#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #SambaralaRambabu, #సంబరాలరాంబాబు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు
Sambarala Rambabu - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao
Published In manatelugukathalu.com On 29/12/2024
సంబరాల రాంబాబు - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆ ఇంట్లో అమరేశ్వరరావు అరవయ్యేళ్ల పండుగ వైభవంగా జరుగుతుంది. అయితే నిన్నటి వరకూ బాగానే హుషారుగా ఉన్న అమరేశ్వరరావు ఈ రోజు ఒక్కసారిగా చాలా నీరసంగా మారిపోయాడు. 99 పాళ్ళు జీవితం గడిచి పోయింది ఇక ఒక శాతం మాత్రమే మిగిలి ఉంది అన్న విచిత్ర భావన అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఫంక్షన్కు వచ్చిన అందరితో 'నాకు మీ అందరినీ చూడడం ఇదే చివరి చూపేమో' అన్న ధోరణితత్వం కూడా అతని మాటల్లో మధ్య మధ్య ఏదో రూపంలో దొర్లుతుంది. మనిషి ముభావంగా, సర్వం కోల్పోయినవాడిలా రేపో ఎల్లుండో మనుషులెవ్వరికీ కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను అన్నంత వైరాగ్యంతో ముఖం కుంచించు కుపోతున్నట్టుగా ఉన్నాడు.
అలా అలా సాయంత్రానికల్లా అందరూ వెళ్ళి పోయారు. అందరితో పాటు ఇద్దరు కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలు అలాగే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ అర్జెంటు పని ఏదో ఉందని చెప్పి జారుకున్నారు నెమ్మది నెమ్మదిగా.
అమరేశ్వరరావు భార్య మంగతాయారు సామాన్లు సరుదుకొనే హడావిడిలో పడిపోయింది. ఇక మిగి లింది అమరేశ్వరరావు అతని ఇంటిపక్క రెండంత స్తుల బిల్డింగ్ లో నివాసముండే స్నేహితుడు భక్తవ త్సలం. వీరిద్దరూ చెరో ఫైబర్ కుర్చీల్లో తీరుబడిగా కూర్చుని ఘనంగా జరిగిన కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నారు.
''కార్యక్రమం బాగానే జరిగిందిరా కానీ..నేను చివరి దశలోకి వచ్చేసాను కదా. ఇంకెన్నాళ్లు బ్రతుకు తాను.అయినా నాకన్నా నువ్వే నయoరా. పిల్లలు అందరూ దూరం దూరంగా ఉన్నారని నీకు తోడుగా ఆ కుర్రోడుని అట్టేపెట్టుకున్నావ్ చూడు. చాలా తెలివైన గొప్ప విషయం అది..'' అంటూ కొంచెం దూరంలో నిల బడి ఉన్న శీనుని చూపిస్తూ అన్నాడు అమరేశ్వరరావు.
''ఆ అనాథ కుర్రాడు విషయమే కదా నువ్వు చెప్పేది. వాడి గురించే చెబుదామనే నేను ఇంత సేపు కూర్చు న్నాను. మా పెద్దవాడు నన్ను అమెరికా వచ్చేయమని అంటున్నాడు. ఇక అక్కడే ఉండమంటున్నాడు. నాకు కూడా వెళ్ళిపోదామనే ఉంది. వారం రోజుల నుండి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను.
నువ్వు నీ హడావిడిలో ఉన్నావు కదా అని చెప్ప లేదు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అనాధశర ణాలయం నుంచి తెచ్చుకున్న ఆకుర్రోడు..4 సంవత్స రాల నుండి నా మంచిచెడ్డలు చూస్తూ నా దగ్గర ఉంటున్నాడు కదా. ఆ శీను గాడిని ఇకమీదట నీ దగ్గర ఉండేలా నీకు అప్ప చెబుదా మనుకుంటున్నాను. నిన్న రాత్రి వివరంగా చెప్పి వాడిని అడిగితే వాడు కూడా సరే అంటూ ఇష్టపడ్డాడు. మరి నీ ఉద్దేశం ఏమిటిరా?'' అంటూ ప్రశ్నించాడు భక్తవ త్సలo.
''నాకిష్టమేరా. నా చరిత్ర కూడా ఇక అయిపో తుంది కదా. భార్య ఉన్నా నేను బయటకు వెళ్లిన ప్రతిసారీ నా కూడా ఆమె ఉండలేదు కదా. ఇప్పు డు ఈ పరి స్థితుల్లో ఆ కుర్రోడు నాకు బాగా ఉప యోగిస్తాడు. వాడికి ప్రపంచం జ్ఞాన నేర్పావు..నేను కూడా నీలాగే రెండు పూటలా తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకుంటాను.'' అంటూ భక్తవత్సలానికి మాట ఇచ్చేశాడు అమరేశ్వర రావు.
''సరేరా నేను ఉంటున్న ఈ ఇంట్లో ఊర్లోనే ఉన్న మా బంధువులు ఉండేలా ఏర్పాటు చేశానులే. ఎప్పుడన్నా వస్తే ఉండడానికి ఒక రూము నా కోసం అట్టే పెట్టుకు న్నాను .ఎల్లుండే నా ప్రయాణo''.. అంటూ పైకిలేచాడు భక్తవత్సలం.
''మన టైం అయిపోయిందిరా ఇక.. ఏ రోజు ఏ సమస్య వస్తుందో ఎప్పుడు మంచాన పడతామో తెలియని స్టేజ్ లోకి వచ్చేసాము.జాగ్రత్త.' అంటూ మిత్రుడికి కరచాలనం చేశాడు అమరేశ్వరరావు .
భక్తవత్సలం శీనుని దగ్గరకు పిలిచి చెప్పవలసిన విషయాన్ని చాలాసేపు పూర్తిగా చెప్పాడు. శీను కొంచెం బాధపడి చివరికి...'' సరే గురువు గారు..'' అంటూ ఒప్పుకోక తప్పలేదు.
*
శీను అమరేశ్వరరావు ఇంటి వీధి అరుగు పక్కనే ఉన్న పెద్దగదిలో ఉంటూ అమరేశ్వరరావు ని మాస్టారు అంటూ సంబోధిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పక్కనే కనిపెట్టుకొని కాలం గడుపు తున్నాడు.
ఆరోజు...అప్పుడే...పక్క ఊరు రామచంద్రపురం నుండి తన తో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తులతో పిచ్చా పాటి లో పడ్డాడు అమరేశ్వరరావు.
''ఇదిగో రెడ్డిగారు నా వయసు అయిపోతుంది కదా నా పరిస్థితి ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్ప లేను.అందు
కని మనం ఇచ్చిపుచ్చుకునే వ్యవహా రాలు తొందర్లోనే సెటిల్ చేసుకుందాం.'' అంటూ.. అతనికి చెప్పవలసిన వ్యవహారాలన్నీ చెప్పేశాడు.
ఆ తర్వాత అదే రోజు సాయంత్రం జగన్నాథగిరి నుండి వచ్చిన రంగారావుగారితో మాట్లాడుతూ
''ఇదిగో రంగారావుగారు మీ పాతకలప వ్యాపారం బాగుందా. మీ జగన్నాథగిరిలో మా మేనమామ గార బ్బాయి..కృష్ణారావు ఉన్నాడు కదా. నేను ఫోన్ చేసినా వాడు మొన్న ఫంక్షన్ కు రాలేదు. నేనంటే చిన్న కోపం వాడికి. నాకు టైం అయిపోతుంది కదా.. వాడు కూడ మొన్న వచ్చి ఉంటే బాగుండు అనుకు న్నాను. సరే నా చివరి చూపుకైనా వస్తాడేమో చూడాలి. '' అంటూ అత ని వ్యవహారాలు చక్కబెట్టి అతడిని కూడా పంపిం చాడు అమరేశ్వరరావు.
ఈ మాటలన్నీ వింటూ నిలబడి ఉన్న శీను.. తన మాస్టారు అమరేశ్వరరావు ఎందుకు అంత బేలగా మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు.
**
అలా.. ఎలాగోలా నాలుగు ఏళ్ళు గడిచాక...
ఆరోజు ఆదివారం..
ఉదయం పార్కులో అమరేశ్వరరావు తన మరో నలుగురు స్నేహితులతో కూర్చున్నాడు.
''మన జగ్గారావు బకెట్టు తన్నేశాడట నిజమేనా?''
''నిజమే.. మచిలీపట్నం లో ఉన్నాడు.. గట్టిగా వయసు 62 ఏళ్లు నిండలేదు.''
''నాకూ అదే భయం పట్టుకుంది. మనం సడన్ గా పోతే మన వెనకాల ఉన్నవాళ్ళు మన ఆస్తుల గురించి కొట్టుకోవచ్చు. మనం ఎక్కడైనా దాచినవి ఏమైనా ఉంటే వాళ్ళకి కనపడక అవి కోల్పోతారు కదా. అందుకనే నేను నాకున్న కొద్దిపాటి ఆస్తులను నలుగురు సంతానానికి నా భార్యకు సమంగా వీలు నామా రాసి ఉంచాలి అనుకుంటున్నాను.
సీక్రెట్ ఏమీ ఉంచకుండా అన్ని విషయాలు నా భార్య కు వివరంగా అర్థమయ్యేలా ఈ రోజే చెప్పేయాలను కుంటున్నాను.. ఏమో మన జగ్గారావు గాడు లాగా ఎప్పుడు బకెట్టు తన్నేస్తామో తెలియదు కదా..'' అన్నాడు.. అతి నిరాశగా మిగిలిన నలుగురు స్నేహి తులతో అమరేశ్వరరావు.
పక్కనే ఉండి ప్రతి అక్షరం వింటున్న శీను..పార్కులో జరిగిన ఈ సంఘటనతో... తన మాస్టారు అమ రేశ్వరరావులో కనబడుతున్న ఇలాంటి ఆందోళన కరమైన మార్పుకి కారణం ఏమై ఉంటుందో గత చాలా కాలం నుండి తెలుసులేకపోతున్నాడు. 60 ఏళ్లు నిండిన వాళ్ళలో కొంతమందైతే.. ఇలాగే ఇక ఎక్కువ రోజులు బతకమేమో అని ఎందుకు బెంబేలుపడి పోతున్నారో... శీను చిన్న గుండెకాయ అర్థం చేసుకోలేక పోతుంది.
ఇలా మరో మూడేళ్లు...శీను వచ్చిన తర్వాత మొత్తంమీద ఏకంగా 7 ఏళ్ళు గడిచిపోయాయి.
ఇప్పుడు మాస్టారు అమరేశ్వరరావు వయస్సు 67వరకు వచ్చింది.. శీను వయసు 27 దగ్గర పడ్డాయి.
మాస్టారు అమరేశ్వరరావు ఆరోగ్యం మామూలుగానే ఉంది.. కానీ మాట పలికే విధానములో ఆ కంగారు పడుతూ భయపడే తీరు ఇంకా బాగా పెరిగిపోయింది.
'' మీ మాస్టారు మనసు బాధపెట్టకుండా ఆయన ఏది చెబితే అది చేస్తూ ఆయనకు ఏమాత్రం సమస్య రాకుండా ఏ సందర్భంలోనూ ఎదురు చెప్పకుండా మస లుకో .''. .అని..తన మొదటి గురువుగారు భక్తవత్సలం ఒకసారి అమెరికా నుండి ఫోన్ లో మాట్లాడుతూ చెప్ప డంతో ప్రస్తుత తన మాస్టారు అమరేశ్వరరావు 'ఎలా మాట్లాడితే నాకెందుకులే' అని సరి పెట్టుకుంటూ బ్రతక డం అలవాటు చేసుకున్నాడు శీను.
మరో ఆరునెలలు అలా గడిచాక..అమరేశ్వరరావు భార్యతో.. శీనుతో సహా ఓ రోజు అదే ఊరిలో ఉన్న దూరపుబంధువుల ఇంటికి ఫంక్షన్కు వెళ్లి ఇంటికి వచ్చాక ఇంట్లో మాస్టర్ కి కొంచెం దగ్గరగా వచ్చి నిలబడ్డాడు శీను.
'' ఏరా..''.. ప్రశ్నించాడు మాస్టారు అమరేశ్వరరావు
''మాస్టారు ఒక మాట అడుగుతాను..కోప్పడతా రేమో... అడగమంటారా..''.. అన్నాడు శీను.
అమరేశ్వరరావు కంగారుగా ఏమిటన్నట్టు చూశాడు శీను ముఖంలోకి.
''ఇదే మాస్టారూ ఇదే... ఈ కంగారే..ఈ ఆదుర్దాయే ఈ రోజు మనం వెళ్ళిన ఫంక్షన్ లో కూడా మీరు వయసు పూర్తిగా అయిపోతున్నట్లు..మహా భయం కరమైన ప్రమాదం జరగబోతున్నట్టు.. ఎందుకు మీరలా ఉంటున్నారు? మీ కన్నా పెద్ద వయసు వాళ్ళు కూడా చాలామంది బాగానే ఉన్నారు కదా. నేను వచ్చిన నాటికి ఇప్పటికీ భగవంతుని దయ వల్ల మీ ఆరోగ్యం బాగానే ఉంది. మరి మీరు ఎందు కలా వయసు విషయంలో కంగారుపడుతూ బాధ పడుతూ తడబడుతూ మాట్లాడతారు?'' అంటూ ధైర్యంగా అడిగేశాడు.
మాస్టారు చాలాసేపు పిచ్చిగా అదోరకంగా వెకిలిగా నవ్వేశాడు.'' చిన్న కుర్రాడివిరా.. నీకేంతెలుసు పెద్దవాళ్ల మన స్తత్వాలు. నాకు 70 ఏళ్లు దగ్గరపడుతున్నాయి రా . 70 సంవత్సరాలు అంటే..తక్కువ వయసు కాదు కదా. కాటికి కాళ్లు చాపి.. సిద్ధంగా ఉన్నాం. మా భయా లు మావి. అయినా 60 ఏళ్లు దాటాక ప్రతి రోజూ దిన దిన గండమేరా..! ఏ క్షణాన గుండెపోటు వస్తుందో, ఏ క్షణాన పెరాలసిస్ వస్తుందో, ఏ క్షణాన.. క్యాన్సర్ ఉం దన్న విషయం బయటపడుతుందో...ఏ క్షణానఏ మాయదారి కొత్త రకం జబ్బు ప్రవేశించి ఎప్పుడు హుష్ కాకి అయిపోతామో అన్న భయం ప్రతిక్షణం ఆవరించి ఉంటుంది మాలా వయసు ముదిరిన మనసుల్లో.''
''మాస్టారు.. అవన్నీ మాలాంటి పిల్లల్లో కూడా వస్తు న్నాయికదా..''
''మీరు బాధ్యత లేని వాళ్ళురా. మేము బాధ్యతలు ఉన్నవాళ్ళం. మా బాధ్యతలన్నీ.. సక్రమంగా పూర్తి చేసామో లేదో.. చెయ్యగలమో లేదో అన్న బెంగతో బతుకుతున్నవాళ్ళo.''
''మీ బాధ్యతలన్నీ నెరవేర్చేశారు కదా మాస్టారు..
ప్రశాంతంగా ఉండొచ్చు కదా. వయసైపోయింది.. వయసైపోయింది అని పది మంది దగ్గర ఏకరువు పెట్టుకుంటూ మీకుమీరే భయపడిపోతున్నారు . ఈ ఆదుర్దా మీ ఆరోగ్యాన్ని మరీ దెబ్బ తీస్తుంది కదా మాస్టారు ..''
''నీకు తెలివితేటలు బాగా పెరిగిపోయాయి రా. పోనీ మాలాంటి ముసలోళ్ళు ఎలా బ్రతకాలో నీకు ఏమైనా తెలిసుoటే చెప్పు....'' కోపంగా అడిగాడు అమరేశ్వరావు.
''నాకు తెలియదు మాస్టారు.. కానీ మొన్న మన ఊరి శివాలయంలో చింతామణిశాస్త్రిగారి పురాణానికి వెళ్లాను.. అక్కడ ఆయన వృద్ధుల జీవన విధానం గురించి చెప్పారు. అసలు వృద్ధులు తాము పుట్టిన తేదీ మర్చిపోవాలంట,పాత స్నేహితులని మళ్లీ కలుపుకో వాలట, సరదా కార్యక్రమాలలో పాల్గొనాలట, మార్పు గా ఉండే ప్రదేశాలు తిరగాలట, శత్రువుని మిత్రుడు గా ప్రేమించాలట, కనపడిన ప్రతి పిల్లలతో సరదాగా ఉండాలట, మనసు ప్రశాంతంగా ఉంచుకొని అసలు చావునే గుర్తు చేసుకోకుండా నవ్వుతూ గడపాలి అని చెప్పారు. వీటన్నింటికీ మించి భార్యతో ఆనందంగా ఉండాలని అన్నారు. ఇవన్నీ మీకు చెప్పడం కోసం బాగా గుర్తు పెట్టుకు న్నాను . ఇందులో ఒక్కటైనా మీరు పాటిస్తున్నారా చెప్పండి మాస్టారు...''..ఏమాత్రం భయపడకుండా అడిగేశాడు శీను.
''అమ్మో.. నా దగ్గరకు వచ్చిన ఈ ఏడు సంవత్స రాలలో చాలా గ్రంథాలు చదివావురా. సరే ఇవన్నీ నువ్వు ముసలాడు అయ్యాక పాటించి వందేళ్లు బ్రతికేయ్ !" అమరేశ్వరరావు కొంచెం కేకలు పెట్టి నట్టుగానే మాట్లాడాడు.
''లేదు మాస్టారు.. జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా. ఎవరూ ఆపలేరు. అసలు ఏమీ ప్రమాద సూచ నలు లేకపోయినా వయసు తరుముకొస్తోంది అన్న ఆలోచనతో మీరు నిరాశ పడిపోయి మీ చుట్టూ ఉన్న వారిని నీరసం పెడుతున్నారేమో ఆలోచిం చండి. మీరు.. 'నా పని అయిపోయింది'... అని ఏడు సంవ త్సరాల క్రితమే అనుకున్నారు..అయిపోయిం దా? మీకేదైనా నష్టం జరిగిందా? చెప్పండి. సమా ధానం చెప్పండి." అన్నట్టు ప్రశ్నించాడు శీను.
''పిల్ల కాకివిరా... నీకు పెళ్లి చేస్తేనే కానీ ఇదంతా అర్థం కాదు. వెళ్లి పని చూసుకోరా.'' తన శిష్యునితో వాదించే శక్తి లేనట్టుగా అమరేశ్వరరావు నీరసంగా మడత మంచం మీద వాలిపోయి బెంగపడిన వాడిలా దుప్ప టి ముసుగు పెట్టాడు... భార్య మంగతా యారు వచ్చి మజ్జిగ అందించినప్పటికీ వద్దని సైగ చేసి ఏదో ఆలో చనలో పడిపోయాడు.
అలా ఇంకొంతకాలం గడిచింది.. అమరేశ్వర రావు 70 వయసులోకి వచ్చాడు. శీను కి 30 నిండాయి.
**
మూడు నెలల పాటు ఇండియాలో ఉండి శీను కి పెళ్లి చేసి వెళ్లాలనే ఉద్దేశంతో పది సంవత్సరముల తర్వా త... ఇండియా తన సొంత ఇంటికి తిరిగి వచ్చాడు భక్తవత్సలం. తను వెళ్లేటప్పుడు తన ఇంటిలో ఒక పెద్ద గది ఖాళీగా ఉంచుకుని వెళ్ళటం మూలాన అందు లోనే ఉన్నాడు. వచ్చిన రోజే అమ రేశ్వరరావుతో హాలులో ఫైబర్ కుర్చీలో కూర్చొని చాలాసేపు మాట్లా డాడు. ఈ పది సంవత్సరాలలో ఈ ప్రాంతంలో జరిగిన వింతలు,విశేషాలు, వాతా వరణ ప్రభావాలు, ఆరోగ్య విశేషాలు మాట్లాడుకు న్నాక.. శీను వాళ్ళిద్దరి పక్కన నిలబడి ఉండగానే అతని పెళ్లి విషయం కూడా మాట్లాడుకున్నారు.
''చేసెయ్యాలిరా భక్తవత్సలం.. మన శీను గాడికి ఎలాగోల మళ్లీ నువ్వు తిరిగి వెళ్ళే లోపల రెండు నెలల్లో పెళ్లి చేసేద్దాం. ఎందుకంటే నాకు 70 ఏళ్ళు పైనపడుతున్నాయి కదా. ఏ నిమిషంలో పుటుక్కు మంటానో భయంగాఉంది.'' అన్నాడు అమరేశ్వర రావు తన స్నేహితుడు భక్తవత్సలంతో.
అలా వాళ్ళిద్దరూ రోజు కూర్చుని మాట్లాడుకుం టూనే ఉన్నారు.. శీను కి సంబంధ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
భక్తవత్సలం వచ్చిన నెలరోజుల తర్వాత ఆ ఇద్దరూ హాలులో కూర్చుని మాట్లాడుకుంటుండగా రామచం ద్రపురం నుండి రెడ్డిగారుతో సహా మరో ఇద్దరు వచ్చారు.
''ఇదో..అమరంగారు..మీ శీను పద్ధతి ఏమంత బాగుండ లేదు. 10 రోజుల క్రితం.. మీతో ఉన్న కొద్ది పాటి బ్యాలె న్స్ విషయం క్లియర్ చేసుకోవడానికి వస్తానని మీకు చెప్పమని మీ శీనుకి ఫోన్ చేశాను.
వాడు ఫోన్ లో ఏమన్నాడో తెలుసా..''రెడ్డిగారు మీరు రావద్దు.. మా మాస్టారు పరిస్థితి అసలు బాగుండలేదు చివరిరోజుల్లో ఉన్నట్టుగా ఉన్నారు వయసు 70పైబడి దాటిపోయింది.ఏ నిమిషం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు అన్నట్టుగా నాకు కూడా అనిపిస్తుంది. నేను ఫోన్ చేస్తానులేండి '' అన్నాడు. సరే ఏదో సమస్య అనుకుని ఆగిపోయి ఈ వీధిలోనే ఉన్న కిరాణా కొట్టు సుబ్బారావుకి ఫోన్ చేశాను. వాడు.. 'మీరు గుండుపిక్క లా తిరుగు తున్నారని ఏ రోగము, జబ్బు లేదని' చక్క గా చెప్పు కొచ్చాడు. మీ శీనుకి కొంచెం భయం చెప్పి దారిలో పెట్టుకోండి.లేకుంటే మీ పరువు ఖచ్చితంగా గంగలో కలిసి పోవడం ఖాయం..''..అంటూ గట్టిగా చెప్పి తను వచ్చిన విషయం పూర్తి చేసుకుని వెళ్లిపో యాడు తనవాళ్ళతో రామచంద్రపురం రెడ్డిగారు.
భక్తవత్సలం శీను వైపు చిలిపి నవ్వుతో అదోలా చూశాడు. శీను మీద అమరేశ్వరానికి కోపం తాడిచెట్టు అంత ఎత్తున లెగిసింది.
''ఒరేయ్ భక్తవత్సలం..ఇదిగో ఈ మధ్యన ఇలా మారేడు ఈ శీనుగాడు. నా గురించి అంత డ్యామేజ్ ఎందుకు చేస్తున్నాడు. నీకు చెప్పలేదు కానీ వారం క్రితం కూడా నేను వీధి చివరకి వెళ్ళినప్పుడు నన్ను అందరూ చిత్రంగా చూడడం మొదలు పెట్టారు. విషయం ఏమిటి అని వాళ్ళని అడిగితే.. ఇదిగో... ఇలాగే వాళ్లకి కూడా చెప్పాడట. నేను బాగానే ఉన్నాను కదా బీపీ షుగర్ కూడా లేవు. నీ కంటే పోయినేడు హార్ట్ఎటాక్ కూడా వచ్చింది అన్నావు. నాకు 70 ఏళ్ల వరకు ఏ సమస్య లేదు . నా పరువు వీడు ఎందుకు మురికి గుంటలో కలుపుతున్నాడో అర్థం కావడంలేదురా''..అనేశాడు చికాకుగా అమ రేశ్వరరావు.
''అదేమిటి మాస్టారు.. అవి మీరు అందరికీ ప్రతి రోజు చెప్పే మాటలే కదా. మీరు అలా చెబుతూ ఉంటే నీరసం వస్తుంది అని మీ బదులు నేనే చెప్పడం తప్పా?... నేను అబద్ధం చెప్పడం లేదు కదా. నాటకం కూడా ఆడడం లేదు. మీ మాటలునే మీరు చెప్పకుండా నేను చెబుతున్నాను అలా...మీకు ఉప కారం చూస్తుంటే నన్ను ఆడి పోసుకుంటారేమిటి?'' అన్నాడు శీను మరింత చిరాకుగా.
పరిస్థితి మారబోతుందని గ్రహించిన భక్తవత్సలం దాన్ని కాస్త ప్రశాంతత పరిచి సర్దుబాటు చేశాడు.
