top of page
Writer's picturePandranki Subramani

సరదాగా సందడి కోసం


'Saradaga Sandadi Kosam' - New Telugu Story Written By Pandranki Subramani 'సరదాగా సందడి కోసం' తెలుగు కథ

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఇప్పటి ఆందోళనకర పరిస్థితి యెలాంటిదో యెలా విస్తరిస్తుందో అందరికీ అవగతమే. నా బడిరోజుల్లో నేను చదివిన అపరాధ పరిశోధక నవల్సులో ఒక పదం తరచుగా కనబడేది- లాకప్. ఇప్పడు అదే రీతిన వినిపించే పదం- లాకవుట్.


సామాజిక వాతావరణం యెంత జటిలంగా తయార యిందంటే; మనిషి తోటి మనిషిని మానవ రూపంలో చూడడం మానుకుంటున్నాడు. అల్లంత దూరం నుంచి పరికిస్తూనే కరోనా వైరస్ గానో మరొక కొత్తరకపు వైరస్ గానో తల పోస్తున్నాడు. కరోనాను కట్టెదుట చూస్తున్నట్లే బెరుకు బెరుకుగా చూస్తున్నాడు. ముఖ కవచాన్ని తరచుగా సర్దుకుంటున్నాడు. బిర్ర బిగించుకుంటున్నాడు.

రోడ్డుపైన కనిపిస్తే చాలు నడచిపోతూన్న మనిషిని గుర్రుగా అదోలా కళ్ళు మిటకరిస్తూ దగ్గరకు వస్తున్నాడు రక్షక భటుడు.


ఇటువంటి క్లిష్ట సమయంలో యిరుగ పొరుగు ప్రయాణాలకు దూరమయి యింట్లోనుంచి బైటకు కాలుపెట్టలేని స్థితికి లోనయిన ఒక విశ్రాంత ప్రభుత్వోద్యోగి పరిస్థితి యెలా ఉంటుంది? ఊహించడానికే కంపరం కలుగుతుంది కదూ! వెన్నెముకలో చలి పుడ్తుంది కదూ! ఇంటా బైటా వైరస్ కి మొదటి టార్గట్ అరవై యెళ్ళు పైబడ్డ విశ్రాంత జీవులే--


విశ్రాంత కేంద్ర ప్రభుత్వోద్యోగిగా దాదాపు నా పరిస్థతి కూడా అంతే-- అధ్యయనంలో మునిగి తేలడం యెంతటి ఆసక్తి గల అంశమైతే మాత్రం, రోజంతా పుస్తకం చేతబట్టుకుని కూర్చోలేము కదా! బిరబిర వ్రాస్తూ ఉండలేము కదా! అందులో వార్తా పత్రికల ప్రచురణలు కూడా కరువాయె-- అటువంటి స్తబ్ధ వాతావరణంలో ఆ రోజు అందరిలాగే నేను కూడా యథాలాపంగా టీవీని ఆన్ చేసాను.


ఉలిక్కిపడుతూ కళ్ళు మిటకరించాను, రివటలాంటి ఇద్దరమ్మాయిలు గెంతులు వేస్తున్నా రు. ఆడుతూ పాడుతూ చీరచెంగుల్ని ఉండలు చుట్టుకుంటూ గుట్టలపైకి యెక్కేస్తున్నారు. పూల చెట్ల పొదల్లోకి యెవరూ దూరలేని సందుల్లోకి దూకేస్తున్నారు.


ఇద్దరూ చేతులు పైకెత్తి ఉద్వేగపూరితంగా పాడుతూ ఆకాశాన్ని దగ్గరకు రమ్మనమని ఆహ్వానిస్తున్నారు. అసలీ అమ్మాయిలిద్దరూ మానవ లోకానికి చెందినవారేనా! లేక టీవీ చానెల్ వాళ్ళు పొరపాటున ఎప్పటిదో ప్రాత కార్యక్రమాన్ని తిరిగదోడి చూపిస్తున్నారా, ఇప్పటి కాలమాన ఉద్రిక్త పరిస్థితుల్ని అలవోకగా విస్మరించి!


చూసినవారు నవ్విపోదురు గాక—కాదు! అటువంటిదేమీ జరగ లేదు. యవ్వన ప్రాయంలో ఉన్న అమ్మాయిలిద్దరూ పూర్తి స్పృహతోనే ఉత్సాహాన్ని పుణికి పుచ్చుకునే చెంగు చెంగున నాట్యమాడుతున్నారు. టీ వీ చానెల్ వాళ్ళు కావాలనే ఆ కార్యక్రమాన్ని చూపిస్తున్నారు. ఇదెలా తెలుసుకున్నానంటే— చిట్ట చివరన ఒక వ్యాఖ్యానాన్ని చేసారు యాంకర్లు—కొద్ది సేపు కరోనాను మరచి సరదాగా ఉందామని-- అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. ఉన్నపాటున గతంలోకి వెళ్ళిపోయాను.


నా జీవితంలోనూ సరదాగా సంతోషంగా గడిపిన సంఘటనులు ఉన్నాయి కదా-- ఎప్పుడూ మార్కు లిస్టులా వస్తూన్న కరోనా కేసుల గురించే, వేసుకోబోబ బూస్టర్ డోసుల గురించే పదే పదే తలపోస్తూ ఉండేకన్నా నా కెదురైన ఒకటి రెండు నవ్వు పుట్టించే ఉదంతాలను తోటివారితో పంచుకోవచ్చు కదా! మనసుని అటునుంచి యిటు మళ్ళించ వచ్చు కదా! కథల రాయుడిగా ఇది నా కనీస సామాజిక కర్తవ్యం కాదూ!


సాధారణంగా పరిచయం లేని ప్రాంతాలకు వెళ్ళడం యెవరకైనా ఇబ్బందికరమైన విషయమే-- అందులో భాష రాని స్థలాలకు వెళ్ళడం మరింత యిబ్బందికరం. పరభాష పూర్తిగా తెలియకపోతే పర్వాలేదు. బాగా తెలిస్తే మరింత మంచిది. సగం తెలిసి సగం తెలియకపోవడం నిజంగా ఊహించలేని పరిస్థతిని సృశ్టిస్తుంది.


హిందీలో పచ్చాస్- పచ్చీస్ అన్న రెండు అంకెలున్నాయి. పచ్చాస్ అంటే యాభై, పచ్చీస్ అంటే ఇరవై ఐదు. నా వరకు ఈ రెండు అంకెలూ నన్ను తెగ తికమక పెట్టేస్తుండేవి. ఈ పరిస్థితి నాకు మాత్రమే అనుకునే వాణ్ణి. కాని చాలా మంది దక్షిణాది వాళ్ళకు ఇదే పరిస్థితని తరవాత తెలిసొచ్చింది.


ఎలాగంటే- యెప్పుడంటే—ఒకసారి నేషనల్ అకాడమీ లో ట్రైనింగు కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు, కరోల్ బాగ్ మెయిన్ రోడ్డులో ఇద్దరు ముగ్గురు సహోద్యోగులతో నడచి వెళుతున్నప్పుడు అటు ఫుట్ పాత్ పైన యెవరో వేగంగా పరుగు వంటి నడకతో సాగుతున్నట్టనిపించి చూపులు నిక్కించి చూసాను. తెలిసిన వ్యక్తిలా అగు పించాడు. అతడెవరో కాదు. కేరళనుండి ట్రైనింగు ప్రోగ్రాము కోసం వచ్చిన రామచంద్రనాయర్.


ఎందుకో మరి అతడి వెనుక మరొక ఢిల్లీ ప్రాంతపు మనిషి అదే పరుగు వంటి నడకతో వెన్నంటి వెళ్తున్నాడు. అదేమంత క్షేమకర పరిస్థితి కాదని ఊహించి నేనటు వేగంగా రోడ్డు దాటి వెళ్ళాను. ఈ లోపల రామచంద్రనాయర్ బట్టల దుకాణంలోకి దూరిపోయాడు. అతణ్ణి వెన్నంటి ఢిల్లీ మనిషి కూడా ప్రవేశించాడు. నేను వాళ్ళ మధ్యకు దూరి విషయం యేమిటని ఆరాతీసాను.


నాయర్ గట్టిగా యింగ్లీషులో చెప్పాడు- “నేను ఆటోరిక్షా యెక్కక ముందు నాకు తెలిసిన వాళ్ళను- గీరాకీ గురించి బాగా అడిగే యెక్కాను- పచ్చాస్ కంటే యెక్కువివ్వకన్నారు. తీరా యిక్కడకు వచ్చిన తరవాత ఈ రిక్షావాడు యెక్కువడుగు తున్నాడు. నేను చచ్చినా యిచ్చేది లేదు”


నేనప్పుడు రిక్షావాడి వేపు తిరిగి నిలదీసాను- “ఇదెక్కడి న్యాయమయ్యా! కరెక్టుగా పచ్చాస్ యిస్తుంటే యింకా కావాలంటున్నావట—వేరే ప్రాంతం వాళ్లను యిలాగేనా దబాయిస్తావు?”

అప్పుడు క్యాట్ ఈజ్ ఔటాఫ్ ది బ్యాగ్ అంటారే- అలా వాస్తవం బైటపడింది, ”సార్! నేనేమీ యెక్కువడగటం లేదు. అక్కణ్ణించి యిక్కడకు పచ్చీస్ మాత్రమే ఔతుంది. పచ్చాస్ వద్దు- అని నా జేబునుండి ఇరవై ఐదు రూపాయల చేంజ్ తీసి యిస్తుంటే ఈయన యేదేదో యింగ్లీషులో అంటూ యిటు పరుగెత్తుకు వస్తున్నాడు, అంతేనండి మేటర్! “అంటూ ఇరవై ఐదూ నా చేతిలో పెట్టాడు.


ఆ డబ్బుల్ని రామచంద్రనాయర్ కి అందిస్తూ విషయాన్ని వివరించాను- “లెక్క ప్రకారం పచ్చాస్ యెక్కువయ్యా! పచ్చీస్ దానికంటే తక్కువ. నిజాయితీ పరుడైన ఆ రిక్షావాడు ఇరవై ఐదు మాత్రమే తీసుకుని మిగతాది వాపస్ చేసాడయ్యా బాబూ! ఇది అర్థం చేసుకోకుండా మీరు పోలీస్ స్టేషన్ కి వెళతానన్నారట. ఇది మీకు తగునా! “


నాయర్ తెల్లబోయి నిల్చున్నాడు. ఇదీ సగం తెలిసీ సగం తెలియని హిందీ వల్ల వచ్చిన తంటా--


ఇక నా విషయానికి వస్తాను. నేను మొదటిసారి గజిటెడ్ పోస్టుకి యెంపికైనప్పుడు నన్ను రాజస్థాన్ లో ట్రైనింగు అకాడమీకి పంపించారు. నాతో బాటు నాతోటి బ్యాచ్ ప్రమోటీస్ ని కూడా అదే అకాడమీకి పంపించారు. సాధారణంగా అకాడమీ నిర్వాహకులకు ఒక ఆనవాయితీ ఉంది. శిక్షణ కోసం వివిధ ప్రాంతాలనుండి వచ్చే ఆఫీసర్లకు యేకబిగిన ట్రైనింగు తరగతులు నడిపి విసుగుదల కలిగించ కూడదని చుట్టు ప్రక్కల ఉన్న ఊళ్ళకు వెసులుబాటుగా తీసుకెళ్ళి అక్కడి విశేషాలను వివరిస్తారు.


ఈ పర్యటనలు చిన్నవయినా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ ఊపున మమ్మల్ని జైపూర్ చుట్టూ తిప్పించి అక్కడి రాజసౌధాలను కూడా చూపించి నగరం మధ్యనున్న ఒక పార్కులో మమ్మల్ని విడిచిపెట్టారు. అందరూ చెదరిపోయి వాళ్ళకు వాళ్ళు ఊసులాడుకుంటూ పార్కు చుట్టూ తిరగసాగారు.


కాని నా దృష్టి వేరు. ఒక వటవృక్షం చుట్టూ వలయాకారంలో కూర్చున్న రాజస్థానీ స్త్రీలవేపు నా చూపు మళ్ళింది. ఒక్కొక్క స్త్రీ ముందూ ఒక్కొక్క భారీ మట్టి కుండ ఉంది. వచ్చీ పోయే వాళ్ళందర్నీ రాజస్థానీ భాషలో పిలుస్తున్నారు మంచి నీళ్లు తాగి వెళ్ళమని. నేను మైమరిచాను. మేను గరిక పొడిచింది. ఆహా! ఇది కాదా పుణ్య భూమి భారతి! రాజస్థాన్ యెండల్లో పడి దప్పికతో వస్తూన్న వారిని యెంత సౌమ్యంగా ఆదరించి పిలుస్తున్నారు! మనసులోనే జోహార్లు అర్పించి ఒక వాటర్ ఉమెన్ ముందు నిల్చున్నాను.


ఆమె ఆప్యాయంగా లోటా నీళ్ళు గ్లాసులో పోసి యిచ్చింది. నీళ్ళు చల్లగా ఉన్నాయి. ఎడారి ప్రాంతాలకు సమీపంగా ఉన్న జైపూర్ లో యింతటి చల్లని నీళ్ళు యెక్కడ దొరుకుతాయబ్బా- అనుకుంటూ థేంక్శు చెప్పి లోటా తిరిగిస్తూ వెను తిరగబోయాను.


ఆ వాటర్ ఉమెన్ పిలిచింది. ఓహో! మరొక లోటా నీళ్ళు తీసుకోమని పిలుస్తుందనుకుని నవ్వుతూ చేయి చాచి మంచి నీళ్ళ గ్లాసు అందుకుని తాగి మరొకమారు థేంక్సు చెప్పి వెనుతిరిగాను.


ఆమె మళ్ళీ పిలిచింది. ”నో ధేంక్సు నో థేంక్సు! ఇక చాలు! ”అంటూ చకచకా నడిచాను మా బ్యాచ్ గుంపులోకి చేరిపోవడానికి. అలా కొన్ని అడుగులు వేసానో లేదో ఒక ఉత్తరాది ట్రైనీ వేగంగా వచ్చి నన్నాపాడు. ”మీరక్కడ కుండ నీళ్ళు తాగారా ?“


“ఔను తాగాను. నీళ్లు శుభ్రంగా చల్లగా ఉన్నాయని కూడా మెచ్చుకున్నాను“


“ఆ నీళ్ళావిడ పిలుస్తున్నా మీరు ఆగకుండా వచ్చేసారట-- “


“ఔను. రెండు గ్లాసుల నీళ్ళు తాగిన తరవాత మళ్ళీ పిలిచిందావిడ. ఇక నా వల్ల కాదని వచ్చేసాను “


“అయ్యోరామ! మిమ్మల్నావిడ పిలుస్తున్నది మరొక గ్లాసు నీళ్ళు తాగమని కాదు. మీరు తాగిన రెండు గ్లాసులకీ డబ్బులివ్వమని—“


ఉలిక్కి పడ్డాను. జాతర్లప్పుడు అన్నదానంలా ఆమె నాకు నీళ్ళ దానం చేస్తుందనుకున్నానే గాని, డబ్బులకు నీళ్ళు అమ్ముతుందనుకోలేదు. నిదానంగా నడచి వెళ్ళి సారీ చెప్తూ డబ్బులు చెల్లించి వచ్చాను.


ఇప్పుడు మాటలో మాటగా విధి విన్యాసం గురించి ఒకటి చెప్పాలి. ఇప్పుడు మా పెద్దబ్బాయిని వివాహమాడిన పెద్దకోడలు రాజస్థానీ అమ్మాయే! ఈ అమ్మాయిని చూస్తున్నప్పుడల్లా నాకు అప్పటి ఉదంతం గుర్తుకి వస్తుంటుంది. మరి మీకు?

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.







51 views0 comments

コメント


bottom of page