'Samkalpa Balam' - New Telugu Story Written By Padmavathi Divakarla
'సంకల్ప బలం' తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఉదయం ఐదుగంటలకే లేచి స్నానం, పూజాదులు ముగించి సోఫాలో తీరిగ్గా వాలాడు రామచంద్ర. ఈ మధ్యే ఉద్యోగ విరమణ చేసాడు. ప్రభుత్వరంగ బ్యాంక్లో ఆఫీసరుగా అవిశ్రాంతంగా ముఫై అయిదేళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన రామచంద్ర ఇంకా ఈ కొత్త జీవితానికి అలవాటు పడలేదు. ఎప్పుడూ ఏదో పనితో బిజీగా ఉన్న అతను ఇప్పుడు పూర్తిగా ఖాళీ!
టీపాయ్పైన ఉన్న పేపరు అందుకొని యధాలాపంగా తిరగేసాడు. అందులోని వార్తలు చదువుతూంటే రెండో పేజీలో పడిన ఒక వార్త అతని దృష్టి ఆకర్షించింది. అది చదివి కొద్దిగా ఉద్వేగానికి గురైయ్యాడు కూడా!
"హేమా, రమా!...ఇలా రండి!" అని పిలిచాడు రామచంద్ర తన కూతుళ్ళను ఉద్దేశించి. తండ్రి పిలుపు విని హేమ, రమ ఇద్దరూ లోపలనుండి వచ్చారు.
"అమ్మా హేమా, రమా! రేపే మెడికల్ ఎంట్రాన్స్ ఫలితాలు రాబోతున్నాయి!" అని తను చదివిన వార్త సారాశం వాళ్ళకి చెప్పాడు.
"అలాగా నాన్నా!" అన్నారు ఇద్దరూ ఒకేసారి ఆతృతగా.
"అవును, రేపే రిజల్ట్స్, ఇదిగో ఇవాళ పేపర్లో వచ్చింది." చెప్పాడు రామచంద్ర.
రామచంద్ర చేతుల్లోంచి పేపరు అందుకొని చదివిన హేమ, “అవును నాన్నా! మనం ఎదురు చూసే రోజు రానే వచ్చింది. మా భవిషత్తు తీర్చిదిద్దడానికి మీరెంత కష్టపడ్డారో మాకు బాగా తెలుసు. మీ కలలు తప్పకుండా నెరవేరుతాయి నాన్నా!" అంది ఉద్వేగంగా చూస్తూ.
"సంతోషం తల్లీ! మీ ఇద్దర్నీ డాక్టర్లగా చూడాలన్నదే ఆ ఆకాంక్ష. మీరిద్దరూ నేను కలలు కన్నట్లు గ్రామాల్లో వైద్య సేవలు అందించి నా చిరకాల కోరిక తీర్చాలి అమ్మా!” అన్నాడు రామచంద్ర ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ.
రామచంద్రకి తన ఇద్దరు కూతుళ్ళు రమ, హేమ అంటే ప్రాణం. అయిదేళ్ళ క్రితం క్యాన్సర్ వ్యాధితో భార్య గతించినప్పటినుండీ అతని లోకమంతా వాళ్ళిద్దరే! భార్య మరణం అతన్ని నిలువునా కృంగదీసినా అతను త్వరలోనే తేరుకొని కుమార్తెల భవిష్యత్తు తీర్చిదిద్దిడానికి పూనుకున్నాడు. రామచంద్ర మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది.
రామచంద్ర తండ్రి రాఘవరావు ఓ ప్రయివేట్ సంస్థలో చిన్న ఉద్యోగి. ఇద్దరు కూతుళ్ళ తర్వాత పుట్టిన రామచంద్రాన్ని ఎక్కువ చదివించలేకపోయాడు రాఘవరావు. రామచంద్ర ఇంటర్ పూర్తి చేసేసరికి రాఘవరావు వయసురీత్యా ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది. కూతుళ్ళిద్దరి పెళ్ళి చేసిన తర్వాత ఆర్థికంగా చితికిపోయిన రాఘవరావు కొడుకుని పై చదువులు ఇక చదివించలేకపోయాడు.
రామచంద్ర చిన్నప్పటినుండి చాలా తెలివైనవాడని పేరు తెచ్చుకోవడమే కాక అన్ని తరగతుల్లోనూ స్కూలు ఫస్ట్గా వచ్చేవాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉండబోతుందని స్కూల్లో టీచర్లు అనుకొనేవారు. కాలేజీలో అతని ప్రతిభచూసి అధ్యాపకులు ప్రోత్సహించేవారు. కాలేజీలో బైపిసి తీసుకున్న రామచంద్ర డాక్టరవాలని కలలు కన్నాడు. వైద్యుడిగా ప్రజాసేవ చేయాలని మనసులో సంకల్పం చేసుకున్నాడు.
కాని తన కలలు వాస్తవ రూపం దాల్చలేవని త్వరలోనే తెలిసివచ్చిందతనికి. చిన్నపటినుండి డాక్టరవాలని కలలుకన్న రామచంద్రాన్ని నిరాశ ఆవరించింది. ఎలాగైనా కష్టపడి చదువుదామని అనుకున్నా తండ్రి తన అసక్తత వెలిబుచ్చడంతో తీవ్ర నిరాశకి గురయ్యాడు రామచంద్ర. తండ్రికి చదివించే స్తోమత లేనందువల్ల డిగ్రీ పూర్తిచేసి ఆ తర్వాత పోటీపరీక్షలు రాసి బ్యాంక్ ఉద్యోగంలో జొరబడ్డాడు. తన ఇష్టానికి విరుద్ధంగా బ్యాంక్ ఉద్యోగంలో చేరాడు కాని మనసులో ఏదో తెలీని వెలితి.
అదీ చాలా కొద్దిరోజులే! ఈ లోపల బాధ్యతలు చుట్టు ముట్టాయి. తండ్రి చనిపోవడం, తన పెళ్ళి జరిగి జానకి కాపురానికి రావడం కాలక్రమంలో జరిగిపోయాయి. అయితే డాక్టరవాలన్న అతని బలీయమైన కోరిక మాత్రం రూపు మాసిపోలేదు. ఈ లోపు ఆర్థికంగా కుదుటపడ్డాడు. కవలలైన తన పెద్ద కూతురు హేమ, చిన్న కూతురు రమలోనే తన భవిష్యత్తు ఊహించుకోసాగాడు.
వాళ్ళని మంచి స్కూల్లో చేర్చి, చిన్నపటినుండి వాళ్ళల్లో డాక్టర్ కావాలనే ఆశయాన్ని పెంచి పోషించసాగాడు. వాళ్ళిద్దరూ అదే ఆశయంతో చదివి తండ్రి ఆశయం నెరవేర్చడానికి కంకణం కట్టుకున్నారు. ఇంటర్లో ఉండగానే మెడిసిన్ కోచింగ్లో చేరారు. అంతేకాక, తండ్రివద్ద నుండి కూడా చాలా నేర్చుకున్నారు. రామచంద్ర బ్యాంక్లో కర్తవ్య నిర్వహణలో ఉండగానే ఉచితంగా చాలామంది పిల్లలకి కోచింగ్ ఇచ్చేవాడు కూడా. సహోద్యోగులపిల్లలకు, స్నేహితులు, తెలిసిన వాళ్ళ పిల్లలకి తన పరిధిలో, తనకున్న పరిజ్ఞానంతో చదువులో సహాయం చేసేవాడు.
అతనివద్ద చదువుకున్న చాలామందికి ఆ తర్వాత మెడిసిన్లో సీటొచ్చింది కూడా. రామచంద్ర తన ఉద్యోగ నిర్వహణలో చాలా ఊళ్ళు తిరిగాడు. అందులో కొన్ని అసలు ఏ మాత్రం వైద్య సదుపాయం లేనివి ఉన్నాయి. వైద్యం కోసం చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది అక్కడ స్థానికులకు, ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో అయితే ఈ పరిస్థితి దారుణం, వర్ణనాతీతం. వైద్య సదుపాయం అందకుండా కళ్ళముందే ప్రాణాలు పోవడం కూడా చూసాడు. అది రామచంద్ర మనసుని బాగా కలచివేసేది.
మెడిసిన్ చేసి పల్లెల్లో వైద్య సదుపాయం అందించే భాగ్యం తనకు కలగనందుకు చాలా చింతించేవాడు. అందుకే తన కూతుళ్లనిద్దరినీ ఎలాగైనా డాక్టర్లుగా చేసి తన కోరిక నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. రెండుమూడేళ్ళనుండి ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. రిటైరైన తర్వాత తనకు లభించిన అదనపు సమయం వాళ్ళిద్దరికీ చదువు చెప్పడంకోసం వెచ్చించాడు.
సరిగ్గా అదే సమయంలో రామచంద్రకి అత్యంత ఉద్వేగానికి గురి చేసే ఓ విషయం తెలిసింది. సరిగ్గా ఆరునెలల క్రితం అతని క్లాస్మేట్, స్నేహితుడు అయిన డాక్టర్ ప్రభాకర్ నుండి తెలిసిన ఆ విషయం రామచంద్రంలో కొత్త కోరికలు నింపింది. మనసులో సరికొత్త ఆలోచనలు లేపింది. ఉద్యోగ విరమణ తర్వాత తనకు లభించబోయే ఈ అవకాశం చాలా అద్భుతంగా, అబ్బురంగా తోచింది. అతన్ని అనందంతో ఉక్కిరిబిక్కిరయ్యేలా చేసింది. రామచంద్రలో ఆశలు పురివిప్పాయి. మూడునెలల క్రితం ప్రభాకర్ చెప్పిన విషయం మనసులో మెదిలింది.
ఆ రోజు పని గట్టుకొని తన ఇంటికి వచ్చిన ప్రభాకర్ చెప్పిన మాటలివి, "రామచంద్రా! నీకు తెలుసో, లేదో ప్రస్తుతం మెడిసిన్లో చేరడానికి అప్పర్ ఏజ్లిమిట్ లేదు, కోర్టు తీర్పు మూలంగా! ఇప్పుడు నువ్వెలాగూ రిటైరై ఖాళీగా ఉన్నావు. పైగా అందరికీ కోచింగ్ ఇస్తూ ఉండడం వల్ల నువ్వు బాగా అప్డేట్ కూడా అయి ఉన్నావు. నువ్వు డాక్టర్ కాలేకపోయినందుకు ఎంత మనసులో బాధపడేవాడివో నాకు తెలియంది కాదు. నాకన్నా చదువులో నువ్వు ఎప్పుడూ ముందున్నా కూడా నీ ఆర్థిక పరిస్థితులవల్ల చదవలేకపోయావు.
ఇప్పుడు నీకు కూడా మంచి అవకాశం ఉంది. నువ్వు కూడా మీ అమ్మాయిలతో పాటు పరీక్షలకి ప్రిపేర్ కావచ్చు. అదృష్టం ఉంటే నీకూ ఛాన్స్ రావచ్చు. అలా నీ కోరిక కూడా తీరవచ్చు."
ప్రభాకర్ మాటలు విన్న రామచంద్రకి ఒక్క నిమిషం ఆలోచనలో పడి, ఆ తర్వాత, "ఈ వయసులోనా! నేనూ ఆ వార్త చూసాను. కానీ మా అమ్మాయిలతో నేను కూడా పరీక్షలకి హాజరు కావడం..." పేలవంగా నవ్వుతూ అంటున్న రామచంద్ర మాటలను ఖండిస్తూ, "వయసనేది శరీరానికే కాని మనసుకు కాదు. నీ మనసేమిటో నాకు బాగా తెలుసు. ఎవరో నవ్వుతారో ఏమో అని బిడియపడకుండా నువ్వూ ప్రయత్నిస్తే గెలుపు నీదే సుమా! అయినా ఇప్పటికైనా నీ వయసేం మించిపోయింది చెప్పు! రిటైరై ఏడాదికూడా కాలేదు. శారిరకంగా కూడా ఇంకా ఫిట్గానే ఉన్నావు. పట్టుదలతో ప్రయత్నిస్తే కాలేనిది ఏమీ లేదు. అరుదుగా వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని నీ అదృష్టాన్ని పరీక్షించుకో! నువ్వు మాత్రం విజయం సాధిస్తే నాకన్నా సంతోషించేవాడెవడూ ఉండడు. బాగా ఆలోచించుకో! బెస్టాఫ్ లక్!" అని రామచంద్ర మనసులో ఆశల బీజం నాటి వదిలాడు.
ఆ రోజునుండి రామచంద్రకూడా హేమ, రమకి ఇంట్లో కోచింగ్ ఇస్తూనే తను కూడా ఎంట్రాన్స్కి ప్రిపేర్ అయ్యేవాడు. అయితే వాళ్ళ నుండి ఈ విషయం దాచి, అతను ఎంట్రాన్స్కి వేరే సెంటెర్ ఎంచుకున్నాడు. వాళ్ళిద్దరికీ తెలియకుండా రామచంద్ర కూడా పరీక్షలకు హాజరైయ్యాడు. అక్కడ అతన్ని చూసిన కుర్రకారు, ఇన్విజిలేటర్లు నువ్వుతూ కామెంట్ చేయడం అతని దృష్టి దాటిపోలేదు.
అందులో ఓ కొంటె కుర్రాడు, "మనతో ఈ ముసలివాడు కూడా పోటీకి వస్తున్నాడోయ్!" అని అంటే మిగతా వాళ్ళు కిసుక్కున నవ్వారు కూడా. అయితే మనసులో దృఢ సంకల్పం ఏర్పర్చుకున్న రామచంద్ర దేనికీ చలించలేదు. ఏమాత్రం ఏమరుపాటు లేకుండా, చాలా జాగ్రత్తగా ఎంట్రాన్స్ రాసాడు. అప్పటినుండీ ఈ రోజు కోసమే వేచి ఉన్నాడు. ప్రభాకర్ మాటల్లో పడి తన కూతుళ్ళిద్దరితో కూడా పోటీలోకి దిగినా, వాళ్ళిద్దరికీ తప్పకుండా మంచి ర్యాంక్ రావాలని మనసులో దేవుణ్ణి ప్రార్థించేవాడు. ఇప్పుడు తను ఎదురు చూసే తరుణం రానే వచ్చింది.
గోడగడియారం పదిగంటలు కొట్టడంతో ఆలోచనల్లోంచి తేరుకున్న రామచంద్ర వాలుకుర్చీలోంచి లేచాడు. రామచంద్రేకాక, హేమ, రమకూడా రాత్రంతా కలతనిద్రతో గడిపారు. ఎంతో భారంగా తెల్లరిందనిపించింది ఆ రోజు. ఎదురుచూసిన ఘడియ రానేవచ్చింది. తెల్లారుతూనే ఎంట్రాన్స్ ఫలితాలకోసం ఎదురు చూడసాగారు ఆ ముగ్గురూ చాలా ఆత్రంగా. నెట్లో ఘడియఘడియకి చూస్తూనే ఉన్నారు. వాళ్ళ సహనానికి పరీక్ష పెడుతూ ఎట్టకేలకు పదిన్నరకి వాళ్ళు ఎదురుచూస్తున్న రిజల్ట్స్ వచ్చాయి.
హేమ, రమా ఇద్దరూ కూడా సోఫాలో చేరో మూల కూర్చొని ఆత్రంగా వాళ్ళ నంబర్లకోసం వెతకసాగారు. వాళ్ళ వంకే ఆత్రంగా చూస్తూ కూర్చున్నాడు రామచంద్ర. అలా అరగంటపైగా చూస్తున్న కూతుళ్ళిద్దరి మోహాల్లోనూ ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది రామచంద్రానికి. తన ఉద్వేగాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్షణక్షణాల్లో వాళ్ళ మొహాల్లో రంగులు మారుతున్నాయి.
అరగంట తర్వాత వాళ్ళిద్దరూ లేచారు. నిరాశగా రామచంద్రవైపు చూస్తూ. "నాన్నా! మిమ్మల్ని నిరాశకి గురిచేస్తున్నందుకు మన్నించండి. మా ఇద్దరికీ మంచి ర్యాంక్ రాలేదు. ఏ మెడికల్ కాలేజీలోనూ సీటు దొరికే అవకాశం లేదు. అయినా ఇది మొదటిసారికదా! ఇంకా బాగా చదివి వచ్చే ఏడు తప్పక విజయం సాధిస్తాం నాన్నా! మమ్మల్ని నమ్మండి. మీ కల వమ్ము కానివ్వము!" కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నా తండ్రివద్దకు వచ్చి అనునయంగా చెప్పింది హేమ.
వాళ్ళని ఆ పరిస్థితిలో చూసేసరికి రామచంద్రకి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తన ఇన్నేళ్ళ శ్రమ వృధా అయిందా అని ఓ క్షణం మనసులో మెదిలినా ఆ భావాలేమీ పైకి కనపడకుండా, "బాధపడకండి అమ్మా! మీరు మీ శక్తికి మించి ప్రయత్నించారు, అయినా ఫలితం దక్కలేదు. అయినా నువ్వన్నట్లు ఇది మొదటిసారికదా! వచ్చేసారి తప్పక సాధిస్తారు!" అన్నాడు వాళ్ళని ఓదారుస్తూ.
వాళ్ళిద్దర్నీ ఆ పరిస్థితిలో చూసేసరికి రామచంద్రకి చాలా బాధ వేసింది. ఎక్కడలేని నిరాశ మనసుని అలుముకుంది. తన నంబరు చూడాలని ఏదోమూల మనసులో అనిపించినా హేమ, రమకి రాని ర్యాంక్ తనకెలా వస్తుంది? వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే కాలేజీలో చదివిన వాళ్ళు, పైగా ఫ్రెష్! వాళ్ళ ముందు పోటీలో తనెంత? అయినా తనకి వచ్చినా రాకపోయినా వాళ్ళకి తప్పకుండా మంచి ర్యాంక్ రావాలని తపన రామచంద్రానికి. అందుకే వాళ్ళకి రానందుకు మనసులో బాధ సుడులు తిరుగుతోంది.
సరిగ్గా ఓ గంట తర్వాత ప్రభాకర్నుండి ఫోన్ వస్తే ఎత్తి, "మా అమ్మాయిలిద్దరికీ కావలసిన ర్యాంక్ రాలేదురా! నిరాశగా చెప్పాడు.
"అవును, నాకూ ఇప్పుడే తెలిసింది. అయితే నీకు మాత్రం కంగ్రాచ్యులేషన్స్ రా!" ఉత్సాహంగా ప్రభాకర్ చెప్పడం విన్న రామచంద్ర, "నీకేమైనా మతి పోయిందా? వాళ్ళిద్దరికీ మంచి ర్యాంక్ రాలేదని నేను విచారంలో ఉంటే నీకు ఈ వేళాకోళం తగునా!" కాస్త కినుకుగా, నిష్టూరంగా అన్నాడు.
"ఒరేయ్! రామచంద్రా! సరిగ్గా విను! వాళ్ళిద్దరికీ రాకపోయినా నువ్వు మాత్రం ఈ ఘనత సాధించావురా! అంతేకాక, నీ ర్యాంక్ కూడా వందలోపే! నీ నంబరు నువ్వు చూసుకోలేదా! చరిత్రలోనే ఇది మొదటిసారి, తెలుసా!" మరింత ఉత్సాహంగా అన్న ప్రభాకర్ మాటలకి మతిపోయింది రామచంద్రానికి.
"నిజంగా!" రామచంద్రకి నయనాలు అశ్రుభరితాలయ్యాయి. ఆనందాశ్రువులు మరి! ప్రభాకర్ మాటల్ని ఒకపట్టాన నమ్మలేకపోయాడు.
"నిజంరా! నూటికి నూరు శాతం నిజం! నమ్ము! నీ ర్యాంక్ తొంభై ఒకటి. మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుంది నీకు తెలుసా!" అన్నాడు.
ప్రభాకర్ మాటల్ని నమ్మలేక నెట్లో తన నంబర్ వెతికాడు రామచంద్ర! ఆశ్చర్యం! తన ర్యాంక్ తొంభై ఒకటి! నమ్మశక్యం కాలేదు రామచంద్రకి. ఈ వార్త ప్రభాకర్ వల్ల తెలిసిందో మరి ఎలా తెలిసిందో కాని హేమ, రమ కూడా తండ్రివద్దకు పరిగెట్టుకొని వచ్చారు. "నాన్నా! ఇది నిజమా! మీరెప్పుడు ఎంట్రాన్స్ ఇచ్చారు?" అంది సంభ్రమంగా రమ.
"చిట్టితల్లీ! అదంతా అంకుల్ ప్రభాకర్ వల్లే సాధ్యమైందమ్మా! మీకు రానందుకు దుఃఖ పడాలో, లేక నాకు ర్యాంక్ వచ్చినందుకు ఆనందపడాలో తెలియడం లేదమ్మా!" అన్నాడు రామచంద్ర. అతని కళ్ళనిండా నీళ్ళు.
"నాన్నా! మాదేముంది నాన్నా, ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు. కాకపోతే మీ విజయం మాత్రం అరుదైనది నాన్నా! మీ సంకల్పబలం ఎంతో దృఢమైనది! ఎప్పటినుండో మీ మనసులో ఉన్న కోరిక ఫలించబోతోంది నాన్నా!" అతని వళ్ళో వాలిపోయింది హేమ.
రమ చెమర్చిన రామచంద్ర కళ్ళు చేత్తో సుతారంగా తుడిచింది.
(ఇది కథ కాదు, వాస్తవం! ఉద్యోగ విరమణ చేసిన ఓ వ్యక్తి విజయగాధ ఇది.)
***
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
Comments