కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Sankham Lo Posthe Gani Tirtham Kadu' written by Neeraja Hari Prabhala
రచన : నీరజ హరి ప్రభల
పాస్ పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు చిన్న భంగపాటు కలిగింది సరోజకు.
అక్కడ కలిగిన ఇబ్బంది కంటే భర్త నవ్వాడనే ఉక్రోషమే మరింత బాధించింది ఆమెను. సరదా సరదాగా సాగే ఈ కథను ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు రచించారు.
అమెరికాలో ఉన్న కూతురి వద్దకు వెళ్ళేందుకు, వీసా పాస్పోర్ట్ రెడీ చేసుకునేందుకు కావలసిన ఫారంలు అవీ పూర్తిచేసి, ఆ ఆఫీసులో ఇస్తే వాళ్ళు ఇంటర్వూ డేట్ కూడా ఇచ్చారు సరోజ దంపతులకు.
మొదటి సారి అమెరికా ప్రయాణం. చాలా ఖంగారు పడుతోంది సరోజ. ఇంటర్వ్యూలో ఏంచెప్పాలో, తడబడకుండా ఎలా చెప్పాలో ముందుగానే వాళ్లని ప్రిపేర్ చేశారు కూతురు, అల్లుడు.
"ఆఫీసులో వాళ్ళు వెబ్ కామ్ లో ఫొటోలు కూడా తీసుకుంటారమ్మా " అంది కూతురు.
ఇంటర్వ్యూ రోజు రానే వచ్చింది. ఆరోజు ఉదయమే తలకు డై వేసుకుని బ్యూటీ పార్లర్ కు వెళ్ళి ఫేషియల్ చేయించుకుని మంచి లేటెస్ట్ మోడల్ చీర కట్టుకుని అందంగా ముస్తాబయింది సరోజ.
"ఏమే ! మనం పెళ్లికి కాదు వెళ్తున్నది. ఇది పాస్పోర్ట్ ఆఫీసులో ఇంటర్వ్యూ, దానికి సంబంధించి ఫొటోనే. అలా మేకప్ లు, లిప్ స్టిక్ లు వేసుకోగూడదే. వాళ్ళు రిజక్ట్ చేస్తారే " అన్నాడు భర్త రామం.
"మీరెప్పుడూ ఇంతే. నన్ను ఎప్పుడు మెచ్చుకున్నారు కనుక? నేను అందంగా రెడీ అయితే మీకు కుళ్ళు" అన్నది సరోజ.
"ఇది ఇంక ఏంచెప్పినా వినదు. ఈ మేకప్ సాథనాలను ఎవరు కనిపెట్టారో, వాళ్ళను అనుకోవాలి" అని గొణుక్కున్నాడు రామం.
" నాగురించి గొణుక్కున్నది చాల్లేండి, పదండి బయలుదేరుదాం " అన్న భార్య మాటలతో కావలసిన ఫారాలు అవీ తీసుకుని పాస్పోర్ట్ ఆఫీసుకు ఆటోలో బయలుదేరారు రామం దంపతులు. వాళ్ళ ఇంటినుంచి పాస్పోర్ట్ ఆఫీసుకు చేరేందుకు చాలా సమయం పడుతుంది.
అసలే రోహిణీకార్తె ఎండలాయే ! ముఖమంతా చెమటలు పోస్తున్నాయి . తీరా అక్కడికి చేరేటప్పటికి తన మేకప్ ఎక్కడ చెదిరిపోతుందోనని మధ్యమధ్యలో తన హాండ్ బాగ్ లోంచి అద్దము, టిష్యూ పేపరు తీసుకుని ముఖం మీద స్వేదాన్ని తుడిచి మేకప్ బాక్స్ లోని చిన్న పఫ్ తో మేకప్ పౌడర్ను అద్ది ముఖానికి టచప్ చేస్తోంది సరోజ. ఇదంతా గమనిస్తున్న రామం వస్తున్న నవ్వును బలవంతంగా పెదవుల చాటున అదుముకుంటూ బయటకు చూపులు మరల్చాడు.
భర్త తీరును క్రీగంట గమనిస్తూ "ఈయనింతే ! నన్ను, నా అందాన్ని ఏనాడు మెచ్చుకున్నారు కనుక, ఇవాళ మెచ్చుకునేందుకు. చుట్టు ప్రక్కల ఆడవాళ్ళను ఎంతగానో మెచ్చుకుంటారు. పొరుగింటి పుల్లకూర రుచి" అని మనసులో అనుకుంది సరోజ.
కొంత సేపటికి పాస్పోర్ట్ ఆఫీసుకు చేరారు సరోజా వాళ్ళు . సరోజను అక్కడున్న కుర్చీలో కూర్చోమని రామం లోపలికి వెళ్ళి అక్కడి ఆఫీపర్లకు తన వద్ద ఉన్న కాగితాలను ఇచ్చాడు. వాళ్ళు "మీ సమయం వచ్చినప్పుడు పిలుస్తాము. వేచి ఉండండి " అని చెపితే తిరిగి భార్య వద్దకు వచ్చి ఆమాటే చెప్పి కూర్చున్నాడు .
కాసేపటికి వీళ్ళ పేర్లు పిలిచి విడివిడిగా ఇంటర్వ్యూ చేశారు ఆఫీసర్లు. వాళ్ళు అడిగినవాటికి కూతురు, అల్లుడు ప్రిపేరు చేసినట్టుగానే తడుముకోకుండా సమాధానాలు చెప్పారు సరోజా వాళ్ళు. రామంకు ఫొటో తీశారు. "పాస్పోర్ట్, పోస్ట్ లో వస్తుంది , ఇంక మీరు వెళ్ళవచ్చు" అనగానే బయట హాలు లోకి వచ్చి కూర్చొని, భార్య రాక కోసం వెయిట్ చేస్తున్నాడు రామం.
"మేడమ్, మీకు ఫొటో తీసుకోవాలి. మేకప్ తీసేసి రండి. మీరు ఇంట్లో మామూలుగా ఎలా ఉంటారో అలా ఉండాలి ఫొటో. కాస్త బయటకు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురండి " అంది ఆ ఆఫీసర్.
ఒక్కసారిగా చిన్నబుచ్చుకుని ఏదో చెప్పబోయి "వీళ్ళతో నాకెందుకు గొడవ? ఏదన్నా అంటే పాస్పోర్ట్ ఆపేస్తారేమో " అని భయపడి బయటకు వచ్చి భర్తతో జరిగింది చెప్పింది సరోజ.
భార్య మాటలకు ఫక్కున నవ్వుతూ "నేను చెపితే విన్నావా? శంఖంలో పోస్తేగానీ తీర్థం కాదు . వాళ్ళు చెపితే గానీ నీ చెవికెక్కలేదు. పద” అని, “అదిగో! వాష్ రూమ్, వెళ్ళి ముఖం కడుక్కొని రా " అన్న భర్త మాటలకు ముఖమంతా మాడ్చుకుని వాష్ రూమ్ లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని ఆ ఆఫీసర్ రూమ్ లోనికి వెళ్ళింది సరోజ.
ఫొటో అనగానే పళ్ళన్నీ బయటకు కన్పడేలా నవ్వుతూ ముఖం పెట్టి ఫోజివ్వటం పరిపాటి సరోజకు. అలాగే నవ్వబోతుంటే " మేడమ్, మీరు నవ్వగూడదు. సీరియస్ గా , గంభీరంగా ముఖం పెట్టాలి " అన్న ఆవిడ మాటలకు తిక్కరేగి జవాబు ఇవ్వబోయి మళ్ళీ తమాయించుకుని ఆవిడ చెప్పినట్టే చేసింది.
"ఇంక మీరు వెళ్ళండి. మీ పాస్పోర్ట్ పోస్ట్ లో వస్తుంది" అన్న ఆవిడ మాటలకు 'హమ్మయ్య ! బ్రతుకు జీవుడా ' అని బయటకు వచ్చి కందగడ్డ లాగా ముఖం పెట్టుకుని భర్తతో ఆటోలో ఇంటికి బయలుదేరింది సరోజ .
భార్య ముఖం చూసి వస్తున్న నవ్వును పంటిబిగువున బలవంతంగా ఆపుకుంటున్న భర్తను చూసి మరింత ఉక్రోషంతో "మీకూ సమయం వస్తుంది లెండీ, అప్పుడు చెబుతా మీ పని" అంది సరోజ. కాసేపటికి ఇంటికి చేరారు సరోజా వాళ్ళు. పాస్పోర్ట్ ఆఫీసులో తనకు జరిగింది అవమానంగా భావించి మనసులో కోపంతో రగిలిపోతోంది సరోజ .దానికి తోడు 'అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దారిలో భర్త వ్యంగ్యమైన నవ్వు.' ఇంక ఆపుకోలేక భర్తను కోపంతో నాలుగు మాటలని దులిపేసింది. భార్య తీరు తెలుసు . ఆ కోపం కాసేపే ఉంటుంది. 'కోపం పోయాక తనను దగ్గరకు తీసుకోవచ్చు' అనుకుని కిమ్మనకుండా అటు ముఖం తిప్పుకుని కూర్చున్నాడు రామం.
తన అక్కసు తీరినందుకు మనసులో సంతోషిస్తూ, ' కాసేపాగితే తనే వచ్చి బుజ్జగిస్తాడు ' అనుకుని పైకి కోపంగా ముఖం పెట్టి అటుతిరిగి పెడముఖంగా కూర్చుంది సరోజ. భార్యాభర్తల మధ్యన కోపతాపాలు ఎంతో సేపు ఉండవు కదా! అద్దంమీద ఆవగింజలాగా అవి ఎక్కువ సమయం ఉండవు. కాసేపటికి "అలిగితివా ప్రియా! అలుక మానవా! " అని రాగయుక్తంగా పాడుతూ సరోజను తనవైపు తిప్పుకుని దగ్గరకు తీసుకున్నాడు రామం. కిలకిలా నవ్వుతూ భర్త కౌగిలిలో గువ్వలా ఒదిగి పోయింది సరోజ.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
మనసులోని మాట
రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments