top of page

సంకల్పం

Updated: Oct 11, 2023


Samkalpam New Telugu Story

Written By Ramu Kola

రచన : రాము కోలా



పట్టు జారితే నడుము విరగడమేమో కాని పరలోకం చేరడం మాత్రం ఖాయం.

అటువంటి స్థితిలో నాలుగో అంతస్తు కిటికీ రెక్కలకు వ్రేలాడుతున్నాడు అతను.


నోటిలోని కత్తి దూరంగా వెలుగుతున్న వీధి దీపాల కాంతిలో మిలమిలా మెరుస్తుంది.

జాలి అనే పదం ఎరుగని గజదొంగ , నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీయగల హంతకుడు అతనే.


‘ఈ రోజు ఎలాగైనా సరే! నా రత్తాలు ముఖంలో సంతోషాలు చూడాల’అనుకున్నాడేమో, చీకటి మాటున అడుగులో అడుగు కదుపుతూ, పిట్టగోడ ను ఆసరా చేసుకుని ముందుకు సాగుతున్న గజదొంగ నాగులు.


"ఈ వృత్తిలోకి వచ్చిన తరువాత,సంపాదన లేకుండా ఉన్నది ఈ నెలలోనే.ఇలా అయితే ఎలాగో!అనుకుంటూ ఓ నిట్టూర్పు వదలి చీకట్లో ముందుకు సాగున్నాడు


"జనం మారిపోతున్నారు"

"అందరూ, క్రెడిట్ డెబిట్ కార్డుల మీద బ్రతికేస్తున్నారు,ఇంట్లో డబ్బులు, బంగారం ఉండనివ్వడం లేదు.

‘ఇలా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే తనలాంటి వాళ్ళు బ్రతికేదెలా’అని ఎన్నోసార్లు దేవుడికి మొర పెట్టుకున్నాడు నాగులు.


అసలే రత్తాలు నాలుగు రోజుల నుండి ఒకటే నస ‘డబ్బులు ఇంటికి తేవడం లేదంటూ.’

“పని మీద శ్రద్ధ తగింది"అంటుంది, సూటి పోటి మాటలతో.


ఎవ్వడి విద్య వాడికి గొప్ప. మాటలు చెప్పినంత తేలిక కాదు…, ఆతను చేసే పని చేయగలగడం.

టెక్నాలజీ పుణ్యమా అంటూ, అందరూ తెలివి మీరి, అతను చేసే పనికి, ఎంత సెక్యూరిటీ పెంచుకుంటున్నారో.

అటువంటి సమయంలో ఎంతో సామర్ధ్యవంతంగానో,ఒడుపుగానో ‘పని సక్కబెట్టుకోవడం’, చేసే వాడికే తెలుస్తుంది .ఇది కత్తి మీద సాము లాంటిది

ఆ విషయం నాగులుకు చాలా బాగా తెలుసు.


***************

అపార్టు మెంట్ నీళ్ళ పైపు వంక ఒకసారి చూసి, నడుము దగ్గర దాచిన ఫౌడర్ తీసి చేతుల నిండుగా పులుముకుని, చకచకా పైకి పాకడం మొదలెట్టాడు నాగులు


ఈ రోజు తన భార్య" రత్తాలు ముఖం పైన చిరునవ్వు చూడాలనుకున్నాడేమో…. చాలా జాగ్రత్తగా పనిలోకి పరకాయ ప్రవేశం చేసాడు.

ఇక సాధించే వరకు ఆగడు.


పైపు సహాయంతో ఎక్కి వెనుక డోర్ ఓఫెన్ చేసి, లోపలకు ఒదిగి దిగిపోయాడు నాగులు.

పనిలో దిగితే, ఇక తనకు సాటి రాగలవారు లేరు అన్న తన గురువు గారి మాట పైదవులపై విజయగర్వం నింపుతుంటే, నడుము దగ్గర దాచిన కత్తి తీసి చేతపట్టుకొని, తన ఎక్స్ రే కన్నులతో ప్రతి గది స్కాన్ చేస్తున్నాడు.


అతని చూపులు, చిరుత చూపులే,

అతని కదలిక, కుందేలును మరిపిస్తుంది,

ఇక పరుగులో చిరుత కూడా, తన ముందు తల వంచాల్సిందే ,అనే మాట నిజం చేసాడు ఎన్నో సార్లు.


మెల్లగా ఒక్కో గదిలో దొరికింది దొరికి నట్లు మూట లోకి చొప్పించేస్తున్నాడు.

కాస్తో కూస్తో దొరికిన బంగారం. మెడలో వేలాడేసాడు.

"ఇక మరో రెండు గదులు దోచేస్తే, వచ్చిన పని అయిపోతుంది"

అనుకుంటూ గదిలో దొరికిన ప్రతి వస్తువు సంచిలో నింపేసి, చివరి గది డోర్ చిన్నగా తెరిచాడు.


ఎదురుగా ఎవరో కనిపిస్తున్నారు.

మనిషా లేక బొమ్మో అర్థం కావడం లేదు.

అయినా తన చేతిలోని కత్తి మెరుస్తూ తనలో ధైర్యం నింపుతుంది.


డోర్.. తెరుచుకుని లోపలకు అడుగు పెట్టాడు, నాగులు.

అతని కన్నులు అంగుళం అంగుళం స్కాన్ చేస్తున్నాయ్, విలువైన వస్తువుల కోసం.


తనకు అభిముఖంగా ఎవ్వరో, వీల్ చైర్ లో కూర్చుని కనిపించడంతో, తన దగ్గర కత్తిని ఎదుటి వ్యక్తి పై దాడికి ఏ క్షణమైనా దాడి చేసేందుకు సిద్ధం చేసుకుంటూ...


"అరవాలని కానీ, ప్రతిఘటించాలని కానీ చూడకండి. "

"నాకు దయాదాక్షిణ్యం లేనే లేదు ,సూటిగా గుండెల్లో పొడిచేయగలను. "

"మీ మంచి కోసమే చెప్తున్నాను." అంటున్నా

అటునుండి ఎటు వంటి స్పందన రాకపోవడం నాగులుకు అమితమైన ఆశ్చర్యం కలిగిస్తుంది.


మరి కాస్త దగ్గరగా జరిగాడు..

అయినా ఎదుటి వ్యక్తిలో చలనం లేదు..

ఇక లాభం లేదు అనుకుంటూ, మరికాస్త దగ్గరగా జరిగాడు నాగులు.


నాగులు రాకను ఏ మాత్రం, పట్టించుకోవడం లేదు అతను,

తన పని తాను చేసుకుపోతున్నాడు.

" అసలు. ఈ సమయంలో. ఏం చేస్తుంటాడు ఇతను" అని జాగ్రత్తగా చూసాడు నాగులు.


వీల్ చైర్ లోని వ్యక్తికి చేతులు లేవు. కాళ్ళు కూడా అందరికిలా లేవు.

చిన్న తనంలోనే అవయవ లోపం తో జన్మించాడేమో,

ఉన్న కాళ్ళు కూడా చాలా సన్నగా, పెరుగుదల లేకుండా ఉన్నాయి.

కాలి వ్రేళ్ళ మధ్య బ్రష్ తో.. రంగుల చిత్రాలు గీస్తున్నాడు అతను.


"ఇంత రాత్రి వేళ ఇలా చిత్రాలు గీసే అవసరం ఏమొచ్చింది," అనిపించి మరి కాస్త ముందుకు జరిగాడు నాగులు.

వీల్ చైర్ లోని వ్యక్తి తల కాస్త పైకి ఎత్తి చూసి, తన పని తాను చేసుకుంటున్నాడు.


నాగులు కు విపరీతమైన ఆశ్చర్యం కలిగింది.

ఆగలేక అడిగేసాడు.

"అర్ధరాత్రి !నీ ఇంటికి దొంగతనం కోసం వచ్చానని తెలిసి, నా దగ్గర కత్తి ఉందని తెలిసి కనీసం భయం అనిపించడం లేదా "అంటూ.


"నీ పని నువ్వు చేస్తున్నావు !

నా పని నేను చేస్తున్నాను, అంతే. ఎవరి పని వారు శ్రద్దగా చేయాలి కదా"

అంటూ తన పనిలో లీనమైపోయాడు వీల్ చైర్లోని వ్యక్తి.


ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు అనిపించి. అడిగేసాడు నాగులు, " ఏ మాత్రం భయం అనిపించడం లేదా నీకు నన్ను చూస్తే? "

"అయినా ఇంత రాత్రి వేళల్లో ఒక్కడివే ఇలా బొమ్మలు గీయడం ఏంటి. "

అడిగాడు ఆశ్చర్యంగా.


"ఒక్క ఐదు నిముషాలు ఆగితే !నువ్వు ఏది అడిగితే అది చెపుతాను, సరేనా, "

అంటూ తన పనిలో లీనమై పోయాడా వ్యక్తి.


**************

అంత అవయవ లోపం తో చిత్రాలు గీయాలనే తపన అతనికి ఎందుకు.. అనిపించింది నాగులు కు.

అతని కథ వింటే కన్నీటికే కన్నీరు రాక మానవని తెలియదు నాగులు కు.


నాగులు అలాగే చూస్తుండి పోయాడా వ్యక్తి వంక.

అతనికి తన పని పట్ల ఉన్న శ్రద్దకు ముగ్దుడై.


చిత్రం గీయడంలో పూర్తిగా నిమగ్నమై పోయాడేమో,

అతని కన్నులు మెరుస్తున్నాయ్.

చిత్రం పూర్తి అయ్యేవరకు అదే చిరుదరహాసం చెదరనివ్వలేదు.

అంతటి అర్దరాత్రి సమయంలో కూడా అతని తలనుండి స్వేదం జారుతుంది.అంటే అతను మస్తిష్కంలో ఎంతటి సంఘర్షణ ఎదుర్కొంటున్నాడో అర్థమౌతుంది.

చిత్రం పూర్తి అయింది.

అది ఒక తల్లి తన బిడ్డకు పాలు పట్టే చిత్రం

****

కుంచెను శుభ్రంగా కడిగేసి, పదిలంగా అన్ని ఒక పక్కకు చిన్నగా జరుపుతున్నాడు,

తన వీల్ ఛైర్ కదలికలతో.


"ఇంత కష్టపడి చిత్రం గీస్తున్నారు కదా, అంత అవసరం ఏంటీ?

అందరూ ఆదమరచి నిద్రించే వేళ, దొంగతనాలు చేయడం నా వృత్తి.

ఎంతో జాగ్రత్తగా చేయవలసిన పని.

మీరు అంతకు మించిన జాగ్రత్తగా. చేతులు లేకున్నా, కాలి వేళ్ళ మధ్య బ్రష్ ఉంచి, ఎంత బాగా గీసారు"

ఉత్సాహం ఆపుకోలేక అనేసాడు నాగులు.


"నిజమే! శ్రమ అనే పదం నాకు ఎంతో ఇష్టం.

చిన్న తనంలోనే, అమ్మ మా ఇద్దరికీ జన్మనిచ్చింది. అప్పటికే తను అనారోగ్యంతో బాధపడుతుంది.

నేను మా చెల్లి ఇలా అవయవ లోపం తో పుట్టడానికి అది ఒక కారణం. సరి అయిన ఆహారం తీసుకునే స్తోమత అమ్మకు లేక.


మాకు ఊహ వచ్చిన దగ్గర నుండి. ఎవ్వరూ అంతగా మమ్మల్ని దగ్గరకు చేర్చుకునే వారు కాదు.

చెల్లి కాస్త పర్వాలేదు.

తను అన్ని పనులు చేయగలదు. తనే నన్ను పెంచింది అమ్మలా.


ఒంటరిగా ఉండలేక నేలపై చిత్రాలు గీసే వాడిని. చూసిన కొందరు మెచ్చుకుంటూ, ప్రోత్సహించేవారు డబ్బులు ఇచ్చే వారు.

తరువాత పేపర్స్ పైన ఎదుటి వ్యక్తి ని చూస్తూ చిత్రాలు వేసేవాడిని.

కొంత డబ్బులు వచ్చేవి. వాటితో ఫెయింట్స్ కొని, కాన్వాస్ చిత్రాలు గీయడం మొదలెట్టాను.


నా అవయవ లోపం ఎప్పుడూ నన్ను బాధ పెట్టలేదు. నా చిత్రాలను. మా చెల్లాయ్. ఆర్ట్స్ గ్యాలరీలలో పెడుతుంది.

వచ్చిన డబ్బులు మా అవసరాలకు సరిపోతుండేవి.


"కానీ చెల్లి పెరిగి పెద్దదౌతుంటే., నా భాధ్యత పెరగడం మొదలైంది.

తను ఎంత కాలం నాతో ఉండగలదు.

తనకు పెళ్లి చేయాలి. ఒక బంధం కల్పించాలి.

అనే ఆలోచనతో. నా చిత్రాలు బెంగళూరు లో జరిగే ఆర్ట్స్ ఎగ్జిబిషన్ కు పంపడం.

ఆవి అక్కడ నచ్చడంతో.మరికొన్ని చిత్రాలకు ఆర్డర్ వచ్చింది.


అవి కంప్లీట్ చేయాలి. అందుకే ఈ సమయంలో ఇలా పని చేస్తున్నాను.

నువ్వు ఏదో దోచుకోవాలని వచ్చావు కదా. నీ పని నువ్వు శ్రద్దగా చేయలేక పోయావు కదా నా వలన.

నీవు తెచ్చే డబ్బులు ఎంత అవసరమో నీ ఇంటికి. నేను అర్థం చేసుకోగలను.


అందుకే…!. ఆ క్రింద అరలో డబ్బులు ఉంటాయ్. తీసుకో. ఇలా నా శ్రమ నీకు ఉపయోగపడినందుకు నాకు సంతోషమే కానీ బాధ ఉండదు. తీసుకో"

అంటున్న అతన్ని చూస్తూ.

తన వైపు చూసుకుంటూ సిగ్గుతో తల వంచుకున్నాడు.

అతని ముందు తాను ఎంత అల్పుడో తనకు అర్థమౌతుంది.

అతనికి తెలియకుండానే కంటతడి పెట్టుకున్నాడు నాగులు.


అవయవ లోపంతో తన బాధ్యత లను ఎంత చక్కగా నిర్వహిస్తున్నాడు అతను .

ఎంత శ్రమపడుతున్నాడు? మరి తను ఎందరి శ్రమనో దోచుకుంటున్నాడు.

ఇక్కడ ఎవరు మనిషి.. మానవత్వం వున్నా అవయవాలు లేవనే భావం రానివ్వక తన పనిలో నిష్ఠగా సాగిపోతున్నాడు అతను.


మరి నేను?

అన్ని అవయవాలు ఉండి, సోమరిలా దొంగతనాలు చేస్తూ, నా సంతోషాలకోసం, ఎందరి శ్రమనో దోచుకుంటూ...

‘ఛీ! నాదీ ఒక బ్రతుకేనా? వద్దు ఇటువంటి బ్రతుకు. విలువ లేకుండా

ఎందరి శ్రమనో దోచుకునే బ్రతుకు.


దోచుకోవడం వదిలేస్తాను ఈ నిముషం నుండి, శ్రమను నమ్ముకుంటాను. నా కుటుంబాన్ని పోషించుకుంటాను’

అని మనసులో అనుకుంటూ… అతని పాదాలకు నమస్కారించి,తాను తీసిన వస్తువులు ఎక్కడివి అక్క సర్దేసి వెను తిరిగాడు నాగులు.


తను దోచుకున్నది ఏ గదిలోది ఆగదిలో సర్దేయాలని..


మనిషిలో మార్పు.. ఉన్నతుడిని చేస్తుంది...


*శుభం*




Komentáre


bottom of page