top of page

శాంతము లేక సౌఖ్యము లేదు

#TeluguMoralStories, #నైతికకథలు, #SripathiLalitha, #శ్రీపతిలలిత, #SanthamuLekaSoukhyamuLedu, #శాంతములేకసౌఖ్యములేదు


Santhamu Leka Soukhyamu Ledu - New Telugu Story Written By Sripathi Lalitha

Published In manatelugukathalu.com On 05/04/2025 

శాంతము లేక సౌఖ్యము లేదు - తెలుగు కథ

రచన: శ్రీపతి లలిత

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



"అసలు నీకు ఇంత ఓర్పు ఎలా వచ్చిందమ్మా? పెద్దమ్మ ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకుంటుంటే నవ్వుతూ చూస్తున్నావు" కోపంగా అంది అనఘ తల్లి శారదతో.


"వాళ్ళ నోరు ఎలానూ ఆపలేము. మనం నోరు మూసుకుంటే గొడవలు జరగవు, కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేము అన్న మాట వినలేదా?" శాంతంగా అన్నది శారద.


కమల భర్త కామేష్, శారద భర్త సురేష్ సొంత అన్నదమ్ములు.


కామేష్ ప్రభుత్వంలో మంచి డిపార్ట్మెంట్ లో పని చేసాడు. అక్కడ జీతం కంటే గీతం ఎక్కువ అని అందరి ఉవాచ. ఒక మంచి పోష్ కాలనీలో పెద్ద ఇల్లు కట్టారు. కూతురు సరితకు బోలెడు కట్నం పోసి అమెరికా సంబంధం చేసారు, కొడుకు సాగర్ కి డొనేషన్ కట్టి ఇంజినీరింగ్ చదివించారు. అతను ఒక చిన్న కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి పెళ్లి అయ్యి ఒక పాప.


సురేష్, శారద ఇద్దరూ బ్యాంకు లో క్లర్క్ లుగా చేసారు. పిల్లల చదువు కోసం ఇద్దరూ ప్రమోషన్ తీసుకోకుండా అలానే రిటైర్ అయ్యారు, లోన్ తో చిన్న ఫ్లాట్ కొనుక్కున్నారు.అనఘ మెడిసిన్ చదివి, ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంది.

ఇద్దరూ ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తారు.

అనంత్ మంచి కాలేజీలో ఇంజినీరింగ్ చేసి, తరవాత ఎంబీఏ చేసి ఒక పెద్ద కంపనీలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇంకా పెళ్లి చెయ్యాలి.


కామేష్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడని సహఉద్యోగులు, అతను రిటైర్ అవ్వగానే అతని అవినీతి మీద కంప్లైంట్ ఇచ్చారు. దానితో ప్రభుత్వం కేసు వేసి పెన్షన్ ఆపి, బ్యాంకు ఖాతాలు కూడా సీజ్ చేసింది.

ఒక్కసారిగా సంఘంలో పరువుపోయి, చేతిలో డబ్బులు లేక ఆ కుటుంబం గిలగిలలాడింది.

ఇప్పడు సాగర్ జీతం మీదే కుటుంబం ఆధారపడింది.


భర్త ఉద్యోగంలో ఉన్నప్పుడు, అందరినీ పురుగుల్లా విదిలించిన కమలని చూసి, కోడలితో సహా అందరూ మంచి పని అయ్యింది అనుకున్నారు.

తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నాడని, తమ్ముడిని అతని కుటుంబాన్ని ఎప్పుడూ పలకరించని కామేష్, ఇప్పుడు తమ్ముడితో మాట్లాడాలంటే మొహమాటపడుతున్నాడు.


మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టు, సాగర్ ఉద్యోగం కాస్తా ఊడిపోయింది.

ఇల్లు గడవడం కష్టంగా ఉండి, కమల, సాగర్ ని తీసుకుని సురేష్ వాళ్ళ ఇంటికి వచ్చింది, అనంత్ ద్వారా సాగర్ కి ఉద్యోగం కోసం.


ఆదివారం అవడంతో, ఆ టైంకి అనఘ కూడా అక్కడే ఉంది.

ముందు పలకరింపులు అయ్యాక, కమల గొంతు సవరించుకుని

"శారదా! నీకు తెలుసుగా మీ బావగారు ఎలాంటివారో? ఎవడో గిట్టని వెధవ ఆయన మీద కేసు పెట్టాడు. ఆ దరిద్రుడు నాశనమవ్వాలి, ఎవరి ఏడుపో కానీ సాగర్ ఉద్యోగం పోయింది. మన అనంత్ కంపనీలో మంచి ఉద్యోగం ఇప్పించమని అడుగుదామని వచ్చాను,ఏరా అనంత్! మీ అన్నకి కాకపోతే ఇంకెవరికి ఇస్తావు? చిన్నప్పుడు నీకు లెక్కలు రాకపోతే అన్నయ్యేగా చెప్పి మంచి రాంక్ తెప్పించింది"


ఆవిడ మాటలకి అనంత్, అనఘా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

అసలు ఎప్పుడైనా తమని వాళ్ళింటికి పిలిచి, ఒక గ్లాస్ నీళ్లన్నా ఇచ్చిందా ఈవిడ? సాగర్, సరితా చాలా పొగరుగా ఉండేవారు. చదువు చెప్పడం దేవుడెరుగు పలకరింపు కూడా లేదు. సాగర్ అన్నిటిలోనూ అత్తెసరు మార్కులతో పాసైతే అనంత్ ముందు నుంచి టాప్ విద్యార్థి.


"పెద్దమ్మా! అన్న చేసే పనికి సంబంధించిన ఉద్యోగాలు మా కంపెనీ లో ఉండవు, నేను మా స్నేహితులకి అన్న రెస్యూమె పంపి ప్రయత్నిస్తాను, కొద్దిగా టైం పట్టచ్చు"

అన్నాడు అనంత్.

కమల మొహం ఎర్రగా అయింది, తాను అడగంగానే ఆర్డర్ చేతిలో పెడతాడు

అనుకుంది. తమాయించుకుని,


"శారదా! మొన్న మీరు అనంత్ కోసం ఆ విజిలెన్సు ఆఫీసర్ కూతురు త్రిపురని చూశారట కదా!

ఆ అమ్మాయిని చేసుకుంటే, బావగారి కేసు మనవేపుగా చేస్తానని ఆయన ఫోన్ చేశారు.

పిల్ల బానే ఉంది, ఉద్యోగస్తురాలు, బాగా డబ్బు ఉన్నవాళ్లు. మీరు ఆ సంబంధం చేసుకుంటే బావగారు బయట పడతారు, మా మాట అనంత్ కాదనడని మీ పెదనాన్న చెప్పారులే" అనంత్ వేపు చూస్తూ అంది కమల.

కోపంగా ఏదో అనపోతున్న అనంత్ ని లోపలికి వెళ్ళమని సౌంజ్ఞ చేసింది శారద.


"అక్కయ్యా! సాగర్ ఉద్యోగం సంగతి తప్పకుండా అనంత్ చూస్తాడు, కొద్దిగా టైం ఇవ్వండి. ఇంక పెళ్లి సంబంధం అంటారా! అది పూర్తిగా వాడిష్టం, అనఘ పెళ్లి ఎలా తన ఇష్టప్రకారం అయ్యిందో వాడిది కూడా వాడికి నచ్చినట్టుగా జరుగుతుంది. మన ప్రయోజనం కోసం వాడిని మేము బలవంతపెట్టం" నెమ్మదిగా అన్నా ధృడంగా అంది శారద.


అసలే వీళ్ళని సహాయం అడగడం ఇష్టంలేకపోయినా, తప్పనిసరై వచ్చిన కమల ఆ మాటకి రెచ్చిపోయింది.


"నాకు తెలుసు, ముందు నుంచి మా మీద ఒకటే ఏడుపు. అన్నగారి సంపాదన చూసి తమ్ముడి కళ్ళు కుడుతూనేఉండేవి, ఆయన మీద కేసు పెడితే పండగ చేసుకుని ఉంటారు. ఎవరికి తెలుసు, ఆ కేసు మీరే వేయించి ఉంటారు కూడా, గతిలేక మీ దగ్గరికి వచ్చామని చులకన. నాకే బుద్ధిలేదు, ఆయన అంటూనే ఉన్నారు వెళ్లొద్దు అని, ఈ సాగర్ గాడే వెళ్లి ముష్టెద్దుదాం అని తెచ్చాడు, మంచి పాఠమే చెప్పారు" పూనకం వచ్చినట్టు ఊగిపోతున్న కమల చేతులని పట్టుకుని శారద


"అక్కా! క్షమించు నేను అలా అనలేదు, నీ మనసు బాధపెట్టినందుకు మన్నించు,పొరపాటు అయింది" అంటూ చెంపలు వేసుకుంది.


దానితో కొద్దిగా శాంతించిన కమల వెళ్తానంటే ఆపి, టిఫిన్, కాఫీ ఇచ్చి బొట్టుపెట్టి చీర పెట్టి, సాగర్ చేతిలో ఒక వెయ్యి పెట్టి, పిల్లలకి ఏమన్నా కొను అని పంపింది.


వాళ్ళు వెళ్ళగానే అనఘా, అనంత్ కోపంగా శారద మీద అరిచారు

"ఏంటమ్మా! ఆవిడ అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నువ్వు క్షమాపణ చెప్పావు?" అన్నాడు అనంత్.


"మీ చిన్నప్పుడు చదివిన పద్యం "తన కోపమే...

తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ...." గుర్తు లేదా!


వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఉన్న కష్టాలు చాలవన్నట్టు ఆ సాగర్ ఉద్యోగం పోయింది,

మనం ఏదో సాయం చేస్తామనేగా వచ్చారు, ఎంత కాదన్నా మనవాళ్ళు ఇబ్బంది లో ఉన్నారు, నువ్వు గట్టిగా ప్రయత్నించి సాగర్ కి ఉద్యోగం ఇప్పించు అనంత్!"

అనఘ వేపు తిరిగి


"శాంతము లేక సౌఖ్యము లేదు అన్న త్యాగరాయకీర్తన మర్చిపోయావా నువ్వు! కోపం తెచ్చుకోవడం మంచిది కాదని మీకు తెలీదా? నువ్వు డాక్టరువి, కోపం వల్ల బీపీ పెరగడం తప్ప ఏ ఉపయోగం లేదనే సంగతి నీకు తెలీదా అనఘా! వాళ్ళ ఉక్రోషం ఎక్కడ తీర్చాలో తెలీక మనమీద తీర్చుకున్నారు, మనం కూడా వాళ్లలాగే ప్రవర్తించి, నోరు పారేసుకుంటే మనకీ వాళ్ళకీ తేడా ఏమిటీ?


కొంచెం దయతో ఆలోచించండి వాళ్ళ పరిస్థితికి జాలి కలగట్లేదా?" శారద చెప్తుంటే నిజమే అనిపించింది ఇద్దరికీ. చిన్ననాటినుంచీ సుమతీ శతకాలు, వేమన పద్యాలూ విన్న అలవాటున్న ఇద్దరూ కూడబలుక్కున్నట్టు "కదరా సుమతీ!" అంటే


"చాల్లే ఊరుకోండి ఇద్దరూ, ఇప్పుడు మీ నాన్న వస్తే ఇంకో క్లాస్ తీసుకుంటారు మీకు"

అంటుండగానే అనంత్ ఫోన్ మోగింది.


"సాగర్ అన్నయ్య!" అంటూ ఫోన్ ఎత్తాడు, అవతల సాగర్ ఏమన్నాడో "అయ్యో అన్నయ్యా! నువ్వు సారీ చెప్పడం ఏమిటి? పెద్దమ్మ అన్నమాటలు మేము పట్టించుకోము అన్నయ్యా! నువ్వు బాధపడకు నీకు సరిపడే ఉద్యోగం నేను ఒక వారం, పది రోజుల్లో చూస్తాను, నీకు ఈ లోగా ఏదైనా అవసరం ఉంటే, నా దగ్గర మొహమాటపడకు అన్నయ్యా!" అంటూ ఆప్యాయంగా మాట్లాడుతున్న అనంత్ ని చూసి ప్రేమగా నవ్వింది శారద, తన సుమతీశతకాలు వృధా అవలేదని సంతోషంతో.


***

శ్రీపతి లలిత  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.




Comments


bottom of page