top of page

సన్నాయి మేళం



'Sannayi Melam' - New Telugu Story Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 11/07/2024

'సన్నాయి మేళం' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


"సార్!.. " 


ఆ పిలుపు విన్న గణపతిరావు.. తలుపు తెరిచి నేరుగా చూచాడు. 

"ఎవరండీ?" అడిగాడు. 


"నమస్కారం సార్! నాపేరు పానకాలరావు సార్! టు లెట్ బోర్డును చూచాను"


"అలాగా!"


"అవునండీ. "


"ఇల్లు కావాలా?"


"అవును సార్. "


"పేరేమిటి?"


"చెప్పాను కదా పానకాలరావు సార్. "


"పెళ్ళయిందా?"


"అయ్యింది సార్. "


"అయితే సంసారివి అన్నమాట!"


"అన్నమాటే కాదుసార్!.. అదే వున్నమాట" చిరునవ్వుతో చెప్పాడు పానకాలరావు. 


"మందేవూరు?"


"సార్.. "


"ఆఁ.. "


"మీవూరా.. మా వూరా!" నవ్వుతూ అడిగాడు పానకాలరావు. 


"ఆహా!.. పానకాలూ.. మంచి సరదామనిషివే!.. అదే మీ వూరు ఏదయ్యా!"


"అనకాపల్లి. "


"ఏ అనకాపల్లి?"


"విశాఖపట్నం దగ్గర అనకాపల్లి. "


"అనకాపల్లిలో ఆవగింజల అంజయ్య తెలుసా! వారు నా మిత్రులు"


" తెలియకపోవడమేమిటి సార్! వారు మా అమ్మ అన్నయ్యగారు"


"అంటే నీకు అంజయ్య మేనమామ అన్నమాట. "


"అవునండీ!"


"మరి మీ భార్యది ఏవూరు?"


"ఆవగింజల అంజయ్యగారి పెద్దకూతురు సౌదామిని నా భార్యండి. "


"అంటే.. మేనమామ కూతుర్నే పెళ్ళిచేసుకొన్నావన్నమాట. "


"అవునండీ”. 


“ఆ.. నా పేరు గణపతిరావు. నా భార్య పేరు శకుంతల. అవునూ నీకు పిల్లలెంతమంది?"


"పెండ్లయ్యి మూడునెలలే సార్. "


"ఓహో ఇంకా పిల్లలు పుట్టలేదా?"


"పెండ్లయ్యి మూడునెలలే సార్! చెప్పానుగా. "


"అవునవును చెప్పావుగా. "


"అవునుసార్!"


"ఆ.. అదైందా?"


పానకాలరావుకు అర్థం కాలేదు. ఆశ్చర్యంతో గణపతిరావు ముఖంలోనికి చూచాడు. 

"మీరేమడిగారుసార్!.. "బిక్క ముఖంతో మెల్లగా అడిగాడు పానకాలరావు. 


"ఏంది నేనడిగింది నీకు అర్థం కాలేదా!"


లేదు.. అన్నట్లుగా తలాడించాడు పానకాలరావు. 


"ఓరి అమాయకుడా.. "


"అవును సార్. "


"ఆ.. అవునా! ఓరి పిచ్చోడా.. నేను అడిగింది నీ శోభనాన్ని గురించి" విచిత్రంగా నవ్వాడు గణపతిరావు. 


అప్పటికి విషయం అర్థం అయ్యింది పానకాలరావుకు. 

చిరునవ్వుతో "అయ్యింది సార్.. ఇల్లును చూపిస్తారా?"


"ఓ.. దానికేం నాతో రా. "


ఇరువురూ ఇంట్లోనికి నడిచారు. 


వరండా, హాలుదాటి మరోగది (వారి పడకగది) లో ప్రవేశించారు. ఒక గోడకు ద్వారం వుంది. తలుపు మూసి తాళపు బుర్రవేసి ఉంది. 


అలమరాలో వున్న తాళాన్ని చేతికి తీసుకొని తలుపుకు వున్న బుర్రను తీశాడు. ఆ తలుపుకు రెండు రెక్కలు తెరిచాడు. ఆ పోర్షన్ లోనికి ప్రవేశించాడు గణపతిరావు. 


"ఆ.. రా పానకాలూ!.. రా.. " పిలిచాడు. 


పానకాలరావు ఆ పోర్షన్‍లోనికి ప్రవేశించాడు. ఆ పోర్షన్‍లో అది పడకగది. దానికి ముందు హాలు, దానిముందు వరండా, ఆగ్నేయ మూలంలో వంటగది, దాని ప్రక్కన బాత్‍రూం లెట్రిన్ (బెడ్ రూముకు ఒక వైపున) అన్నీ క్రమంగా ఉన్నాయి. 


"ఇంటిని చూడు పానకాలూ" అన్నాడు గణపతిరావు. 


అంతా పరీక్షగా చూచాడు పానకాలరావు. 


"ఏం పానకాలూ!.. ఇల్లు నచ్చిందా?"


"బాగుంది సార్! అద్దె ఎంత?"


"వేరెవరికైనా అయితే ఏడువేలు. నీవూ మావాడివైపోయావ్ కనుక నీకు ఆరువేలకు ఇస్తాను. ఐదునెలల అద్దె అడ్వాన్స్. "


"సార్!.. "


"ఏమిటి సందేహం? మీకు సబ్‍మీటర్ వరండాలో వుంది గమనించావా. "


"లేదు సార్"


"అవునూ నీవు ఇంతకీ ఏం పని చేస్తావ్?"


"పోలీస్"


ఆ మాట వినగానే గణపతిరావు ఉలిక్కిపడ్డాడు. 

"నీవు పోలీసువా!"


"సబ్ ఇన్స్ పెక్టర్‍ని సార్. "


"అలాగా!"


"అవును సార్! నాలుగు రోజుల క్రిందట ప్రమోషన్‍తో ఈ వూరికి ట్రాన్సఫర్‍లో వచ్చాను"


"ఓహో!" 


’ఇతను పోలీస్ ఇన్స్ పెక్టర్. ఇలాంటివాడు మన ఇంట్లో కాపురానికి వుంటే చుట్టుప్రక్కల వాళ్ల దృష్టిలో మనకు మంచి గౌరవం మర్యాద ఏర్పడుతుంది. ఇతడికి ఇల్లు అద్దెకి ఇవ్వడం చాలా మంచిది’ అనుకొన్నాడు గణపతిరావు. 


"సార్!"


"ఏమిటి సార్"


 గణపతిరావు సంబోధనకు పానకాలరావు ఆశ్చర్యపోయాడు. 

’నేను సబ్ ఇన్స్ పెక్టర్‍ని అని వినగానే మనకు వారి దృష్టిలో మర్యాద పెరిగింది’ అని నవ్వుకొన్నాడు పానకాలరావు. 


"సార్!"


"అడగండి సార్"


"ఇంట్లోకి ఎప్పుడు వస్తారు?"


"సార్! ఈరోజు బుధవారం. వీకెండ్‍లో వూరికెళ్ళి నా భార్యను తీసికొని వస్తాను. సోమవారం మంచిరోజు ఆ రోజు మీ ఇంటికి వచ్చేస్తాం మీరేమంటారు?"


"నేను అనేదానికేముంది సార్! పరమానందం" క్షణం తర్వాత "మరి అడ్వాన్స్.. "


పానకాలరావు ప్యాంట్ జేబులోనుంచి పర్స్ తీసి, ఇరవైవేలు లెక్కపెట్టి గణపతిరావుకు ఇచ్చాడు. 

"మిగతా పదివేలు సోమవారం ఇంట్లోకి రాగానే ఇస్తాను సార్. గోడల రంగులన్నీ బాగున్నాయి. నేలను ఒకసారి చిమ్మించండి సార్" అభ్యర్థనగా చెప్పాడు పానకాలరావు. 


"అలాగే.. అలాగే.. సార్!" డబ్బులు జేబులో పెట్టుకొంటూ చెప్పాడు గణపతిరావు. 


"సార్!.. చిన్న సందేహం?" అడిగాడు పానకాలరావు. 


"అడగండి సార్"


"ఇంట్లో మీరొక్కరే వుంటున్నారా? భార్యా పిల్లలు.. " పానకాలరావు పూర్తిచేయకమునుపే.. 

"సార్! నాకు వివాహం అయ్యి ఎనిమిదేళ్ళయ్యింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. మా ఆవిడ వారి అమ్మగారికి అనారోగ్యంగా వుందని పదిరోజులనాడు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. వారంరోజుల్లో వచ్చేస్తుంది. "


"ఓ అలాగా!.. "


"అవును సార్.. "


"ఓకే.. సార్! నేను వెళ్ళి వస్తాను. నమస్తే.. " చేతులు జోడించి పానకాలరావు వేగంగా ఇంట్లోనుంచి బయటికి నడిచాడు. 


గణపతిరావు భార్యను తలచుకొంటూ ఇంటితాళం వేసి తన స్వీట్ షాపుకు బయలుదేరాడు. 

  *

ఆరోజు సోమవారం. పానకాలరావు అతని భార్య సౌదామిని, గణపతిరావు ఇంట్లో ప్రవేశించి, పాలుకాచి, నవగ్రహ పూజను పురోహితులతో ఘనంగా జరిపించారు ఉదయం తొమ్మిది గంటల లోపల. పదిన్నరకు లారీలో సామానంతా వచ్చేసింది. భార్యాభర్తలు ఇరువురూ కలిసి అన్ని వస్తువులను ఇంట్లో క్రమంగా సర్దుకున్నారు. పూజకు హాజరైన తరువాత గణపతిరావు దుకాణానికి వెళ్ళాడు. 


"బావా!.. "


"ఆ చెప్పు సౌదా.. "


"అన్నీ బాగానే వున్నాయి కానీ ఈ బెడ్‍రూములో ఆ గోడకు మరో తలుపు ఎందుకు పెట్టినట్లు?" అడిగింది సౌదామిని. 


"ఓ.. అదా!.. ఈ బెడ్ రూములో యింటివారి పిల్లలు పడుకొనేదానిగా ఆ తలుపు పెట్టి వుంటారు. "


"ఇంటి ఓనర్ పూజకు వచ్చాడు. వారి సతీమణి రాలేదేం?"


"ఆవిడ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందట"


"అలాగా"


"అవును.. "


"వారికి ఎందరు పిల్లలు?"


"ఇంకా పుట్టలేదట!"


"ఆ.. " ఆశ్చర్యపోయింది సౌదామిని. 


"వారికి వయస్సు దాదాపు నలభై సంవత్సరాలు వుండొచ్చు. అంటే వారి అర్థాంగి వయస్సు ముఫ్ఫై నాలుగు.. ముఫ్ఫై ఐదు వుండవచ్చునుగా"


"ఆ.. అయ్యిండవచ్చు"


"అంటే దాదాపు వారి పెండ్లి అయ్యి పది సంవత్సరాలు అయ్యుండొచ్చు. ఇంకా పిల్లలు పుట్టలేదంటే వారికి ఏదో ప్రాబ్లమ్ వుండి వుంటుంది కదా. "


"అవునవును.. రేపు గణపతిరావును అడుగుతాను. "


"తప్పకుండా అడగండి"


"చూడు.. ఇప్పుడు వారి సంగతి మనకెందుకు? మా అమ్మ చెప్పింది.. "


"ఏమని?.. "


"వచ్చే సంవత్సరంలో మనం ఆమె చేతిలో మనుమడినో.. మనుమరాలినో పెట్టలట. అంటే.. " నవ్వాడు పానకాలరావు. 


"ఆ.. అది నా చేతిలో లేదు.. నీ చేతిలోనే వుంది!" ఓరకంట నవ్వుతూ చూస్తూ వంటగదిలోకి వెళ్ళింది సౌదామిని. 


ఆ రాత్రి.. శయనం.. 

మంచం కిర్రుకిర్రుమంది.. రెండుమూడు సార్లు.. 


ప్రక్క పోర్షనులో వున్న గణపతిరావు ఆ శబ్దాన్ని విన్నాడు. అతని మనస్సులో ఏదో ఆరాటం.. తన మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ నడిరాత్రి తరువాత నిద్రపోయాడు. 

  *

ఆ మంచం శబ్దం.. పానకాలరావుకు అప్రశాంతతను కలిగించింది. మరురోజు సాయంత్రం వచ్చేటప్పుడు టేప్ రికార్డరును కొన్ని క్యాసెట్లను తెచ్చాడు. భోజనానంతరం ఇరువురు శయ్యనలంకరించగానే టేప్ రికార్డరులో మంచి నాదస్వరం కచ్చేరీ క్యాసెట్ వేశాడు. వీనుల విందుగా ఆ సంగీతాన్ని వింటూ పానకాలరావు సౌదామినీలు వీరవిహారం చేశారు. 


ప్రక్క ఇంట్లోని గణపతిరావుకు మంచం కిర్రుకిర్రు చప్పుడు వినిపించలేదు. నాదస్వరం డోలు, వాయిద్యాలు చెవులకు ఎంతో శ్రావ్యంగా వినిపించాయి. అతనికి ఆ వాయిద్యాలంటే చాలా ఇష్టం. ఆనందంగా వింటూ నిద్రపోయాడు. 


ఉదయం బ్రష్ చేసుకొంటూ గణపతిరావు పానకాలరావు వాకిట్లో కలిశారు. 

"సార్!"


"ఆ.. చెప్పండి. "


"మీరు రాత్రి పెట్టిన నాదస్వర కచ్చేరి అద్భుతం సార్. నాకు ఆ వాయిద్యాలంటే చాలా ఇష్టం. ఆనందంగా వింటూ నిద్రపోయాను. రాత్రి పొద్దుపోయాక మా ఆవిడ వచ్చింది సార్!"


"అలాగా!.. "


"అవును.. మార్గమధ్యలో బస్సు చెడిపోయిందట. రిపేర్ చేసేటప్పటికి ఆలస్యం అయిందట"


"ఎన్ని గంటలకు వచ్చారు?"


"వేకువనే మూడు గంటలకు. "


"అప్పుడు నేను మంచి నిద్రలో వున్నాను. అవును మీకు వివాహం అయ్యి ఎంతకాలం అయ్యింది."


"ఎనిమిది సంవత్సరాలు అయ్యింది సార్! లేట్ మ్యారేజ్!"


"పిల్లలు.. !?"


"ఇంకా లేదు" విచారంగా చెప్పాడు గణపతిరావు. 


"ఏమండీ!.. ఎంతసేపు పళ్ళు తోముతారు?.. అవి ఊడిపోతాయేమో!" గర్జింపు స్వరం. 

గణపతిరావు ఉలిక్కిపడ్డాడు. 


"వస్తాను సార్! నా భార్య పిలుస్తుంది" వెకిలిగా నవ్వుతూ యింట్లోకి పరుగెత్తాడు గణపతిరావు. 


పానకాలరావు కాసేపు అటూ ఇటూ పచారు చేస్తూ పళ్ళు తోముకొని ఇంట్లోకి ప్రవేశించాడు. స్నానం, టిఫిన్ ముగించి డ్రస్ చేసికొనేదానికి బెడ్‍రూములో ప్రవేశించాడు. సౌదామిని వంట ఇంట్లో కూరలు తరుగుతూ ఉంది. 


"ఇదిగో నా వైపు చూడండి. మా అమ్మ నన్ను లేడీ డాక్టర్‍కు చూపించింది. నాలో ఏ లోపమూ లేదని డాక్టర్ చెప్పింది. సమస్య ఏదో మీలోనే వుందట. మంచి డాక్టరుకు చూపించుకోండి. మీతోటే రమ్మంటే నేనూ వస్తాను. ఈ మాటను నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా.. దున్నపోతు మీద వానకురిసినట్లుగా ఉంది. కానీ మీలో చలనం లేదు. మీరు నామాట వినకపోతే.. !"


"సరే సరే!.. చాలు.. ఇంక చాలు. ప్రక్కపోర్షన్‍లో మనుషులున్నారే వారు వింటే మన.. "


"పరువు పోతుందంటారు.. అవునా!?.. " 


"అవును కదే!.. స్వరాన్ని తగ్గించు.. తగ్గించు" ప్రాధేయపూర్వకంగా చెప్పాడు గణపతిరావు. 


వారి సంభాషణ సాంతం పానకాలరావు విన్నాడు. అతనికి గణపతిరావు భయస్తుడని తెలిసిపోయింది. ఆ విషయంలో గణపతిరావుకు సాయం చేయాలని నిర్ణయించుకొన్నాడు. 

  *

సాయంత్రం ఏడుగంటలకు తన బులెట్‍పై నాలుగుమూర్ల మల్లెపూలతో పానకాలరావు ఇంటికి వచ్చాడు. వరండాలో వున్న శకుంతల అతని చేతిలోని మల్లెపూలను చూచింది. ’హు.. నాకూ వున్నాడు పేరుకు ఒక మొగుడు. మొగుడు కాదు మొద్దు. కొంపకు రావడమే తొమ్మిదిన్నర పదికి. ఏనాడైనా తానుగా తెచ్చి మల్లెపూలను ’శకుంతలా పూలు’ అని ఇచ్చాడా!.. మొగవాడంటే ఆ పోలీసులా వుండాలి. ఆ పిల్ల ఎంత అదృష్టవంతురాలో!!’ విచారంగా అనుకొంది శకుంతల. 


సమయం రాత్రి పదిన్నర పానకాలరావు పోర్షన్‍లో సన్నాయి మేళం ప్రారంభమయ్యింది. 


అప్పుడే భోజనం చేసి మంచంమ్మీద వాలిన గణపతిరావు కళ్ళు మూసుకొని ఆ సంగీతాన్ని వింటూ చేతిని ఆడిస్తా తాళం చేస్తున్నాడు. 


ఆ దృశ్యాన్ని శకుంతల చూచింది. బక్కెట్‍తో చన్నీళ్ళు తెచ్చి కళ్ళుమూసుకొని నాదస్వరం కచ్చేరిని వింటున్న గణపతిరావు తలపై పోసింది. 


ఉలిక్కిపడి, అదిరిపోయి లేచి కూర్చున్నాడు గణపతిరావు. 

"ఇదేమిటే.. చన్నీళ్ళు నెత్తిన పోశావ్.. " దీనంగా అడిగాడు. 


అతనికి భార్య ఆవేశానికి కారణం అర్థం అయ్యింది. 

మంచం దిగి స్టాండును సమీపించి టవల్‍ను తీసుకొని తల తుడుచుకోసాగాడు. 


"రేపు మీరు డాక్టరు గారి వద్దకు వెళ్ళకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇక ఈ జన్మలో తిరిగిరాను" బెదిరించింది శకుంతల. 


’పక్కింటి పానకాలరావు చాలా మంచివాడు. నా దీనచరితను వారికి తెలియజేసి డాక్టరు దగ్గరకు నాతో రావలసిందిగా కోరుతాను. డాక్టరుకు చూపించుకొంటాను’ అనే నిర్ణయానికి వచ్చాడు గణపతిరావు. 


"చూడూ!.. రేపు నేను డాక్టరు వద్దకు వెళుతున్నాను. ఈ నా మాట సత్యం" భార్య తలపై తన కుడిచేతిని వుంచాడు. 


శకుంతల ఆశ్చర్యంతో అతని ముఖంలోకి చూచింది. 

మరుదినం.. సబ్ ఇన్స్ పెక్టర్ బయలుదేరేటప్పుడు.. అతన్ని సమీపించాడు గణపతిరావు. 

"ఏం రావుగారూ!.. "


"నేను మీతో వస్తాను సార్!"


"సరే రండి!.. " చిరునవ్వుతో చెప్పాడు పానకాలరావు. 


సౌదామిని వాకిట్లోకి వచ్చింది. భర్తకు ’టా.. టా’ చెప్పింది. 

పానకాలరావు, గణపతిరావు బులెట్‍పై బయలుదేరారు. 


మార్గమధ్యంలో గణపతిరావు తన సమస్యను, నిర్ణయాన్ని పానకాలరావుకు తెలియజేశాడు. 

"విషయం నాకు అర్థం అయ్యింది సార్. మీరు షాపును నాలుగున్నరకు మూసి మా స్టేషన్ దగ్గరికి రండి. నేను మిమ్మల్ని మంచి డాక్టరు దగ్గరకు తీసుకొని వెళతాను. సరేనా!" నవ్వుతూ అడిగాడు పానకాలరావు. 


"ధన్యవాదాలు సార్!.. అదే నా షాపు.. దిగుతాను" చెప్పాడు గణపతిరావు. 


పానకాలరావు బులెట్‍ను ఆపాడు. గణపతిరావు దిగి సెల్యూట్ కొట్టాడు. 

కాలచక్రంలో ఆరుమాసాలు గడిచిపోయాయి. గణపతిరావు డాక్టర్ ఇచ్చిన మందులను శ్రద్ధగా వేసుకొన్నాడు. శకుంతల అతన్ని ఎంతో ప్రేమగా చూచుకోసాగింది. 


ఆ రోజు ఉదయం.. 

పానకాలరావు బులెట్‍ను సమీపించాడు. 


"బావా!.. " పిలిచింది సౌదామిని. 


"ఆ.. ఏమిటి?"


అతనికి దగ్గరగా వచ్చి "టూ మ్యాంగోస్ ప్లీజ్" చిరునవ్వుతో సిగ్గుతో చెప్పింది సౌదామిని. 


"ఓకే డన్!.. " విషయాన్ని అర్థం చేసుకున్న పానకాలరావు నవ్వుతూ చెప్పాడు. 


తన వరండాలోనికి వచ్చిన శకుంతల ఆ మాటను విన్నది. విచిత్రంగా సౌదామిని ముఖంలోకి చూచింది సౌదామిని ఇంట్లోకి వెళ్ళిపోయింది. 


శకుంతలకు.. 

వాంతి వస్తున్న ఫీలింగ్.. ఇంట్లోకి పరుగుతీసింది. వాంతి చేసికొంది తన కడుపు తాకి చూచుకొంది. షాప్‍కు ఫోన్ చేసి.. "రావుగారు వచ్చేటప్పుడు నాలుగు పచ్చిపుల్లని మామిడికాయలను తీసుకురండి" చెప్పింది ఆనందంగా నవ్వుకొంటూ శకుంతల. 

***

సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



48 views1 comment

1 Comment


మంచి కథ...ఆసక్తికరంగా మలిచారు

Like
bottom of page