#SapthaChiranjeevulu, #సప్తచిరంజీవులు, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ, #పురాణం, #ఆధ్యాత్మికం, #devotional

Saptha Chiranjeevulu - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 16/11/2024
సప్త చిరంజీవులు - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
మన హైందవ పురాణ ఇతిహాసాల ప్రకారం ఏడుగురు మహనీయులు కృత త్రేతాయుగ ద్వాపర యుగాలకు చెందినవారు. వారు ఈ కలియుగమునందున చిరంజీవులు.
సప్త - ఏడు అను సంఖ్య చాలా ప్రభావితమైనది.
1. సప్త ఋషులు:- శతపద బ్రాహ్మణము, బృహదారణ్య కోపనిషత్తులలో కశ్యపుడు, భరద్వాజుడు, గౌతముడు, అత్రి, జమదగ్ని, వశిష్టుడు, విశ్వామిత్రుడు సప్త ఋషులని వివరించబడియున్నది.
2. సప్త సాగరములు: లవణ (ఉప్పు) సముద్రము, ఇక్ష (చెరకు) సముద్రము, సురా (మద్యం, కల్లు) సముద్రము, సర్పి (ఘతం / నెయ్యి) సముద్రము, క్షీర (పాల) సముద్రము, దధి (పెరుగు) సముద్రము, నీరు (మంచినీటి) సముద్రము.
3. సప్త వర్ణములు :- తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, వక్కఛాయ.
4. సప్త ద్వీపములు :- జంబూ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మనీ ద్వీపము, కుశ ద్వీపము, క్రౌంచ ద్వీపము, శాక ద్వీపము, (ఇవి బ్రహ్మాండ పురాణంలో, మహాభారతంలో భాగవతంలోని వివరణ)
5. సప్త స్వరములు :- స,రి,గ,మ,ప,ద,ని....స షడ్బమం (నెమలి క్రేం కారం) రి - రిషభం(ఎద్దురంకె) గ - గాంధర్వం (మేక అరుపు), మే - మధ్యమం (క్రౌంచ పక్షి కూత), ప - పంచమం (కోయిల కూత), ద - దైవతం / గుర్రం సకిలింపు), ని- నిషాదం (ఏనుగు ఘీంకారం)
6. సప్త వారములు : ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని
7. సప్త చిరంజీవులు : బలి చక్రవర్తి, శ్రీవ్యాసుడు, పరశురాముడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యులు, ఆశ్వత్దామ.
దిగువన సప్త చిరంజీవుల చరిత్ర, ఘనత వివరాలు :
1. బలి చక్రవర్తి వారు:- వీరు భక్త ప్రహ్లాదుల మనుమడు. వీరికి బాలి, ఇంద్రసేనన్, మావేలి అను మారుపేర్లు కలవు. వీరు కశ్వప ఋషి వంశస్థులు. వీరి తండ్రిగారి పేరు వీరోచనుడు. వీరి తల్లి దేవాంబ. భార్య ఆశన. వీరు దాననిరతిలో శిబి చక్రవర్తి అంతటివాడు. వీరి గురువు శుక్రాచార్యులు. ముల్లోకాలను జయించిన మహా పరాక్రమశాలి. గొప్పదాత.
శ్రీ మహావిష్ణుమూర్తి వీరి దానగుణమును పరీక్షించదలచి వామరూపము వటువుగా వారి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను అర్థించాడు. ఇస్తానన్నాడు బలి. గురువు శుక్రాచారుయులు వారించాడు. కానీ బలి చక్రవర్తి గురువు వాక్కును వినిపించుకోలేదు. కమండల జలంలో మూడు అడుగులు, శ్రీ మహావిష్ణువుకు ధారపోయబోయాడు.
శుక్రాచార్యులు కమండల ద్వారానికి తన నేత్రాన్ని అడ్డుగా పెట్టాడు. ఆవటువు కమండ జల ప్రవాహ మార్గమును దర్భంతో పొడిచాడు. అడ్డుగా వున్న శుక్రాచార్యుల నేత్రం పోయింది. నీరును వటువు చేతిలో పోసి బలి దాన విధిని ముగించాడు. శ్రీహరి త్రివిక్రమ రూపధారియై ఒక పాదమును యావత్ భూమిమీదను, రెండవ పాదమును గగనతలముననూ వుంచి... అడిగాడు.. ’బలీ!... మూడవ పాదము ఎక్కడ మోపవలె!"
దాన గ్రహీత శ్రీ మహావిష్ణుమూర్తి అని గ్రహించి, మహా జ్ఞాని బలి చక్రవర్తి.... తన శిరమును చూపి.... ’ప్రభూ!.... మూడవ పాదమును ఇచ్చట మోపండి’ అన్నాడు పరమానందంగా.
జగత్ రక్షకుడు శ్రీమన్నారాయణులు బలిచక్రవర్తి దాన గుణానికి సంతసించి, వారికి ప్రసన్నుడై భార్యా పిల్లలతో పాతాళ లోకవాసిగా, చిరంజీవిగా వర్ధిల్లమని శ్రీ మహావిష్ణుమూర్తి, బలిచక్రవర్తిని ఆశీర్వదించారు, వరం ఇచ్చారు.
2. వేదవ్యాసుల వారు:- బెస్త స్త్రీ సత్యవతికి, పరాశర మునీంద్రులకు జన్మించినవారు వ్యాసమహర్షి. మన పూర్వులు పంచమవేదమని పిలవబడు ఇతిహస మహాకావ్యము శ్రీ మహాభారము. అది పదునెనిమిది పర్వములు. అది కౌరవ పాండవుల కథ. వీరు చంద్ర వంశస్థులు. పరీక్షిత్తు మహారాజు వారి భార్య మద్రావతి. తండ్రి అభిమన్యుడు, తల్లి ఉత్తర, కుమారుడు జనమేజయుడు. వీరికి ముగ్గురు సోదరులు. భీమసేనుడు, ఉగ్రసేనుడు, శ్రుతిసేనుడు. జనమేజయుడు అర్జునునికి ముని మనుమడు.
వ్యాసులు ప్రియ శిష్యులు వైశంపాయనుడు. వీరు మహా భారత కథను జనమేజయులకు వివరించినారు.. జనమేజయులకు ఇరువురు కుమారులు. జనమేజయుల తండ్రి పరీక్షిత్ మహారాజు పాముకాటు వలన మరణించు శాపము కలిగినది. అది ఎట్లనిన శమీక అను ఋషి తపమునందుండగా అడవికి వేటకు వెళ్ళిన పరీక్షిత్తు ఆ ఋషిని చూచి దాహము తీర్చుకొనుటకు నీటికి అడిగినాడు. జపమునందున్న ఋషి పలుకలేదు. అవేశంలో పరీక్షిత్తు చనిపోయిన ఒక పాము కళేబరమును శమీక ఋషి మెడలో వేసి వెళ్ళిపోయాడు.
శమీక ఋషి తనయుడు శృంగి, ఏడవరోజున పాము తక్షకుడు నిన్ను కాటువేసి చంపుగాక, అని శపించినాడు. అదే రీతిగా పాముల రాజు తక్షకుడు పరీక్షిత్తును కరచి చంపినాడు. ఆ కారణముగా జనమేజయునికి పాములు అంటే ద్వేషం. వారిని సర్ప యాగమును చేసి చాలా పాములను చంపినారు. ఈ పంచమ వేద రచయిత శ్రీ వ్యాస మహర్షుల వారు. శ్రీ మహా విష్ణువు చిరంజీవిగా వరం ఇచ్చినారు..
3. పరశురాముడు: శ్రీ మహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది. త్రేత్రాయుగ ఆరంభంలో జరిగినది. మహావీరుడు. పరశురాముని తండ్రి జమదగ్ని, తల్లి రేణుకాదేవి. వీరికి నలుగురు మగపిల్లలు. చివరివాడు పరశురాముడు. అసాధారణమైన బలపరాక్రమశాలి. వీరి చరిత్ర చాలా విచిత్రమైనది. వీరి తాతగారు ఋచీకుడు, ఋషి. వారు గాధి రాజు వద్దకు వెళ్ళి రాజకుమారి సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయమని కోరినారు.
సత్యవతిదేవి గాధి మహారాజు ఏకైక పుత్రిక. ఆమె వివాహమును గాధి మహారాజు సర్వశక్తి సంపన్నుడైన మునిబిడ్డ రుచికునికి ఇచ్చి వివాహమును జరిపించెను. సత్యవతి తాను క్షత్రియకుల కాంత కావున, తనకు జన్మించే సంతానం కూడా క్షత్రియ బుద్ధులతో పుడతాడు. అది ముని అయిన తన భర్త వంశమునకు కీడు అని భావించి, రుచికునికి తనకు కేవలం సాత్విక గుణములు కలిగిన బిడ్డ కావలయునని విన్నవించెను.
అలాగే, మగ సంతానములేని తన తల్లితండ్రులకు క్షత్రియ గుణములు కలిగిన బిడ్డను ప్రసాదించమని కోరెను. సత్యవతి కోరిక మేరకు, అత్తకు..... భార్యకు సంతతిని ఇవ్వదలచి రుచికుడు, యాగము చేసి రెండు కుండల్లో పరమాన్నమును నింపి, ఒకటి అత్తగారికి మరొకటి భార్యకు ఇచ్చి, ఎవరిది వారు భుజించవలయునని చెప్పెను.
రుచికుడి ఉద్దేశ్యము, క్షత్రియకుల సతి అయిన గాధిరాజు భార్యకు (అత్తగారికి) క్షత్రియు గుణములు కల బిడ్డను, ముని భార్య అయిన సత్యవతికి సాత్విక గుణములు ఉండు ముని బాలుడు పుట్టవలెననే ఉద్దేశ్యము. కానీ... అల్లుడు రుచికుడి పైన అనుమానము కలిగిన సత్యవతి తల్లి, తనకు మంచిబిడ్డ పుట్టవలయునను ఉద్దేశ్యంతో, మునిరాజు తన భార్య కుండలో ఏవైనా గొప్ప శక్తులు నింపాడేమో అనుకొని, స్వార్థముతో సత్యవతికి ఇచ్చిన కుండలోని క్షీరాన్నమును తాను భుజించి, తనకు ఇచ్చిన కుండను సత్యవతికి ఇచ్చెను.
అవి భుజించిన వారి గర్భములలో మారు బిడ్డలు పెరుగుచుండిరి. ఆ విషయమును గ్రహించిన రుచికుడు తన భార్యకు తాను మారు శిశువును మోయుచున్నట్లు చెప్పెను. అందుకు సత్యవతి భయంతో ఆ బిడ్డను తన కుటుంబ తరువాతి తరమునకు చెందిన తన కోడలి గర్భమునకు మార్చమని, రుచికుడిని కోరెను.
రుచికుడు ఆమె కోరికను మన్నించి ఆమె ఆశయమును నెరవేర్చెను. అత్తకు, భార్యకు కూడా సాత్విక తత్వ సంతానములు కలిగిరి. గాధి తన బిడ్డకు విశ్వామిత్రుడు అని నామకరణము చేసెను. సత్యవతి తన బిడ్డకు జమదగ్ని అని నామకరణము చేసినది. ఆ ముని బిడ్డ జమదగ్ని క్రోద దేవతల ఆశీర్వాదంతో తనకు కోపము కలిగించిన వారిని తన క్రోదాగ్ని జ్వాలలతో భస్మము చేయగల శక్తి పొందెను.
పరశురాముని తండ్రి జమదగ్ని, తల్లి రేణుకాదేవి. తోబుట్టువులు సుమస్వాన్, సుహోత్ర, వాసు, విశ్వవసు, భార్య ధరణ (లక్ష్మి). వీరికి పరమశివుడు, నేరస్థులను, చెడుగా ప్రవర్తించే వ్యక్తులను, తీవ్రవాదులను, రాక్షసులను మరియు గర్వంతో విర్రవీగుతున్న అంధుల బారినుండి భూమాతను విడిపించమని వారికి సలహా ఇచ్చాడు.
వీరు ఆ వర్గీయులపై ఇరవై ఒక్కసార్లు (కొన్ని వంశములను విడిచి) నాశనం చేయడం ద్వారా విశ్వ సమతుల్యాన్ని సరిదిద్దారు. అతి పరాక్రమశాలి వీరుడు. ధీరుడు ధైర్యశాలి పిత్రువాక్య పరిపాలకుడు.
ఒకనాడు తల్లి రేణుకాదేవి గంగానదికి నీటికోసం వెళ్ళగా అక్కడ జలకాలాడుతున్న గంధర్వ కన్యలను చూచి పరవశంతో వర్తమానాన్ని మరచిపోయినది. ఎంతకూ తిరిగి ఇంటికిరాని ఇల్లాలిపై ఆగ్రహించి, తండ్రి జమదగ్ని, పరశురామునితో ‘నీ తల్లి తల నరికి తెమ్ము’ అని ఆజ్ఞాపించెను. సత్వరము పరశురాముడు తల్లి వున్న స్థలమునకు ఏగి, తల్లి తలను నరికి తెచ్చి తండ్రికి సమర్పించెను.
అంతటి కఠోర సంకల్పుడు పరశురాముడు. వీరు భీష్ములు. ద్రోణుడు, రుక్మి మరియు కర్ణులకు గురువు. వారు సమాజంలోని బ్రాహ్మణులు, పిల్లలు, మహిళలు, వృద్ధులు, ఇతర బలహీనవర్గాల పట్ల తన దయా దాక్షిణ్యాలను చూపారు. శ్రీ మహావిష్ణువు వరంతో చిరంజీవి అయినారు.
4. హనుమంతుల వారు:- వీరి తల్లి అంజన, తండ్రి కేసరి. వీరికి మరొక పేర్లు భజరంగబలి మరియు పవనసుత. వీరు అంజనాదేవుకి వాయువు వర ప్రసాదం. మహాజ్ఞానం, బలం, ధైర్యం, భక్తి మరియు స్వీయ క్రమశిక్షణ కలిగిన మహోన్నతులు, ఋష్యమూకాద్రి పర్వతరాజైన వాలి కొలువులోన వుండేవారు.
అభిప్రాయభేదముల వలన వాలి తన సోదరుడైన సుగ్రీవుని, రాజ్యం నుంచి తరిమేశాడు. ఆ తరుణంలో ఆంజనేయులు ధర్మ మార్గవర్తి.... సుగ్రీవునకు అండగా ఆ వర్గంలో వుంటాడు. వీరి గురువులు సూర్యుడు, రావణుడు, అరణ్య వాసమునందు వున్న సీతామాత యొక్క అందాన్ని గురించి తన సోదరి శూర్పణక చెప్పిన మాటలు విని, రావణుడు మారిచుని మాయ బంగారు లేడి రూపంలో రామాశ్రమునకు పంపగా సీతామాత ఆ లేడి తనకు కావలెనని శ్రీరాముని కోరగా, రాముడు ఆ మాయా లేడిని పట్టుకొనుటకు వెళతాడు.
లక్ష్మణుడు ఆశ్రమమున వుంటాడు. ’హా సీత... హా లక్ష్మణా...’ అనే దీన స్వరాన్ని మారీచుడు (లేడీ రూపమున వున్న) పలుకగా, సీతామాత భయంతో, లక్ష్మణుని ఆశ్రమమును విడచి, శ్రీరామరక్షణకు వెళ్ళమంటుంది. ’తల్లీ.... అది రాక్షస మాయ, మా అన్నయ్యను ఎవరూ ఏమీ చేయలేరు. మీరు భయపడకండి’ అని జవాబు చెపుతాడు లక్ష్మణుడు. ’మనస్సున చెడ్డ ఉద్దేశ్యంతో నీవు ఆశ్రమమును వదలిపోనంటున్నావు.’ అన్నారు సీతామాత. లక్ష్మణుని హృదయంలో ఆవేదన. మాత అనుమానం తీరాలంటే తాను వెళ్ళక తప్పదని ’లక్ష్మణ గీత’ను ఆశ్రమం ముంగిట గీసి ’తల్లీ!.... ఎటువంటి పరిస్థితిలోనూ, మీరు ఈ గీతను దాటరాదు’ అని చెప్పి, లక్ష్మణుడు శ్రీరాముని కోసం వెళతాడు.
ఆ సమయమున రావణుడు జంగం దేవర వేషంలో ఆశ్రమానికి వచ్చి ’భవతి భిక్షాందేహి’ అని యాచిస్తాడు. సీతామాత వారిని చూచింది. భిక్షను తీసుకొని, లక్ష్మణ రేఖను దాటకుండా రావణునికి ఇవ్వబోయింది. దురుద్దేశపు రావణుడు ఆ దానాన్ని అంగీకరించలేదు. గీతను దాటి వచ్చి తన జోలిలో వేయమంటాడు రావణుడు.
యాచకునకు నిరాశ, అసంతృప్తి కలిగకూడదని మాత లక్ష్మణ రేఖను దాటుతుంది. వెంటనే రావణుడు సీతామాతను తన పుష్పక విమానాన్ని ఎక్కించి, లంకకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆశ్రమమునకు తిరిగి వచ్చిన శ్రీరామ లక్ష్మణులకు మాత కనిపించలేదు. నలువైపులా వెదికారు. కానీ... ప్రయోజనం శూన్యం విచారవదనంతో రామలక్ష్మణ సీతామాత అన్వేషణను అడవిలో ప్రారంభించారు.
ఆ తరుణంలో శ్రీ హనుమంతుడు వారిని కలిశాడు. వారు, వారి దీన స్థితిని వాయునందనునికి తెలియజేశారు. హనుమ వారిని తన రాజైన సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్ళి పరిచయం చేశారు. సుగ్రీవుడు తన దుస్థితిని రాముల వారికి తెలియజేశాడు. వాలి, సుగ్రీవుల రూపురేఖలు ఒకేరీతిగా వుంటాయి. అన్యాయమార్గ వర్తనుడు అహంకారి అయిన వాలిని వధించి సుగ్రీవునకు పట్టాభిషేకం జరపాలని శ్రీరాముడు నిర్ణయించారు. సుగ్రీవుని సందేశంగా వాలిని ద్వంద యుద్ధానికి రావలెనని సందేశం పంపారు.
వాలి యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు. ఇరువురూ ఒకే పోలిక యున్నందువలన శ్రీరాముల వారు సుగ్రీవుని కంఠమునందు తామర పూలమాలను వేసి యుద్ధానికి దింపారు. వాలి రావణుడి కన్నా మహా బలశాలి. అతని ధాటికి సుగ్రీవుడు హడలిపోసాగాడు. వాలిని సుగ్రీవుడు గెలవలేడని గ్రహించిన శ్రీరాముడు తన బాణంతో వాలిని సంహరించాడు. సుగ్రివుడు రాజైనాడు.
సీతామాత అన్వేషణకు వానర ప్రముఖులను సుగ్రీవుడు అష్టదిక్కులకు తనవారిని పంపినాడు. ఆగ్నేయమూలకు శ్రీ ఆంజనేయుడు వెడలినాడు. లంకా రాక్షసిని చంపి లంకలో ప్రవేశించి అశోకవనమున సీతామాతను సందర్శించినారు. శ్రీరాములు ఇచ్చిన అంగిళీయకమును మాతకు చూపించి తాను శ్రీరామ దూతననే గుర్తింపును పొంది మాతను ఓదార్చి ’త్వరలో మా వానర సమూహం శ్రీరామ లక్ష్మణ సమేతంగా లంకకు వచ్చి, రావణుని వధించి మిమ్ములను తీసుకొని పోయెదమని సీతామాతను ఓదార్చినాడు.
అశోకవనమును ధ్వంసం చేసి, రావణ వన రక్షకులను చంపి, ఇంద్రజిత్ (రావణ కుమారుడు) బ్రహ్మస్త్రమున వారికి బంధీగా దొరికి రావణుని దర్బారున ప్రవేశించినారు. దూతకు ఆసనమును ఏర్పాటుచేయలేదు రావణుడు. అతన్ని పరుష భాషణలతో అవమానించాడు.
హనుమంతులవారు వాలమును కాయమును పెంచి, వాలమును ఎత్తైన (రావణుని ఆసనము కన్న) ఆసనముగా అమర్చి దానిపై కూర్చొని శ్రీరామ సందేశాన్ని రావణునకు వినిపించాడు వాయునందన. ఆగ్రహావేశాలతో రావణుడు ఆ వానరవాలమునకు గుడ్డలు చుట్టి రసాయనాన్ని పోసి వాలమునకు నిప్పును అంటింపచేశాడు రావణుడు. అగ్ని శిఖలు చెలరేగుతున్న వాలముతో పవతనయులు లంకానగర సౌధములన్నింటికీ నిప్పును అంటించాడు. లంకానగరం అగ్ని జ్వాలలకు ఆహుతి అయినది.
వాలమును సాగరమున ముంచి అగ్నిని చల్లార్చుకొని, సీతా మాతను కలిసి ఆమె ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా తీసుకొని శ్రీరాముల సన్నిధికి తిరిగివచ్చి, ’మాతను చూచితిని, మాట్లాడితిని. తల్లి క్షేమం. ఇదిగో మాత ఇచ్చిన ఆనవాలు, అని చూడామణిని (తలలో ధరించు బంగారు ఆభరణము) శ్రీరాముల వారి చేతికి అందించినాడు హనుమంతుడు. సాగరముపై రాళ్ళపై శ్రీరామ నామమును వ్రాసి విసరగా అవి నీటిపై తేలి వారధి/ సేతువుగా వెలసెను. వానర సైన్యంతో సుగ్రీవ అంగద జాంబవంత హనుమంతులతో శ్రీ రామలక్ష్మణులు లంకకు చేరి, రావణ పరివారమును అంతం చేశాడు.
రావణుని సోదరుడు సద్గుణ సంపన్నుడు విభీషణుడు, రావణునకు హిత వచనములను చెప్పి, సీతామాతను శ్రీరాములకు అప్పగించమని వేడెను. అహంకారి దుర్మార్గుడు అయిన రావణుడు, సోదరిని వచనములను పెడచెవిన పెట్టి విభీషణుని దుర్భాషలాడినాడు. ఫలితముగా సుగ్రీవుడు లంకను, రావణుని వదలి శ్రీరాముల వారిని కలిసి శరణు వేడినాడు. శ్రీరాములు అతనికి అభయమిచ్చినాడు. వారు శ్రీరాముల వారికి రావణ ప్రాణ రహస్యను తెలిపినాడు. భయంకరంగా రామ రావణ యుద్దం జరిగినది. లక్ష్మణుడు మూర్ఛ చెందినాడు.
శ్రీ హనుమంతుడు హిమాలయ పర్వతమునకు ఏగి మృత సంజీవిని తెచ్చి లక్ష్మణుని కాపాడినాడు. ఆ యుద్ధములో రావణుని సోదరులు, సుతులు అందరూ మరణించినారు. చివరగా పది తలల రావణుడు రామబాణానికి హతుడైనాడు. పరవాని పంచన వుండిన సీతామాతకు ఆ రాముడు అగ్ని పరీక్ష పెట్టినాడు. మాత ఆ పరీక్ష యందు నెగ్గి అగ్ని పునీతగా నిలిచినది.
శ్రీ రామలక్ష్మణులు సీతామాత సుగ్రీవ అంగద జావంతాదులందరూ అయోధ్య నగరమునకు చేరినారు. కులగురువు వసిష్టుల వారి నిర్ణయమైన శుభముహూర్తాన శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవము కనుల పండుగగా జరిగినది. శ్రీరాముడు అంజనాసుతుని ఆలింగనము చేసికొని.... ’చిరంజీవివై వర్ధిల్లు హనుమా!’ అని దీవించినారు. ఆ రీతిగా.... ఆ మహోన్నత శివ అంశ అంజనా కేసరి తనయుడు చిరంజీవి అయినాడు.
5. విభీషణుల వారు: శ్రీరాముల వారియందు అపరిమిత భక్తి శ్రద్ధలు, గౌరవము వున్న విభీషణునకు శ్రీరాముడు లంకా రాజ్య పట్టాభిషేకం ఘనంగా జరిపించినాడు. వీరి తల్లి కైకేసి, తండ్రి విశ్రవఋషి. లంకలో సన్మార్గులు అందరూ కడు సంతసించారు. విభీషణుడు తన రాజ్య ప్రజలను కన్న బిడ్డలవలే అభిమానించి, గౌరవించి, వారికి సర్వ సౌకర్యములను ప్రసాదించినాడు. ఆ కారణముగా శ్రీ రాముడు మహదానందంతో, విభీషణునకు చిరంజీవి వరాన్ని ప్రసాదించారు.
6. కృపాచార్యులవారు: వీరు ఆందీరస ఋష వంశస్థులు. వీరిని తను రాజు దత్తు తీసికొన్నారు. వీరు హస్తినాపురమునకు రాజ పూజారులు. వీరి భార్య జనపది. వీరు శతానంద మహర్షి మనుమడు. వీరి సోదరి కృషి ద్రోణాచార్యుల వారి ఇల్లాలు. వీరు కౌరవపాండవులకు ఆదిగురువు. వీరు మహాజ్ఞాని. పండితుడు. మాట పట్టింపుగల గొప్ప వ్యక్తి. ద్రోణాచార్యులు వీరి బావమరిది. కౌరవ పాండవుల యుద్ధం ముగిసిన తరువాత వీరు అర్జునుని మనుమడు పరీక్షకు గురైనారు. వీరికి సామర్థ్యానికి, నీతి నియమాలకు మెచ్చి, శ్రీ కృష్ణ పరమాత్మ వీరికి చిరంజీవిగా వరమిచ్చారు.
7. అశ్వత్దామ వారు: వీరు ద్రొణాచార్యుల కుమారులు. వీరి తల్లి కృపాచార్యుల సోదరి కృషి. తండ్రి వద్ద మామ కృపాచార్యుల వద్ద అశ్వత్దామ అన్నివిద్యలూ, యుద్ధ నైపుణ్యాలను నేర్చుకొన్నారు. తపసంపన్నుడు. కురుయువరాజు రారాజు దుర్యోధనునకు గొప్ప మిత్రుడు. యుద్ధంలో కౌరవులు వారి సర్వ సైన్యం దుర్యోధన సోదరులు అందరూ చనిపోయారు.
ఆ కక్షతో పంచ పాండవులు ఐదుగురు సంతతి ఉప పాండవులను రాత్రి సమయంలో గుడారంలో ప్రవేశించి ఐదుగురు వుప పాండవులను హతమార్చాడు. అంతేకాకుండా అభిమన్యుని ఇల్లాలు ఉత్తర గర్భమునందున్న శిశువును కూడా చంప బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. విషయాన్ని గ్రహించిన శ్రీ కృష్ణ పరమాత్మ ఉత్తర గర్భమునందున్న శిశువు (పరీక్షిత్)ను రక్షించినాడు.
ఆశ్వత్థామకు రక్తశిక్తమైన రణ (గాయాలు) పూరిత శరీరంలో దుర్గంధంతో కలియుగాంతం వరకు చిరంజీవిగా నరకయాతనలను అనుభవిస్తూ బ్రతకమని శపించారు శ్రీ కృష్ణ పరమాత్మ.
ఆ రితిగా అనుచిత కార్యాలు చేసినందుకు శ్రీకృష్ణ శాపంతో అశ్వథామ చిరంజీవి అయినాడు.
యధార్థంగా పై ఏడుమంది ఒకరిని మించిన మహనీయులు ఒకరు. కొందరు సత్వగుణ ప్రధానులు (బలిచక్రవర్తి, వ్యాసుల వారు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యులు) ఆ కోవకు చెందినవారు. పరశురాముడు అశ్వత్థామ రజోగుణ ప్రభావితులు.
వీరందరికీ అంతటి మహత్తర శక్తులు. నైపుణ్యం, నేర్పరితనం సిద్ధించినది, వారు గురువులను గౌరవించి విద్యలను అభ్యసించిన రీతి, మనస్సున దీక్ష, పట్టుదల, పెద్దల యందున గౌరవం, ధ్యానం తపం, యోగ విద్యల సాధన వలన వారు అంతటి గొప్ప వారు కాగలిగారు. కోట్ల ప్రజానీకపు నోట కొనియాడబడ్డారు. దైవ దృష్టిలో ధర్మానికి రక్షణ, అధర్మానికి శిక్షణ ఎలాంటి వారికైనా తప్పదు మారదు. కారణం జగత్కర్త సదా నిస్పక్షపాతి ధర్మమూర్తి.
పైవారు వారి వర్తమాన కాలంలో ఇంకా ఎన్నెన్నో ఘనకార్యాలు చేశారు. చరిత్ర నాయకులై మన భారతజాతి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు.
ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో పాటించవలసినది సత్వగుణం. సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ, న్యాయం, మానవత్వం, రజోగుణ తత్వాలు రాక్షస చర్యలు. వాటికి దూరంగా వుంటూ, దైవం పట్ల విశ్వాసం, నమ్మకం, సాటివారి పట్ల ప్రేమాభిమానాలు కలిగి వర్తించినవారు ఉత్తములు. పురుషోత్తములని సాటివారి చేత పిలువబడుతారు. గౌరవించబడతారు.
*
సూచన : ప్రపంచ చరిత్రలో మన హైందవ సనాతన ఋషి పరంపర వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు మానవ మనుగడ ఆదర్శప్రాయంగా సాగేదానికి మార్గ దర్శకాలు. పై సప్త మహనీయుల మూలంగా కొత మంచిని వ్రాయకలిగాను. విన్నవారు, చదివినవారు కొన్ని నిముషాలైనా మనం ఎవరం?... మన యధార్థ వునికి ఏమిటి?... ఎలా సమాజంలో నడుస్తున్నాము!... ఎలా నడుచుకోవాలి? అని ఆలోచించి ధర్మపధ వర్తనులుగా భావిలో వర్తించగలరని ఆశిస్తున్నాను.
మన భరత వాసులంతా సఖ్యతతో ఒకటిగా వర్తించి మన భారత దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తలమాణక్యంగా ఆదర్శప్రాయంగా వెలుగొందేలా చేయడం మన అందరి కర్తవ్యం, విధి, ధర్మం.
సర్వేజనా సుగుణోభవంతు జై జై జయహో భారతావని... జయహో!!!
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments