top of page

సంకల్పం

#Siriprasad, #శిరిప్రసాద్, #Samkalpam, #సంకల్పం, #TeluguKathalu, #తెలుగుకథలు


Samkalpam - New Telugu Story Written By Siriprasad

Published In manatelugukathalu.com On 11/02/2025

సంకల్పం - తెలుగు కథ

రచన: శిరిప్రసాద్

 (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



గౌరీ యాభై ఏళ్ళు నిండి ఏభై ఒకటిలో ప్రవేశించింది. ఆ కాలనీలో ఆమె పూజల గౌరిగా ప్రసిద్ధి. అమ్మాయిలనించి అమ్మమ్మల వరకు అందరికీ పూజల విషయంలో మార్గదర్శకురాలు. పెళ్ళికాని అమ్మాయిలకోసం వ్రతాలు చేయిస్తుంది. మధ్య వయస్కులనించి, వృద్ధ స్త్రీల వరకు ఎన్నో వ్రతాలు చేయిస్తుంది. సాంప్రదాయకులైన కుటుంబాలు నివసిస్తున్న ఆ కాలనీలో పూజలు, వ్రతాల సందడి ఎక్కువగా వుంటుంది. దీర్ఘ సుమంగళిగా పోవాలని కోరుకునే స్త్రీలకి వ్రతాలు, నోముల కొరత లేదు. గౌరీ ఆధ్వర్యంలో వాటిని నిర్వహించుకోవడం అక్కడి స్త్రీలందరికీ అలవాటు. జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఆమె దగ్గిర ఓ పరిష్కార వ్రతం వుంటుంది. ఆ వ్రతం చేస్తే, ఆ సమస్య పరిష్కారం అవుతూ వుంటుంది. అది నిజంగానే వ్రత మహత్యమా, లేక కాకతాళీయమా, అనేది ఆలోచించరు. గౌరిమీద ఆ కాలనీ వాసులకి అంత నమ్మకం!


గౌరి పొడుగ్గా, ధృడంగా, పచ్చని ఛాయలో మెరిసిపోతుంటుంది. ఆమె నుదుటిమీద పెట్టుకునే కుంకుమ బొట్టు విలక్షణంగా కనిపిస్తూ, ఆమె పట్ల గౌరవభావాన్ని యినుమడింప చేస్తుంది. శుక్రవారాల్లో ఖరీదైన పట్టు చీర కట్టుకుని, సత్సంగం నిర్వహిస్తూ అందరికీ రుచికరమైన ప్రసాదాలు పెడుతుంది. 

ఆమె భర్త, ఈశ్వర రావు రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసి, సర్వీస్ యింకా ముగిలివున్నా, ఈ మధ్యే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. భార్యకి చేదోడు వాదోడుగా వుంటుంటాడు. వాళ్ళిద్దరికీ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి భర్తతో అమెరికాలో వుంటుంది. అబ్బాయి సెంట్రల్ సర్వీసు లో ఉద్యోగం చేస్తూ ఢిల్లీలో వుంటాడు. అతని జాబ్ లో బదిలీలుండవు. పిల్లలిద్దరూ ఏడాదికోసారి సంక్రాంతికి వచ్చి వెళుతుంటారు. కూతురి భర్తకి చుట్టాల పట్ల పెద్దగా ప్రేమ లేదు. పుట్టింటి విషయంలో కొన్ని నియమనిబంధనలు పెట్టాడు. అవి బాధాకరంగా వున్నా భరించక తప్పలేదు కూతురికి. ఇక కోడలు ఎప్పుడూ అసంతృప్తిగా వుంటుంది. అత్తమామల పట్ల గౌరవం నటిస్తుంది కానీ, అంటీ ముట్టనట్టుగా వుంటుందనేది స్పష్టంగా కనిపిస్తుంది. 


వాళ్ళకి వున్న ఆస్తి పిల్లలిద్దరికీ యిచ్చేసారు. ఆ యిల్లు మాత్రం ఈశ్వర రావు పేరు మీదే వుంది. వచ్చే పెన్షన్ డబ్బుతో యిద్దరూ హాయిగా వుంటున్నారు. నిత్య పూజలతో యిల్లు కళకళలాడుతూ వుంటుంది. ఆ కాలనీలో ఆడవాళ్ళు ఏ ముఖ్యమైన పనికి వెళ్తున్నా గౌరి ఆశీర్వాదం తీసుకుంటూ వుంటారు. గౌరిని చూస్తుంటే గౌరవభావం రోజురోజుకీ పెరిగిపోతూ వుంటుంది. ఆమె ముఖ వర్చస్సు, నుదుటి మీద ప్రస్ఫుటంగా కనిపించే బొట్టు, నిండైన పట్టు చీర చూపరుల దృష్టిలో ఆమెకి దాదాపు దేవుడి స్థానం దక్కింది. అమ్మవారి స్వరూపమా అన్నట్టుంటుంది. 


అలా అయిదేళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది గౌరి. వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ఐ సీ యూ లో వుంచి అన్నీ పరీక్షలూ చేసారు. ఒక కిడ్నీ పనిచేయడం లేదు, మరో కిడ్నీ తక్కువ సామర్థ్యంతో పనిచేస్తోంది. కాలనీ వాసులందరూ గుళ్ళో ఆమె ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్నారు. 


గౌరి కూతురు అమెరికా నించి, కొడుకు ఢిల్లీ నించి వచ్చారు. తల్లిని చూసి బావురుమన్నారు. తల్లి చేస్తున్న పూజల వల్లే తాము సంతోషంగా వుండగలుగుతున్నామని వాళ్ళ నమ్మకం. అలాంటి తల్లి తమకు దూరమైపోతే, అనే భావనే భరించలేనిదిగా అనిపించింది. 


గౌరికి డయాలిసిస్ ప్రారంభించారు. కొద్ది రోజులు హాస్పటల్లోనే వుంచాలని నిర్ణయించారు. 

ఇంతలో ఒక రోజు ఈశ్వర్ రావు కనపడకుండా పోయాడు. 


ఒక రోజంతా వెతికారు. చివరికి సాయంత్రం ఒక పోలీసు కానిస్టేబుల్ ఆయన్ని తీసుకొచ్చి యింటి దగ్గిర దింపాడు. తర్వాత కొంచం సేపు లెక్చరిచ్చి, వెళ్ళిపోయాడు. తండ్రి హావభావాల్లో, ప్రవర్తనలో తేడా వున్నట్టు గ్రహించాడు ఈశ్వరరావు కొడుకు మురళి. ఆ రోజు ఆయన నీరసంగా వుండి, కొద్దిగా అన్నం తిని పడుకున్నాడు. 


మర్నాడు కూడా ఈశ్వరరావు అలాగే బయటికెళ్లి పోయాడు. అయితే రెండు గంటల్లో తిరిగి వచ్చాడు. బాత్రూం లో గంట సేపు గడిపాడు. ఇక లాభం లేదనుకుని మురళి తండ్రిని డాక్టరుకి చూపించాడు. ఆ హాస్పిటల్ లో న్యూరాలజిస్ట్ వుండడంతో టెస్ట్స్ పరంపర కొనసాగించి, మర్నాడు డిక్లేర్ చేసారు. ఈశ్వరరావు కి అల్జీమర్స్ వ్యాధి ప్రారంభమైంది. న్యూరోలజిస్ట్ కొన్ని మందులు రాశాడు. ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. మురళికి గుండె దడ మొదలైంది.


తల్లి కిడ్నీ పేషెంట్, తండ్రికి అల్జీమర్స్. వీళ్ళిద్దరూ ఎలా ఉండగలరు? ఒకరికొకరు సహాయపడే పరిస్థితి లేదు. తను ఢిల్లీ వదిలి రాలేడు. వీళ్ళిద్దరినీ ఢిల్లీకి తీసికెళ్ళలేడు. భార్య ఒప్పుకోదు. చెల్లెలు అమెరికా విడిచి రాలేదు. కొద్ది రోజులు వుండడానికి కూడా బావ ఒప్పుకోడు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? మురళి మనసులో ఆందోళన మొదలైంది. తల్లితండ్రుల మీద ప్రేమ, జాలి; భార్య అభిప్రాయాలకి ఎదురుచెప్పడానికి సరిపోని ధైర్యం - వీటి మధ్య తర్జన భర్జన! 


