'Samsaramlo Sarigamalu' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao
'సంసారం లో సరిగమలు' తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అప్పటిదాకా తమ్ముడితో ఫోన్లో రాజకీయాలు మాట్లాడి వంట గదిలోకి వచ్చి, “ఏమి వండుతున్నావు?” అని ఆడిగాడు భార్య విజయలక్ష్మి ని రాఘవరావు.
“మామిడి బద్దలు పప్పు, వంకాయ మసాలా కూర” అంది బియ్యం కడుగుతూ.
“బ్రాహ్మణ పుట్టుక పుట్టి మసాలా కూర ఏమిటే, నవ నవలాడుతున్న వంకాయలన్నీ నాశనం చేసావు” అన్నాడు కోపం గా రాఘవరావు.
“ఏ, హోటల్ లో మసాలా దోశ ఆవురు ఆవురు మంటూ తిన్నప్పుడు మీ బ్రాహ్మణికం గుర్తుకు రాలేదా. ఎప్పుడూ మెంతికారం ఎందుకని ఈ రోజు మసాలా కూర చేస్తున్నాను” అంది విజయలక్ష్మి. “అయినా మీ అమ్మగారు మీకు రుచులు నేర్పి నా ప్రాణం తీయటానికి అంటకట్టారు, ఏ యింట్లోను భార్య వండింది తిని మెచ్చుకుని లేస్తారు. నా మొహానికి ఏ సరదా లేదు” అంది విజయలక్ష్మి.
“యిప్పుడు మా అమ్మ విషయం ఎందుకు లాగుతావు? అవును. మాకు మా అమ్మ రుచిగా చేసి పెట్టేది. మీ అమ్మకి వంటే రాదు. మీ అమ్మమ్మ చేసేది. అందుకే మీకెవ్వరికి రుచులు తెలియవు” అన్నాడు రాఘవరావు.
“మా అమ్మ వండి పెట్టకపోతేనే పెద్దవాళ్ళం అయ్యామా, ఏదైనా అంటే చాలు వెంటనే కౌంటర్ యిచ్చేస్తారు మీరు. యింకా కూర వండలేదు, మీకు కావలిసినట్టుగా వండుకోండి” అంది విసుగ్గా విజయలక్ష్మి.
“యిప్పుడు మళ్ళీ నేను వంట చేయాలి అంటే మడి కట్టుకోవాలి, అదేదో నువ్వే వండేయ్” అన్నాడు.
“మీ మడి బాగానే వుంది. ఉదయం నాలుగు ఉల్లి పెసరట్లు తిని యిప్పుడు మడి గుర్తుకు వచ్చింది పాపం. నాకు తెలియదు.. నన్ను అన్నీ మాటలు అన్న తరువాత నేను వంకాయ కూర చెయ్యను” అంది విజయలక్ష్మ.
“మరి నువ్వు ఏమి వేసుకుని మింగుతావు, నీకైనా కూర ఉండాలి గా?” అన్నాడు రాఘవరావు.
“నేను పెసరపప్పు పచ్చడి చేసుకుని తింటాను. మీలాగా ఈ కూరే కావాలి అని పట్టింపు లేదు” అంది.
“అయితే ఆ పచ్చడి తో నాకు అట్టు వెయ్యి, ఈ పూటకి సరిపెట్టుకుంటాను” అన్నాడు.
“అదేమీ కుదరదు, అబ్బాయి కి కూర లేకపోతే తినడు. వెళ్లి స్నానం చేసి వచ్చి కూర వండుకోండి. నాకు నడుము లాగేస్తోంది. కాసేపు పడుకోవాలి” అంది.
“యింత మొండితనం పనికిరాదు, యిట్టే వచ్చి కూర వండేస్తా చూడు” అంటూ మేడ మీదకి వెళ్ళాడు స్నానం కి.
“అమ్మా! నువ్వు నాన్న ఎందుకు అలా పొట్లాడుకుంటారు, ముప్పై ఏళ్ళ నుంచి ఇదే వరస. నాన్నకు ఏది యిష్టం అయితే అదే చేస్తే గొడవ వుండదు గా” అన్నాడు విజయలక్ష్మి కొడుకు కృష్ణ.
“మీ నాన్నకి ఏదో వంక కలిపించుకుని పొట్లాట పెట్టుకుంటారు. చూడు స్నానం కి అని వెళ్లి ఫోన్లో ఎవ్వరితోనో ఎలా మాట్లాడుతున్నారో” అంది.
“నాకు మిమ్మల్ని చూస్తు వుంటే రేపు నాకు పెళ్లి అయినా మేము యిలాగే పొట్లాడుకుంటామేమో అని భయంగా వుంది” అంటున్న కొడుకుతో, “యిప్పటి మగపిల్లలు పెళ్లి అయిన దగ్గరనుంచి పెళ్ళాం కొంగట్టుకుని తిరగడమే సరిపోతుంది, యింకా తగాదాలు ఎక్కడ వుంటాయి” అంది నవ్వుతు విజయలక్ష్మి.
గంటసేపు నుంచి అన్నగారితో మాట్లాడుతు వుండగా తను యింకా స్నానం చెయ్యలేదు అని, స్నానం చేసి కూర వండాలి అని గుర్తుకు వచ్చి, “అన్నయ్య.. ఎవ్వరో వచ్చారు, మళ్ళీ మాట్లాడుతా” అని ఫోన్ పెట్టేసి, స్నానం పూర్తి చేసుకుని కిందకి వచ్చాడు. డైయినింగ్ టేబుల్ దగ్గర కొడుకు కూర్చొని అన్నం తినటం చూసి, తనుకూడా వెళ్లి తన కంచం తీసుకుంటూవుంటే, “అదేమిటి కూర వండుకోరా” అంది విజయలక్ష్మి.
‘చచ్చాను, కూర చేసుకోవాలి కదా, సరే’ అంటూ కంచం అక్కడ పెట్టి లేస్తున్న రాఘవరావుని, “లేవకండి, యిప్పుడు తెలిసిందా, మాటలు అనడం కాదు” అంటూ గుమగుమలాడుతున్న వంకాయ కూర కంచంలో వడ్డించింది.
“నాన్నా! అమ్మని మీరు ఎప్పుడు అర్ధం చేసుకుంటారు” అన్నాడు కొడుకు.
“పిచ్చివాడా మీ అమ్మని అర్ధం చేసుకోవలిసింది నువ్వు, అక్కయ్య. మా పెళ్లి అయిన దగ్గరనుండి ఈ రోజు వరకు ఈ యింటిని కాపాడుతున్నది మీ అమ్మే. తను ఉద్యోగం చేస్తో, బామ్మకి, బాబాయ్ కి వంట చేసి తను ఆఫీస్ కి వెళ్ళేది. నాకు ఆఫీస్ పని ఎక్కువ వుండటంతో తనే మీ చదువుల గురించి ప్లాన్ చేసింది. చివరికి అక్కయ్య పెళ్ళికి తన జీపీఫ్ మొత్తం వాడేసింది మనం ఎవ్వరి దగ్గర అప్పు చెయ్యకూడదు అని” అన్నాడు.
“మరి అటువంటి అమ్మతో ఎందుకు రోజు తగాదా పడతారు” అన్నాడు కృష్ణ.
“అమ్మ ఎంత వరకు యింటిపని, టైమ్ వుంటే భక్తి టీవీ చూడటం. నీకు నాలాగానే ఆఫీస్ పని తప్పా వేరే విషయం పట్టించుకోవు. నేను మేడ మీదకి వెళ్ళినప్పుడు వంతెన నారాయణ రాజు గారి ఆరోగ్య సలహాలు వింటూ వుంటాను. ఆయన అరవై ఏళ్ళు దాటిన తరువాత వాకింగ్ లాంటివి చెయ్యలేనప్పుడు శరీరం మొత్తానికి బ్లడ్ సర్క్యూలేషన్ వుండాలంటే భార్య తో భర్త, భర్తతో భార్య ఆవేశం గా గొడవ పడుతున్నట్టు నటించాలి. గొంతుక పెంచడం తగ్గించడం, అరవడం తో గొంతుకకు వ్యాయామం అయ్యి గొంతు కాన్సర్లు, థైరాయిడ్ రాకుండా వుంటాయి అన్నాడు.
నేను ఏదో విధంగా నడుస్తోవుంటాను. పాపం మీ అమ్మకి నడకకి టైమ్ దొరకదు. అందుకే వంతెన గారి సలహా పాటిస్తున్నాను. నా శ్రమ అంతా మీ కోసమే” అన్నాడు కొడుకు వంక చూస్తో..
“బాగానే వుంది ఆయన సలహా. గొడవలతో గుండె నీరసం వచ్చి నేను పడే బాధ భగవంతుడికి తెలుసు” అంది విజయలక్ష్మి. “అయినా మీరు నన్ను ఎక్కువ చేసి చెప్పారు కానీ యిప్పుడు ఖర్చుకి మీ డబ్బే కదా నేను వాడేది. నాకేమేనా పెన్షన్ వుందా పాడా” అంది యింకొద్దిగా కూర భర్త కంచం లో వేస్తో.
“డాడి, ఆ వంతెన గారి ఫోన్ నెంబర్ యిస్తావా” అన్నాడు కృష్ణ.
“ఎందుకు రా యిప్పుడు.. ఆయన యిచ్చే సలహాలు నేను యివ్వగలను. నీ ప్రాబ్లం ఏమిటి” అన్నాడు రాఘవరావు.
“డాడి.. దయచేసి ఆ సలహాలు బయట వాళ్ళకి ఇవ్వకండి, వాళ్ళకి ఏమైనా అయితే కోర్టు చుట్టూ తిరగలేను. అందుకనేనా మొన్న మా ఫ్రెండ్ ఎమిటిరా మీ నాన్నా ఏదో చెట్టు ఆకులు కోసుకుంటో కనిపించారు అన్నాడు అంటే ఏమో అనుకున్నాను. మీరు యూట్యూబ్ లో యిచ్చే సలహాలు మీరు విని మా మీద ప్రయోగించి మమ్మల్ని పిచ్చవాళ్ళని చేయకండి” అన్నాడు కృష్ణ.
‘వీళ్ళు నన్ను ఎప్పుడు అర్ధం చేసుకుంటారో’ అనుకున్నాడు రాఘవరావు.
కాసేపు విశ్రాంతి తీసుకుని లేచిన రాఘవరావు కి సంచిలో ఉదయం కొన్న గోంగూర కట్టలు తీసి బయట పడేస్తున్న కొడుకు ని చూసి కంగారు గా పరుగు తీసి కొడుకు చేతిలోని గోంగూర కట్టలు తీసుకుని, “ఎందుకు రా పడేస్తున్నావు” అన్నాడు.
“డాడీ! మీరు ప్రతీ చెట్టు ఆకులు తెచ్చి కషాయం అంటూ గిన్నెలు మాడ్చి వేస్తున్నారు. అందుకే ఈ ఆకులు పారెస్తున్నా” అన్నాడు కొడుకు.
“ఒరేయ్! అవి గోంగూర కట్టలు. తింటే ఐరన్ వచ్చి బ్లడ్ బాగా పడుతుంది. అమ్మకిచ్చి పప్పులో పడేయామనాలి కానీ యిలా రోడ్డు మీద పడేయకూడదు అన్నాడు రాఘవరావు.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments