'Santhamu Leka Soukhyamu Ledu' - New Telugu Story Written By Vijayasundar
Published In manatelugukathalu.com On 29/06/2024
'శాంతమూ లేక సౌఖ్యము లేదు!' తెలుగు కథ
రచన: విజయా సుందర్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
'అవును నాయనా శాంతమూ లేక సౌఖ్యము లేదు.. తెలిసినా ఏమీ చేయలేని ఆశక్తుడ్ని'! రేడియోలో పాట విని, విశ్వం విరక్తిగా తల పంకించాడు;
వంటింట్లోనించి దూసుకొస్తున్న అత్తా,. కోడళ్ల ఆనవాయితీ మాటల తూటాల్నించి ఏ రకంగా శాంతం లభిస్తుందా అని !
"ఎన్నిసార్లు చెప్పాను.. పాలు కాచే ముందు ఒక చిన్న గ్లాసుడు అభిషేకానికి తియ్యమని? నేనక్కడ తగలడి చెప్పకపోతే అంతే! ఏం అంత మరుపు.. మరుపు కాదులే ఈవిడ మాట వినేదేమిటని!"
అత్తగారి సన్నాయి నొక్కులకి మొదట్లో కాస్త ఊరుకునేది. సుగుణ.. పెళ్ళయ్యి.. ఐదేళ్ళయ్యి.. ఇద్దరు పిల్లల తల్లయినా ఇంకా ఏదో ఒకటి సాధిస్తుంటే.. ఈ మధ్య బాగా ఎదురు తిరుగుతోంది!
"కావాలని ఎందుకు చేస్తానండీ.. ఎప్పుడన్నా ఒక రోజు చెయ్యక పోతే రోజూ చెయ్యనట్లే అనేస్తారు. మీకు పూజ ఒక్కటే పని.. మరి నాకో వంట, టిఫిను, కాళ్ళకీ చేతులకి అడ్డం పడే పిల్లలు.. మధ్య మధ్యలో మీ అబ్బాయి పనులు"
"మేమూ చేసాము ఇంతోటి కాపురాలు.. చాల్లే సంబడం. మా వాడికి నువ్వేం చేస్తున్నావు.. సగం పని వాడి చేతే చేయించుకుంటూ, పెద్ద చెప్పొచ్చావు? అయినా 60ఏళ్లదాన్ని, నేను పని చెయ్యలేదన్న ఏడుపెందుకూ?"
"ఇక్కడ ఎవరూ ఏడవట్లేదు.. నిండింట్లో ఏడుపుల ఊసేమిటండీ? అన్నానంటే.. అన్నానంటారు.. మీరు పెద్దవారయ్యి, ఇలా"
"ఆ పెద్ద.. తగలబడ్డట్టే ఉన్నది నా పెద్దరికం.. మాటకి మాట.. నీటికి నాచు తెగులని, నీ నోట్లో నోరు పెట్టా చూడు.. "
"అనేవన్నీ అనేసి.. ఇంక ఏడుపులోకి దిగుతారు.. అక్కడికి నేనేదో మిమ్మల్ని తిట్టేసినట్లు! " కళ్ళు తుడుచుకుంటున్న అత్తగార్ని మిర్రిమిర్రి చూస్తూ, విసురుగా వెనక్కు తిరిగిన సుగుణ,. మౌనంగా పాల పాకెట్ తల్లి చేతికిస్తున్న, భర్త వేడి కోలు చూపులకి తన వాగ్ధాటి తగ్గించి, విసవిసా వెళ్లిపోయింది అక్కడ్నించి!
'సుగుణ చెడ్డదేమీ. కాదు.. అమ్మయినా చిన్న చిన్న విషయాలు పెద్దవి చెయ్యకుండా ఊరుకోవచ్చు.. పోనీ సుగుణ పెద్దావిడ కదా పోనీలే అనుకోవచ్చు.. మళ్లీ ఇద్దరూ విడిగా బానే మాట్లాడుకుంటారు. అదిగో ఏమన్నా మాట వస్తే పందెం కోళ్లే!.. ఎవరినన్నా అంటే రెండోవాళ్ళు తనమీద ధ్వజమెత్తుతారు. వాళ్లిద్దరూ బానే ఉన్నారు.. నేను ఎంత శాంతంగా ఉన్నా.. లోపల్లోపల ఎప్పుడు ఈ గొడవలు పెద్దవి అవుతాయో అని హడలి పోతున్నాను.. విశ్వం ఏదో ఒకటి చెయ్యాలనే నిశ్చయానికి వచ్చి.. ఏదో నిర్ణయం అమలు చేయడానికి లేచాడు!.
ఎన్నడూ లేనిది, వారానికో సినిమా, పిల్లలతో రెండుసార్లు హోటల్ కీ.. సుగుణకి భర్త ధోరణి అర్ధం కావట్లేదు.
ఆలోచనల్లో ఉండగానే ఆటో తన పుట్టింటి ముందు ఆగింది. ఆశ్చర్యపోతూ.. "ఇదేమిటీ. ఇక్కడికి ఎందుకిప్పుడు?"
అంటున్న భార్యని నవ్వుతూ చూసి, "అదేమిటీ.. మీ పుట్టింటికేగా వచ్చింది.. నీకు సర్ప్రైజ్! ఎప్పుడూ బాధపడతావుగా, ఇంట్లో చాకిరీ, ఉద్యోగంలో చాకిరీ అని. మీ ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పా అర్జంట్ అవసరం వచ్చింది.. రేపు లీవ్ లెటర్ తెచ్చి ఇస్తానని. ఒక వారం రోజులు హాయిగా ఉండి రా. "
మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లోపలికి దారి తీసాడు విశ్వం! ముందే చెప్పినట్లున్నాడు, అమ్మా, నాన్న, అన్నయ్య వదినెలు ఎవ్వరూ కంగారు పడలేదు ఉన్నట్లుండి వచ్చానని. కాస్సేపు కూర్చుని పనున్నదని
విశ్వం వెళ్ళిపోయాడు. !
"అదేమిటీ సుగుణ, పిల్లలు ఏరీ. ?". వాకిట్లోకి అడుగుపెట్టగానే తల్లి ఆడిగిన దానికి, విషయంచెప్పాడు, విశ్వం! ఆవిడ నోరెళ్ళబెట్టింది!.
"అమ్మా! నేను ఆఫీసుకి వెళ్లి రావాలి ఓసారి"
"ఇవాళ ఆదివారం ఆఫీసేమిటీ?”
"కొంచె పనుందిలే"
ఏమాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్లి పోతున్న విశ్వం వైఖరి శాంతమ్మ గారికి అంతుపట్టలేదు!
సుగుణ ఫోన్ చెసినా, తను సుగుణకి చేసినా ముక్తసరిగా మూడే ముక్కలు, పిల్లలవి, సుగుణవి యోగ క్షేమాలడగటం పెట్టేయడమూను. సుగుణకి పిచ్చెక్కి పోతోంది భర్త ధోరణికి. ఆరోజింక ఆగలేక అత్తగారి సెల్కి. వీడియో కాల్ చేసింది.. అత్తగారు లైన్లోకి రాగానే ఆబగా,
"అత్తయ్యా! ఎలా ఉన్నారు.. ఈయన ఏమిటో ఉన్నట్లుండి ఇక్కడ దింపి వెళ్లారు.. నాకసలు తెలియనే తెలియదు" కళ్లనీళ్ల పర్యంతమవుతూ చెప్తున్న కోడలితో,
"అట్లాగటే అమ్మాయి.. ఇంకా నువ్వే వెళ్లాలన్నావేమో నా పోరు పడలేక అని మింగలేక కక్క లేక చస్తున్నా. అసలు ఏదన్నా అడుగుదామంటే వాడు ఇంట్లో ఉంటే కదే. ఉన్న కాస్సేపు కళ్ళమీద చేతులు పెట్టుకుని ఉంటాడు. పలకరిద్దామని వెళ్ళేప్పటికి ఆఫీసు ఫైలులో తలదూరుస్తాడు. నరకం అనుభవిస్తున్నానుకో!”
ఆవిడా కొంగుతో కళ్ళు తుడుచుకున్నది!
****
సుగుణ ఎలాగైనా భర్తతో మాట్లాడాలని నిశ్చయించుకున్నది. ఎలాగూ ఇవాళ ఆదివారం.. ఆ యన అన్న వారం కూడా అయింది. కదా. ఆయన సెల్ కి ఫోన్ చెయ్యబోతుడగా డోర్ బెల్ మోగింది.. విశ్వం.
'అమ్మయ్య ! ఆడబోయిన తీర్ధం ఎదురైంది’ అనుకుంది సుగుణ!
"ఊ.. చెప్పు సుగుణా! ఏం చేద్దామనుకుంటున్నావు?"
"దేని గురించి. ?". తెల్లబోతున్న సుగుణకి దగ్గరగా జరిగి విశ్వం,
"నీకు. ఎందుకు నేనిలా మీ ఇంట్లో దింపి వెళ్ళానో తెలీక సతమతమౌతున్నావని తెలుసు.. మరేం చెయ్యను. ? ఇంట్లో ఉన్న ఇద్దరు పెద్ద వాళ్ళూ. ఇంగితజ్ఞానం లేకుండా కొట్టుకుంటుంటే.. చిన్న పిల్లాలిద్దరూ బెంబేలు పడితే, నేను మనశాంతి లేక అలమటిస్తున్నాను. సుగుణా! నీకు మొదట్నుంచీ తెలుసు ఇంట్లో శాంతి నాకు ఎంత ముఖ్యమో. ఎంత శాంతంగా ఉన్న లోపల్లోపల కుంగిపోతున్నా, ఇది ఎక్కడిదాకా పోతుందో ననీ.
అందుకే నేనో నిర్ణయానికొచ్చాను. అమ్మని హోంకి పంపేస్తాను.. ఆవిడ తోటి వాళ్ళుంటారు. పనేమీ చెయ్యక్కర్లేదు.. నీకు ఈ ఆరళ్ళు తప్పుతాయి!"
తన పని అయిపోయిందన్నట్లు కూర్చున్న భర్తని చొక్కా పట్టుకు నిలదీయాలన్న కోరిక బలవంతాన ఆపుకుని..
"అసలు ఏమ్మాట్లాడుతున్నారు మీరు. ఏ ఇంట్లో ఉండవు అత్తా కోడళ్ల పొట్లాటలు?"
"రోజూ ఈ లెవెల్ లో నేను భరించలేను సుగుణా!”
"కాదండీ నాది తప్పే.. ఇంత పెద్ద శిక్ష వెయ్యకండి. ఈ నాల్రోజుల్నించీ అత్తయ్య ఎలా చేసుకుంటున్నారో నని ఎంత అల్లాడుతున్నానో మా అమ్మననడగండి. నన్నేమి చెయ్యమంటారో చెప్పండి".
"నిజంగా చేస్తావా.. ?"
"తప్పకుండా!"
"ఏం లేదు సుగుణా.. ఆవిడ పెద్దావిడ.. ఆవిడవన్నీ తప్పులే అయినా బతికినన్నాళ్లు బతకదు.. ఎవరికి చెప్పుకుంటుంది.. నువ్వు నాకు చెప్పుకోవచ్చు. అసలు ఆవిడ ఇంత కఠినంగా మారడానికి కారణం, సగం తన ఇన్వొల్వెమెంట్ మన కుటుంబంలో లేక!’
"అంటే?"
""అంటే నువ్వు పిల్లల్ని డే కేర్ లో ఎందుకు పెట్టడం? ఎన్ని సార్లో అన్నది నాతో, "పిల్లల్ని నా దగ్గరికి రానియ్యదు" అని.
"పిల్లల్ని ఆవిడ చూడగలదు.. పై ఎత్తున పనిమనిషిని పెడదాం. వంట ఆవిడ చేసినట్లే తిందాం కొన్నాళ్ళు. మెల్లిగా ఆవిడతో స్నేహం చెయ్యి.. అప్పుడు నీ పద్ధతులు ఆవిడ తప్పకుండా చేస్తుంది. సుగుణా మీ ఇద్దరూ చెడ్డవాళ్ళు కారు. నువ్వు లేని ఈ వారం రోజులు నేను దొరికిన పది నిమిషాల్లో చెప్పే మాట, ‘సుగుణ, పిల్లలు లేకపోతే నాకు బాగుండలేదురా. నువ్వు తీసుకొస్తావా. ? లేకపోతే ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్యని దింపమని చెప్పేదా’ అని ఒకటే పోరు. "
"అంటే మీరు కావాలనే చేసారా ఇదంతా?"
"అవును ఈ వారం రోజుల ఎడబాటుతో మీకు ఒకళ్ల కొకళ్ళు కావాలనిపించి మారతారా, సరే.. లేదా.. నేను మొదట చెప్పినది చేద్దామనుకున్నా. అమ్మకి కూడా ఇలాగే కొన్ని మారాలని చెప్పా. ఆవిడా బాధపడుతోంది.. ".
సుగుణ "అమ్మో!. మీరు శాంతంగా ఉంటూనే ఇంత పెద్ద నిర్ణయం చేశారా.. అత్తయ్య లేకపోతే నేనూ ఉండలేనండీ.. "
అప్ప్పుడు బైటికొచ్చి.. సుగుణ వాళ్ళ ఇంట్లో అందరికీ విషయం చెప్పాడు విశ్వం. అల్లుడి తెలివి తేటల్కి అంతా హర్షించారు.
****
వంటిట్లోనించి వినిపిస్తున్న నవ్వులకి పరవశించి పోతూ రేడియోలో వస్తున్న 'శాంతమూ లేక సౌఖ్యమూ లేదు' పాటకు వంత పాడుతూ తాళం వేస్తూ విశ్వం "ఏమిటి అత్తా కోడళ్ల నవ్వులేనా.. కాఫీ ఏమన్నా ఇచ్చేదున్నదా?”
అన్నాడు అక్కడే ఉన్న పిల్లాడిని ముద్దు చేస్తూ!
***
విజయా సుందర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar
నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.
'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!
ఈ కథ చాలా బావుంది అండీ. నేటి తరం అత్తా కోడళ్ల మధ్య వస్తున్న తగవులకు మంచి పరిష్కారం సూచించారు. అందరూ చదవాల్సిన కథ ఇది అని నా అభిప్రాయం. ఇంత మంచి కథని అందించిన మీకు ధన్యవాదములు అండీ. చాలా చక్కని కథని వ్రాసిన రచయిత్రి గారికి అభినందనలు 🙏
P Sudharamana