాల వ్యాపారి రాయలవారు పంపినట్లుగా చెప్పి వంద వరహాలతో అత్యంత ఖరీదైన రెండు వజ్రాలు కొనుగోలు చేసాడు.
వజ్రాలను భద్రంగా, రాణివాసానికి బంగారు నగలు తయారు చేసే మాధవాచారి దగ్గరికెళ్లి రెండు వజ్రాలను నిప్పుల కొలిమిలో ఉంచి ఎర్రగా కాల్చి భస్మం చెయ్యమన్నాడు.
రాయలవారి ఆస్థాన కవి రామకృష్ణే స్వయంగా వచ్చి ఇచ్చినందున మాధవాచారి మరొకమాట అడగకుండా అత్యంత ఖరీదైన వజ్రాల్ని పాత్రలో ఉంచి కొలిమిలో ఎర్రని నిప్పుల్లో కాల్చి భస్మం చేసి చిన్న వెండి భరిణెలో ఉంచి ఇచ్చాడు.
మరుచటి రోజు రాయలవారి భువనవిజయం సభ ప్రారంభం కాగానే అందరు రామకృష్ణ కవి రాక కోసం ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు.
ఇంతలో రామకృష్ణ చిన్న వెండిభరిణెతో సభా ప్రవేశం చేసి రాయల వారికి సభకు ప్రణామం చేసాడు.
నిన్నటి రోజున రాయలవారి నుంచి నూరు వరహాల రొక్కంమూటతో వెళ్లిన రామకృష్ణ కవి ఉత్త చేతులతో రావడం చూసి అందరూ మరింత ఉత్కంఠతకు గురయారు.
రామకృష్ణ కవి రాయల వారి నుద్దేసించి సభా మంటపం మధ్య ఒక ఆసనం ఏర్పాటు చేయించి ఒక మోద (యాబది) లేత తమలపాకులు, గుల్ల సున్నం, కాచు, వక్క పలుకులు
చిన్న పాత్రతో జలం తెప్పించవల్సిందిగా కోరాడు.
రామకృష్ణ కవి కోరినట్లుగా అన్ని వస్తువులు హాజరు పరిచారు. సభ మద్య ఆసీనుడై తన వెంట తెచ్చిన వెండిభరిణెలో కొద్దిగా జలం పోసి అందులో ఉన్న భస్మాన్ని చిన్న ముద్దగా చేసి గుల్ల సున్నంతో కలిపాడు.
రెండేసి లేత తమలపాకులు తీసుకుని కొంచం కాచు పట్టించి వజ్రాల భస్మం కలిపిన సున్నం రాసి వక్కపొడి ఉంచి నోట్లో పెట్టుకుని నమలడం ప్రారంభించాడు. లేత తమలపాకులు కాచు సున్నంతో కలిపి భుజించి రాయలవారి నుద్దేశించి " తమరి కోరిక ప్రకారం క్షణాల్లో నూరు వరహాలు నా కడుపులో చేరేయి" అన్నాడు.
రాయలవారితో పాటు సభలో ఉన్న వారంతా అదెలా సాధ్యం అని ఆశ్ఛర్యపోతుండగా తను నూరు వరహాలతో వజ్రాల వ్యాపారి వద్ద వజ్రాలు కొనడం, వాటిని నగలు చేసే మాధవాచారి ద్వారా భస్మం కావించడం, ఆ భస్మాన్ని వెండిభరిణెలో ఉంచి సభ సమక్షంలో
తమలపాకులతో భుజించడం వరకు వివరంగా తెలియచేసాడు.
రామకృష్ణ తెలివితేటలు, సమయస్ఫూర్తికి రాయలవారు ఆనందించి సభ అందరి తన మెడలోని ముత్యాల హారాన్ని రామకృష్ణ కవి మెడలో అలంకరించారు. సభలోని
వారందరు కరతాళ ధ్వనులతో అభినందించారు.
స్వాగత సత్కారాలతో వచ్చిన రామకృష్ణ కవికి ఇంటి వద్ద చిరునవ్వుతో ఎదురు వచ్చిన భార్య కాత్యాయనిని అభినందిస్తు “ఈ సన్మానానికి నువ్వే అర్హురాలి”వంటు తన మెడలోని ముత్యాలహారాన్ని ఆమె మెడలో వేసాడు.
మగవాని విజయానికి వెనుక ఒక స్త్రీ ఉంటుందని కాత్యాయని నిరూపించింది.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments