top of page

సప్తతత్వాలు - పార్ట్ 2

Updated: Jan 17, 2024



'Sapthathatvalu - Part 2/2' - New Telugu Story Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 01/01/2024

'సప్తతత్వాలు - పార్ట్ 2/2' తెలుగు కథ 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ




4. శ్రీ కృష్ణతత్వం.. 

(ధర్మరక్షణ.. దుష్ట శిక్షణ :- )

దేవకీ వసుదేవ మహారాజుల ఎనిమిదవ సంతతి శ్రీ కృష్ణ పరమాత్మ. 

ద్వాపర యుగ మహా పురుషుడు. పురుషోత్తముడు, శ్రీ మహావిష్ణు మూర్తి, లోకపాలనకర్త. 

దశావతారములను ఆయా కాలాలతో ధర్మరక్షణకు దుష్ట శిక్షణకు ఎత్తారు. అవి,మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, పరశురామ, శ్రీరామ, శ్రీ కృష్ణ, కల్కి దశావతారములు. మొత్తం అవతారములు 21. పైవి అతి ప్రశస్తమైన ప్రధానమైన అవతారములు.  గొప్ప అవతారములలో శ్రీ కృష్ణావతారం తొమ్మిదవ అవతారం. 


వారి తల్లి దేవకి, తండ్రి వసుదేవ మహారాజు. దేవకి తండ్రి ఉగ్రసేనుడు, తల్లి పద్మావతి.  సోదరుడు కంసుడు. వారి వారి రాజధాని మధుర. వీరి రాజధాని వడోదర (గుజరాత్). సోదరి దేవకి వివాహం వసుదేవులతో జరిగిన పిదప వారిని కంసుడు మధురకు రధముపై తీసుకొని వచ్చు సమయమున ఆకాశము నుంచి యోగమాయ, ‘దేవకీ అష్టమ (ఎనిమిది) సంతతి కుమారుడు నిన్ను చంపుతాడ’ని పలికెను. ఆ కారణముగా కంసునకు అంతవరకూ బావ, సోదరీలపై యున్న ప్రేమానురాగాల స్థానంలో ద్వేషము, పగ, భయం కలిగినవి. నిర్ధాక్షణంగా వారిరువురినీ కంసుడు కారాగారమున బంధించినాడు. ఏడుగురు శిశువులను పుట్టగానే చంపేశారు. ఎనిమిదవ శిశువు జన్మించగానే (శ్రీ కృష్ణ పరమాత్మ) కారాగార కాపలా వారు మూర్ఛపోయారు. వశుదేవుడు ఆ శిశువును బుట్టలో పదిలముగా వుంచుకొని యమునానదిని దాటి రేపల్లెకు వచ్చి అంతకుముందే యశోదకు జన్మించిన ఆడబిడ్డను తాను తీసుకొని,, దేవకీ అష్టమ శిశువును యశోద ప్రక్కన పరుండబెట్టి వెళ్ళిపోయాడు. ఆమె భర్త నందుడు. వారు శ్రీ కృష్ణుని పెంచారు. 


శ్రీ కృష్ణుడు, కంసుడు తన తల్లిదండ్రులను కారాగారమున వుంచి హింసించినందుకు, తన సోదరీ సోదరులను ఎనిమిది మందిని చంపినందుకు, అతనిని అతని ఇంటనే వధించాడు. అప్పటికి వారి వయస్సు పదకొండు సంవత్సరాల యాభై రెండు రోజులు. యుగపురుషుడు ఆ విధముగా బాల్యం నుండే దుష్ట శిక్షణ, ధర్మరక్షణ కావించాడు. ఎన్నో అద్భుతాలను చేశాడు. 


5. దుర్యోధనతత్వం:

(స్వార్థం, దాయాదుల పట్ల ద్వేషం, స్వాతిశయం)

కౌరవులు నూర్గురు. వారిలో అగ్రజుడు దుర్యోధనుడు. వీరికి ఒక సోదరి. పేరు దుస్సల. తల్లి గాంధారి. తండ్రి దృతరాష్ట్రుడు (జన్మతః అంధుడు.) గాంధారి సోదరుడు శకుని దుర్యోధనుని మేనమామ, తాంత్రిక జూదరి. 


పాండవులు ఐదుగురు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహాదేవుడు. వీరి తల్లి కుంతీదేవి, మాద్రి. తండ్రి పాండురాజు. ధర్మరాజు జూదప్రియుడు (వ్యసనం) నకుల సహదేవులు ఇరువురు మాద్రి సంతతి. దుర్యోధనుడు స్వాభిమాని. దాయాదుల పట్ల ద్వేషం, పగ. ఆ కారణంగా మామ శకుని సలహామేరకు ధర్మరాజును జూదానికి ఆహ్వానించి, తంత్రజూదరి అయిన తన మామ శకుని చేత పాచికలను వేయించి, పాండవుల సర్వస్వాన్ని గెలుచుకొని (పందెం) ధర్మరాజుని ఓడిస్తారు. శిక్షగా పాండవులను పన్నెండు సంవత్సరములు వనవాసము, ఒక్క సంవత్సరం అజ్ఞాత వాసం చేయవలసినదిగా ఆదేశిస్తాడు దుర్యోధనుడు. వారి కష్టకాలంలో అనేక పర్యాయాలు శ్రీ కృష్ణుడు వారికి సాయం చేశాడు. శ్రీ కృష్ణుడు దీర్ఘదర్శి, కాలజ్ఞాని, మహోన్నతుడు, యుగపురుషుడు. 

వనవాస, అజ్ఞాతవాసాల పదమూడు సంవత్సరాలు గడిచిన తరువాత పాండవులు శ్రీ కృష్ణుని హస్తినాపురానికి రాయబారిగా, రాజ్యంలో సగభాగం ఇవ్వకపోయినా, కనీసం ఐదుగురికి ఐదుగ్రామాలను ఇవ్వవలసినదిగా కోరమని ధర్మరాజాదులు శ్రీకృష్ణులను హస్తినాపురానికి రాయబారానికి పంపారు. 


ఆ మహాసభలో శ్రీ కృష్ణ పరమాత్మ పాండవుల సందేశాన్ని వారి పినతండ్రి ధృతరాష్ట్ర మహారాజుకు వివరించారు. సభాసదులైన విదురుడు, పితామహిలు భీష్ముల వారు, ద్రోణాచార్యులు, కృష్ణాచార్యులు పాండవుల కోరిక సమంజసమని, సగభాగపు రాజ్యాన్ని వారికి ఇవ్వవలసినదిగా దృతరాష్ట్ర దుర్యోధనులకు తెలియజేశారు. స్వార్థపరుడు, దాయాదులపై ఎంతో ద్వేషంతో వున్న దుర్యోధనుడు, సూదిమొన స్థలమును కూడా పాండవులకు ఇవ్వనని చెప్పాడు. పెద్దలందరూ నచ్చచెప్పారు. కానీ దుర్యోధనుడు వారి మాటలను లెక్కచేయలేదు. తన తత్వాన్ని మార్చుకోలేదు. శ్రీకృష్ణుల రాయబారం విఫలమైయ్యింది. వారు పాండవులను కలసి దుర్యోధనుని నిర్ణయాన్ని తెలియజేశారు. యుద్ధం అనివార్యం అన్నారు. కౌరవ పాండవులకు కురుక్షేత్ర సంగ్రామ భూమిపై, పదునెనిమిది రోజుల ఘోర యుద్ధం జరిగింది. కౌరవ సోదరులందరూ, వారి హితులు, సర్వ సైన్యం హతమయ్యారు. ధర్మరాజుల వారికి హస్థినాపురానికి పట్టాభిషేకం జరిగింది. 

దుర్యోధనదాయాది మచ్చరం, కపటం మోసం, వారికి పరాజయం, ధర్మానికి, నీతి నిజాయితీలకు విజయం సిద్ధించింది. సత్యమేవజయతే. 


6. కర్ణతత్వము : 


(స్నేహము, దానము, ధీరము, సూరము, నిజాయితీ)

కురువంశపు రాజు శంతనుడు. వారి మొదటి భార్య గంగ. వారి పుత్రుడు దేవీవ్రతుడు. వారి మరోపేరు భీష్ముడు. బెస్తవాడైన దాశరాజు కుమార్తె కలి. మరొకపేరు సత్యవతి. ఆమెకు మత్స్యగంధ అని కూడా పేరు. 


శంతన మహారాజు, గంగానది తీరాన సత్యవతిని చూచి, మోహిస్తారు. సత్యవతి తండ్రి దాశరాజు, తన కూతురు సంతతికే రాజ్యం సంక్రమించాలని, భీష్మునికి చెందకూడదని షరతు చెబుతారు. గంగాపుత్రుడు భీష్ముడు వుండగా అది ఎలా సాధ్యమని శంతనుడు విచారగ్రస్థుడవుతాడు. తండ్రి విచారతను గ్రహించిన భీష్ముడు, తండ్రి నడిగి కారణం తెలుసుకొని, దాశరాజు సత్యవతుల చెంతకు వెళ్ళి ’నేను నా జీవితాంతం అవివాహితునిగానే ఉండిపోతాను. మీ కుమార్తెను మా నాన్నగారికి ఇచ్చి వివాహం’ చేయమని దాశరాజును కోరుతాడు. ఆ బెస్తరాజు ఆనందంగా తన కుమార్తె సత్యవతి వివాహం, శంతన మహారాజుతో జరుపుతాడు. 


సత్యవతి, శంతన మహారాజులకి ఇరువురు పుత్రులు జన్మిస్తారు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. కాశీరాజు కాశ్యుని కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక. వారి స్వయంవర ప్రకటనను విని మారుతల్లి సత్యవతి ఆదేశానుసారంగా భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్ళి గెలుస్తాడు. షరతు ప్రకారం ఆ ముగ్గురు కన్యలు గెలిచిన వారిని వివాహం చేసుకోవాలి. 


కాశ్యుడు భీష్మునితో వివాహ ప్రసక్తిని తెలుపగా, భీష్ముడు రాజకుమారీలు తమ సోదరులైన చిత్రాంగద, విచిత్రవీర్యులను వివాహం చేసుకోవలయునని, తాను స్వయంవరానికి వచ్చినది, తన తమ్ములైన చిత్రాంగదుడు, విచిత్ర వీర్యులకు వివాహం చేసేటందుకేనని తెలుపుతాడు. 

కాశ్యుని పెద్దకుమార్తె అంబ, సాళ్వుడిని ప్రేమించిన కారణంగా భీష్ముని మాటలను తిరస్కరిస్తుంది. భీష్ముడు అంబిక, అంబాలికలతో హస్తినాపురం చేరుతాడు. చిత్రాంగదుడు సత్యవతి పెద్ద కుమారుడు. పరమ అహంకారి. భీష్ముడు తన శపథం ప్రకారం విచిత్రవీర్యుని ముందు హస్తినాపురానికి రాజును చేశారు. హిరణావతి నది తీరంలో గంధర్వరాజు చిత్రాంగదతో మూడు సంవత్సరాలు యుద్ధం చేసి చివరకు గంధర్వరాజు చేతిలో చిత్రాంగదుడు మరణించాడు. 

రెండవవాడు విచిత్రవీర్యునితో భీష్ముడు, సత్యవతి ఆ ఇరువురి కన్యలకు వివాహాన్ని జరిపిస్తారు. విచిత్ర వీర్యుని హస్తినాపురానికి రాజుగా చేస్తారు. సతతము భార్యలతో అతి సంపర్కము , త్రాగుడు కారణంగా చిత్రాంగదుడు సంతాన రహితముగా, హృద్రోగముతో మరణిస్తారు. 


విచిత్రవీర్యుని మరణానంతరం, సత్యవతి ప్రప్రధమ పుత్రుడు వ్యాసుడు, అంబికలకు (vyasa is biological father ) ధృతరాష్ట్రుడు పుడతాడు.  ధృతరాష్ట్రునకు నూరుగురు పుత్రులు. ఒక కూతురు. 

పాండు రాజు తల్లి అంబాలిక. తండ్రి (విచిత్రవీర్య), వ్యాసుడు. (Biological Father)

వ్యాసుని గడ్డమీసాలను చూచిన అంబాలిక చీదరింపు కారణంగా పాండురాజు శరీరం వన్నెలో మార్పు. మృగముల వేటకు వెళ్ళిన పాండురాజు తాపసి కందమ మునితో క్షత్రియులు మృగాలను వేటాడవచ్చునని వాదించారు. ఫలితంగా ఆ మహర్షి పాండురాజు తన పత్నులతో సరససల్లాపాది ప్రేమ తత్వాన్ని ప్రదర్శించిన,  శవంగా మారుతావని శపించాడు. పాండురాజుకు ఇరువురు భార్యలు. మొదటి భార్య కుంతి. శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవుడి సోదరి. వీరి రెండవ భార్య మాద్రి. మగధరాజకుమారి. 


శాపగ్రస్థుడైన పాండురాజు సంతతికోసం ఇరువురు భార్యలను యముడిని, వాయుదేవుని, దేవేంద్రుని, అశ్వినీదేవతలను ప్రార్థించి వరప్రసాదంగా సంతతి కోరమని చెబుతాడు. పసితనంలో కుంతిదేవి సేవలకు మెచ్చిన వారి కుల గురువు దూర్వాస మహాఋషి ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆ వర ప్రభావం ఆమె, తాను చిత్తశుద్ధితో కోరినప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమవుతారని తాను కోరిన కోర్కెను తీరుస్తానని దీవించాడు. ఆ విషయాన్ని కుంతి పాండురాజుకు చెప్పగా, ఆ రీతిగా సంతానాన్ని పొందాలని దంపతులు నిర్ణయించుకొని యముని వాయుదేవుని, ఇంద్రుని స్మరించి కుంతి ధర్మజ భీమ అర్జునులను కుమారులుగా పొందింది. అదే మంత్రాన్ని పఠించి మాద్రి అశ్వినీదేవతలను వేడుకొని నకుల సహాదేవులను పుత్రులుగా పొందినది. 


దుర్వాసముని వెళ్ళిన తరువాత ఏకాంతంలో గురువుగారు ప్రసాదించి వరపరీక్ష చేయతలచింది కుంతి. సూర్యదేవుని చిత్తశుద్ధితో ధ్యానించింది. ఆ దినకరుడు ప్రత్యక్షమైనాడు. ’ఏం వరం కావాలి అని కుంతిదేవిని అడిగాడు. నాకు చరిత్ర ప్రసిద్ధుడయ్యే గొప్ప వీరపుత్రుడు కావాలని కుంతీదేవి కోరింది. మరుక్షణంలో బంగారు కాంతులతో సహజ కవచకుండలాలతో మగశిశువు ఆమె ముందు వెలిశాడు. 


చిన్నతనం కాబట్టి ఆ శిశు సంరక్షణ ఎలా చేయాలో తెలియక భయంతో తన తల్లిదండ్రులు ఏమంటారో అనే విచారంతో ఒక బుట్టలో ఆ శిశువును ఉంచి ప్రవహించే గంగానదిలో వదిలేసింది కుంతి. గంగా ప్రవాహంలో ముందుకు వెళుతున్న బుట్టను సుధాముడు (రధసారధి) అతని భార్య రాధ చూచారు. బుట్టను దరికి చేర్చుకొని అందున పొత్తిళ్ళలో మెరిసిపోతున్న బాబును చూచి, చేతిలోనికి తీసుకొని వారి నిలయం చేరి ఆ దైవం ప్రసాదించిన బిడ్డగా భావించి, ఎంతో గారాబంగా పెంచసాగారు. సహజ కవచ కుండలాలు కల ఆ బిడ్డకు వారు ’కర్ణుడు’ అని నామకరణం చేశారు. సూతుడు, ధృతరాష్ట్రు మహారాజు కొలువులో సారధిగా పనిచేసేవాడు. 


కర్ణుడు తాను రధచోదకుని కుమారుడని అందరూ విమర్శించడం విని అన్ని విధ్యలూ రాజకుమారుని వలె అభ్యసించదలచి పరశురాయ గురువులను ఆశ్రయించాడు. తాను బ్రాహ్మణుడనని చెప్పి వారి వద్ద సర్వవిద్యలూ నేర్చుకొన్నాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుని తొడపై తన శిరస్సు ఉంచి శయనించాడు. 


పేడపురుగు ఒకటి కర్ణుడి తొడపై వాలి తొండాన్ని గుచ్చి రక్తాన్ని త్రాగసాగింది. ఆ పురుగు ఏర్పరచిన గాయం నుండి రక్తం, క్రింద ప్రవహించసాహింది. అయినా కర్ణుడు గురువుగారికి నిద్రాభంగం కలుగ రాదని తలచి, కదలలేదు, బాధను సహించాడు. 


నేలపారిన రక్తం పరశురాముల వీపు ప్రాంతానికి చేరింది. చల్లని ఆ రక్తస్పర్శకు పరశురాముడు మేల్కొన్నాడు. కర్ణుని ముఖంలోనికి చూచాడు. మహనీయులైన వారికి విషయం అర్థం అయింది. వారిలో ఆవేశం పెరిగింది. ’నావద్ద నీవు అభ్యసించిన ఏ విద్యా నీకు ఆపద సమయంలో ఉపయోగపడవు గాక!’ అని శపించాడు పరశురాముడు. ఆయన జమదగ్ని రేణుకా తనయుడు. విచారంతో కర్ణుడు తన నిలయం చేరాడు. 


ధృతరాష్టునికి నూర్గురు తనయులు. పాండురాజుకు ఐదుగురు పుత్రులు. సర్వవిద్యలను వారి గురువులు ద్రోణాచార్యులు,  కృపాచార్యుల వద్ద అభ్యసించి, సభాసదుల ముందు వారి వారి ప్రతిభలను వెల్లడి చేయు సమయమున కర్ణుడు అక్కడికి వెళ్ళారు. ఆ బల ప్రదర్శనను చూచారు. అర్జునుని గాండీవ ప్రదర్శన అందరి అభిమానాన్ని చూరకొన్నది. ద్రోణాచార్యులు, అర్జునుని జగదేకవీరునిగా సభలో ప్రశంసించారు. కుంతికి పరమానందం. కౌరవుల తల్లి గాంధారికి, ఆమె జేష్ట పుత్రుడు దుర్యోధనునకు, ద్వేషం. ప్రదర్శన శాలలో ప్రవేశించిన కర్ణుడు, అర్జునునిపై సవాలు విసిరాడు. 


’నీవు సూత పుత్రుడ.వు క్షత్రియరాజ పుత్రుడవు కావు. బలప్రదర్శనకు నీవు అయోగ్యుడవు’ అన్నాడు ద్రోణాచార్యుడు. కర్ణుని రూపురేఖలను చూచి మాటలను విన్న దుర్యోధనుడు అతని మైత్రికోరి, కర్ణుని అంగదేశానికి రాజుగా నియమించాడు. ఆ రీతిగా కర్ణుడు అంగరాజుగా, దుర్యోధనునకు విశ్వాస పాత్రుడైన మిత్రుడుగా మారిపోయాడు. 


రాయబారమునకు వచ్చిన శ్రీకృష్ణుడు, కర్ణుని కలిసికొని, ’నీవు నిజముగా సూత పుత్రుడవు కావు. నా మేనత్త కుంతికి సూర్య భగవానుల మూలంగా, ఆమె ప్రధమ పుత్రుడిగా జన్మించావు. కౌరవులను వీడి పాండవుల పక్షానికిరా, నీవు పాండవాగ్రజుడవు అవుతావు. హాస్తినాపురానికి మహారాజువౌతావు అని చెప్పి అతనిని పాండవుల పక్షానికి మార్చడానికి  ప్రయత్నించాడు. సమాధానంగా కర్ణుడు ’భవిష్యత్తు నాకు తెలుసు కృష్ణా. యుద్ధం జరుగుతుంది. దానికి హోత అర్జునుడు. విజయం పాండవులదే. కానీ ప్రాణభయంతో రాజ్య కాంక్షతో నేను నా మిత్రుడు దుర్యోధనుని వీడి పాండవ పక్షానికి రాలేను. ఈ దానవీర శూర కర్ణుడు ఆడిన మాట తప్పడు’ అంటాడు కర్ణుడు. 



యుద్ధం కురుపాండవులకు తధ్యం అయినప్పుడు దేవేంద్రుడు బ్రాహ్మణ రూపధారిగా కర్ణుని వద్దకు వచ్చి దానాన్ని యాచిస్తాడు. అతని కోర్కె ప్రకారం మాట తప్పకుండా తన సహజ కవచ కుండలాలను దేవేంద్రునకు సమర్పిస్తాడు కర్ణుడు. యుద్దభూమిలో గురువు పరశురాముని శాపరీత్యా అస్త్ర శాస్త్ర ప్రయోగాన్ని అర్జునునిపై చేయలేక వీరమరణం పొందుతాడు. చరిత్రలో వారిపేరు దానవీరశూర కర్ణుడుగా శాశ్వతంగా నిలిచిపోయిండి. ఎన్ని సంవత్సరాలు జరిగినా కర్ణ చరిత చెదరనిది, తరగనిది. 



7. హరిశ్చంద్ర తత్వం 


(: సత్యపాలన, ధర్మరక్షణ:-)

హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశములోని ప్రముఖ చక్రవర్తి. సత్యవ్రతుని కుమారుడు. వారు సతతము సత్యమునే పలుకవలెనని నియమం కలవారు. పాటించువారు. వారి అర్థాంగి చంద్రమతి. కొడుకు లోహితాస్యుడు, మంత్రి సత్యకీర్తి. వీరూ మహా సత్యసంధులు. ఒకనాడు దేవలోకములో దేవేంద్రుని కొలువు లో అచ్చట కొలువు తీరియున్న మహాఋషులు, వసిష్టుడు, విశ్వామిత్రులను చూచి దేవేంద్రుడు ప్రపంచములో సత్యసంధుడు ఎవరు అని ప్రశ్నించెను. 


వసిష్ట మహర్షి హరిశ్చంద్ర చక్రవర్తి అని జవాబు చెప్పిరి. వసిష్టుల వారి మాటలు నచ్చని విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్రుడు అంతటి సత్యసంధుడా? నేను అతనిని బొంకించెద అని శపదము చేసెను. 

విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని కలిసి తొలుత వారి యావత్ రాజ్యమును దానముగా స్వీకరించెను. అంతకుముందు తన యజ్ఞమునకు హరిశ్చంద్రుడు ధనమును ఇస్తానని వాక్కు ఇచ్చియుండిన కారణముగా, తాను పూర్వము అడిగిన ధనమును ఇమ్మని అడిగెను. ముందుగా తన సర్వసామ్రాజ్యాన్ని దానం చేసిన హరిశ్చంద్రుడు తన భార్యా బిడ్డను కౌశికుడు, కలహకంఠ అను బ్రాహ్మణ దంపతులకు విక్రయించి, తాను కాటికాపరి చండాలునికి అమ్ముడుపోయి కాటికాపరిగా మారి, విశ్వామిత్రునికి ధనమును చెల్లించెను. విశ్వామిత్రుడు అతని కుమారుడు లోహితాస్యుడిని పాముచేత కరిపించి చంపెను. వారి భార్య మీద శిశు హత్యా నేరమును మోపెను. ఎన్నో కష్టములు వచ్చిననూ హరిశ్చంద్రుడు ఆడిన మాటను తప్పలేదు. 


పాము కరిచి చనిపోయిన కుమారుని స్మశానమునకు తీసుకొని వెళ్ళిన చంద్రమతిని కాటికాపరి హరిశ్చంద్రుడు కాటిసుంకము చెల్లించనిదే శవ సంస్కారము జరగదని చంద్రమతికి చెప్పెను. చంద్రమతి మహా పతివ్రత. ఆమె మాంగల్యం చూచిన హరిశ్చంద్రుడు మెడలోని మాంగల్యాన్ని విక్రయించి కాటి సుంకమును చెల్లింపుమని చంద్రమతిని ఆదేశించెను. 


హరిశ్చంద్రుని సత్యనిరతికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వారి సుతుని బ్రతికించిరి. పశ్చాత్తాపంతో విశ్వామిత్రుడు నీవు ఒట్టి హరిశ్చంద్రుడివి కావు. సత్య హరిశ్చంద్రుడివి. నీవు గెలిచావు. నేను నా సంకల్పం ఓడినవి. నీ నుండి నేను గ్రహించిన సకల సంపదలు ఇకపై నీవి. యుగాంతం వరకూ శాశ్వతంగా నీపేరు సత్యానికి మారురూపుగా సత్య హరిశ్చంద్రుడుగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవునని ఆశీర్వదించెను. సత్యహరిశ్చంద్రుడు తన భార్యా పుత్రునితో తన రాజధాని మన్‍డోర్‍కు చేరి, ఆనందంగా సర్వ సౌభాగ్యాలతో శేష జీవితాన్ని సాగించారు. 

చరిత్రలో చెరగని మహాచరిత్ర సత్య హరిశ్చంద్రుల వారిది. సత్యానికి ప్రతిరూపం శ్రీ సత్యహరిశ్చంద్ర మహారాజు

ఈ చరాచర సృష్టిలోని జీవరాసుల్లో మానవజన్మ మహోన్నతమైనది. ఆ దైవం మనిషికి రెండు మహోన్నత శక్తులను ప్రసాదించాడు. ఒకటి జ్ఞాపకశక్తి. రెండవది విచక్షణ. చరిత్రలోని మహనీయులందరూ ఆ మహత్తర శక్తులను సద్వినియోగం చేసుకొని చరిత్ర నాయుకులై చరిత్రలో సజీవంగా నిలిచిపోయారు. 


మరుజన్మ వున్నదో లేదో! ఈ మహోన్నత జన్మ విశిష్టతను ఎరిగి నిత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, అభిమానం, సౌభ్రాతృత్వం, విశిష్టతను గ్రహించి, పాటించి కన్న తల్లిదండ్రులకు బంధుమిత్రులకు యావత్ సమాజ సభ్యులకు ప్రేమానురాగాలు ఆనందాన్ని పంచి ఈ జన్మను సార్థకత చేసుకోవడమే మంచి మానవత్వం.. ఆ తత్వాన్ని పాటించి జీవితాన్ని సాగించేవారే అసలు సిసలైన మానవులు. 


పై సప్త గుణాలలో రావణ దుర్యోధనల గుణాలు అమానుషత్వానికి నిదర్శనాలు. బలిచక్రవర్తి, శ్రీరామచంద్రుడు, శ్రీ కృష్ణుడు, కర్ణుడు, సత్య హరిశ్చంద్రుడు.. ఈ ఐదుగురి గుణాలు ప్రాపంచిక మానవాళికందరికీ ఆదర్శాలు, అనుసరణీయాలు. 


సమాప్తి

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page