రెండు రోజుల తర్వాత గౌరి ఆసుపత్రినించి యింటికి వచ్చింది. ఆమె ఎక్కువ ఆయాసపడకుండా తన పనులు చేసుకోవచ్చన్నారు డాక్టర్లు. ఒక ప్రైవేటు ఏజెన్సీని పట్టుకుని తండ్రిని చూసుకోడానికి ఒక మనిషిని కుదిర్చాడు మురళి. అతనికి కూడా తిండి పెట్టాల్సి రావడంతో తల్లి అంత కష్టం తీసుకోలేదని ఒక వంటమనిషిని కుదిర్చాడు. వీళ్ళిద్దరి జీతాలకి సరిపోను నెలా నెలా డబ్బు పంపిస్తానని చెప్పాడు. గౌరికి ఆ బయట మనుషులు యింట్లో వుండడం యిష్టం లేకున్నా, తన పరిస్థితి, భర్త పరిస్థితి చూసాక వొప్పుకోక తప్పలేదు.


మరో నాలుగు రోజుల తర్వాత మురళి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వారం రోజులకి గౌరి కూతురు సుధ అమెరికా విమానం ఎక్కింది. 

******

ఈశ్వరరావు యిరుగుపొరుగుని గుర్తు పట్టలేక పోతున్నాడు. భార్య గౌరిని గుర్తుపడుతున్నాడు కానీ అసహనంగా వుంటున్నాడు. తనలో తనే గొణుక్కుంటున్నాడు. ఉద్యోగంలో వున్నప్పటి సహచరులనీ, పై అధికారుల్ని తిట్టి పోస్తున్నాడు. కొట్టి వస్తానంటూ వేగంగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాడు. సహాయకుడు బలవంతంగా లోపలికి లాక్కొస్తుంటాడు. అతనికి కూడా అసహనం పెరిగిపోయి అరుస్తుంటాడు. 


ఈశ్వరరావు తిండి తగ్గించేసాడు. చిన్న పిల్లాడికి పెట్టినట్టు పెట్టాల్సొస్తోoది. అప్పుడే నడక నేర్చిన బుడతడు ఇంట్లోంచి బయటి విశాల ప్రపంచంలోకి పరిగెత్తే ప్రయత్నం చేసినట్టు, ఈశ్వరరావు కూడా ఆ ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఆయన కాలానికి బందీ అయిపోయాడు. అల్జీమర్స్ అనే సంకెళ్ళు బలంగా ఆయన్ని కట్టి పడేస్తున్నాయి. ఆయన పరిస్థితి చూసి గౌరి కన్నీళ్ళ పర్యంతం అవుతోంది. తను కూడా ఏమీ చేయలేని పరిస్థితి. తను బాగుండివుంటే భర్తని చిన్న బాబులా ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేదాన్ని కదా, అని వాపోతూ వుంటుంది. కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని అమ్మవారిని ప్రార్థిస్తూ, మనస్సులో ఆ తల్లి పాదాలని తన కన్నీళ్ళతో కడుగుతూ వుంటుంది. తన వ్రతాలు, నోములూ, పూజలూ, కళ్యాణాలూ ఏమైపోయాయి, అవన్నీ వ్యర్ధమేనా, తామిద్దరికీ ఒకేసారి యింత తీవ్ర వ్యాధులు రావడమేంటి, యిద్దరం పరస్పరం సహాయం చేసుకోలేక పోవడమేమిటి? బయటి వ్యక్తుల మీద ఆధారపడి, యింత నికృష్టమైన జీవితం గడపడమేమిటి?


గౌరి వంశంలో కిడ్నీ బాధితులు వున్నారు. ఆమె తల్లి కిడ్నీ పాడై చికిత్స మొదలెట్టే లోపే చనిపోయింది. ఈ వంశ పారంపర్య వ్యాధి గౌరీకి కూడా తగులుకుంది. తన పెళ్ళి చూపుల్లో ఈశ్వరరావు తండ్రి తమ కుటుంబంలో వంశపారంపర్య వ్యాధులేవైనా వున్నాయా అని అడిగాడు. గౌరి తండ్రి సులువుగా అబద్ధం చెప్పేశాడు. వంద అబద్ధాలు చెప్పైనా పెళ్ళి చేయమన్నారు కదా! పెళ్ళైన రెండు మూడు సంవత్సరాలకి ఈశ్వరరావుకీ విషయం తెలిసింది. చిరునవ్వు నవ్వి, మన పెళ్ళి అందరి పెళ్ళిళ్ళ లానే స్వర్గంలో జరిగిపోయిందోయ్, అన్నాడు. తర్వాత ఆ విషయమే మర్చిపోయాడు. ఇప్పుడిక గౌరికి వ్యాధి వచ్చిన విషయం ఆయనకి తెలుసో, లేదో కూడా తెలియదు. మతిమరపు వ్యాధి ఆయన మెదన్ని చుట్టేసింది. అది తగ్గదంటున్నారు. మందులే లేవంటున్నారు. త్వర త్వరగా అయిదో స్టేజ్ దాటిపోయింది. రెండు మూడు సార్లు కింద పడ్డాడు. కానీ ఆయనకది తెలియదు. కిందపడకుండా ఎలాంటి ప్రయత్నం చేయలేక పోతున్నాడు. 


గౌరి తన అనారోగ్యం కొంత స్థిమిత పడ్డాక అమ్మవారికి పూజలు మొదలెట్టింది. రోజూ రెండుమూడు గంటలు పూజ చేసి అమ్మవారిని వేడుకుంటుంది, "తల్లీ నీకు ఎంతకాలంగా, ఎన్నెన్ని పూజలు, నోములు, వ్రతాలు చేసాను! అయినా దయలేక నాకు, నా భర్తకి ఒక్కసారే యింత తీవ్రమైన వ్యాధులు కలిగించావా! ఏ జన్మలో ఏ పాపాలు చేసాను? నీ పట్ల నా భక్తి ఆ పాపాల్ని చెరిపేయలేక పోయిందా! ఇంక యీ పూజలు, వ్రతాల వల్ల ఫలితం ఏమిటి? నన్ను చూసి ఎంత మంది నీకు పూజలు చేస్తున్నారు! వాళ్ళందరికీ నేనేం చెప్పను? తల్లీ, దీర్ఘ సుమంగళిగా బతకాలని యిన్ని నోములు నోచానే! నాకు కిడ్నీ వ్యాధి తెప్పించావు, సరే! ఆ వ్యాధితో నేను త్వరలోనే మరణిస్తాను, సరే! సుమంగళిగా మరణిస్తాను, సరే! నా తర్వాత నా భర్త అల్జీమర్స్ వ్యాధితో ఎలా బతుకుతాడు? బిడ్డలిద్దరూ ఆయన్ని చూసుకుంటారా? నాకు నమ్మకం లేదు. ఆయన బతుకేం కావాలి? ఇంతకాలం ఆయనకి ఎందులోనూ తక్కువ చేయకుండా రాజు లా చూసుకున్నాను. ఇప్పుడిలా ఎందుకు జరిగింది? ఈ సమస్యని నువ్వే పరిష్కరించాలి తల్లీ!"

ఇరుగు పొరుగు గౌరి పట్ల భక్తితో చేయగలిగిన సహాయం చేస్తున్నారు. డయాలిసిస్ చేయించుకుంటూ గౌరి రోజులు వెళ్ళదీస్తోంది. భర్త పిచ్చి వాడిలా ప్రవర్తించసాగాడు. ఒక్కో రోజు అందరినీ ఏమర్చి బయటికి వెళ్ళిపోతున్నాడు. నీరసించి, బరువు తగ్గిపోయాడు.


కొడుకు మురళి నెలకోసారి వచ్చి చూసిపోతున్నాడు. 


ఒక రోజు గౌరికి ఎందుకో అనిపించింది, మృత్యువు తన చుట్టూనే తిరుగుతున్నట్టు, ఏదో క్షణాన తనని కబళించబోతున్నట్టు! ఆ వూహే భయంకరంగా అనిపించింది గౌరికి. తన తర్వాత భర్త పరిస్థితి ఏమిటి? 

గౌరి ఇప్పుడు భర్త గురించి మరింత మధన పడ సాగింది. తర్వాత శుక్రవారం రోజు పెద్ద పూజ చేయాలని నిర్ణయించింది. కాలనీలోని తనకత్యంత సన్నిహితుల్ని పిలిచి ఏర్పాట్లు చేయించింది. వంట కోసం ఏర్పాట్లు చేయించింది. పూజా సామగ్రి ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికొచ్చింది. పదకొండు మంది ముత్తైదువులకు పట్టు చీరలు తెప్పించింది. మురళి తల్లిని ఫోన్లో మందలించాడు. విశ్రాంతి తీసుకోకుండా ఈపూజలేమిటని కొంచం కోపంగా మాట్లాడాడు. అవేవీ పట్టించుకోకుండా ఏర్పాట్లు చేసింది.


రెండు గంటల పూజకి అలసిపోయింది గౌరి. గౌరీ మాతని ఏడుస్తూ మనసులోనే వేడుకుంటోంది. ఆమె కన్నీళ్ళు చూసి అక్కడ కూర్చున్న మహిళలందరి కళ్ళూ చెమర్చాయి. ఎందుకో గౌరి తమకు దూరమైపోతుందని అనిపించింది. వాళ్ళందరూ కూడా గౌరీ మాతని ప్రార్థించారు.


గౌరి మనసులో అమ్మవారిని వేడుకుంది, " తల్లీ నేనింతకాలం దీర్ఘ సుమంగళిగా పోవాలని నిన్ను ప్రార్ధించాను. ఎన్నో వ్రతాలు చేసాను. ఎంతమంది చాతో చేయించాను. కానీ యిప్పుడు మాత్రం నిన్ను ఒకే కోరిక కోరుతున్నాను. నాకు సుమంగళిగా పోయే ఆ యోగం అక్కర్లేదు. నా భర్త పరిస్థితికి ఎంతో బాధని అనుభవిస్తున్నాను. నేను లేకుంటే ఆయన జీవితం అతలాకుతలం అయిపోతుంది. ఆయన్ని ఎవరు పట్టించుకుంటారు? ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. నేనూ కాదు, నా భర్తా కాదు. అందుకే నిన్ను యీ వ్రతం చేసి వేడుకుంటున్నాను, నా భర్తని నాకంటే ముందుగా తీసికెళ్ళిపో! ఆయన బాధలకి ముగింపు పలుకు. ఆయన ఎవ్వరికీ భారం కాకుండా వుండాలంటే యింతకు మించి వేరే మార్గం లేదు. నన్ను నీ దగ్గిరకి ఎప్పుడు చేర్చుకుంటావన్నది నీ యిష్టం!"


ఆమె ప్రార్ధనని ఆ గౌరీ మాత వింటుందా, అసలావిడ నిజంగా వున్నదా, అడగ్గానే ప్రాణం తీసుకోగలదా? ఈ ప్రశ్నలేవీ గౌరి మనసులోకి రావు. అంతులేని భక్తి ఆమెకి ఆ నమ్మకాన్ని కలిగించింది. ఇక ఆ రోజునించి వ్రతాలు, పూజలు ఆపేసింది గౌరి. 


ఆ పూజ చేసిన వారం తర్వాత, సహాయకుడు టాయిలెట్కి వెళ్ళిన సమయంలో ఈశ్వరరావు యింటి నించి బయట పడ్డాడు. మనిషి నీరసంగా వున్నా వేగంగా అడుగులేస్తున్నాడు, తడబడుతూ, పడుతూ, లేస్తూ. క్షణాల్లో మైన్ రోడ్ లో ప్రవేశించాడు. రోడ్డు దాటుతుండగా ఆయన్ని ఒక బైక్ కొట్టింది. విసిరేసినట్టు దూరంగా పడ్డాడు. అంతలోనే అటుగా వచ్చిన లారీ ఆయన తలమీదుగా వెళ్ళింది. అక్కడికక్కడే మరణించాడు ఈశ్వరరావు. 


ఆ వార్త తెలిసి కుప్పకూలిపోయింది గౌరి. ఆ దేవుళ్ళు తన కోరికని యింత త్వరగా తీరుస్తారనుకోలేదు. కుప్పకూలిన గౌరిని పక్కవాళ్ళు, పనివాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అరగంట తర్వాత డాక్టర్ వచ్చి గౌరిని చూసాడు. ఒళ్ళు చల్లబడిపోయిన గౌరి వంక దిగాలుగా చూస్తూ, " సారీ, " అన్నాడు డాక్టర్. 

గౌరి ప్రాణాలు అప్పటికే అనంత వాయువుల్లో కలిసిపోయాయి. భర్తతో కలిసి వూర్ధ్వ లోకాలకి వెళ్ళిపోయింది.


(సమాప్తం)


శిరిప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :

అందరికీవందనాలు.

చిన్నతనంనించి కథలురాయడం నాహాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.

'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.

ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.



 
 
 

Komentāri


bottom of page