top of page

సరైన మందు

#JeediguntaSrinivasaRao, #SarainaMandu, #SarainaMandu, #JeediguntaSrinivasaRao, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Saraina Mandu - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 27/04/2025

సరైన మందు - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“యిదిగో! శేఖరబాబు రాత్రి పోయాడుట, నిన్న ఉదయం బాగానే పలుకరించాడు, ఆరోగ్యం కూడా మంచిదే పాపం. ఎందుకు అలా అయ్యిందో.. నువ్వు రెడీ అవుతే వెళ్లి చూసి వద్దాం” అన్నాడు భార్య కాంతం తో రమేష్. 


“అయ్యో ఏమిటో దేవుడి నిర్ణయం, నిన్న నాతో కూడా మాట్లాడి ‘అన్నయ్య.. ఏం తిన్నావు అంటే ఎప్పుడూ ఇడ్లీ అంటున్నాడు, వారం కి రెండు మూడు రకాల టిఫిన్స్ చేసిపెట్టు వదినా. అన్నాడు. మీరేమో గారెలు, పూరీలు తిన్నా, నూనె వస్తువులు ఎందుకు తింటావు అని అంటారని అందరికి ఇడ్లీ అని ఒక్కటే జవాబు యిస్తారు. వాళ్లు మీకు ఏమిచేసి పెట్టటం లేదనుకుని నాకు బోధలు చేస్తారు” అంది. 


“ఉరుకోవే, యిప్పుడు విషయం అదికాదు. మనం వెళ్లి పలకరించకపోతే శేఖరబాబు భార్య ఏమనుకుంటుంది? త్వరగా యిల్లు తాళం వేసి బయలుదేరు” అన్నాడు కారు తాళం కోసం వెతుకుంటూ. 


“ఒక మాట, మీరు అసలే భయస్థులు. అనుమానం ఎక్కువ. అక్కడ జరిగే తంతు చూసి దడుచుకుంటారేమో, రెండు రోజులు అయిన తరువాత వెళ్లి పలుకరిద్దాం” అంది కాంతం. 


“నాకు అటువంటి భయం లేదు. పుట్టినవాడు గిట్టక మానడు. దానికి భయమెందుకు పిచ్చదాన, పదా” అంటూ కారు స్టార్ట్ చేసాడు. 


“కొంతదూరం డ్రైవ్ చేసిన తరువాత “నీకు రోడ్డు మీద ఎవ్వరైనా కనిపిస్తున్నారా” అన్నాడు భార్యతో రమేష్. 


“అదేమిటి మీకు కనిపించడలేదా” అంది. 


“ఏమిటో కళ్ళు మసకగా ఉన్నట్టు గా వుంది” అన్నాడు.


“బాబోయ్.. క్యాబ్ లో వెళ్దాం అంటే కారు వున్నది ఎందుకు అంటూ యిప్పుడు రోడ్డు మీదకి వచ్చిన తరువాత కనిపించడం లేదు అంటే ఎలా” అంది. 


“వూరికే అన్నాను నీ ఫీలింగ్స్ చూడటానికి, కనిపించకపోతే ఈపాటికే ఆక్సిడెంట్ అయ్యేదిగా” అన్నాడు నవ్వుతూ రమేష్. 


“ఛాలెండి మీ తమాషా, యిదే చివరిసారి, యిహ మీరు కారు నడుపుతే నేను కారు ఎక్కను” అంది కాంతం. 


శేఖరబాబు యింటికి చేరుకున్నారు. వరండాలో కూర్చున్నవాళ్లు టిఫిన్స్ తింటున్నారు. ముందు గదిలో ఐస్ పెట్టెలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకుని వున్నాడు శేఖరబాబు. రమేష్ ని కాంతం ని చూడగానే శేఖరబాబు భార్య, అతని కూతురు గొల్లుమని ఏడ్చారు. బయట టిఫిన్ తింటున్న చుట్టాలు కూడా టిఫిన్ తింటాం ఒక నిమిషం ఆపి గొల్లుమని, మళ్ళీ తినడం మొదలుపెట్టారు. కాంతం శేఖరబాబు భార్య దగ్గర కూర్చొని వొదరుస్తోంది. రమేష్ మెల్లగా బయటకు వచ్చిటిఫిన్స్ తింటున్న చుట్టాలు పక్కన కుర్చీలో కూర్చున్నాడు కళ్ల నీళ్లు తుడుచుకుంటూ. 


ఇంతలో ఒక కుర్రాడు ప్లేటులో రెండు ఇడ్లీ, ఒక వడా వేసి తీసుకుని వచ్చి రమేష్ కి యిచ్చాడు. 