ఆ తర్వాత మరో నెల రోజులకు శీనుకి మంచి సంబంధం కుదరడం పెళ్లి అవ్వడం జరిగి పోయా యి. తన మాస్టారు ఇంటిలో తను ఉండే గది పెద్ద దిగా అన్ని సౌకర్యాలుతో ఉండడంతో భార్యతో అక్కడే ఉంటున్నాడు.
భక్తవత్సలం తను వచ్చిన మూడునెలల తర్వాత పని పూర్తి అవడంతో అమెరికా తిరుగుప్రయాణం హడా విడిలో ఉన్నాడు.. చివరగా స్నేహితుడు అమరేశ్వర రావుతో మాట్లాడడానికి వచ్చి అతనితో కూర్చున్నా డు . వారిద్దరి పక్కగా శీను నిలబడి ఉన్నాడు.
అప్పుడే జగన్నాథగిరి నుండి పాత కలప వ్యాపారం చేసే రంగారావు కొందరితో కలసి వచ్చాడు. వస్తూ అమరేశ్వరరావుని చూసి అవాక్కయిపోయాడు.
''అమరేశ్వరరావుగారు... మీరు హ్యాపీగా ఉన్నారు సంతోషం. ఆ మధ్య ముఖ్యమైన విషయం మాట్లా డడానికి మేము మీ దగ్గరరకు వద్దామనుకుంటే మీ శీను మమ్మల్ని రెండునెలలనుండి మోసం చేస్తు న్నాడు. మీ పరిస్థితి ఏమాత్రం బాగుండలేదని, ఏ సమయం ఎలా ఉంటుందో చెప్పలేమని, 70 వయసు దాటాక ఎవరైనా బ్రతకడం కష్టమని ఇంకా ఏదే దో చెప్పి మమ్మల్ని భయపెట్టేసాడు. చివరికి నిన్న రాత్రి కూడా ఎలా ఉంది పరిస్థితి అని అడిగితే మళ్లీ అలాగే చెప్పాడు. మీరు చూస్తే సకల ఆరోగ్యం గా ఉన్నారు. ఇలాంటి తప్పుడు వాడిని మీ దగ్గర ఎలా పెట్టుకున్నారు. వీడు నమ్మకస్తుడిగా కనిపించడం లేదు. పంపించేయండి..లేదా ప్రమాదంలో పడతారు
ఈ విషయం చెబుదామనే పనిగట్టుకుని వచ్చాను. అంటూ హెచ్చరించి విసురుగా వెళ్ళిపోయాడు ఆ వచ్చిన జగన్నాథగిరి రంగారావు.
ఈసారి.. భక్తవత్సలం శీను వైపు బుల్లి నవ్వుతో ప్రశ్నార్థకంగా చూశాడు.
అమరేశ్వరరావు..భక్తవత్సలం వైపు చూసి నెత్తి బాదుకున్నాడు.
''ఏంట్రా ఈ కర్మ.. వీడు నన్ను బతికుండగా చంపే స్తాడేమో. నువ్వు చూస్తున్నావుగా మూడు నెలల నుండి బ్రహ్మాండంగా ఉన్నాను కదా. నా మీద పగ పట్టాడా? నాకు ఏ తెగులు రోగము లేకపోయినా దబ్బపండు లాగా బలంగా ఉన్నా ఏదో కాటికి కాలు చాపిన వాడిలా నా గురించి వీడు అలా చెప్పడం ఏమిటి. వీడిని ఇక నేను భరించలేను. ఏం చేసు కుంటావో తీసుకుపో.''.. అన్నాడు విపరీతమైన తలపోటు వ్యవహారంగా.
''నేను కూడా ఒక్క నిమిషం ఉండదలుచుకోలేదు మాస్టారు. మీరు మొన్న నా పెళ్లిలో కూడా అంద రితో మీ వయసు ఐపోయినట్టే మాట్లాడారుకదా.
''నా చరిత్ర అయిపోయింది.. రోజులు లెక్క పెట్టు కుంటున్నాను....'' అని మీరు చాలా మందితో అన్నా రు కదా. మా ఆవిడ కూడా మీ పద్ధతి చూసి భయ పడుతుంది. 'మనం కూడా మీ మాస్టారు లాగే ఈ చిన్న వయసులోనే ఏమైన అయిపోతామేమో..'అంటూ నన్ను ప్రశ్నిస్తుంది. ఆవిడకు సమాధానం చెప్పలేకపోతు న్నాను. నేను కూడా వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మాస్టారు.''ముక్కు ఎగ చీదుకుంటూ అన్నాడు శీను.
