'Samayaspurthi' - New Telugu Story Written By Palla Venkata Ramarao
Published In manatelugukathalu.com On 03/09/2024
'సమయస్ఫూర్తి' తెలుగు కథ
రచన: పల్లా వెంకట రామారావు
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
కొండవీడు రాజ్యాన్ని సుకేతు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు మంచి పరిపాలనా దక్షుడు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు కష్టనష్టాలేవీ దరిచేరకుండా పాలన సాగిస్తున్నాడు. అతనికి తగినట్లే అతని ఉద్యోగులు కూడా సహకరిస్తుంటారు.
అలాంటి రాజు కొద్ది రోజులుగా అన్య మనస్కంగా ఉంటున్నాడు. పరిపాలన విషయాలు ఏవైనా మంత్రులు చెప్పినా వారిపైనే వదిలేసి మీరే ఏదో చేయండి అంటున్నాడు. కొన్నిసార్లు సభకు కూడా సరిగా రావడం లేదు. దాంతో పాలన కొంచెం కుంటుపడింది. ఈ విషయం ప్రధానమంత్రిని కొంచెం ఆలోచింపజేసింది. రాజు ఇలా ఉన్నాడని శత్రువులకు తెలిస్తే ప్రమాదం. అయితే ఎక్కువ కాలం ఈ విషయాన్ని దాచలేము. అలాగని అందరితోనూ చర్చించలేం. సరే ఎవరికో ఒకరికి చెప్పాలి కదా!
ప్రధానమంత్రి తనకు అత్యంత సన్నిహితుడైన కవిరాజు అనే పండితుడికి ఈ విషయం చెప్పాడు.
కవిరాజు ప్రధానమంత్రికే కాదు సుకేతుకు కూడా సన్నిహితుడు. అతడు అంతఃపురంలో మిగిలిన వారి కంటే కొంచెం స్వేచ్ఛగా తిరగగలిగే చనువుంది. మంత్రి ద్వారా విషయం తెలుసుకున్న కవిరాజు నవ్వుతూ “ఇక ఈ విషయాన్ని నాకు వదిలేయండి. నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తానుగా” అంటూ భరోసానిచ్చాడు.
కొద్దిరోజులు గడిచాయి. సుకేతు ఉల్లాసంగా సభకు రావడమే కాకుండా పరిపాలన విషయాలు యధావిధిగా ఉత్సాహంతో నిర్వహించడం మొదలుపెట్టాడు. అది చూసిన ప్రధానమంత్రికి సంతోషం కలిగింది.
కవిరాజును కలిసి "ఏమైందో ఏమో కానీ రాజు మళ్ళీ మునుపటిలా సంతోషంగా ఉన్నాడు. ఇది దానంతట అదే జరిగిందా? లేక నీవేమైనా చేశావా?" అని అడిగాడు మంత్రి.
దానికి కవి రాజు నవ్వుతూ "అయ్యా! మీరు చెప్పిన తర్వాత నేను కొంత పరిశోధన చేశాను. అంతఃపురంలో ఏం జరిగిందో నాకు సన్నిహితంగా ఉండే కొందరి ద్వారా సమాచారం సేకరించాను. రాజకుమారుడు గౌతముడు కొద్ది రోజులుగా అలకతో ఉంటున్నాడు. ఆ అలకకు కారణం ఏమిటి అని అడిగాను. అతనికి కొండపల్లి బొమ్మల పైన ఇష్టం పుట్టింది అవి కావాలని రాజు గారిని అడిగాడు. రాజుకి ఎందువలనో ఆ బొమ్మలంటే ఇష్టం లేదు. అందుకని రాజకుమారుని కోర్కెను వెంటనే తీర్చలేదు. అందువల్ల రాజకుమారుడు రాజుకు ఎదురు పడకుండా తిరగడము, సమయానికి భోజనం చేయకుండా ఉండడము వంటి చేష్టలు చేస్తున్నాడు. దాంతో రాజుగారికి, రాణి గారికి మనశ్శాంతి లేకుండా పోయింది. పోనీ రాణి గారు బొమ్మలు తెప్పిద్దామంటే రాజుకు కోపం వస్తుందేమో అని మిన్నకుండిపోయారు. ఈ విషయం తెలిసిన నేను వెంటనే కొండపల్లి బొమ్మలని తెప్పించాను. వాటిని చూసిన గౌతముడు సంతోషంతో తన అలక మాని తల్లిదండ్రులతో మునుపటిలా ఉండడం మొదలుపెట్టాడు. దాంతో రాజు గారు కూడా యధావిధిగా తన కార్యక్రమాలు చేస్తున్నారు" అని వివరించాడు కవిరాజు.
"మంచి పని చేశారు కవి రాజు! ఇంట్లో మనశ్శాంతి ఉంటేనే బయట కూడా ఏ విజయాన్ని అయినా సాధించగలం. ఇంట్లో ఇబ్బందులు ఉంటే బయట ఏ పనీ చేయలేం. రాజుగారికి మనశ్శాంతి కలిగించి రాజ్యాన్ని కాపాడారు" అన్నాడు మంత్రి.
"రాజోద్యోగిగా అది నా కర్తవ్యం" అని వినయంగా సమాధానం ఇచ్చాడు కవిరాజు.
“అయితే నాకు ఒక సందేహం. రాజుగారు ఆ బొమ్మలపై అయిష్టతతో ఉన్నారని అన్నావు కదా! మరి నీవు బొమ్మలు తెప్పిస్తే నీ మీద కోప్పడలేదా?" అడిగాడు మంత్రి.
"అవి తెప్పించింది నేనే అయినా ఆ విషయం బయటకు చెప్పలేదు. గౌతముడి స్నేహితుడికి ఆ బొమ్మలు ఇచ్చి వాటిని యువరాజుకు చేరవేయమని చెప్పాను. పిల్లలను అందునా గౌతముని స్నేహితుడిని రాజు ఏమీ అనలేడు కదా!" అంటూ నవ్వాడు కవిరాజు.
"నీ సమయస్ఫూర్తితో రాజ్యానికి మేలు చేశావు కవిరాజా!" అని అభినందించాడు మంత్రి.
----------
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.
@The_leo_tv
• 2 hours ago
బాగుంది కథ