“వద్దు బాబూ, చెట్టంత మనిషి పోతే ఏమి తింటాము” అన్నాడు. 


అంతలో పక్కన కూర్చుని వున్న ఒక పెద్దాయన, “తినకపోతే మనం పోతాం షుగర్ పడిపోయి, తినండి పరవాలేదు, దేనికదే” అన్నాడు. 


నిజమే.. చేతులు వణుకుతున్నాయి. అలా అని ఐస్ పెట్టి కి ఎదురుగా పెట్టుకుని తినాలనిపించక భార్య ఏమి చేస్తోందో అని లోపలికి వెళ్ళాడు. లోపల శేఖరబాబు భార్యతో సహా అందరూ కాఫీలు తాగుతున్నారు. 


‘అవునులే.. పోయినవాళ్ళతో మనము పోతామా’ అనుకుంటూ టిఫిన్ ప్లేట్ అందుకుని షాంయనా లో వున్న కుర్చీలో కూర్చుని రెండు ఇడ్లీలు తిని మంచినీళ్లు తాగి అమ్మయ్య అనుకున్నాడు. 


గోవిందా గోవిందా అనే అరుపులతో అంబులెన్సు శేఖరబాబు ని ఎక్కించుకుని వెళ్ళిపోయింది. వచ్చిన లోకల్ చుట్టాలు కూడా మెల్లగా వాళ్ళ ఇళ్ళకి బయలుదేరారు. శేఖరబాబు శవం కి చేసిన చివరి తంతు గురించి ఆలోచిస్తూ కూర్చొని వున్నాడు రమేష్. 


“ఏమిటి ఆలోచిస్తున్నారు, అందరు వెళ్లిపోతున్నారు, పదండి మనం కూడా బయలుదేరుదాం” అంటూ వచ్చింది కాంతం. 


పదా అంటూ కారులో కూర్చుంటూ, “శేఖరబాబు కి చాలా మంది బంధువులు మిత్రులు వున్నారు. యిల్లు కిటకిటలాడిపోయింది. మనకి అంతమంది వస్తారంటావా” అన్నాడు. 


“శుభం ఆలోచించక కీడు గురించి ఎందుకండి ఆలోచిస్తారు. ఎంతమంది వచ్చారో పోయినవాడికి తెలియదు కదా, అనవసరంగా ఆలోచించక ముందు ఆ షుగర్ కేన్ జ్యూస్ షాప్ దగ్గర ఆపండి. చెరో గ్లాసు జ్యూస్ తాగితే మనసు కుదుటపడుతుంది” అంది. 


షుగర్ కేన్ జ్యూస్ తాగుతు “అవును.. ఆ పరుపు, దిండ్లు బయటపడేసింది ఏమిటి శేఖరబాబు కోడలు” అన్నాడు.


“ఆయన మంచం మీదే పోయాడుట, అందుకే ఆ పరుపు తలగడా దుప్పట్లు చాకలి తీసుకొని వెళ్ళిపోతాడు” అంది జ్యూస్ తాగుతో. 


యింటికి వచ్చినా ఏదో ఆలోచిస్తోనే వున్న భర్తని చూసి బహుశా శేఖరబాబు గారు లేరు అనే విషయం జీర్ణం చేసుకోలేకపోతున్నారు అనుకుంటా, పైకి సింహం లా వుంటారు కాని లోపల విపరీత భయస్తుడు అనుకుని డిన్నర్ తయారుచేసి భర్తని పిలిచి భోజనం చేసారు. 


అర్ధరాత్రి మెలుకువ వచ్చిన కాంతం కి మంచం మీద రమేష్ లేకపోవడంతో బెడ్ రూమ్ నుంచి హాల్ లోకి వచ్చి ఉలిక్కి పడింది. 


హాల్ మధ్యలో పాత చాప వేసుకుని తలకింద పాత తలగడా పెట్టుకుని పడుకుని వున్నాడు భర్త. గుర్రు వినిపిస్తోంది. హాయిగా ఏసీ రూమ్ వదిలి ఇక్కడకి వచ్చిపడుకున్నారేమిటి అనుకుంటూ వెళ్ళి పడుకుంది. 


ఉదయం లేచి భర్తతో “పడుకుంది చాలు లేవండి” అంది కాంతం. 


“యింకో పదినిముషాలు పడుకోనీ “ అన్నాడు రమేష్. 


గేటుకి కట్టిన సంచిలోనుంచి పాలప్యాకెట్ తీసుకుని లోపలికి వచ్చింది. పాలు స్టవ్ మీద పెట్టి డికాషన్ తీస్తున్న కాంతం కి ‘ఎంత పని జరిగింది కాంతమ్మ తల్లో, దేవుడు నీకే అన్యాయం చెయ్యాలా’ అంటూ ఏడుస్తూ లోపలికి వచ్చిన పనిమనిషి రమేష్ పడుకున్న చాప చుట్టూ తిరుగుతోంది. 


“ఆగు, నువ్వు అనుకున్నది కాదు, రాత్రి నిద్రపట్టక యిక్కడ పడుకున్నారు సార్” అంది కాంతం. 


పనిమనిషి ఏడుపులకి ఉలిక్కిపడి లేచి, చాప ని సోఫా కిందకి తోసి దిండు పట్టుకొని బెడ్ రూమ్ లో కి వెళ్ళాడు రమేష్. 


“పడుకుంది చాలు, చూడండి మీరు చేసిన పనికి ఎంత అప్రతిష్ట వచ్చిందో చూసారా, అసలు యిలా ఎందుకు చేశారు” అంది. 


“వుండు.. మొహం కడుక్కుని వేడి కాఫీ తాగుతు చెప్తా” అన్నాడు బ్రష్ వంక చూసుకుంటో. 


“ఏమిటా వెర్రి చూపులు.. రోజు కడుగుకునే బ్రష్ ని ఎందుకు ఆలా చూస్తున్నారు” అంది. 


“ఏమిలేదు. ఈ బ్రష్ నాకు ఏదైనా అయితే ఏమవుతుంది, యిన్నాళ్ళు నా శుభ్రత కి ఉపయోగపడినది, నేను అటు వెళ్ళగానే బయటపారేస్తారుగా” అన్నాడు. 


“బాబోయ్.. మీకు ఏమైంది” అంటూ ఉప్పు మిరపకాయలు తీసుకునివచ్చి భర్తకి దిష్టి తీసింది. 


“యిప్పుడు చెప్పండి, ఏదో వడియాలు ఎండపెట్టుకుంటానికి దాచిపెట్టిన చాప తీసుకునివచ్చి హాల్ లో అలా ఎందుకు పడుకున్నారు, ఎవ్వరైనా చూస్తే ఏమనుకుంటారో అనే ఆలోచన కూడా లేదా మీకు” అంది కాంతమ్మ. 

“మీ ఆడవాళ్ళకి డబ్బు విలువ తెలియదు, నిన్న శేఖరబాబు కోడలు చక్కటి పరుపు, దుప్పట్లు అన్నీ బయటపడేసింది. ఎందుకంటే మామగారు వాటిమీద పడుకున్నప్పుడు చనిపోయారుట. మరి క్రిందటి నెల మనం ముప్పై వేలు పెట్టి స్లీప్ వెల్ పరుపు దానిమీదకి బొంబాయి డయింగ్ దుప్పట్లు కొన్నాము కదా. నువ్వు నాకంటే నాలుగు ఏళ్ళు చిన్న. అదికాక మీ వంశంలో అందరూ ఎనభై చూసారు. ఏదైనా అయితే నాకే కదా, యింత ఖరీదు తో కొన్న పరుపు పడేస్తారేమో అని భయం తో ముందే చింకి చాప మీద పడుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను” అన్నాడు కొద్దిగా వణుకుతో. 


“మీ భయం దొంగలేత్తుకెళ్ల, ప్రాణం కంటే పరుపులు ఎక్కువటండి? అయినా యిప్పుడు మీకు అరవై అయిదు ఏళ్ళు, మొన్న డాక్టర్ మీ టెస్ట్ రిపోర్ట్స్ చూసి ఏమన్నాడు.. తనకంటే మీరే ఆరోగ్యం గా వున్నారు అన్నాడుగా, యిప్పుడు మీకు హటార్తుగా ప్రాణభయం ఎందుకు పట్టుకుంది” అంది కాంతం. 


“ప్రాణభయం కాదే పిచ్చదాన, ఏదైనా అయితే చూస్తో చూస్తో యింత ఖరీదు వస్తువులు బయటపడేసే బదులు సౌకర్యం గా వుంటుంది అని చాప మీద పడుకుంటున్నా. రేపు ఏదైనా అయినా నాతో పాటు పాత చాప కూడా పడేయ్యవచ్చు” అన్నాడు రమేష్. 


“మీకు పిచ్చ బాగా ముదిరిపోయింది. ఈ యిల్లు మీరు పుడుతో తెచ్చారా, మధ్యలో కట్టుకున్న యిల్లు చివరిలో వదిలిపెట్టి పోక, పోయిన వాళ్ళు ఎవ్వరైనా తీసుకుని వెళ్ళారా, అయినా పోయిన తరువాత యిల్లు వాకిలి, పెళ్ళాం బిడ్డలు ఎవ్వరు గుర్తుంటారండి, ఎప్పుడో పోయేదానికి ఇప్పటి నుంచి మీరు కొనుకున్న వస్తువులు ఏమవుతాయో అని బెంగ పెట్టుకుంటారా.. ఎవ్వరైనా వింటే నవ్విపోతారు” అంది భర్త తో. 


“ఏమో! నాకు ఈ ఆస్తి, మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అంటే భయం గా వుంది. నీకు అసలే నోట్లో నాలుక లేదు. రేపు కొడుకు కోడలితో ఎలా వేగుతావు అని మరీ భయం గా వుంది” అన్నాడు. 


“మీరు చాప మీద పడుకుంటే యివి అన్నీ ఆగిపోతాయా, అసలు మీరు యింత భయస్తులైనప్పుడు ఆ శేఖరబాబు శవం దగ్గర కూర్చొని పెద్ద మీకు అన్నీ తెలిసినట్టుగా పుట్టినవాడు గిట్టక మానడు, ధైర్యంగా వుండండి అంటూ ఘంటసాల లా ఆ భోధనలు ఎందుకు, యింటికి వచ్చి వణికి పోవడమెందుకు” అంది. 


“చూడు.. ఈ యింట్లో వున్నది మనమిద్దరం. మంచం మీద ఏదైనా అయితే నువ్వు ఎలా దింపగలవు.. గ్యాస్ సిలిండర్ కూడా నా చేత మొయించే దానివి, అందుకే చాప మీద పడుకుంటాను అనేది, ఏమిటో మనం శాశ్వతం కానప్పుడు ఈ కార్లు, స్థలాలు, అయిదు ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఎందుకు.. హాయిగా కాశీలో వుండిపోతే ఎవ్వరో ఒకరు యింత అన్నం పెట్టకపోరు, యింత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు జనం” అన్నాడు. 



రాత్రి కొడుక్కి ఫోన్ చేసి “మీ నాన్నకి ఏదో అయ్యింది. పిచ్చగా ప్రవర్తిస్తున్నారు. నువ్వు వెంటనే రా” అని చెప్పింది. 


తెల్లవారి జామున ఫ్లైట్ దిగి యింటికి వచ్చిన శ్రీకాంత్ కి హాల్ లో చాప మీద పడుకుని గుర్రు పెడుతున్న తండ్రిని చూసి, అమ్మ చెప్పింది నిజమే అనుకుని తండ్రిని లేపాడు. 


కొడుకు ని చూసి “నువ్వు ఎప్పుడు వచ్చావు, దా వచ్చి కాసేపు పడుకో యింకా చీకటిగానే వుంది” అంటూ చాప మీద జరిగి చోటిచ్చాడు. 


సాయంత్రం తండ్రి ని కారులో ఎక్కించుకుని అబిడ్స్ లో వున్న డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. 


“యిక్కడికి ఎందుకు, ఆఫీసులో ఏమైనా టెన్సన్స్ వున్నాయా” అని అడిగాడు కొడుకుని రమేష్. 


డాక్టర్ గారికి విషయం ముందే చెప్పడం వలన రమేష్ ని చూసి తన వెనుక వున్న గోడమీద బొమ్మలు చూపించి వాటి పేర్లు చెప్పమన్నాడు రమేష్ ని. రమేష్ నవ్వుతూ “డాక్టర్ గారు.. మా అబ్బాయి నాకు పిచ్చ ఎక్కింది అని చెప్పాడా, అటువంటిది ఏమి లేదు. మీరు టీవీలో బతుకు జట్కా బండి, అందమైన జీవితం సీరియల్స్ లో కనిపిస్తోవుంటారు. మీ జడ్జిమెంట్ చాలా బాగుంటుంది” అన్నాడు. 


“యింత బాగా మాట్లాడుతున్న మీరు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, చావు అంటే భయం తోనా” అని అడిగాడు డాక్టర్. 


“చావు అంటే భయం లేదు డాక్టర్. చావు తరువాత చేసే తతంగం అంటేనే భయం. బిక్కు బిక్కు మంటూ వుండే పిల్లలు, కన్నీళ్లతో భార్య, అర్ధం లేని అతిగా పూజలు” అంటే భయం అన్నాడు రమేష్. 


“అవి ఏవి మరణించిన వ్యక్తి కి తెలియదు కదా, భయం ఎందుకు” అన్నాడు డాక్టర్. 


“నా కళ్ళతో అన్నీ చూసాను కాబట్టి ఎప్పుడో అప్పుడు నా పరిస్థితి అంతేగా అని భయం. ఆనందం జీవితం లో పూర్తిగా పోయింది, అందుకే నా వాళ్ళకి నా వల్ల తక్కువ కష్టం ఉండేడట్లు చూస్తున్నాను” అన్నాడు రమేష్. 


డాక్టర్ గారు ఒకసారి రమేష్ వంక చూసి “సరే, మీరు ఒక పది నిముషాలు బయట కూర్చోండి” అన్నాడు. 


రమేష్ వెళ్లిన తరువాత డాక్టర్ గారు రమేష్ కొడుక్కి చెప్పాడు “మీ నాన్నగారికి మనవడు లేకపోతే మనవరాలు వున్నారా” అని అడిగాడు. 


“ఆ.. నాకు కూతురు, మా అక్కకు కొడుకు వున్నారు” అన్నాడు. 

“వాళ్లే మీ నాన్నగారికి సరైన మందు. వాళ్ళతో మీ నాన్నగారు కొన్నాళ్ళు గడిపే విధంగా చూడండి చాలు” అన్నాడు. 


యధాప్రకారం చాప దిండు వేసుకుని పడుకుంటున్న తండ్రి చూసి, ఏమి అనకుండా తన గదికి వెళ్లి పడుకున్నాడు రమేష్ వాళ్ళ అబ్బాయి. 


తెల్లారింది. మొహం నిండా దుప్పటి కప్పుకుని పడుకున్న రమేష్ దుప్పటి లాగేయడం తో కోపంగా ఎవ్వరు అని అరుస్తూ కళ్ళు తెరిచి చూసాడు. 


మొహం లో మొహం పెట్టి చూస్తున్న మనవరాలు కనిపించడం తో కోపం కాస్త పోయి “నువ్వు ఎలా వచ్చావే” అని లేవబోతోవుండగా కాళ్ళు కదలకపోవడం తో కిందకి చూసాడు. కాళ్ళ మీద కూర్చుని నవ్వుతో కనిపించాడు మనవడు. 


“ఓరినీ.. నువ్వు కూడా వచ్చావా” అంటూ మనవడిని దగ్గరికి లాక్కున్నాడు రమేష్. 


“ముందు లే తాతా” అని మనవడు మనవరాలు చెరో చెయ్యి పట్టుకుని పైకి లేపారు రమేష్ ని. 


రమేష్ లేచి సోఫాలో కూర్చొని, మేడమెట్లు దిగుతున్న కూతురు కోడళ్ళని చూసి “ఎలా వున్నారమ్మా” అని పలకరించాడు. 

ఇంతలో తన చాపని మడతపెట్టి బయట వున్న చెత్త బుట్టలో పడేస్తున్న మనవరాలితో “ఎందుకే పారేసావు” అన్నాడు. 


“యిహ నుంచి మనం పెద్ద మంచం మీద పడుకుని కథలు చెప్పుకోవాలి. మేము చాప మీద పడుకోము” అన్నాడు మనవడు. 


“సరేలేరా, మీకు కథలు చెప్పి మీరు పడుకున్న తరువాత నా చాప మీద పడుకునే వాడిని. నాకంటే ముందే నా చాపని బయట పడేసారు” అన్నాడు. 


“తాతా! మనం ఈ రోజు హోటల్ కి వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేద్దాం, నాన్నా ని తీసుకుని వెళ్ళద్దు. మనకి కావలిసినవి తిననియ్యడు” అంది మనవరాలు. 


‘ఓకే అలాగే’ అని హుషారుగా లేచి పిల్లలని కారులో కూర్చోపెట్టుకుని వెళ్తున్న రమేష్ ని చూసి “అమ్మా! నాన్నలో మామూలు సంతోషం కనిపిస్తోంది కదు” అన్నాడు తల్లితో. 


పిల్లలని కాసేపు పార్కులో ఆడించి యింటికి తీసుకుని వచ్చాడు. లంచ్ అయిన తరువాత మనవడు మనవరాలు యిద్దరిని చెరోపక్కన మంచం మీద పడుకోబెట్టుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్న తండ్రిని చూసి నిర్ణయం తీసుకున్నాడు అమ్మానాన్నలని తనతో తీసుకుని వెళ్ళాలి అని. 


వృద్ధాప్యం లో మనవడు, మనవరాలు తో ఆడుకుంటోవుంటే యింకా ఏమి అక్కరలేదు, అదే ఆరోగ్యం వాళ్ళకి. 


 శుభం 

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
















bottom of page