top of page

సంప్రహాసము

Writer's picture: Sudarsana Rao PochampalliSudarsana Rao Pochampalli


'Samprahasamu' - New Telugu Article Written By Sudarsana Rao Pochampally

'సంప్రహాసము' తెలుగు వ్యాసం

రచన : సుదర్శన రావు పోచంపల్లి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


మానవునికి దైనందిన జీవితములో భాగంగా నవ్వు అనబడేది ప్రకృతి ప్రసాదించిన వరము-


నవ్వుట ఒక యోగము కాగా నవ్వ లేక పోవుట ఒక రోగము అంటారు. మానవుని శారీరక, మానసిక శ్రేయస్సుకు నవ్వు ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ నవ్వు అనబడే పదానికి నిఘంటువులో పర్యాయపదాలు చాలానే ఉన్నాయి- అవి సందర్భానుసారంగా వాడబదుతుంటాయి.


అవి-- హసించు, వికసించు, పరిహసించు, అపహసించు, హాసము, వికాసము, పరిహాసము, అపహాసము, మందహాసము, వికటాట్టహాసము, కేరింత, రాసము, విస్మేరము, సంప్రహాసము, స్మయనము, హసనము, హసితము, హాస్యము, ఇంగిలింత, ఉపహసించు, చెంగలించు, నగవులాడు, నగు, నవ్వుకొను, ప్రసించు, హసించు-


ఈ పరిహసించులో -- అణికించు, అపహసించు, ఆలిగొను, ఆలి చేయు, ఉపహసించు, ఉల్లసమాడు, ఎక్కిరించు, ఎగతాళి చేయు, కేరు, కొక్కరించు, కోడిగమాడు, కోడిగించు, క్రేణించు, గేలించు, గేలికొట్టు, గేలిగొను, గేలిసేయు, చదురడచు, చిన్నబుచ్చు, జక్కిలించు, తచ్చనలాడు, తచనసేయు, త్రస్తరించు, త్రస్తరులాడు, నవ్వు, పరియాచికమాడు, పిసాళించు, మేలమాడు, విహసించు, వెలగెమాడు, వెంగములాడు, సయ్యాటించు.


నవ్వుతో కలిగేది సంతోషం.


అది-- అనుమోదిల్లు, అలరారు, అలరు, అలరొందు, ఆనందించు, ఆహ్లాదించు, ఆమోదించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, ఉల్లాసించు, ఎలరుచు, ఒడబడు, చెలగు, తలిర్చు, తులకరించు, తోషించు, నందించు, నెమ్మిసేయు, పరసించు, పరితోషించు, పొంగారు, పొంగు, పొంపిరివోవు, పొదలు, ప్రమదించు, ప్రమోదించు, ప్రహర్షించు, బులియు, ముదమందు, మురియు, మురిసిపోవు, మోదించు, మోదిల్లు, సంతసపడు, సంతసించు, సంతసిల్లు, సంతోషపడు, సమ్మోదించు, హరుసించు, హర్షించు-


కన్నులనుండి నవ్వు కడు

చిన్నగబుట్టి చిరు బుగ్గలు దాకి పెదవుల

పెన్నిధివోలె నుట్టిపడి నిక

తిన్నగసాగు దరహాసమానన మంతటన్.


రసిక హృదయులు రమణీ మణులున్

ముసిముసి నవ్వుల ముదుసలి మోమున్

పసికందుల కెందమ్మి అందమునందున్ వి

ససితమగు రసికత విరులన్ బోలున్.


హాసము మందహాసము దర

హాసము పరిహాస హాస వి

లాసమెరుంగని విరాగి సహ

వాస మెరుంగునె జనవాసములందున్.


అధికారి దరిజేరి అర్థించబోవ

పెదవిప్పి సరెనంటు ముదముతో బలుక

మదినున్న దిగులింక మరుజుజేరి

పదిలమై హృదయము పరవశించు.


అతి స్మితమతి మగడును యన సరి

యతి స్మితమతి మగువయుగాగన్ స్మిత

మతులెరుగని సతి పతులకు

సుతి గుదురునె సూక్స్మంబైనన్.


నవ్విన నాతి నెమ్మోముయు

నవ్వించిన నాథు నగుమోముయున్

కవ్వింపుగాదు నెంచ నది

సవ్యంబగు సంసారంబనన్.


నవ్వు లేదా మందహాసం, లేదా దరహాసం మున్నగు హాసము లన్ని మానవుని ముఖ కవళికల ద్వారా తేటతెల్లమౌతాయి. మనిషి లోని నవ్వు లేదా సంతోషము ఆతని ఆనందానికి బాహ్య సంకేతం.


నవ్వులో కూడా జనము ఒక్కొక్కరు ఒక్కొక్కరీతిగా నవ్వుతారు. కొందరు ఏమాత్రము శబ్ధము చేయకుండా నవ్వితె కొందరు శబ్ధము వచ్చేటట్లు నవ్వుతారు. కొన్ని రకాల ప్రేరణ, హాస్యోక్తులు, వలన నవ్వు జనిస్తుంది.


"నవ్వినా యేడ్చినా కన్నీరే వస్తాయి" అని ఒక కవి అన్నట్లు లాసిగా నవ్వినప్పుడు కండ్లనుండి నీళ్ళు రావడము సహజము.


నవ్వు స్నేహాన్ని కోరుతుంది- ఇతరుల కలయికతో హాస్య సంఘటనల పర్యవసానంగా నవ్వు పుట్టుకొస్తుంది- నవ్వును మానవునిలోని మెదడు నియంత్రిస్తుంది.


వ్యక్తులు ఒకరితో ఒకరు సంభాషించుకున్నప్పుడు సందర్భానుసారంగా నవ్వు పుట్టుకొచ్చి వారి స్నేహము బలపరుస్తుంది.


నవ్వు ఒకరిని చూచి ఒకరు నవ్వుకొనడము కద్దు- అది అంటు వ్యాధిలా వ్యపిస్తుంది.


మనిషి గత హాస్య సన్నివేశాలు నెమరు వేసుకుంటున్న తరుణములో ఒంటరిగా ఉన్నా ఒక్కొక్కసారి తనకు తానే నవ్వుకుంటాడు.


శ్రీ రాముడు ఎప్పుడూ నవ్వుకుంటూనే మాట్లాడేవాడని పురాణ కథనం అందుకే ఆతనిని "స్మిత పూర్వ భాషి " అంటారు.


కోపానికి విరుగుడంటే నవ్వే. రకరకాల రుగ్మతల విముక్తికి దివ్యౌషధము నవ్వు.


నవ్వు ఒక చక్కని వ్యాయామము. మానసికంగాగాని, శారీరకంగా గాని స్వాస్థ్యత చేకూర్చేది నవ్వు. నవ్వుతో ఎంతో ఉత్సాహము, ఉల్లాసము కలుగుననుటలో సందేహము లేదు. సాధారణంగా నవ్వు సర్వ రోగ నివారిణేకాక వ్యక్తిలోని భయశీలత పోగొట్టగలదు-


ఈ నవ్వు నానా విధాలు. -- పగులబడి నవ్వుట, వికటాట్టహాసం చేయుట, పకపకమని నవ్వుట, వెకిలి నవ్వు, సుందర మందహాసం, ముసిముసినవ్వు, కొనితెచ్చుకునే నవ్వు, చిద్విలాసం, ముదుసలి, పసి వారి బోసినవ్వు, ఏడ్వలేని నవ్వు, ఓర్వలేని నవ్వు, అహంకారపునవ్వు, దీనావస్థ నవ్వు, ఆకస్మిక ప్రయోజన నవ్వు, విజయ సాధన నవ్వు ఇట్లా నవ్వు నానా రకాలు.


ఇవిగాక మరికొన్ని విధాలనవ్వులు-


తలమాత్రము వంచి కండ్లు మూసుకొని నవ్వడము,

లయధాటీనవ్వు-తాళం వేయడానికి వీలుగా ఉండునటువంటి నవ్వు, మాట్లాడి మాట్లాడి నవ్వే నవ్వు, విషయము చెప్పరాక అవస్త పడుకుంటూ ఏకధాటిగా నవ్వే నవ్వు, చాటు నవ్వు, పజ్జనవ్వు, దొంగనవ్వు, కడుపుబ్బేటంతటి నవ్వు, తల్లి దండించేటప్పుడు ఆ దెబ్బలనుండి తప్పించుకునే ఉపాయపు నవ్వు.


మహా భారతములో తిక్కన గారు కూడా కొన్ని నవ్వుల ప్రస్థావన తెచ్చారు. అవేమిటంటే-చిన్న నవ్వు, చిరునవ్వు, అంతస్మితం, అనాదరమందస్మితం, లేత నవ్వు, కడుపుబ్బునవ్వు, అపహాస్యం, కిలకిల నవ్వు, బెట్టునవ్వు, కినుకమానిన నవ్వు, నవ్వు రాని నవ్వు, మందస్మిత, జనిత మందస్మిత, సాదర దరహాసం, గేలికొను నవ్వు, రోషకఠిన హాసం, ఎలనవ్వు, కన్నులనవ్వు, అలతినవ్వు, హర్షమందస్మిత, ఉద్గతమందస్మితం, తిన్నని నవ్వు, పెలుచన నవ్వు, ఒత్తిలినవ్వు, ఊద్భుటనవ్వు, ప్రౌఢస్మితము, కన్నుల నిప్పురాలు నవ్వు, కఠిన నవ్వు.


శాస్త్రజ్ఞులు నవ్వు వల్ల జీవితకాలము ఏడు సంవత్సరాలు పెరుగవచ్చునంటారు.


నవ్వులోని మార్పులవల్ల వ్యక్తుల జీవన ప్రమాణములో హెచ్చుతగ్గులుంటాయంటరు.


మనస్పూర్తిగా అంటే ఏ వికారము లేకుండా నవ్వేవాండ్లు ఎక్కువకాల జీవిస్తారంటారు-


అందుకొరకే నేటి ఆధునిక కాలములో నవ్వులతో ఆరోగ్యము పొందుట కొరకే అక్కడక్కడ కొన్ని లాఫింగ్ క్లబ్బులు ఏర్పడ్డాయి.


గుర్రం జాషువా గారు నవ్వును గూర్చి చెప్పిన పద్యము.


నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికిన్

దివ్వెలు కొన్ని నవ్వులెటు తెల్వవుకాని విషప్రయుక్తముల్

పువ్వులవోలె ప్రేమ రసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన వే

నవ్వులు సర్వ దుఃఖ శమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్.


చమత్కార పద్యము.


అని బారిని విధి నవ్వును

ధన సంపద నవ్వు ఉచిత దాన హీనున్

తనయుని ముద్దాడంగా

పెన్మిటి గని జార నవ్వు పిచ్చయ రేచా!


ఓ పిచ్చయ రేచా యుద్ధమునుండి పారి పోతే విధి నవ్వుతుందట-ధన సంపదతో ఉండి తగిన రీతిగా దానం చేయని వాని చూచి ధనము నవ్వుతుందట-కొడుకును భర్త ముద్దాడుతుంటే తన కొడుకే యను భ్రమతో ఎంత ముద్దడుతున్నాడు అని జార స్త్రీ నవ్వుతుందట.


నవ్వు కలుగ జేయు నయనంబులకు హాయి

నవ్వు రుగ్మతలను నయము జేయు

నవ్వు లేని జన్మ నర జన్మ మెట్లది

రామ మోహన నుక్తి రమ్య సూక్తి


యః తుష్టా తుష్ట ఆప్నోతి శోకే శోకము పైతిచ

క్రోధే కృద్ధో భయో భీరు స్సశ్రేష్టః ప్రేక్షక స్మృతః


నవ రసములోని ప్రతి రసముకు రసానుగుణముగా స్పందించే వారు సరియైన ప్రేక్షకుడు అని నొక్కి చెప్పవచ్చును. అంటే హాస్యమునకు స్పందన ఆనందించుటయే గాని అన్యదా కాదు అంటారు.


ఒక వేళ నవ్వే రాకుంటే నవ్వకుండా ఉండడమే తప్పించి దానిని కువిమర్శకు గురి చేయ కూడదు. నటనకైనా రచన కైనా సంభాషణకైనా ఇదే వర్తిస్తుంది.


కాదేదీ నవ్వు కనర్హం (నవ రసాలలో హాస్యమొక రసం) .

నవ్వడం కేవలం పిల్లల పనే అనుకుంటారు కొందరు. నిశ్శబ్ధంగా, గంభీరంగా ఉండటము హుందా తనంగా భావిస్తారు మరికొందరు. కాని సమయ సందర్భానుసారం మనసారా నవ్వితేనే మంచిదంటున్నారు శాస్రజ్ఞులు.


నవ్వితే మానసిక ఉద్రేకాలు దూరమౌతాయి - సృష్టిలో మనిషికి మాత్రమే నవ్వే గుణము ఉంది- వేరే జంతువులకు లేదనే విషయము ప్రతి ఒక్కరు గుర్తెరిగిన విషయమే - ఐనా మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా హాస్యముంటుంది అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.


కుక్కలు, చింపాజీలు, గొరిల్లాలు, ఎలుకలు, హైనాలు(దుమ్ములగొండి) మరియు పక్షులు కూడా వాటి చేష్టలతో సంతోషము వ్యక్తము చేయగలవు. అవి మనుషులులా నవ్వలేక పోయినా భిన్నమైన శబ్ధాలు చేసి వాటి సంతోషము వ్యక్త పరుస్తాయి ఉదాహరణకు కుక్క దాని తోక ఆడించిందంటే అది చాలా సంతోషంగా ఉన్నదని అర్థం.


నవ్వడాన్ని అదృష్టంగా భావించాలి-


నవ్వుతున్న సమయంలో పని చేసే కండరాలు చురుకుగా పని చేస్తాయి-చిన్న ప్రేరణకైనా స్పందించి నవ్వడానికి అలవాటు పడ్డవారు అదృష్టవంతులు-నిరంతరం ముభావంగా విషాదంగా కనిపించే వారిలో ఆత్మ హత్యకు పాల్బడే వైఖరి అలవడుతుందని మానసిక వైద్యులు హెచ్చరిస్తుంటారు.


నవ్వులో ఆనందమనే భావావేశం ఉంటుంది. భావావేశం లేకుండా కూడా నవ్వవచ్చు-అందుకే మనస్పూర్తిగా నవ్వే నవ్వుకు తెచ్చి పెట్టుకునే నవ్వుకు తేడా ఉంటుంది. నవ్వు వచ్చినప్పుడు ఒక చంత్కారము గాని ఒక సన్నివేశాన్ని గాని అర్థం చేసుకొని అందులో హాస్యభరితమైన అంశాన్ని గ్రహించాలి.


నవ్వినపుడు ముఖములో పలు కండరాలు కలిసి పని చేయాలి కనుక ఇందులో కర్మేంద్రియాల ప్రమేయం ఉన్నది. ఈ మూడు రకాల అంశాలను మెదడులో వివిధ ప్రాంతాలు శాసిస్తుంటాయి -


నవ్వు వల్ల ప్రయోజనాలు.


1. ఆవేశాన్ని, ఉద్రిక్తతను అణుస్తుంది.

2. రోగ నిరోధక శతి పెరుగుతుంది.

3. ఒత్తిడి తగ్గిస్తుంది

4. శ్వాస తీసుకోవడములోని అడ్డంకుల తొలగిస్తుంది.

5. ముఖానికి చక్కని వ్యాయమము కలిగిస్తుంది.

6. దీర్ఘకాల రోగులకు నవ్వు దివ్యౌషధము మాదిరి ఉపశమనం కలిగిసుంది.

7. బాగా నవ్వడం వల్ల ఆమ్లజని బాగా లభిస్తుంది.

8. ఇంకా ఇంకా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది నవ్వు.

మనిషి జీవితములో నవ్వు, హాస్యం, మందహాసం, వికటాట్ట హాసం అని వివిధ రూపాలలో తోడుండి జీవితం సుఖప్రదం చేస్తుంది.


నవ్వే సర్వ రోగ నివారిణి -----

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


73 views0 comments

Comments


bottom of page