'Sanmanalandaho Sanmanalu' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 23/08/2024
'సన్మానాలండహో సన్మానాలు' తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
స్వతంత్రకుమార్ పేరు పడ్డ రచయిత. పేరు పడ్డ అంటే పేరు పడి పోవడం ఏమిటి అనుకోకండి.. నేల మీద వెతుక్కోకండి. అంటే దానర్థం కూసంత పేరు పొందిన..
కథలు రాసేవాడు అన్నమాట.
ఆ రోజు ఆదివారం..
ఆరోజు ఉదయం నాలుగు గంటలకే స్వతంత్రకుమార్ నిద్రలేచి నూనె నలుగు పెట్టుకుని, కుంకుడుకాయతో తలకాయ అంటుకొని స్నానం చేసి టిప్ టాప్గా తయా రయ్యాడు. వంటింట్లోకి వెళ్లి చూశాడు. భార్య సకల సద్గుణవతి కనపడలేదు. తెల్లవారేసరికి ఉల్లి అల్లం మిర్చి జీలకర్ర పెసరట్లుతో పాటు బొంబాయి రవ్వ ఉప్మా ప్లస్ గిన్నెడు అల్లం చట్నీ సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు రాత్రి పడుకునే ముందు.
10 గంటలకు పాయసం 12 గంటలకు బూరులు, గారెలు, బొబ్బట్లు, పులిహార.. రెడీ చెయ్యమన్నాడు. అబ్బే.. వంట గదిలో ఎంత వెతికినా ఆ ఏర్పాట్లు ఏమి కనపడలేదు. గిన్నెలన్నీ బోర్లించి ఉన్నాయి.
ఆమె గుర్రు పెట్టి ఇంకా పడుకునే ఉంది అని గ్రహించి తన భార్య వల్ల ఈ కార్యక్రమం పూర్తికాదు అని పక్కా గా నిర్ణయించుకున్న మీదట ఈనాటి తన.. ఎవరెస్టు శిఖరం అంత ఎత్తు ఎదిగిన కర్తవ్య దీక్ష ప్రారంభించాలి అన్న ఉద్దేశంతో గబగబా కార్య క్రమాలు పూర్తి చేసుకుని బయటపడ్డాడు.
***
స్వతంత్రకుమార్ బయటకు వెళ్లి పోయిన కాసేపటికి అతని భార్య సకలసద్గుణవతికి ఆమె కొలీగ్ వెంకట లక్ష్మి నుండి ఫోన్ వచ్చింది.
"ఏమే సకల సద్గుణం బాగున్నావా..” అంటూ అడిగింది.. అటునుంచి వెంకటలక్ష్మి.
సకలసద్గుణవతి మాట్లాడడం మొదలుపెట్టింది.
''ఎంకటలక్ష్మి నువ్వు బాగున్నావా.. నేను ఇప్పుడే లేచాను. ఏం చేస్తున్నావ్.. పోనీలే నువ్వు బాగానే ఉన్నావు సంతోషం. నేను మాత్రం మా ఆయనతో పడలేకపోతున్నాను అనుకో.
విజయవిహారం ఆన్లైన్ పత్రికలో ఆయనవి ఈ సంవ త్సరం ఇప్పటి వరకు 50 కథలు పబ్లిష్ అయ్యాయట. అవన్నీ ఎప్పటికప్పుడు నన్ను చదవమని వేపించుకు తినేవారు. నాకు తలలో పేలు ఎక్కువ కదా. తల దువ్వుకోడానికే టైంసరిపోదు. అలా నన్ను వేపించుకు తింటుంటే చదివాను.. చదివాను అని ఏదో బిల్డప్పులు కొడుతూ ఇంతవరకు లాక్కొచ్చాను. ఈరోజు అర్థ శత కథ పబ్లిష్ అయ్యిందట.. తన జీవితంలో ఇది మరపు రాని మరిచిపోని మహోన్నతమైన గొప్ప రోజు అని నన్ను రకరకాలు వండమని రాత్రి ఆర్డర్ వేశారు. నా నడుము నొప్పితో నేనుఎక్కడ వండగలను. రాత్రే నావల్ల కాదు.. అని చెప్పేసాను.
ఆయన ఏదో పెద్ద ఘనకార్యం సాధించేశాను అను కుంటున్నాడు. రాత్రంతా గదిలో అటు ఇటు తిరు గుతూ ఈరోజు సాయంత్రం జరగబోయే సన్మాన సభ లో ప్రసంగం ప్రాక్టీస్ చేసుకుంటూ తెగ సంబర పడిపో యాడు. ఇంట్లో తెగ ఫోజులు పెట్టేశాడు. పద్మశ్రీ వచ్చి నట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఒకే పత్రికలో 50 కథలు పడితే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టా.
ఆ మధ్య మురికి పిల్లకాలువ దాటుతూ జారి అందు లో పడ్డాడు. ఈ మహానుభావుడు. ఏదో అరేబియా సముద్రంలో ఈత కొట్టినట్టు ఫీల్ అయిపోతాడేమిటే.
ఎంకటలక్ష్మి, నేను ఉదయం నిద్రలేవకపోవటంతో
ఆ వంటలు ఏవి చేయను.. అని నిశ్చయంచేసుకుని.. 'సరే హోటల్ లో తినేసి ఊరంతా తిరిగి అందరికీ చెప్పి రాత్రికి సన్మానం అయ్యాక వస్తాను' అని నాకు ప్రొద్దుటే నిద్రలో వినబడేటట్టు అనుకుంటూ ఊపుకుంటూ వెళ్లిపోయాడు. సన్మాన సమయానికి ఫోన్ చేస్తాడట నేను వెళ్ళాలట. కారు పంపుతాడెమో చూద్దాం.. హి హి.. నువ్వు కూడా రెడీగా ఉండవే వెంకటలక్ష్మి.
ఎంకటలక్ష్మి.. ఈ మనిషి నాకు అర్థం అవడం లేదు. ఈయన కథలు రాస్తే ఎంత రాయకపోతే ఎంత ఈ దేశానికి ఏదైనా నష్టం వచ్చి పడుతుందా.
ఆ మధ్య మా వీధిలో ఒక ముసలాడు కళ్ళు తిరిగి పడిపోతే వాళ్లు వీళ్లు వెళ్లి రక్షించారు కానీ మా ఆయన అదే ఈ 50 కథల అందగాడు చూస్తూ అలాగే నిల బడ్డాడు. నేను రచయితను సమాజంలో నాకు విలువ ఉంది, ప్రపంచంలో అందరూ నా కథలు చదువుతారు.. అలాంటి పనులు నేను చేయకూడదు అన్నాడు. రెండు చేతులతో నోరు కాదు అవయవాలన్నీ మూసేసుకున్నాను.
రెండు రోజుల క్రితం రైల్వే స్టేషన్ లో పేదవాళ్లు డబ్బు లు ఇవ్వమని అడిగారు. ఈ అందగాడు జేబులో బోల్డంత చిల్లర ఉండి కూడా ఒక్క రూపాయి విదిలించలేక పోయాడు. పైగా అరగంటసేపు వాళ్లకు లెక్చరిచ్చాడు.. కష్టపడి పని చేసి కడుపు నింపుకోవాలట. కాళ్లు చేతులు లేని వాళ్ళు.. ఏం చేయగలరు పని పాపం వాళ్ళు.
ఇదిగో.. ఎంకటలక్ష్మి.. ఆయన నీకు దారిలో ఎక్కడన్నా కనబడి తన కథలు చదవమని గోల చేస్తుంటే.. నీకు కూడా మా వారు బాగా తెలుసు కనుక నేను చెప్పిన విషయాలు అన్ని అడిగి కడిగి పాడేయ్. మీ వీధి వెంట వెళ్లేటప్పుడు ముఖం మీద కాసిన్ని పేడనీళ్లు జల్లు, ఏం పర్వాలేదు.. నేను ఏమీ అనుకోనులే.
సరే కానీ మీ ఆయనతో నీకు బాగుంటుందా. మహా అదృష్టవంతురాలివి.. ఉంటాను. ''
అంటూ తన కొలీగ్ వెంకటలక్ష్మితో మాట్లాడి తలుపు గట్టిగా గడియ పెట్టి తన పనులలో నిమగ్నం అయి పోయింది సకలసద్గుణవతి.
**
స్వతంత్రకుమార్.. ఫ్లవర్స్ స్టాల్ దగ్గర ఆగాడు.
''ఏమోయ్ శంకరం, ఈరోజు సాయంత్రం ఈఊర్లో నాకు ఘన సన్మాన సత్కారాలు ఉండవచ్చు. 200 పూల దండలు నీకు అమ్మకం కావచ్చు. ఆ తర్వాత నువ్వు నాతో.. ముందుగా కాస్త చెప్పి ఉండవలసింది బాబయ్య.. అంటావని తెలుసున్నవాడివి కదా అని ముందుగా ఈ విషయం ఏదో చెప్తున్నా.. దండలు తెప్పించి రెడీగా ఉంచుకో. బొకేలు కూడా ఓ వంద రెండు వందలు తెప్పించి రెడీగా ఉంచుకో.
ఏదో నీకు ఉపకారం చేద్దామని చెబుతున్నాను కానీ నాకు అసలు నీతో మాట్లాడే అంత తీరుబడలేదు
తెలుసా, వస్తాను'' అంటూ బయలుదేరాడు.
కొంచెం దూరం వెళ్లి గుడి మలుపులో ఆ మెమొంటో లు, శాలువాలు అమ్మే పరంధామయ్య దగ్గరికి వెళ్లి సాయంత్రం తనకు జరగబోయే అతి భారీ సన్మాన సత్కారాల విషయంలో చాలా శాలువాలు ఖర్చు అవ్వవచ్చు అని, అవసరమైతే దూరప్రాంతం నుంచి తెప్పించి రెడీగా ఉంచుకోమని పురమాయించి వెళ్ళిపోయాడు.. స్వతంత్రకుమార్
**
స్వతంత్రకుమార్ ఊర్లో ప్రతి వీధులు, సంధులు, గొందులు అన్ని మొత్తం తిరిగి తనకు తెలిసిన తెలియని ప్రతి ఫ్రెండ్స్కు తాను ఆ విజయవిహారం ఆన్లైన్ పత్రికలో 50 కథలు రాసినట్టు అవి పబ్లిష్ అయినట్టు ఆయాసం వచ్చేలా యాకరువు పెట్టాడు. అతను చెప్పినది ఒకరిద్దరికి తప్పించి 98 మందికి అర్థం కాలేదు. చివరికి ఆ ఊరిలో ఉన్న సమసమాజ స్థాపన అనే స్వచ్ఛంద సంస్థ దగ్గరకు వెళ్ళాడు.
ఆ సంస్థ యజమాని ఘటోత్కచరావుతో ఒకటి రెండు సార్లు మాట్లాడిన పరిచయం ఉంది స్వతంత్రకుమార్ కు. తన పబ్లిష్ అయిన ప్రతి కథ వాట్సాప్ లో అతనికి పంపించి కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకసారి చదివారా నాకథలు అని ఘటోత్కచరావు ని అడిగితే.. ''నువ్వు కథలు పంపించావా.. నేను చూడ లేదే. నేను నా వాట్సాప్ లో ఒక రోజు లోనే డిలీట్ అయిపోయే ఆప్షన్ పెట్టుకున్నాను సుమా మరి '' అంటూ వెళ్లిపోయాడు ఘటోత్కచరావు.
అదిగదిగో ఆమాత్రం పరిచయ భాగ్యం ఉంది కనుక ఆ పరిచయభాగ్యంతో అతని దగ్గరకు వెళ్లి సాయంత్రం ఎలాగైనా అత్యంత భారీ ఏర్పాటుతో ఓ వెయ్యి మంది జనం వచ్చేలాగా పెద్ద గ్రౌండ్లో తనకు సన్మాన సత్కా రాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుదాం అనుకున్నాడు స్వతంత్రకుమార్.
అంతే అతను ఆఫీస్ చేరిపోయి ఈ విషయం అంతా ఏకరు పెట్టి ఓ పది పదిహేను ఫోటోలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వాలని వాట్లను పత్రికలు, ఫేస్బుక్, యూట్యూబ్లకు పంపించి రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే పుస్తకంలో ఒకే సంవత్సరంలో ఏకంగా 50 కథల పబ్లిష్ అయిన మొనగాడుగా, అందగాడుగా, బిల్డప్పు రాయుడుగా పేరు పొందాలని ఆశను వెలవరించాడు.
ఘటోత్కచరావు స్వతంత్రకుమార్ ను కూర్చోబెట్టి నెమ్మదిగా ప్లాస్కోలో టీ తను మాత్రమే కప్పులో పోసు కుని తాగుతూ మొత్తం లెక్కలు కట్టి ఓ పదివేలు ఈ మొత్తం ఖర్చులకు ఇమ్మన్నాడు. కళ్ళు తిరిగి కింద పడ్డాడు స్వతంత్రకుమార్..
''సార్ సార్, రాష్ట్ర చరిత్రలో నేను ప్రత్యేకమైన మనిషిని సార్. మీరు భూతద్దం పెట్టి వెతికి చూసుకోండి. దయ చేసి నేను డబ్బులు కట్టలేను కానీ చాలా సింపుల్గా ఖర్చులేకుండా నాకు సన్మానం చేసేయండి. ఉత్తుత్తి రెండు ఫోటోలు తీసుకుంటే చాలు. చాలా గ్రూపుల్లో షేర్ చేయాలి. మిగతా నా కొలీగ్స్.. వాళ్ళందరూ అదిరి పోవాలి. '' అంటూ ప్రాధేయపడ్డాడు స్వతంత్రకుమార్.
"సాయంత్రం 7:00 వరకు ఉంటే ఆఫీసులో అందరూ వెళ్లిపోయాక నా పాతశాలువా కప్పి, పాతదండ ఒకటి మెడలో వేసి నేను నీకు బొకే ఇస్తున్నట్టు ఫోటో తీసి మళ్లీ ఆ దండ, బొకే తీసేసుకుంటాను. ఇష్టమేనా. " అని అడిగాడు ఘటోత్కచరావు.
ఇక తన ఆశలన్నీ అడియాశలు అయినట్లేనని.. అత్యంత భారీ ఎత్తున 200 పూలదండలతో రెండు వందల శాలువాలతో తనకు సన్మానం జరిగే అవకాశం కించిత్తు కూడా లేదని.. కచ్చితంగా బల్ల గుద్ధి మరి మరీ నిర్ణయం చేసుకున్నాడు స్వతంత్ర కుమార్.
ఇక చివరగా ధాన్యపు మూట లో పెసరబద్ధ అంత ఉపకారం జరిగినా పర్వాలేదని ఘటోత్కచురావు చెప్పిన కండిషన్లకు ఒప్పేసుకున్నాడు.. స్వతంత్ర కుమార్.
సరే సాయంత్రం 7:00 వరకు ఘటోత్కచరావు ఆఫీసు బయట జోడుతూముల మీద కాగితం ముక్కలు పక్కకు జరిపి.. నోటితో ఊఫ్ఊఫ్ అని ఊదుకొని కూర్చున్నాడు స్వతంత్ర కుమార్.
రాత్రి అత్యంత భారీ ఎత్తున కాకపోయినా అత్యంత దిగువ ఎత్తున సన్మానం ప్రారంభమైంది ఘటోత్కచ రావు పర్యవేక్షణలో అతని రూములో స్వతంత్ర కుమార్ కు.
''సార్ సార్, రూమ్ అంతా బూజులు ఉన్నాయి సార్. కింద కూడా కాగితం ముక్కలు. గోడ మీద గీతలు కొంచెం చెరిపేస్తే ఫోటో బాగా అందంగా వస్తుంది కదా..” అంటూ స్వతంత్ర కుమార్ గొనిగాడు.
ఘటోత్కచరావు కసురుకొని ''ఆ పని నేను చెయ్యాలా? నావల్ల కాదు బాబు'' అన్నాడు.
''లేదు సార్! నేను చేసేస్తాను. ఎంతసేపు. ''.. అంటూ తడి గుడ్డతో గోడ మీద గీతలు అన్ని చెరిపేసి చీపిరితో బూజులు అన్నీ దులిపేసి సన్మాన సత్కారానికి సమాయత్తమయ్యాడు స్వతంత్ర కుమార్.
అక్కడ ఇక ఎవరూ జనం లేకపోవడంతో ఆటో మేటిక్ కెమెరాతో ఎలాగోలా రెండు స్టిల్స్ తన కెమెరాలో బంధించుకొని బయటపడ్డాడు స్వతంత్ర కుమార్.
జేబురుమాలు కప్పుకొని మార్కెట్లోంచి గబగబా నడు చుకుంటూ తన ఇంటి దారి పట్టాడు. రోడ్డు మీద స్పీడు గా నడకలాంటి పరుగుతో వెళుతుంటుండగా వెనుకగా ఎవరో వచ్చి అతని నడుం చుట్టూ చేయివేసి గట్టిగా లాక్కుంటూ తన ఫ్లవర్ స్టాల్ దగ్గరికి తీసుకువెళ్లినట్టు అనిపించింది స్వతంత్ర కుమార్ కు. అనిపించడం కాదు నూటికి నూరుడబ్బది పాళ్ళు యదార్థం. అతను ఫ్లవర్ స్టాల్ మేనేజర్ శంకరం.
''ఏమయ్యా.. రైటరు నీ మాట నమ్మి రెండువేల రూపాయలు దండలు తెప్పించాను. ఒక్క దండ ఎవడు కొనలేదు. ఈ దండలు ఎలా ఖర్చవుతాయి. 2000 రూపాయలు కట్టి ఈ దండలన్నీ నీ మెడలో వేసుకుని పట్టు కెళ్ళు. '' అంటూ అరిచాడు.
చుట్టూర జనం పోగడ్డారు. 200 మంది ఉంటారు ఆడ వాళ్లు, మగవాళ్ళు, పిల్లలు కలిసి.
అందులో కొంతమంది ఇలా మాట్లాడుకుంటున్నారు..
'' ఏవో కథలు కాకరకాయలు రాస్తాడట. ఏదో పుస్త కంలో వరుసగా 50 కథలు పడ్డాయట.. రెండు రోజుల నుండి ఊరంతా తిరిగి పెద్ద ఫోజులు కొడుతున్నాడు. ఈయనగారు కథలు రాస్తే మన కేంటి ఉపయోగం. ''
''ఎవడి పిచ్చి వాడికి ఆనందంగాని.. సన్మానం ఏదో ఉందట ఈ రోజు. '''
''ఆ ఉంది ఇదిగో పూలు కొట్టు శంకరం స్పెషల్ సన్మానం చేస్తాడు చూడు. ''
అంతే.. వాళ్ళు అనుకున్నట్టు అక్కడ అతిభారీగా సన్మానం జరిగింది స్వతంత్ర కుమార్కు. పరుగు లంకించు కున్నాడు మాట్లాడకుండా స్వతంత్రకుమార్.. ఏం చేస్తాడు మరి తనదే తప్పంతా..
ఈ సన్మానాల పిచ్చి ఏమిటిరా భగవంతుడా అను కుంటున్నారు అక్కడ చేరిన జనం. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అనుకుంటున్నారు మరి కొంతమంది ఆడ వాళ్లు.
సరే ఒక గండం గడిచింది. ఎలాగైనా ఆ పట్టుశాలు వాలు అమ్మే పరంధామయ్య కంట పడకుండా వెళ్లా లని పక్కనే ఉన్న పెద్దపేపర్ తీసి ముఖానికి అడ్డంగా పెట్టుకుని పరుగు నడకతో నడుస్తున్నాడు స్వతంత్ర కుమార్.
అయితే అనుకోకుండా అతి పెద్ద గాలి వచ్చి ఆ కాగితం ఎగిరిపోవడం శాలువాలు పరంధామయ్య స్వతంత్ర కుమార్ ని చూడడం సినిమాలో లాగా జరిగి పోయాయి.
సినిమాలో ఇదే సన్నివేశం ఓ అత్యద్భుత హాస్య దర్శకుడు తీస్తే ఎలా ఉంటుందో అంతకు వందరెట్లు అమోఘంగా కళగట్టింది శాలువాలు పరంధామయ్య చేసిన స్వతంత్ర కుమార్ సన్మానఘట్టం.
ఇంటికి వచ్చి సింహద్వారం దాటి లోపలికి వచ్చి దబేలున పడబోయాడు స్వతంత్ర కుమార్. కాని గట్టిగా అతని భార్య పట్టుకోవడంతో ఆ సన్నివేశం కూడా బాగా కళగట్టింది.
వచ్చిన భర్తకు గ్లాసుతో నిండా కాకుండా కాసిన్ని మంచి నీళ్లు ఇచ్చింది సకలసద్గుణవతి.
''అదేమిటి ఇంట్లో మంచినీళ్లు కూడా లేవా''. తలకాయ
పైకి ఎత్తకుండా ప్రశ్నించాడు భార్యను స్వతంత్ర కుమార్.
'''ఉన్నాయి కానీ నేను చెప్పేదంతా విన్నాక గ్లాసుడు మంచినీళ్లు కాదు బిందెడు ఇస్తాను. గట గట తాగే ద్దిరి గాని. ఇదిగో ఇందాక ఆ విజయ విహారం పత్రిక నుంచి ఎవరో శంకరం గారంట. మీరు ప్రతి పత్రిక వాళ్లకు మీ నెంబరు నా నెంబరు కూడా ఇవ్వటంతో ఆయన నాతో మాట్లాడడానికి అవకాశం కలిగినట్టుంది. వాట్సాప్ లో మాట్లాడాడు. కుర్రోడు బుద్ధిగా బుజ్జిగా ఉన్నాడు బాబు. ఆయన ఏమన్నాడంటే.. ఏమ్మా మీ ఆయనకు లెక్కలు సరిగ్గా రావా.. ఒకే పత్రికలో 50 కథలు రాసేసాను.. 50 కథలు రాసేసాను అని అన్ని గ్రూపుల్లోను ఊదరకొడుతూ డబ్బా కొడుతున్నాడు. మరి అంత అబద్ధాలకోరు ఏమిటమ్మా నీ మొగుడు. ''
అంటూ చివాట్లు పెట్టాడు.
ఆయన తన పత్రికలో గతంలో మీరు రాసిన కథలు మొత్తం లెక్కపెట్టాడట. 49 వచ్చాయట. మిమ్మ ల్ని బాగా లెక్కలు నేర్చుకోమని పెద్ద లెక్చరు ఇచ్చాడు. సరేనండి.. నేను ఆయనకు చీవాట్లు పెడతాను అంటే ఊరుకోడే. నువ్వు పెట్టడం కాదమ్మ నేను పెట్టిన చీవాట్లు ఆయన చేత తినిపించు.. అన్నాడు. సిగ్గేసేసింది బాబు.
మరో ఆటంబాంబు లాంటి విషయం చెప్పమంటారా.. వినండి మొగుడు మహాశయా. అదే విజయ విహారం పత్రికలో.. చిట్టి చిలక.. అనే కలం పేరుతో ఒకావిడ కథలు రాస్తుంది. మీకు తెలుసా?'' ప్రశ్నించింది సకల సద్గుణవతి.
''తెలియకపోవడం ఏమిటే బాబు ఆవిడ చాలా సీనియర్'' చెప్పాడు స్వతంత్ర కుమార్.
''మరి అదే.. ఆవిడ అదే పత్రికలో 60 కథలు రాసిందటండి. ఈ ఒక్క సంవత్సరంలోనే. ఇప్పుడే మన ఇంటికి వచ్చి నెట్ లో నుంచి ప్రింట్ అవుట్ తీసిన 60 కథలు నాకు చూపించింది'' అంది సకల సద్గుణవతి భర్త స్వతంత్ర కుమార్ తో
''హాయ్ బాబోయ్ అంత గొప్ప ఆవిడ మన ఇంటికి వచ్చిందా? నాకన్నా ఎక్కువ 60 కథలు రాసిందా? నేనసలు ఊహించలేదు సుమీ. ''
''సుమీయే సుమీ.. ఇంతకీ.. ఆవిడ ఎవరనుకుంటున్నారు. మీరు అస్తమానం మన ఇంటికి వస్తుంది పని పాట లేదావిడకి రానివ్వకు అంటూ చిరాకు పడేవారు కదా.. మా ఫ్రెండు ఎంకటలక్ష్మి.. ఆవిడే.. మన పక్క వీధిలో ఉంటుంది కదా.. ఆవిడే ఈ చిట్టి చిలక.. అట. ఇప్పటివరకు నాకు కూడా తెలియదు సుమీ.
మొగుడుగారు దీన్ని బట్టి మీకు ఏమి అర్థమైంది. సమాజం గురించి మీరు కథలు రాయండి.. ఒకటి రాసిన చాలు. నా పెళ్లయిన దగ్గర నుండి చూస్తున్నాను, ప్రతి నెల మీకే ప్రైస్ లు, మీకే సన్మానాలు. మిగిలిన వాళ్ళు ఏమైపోవాలండి. జూనియర్స్ ను ఎదగనివ్వరా మీరు. కొత్త నీరు రావడం మీకు ఇష్టం లేదా.
ప్రైజులు మీకే రావాలని మీ పేరు మారుమోగిపోవాలని ఎన్నాళ్లు ఉబలాటం. ఎన్నో వందలు కథలు రాసి పాడేశానని ఈ డబ్బా కొట్టుకోవడం దేనికి అన్న పాయింట్ అర్థం అవటం లేదా మీకు. మీరు మంచి కథలు రాయండి మహాశయ అంతవరకే.. ప్రైజు మీకు ఇవ్వకపోతే ఆ ఎడిటర్ల మీద అలగటం, ముక్కు మూడు వంకర్లు తిప్పుకోవటం చాలాసార్లు చూశాను నేను మిమ్మల్ని.
ఇంకో ఆటంబాంబు పేల్చమంటారా. గతంలో.. అంటే మీ పెళ్లి అవని క్రితం "లాలూచీ " అనే ఒక పత్రిక ఉండేది గుర్తుందా.. దాని ఎడిటర్.. సస.. ఎవరు ఈ సస.. అంటూ అందరూ ఆశ్చర్యంగా అనుకునేవారు.. ఇంకెవరూ మీ సకల సద్గుణవతియే ఆ సస.
ఇదిగో నేను ఎడిటర్ గా పని చేసినప్పుడు ప్రతిసారి కథలు పోటీలు పెట్టి ఒకరికే ప్రైస్ ఇస్తుంటే ఏదో లాలూచి పడ్డాం అను కుంటారని సీనియర్స్ కథలు బాగున్నా వాళ్ళని పక్క నపెట్టి మిగిలిన వాళ్ళకి బహుమతులు ఇచ్చేదాన్ని. దాంతో ఆ సీనియర్స్ మూతి 14 వంకరలు తిప్పుకునేవారు. పీత కష్టాలు పీతవి అన్నట్టు అప్పట్లో బోల్డ్ కష్టాలు పడే దాన్ని మీకేం తెలుసు.
పెళ్లికి ముందే ఈ విషయాలన్నీ మీకు చెబితే కథలు రాయడం విషయంలో రోజూ సహాయపడమని నా ప్రాణం తీసేస్తారని ఇప్పటివరకు చెప్పలేదు సుమీ.
ఇప్పుడైనా అలాంటి అతిపనులు మానేసి.. మేధావి స్వతంత్ర కుమార్ గారు.. స్వామి.. సమాజం కోసం కథలు రాయండి చాలు. సన్మానాలు చేయించుకుంటూ ఈ ప్రపంచానికి మీరు కనపడక్కర్లేదు మహాశయా.. మీ కథలు కనపడాలి. ఒక సన్మానం చేయించుకున్న 100 సన్మానాలు చేయించుకున్న ఒకటే కదా. ఈ సన్మానాల పిచ్చి ఇకనైనా వదిలిపెట్టండి. లేకపోతే మీకు పోటీగా నేను కథలు రాయడం మొదలు పెడ తాను బాబు.
ఇందాక మంచినీళ్లు కూసినే ఇచ్చావు ఇంట్లో లేవా ఏమిటి అని అడిగారు కదా.. ఇదిగో మర చెంబుడు నీళ్లు అంతా విన్న తర్వాత తాగగలిగితే గబగబా తాగేయండి. ''
అంటూ తస్మాత్ జాగ్రత్త అంటూ పోజు పెట్టుకుంటూ
వంటింట్లోకి వెళ్లిపోయింది సకలసద్గుణవతి. ఓ అర్ధ గంటకు ఈ లోకంలోకి వచ్చి ప్రస్తుత పరిస్థితి గ్రహించిన ద గ్రేట్ రైటర్ స్వతంత్ర కుమార్ తన తల కిందకు కాళ్లు పైకి ఉన్నట్టు మాత్రం గ్రహించగలిగాడు.
****
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
コメント