Samethala Sambaram written by Dasu Radhika
రచన : దాసు రాధిక
"తెలివొకడి అబ్బసోమ్మా దేశరాజు సుబ్బమ్మా అన్నట్టు, ఏం తెలివే నీది... వాడొచ్చేసరికి నువ్వు పని చేస్తూ కనిపిస్తే ఎంత కష్టపడుతున్నావో అని వాడనుకోవాలని నీ ఆలోచన... నాకు తెలియక పోలేదు... ఆ వొండే నాలుగు మెతుకులకు పొద్దస్తమానం ఆ వంటింట్లోనే ఉంటావు... అలా గుడ్లప్పగించి చూస్తావేమే? పోయి ఎసరు పెట్టు, వాడొచ్చే వేళయింది...ఒక్క నిమిషం ఆలస్యం అయినా వాడి నోరు మంచిది కాదు... నేను వినలేనే వాడు నిన్ను పెట్టె చివాట్లు..."
"అయ్యో అత్తయ్యగారు, ఆయన నన్నెప్పుడన్నారని..." అమాయకంగా చూసింది రాజ్యం అత్తగారిని...
"అంటే, నేనే నిన్ను అంటాననా? ఎంతకు బరి తెగించావే??" ఇలా కొడుకు మీద పెట్టి
నిరంతరం ఈవిడే వడ్డిస్తూ ఉంటుంది..."అయినా నా మాట నువ్వెప్పుడు విన్నావు గనక... కూసి కూసి మా బొల్లిమేక ఇలాగే పోయిందని..."
సరిగ్గా ఒంటిగంటకు ఇంటికొచ్చాడు కాశీ ... రాజ్యం వేడిగా అన్నం వడ్డించింది...ఇంక మొదలయింది మళ్ళీ వెంకాయమ్మ ధోరణి... "ఒరేయ్ కాశీ, మన ప్రసాదు సంగతి ఏం చేసావు రా? గాలిలో దీపము పెట్టి దేవుడా నీ మహిమంటే ఎలా రా? మన ప్రయత్నం మనము చెయ్యాలిగా... కష్ట పడి డిగ్రీ గట్టెకించే సరికే తాతలు దిగొచ్చారు వాడికి ... ఎక్కడో అక్కడ పనిలో పెట్టకపోతే రేపు వాడికి పిల్లనెవరిస్తారు... రమ క్కూడా రేపో మాపో పెళ్లి చెయ్యాలి... దాని చదువు వానాకాలం చదువే... అమ్మాయి రాజ్యం, కొంచెం పులుసు తీసుకొచ్చి వడ్డించు, అదే చేత్తో వడియాలు కాల్చి తీసుకురా...సాయంత్రం తినేందుకు అట్లు పొయ్యి, అందులోకి రోటి పచ్చడి చెయ్యి..."
ఇది రోజూ ఉండేదే...
ఏ రోజూ తన కొడుకు కాశీను ప్రశాంతంగా ఇంత ముద్ద తిన్నిస్తేగా... వెంకాయమ్మ పక్కన చేరి తన మాటల తో విసిగిస్తూ ఉంటుంది... ఆఖరికి ఆ మొగుడు పెళ్లానికి ఒక్క నిమిషం కూడా ఏకాంతం లో ముచ్చటించుకునే వీలుండదు... బడిపంతులు గా చేస్తూ కాస్త మధ్యాహ్నాలు భోజనానికి ఇంటికొచ్చి వెళ్లే అలవాటు కాశీది...తన ప్రాణానికి ప్రాణమైన రాజ్యాన్ని మళ్లీ ఒకసారి చూసినట్టుంటుంది... భోజనానంతరము ఒక్క రోజు కూడా పది నిమిషాలు కునుకు తీసేందుకు నోచుకోలేదు...ఈవిడ వొదిలితేగా... వయసైపోయిన తల్లినేమీ అనలేడు...
"వచ్చే నెల మా వేలు విడిచిన మేనమామ ముని మనవడి పెళ్లిరా ... మనము వెళ్తే మన రమను వాళ్లందరికీ చూపించినట్లుంటుందిరా... నాలుగు సంబంధాలు చెప్తారు...కట్న కానుకలు మీ నాన్న స్తోమతకు తగ్గట్లు జరపాలి రా"... ఈ మాటలతోనే వేళ దాటిపోయి, కాశీ తిరిగి బడికి ఆలస్యముగా వెళ్ళాడు...రాజ్యంకు అస్సలు మొగుడుతో మాట్లాడే అవకాశమే లేదు...
"రాజ్యం...ఎక్కడ తగలడ్డావు... కాస్త కాళ్ళోత్తు...అడుగు తీసి అడుగు వెయ్యలేక పోతున్నా..." అంటూ కోడలిని మళ్ళీ పిలిచింది వెంకాయమ్మ...గబ గబా తిన్నాననిపించి "వస్తున్నాను అత్తయ్యగారు" అంటూ పరుగున వచ్చింది రాజ్యం వంటింటి తలుపు దగ్గరేసి...
"ఎదో నా తాపత్రయము వల్ల గాని... నీ లాగా బెల్లం కొట్టిన రాయిలా ఉంటే మేమేం చేసేవాళ్ళం మా సంసారం?? అస్సలు మాట్లాడనిస్తేగా..." కొడుకుతో మాటలైపోయి కోడలిని తిట్టే అధ్యాయము మళ్లీ మొదలుపెట్టింది...
ఇంతలొకే రమ వచ్చి, "అమ్మా అమ్మా, ఒక్క వంద ఇవ్వవే, సినిమా కెళ్లొస్తాను, పక్కింటి పూర్ణాలు వాళ్ళు వెళ్తున్నారు" అని గోల పెట్టింది...రాజ్యం అత్తగారి కాళ్ళు పిసుకుతూనే కొంచెం విసుగ్గా , "కిందటి నెలే వెళ్ళావు, నీకీ తిరుగుళ్ళు అలవాటైపోయాయి...ఇంకో ఆరు నెలల వరకు మళ్ళీ అడగొద్దు నన్ను, ఆ పోపుల డబ్బా పక్కన కందిపప్పు డబ్బా లో చూడు. ఒక వందే తీసుకో" అన్నది కూతురితో...
"కూచమ్మ కూడ పెడ్తే మాచమ్మ మాయము
చేసిందని , నీదేం పోయిందే, సంపాయిస్తోంది
నా కొడుకు" ..."ఇలా అల్లాలు బెల్లాలుగా నీ పిల్లలు ఖర్చు పెడ్తుంటే చూస్తూ కూచో" అని మళ్ళీ కోడల్ని తగులుకుంది అత్తగారు...
కాసేపటికి వెంకాయమ్మకు కునుకు పట్టడం తో రాజ్యం కొంచెం ఊపిరి పీల్చుకుంది...
ఆ వారం వీక్లీలో కధ చదవనేలేదు రాజ్యం. ఒక్క పది నిమిషాలు పడక్కుర్చీ లో చదువుకుంటూ కూర్చుంది...పని అలసటకు నిద్దర పట్టేసింది రాజ్యం కు...
అదృష్టవశాత్తూ అంతే తొందరగా మెలుకువ కూడా వచ్చింది ... మళ్ళీ వంటింట్లో కి వెళ్లి పని మొదలెట్టుకుంది రాజ్యం... అస్సలే అత్తగారు పొద్దునే చెప్పింది పెళ్ళికి పోవాలి, దారిలో తినేందుకు గాను కారప్పూస, మినప సున్ని , బూందీ, మైసూర్ పాకు, జంతికలు, గవ్వలు చేసి ఉంచమని... మరి నిమిషము కూడా మూత పడని నోరు... ఆ మాత్రము తినటానికి కావద్దూ ప్రయాణంలో...రోజుకు కొద్దిగా చేస్తే వెళ్లే రోజుకు అన్ని పూర్తవుతాయి...
ప్రసాదు ఊరంతా తిరిగి సంధ్య వేళకు ఇల్లు చేరుకున్నాడు. పండిత పుత్ర పరమ శుంఠ పాక్షికముగా నిజము ప్రసాదు విషయంలో... ఒక మోస్తరు తెలివితేటలు వల్ల ఎక్కడా ఉద్యోగం రాలేదతనికి ... ఇంట్లో నాయనమ్మ దెప్పుడు మాటలకు విసుకొచ్చి పొద్దున్నే లేచి బయటకెళ్లిపోయి సాయంత్రానికి ఇల్లు చేరటం పరిపాటైపోయిందతనికి... ప్రసాదు స్నానం చేసి రాగానే వెంకాయమ్మ చూసింది మనవడి ని. "ఎరా ఇవాళ అయినా ఏదైనా శుభవార్త చెప్తావా రా? ఉద్యోగం వచ్చిందా?"
అని అడిగింది... ప్రసాదు లోపలికెళ్లిపోయి గది తలుపేసుకున్నాడు... "ఇహ పుట్టేనా ఇహ పెరిగేనా ఇరవై ఏళ్ళ కొడకా ఇంట్లోనే కూర్చో అన్నట్లుఉంది రా... నా కొడుకును నేను ప్రయోజకుణ్ణి చేసినట్లు మీ అమ్మ నిన్ను చెయ్యలేదు రా... అందరూ నా బిడ్డ మీద పడి తింటున్నారు" అంటూ అరుగు మీద కూర్చొని కోడల్ని, మనవడిని ఆడి పోసుకుంటూ కాలక్షేపము చేసింది వెంకాయమ్మ...
ఆవిడతో మాట కలిపేవాళ్ళు లేరు... అందరికి కాశీ రాజ్యం లను చూస్తే జాలి...
ప్రసాదు, రమల చదువులు కూడా ఇంట్లో అనుకూలత లేకనే దెబ్బతిన్నాయని ఊళ్ళో అందరూ అనుకుంటారు...వెంకాయమ్మ ఉన్ననాళ్ళు ఆ ఇంటి పరిస్థితి అంతే అని తీర్మానించేసారు...
కాశీ బడి నుండి అలసిపోయి ఇంటికొచ్చి పడ్డాడు... బడి లో పిల్లలు బాగా అల్లరిచేసారేమో, అరిచి అరిచి గొంతు పోయింది...లెక్కలు మాస్టారు గా మంచి పేరున్నది కాశీ కు... ఇంటికి ట్యూషన్ కు ముప్పైమందికి పైగా పిల్లలొస్తారు... అదే సరిపోతుంది... ఈ రోజు ట్యూషన్ కు సెలవిచ్చేసాడు...మేడ మీదకు పోయి కాస్త విశ్రాంతి గా చల్లగాలి పీల్చుకుంటూ కుర్చీ లో కూల పడ్డాడు... కాఫీ తీసుకుని రాజ్యం పైకెళ్లింది...ప్రసాదు, రమలు దాదాపు పెళ్లీడుకోచ్చేసినా కూడా రాజ్యంలో ఆకర్షణ తగ్గలేదు అనుకున్నాడు కాశీ పెళ్ళాం ని చూస్తూ...తన తల్లి సాధింపులు భరిస్తూ, పిల్లలిద్దరూ అనుకున్నట్లు చదువులో రాణించక పోవటం, బడిపంతులు గా తనకోచ్చే సాధారణ జీతము, ఒకప్పుడు తన తండ్రి హాయాము లో గొప్పగా ఉన్నట్లు జరపాలని తల్లి పెట్టె ఒత్తిళ్లు అన్నీ తన పిచ్చి రాజ్యం ఎలా తట్టుకుంటోందో అనుకున్నాడు కాశీ... కాఫీ కప్పు కింద పెట్టి పెళ్ళాన్ని కాస్త దగ్గరకు తీసుకొని "పెళ్లికి కొత్త చీర కొనుక్కో రాజ్యం" అంటుండగా తల్లి గొంతు వినిపించింది..."ఎవర్ని రా పెళ్లికి రమ్మంటున్నావు?? నీ ముద్దుల పెళ్ళాన్నా? పెళ్ళికెళ్తూ పిల్లినిచంక లో పెట్టికెళ్ళి నట్లు అదెందుకు రా? మనిద్దరమూ రమను తీసుకెల్దాము..."ఉలిక్కి పడి రాజ్యం వస్తున్న కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ పరుగున కిందికెళ్లిపోయింది...
ఇంకో రెండు రోజుల్లో పెళ్లి ప్రయాణం. ఇంకా దారిలో తినటానికని వెంకాయమ్మ కోడలితో అవి ఇవి చేయిచ్చుకుంటూనే ఉంది... ఆ రెండు రోజులు అర్ధరాత్రి పడుకుంది రాజ్యం... అదేమని కొడుకు అడిగితే, వెంకాయమ్మకు మాటలు సామెతల రూపంలో దొర్లుకుంటూ వచ్చాయి... టక్కున చెప్పింది... "పగలంతా బారెడు నేశా, దీపముదేరా దిగనేతమని... రోజంతా నీ పెళ్ళాం పుస్తకాలు చదువుతూ ఉంది ... పగలు వృధాగా పోనిచ్చి రాత్రి పని మొదలెడితే అదే అంటారు మరి... ఇవాళ రోజంతా కేవలం కిలో పాకము పట్టింది బూందీ లడ్డు కోసం రాణీగారు...రోలు తేవే, రోకలి తేవే, రోటీ కాడికి ననెత్తుకు పోవే అని, అంతా పని నేను చేస్తే అది గరిట మాత్రము తిప్పింది రా"... "దాన్ని వదిలేయమ్మా , నీకు దణ్ణం పెడ్తాను..." అన్నాడు కాశీ...
అత్తగారు, మొగుడు పెళ్ళి కెళ్లిన ఆ నాలుగు రోజులు రాజ్యంకు పుట్టింట్లో ఉన్నట్లు అనిపించింది. ఈసడింపులు, తిట్లు లేవు... తనక్కావల్సింది తిని హాయిగా తనకిష్టమైన పుస్తకాలు చదువుతూ కొడుకుతో కబుర్లు చెప్పుకుంటూ గడిచిపోయింది... మధ్య మధ్య లో ఇరుగు పొరుగు తో కాలక్షేపం చేస్తూ... ఇటువంటి పెళ్లిళ్లు, అవసరాలు నెలకొక సారి వస్తే ఎంత బావుంటుందో... ఒక్క నాలుగు రోజులు ఇలా గడిచినా చాలు అనుకుంది...మనసులో భర్తతో తాను వెళ్లలేదనే బాధ ఉన్నా కూడా... అదెలాగూ జరిగే పని కాదు, తనకు తెలుసు...
ప్రసాదుతో మనసు విప్పి మాట్లాడింది రాజ్యం... "రమ పెళ్ళి గురించి దిగులు లేదురా, అందుకు కావాల్సిన డబ్బు చిన్న మొత్తాలుగా దాచి పెట్టి ఉంచాము. నీ గురించే దిగులు...ఎప్పుడు స్థిర పడ్తావు? బాధ్యత ఎప్పుడు తెలుసుకుంటావు? ఎక్కడా నాలుగు రోజులు కూడా ఉండవు, ఇప్పటికే రెండు మూడు ఉద్యోగాలు వేయించారు మీ నాన్న...కోపము, ఆవేశముతో గొడవలు పెట్టుకుని వదిలి వచ్చేశావు...ఆయనకెంతో ఓర్పు కాబట్టి ఇంకా ఏమి అనట్లేదు నిన్ను...మా ఆరోగ్యాలు దెబ్బ తినే వరకు చెయ్యద్దు రా... అన్నది..." "నేనూ ఆ ప్రయత్నం లోనే ఉన్నానమ్మా నన్ను నమ్ము" అన్నాడు ప్రసాదు... చదువు అనుకున్నంత రాలేదు కానీ తన పిల్లలు చెడ్డవాళ్ళు కారు అని రాజ్యంకు తన పెంపకం మీదున్న నమ్మకము... ప్రసాదు మాటకొస్తే వాడికి ఏ
దురలవాట్లు లేవు... అది చాలదూ...
సాయంత్రం ఏడింటికి వాకిట్లో రిక్షా దిగింది వెంకాయమ్మ... కాశీ, రమ వెనుక దిగారు... "గూట్లో దీపం నోట్లో ముద్ద, పనా పాట , నీ పెళ్ళాం అప్పుడే తినేసి పడుకుందేమో రా... చడీ చప్పుడు లేదుగా".. అంటూ లోపలికెళ్లింది... ప్రసాదు తయారై బయటికి వెళ్తున్నాడు... "శత కోటి దరిద్రాలకు ఆనంతకోటి ఉపాయాలని... ఇంకెన్నాళ్లు తిరుగుతావురా... నీ సంగతి కూడా తేల్చే వచ్చానుగా... ఆ ఊళ్ళో సాంబయ్యగారి కూతురిని నువ్వు పెళ్ళి చేసుకోవాలి... వాళ్ళకు బోలెడు ఆస్తి పాస్తులున్నాయి... ఇల్లరికపు అల్లుడు కోసం చూస్తున్నాడు సాంబయ్య... అమ్మాయిని గారాబముగా పెంచాడు. తల్లి లేని పిల్ల అని...అస్సలు బడికే పంపలేదు... గంతకు తగ్గ బొంత... నువ్వు మటుకు ఎవర్ని ఉద్ధరించావు??" ప్రసాదు తండ్రి వంక కోపంగా చూసి వెళ్లి పోయాడు... ఆ రాత్రికి ఇంటికి రాలేదు...
రెండు రోజుల తర్వాత రమను చూడడానికి పెళ్ళివారొచ్చారు... "మా రమను అల్లారు ముద్దుగా పెంచింది మా రాజ్యం. అందుకే దానికి ఇంటి పనులు రావు... నేర్చుకుంటుంది లెండి పెళ్ళయ్యాక". కోడల్ని వంటింటికే పరిమితము చేసి తాను మొదలెట్టేసింది...ఒక అరగంట కూర్చొని, పెట్టిన్నవన్ని శుభ్రంగా తిని, వచ్చిన పని అయిపోయిందన్నట్లు వెళ్లిపోయారు పెళ్ళివారు... "పెళ్ళికొడుకు ఈకలు తీసిన కోడి లాగా ఉంటేనే...మెల్ల కన్ను ఉంటే ఉంది... మంచివాడు...చదువు అబ్బ లేదు... ఇంటి పట్టున వుంటాడు... రమకు ఏ దిగులు అక్కర్లేదు... మామగారు బోలెడు సంపాయించి పెట్టాడు. కొడుక్కి పని చెయ్యాల్సిన కర్మేంటి? ఒక అరడజను మంది ఆడపడుచులు... ఇల్లరికపు మొగుళ్లు
... కలిసి మెలిసుంటారు... నా మనవరాలు పెట్టి పుట్టింది కాబట్టే దానికింత గొప్ప సంబంధమొచ్చింది...రాజ్యం నోరు తెరిచింది...కాశీ అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు...
పిల్ల నచ్చింది, కానీకట్నం లేకుండా పెళ్ళి చేసుకుని తీసుకెళ్తాం అంటూ ఒక వారం లో ఉత్తరము రాశారు పెళ్ళివారు... "నేను చెప్పలా, కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదని, ఒరేయ్ కాశీ..." అని వెంకాయమ్మ ఉత్సాహపడిపోయింది...
రాజ్యం మనసేమి బాగాలేదు... కాశీ ఆ వారం లో రెండు రోజులే మధ్యాహ్నం భోజనానికి
ఇంటికొచ్చాడు... పని ఒత్తిడి వల్ల మిగిలిన రోజులు కుదరలేదని చెప్పాడు తల్లికి...
అస్సలే ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం...
బడి నుండి అటు నించి అటే తన స్నేహితుడింటికి వెళ్ళాడు... మురళీ అనే అతను పట్నం లో ఉద్యోగం చేసి ఈ మధ్యే ఉద్యోగ విరమణ తర్వాత తిరిగి తన సొంత ఊరు వచ్చేసాడు...మురళీ కు ఒక కొడుకు, కూతురు...చెప్పుకోతగ్గ పిల్లలు. కొడుకు ఆ ఊళ్ళోనే ప్రభుత్వ కళాశాల లో పుస్తకశాలాధికారి గా పని చేస్తున్నాడు... కూతురు చిన్న పిల్లలకు టీచరుగా చేస్తోంది...మురళీ, కాశీల తండ్రులు ఒక ఊరు వాళ్ళు కావటం తో మంచి స్నేహితులు... అదే బాట లో పిల్లలు కూడా నడిచారు...మురళి పట్నం వెళ్ళాక ఒక్కసారిగా రాక పోకలు తగ్గాయి... ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవటం వల్ల ఇద్దరూ చాలా ఆనంద పడ్డారు... తన బాధంతా చెప్పుకున్నాడు కాశీ... తల్లి వైఖరి తట్టుకోలేక పోతున్నట్లు చెప్పాడు...తన తండ్రి బతికున్నప్పుడు పొలాలు, వాటి మీద ఆదాయము, ఆ రోజులే వేరు... తర్వాత పదేళ్లు మంచము లో ఉండి పోయాడు తండ్రి... వైద్యానికి దాదాపు పొలాలన్నీ అమ్మేశారు... తనేదో బడిపంతులు గా జీవితం గడిపేస్తున్నాని చెప్పాడు...మురళీ కాశీ భార్య రాజ్యానికి దూరపు బంధువు...ఆ మధ్య రాజ్యం వైపు వాళ్ళెవరో రాసిన ఉత్తరం ద్వారా మురళీ సంగతులు తెలిశాయి...ముప్పై ఏళ్ళ తర్వాత తిరిగి ఆ ఊరే వచ్చాడని...
"మీ నాన్న గారి సహాయము తో ఆ రోజుల్లో నేను చదువుకోవడం, మా ఇద్దరి చెల్లెళ్ళ పెళ్లిళ్లు అయ్యాయిరా... నాకు బాగా గుర్తు... మా నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు మేము పట్నము వెళ్ళాక... తప్పు నాదే... పెళ్లయ్యాక సంసారం లో పడిపోయి, నాన్నగారు ఎన్ని సార్లు అడిగినా మీ నాన్న ను చూడాలని, నేను పట్టించుకోలేదు... ఆ తప్పును సరిదిద్దుకుంటాను ఇప్పుడు, నీకిష్టమైతే..... మీ నాన్న గారు చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారముగా మీ పిల్లలకు మా పిల్లలతో పెళ్లిళ్లు చేసేద్దాము... నీ బాధలు తీరుతాయి, నాకూ బావుంటుంది... నా భార్య పోయి రెండేళ్లయింది...పిల్లల పెళ్లిళ్లు ఒంటరిగా చెయ్యడం నా వల్ల కాదురా... అని తేల్చేశాడు మురళీ...
కాశీ గుండె తెలీక పడింది...రాజ్యం కూడా సంతోషిస్తుంది... పిల్లలు అదృష్టవంతులు... పై నెల లో ముహూర్తాలున్నాయని ఆచార్యుల వారు చెప్పారు...మురళీ తన పిల్లలు ఒప్పుకున్నారని మర్నాడే చెప్పేసాడు... ఇక తన పిల్లలు కూడా కాదనరు అని అనుకున్నాడు కాశీ... నాయనమ్మ తీసుకొచ్చిన గొప్ప సంబంధాల కంటే ఇవి చాలా మంచివని అర్ధమవుతుంది వాళ్ళ కు... ఎటు వచ్చి మళ్ళీ తల్లి తోనే తిప్పలు...
ఈ చల్లని వార్త వినగానే రాజ్యం కు కొండంత ధైర్యం వచ్చింది..."నాకు తెలుసు, మీరు పైకి మీ అమ్మ మాట వింటున్నట్లు కనిపించినా మన పిల్లల కు అన్యాయం చెయ్యరని... కన్నీళ్లు తుడుచుకుంటూ భర్త తో అంది"...
వెంకాయమ్మ కు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది... ఒక్క సారిగా కొడుకు తనకు వ్యతిరేకంగా ఎలా అయిపోయాడో అర్ధం కాలేదు ఆవిడకు... సామెతలు కూడా నోటికి వెంటనే రాలేదావిడకు... ఒకే ఒక్క నిమిషం పట్టింది...ఆ తర్వాత మామూలే... "మీ నాన్న కూడా నా మాట ఎన్నడూ కాదనలేదు రా... నీ బుద్ధి ఎందుకు గడ్డి తిన్నది రా? లోకువ ఎవరంటే నంబి లోకాయి అని నీకు నేనింత లోకువైపోయానా రా?
"ముందుంది రా ముసళ్ళ పండగ"... "ఇప్పుడు అర్ధం కాదురా మీకు... నేను మాట్లాడిన రెండు సంబంధాలు డబ్బున్నవాళ్ళవి...అవొద్దని ఇవి చేస్తావా??
డబ్బుకు దాసోహం రా ఈ లోకము...నీకు తెలీదు, చెబితే వినవు...అదృష్ట వంతులను చెరిచే వాళ్ళు, దురదృష్టవంతులను బాగు చేసే వాళ్ళు లేరు...రేపు నీ పిల్లల గతంతే... పిల్లలను కంటాము గాని పిల్లల రాతలను కాదుగా..."
అలా సామెతలు తో వెంకాయమ్మ వాయిస్తూనే ఉంది...
ఆ ఇంట్లో ఎవ్వరు పట్టిచుకోలేదు... ప్రసాదు, రమలు తండ్రి పెద్దరికం నిలబెట్టి పెళ్ళికి ఒప్పుకున్నారు... తల్లి కలలను నిజం చేశారు... మురళి తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ప్రసాదుకు ఒక ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం వేయించాడు...
ఆ తరువాత నెలలో రెండు పెళ్లిళ్లు ఎక్కువ ఆర్భాటం లేకుండా మిత్రులిద్దరూ కలిసి చేసేసారు...
"తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడని" గట్టిగా తన లో తానే మాట్లాడుకుంటూ వాకిట్లో అరుగు మీద కూర్చుంది వెంకాయమ్మ...ఆమె బాధ పంచుకునే వాడే లేడు...ఆవిడ సంగతి ఊళ్ళో వాళ్లకు తెలియక పోతేగా... నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మరి...
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత్రి పరిచయం
పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక
వయసు: 52 సం.
నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)
స్వస్థలం: తెనాలి
చదువు: BA English Litt., B.Ed
వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.
ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం
పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.
స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.
కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు,
Katha,kathsnsm chala baagunnayi. Attagari character very typical of old days, even now we may see such people. The proverbs have been used well ,blending into the story line effortlessly. Wish you secure a prize !! Best wishes.
I like this story very much. The story is made more interesting by introducing a character, the mother-in-law, who is a treasure-house of popular Telugu proverbs.
చాలా బాగుంది... కథ కు ఎంచుకున్న ఇతి వృత్తం , కథను నడిపిన విధానం చాలా బాగుంది...పాత కాలం నాటి అనేక సామెతలను గుర్తు చేస్తూ కథ సాగడం పాఠకునికి ఒక మంచి అనుభూతిని ఇస్తుంది...రాధికకు మనః పూర్వక అభనందనలు...
The story is rich in proverbs of which
the younger generation needs to get familiar with. love it.
Excellent story. Captures the mood of the good (?) old days when attayyagarlu used to habitually torment daughters in law. Subtle humour. Overall very interesting.
l