అమరేశ్వరరావు కొంచెం మెత్తబడ్డాడు.
''సరే.. శీను..ఏదో అనాథవని చేరదీసాం. మా గౌరవం తీసి పాడేస్తున్నావు. ఇక అదంతా పక్కన పెట్టు. ఇది గోరా భక్తవత్సలం..ఇకముందు నేను ఎవరి దగ్గర కూడా ప్రాణం పోతున్నట్టుగా,నిరాశగా అనవసరపు మాటలు ఏవీ మాట్లాడను. అదే కదా వీడు ఉద్దేశం...ఓకే అలాగే. అయితే ఒక కండిషన్ వీడిని కూడా వీడి పద్ధతి మార్చు కోమను. అంతగా తేడా వస్తే అప్పుడు చూద్దాంలే. పాపం పెళ్లయ్యి నెలరోజులే కదా అయింది. వెంటనే పొమ్మనడం నాకు కూడా మనసుకు నచ్చుబాటు కావడం లేదు..''' అంటూ ఆ చిరాకు సమస్యను అమ రేశ్వర రావు తనంత తానే సర్దుబాటు చేశాడు.
తన ప్రమేయం అవసరం లేకుండా సమస్య వాళ్ళి ద్దరూ కలిసి సర్దుబాటు చేసుకు న్నందుకు కాస్త స్థిమితపడ్డాడు.. ప్రశాంతంగా ఊపిరి పీల్చాడు
భక్తవత్సలం.
***
భక్తవత్సలం అమెరికా ప్రయాణం.
హైదరా బాద్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ మీద ఆగి ఉంది.
ఎస్2..బోగీలో తన రిజర్వేషన్ సీట్లో కూర్చున్నాడు భక్తవత్సలం. కూడా వచ్చిన శీను లగేజ్ బోగీలో సదిరాడు. రైలు బయలుదేరే అనౌన్స్మెంట్ చెప్ప డంతో గబగబా కిందకు దిగి కిటికీ దగ్గరికి వచ్చే సాడు శీను.
''ఒరేయ్ శీను..60 వయసు తర్వాత ఇంకా చాలా కాలం బతకాలని చాలామంది ఆశపడతారు.చాలా కోరికలు తీర్చుకోవాలని, ఆనందాలను పొందాలని మనసులో తెగ ఉబలాటపడతారు. కానీ ఇప్పటి పరిస్థితులను బట్టి ఇక ఎక్కువ కాలం బతకమేమో అని అను మానం వచ్చిన వాళ్లు ఇదిగో ఇలాగే మీ మాస్టార్ లాగే ప్రవర్తిస్తారు."..అంటూ ప్లాట్ ఫామ్ టికెట్ కొనుక్కొని అప్పుడే ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ లోకి ప్రవేశిస్తున్న ఒక వ్యక్తిని చూపిస్తూ...
''అదిగో రా.. అటు చూడు.. నువ్వు చిలిపిగా చేసిన ప్రయత్నం పెద్ద సక్సెస్ ని ఇచ్చిందిరా ''అన్నాడు భక్తవత్సలం శీను తో.
'అందంగా షేవ్ చేసుకొని..నీలంరంగు పువ్వులషర్టు మీద వైట్ ప్యాంటు టక్ చేసి.. వైట్ కలర్ టోపీ పెట్టు కుని..బాట కంపెనీ వారి బూట్లు వేసుకొని..ఓల్డ్ సినీ హీరో లా పరుగులాంటి నడకతో చకచకా మంచి ఉత్సాహంగా తాము ఉన్న ఎస్2 బోగీ సమీపిస్తున్న ఆయన..ఎవరు చెప్మా..? ' చూచిన వెంటనే అర్థం కాలేదు శీనుకి
కానీ కాసేపటికి తన పూర్వగురువు భక్తవత్సలంగారికి సెండాఫ్ చెప్పడానికి వస్తున్న 70 ఏళ్ళ పైబడ్డ ఇప్పటి తన మాస్టారు అమరేశ్వరరావుగారే.. అని గుర్తించాడు శీను.
సమాప్తం
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments