top of page
Writer's picturePandranki Subramani

సంగమం

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #సంగమం, #Sangamam, #TeluguKathalu, #తెలుగుకథలు


Sangamam - New Telugu Story Written By - Pandranki Subramani

Published In manatelugukathalu.com On 23/12/2024

సంగమం - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


పట్టింపులు కంటగింపులు వాటి వెనుక మిడిసిపడే పోటీతత్వాలు వట్టి లాకల్ రాజకీయ రంగాలలో మాత్రమే బుసలు కొడ్తుంటాయనడం పూర్తి సత్యం కాదు. తెలుగువాడి జీవిత సామజిక వాతావరణంలో గుణాంశంగా ఈ భావావేశాలు యేదో ఒక మోతాదున అన్ని నివేశ స్థలాలోనూ పొడ సూపుతూనే ఉంటాయి. ఈ విషయంలో సందడితో జనసమూహంతో అనవరతం అలరారే ఆలయ ప్రాంగణ పరిసరాలకు మట్టుకు మినహాయింపు ఉంటుందా యేమిటి! 


చిలకల గూడ ముత్యాలమ్మ బొడ్డురాయి ఆలయం విశాల ప్రాంగణంగా విస్తరించిన తరవాత అమ్మవారి భక్తులు ముఖ్యంగా ముత్తయిదువులూ పుణ్య స్త్రీలూ మెండుగా తరలిరానారంభించారు. దానితో గుడి నిర్వాహకుల్లో, దేవస్థాన సభ్యుల్లో అమీ తుమీ అన్నరీతిన పొరపచ్చాలు పొటమరించ సాగాయి. కాల గతిన ఆలయ నిర్వాహకులు రెండు శిబిరాలుగా వేరయారు. పైకొనే యుధ్ధం కంటే నివురు గప్పిన నిప్వు వంటి అంతర్యుధ్ధం ప్రమాదకరమన్నది లోకవిదితమేగా! 


ఇంతకూ ఆ రెండు గ్రూపుల్లోని వారెవరట? అందరూ చిలకల గూడకు చెందిన యువకిషోరాలే! మొదటి గ్రూపుకి క్యాప్టన్ మాఁవిడి ముత్యాలయ్య. అతడితో అంటిపెట్టుకుని తిరిగేది నలుగురు. రెండవ గ్రూపుకి నాయకుడు అక్కారావు. ఇతణ్ణి అంటిపెట్టుకుని మరికొందరు-- ఇక విషయానికి వస్తే ఇరు గ్రూపువాళ్ళకూ ఒక రివాజు ఉంది. అదేమంటే- అక్కారావు గ్రూపు వాళ్ళేమో పగటి పూట ఆలయప్రాంగణంలోకి వచ్చి కూర్చుంటారు, గుడి వ్యవహారాలలో పాలు పంచుకుంటారు. సమయానికి దేవార్చన చేయడానికి అర్చకుడు వర్షాభావం వల్లనో రహదారుల రద్దీవల్లనో రాలేకపోతే అక్కారావు గ్రూపువాళ్ళే వెళ్ళి అర్చకుల్ని తీసుకు వస్తారు. 


అదేరీతిన సాయంత్ర పూట హాజరయే మొదటి గ్రూపు వాళ్లు అనివార్య పరిస్థితి వల్ల అర్చకుడు ససేమిరా రాలేనంటే వాళ్ళే పూనుకుని ప్రక్కనున్న హిమగిరి వేదపాఠశాల నుండి యువ అర్చకుణ్ణి అప్పటికప్పుడు తీసుకు వచ్చి గుడి తలుపులు తెరిపించి దేవార్చన చేయిపిస్తారు. భక్తులకు ఊరట కలిగిస్తారు. నైవేద్యానికి పూలు పళ్ళూ లేకపోతే- దీపారాధనకై తైలం ఐపోతే వాళ్ళే పరుగున వెళ్ళి తెచ్చిస్తారు. భక్తులు ముఖ్యంగా వయసు మళ్లిన ముత్తయిదువులు అసౌకర్యానికి లోనుకాకుండా సీటింగ్ యేర్పాటు స్వయంగా చూస్తారు. 


వేసవి ముంచుకొచ్చినప్పుడు తాగడానికి మంచినీళ్ళందించి వారికి అందుబాటులో కుర్చీలు వేస్తారు. సపర్యలు చేస్తారు. కాని—కాలం, మేఘాల మధ్య సజావుగా సాగిపోయే సూర్యరథం కాదు కదా! గ్రూపు వాళ్ళ మధ్య అణగారి ఉన్న పొరపచ్చాలు మెల మెల్లగా బహిర్గతం కాసా గాయి. పెద్దలు ముందే చెప్పలేదూ- చెరువు నిండుగా ఉంటే కప్పల బెకబెకలు మెండుగానే ఉంటాయని-- హుండీల రాబడి పెరిగి, తిరువాభరణం రిజష్టరు పెద్దదయిన తరవాత పెత్తందార్ల అలికిడి కూడా పెరిగింది. 


ఇప్పుడు మ్యునిసిపల్ కార్పొరేటర్లతో బాటు కౌన్సిలర్లతో బాటు అడపా దడపా యెమ్మల్యేల రాకపోకలు కూడా అదికమైనాయి. వాళ్ళకు అక్కారావుతో బాటు అతగాడి మిత్ర బృందం కూడా చేరువవ సాగారు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు పిలుపిచ్చే సభలకు సదస్సులకు కూడా అక్కారావు గ్రుప్ వాళ్ళు వెళ్ళ సాగారు. ఆరీతిన వాళ్ళకు దగ్గరయి పరపతి పెంచుకోసాగారు. ఆలయ ప్రాంగణ పరిసరాల లో ఆధిక్యతతో బాటు అజమాయిషీ కూడా చూపించ సాగారు. 


అందుబాటులోకి రావాలే గాని రాజకీయ నాయకుల దన్నూ వెన్నూ అటువంటిది మరి-- ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించడంలో వాళ్ళను మించిన సిధ్ధహస్తులు తెలుగు నేలపై మరొకరుంటారేమిటి-- కాని- సున్నితత్వంతో పని చేస్తూ, చిత్తశుధ్దితో సేవలొనర్చే మాఁవిడి ముత్యాలయ్య గ్రూపువాళ్లు అలా నీళ్ళలో అరగదీసిన ఇంగువలా కలవలేక పోయారు. చెరకు తిరగలి మరనుండి నెట్టవేయబడ్డ పిప్పిలా నెట్టవేయ బడసాగారు. 


అటువంటి గడ్డు సమయంలో పొలం పనులు చూసుకోవడానికి జబ్బున పడ్డ మామయ్య పిలుస్తున్నాడని ముత్యాలయ్య చిలకల గూడ విడిచి అమ్మానాన్నలతో ఊరు విడిచి వెళ్లిపోయాడు. ఎంతటి భక్తి పరులైతే మాత్రం- గుడి వ్యవహారాలు బ్రతుకు తెరువు చూపించలేవు కదా1 అప్పుడు ఆ గ్రూపు అనధికార ప్రతినిధిగా ప్రహ్లాద్ కిరణ్ ప్రాంగణ కేంద్రం మధ్యకు వచ్చాడు. అతడి రాకతో వాళ్ల బృంద సభ్యులకు కొత్తగాలి సోకినట్లయింది. చేనుకి కొత్తనీరు చేరినట్లనిపించింది. 


అతడు పునరు త్తేజంతో మిత్ర బృందానికి కొత్త దిశ చూపించసాగాడు. ప్రత్యేక అభిషేకాలకు అర్చనలకూ పిలిచినా పిలవకపోయినా- జాతరోత్సవాలకు కబురు పంపినా పంపక పోయినా వాళ్ళే ముందడుగు వేసి సమాచారాన్ని ముందస్తుగా కనుక్కుని ఆలయ వైదిక విధుల్లో పాలు పం చుకోసాగారు. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలేగా! అందులో పేరంటాల పిలుపులెందుకూ! ఆహ్వానాల కోసం వెంపర్లాటలెందుకూ! 

--------------------------------------------------------------------------- 

ఒకరోజు పాల్గుణ శుధ్ద పౌర్ణమినాడు గుడి ఆవరణలో కూర్చున్నప్పుడు మిత్రులందరూ ఒక్కొక్కరుగా గుండె ఘోషను వెళ్ళగక్కుకోనారంభించారు. 


“మనం యెంత కష్టపడేవాళ్ళం మనూరి గుడి నిర్వహణ కోసం! చూసారా యెక్కణ్ణించో వచ్చిన రాజకీ య శక్తులు ధర్మ విధులతో సంబంధం లేని ఎక్ స్ట్రా గుంపులు ఒక్కటిగా గుమికూడి యెలా గ్రద్దల్లా తన్నుకు పోవడానికి ప్రయత్నిస్తున్నారో! మొత్తానికి కాల క్రమేణ మన ఉనికే లేకుండా పోయేటట్లుంది” 


సుబ్బారావు అన్నమాటకు స్పందిస్తూ వేంకటాచలం అన్నాడు- “మెప్పులు గొప్పలకు పోకుండా ఏదీ యెదురు చూడకుండా అమ్మవారికి సేవలు చేసాం. మొన్న గుడిజాతరకు మనల్ని పిలవాలన్న ద్యాసే లేకుండా పోయింది వీళ్ళకు. తలచుకుంటే గుండె తరుక్కుపోతుందిరా ప్రహ్లాదూ! ” 


అప్పుడు మళ్లీ సుబ్బారావు- “మొత్తానికి ఉరుము లేని పిడుగులా వచ్చి పడ్డారు, ఈ ఎక్స్ ట్రా గాళ్ళు -- మనల్ని యేమీ లేకుండా యేమీ కాకుండా చేసారు. మన గుడి పునరుధ్ధరుణకి మనం యెన్ని వీధులు- యెన్ని వాడలు తిరిగామని విరాళాలు ప్రోగుచేయడానికి-- ” 


అప్పుడు అందర్నీ మాట్లాడనిచ్చాక ప్రహ్లాద్ కిరణ్ ముక్తాయింపుగా పాలు పంచుకున్నాడు- “అనవసరంగా మితి మీరిన రీతిన బాధపడిపోకండి. మనం చేసిన మంచి పనులు మనం కొలిచే అమ్మవారికి తెలియకుండానే పోతుందా! ఈపాటికి మనం చేసిన చిన్నాచితకా పనులు అమ్మవారి చూపున పడే ఉంటాయి! ” 


అది విని అందరూ ఒక్కసారిగా తలలు తిప్పి- ఎలా? - అన్నట్టు చూసారు. 


“ఎలాగంటే—చెప్తాను వినండి. మనం చేసిన సేవలన్నీ చిత్త శుధ్దితో చేసాం. ఏమీ యెదురు చూడకుండా గొప్పలకు పోకుండా చేసాం. ఇది గుర్తించి అమ్మవారు తప్పకుండా కరుణిస్తారు” 

దీనికి వరహాలబాబు స్పందించాడు- “ఏమో-- నీ నమ్మకం నీది గాని, నాకలా అనిపించడం లేదురా ప్రహ్లాదా! అన్నీ తుమ్మితే ఊడిపోయే పచ్చికాయల కచ్చా ఉద్యోగాలే దొరుకుతున్నాయి—నా బ్రతుకు వాలకం చూసి స్వంత మేనమామే పిల్లనివ్వడానికి జంకేటట్టున్నాడు ఉద్యోగం ఊడితే యెక్కడ కూతుర్ని నడిరోడ్డున పడేస్తానేమోనని- 

అంతెందుకు మా అమ్మే తమ్ముణ్ణి పిల్లనివ్వమని అడగటానికి జంకుతూంది.


ఇక్కడ మన గ్రూపు వాళ్లు ఇటువంటివి చెప్పడానికి బిడియ పడుతున్నారు. నేను మొహమాటం విడిచి చెప్తున్నాను. అంతే తేడా!” ప్రహ్లాద్ మళ్ళీ ధైర్యం చెప్పడానికి పూనుకున్నాడు- “మనం అడిగే సమయం కాదు ముఖ్యం- అమ్మతల్లి మనపైన దయ తలచే సమయమే ముఖ్యం, కరుణతో కటాక్షించు కామాక్షీ- అని పాడలేదు మనూరి వాగ్గేయకారు డెవరో-- ఇది గుర్తుంచుకోండి”


 దానికి అందరూ సావధానంగా తలలూపారు. అప్పుడు యేదో స్ఫురణ కు వచ్చిన వాడిలా ప్రహ్లాదు అందుకున్నాడు- “అన్నట్టు మాటల్లో పడి కాస్తంత యెమోషనల్ ఐపోయి చెప్పడం మరచిపోయినట్టున్నాను. మీకు సుమారు మూడు నెలలపాటు కనిపించకపోవచ్చు, మా కంపెనీ ప్రొడక్షన్ మేనేజరుతో విదేశాలకు వెళ్ళ వలసి వచ్చింది. అదేదో పెద్ద బాధ్యత గల స్థాయిలో వెళ్తున్నాననుకునేరు. హనుమంతుడి తోకలా ఆయన్ను అనుసరించాలి, ముఖ్యమైన ఫైల్సు గట్రా మోసుకు వెళ్తూ—”


అప్పుడు వేణు మాధవ్ అడ్డు తగిలి అడిగాడు- “ఫారిన్ అంటున్నావు. ఏ దేశమేమిటి? ” 


“హాఁ పెద్ద గొప్ప దేశాలేమీ కావులే! నైజీరియా- జింబాబ్వే- బంగ్లాదేశ్- ఇండోనేషియా- మయన్మార్. ఇటువంటి చిన్నచిన్న దేశాలే! ” 


“ఏ దేశమయితేనేమి? పారిన్ టూర్ ఫారిన్ టూరే కదా ఔతుంది! మా అందరి శుభాకాంక్షలు అందుకుని వెళ్లిరారా- ఏదేశ మేగినా యెందు కాలిడినా- అన్న రాయప్రోలువారి పద్యాన్ని మరచిపోకుండా! ”


అందరూ ప్రహ్లాదుని రోడ్డు ఓరనున్న టీ బంక్ వద్దకు తీసుకు వెళ్లి టీ బిస్కట్లు ఇప్పించి సాగనంపారు. 


మొత్తానికి జరిగినదేమంటే; ప్రహ్లాదు అన్నమాట ప్రకారం మూడు నెలల గడువు లోపున ఊరు చేరలేదు. మిత్రులు కంగారు పడి ప్రహ్లాదు వాళ్ల ఇంటికి వెళ్లి అడిగారు. కాని ఇంటి వాళ్లు కూడా ఇతమిథ్థంగా ప్రహ్లాదు యెప్పుడు వస్తాడో చెప్పలేక పోయారు. కాని ఒక ఊరు తరవాత ఒక ఊరు మారుతున్నప్పుడు మాత్రం ఫోనులో వాళ్ళకు తెలియచేస్తున్నాడు. 


అంతకు తప్ప స్థిరంగా యెక్కడున్నాడో యేమి చేస్తున్నాడే తెలియటం లేదు. ఏది యేమైతేనేమి గనుక— కాలం గడ్డకట్టిన మంచులా ఆగిపోదుగా! ఎవ్వరి కోసమూ యెదురు చూస్తూ నిలచిపోదుగా! ప్రహ్లాదు యెట్టకేలకు ఐదునెలల యెడబాటు తరవాత ఊరు చేరాడు. అదేరోజు సాయంత్రం గుడి ఆవరణలో మిత్ర బృందాన్ని కలుసుకున్నాడు. 

చూసీ చూడటంతోనే వాళ్లు అడిగారు- “ఏక బిగిన ఇన్నాళ్లు కనిపించకపోయే సరికి యెంతగా బెంబేలు పడ్డామో తేలుసా! 


ఏదో ఊరూపేరూ లేని దేశంలో చిక్కుకు పోయా వనుకున్నాం. నిన్ను ఊరికి రప్పించడానికి మనూరి యెమ్మెల్యే వద్దకు వెళ్ళాలనుకున్నాం. ఉక్రేయిన్ సూడాన్ వంటి ప్రాంతం లో పడి యిక్కట్ల పాలవలేదు కదా! ” 


ప్రహ్లాద్ నవ్వాడు- “అదేమీ లేదురా—” అని యేదో చెప్పబోయేంతలో వేణుమాధవ్ యెగిసి పడ్డాడు. “నీకేమైనా బుధ్ది ఉందట్రా! నువ్వెక్కడున్నావో యేమి చేస్తున్నావో మాకు కబురు అందివ్వొద్దూ! అడిగితేనేమో మాకు అమ్మవారి కటాక్షం ఉంటుందన్నావు. ఇక్కడేమో ఉన్నది కూడా ఊడింది. అక్కారావు గ్రూపువాళ్లు రాజకీయ యెక్స్ ట్రా గాళ్ళతో కుమ్మక్కై మమ్మల్ని దేవస్థానం సభ్యత్వం నుండి ఊడబెరికారు. పాడు పడ్డ బావిలో దూకాలన్నంత అవమానభారం మాకందరకూ-- ”


ప్రహ్లాదు అంతావిని తనకు చెప్పడానికి అవకాశం ఇవ్వమని అడుగుతూ టూరు వివరాల గురించి చెప్పసాగాడు- “మొదట సారీ చెప్తున్నాను.. చెప్పినట్టు మూడు నెలల్లోపల రాలేకపోయినందుకు- మీకు ముందస్తు భోగట్టా ఇవ్వనందుకు. ఐతే జాప్యం మా ప్రొడక్షన్ మేనేజర్ వల్ల జరగలేదు. మేం టూరు ముగించబోయే చివర దశలో ఉన్నప్పుడు న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్ నుండి కబురు వచ్చింది వెంటనే అక్కడకు రమ్మనమని—”


అప్పుడు మిత్రులందరూ ఉక్కుమ్మడిగా అడిగారు- “ఏమిటేమిటీ! నువ్వు అమెరికా ఫైనాన్స్ క్యాపిటల్ న్యూయార్కు వెళ్ళావా! ” 


ప్రహ్లాద్ తలూపాడు- “అవున్రా అవును. నక్కతోక తొక్కి అక్కడకు చేరాను మా ప్రొడక్షన్ మేనేజరుతో—యెడా పెడా ఒళ్ళు దాచుకోకుండా పని చేసాను. శ్రధ్దే జ్ఞాన బీజానికి మూలం అంటారే- అలా శ్రధ్దగా సావధానంగా పని చేసి అందర్నీ మెప్పించాను. ముఖ్యంగా అక్కడ మేనేజ్మెంట్ ట్రైనీగా జాబ్ చేస్తూన్న రోజీని బాగా ఇంప్రెస్ చేసాను. ఆమె నాకు వీసా వర్క్ పర్మిట్ పొడిగించడంలో చేయూతనిచ్చింది” 


“పానకంలో పుడకలా మధ్యన ఈ రోజీ యెవర్రా? ” 


“చెప్తాను. ఆమె పేరుకి మేనేజ్మెంటు ట్రైనీగా ఉంటున్నా ఆమె మా కంపెనీ చీఫ్ బాసుకి పెద్ద కుమార్తె. చెప్పకూడదు గాని—చాలా మంచిదిరా! భారతీయత పట్ల మిక్కిలి అభిమానం ఉన్న అమ్మాయి. ముఖ్యంగా ఆమెకు కర్ణాటక సంగీతమూ హిందుస్తానీ మ్యూజిక్ రెండూ ఇష్టం. అదెక్కడో భరత నాట్యం కూడా నేర్చుకుని మధ్యలో విడిచిపెట్టెసిందట. కళాత్మక హృదయురాలు కావటాన కళ్ళలో మృదువైన సభ్యతా సంస్కారాలు ఉట్టి పడుతుంటాయి. 


అంతేకాదు— రోజీకి యిష్టమైన సంగీత కళాకారులెవరో తెలుసా? అప్పటి ఎల్విస్ ప్రెస్లీయో ఇప్పటి జేక్సనో కారు. మన వీణ విద్వాన్ చిట్టిబాబుగారు—సితారా సంగీత నిపుణుడు రవిశంకర్— నమ్మలేకపోతున్నారు కదూ--- ఆమెను ఒకసారి న్యూజెర్సీలో ఉన్న వేంకటేశ్వర స్వామి వారి గుడికి- మరొక రేమో నార్త్ కరోళినాలోని అమ్మవారి గుడికీ తీసుకు వెళ్లాను. అక్కడ రెండు చోట్లా తెలుగింటి భోజనాలు తినిపించాను. చాలా సంబర పడిందనుకో! ”


అప్పుడు వేంకటాచలం అడ్డు పడ్డాడు- “ఏమిట్రోయ్ నీమాటలు ఏకధాటిగా వంకర టింకరగా వినిపిస్తున్నా యే! ఇక్కడేమో మీ వాళ్లు హోరాహోరీగా పెళ్లి సంబంధాలు వెతికేస్తున్నట్టున్నారు. అక్కడేమో నువ్వు యెవ్వరూ ఊహించలేని ఘన కార్యాలు సాధిస్తున్నట్టున్నావు. అసలే మీది సింగినాదం జీలకర్ర కుటుంబం. తెల్లపిల్లపైన మనసు పారేసుకున్నట్టున్నావు. మీ ఇంట్లోవాళ్లకు తెలిస్తే యేమవుతుందో తెలుసా! ” 


ప్రహ్లాదు వెంటనే బదులివ్వలేదు, కాస్తంత యెడబాటు తీసుకుని నోరు విప్పాడు- “మొదట రుస రుసలాడకుండా నేను చెప్పేది వింటారా! వింటామంటేనే ముందుకు సాగుతాను”


ఇక తప్పదన్న ట్టు అందరూ తలలూపారు. “మన బ్రతుకుబాటలో రెండు కార్యాలున్నాయి. ఒకటి స్వకార్యం. రెండవది- స్వామికార్యం. బ్రతుకు బాటలో రెండూ సమపాళ్ళలో జరగాలి. ఇవన్నీ చెప్పడానికి సమయం పడ్తుంది. ముందు మా ఇంటికి రండి. మీకందరకూ ఫ్రీ- షేపులో టీ షర్టులూ- హు డ్ తో స్వెట్టర్లూ తెచ్చాను. కమాన్ ఐసే-”అంటూ లేచాడు ప్రహ్లాదు. 


మిత్రులందరూ అతణ్ణి ఒక్కసారిగా కుదేసి కూర్చోబెట్టారు, “నీ స్వెట్టర్లు తగలడా! ఇప్పుడదా ముఖ్యం? మా గురించి యేదైనా చెప్తావని యెదురు చూస్తుంటే-- ఇదా నీ పోకడ? ”

ప్రహ్లాదు నవ్వేసాడు. “ఓరి మీ ఇల్లు బంగారం గానూ! ఇంటికి వస్తే ఆ విషయం కూడా చెప్తాను టీలు పుచ్చుకుంటూ- ” 

“వద్దంటే వద్దు! మొదట మాసంగతి తేల్చు. అమ్మవారు మాఅందరిపైనా కటాక్షం చూపిస్తారని బల్లగుద్ది చెప్పావుగా! అది చెప్పు” 


“మళ్లీ అదే చెప్తున్నాను. అమ్మతల్లి మనల్ని మరచిపోకుండా మనందరిపైనా దయ చూపిస్తుందని-- ”


అలగయితే, ఆ సత్యాన్ని నిరూపించ మన్నారు మిత్రబృందం ముక్త కంఠంతో-- 


“ఇప్పుడే ఇక్కడే నిరూపిస్తాను. నేను ముందే చెప్పాగా- రోజీ నన్ను యిష్టపడ్డదని, నేను కూడా డిటో-- నాపైన ఆమెకు అంతటి గౌరవం- అంతటి విశ్వాసం కలగడానికి ఒక ముఖ్యమైన ఆధారం ఉంది. ఇన్ని ఊళ్లు తిరిగామా- ఇన్ని హైందవాలయాలు తిరిగామా- పలు చారిత్రాత్మక ప్రదేశాలు తిరిగొచ్చామా- ఖరీదైన ఇటాలియన్ రెస్టారెంట్లలో కలసి తిన్నామా-- నేను ఒక్కసారి కూడా చొరవ తీసుకోలేదు—”


అంటే- అన్నట్టు మిత్రులు కళ్లు మిటకరించి చూసారు. 

“మీకన్నీ విడమర్చి చెప్పాలిరా అరటి పండు ఒలిచినట్టు-- అంటే, నేను సరసాలకు పూనుకోలేదు. రెచ్చగొట్ట లేదు. ఇది ఆమెను బాగా ఆకట్టుకుంది. అప్పుడు ఆమె నాకొక కాంప్లి మెంట్ ఇచ్చింది. ’యు ఆర్ ట్రూ ఇండియన్‘ అంది. అప్పడు అంతగా ఇంప్రెస్ ఆవడం చూసి నేనీసారి నిజంగానే ధైర్యం చేసాను” 


“అంటే—ఈసారి మోహతరంగాలలో తేలుతూ ఆమెతో హాట్ హాట్ గా ప్రవర్తించావన్నమాట--” 


 “ఛే! ఏ మాటల్రా అవి? పూర్తిగా వినేంత ఓపిక లేదు కదా మీకెవ్వరికీ! వివాహం చేసుకుంటానని ప్రపోజ్ చేసాను. ఆమె ఆనందం తో ఒప్పుకుని నాకు దీర్ఘమైన హగ్ ఇచ్చింది, అదే తరుణమని స్వకార్యంలోకి దిగాను. మీ గురించి చెప్పాను. మన గుడి వ్యవహారాల గురించి వివరించి చెప్పాను. అప్పటికప్పడు రోజీ ఒప్పుకుంటూ అడిగింది- మీకందరకూ తగు స్థాయిలో స్కిల్ డెవలాప్ చేయడానికి యేర్పాటు చేసిన పిదప యు యెస్ లోనే ఉద్యోగం చేయడానికి సిధ్దమేనా అడిగింది. నేను వెంటనే ఆమె సలహాను కొట్టిపడేసాను అది సంభవం కాదని” 


అది విని అందరూ ఒక్కసారిగా అరచినంత పని చేసారు. “ఎంతపని చేసావురా ప్రహ్లాద్! మేమెప్పుడురా అమెరికా రాలేమని చెప్పాం? నీ అతి ప్రసంగంతో బంగారు బాతుని చిటికెలో చంపేసావు కదరా! నీకెందుకురా మాపైన అంతటి దుగ్ధ అంతటి పగ! ” 

ప్రహ్లాద్ కొనసాగించాడు- “ముందు నన్ను తిట్టడం ఆపి నేను చెప్పేది ఓపిక తెచ్చుకుని వింటారా! విననంటే ఇప్పుడే ఈ క్షణమే వెళ్లిపోతాను” 


“వింటాం వింటాం. చెప్పు చెప్పు-- “


 “నా సంగతి అటుంచండి. రేపు నేను రోజీని పెళ్లి చేసుకుంటే నేనిక్కడుంటానో ఇంక్కెక్కడుంటానో చెప్పడం కష్టం. ఇప్పుడు మీ విషయానికి వస్తాను. మీరందరూ రెక్కలొచ్చిన పక్షుల్లా అమెరికా ఖండానికి యెగిరిపోతే మరి అమ్మతల్లి గుడి వ్యవహారాలు యెవరు చూస్తారు? అంతా ఆ అక్కారావు గ్రూపు వాళ్ళకూ అతడి అంటకాగుతూన్న రాజకీయ చెమ్చాగాళ్ళకు విడిచి పెట్టేస్తారా! మరి మనం అమ్మతల్లికి యిచ్చిన మాట సంగతి? గాలిలో తేలిపోయిన పేల పిండేనా! ”


మిత్ర బృందం మిన్నకుండిపోయారు.


“అంచేత నేనొక కౌంటర్ ప్రపోజల్ చేసాను. మా కంపెనీ మేనేజిమెంటు వాళ్లు ఇండియాలో యెక్కడో ఒక సౌత్ కొరియా సంస్థ భాగస్వామ్యంతో హార్డ్ వేర్ యూనిట్ నిర్మించ బోతున్నారు. దానిని మరెక్కడో యెందుకు? వాతావరణ సమతుల్యత గల గచ్చిబౌళి లోనో శంషాబాదు శివార్లలోనో కడ్తే పోలా! ఆ కొత్త యూనిట్ లో మీకందరకూ స్కిల్ డెవలెప్మెంటు ప్రోగ్రాములో ట్రైనింగ్ ఇచ్చి స్థిరమైన ఉద్యోగాల్లో కూర్చోబెట్తే సరిపోతుంది కదా! ఆరోజే వాళ్ల నాన్నతో మాట్లాడి విషయాన్ని క్లించ్ చేసింది రోజీ. దీనితో మన స్వకార్యమూ స్వామి కార్యమూ రెండూ పరిపూర్ణత సంతరించుకున్నట్లే కదా!”


అప్పుడు వాళ్ళ ముఖాలు మతాబులు వెలిగినట్లు ఫెళ్లున నవ్వాయి. పరుగున వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు సాష్టాంగ దండ ప్రమాణం చేసారు. 


 శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.






36 views0 comments

Comments


bottom of page