top of page

సంధ్యా సూర్యుడు

#సంధ్యాసూర్యుడు, #SandhyaSuryudu, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguHeartTouchingStories


Sandhya Suryudu - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

Published In manatelugukathalu.com on 24/01/2025

సంధ్యా సూర్యుడు - తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“హాసినీ నేను స్కూల్ కి వెళ్తున్నా” అన్నాడు మోహనకృష్ణ. 


“అలాగే.. నేనూ పదినిముషాలలో బయలుదేరతాను” జవాబిచ్చింది సుహాసిని, చిన్న కూతురికి జడ వేసి రిబ్బను కడుతూ. 


మోహనకృష్ణ సైకిల్ తీసుకుని గేటు బయటకు వచ్చి కొడుకు రాకేశ్ ని ఎక్కించుకుని హై స్కూల్ కి బయలుదేరాడు. పదినిముషాలలో స్కూల్ కి చేరుకున్నాడు తండ్రి, కొడుకు. రాకేశ్ సైకిల్ దిగి ఏడవతరగతి గదికి వెళ్ళాడు. మోహనకృష్ణ సైకిల్ స్టాండులో పెట్టి, హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్లి, ఆయన్ని ‘విష్’ చేసి హాజరుపట్టీలో సంతకం చేసి, స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళాడు. 


లెక్కల మాస్టారు జయంతి శాస్త్రి గారు, తెలుగు మాస్టారు జగన్నాధం గారు, హిందీ మాస్టారు బ్రహ్మానందం గారు, ఇంగ్లీష్ మాస్టారు సుబ్బారావు గారు అప్పటికే వచ్చి ఉన్నారు.


ఆరువందలమంది పిల్లలు ఉన్న హై స్కూల్ లో ఇరవై ఆరు మంది మాస్టర్లు పనిచేస్తున్నారు. స్టాఫ్ ఒక్కక్కరే వస్తున్నారు. మోహనకృష్ణ ఎనిమిది, తొమ్మిది, పది తరగతులకు ఇంగ్లీష్, సైన్సు పాఠాలు చెబుతాడు. హెడ్ మాస్టర్ నాగిరెడ్డి గారికి అతనంటే చాలా అభిమానం. పాఠాలు బాగా చెబుతాడని, వేళకు స్కూల్ కి వస్తాడని. 


ఉదయం స్కూల్ అయ్యింది. మోహనకృష్ణ, రాకేశ్ ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చారు. స్కూల్ ఇంటికి దగ్గరే. సుహాసిని లింగాలవీది చివరఉన్న కాన్వెంట్ లో ఉదయం పూట పిల్లలకు సోషల్ పాఠాలు చెబుతుంది. కూతుళ్ళు పల్లవి, కీర్తన ఇద్దరూ ఆమె పనిచేసే కాన్వెంట్ లోనే చదువుతున్నారు. భర్త, కొడుకు భోజనం చేసి వెళ్ళాకా, సుహాసిని కాసేపు విశ్రాంతి తీసుకుంది. మరురోజు కాన్వెంట్ లో చెప్పవలసిన పాఠాలు ఒకసారి చూసుకుంది. నాలుగు గంటలు దాటేసరికి పల్లవి, కీర్తనలు కాన్వెంట్ నుండి వచ్చారు. 


వాళ్ళు మొహాలు కడుక్కుని బట్టలు మార్చుకుని వచ్చేసరికి, హై స్కూల్ నుండి మోహనకృష్ణ, రాకేశ్ వచ్చారు. వాళ్ళు కూడా ఫ్రెష్ అయి వచ్చాకా నలుగురికీ చిరుతిండ్లు పెట్టింది. పిల్లలు ముగ్గురూ పాలు తాగారు. భార్యా, భర్తా కాఫీ తాగారు. పిల్లలు ముగ్గురూ స్కూల్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటె, భార్యాభర్తలు ఇద్దరూ స్టాఫ్ గురించి మాట్లాడుకున్నారు. కాసేపటికి పిల్లలు హోం వర్క్ చేయడం మొదలుపెట్టారు. 


ఇంటి యజమాని ‘రావిచెట్టు మాస్టారు’ వచ్చి మోహనకృష్ణతో మాట్లాడటం ప్రారంభించారు. ఆయన అసలు పేరు అశ్వద్ధనారాయణ గారు. కానీ అందరూ ‘రావిచెట్టు మాస్టారు’ అనే పిలుస్తారు. వారి అమ్మగారి పేరు మీద జగదాంబ ప్రాథమిక పాఠశాల ప్రారంభించి కొన్ని సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ కి ఇచ్చేసారు. 


ప్రస్తుతం అదే స్కూల్ కి ఆయన హెడ్ మాస్టారుగా పనిచేస్తున్నారు. ఉపకార బుద్ధి గల మనిషి. ఒక అరగంట అయ్యాకా ఆయన వెళ్ళిపోయారు. 


మోహనకృష్ణది శివపురంకి దగ్గరే ఉన్న రావిపాడు. సుహాసినిది పాలకొల్లు. ఆమె చదువు, అందం చూసి కట్నం లేకుండా ఆమెని పెళ్లి చేసుకున్నాడు మోహనకృష్ణ. చంద్రబింబం లాంటి మొహం, నవ్వినపుడు మరింత అందంగా, కాంతివంతంగా ఉంటుంది. మోహనకృష్ణ కూడా అందగాడు. బంగారు రంగులో, అయిదు అడుగుల పది అంగుళాల ఎత్తులో సినిమా హీరోలా ఉంటాడు. శివపురంలో ఆ జంట నడిచివెళ్తుంటే, జనం రెప్పవేయకుండా చూసేవాళ్ళు. సుహాసినికి సంగీతంలో మంచి ప్రవేశం ఉంది.


తల్లి దగ్గర త్యాగరాజు కృతులు, అన్నమయ్య కీర్తనలు చాలా నేర్చుకుంది. పిల్లలు పల్లవి, కీర్తనలకు వాటిని చెప్పడం, వాళ్ళు కాన్వెంట్ లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో, లైబ్రరీ వారోత్సవాలలో పాడి బహుమతులు పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాకేశ్, వయోలిన్ విద్వాంసులు హరి నరసింహ మూర్తి గారి దగ్గర వయోలిన్, గిటార్ నేర్చుకుంటున్నాడు. 


శివపురంలో తాము ఆదేకుంటున్న కొవ్వూరి వారి వీధిలోని ఆడపిల్లలకు సుహాసిని ఆదివారాలలో పాటలు, కుట్లు, అల్లికలు కూడా నేర్పుతూ ఎంతో ఆత్మీయంగా ఉంటుంది. న్దుకే ఆ వీధిలోని వారికి మోహనకృష్ణ కుటుంబం అంటే ఒక గౌరవం, ఆరాధన ఉంది. 


హై స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా, స్కౌట్ మాస్టారు జి. వి. ఎల్. ఎన్. శాస్త్రి గారు ఆడపిల్లకు పాటలు, డాన్సులు నేర్పారు. మోహనకృష్ణ, శరీరఅవయవాలు అన్నీ ఐకమత్యంగా ఉంటేనే, దేహం సక్రమంగా పనిచేతుందన్న సందేశంతో ఒక నాటిక పిల్లలకు నేర్పాడు. ప్రదర్సనలు చూసిన తణుకు, ఉప విద్యాశాఖాధికారి శ్రీరామ మూర్తి గారు, మంచి సందేశాత్మక నాటికతో విద్యార్ధులను సంఘటితం చేసినందుకు మోహనకృష్ణ ని అభినందించారు. 

******

మోహనకృష్ణ, ఆడపిల్లలు డిగ్రీ పూర్తీ చేయగానే వారికి పెళ్ళిళ్ళు చేసేసాడు. పల్లవి భర్త బ్యాంకు ఆఫీసరు. కీర్తన భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రాకేశ్ బి. టెక్. చదువుతున్నాడు. మోహనకృష్ణ, హై స్కూల్ కి హెడ్ మాస్టర్ గా పదోన్నతి పొందాడు. 


సాఫీగా సాగుతున్న వారి సంసారనౌక సుహాసిని అనారోగ్యంతో ఒడి దుడుకులకు లోనయ్యింది. ఒకరోజు గుండేనొప్పి వచ్చి విల విల లాడిపోయింది సుహాసిని. గబ గబా తణుకు పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు మోహనకృష్ణ. డాక్టర్ టెస్టులు చేసి ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉందని, హైదరాబాద్ కానీ మద్రాస్ కానీ తీసుకువెళ్ళి వైద్యం చేయించమని సలహా ఇచ్చారు. తాత్కాలికంగా తగ్గడానికి మందులు వాడి, నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచి పంపించివేశారు. 


శివపురం వచ్చాక ఉపాధ్యాయ మిత్రులు, ‘ఈరోజుల్లో హార్ట్ ప్రాబ్లం పెద్ద సమస్య కాదని, వైద్యానికి అన్నీ చక్కబడుతున్నాయని’ ధైర్యం చెప్పారు. 


మోహనకృష్ణ దగ్గర చదువుకున్న శిష్యుడు డాక్టర్ రామచంద్రరాజు కూడా వచ్చి, ‘మాస్టారూ మీరు మేడం గారిని మద్రాస్ తీసుకువెళ్ళి వైద్యం చేయించి తీసుకురండి. నేను తరుచూ వచ్చి చూసి వెళ్తాను’


అని చెప్పడంతో మోహనకృష్ణకి కొంచెం ధైర్యం వచ్చింది. 


మంచిరోజు చూసి భార్యని తీసుకుని మద్రాస్ వెళ్ళాడు మోహనకృష్ణ. తణుకు డాక్టర్ ఇచ్చిన రిపోర్టులు చూసి, మరికొన్ని టెస్టులు చేసి “మీరు కంగారు పడవలసిన పని లేదు, వాల్వు రీప్లేస్ చేస్తే సరిపోతుందని” డాక్టర్ నీరజ చెప్పారు. రెండు రోజులు పోయాక సుహాసినికి, ఆపరేషన్ చేసి, హార్ట్ వాల్వు రీప్లేస్ చేసారు. పదిరోజులు హాస్పిటల్ లో ఉంది తర్వాత భార్యని తీసుకుని శివపురం వచ్చాడు మోహనకృష్ణ. 


మర్నాడే డాక్టర్ రామచంద్రరాజు వచ్చి సుహాసినిని చూసి వెళ్ళాడు. మోహనకృష్ణ కూతుళ్ళు, అల్లుళ్ళు వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్ళారు. కొడుకు రాకేశ్ కూడా కాలేజీ కి వెళ్ళిపోయాడు. అతను కాకినాడలో బి. టెక్. ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. 


అందరూ వెళ్ళిపోయారు. మోహనకృష్ణ, సుహాసిని మిగిలారు. సాయంత్రం భర్తతో “పిల్లలు ఎదిగాకా మన వద్ద ఉండరు కదా. ఎవరి సంసారం వారిది” దిగులుగా అంది. 


“నువ్వు కూడా పెళ్లి అయ్యాక నాతో వచ్చేసావుకదా. మరి అప్పుడు మీ అమ్మా, నాన్నా ఇలా బాధపడి ఉంటారు. మనిషి జీవితం అంటేనే ఇలా ఉంటుంది. ఎడబాటు.. కలయిక.. చీకటివెలుగులు లాంటివి. మనం వాటిని సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. అయినా నేను నీకు లేనా? ఎందుకు దిగులు? నేను నిన్ను చంటిపాపాయిలా చూసుకుంటాను. సరేనా?” ఆప్యాయంగా అన్నాడు మోహనకృష్ణ.


ఆమె మొహాన్ని తన రెండు చేతులలోకి తీసుకుని “నువ్వు నా జీవన వీణవి. నా మార్గదర్శివి. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి” అన్నాడు మోహనకృష్ణ సంతోషం మొహం నిండా నింపుకుని. 


భర్త అలా తన దగ్గరగా మొహంలో మొహం పెట్టి చూసి పలికిన ఆత్మీయతా పలుకులకు సుహాసిని పులకించిపోయింది. అకస్మాత్తుగా ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడింది. 


“ఊ.. అదే ఉండకూడదు. ఏదీ ఎక్కువగా ‘ఎమోషనల్’ అవ్వకూడదని డాక్టర్ నీరజ చెప్పారు. బి కూల్. బి హ్యాపీ” అన్నాడు మోహనకృష్ణ.


అతను చెప్పిన విధానానికి చిన్నగా నవ్వింది సుహాసిని. ఆ నవ్వు చూసి సంబరపడ్డాడు మోహనకృష్ణ. 


ఇంట్లో పనులు చేయడానికి, భార్యని కనిపెట్టుకుని ఉండడానికి ఒక మనిషిని ఏర్పాటు చేసి హై స్కూల్ కి వెళ్ళడం ప్రారంభించాడు మోహనకృష్ణ. రెండు నెలల్లో సుహాసిని మామూలు మనిషిగా మారింది. 


తన పనులు తాను చేసుకుంటూ, వంట కూడా చేస్తోంది. కాన్వెంట్ కి వెళ్ళడం మానేసింది. ప్రతి రోజూ కూతుళ్ళు ఇద్దరూ ఫోనులు చేసి తల్లితో మాట్లాడుతున్నారు. డాక్టర్ రామచంద్ర రాజు వారం వారం వచ్చి సుహాసినిని చూసి వెళ్తున్నారు. 


కాలచక్రం గిర్రున తిరుగుతోంది. రాకేశ్ చదువు పూర్తీ కావడం, హైదరాబాద్ లో ఉద్యోగం రావడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం చాలా స్పీడా గా జరిగిపోయాయి. పల్లవి, కీర్తనలకు పిల్లలు పుట్టారు. మనవల ఆట, 


పాటలతో మోహనకృష్ణ, సుహాసిని ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు. మోహనకృష్ణ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యాడు. 


సుహాసిని కోరిక మీద, పాలకొల్లు బ్రాడీపేట చివర్లో నాలుగు గదుల డాబా కట్టాడు మోహనకృష్ణ. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో చక్కని పూల మొక్కలు పెంచాడు. సుహాసిని వరండాలో కుర్చీలో కూర్చుని ఆ పూల మొక్కల మీద నుండి వచ్చే చల్లని, పరిమళభరితమైన గాలిని తనివి తీరా ఆస్వాదిస్తూ ఉంటుంది. మోహనకృష్ణ మొక్కలు నీళ్ళు పోస్తూ ఆమెతో కబుర్లు చెబుతూ ఉంటాడు. 

డాక్టర్ రామచంద్రరాజు వారం వారం వచ్చి సుహాసినిని చూసి వెళ్తున్నాడు. మోహనకృష్ణ ఆ కాలనీలోని పిల్లలకు ఇంగ్లీష్, సైన్సు ట్యూషన్ చెబుతున్నాడు. 


ఒకరోజు సుహాసిని “ఇప్పుడు చదువుతున్న పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ సరిగ్గా రావడంలేదు. మీరు గ్రామర్ మీద చిన్న పుస్తకం రాసి అందరకూ ఇవ్వండి. వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది” అంది. అది నిజమే అనిపించింది మోహనకృష్ణకి. తన దగ్గరకు వచ్చే పిల్లలో చాలా మంది ఇంగ్లీష్ గ్రామర లో వెనుకబడి ఉండడం గమనించాడు. తర్వాత పదిహేను రోజులు శ్రమపడి ‘ఈజీ గ్రామర్’ పేరుతో చిన్న పుస్తకం విడుదల చేసాడు మోహనకృష్ణ. 


పాలకొల్లు చుట్టుపక్కల హై స్కూళ్ళలో ఆ పుస్తకాలు ఇచ్చాడు. ఆ మరుసటి సంవత్సరం పదో తరగతి పరీక్షలలో ఇంగ్లీష్ సబ్జెక్టు లో చాలా మంది మంచి మార్కులు సాధించారు. కొంతమంది హై స్కూల్ హెడ్ మాస్టర్ల కోరిక మీద, మరి కొన్ని గ్రామర్ పుస్తకాలు ప్రింటి చేయించి చాలా మంది విద్యార్ధులకు ఇచ్చాడు మోహనకృష్ణ. భర్త చేసిన పని వలన చాలా మంది పిల్లలకు మేలు జరిగినందుకు సుహాసిని చాలా సంతోషించింది. 


సుహాసినికి ఆరోగ్యపరంగా ఏవిధమైన సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మోహనకృష్ణ. ఆమెను ఒక గాజుబొమ్మలా చూసుకుంటున్నాడు. కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు ఆమె దృష్టికి రాకుండా తానే వాటిని పరిష్కరించేవాడు. ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు కృషి చేసేవాడు. అమెకిష్టమైన సంగీత కచేరీలకు టాక్సీ మీద తీసుకెళ్ళేవాడు. ఆమె సంతోషమే తన సంతోషంగా భావించేవాడు. వంటపనిలో కూడా ఆమెకి సాయం చేసేవాడు. ప్రతీ సోమవారం క్షీరారామలింగేశ్వర స్వామి గుడికి స్కూటర్ మీద తీసికెళ్లేవాడు. ఆమెకి అలసట రాకుండా చాలా జాగ్రత్తపడేవాడు. 


ముక్కోటి ఏకాదశి రోజు సాయంత్రం మోహనకృష్ణ, సుహాసిని ఇద్దరూ వరండాలో కుర్చీలలో కూర్చుని ఉన్నారు. పూల మొక్కలమీద నుండి చల్లని గాలి వీస్తోంది. “నీ దయ రాదా, రామ నీ దయ రాదా” అంటూ పాడుతూ, భర్త భుజం మీద తల వాల్చేసింది సుహాసిని. మోహనకృష్ణ కళ్ళు శ్రావణమేఘాలై వర్షించి ఆమె తలని తడిపేసాయి. జేబులోంచి డాక్టర్ రాచంద్ర రాజుకి ఫోన్ చేసాడు. అరగంటలో వచ్చాడు రాజు. అప్పటికే సుహాసిని చనిపోయిందని గ్రహించాడు డాక్టర్ రాజు. మాస్టారిని ఓదార్చి, పిల్లలు ముగ్గురికీ ఫోనులు చేసాడు రాజు.


అర్ధరాత్రి దాటాకా ముగ్గురూ పాలకొల్లు వచ్చారు. అప్పటివరకూ డాక్టర్ రాజు మోహనకృష్ణ దగ్గరే ఉన్నాడు. సుహాసిని దినకార్యక్రమాలు పూర్తి అయ్యాక రాకేశ్ తండ్రిని తనతో తీసుకువెళ్ళాడు. నెల గడవకుండానే పాలకొల్లు వచ్చేసాడు మోహనకృష్ణ. భార్య జ్ఞాపకాలలోనే తాను జీవిస్తానని, ఎక్కడా ఉండనని చెప్పాడు. సంవత్సరం గడిచింది. 


సుహాసినికి ఇష్టమైన పనులే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏటా సంగీత పోటీలు నిర్వహించి పిల్లలకు బహుమతులు ఇస్తున్నాడు. పిల్లలలో దేశభక్తి, జాతీయతా భావాలు పెంపొందించేందుకు సందేశాత్మకమైన చిన్న చిన్న కథలు రాసి, వాటిని పుస్తకాలుగా ప్రచురించి ప్రతి పాఠశాలకు అందిస్తున్నాడు. 


సాయంత్రం వేళల్లో ఇంటి దగ్గర, చదువులో వెనకబడిన విద్యార్ధులకు ట్యూషన్ చెబుతున్నాడు. 

‘సుహాసిని’ ఫౌండేషన్ ద్వారా పల్లెలలో డాక్టర్ రాజు సహాయంతో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాడు. 


ఎనభై రెండు సంవత్సరాల వయసులో ఏ విద్యాసంస్థ వారు పిలిచినా అక్కడికి వెళ్లి పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ చెబుతున్నాడు. 


మలిసంధ్యలో దిగులు పడకుండా, నిరంతర చైతన్యంతో సమాజ వికాసానికి, పిల్లల విద్యాభివృద్ధికి 

శ్రమిస్తున్న మోహనకృష్ణ తొలి సంధ్యా సూర్యుడు. ఎందరికో స్ఫూర్తి దాత. 


సమాప్తం

******* 


M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





 

 
 
 

6 Comments


mk kumar
mk kumar
Jan 26

ఈ కథ "సంధ్యాసూర్యుడు" M R V సత్యనారాయణ మూర్తి గారి రచన. ఇందులో ప్రధాన పాత్ర మోహనకృష్ణ అనే పాఠశాల ఉపాధ్యాయుడి జీవితం. ఆయన కుటుంబంతో గడిపేవిధానాన్ని చూపిస్తుంది. మోహనకృష్ణ, ఆయన భార్య సుహాసిని, పిల్లలతో పాటు సామాజిక సేవలు, కుటుంబ బంధాలు, ఆత్మీయత, కష్టసుఖాలు, మంచి మార్గం చూపడం వంటి విషయాలను చర్చిస్తుంది.


ఈ కథలో మోహనకృష్ణ ఆత్మీయ సంబంధాలు, ఆయన కుటుంబంలో ఉన్న ప్రేమను హైలైట్ చేస్తుంది. ఆయన భార్య సుహాసిని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనడం, వైద్య చికిత్స, కుటుంబ సభ్యుల సహాయం వంటి అంశాలు ఈ కథలోని కీలకమైన భాగాలు. కథలో జీవిత సంకటాలు, కుటుంబ సంబంధాలు, జీవిత ధోరణులపై దృష్టి సారించి, మోహనకృష్ణ తన భార్యతో కలసి జీవితం గడుపుతాడు.


ఇది ఒక మంచి గుణాత్మక కథగా, మనిషి జీవితం లోని ప్రశాంతత, ప్రేమ, బాధలను వివరించే కథ.


Like


@mallampalli1958

11 minutes ago

బాగుంది మూర్తి గారు

Like


@umadevi8931

14 hours ago

ఆదర్శ వంతమైన జీవితాన్ని గడుపుతున్న మోహన్ కృష్ణ ధన్యుడు. కథ చాలా బావుంది రచయిత కు అభినందనలు

Like

@malapakarajeswari5285

14 hours ago

కధ చాలా బావుంది, అలాగే మీరు చదివిన తీరు కూడా చాలా బావుంది. మీ ఇద్దరికీ అభినందనలు

Like


@mrvsmurthy311

15 hours ago

బాగా చదివారు సార్. రచయిత భావాలు, మీ గొంతులో చక్కగా పలికించారు.. ధన్యవాదాలు

Like
bottom of page