#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #SarainaSalaha, #సరయినసలహా, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
Saraina Salaha - New Telugu Story Written By - Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 21/12/2024
సరయిన సలహా - తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
వృద్ధాశ్రమములో తనకి కేటాయించిన గదిని నిశితముగా పరిశీలించి భార్య సరోజినితో “ఈ మంచము, టీ. వీ. చూస్తే, ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది” అంటాడు మాధవరావు.
“మంచము టి. వీ. మనవేనండి” అని జవాబిస్తుంది సరోజినమ్మ.
“ఇంతలో మాధవరావు కొడుకు మురళి సామన్లు తెచ్చి ఆలమర్లో సర్దుతున్నాడు.
“ఒరేయి మురళి, మన మంచము, టీ. వీ. నీవు ఎక్కడ ఇచ్చావురా” అని అడుగుతాడు.
“ఇదే ఆశ్రమములో ఇచ్చాను నాన్న అని జవాబిస్తాడు. పందిరి పట్టు మంచానికి ఉన్న పందిరి తీసేసి, బోసిగా ఉన్న మంచాన్ని చూసి మాధవరావు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, కాలచక్రములో విచిత్రాలు జరగటమంటే ఇవేనేమో అని తనలో తాను గొణుక్కుంటాడు.
యాభయి ఐదు వత్సరాల క్త్రితము పందిరి పట్టు మంచముతో ఉన్నజ్ఞాపకాలు మాధవరావుకి గుర్తుకొచ్చాయి. వివాహమయిన కొత్తలో సారెతో పాటు మావగారు ప్రత్యేకముగా టేకు చెక్కతో, స్వయముగా దగ్గరుండి పందిరి పట్టు మంచము చేయించి పంపారు. తన తండ్రి కట్నము వద్దన్నారనే అభిమానముతో కూతురికి ఘనముగా సారె పెట్టారు.
కాలచక్రములో ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. పెద్దవాడు అమెరికా వెళ్లి అక్కడే ఉన్నాడు.తను, సరోజ రెండో పుత్రుడు మురళి దగ్గర ఉన్నారు. కోడలు సుగుణ పేరుకి తగ్గట్టు సుగుణాల రాసి, అత్తా మామలని కంటికి రెప్పలా చూసుకునేది. ఇద్దరు మనుమలతో అందరూ హాయిగా ఉండే వారు. దేవుడు దయవలన అనారోగ్య సమస్యలు లేనందు వలన ఇంటి పనుల్లో తోచిన సహాయము చేసేవారు.
మురళి మూడు గదుల ఫ్లాట్ తీసుకున్న సందర్భములో తన దగ్గరికి వచ్చి, “నాన్నా, మీకిష్టమయితే పందిరి పట్టె మంచము మరియు పాత టీ. వీ వృద్ధాశ్రమములో ఇచ్చేసి, కొత్త టీ. వీ. , మంచము కొంటాను” అంటాడు.
“ఎందుకురా మురళి, అనవసరమయిన ఖర్చులు, అసలే ఇంటికి చాలా ఖర్చుపెట్టావు కదా” అంటాడు మాధవరావు.
“పర్వాలేదు నాన్నా, దేవుడి దయవలన మనకి ఆర్ధిక ఇబ్బందులు లేవు. గదులు చిన్నగా ఉన్నందు వలన మరియు పందిరి పట్టె మంచము వేస్తే, గది ఇరుకుగా ఉంటుంది గనుక మారుద్దా మనుకుంటున్నాను. మీకిష్టమయితే మంచము మరియు టీ. వీ వృద్ధాశ్రమములో ఇచ్చేసి, కొత్త టీ. వీ. , మంచము కొంటాను” అంటాడు మురళి.
కొడుకు, కోడలు, చూపించే ప్రేమానురాగాలు, ఆప్యాయత వెలగట్ట లేనివి. వెంటనే వస్తువులను ఆశ్రమానికి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. తమ మధ్య ఎటువంటి బేధభావాలు లేకుండా రెండు సంవత్సరాలు సజావుగా గడిచాయి. విధి వక్రించినట్టు ఒక రోజు కోడలు సుగుణకి జ్వరము వస్తే, తగ్గి పోతుందనే ఉద్దేశముతో డోలో 650 వేసుకుంది. జ్వరము తగ్గినట్టే తగ్గి మూడో రోజు జ్వర తీవ్రత పెరిగి ఆసుపత్రిలో చేర్పించాడు మురళి.
అవసరమయిన పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యులు డెంగు జ్వరమని నిర్దారించారు. అప్పటికే ప్లేట్లెట్స్ పడిపోయి, సుగుణ తుది శ్వాస విడిచింది. నా నిర్లక్ష్యము వల్లనే, సుగుణని దూరము చేసుకున్నానని మురళి కన్నీరు మున్నీరు అయ్యాడు.
“ఒరేయ్ మురళి, పిల్లల భవిష్యతు చాల ముఖ్యము. పిల్లల భవిష్యత్తు కోసమయినా నీవు వివాహము చేసుకోవడము మంచిది. మేమిద్దరము పండుటాకులము. మీకు ఎటువంటి సహాయము చేయలేని స్థితిలో ఉన్నాము. మీ ముగ్గురి జీవితాలు సజావుగా సాగాలంటే నీవు పెళ్లి చేసుకోవడము అన్నివిధాలా ఉత్తమము” అని తల్లి మురళికి హితబోధ చేసింది. “నీకు ఇంతకంటే ఎక్కువ చెప్పే అవసరము లేదు, ఆలోచించి నిర్ణయము చెప్పు” అంటుంది.
“నీ ఇష్టమమ్మా” అంటాడు మురళి. “మనందరని బాగా చూసుకునే అమ్మాయి అయితే అన్ని విధాలా మంచిది. అవసరమయితే, ఇరువైపులా ఖర్చు మనమే భరిద్దాము” అని తన అభిప్రాయము చెప్తాడు మురళి..
విష్ణుపురము లో, రామాలయము పూజారి కూతురు సుమతితో మురళి వివాహము నిరాడంబరంగా జరుగుతుంది. సుమతి గుణవంతురాలు మరియు సాంప్రదాయ పద్దతిలో పెరిగిన వాతావరణము అయినందువలన, అత్తామామల దగ్గర అణుకువగా మరియు పిల్లలని పద్దతిగా పెంచి అందరి మన్ననలు పొందుతుంది.
సుమతి పుట్టింట్లో అనుభవించని భోగభాగ్యాలు అత్తగారింట్లో అనుభవిస్తూ మురళి కి అన్నివిధాలా తగిన భార్య అని, అందరి మన్నలు అందుకుంది. బంధు గణములో, మురళి కూడా సుమతిని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడు.
ఒకరోజు పొద్దునే సుమతి, “ఏమండీ, నాన్నగారికి రాత్రి గుండె పోటు వచ్చి పోయారని ఇప్పుడే గుడి పూజారిగారి నుంచి ఫోన్ వచ్చిందండి” అని ఏడుస్తూ చెప్తుంది.
సుమతిని ఓదార్చి, “కారులో మనిద్దరము వెల్దాము పద, ముందర నీ బట్టలు సర్దుకో”, అని తల్లికి “మావయ్యగారు పోయా”రని చెప్పి, “మేమిద్దరమూ వెళ్లివస్తాము. నీవు పిల్లలని చూసుకో” అని ఇద్దరు విష్ణు పురము వెళ్లి సుమతి తండ్రి అంతిమ సంస్కారాలు జరిపి తిరిగి వస్తారు.
“ఏమండీ! మీరు కన్నకొడుకులా అన్నీ దగ్గర ఉండి జరిపించారని మా వూళ్ళో వాళ్ళందరూ మెచ్చుకున్నారండి. నిజముగా నేను చాలా అదృష్ట వంతురాలు నండి” అని మురళితో అంటుంది.
“సుమతీ! నీకు అమ్మ నాన్న అయితే నాకు అత్తమామలు కదా. నా కర్తవ్యము నెరవేర్చాను, అంతేగాని దేశసేవ చేయలేదు” అని చెప్తాడు.
“ఏమండీ, మా అమ్మకి నేను తప్ప ఇంకెవ్వరు లేరు. అమ్మని మన దగ్గరే ఉంచుకుందా మండి” అని మురళి తో అంటుంది సుమతి.
“నీవు ముగ్గురు పెద్దవాళ్ళని మరియు పిల్లలని చూసుకో గలవా.. అది కాకుండా ఎదిగే పిల్లలు, వాళ్ళని నాలుగు కళ్ళతో కనిపెట్టు కోవాలి. అది నీవొక్క దానివలన సాధ్యమవుతుందా” అని అడుగుతాడు మురళి.
“మీరు చెప్పింది నిజమే. ఇంతమందిని చూసుకోవడము ఇబ్బందే, పెద్దవారిని చూసుకోవడము మన నైతిక బాధ్యత, వారికి మనము తప్ప ఇంకెవరున్నారు” అని జవాబిస్తుంది సుమతి. “సరే, ఇప్పుడేమి చేద్దాము” అని భర్తని ప్రశ్నిస్తుంది.
“అత్తయ్యగారిని ఆశ్రమములో చేరుద్దాము” అంటాడు మురళి.
“సరే, మీరు చెప్పి నట్టే మా అమ్మని ఆశ్రమములో చేరుద్దాము, అత్తయ్య, మావయ్య గారిని కూడా ఆశ్రమములో చేర్పిస్తే, పిల్లల కోసము ఎక్కువ సమయము కేటాయించ వచ్చు” అని జవాబిస్తుంది సుమతి.
“మా అమ్మ నాన్నని చూసుకునే బాధ్యత నాది” అని జవాబిస్తాడు మురళి.
“మీరు చెప్పినది నిజమే, అదేవిధముగా మా నాన్నగారు ఉన్నన్ని రోజులు అమ్మ ని నాన్న చూసుకునే వారు. ఇప్పుడు మా అమ్మకి నేను తప్ప ఇంకెవరు లేరు. సహజముగా ఇప్పుడు మా అమ్మని చూసుకునే బాధ్యత నాదే కదా” అని శాంతముగా జవాబిస్తుంది.
వీరిద్దరి మాటలు మాధవరావు విని, మురళి దగ్గరకి వచ్చి, “ఏమయిందిరా, ఎన్నడూ లేనిది అంత గట్టిగా మాట్లాడుతున్నావు కోడలితో” అని అడుగుతాడు తండ్రి.
“ఏమీ లేదు నాన్న..” అని మాట దాటేయ బోతాడు మురళి.
“నీవయినా చెప్పమ్మా”.. సుమతిని అడుగుతాడు మాధవరావు.
సుమతి వారి మధ్య జరిగిన సంభాషణ చెప్తుంది.
“ఒరేయ్ మురళి, మీరు అనవసరముగా గొడవ పడుతున్నారు. మీసమస్యకీ నేను పరిష్కారము చెప్తాను. మీరిద్దరూ మారు మాట్లాడకుండా నేచెప్పినట్టు చేయాలి అని, నాకు మాట ఇవ్వండి” అంటాడు మాధవరావు. సరే అని మురళి, సుజాత తల ఊపుతారు.
“మేమిద్దరము ఎనభయిలో ఉన్నాము. మీతో మేము సేవ చేయించుకుంటున్నాము. మీకు మేము ఏ విధముగా సహాయము చేసే పరిస్థితిలో లేము. మా వయస్సు మరియు అనారోగ్య కారణాలతో మీకు సహాయము చేద్దామనుకున్న చేయలేక పోతున్నాము. మేమిద్దరము ఉండటం వలన మీరు పిల్లలమీద ధ్యాస పెట్టే అవకాశము తక్కువ అని మీకు కూడా తెలుసు. అదే సుమతి అమ్మగారు అయితే మా కంటే వయస్సులో చిన్న వారు. ఇంకా మీకు అన్నివిధాలా సహాయపడ గలరు అని నాఅభిప్రాయము. నేను, మీ అమ్మ ఆశ్రమములో ఉంటాము. మీకు వీలయినప్పుడు మమ్ములను వచ్చి చూస్తూ ఉండండి. అదేవిధముగా మేము కూడా పండుగకి వస్తూ ఉంటాము”.
సుమతి అయిష్టముగానే ఒప్పుకుంటుంది. మురళి కూడా తండ్రికి మాట ఇచ్చినందుకు మారు మాట్లాడ కుండా సరే అంటాడు. ఇక చేసేది ఏమిలేక మురళి, తల్లి తండ్రులని ఆశ్రమములో చేర్పించాడు
“ఏమండీ! కాఫీ పెట్టి చాల సేపు అయింది, తాగకుండా ఏమాలోచిస్తున్నారు” అని అడుగుతుంది సరోజినమ్మ. ‘ఆబ్బె ఏమిలేదు’ అని కాఫీ తాగుతాడు. ఆశ్రమములో నెల రోజులు గడచి పోయాయి. ఇద్దరకీ జీవితములో ఏదో వెలితిగా అనిపిస్తున్నాయి.
“ఏమండీ, ఒకసారి మురళి వాళ్ళని చూసి వద్దామండి” అని అడుగుతుంది.
“సరే రేపు వెల్దాము” అని సంతోషముగా జవాబిస్తాడు మాధవరావు.
అనుకోకుండా అమ్మానాన్నను గుమ్మములో చూసి మురళి అమ్మ చేయి పట్టుకొని సోఫాలో కుర్చోపెడతాడు. ఇంతలో సుమతి వచ్చి అత్తమామల కాళ్ళకి దణ్ణమ్ము పెట్టి మంచినీళ్లు
కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది.
“మీ అమ్మ గారు ఎక్కడమ్మా” అని అడుగుతాడు మాధవరావు.
“మావయ్యగారూ! అమ్మ ఇల్లు ఖాళీ చేసి వచ్చేనెల వస్తానని చెప్పిందండి: అని జవాబిస్తుంది.
మాధవరావు సాయంత్రము దాక ఉండి ఆశ్రమానికి బయలుదేరతారు.
“నాన్నా! రెండురోజులుండి వెళ్ళవచ్చుకదా, మీరు పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు వెళ్లి పోవడము సరికాదు” అని నిష్టూరంగా అంటాడు.
“ఈసారి దసరా పండుగకి వచ్చి వారము రోజులుంటాము అని జవాబిచ్చి ఇద్దరు బయలుదేరతారు. నెల రోజుల తర్వాత మురళి సుమతి మరియు సుమతి తల్లి ఆశ్రమానికి వెళ్తారు. అందరు మాధవ రావు గదిలో కూర్చున్నారు,
“బాగున్నారా వదినగారూ” అని పలకరిస్తుంది సరోజినమ్మ.
బాగున్నానండి అని జవాబిస్తుంది కమలమ్మ.
ఇంతలో మురళి, “అత్తయ్యగారు కూడా మీతోపాటు ఆశ్రమములో ఉంటానని పెట్టె బేడాతో వచ్చా”రని క్లుప్తముగా చెప్తాడు.
“కమలమ్మగారు మీతో ఎందుకు ఉండటం లేదు” అని ప్రశ్నిస్తాడు మాధవరావు.
“మావయ్యగారూ! నే చెప్తానండి. ఆ రోజు మేము మీ మాటకి ఎదురు చెప్పకుండా మిమ్ములను ఆశ్రమములో చేర్పించాము. మా అమ్మ మీరు లేని ఆ ఇంట్లో ఉండనని, తను కూడా ఆశ్రమము లోనే ఉంటానని ఇక్కడకి వచ్చిందండి”.
ఇంతలో మురళి తన అభిప్రాయము చెప్పడము మొదలు పెట్టాడు. “నాన్నా! మీరు, అమ్మ లేని ఇంట్లో ఉండటం చాలా కష్టముగా ఉంది. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మిమ్ములను విడచి ఉండలేదు. ఈ విషయము సుమతి కూడా గ్రహించింది. మీరు ఒక రోజు మన ఇంటికి వచ్చినప్పుడు, పిల్లలు మిమ్ములను విడచి ఎక్కడకి వెళ్ళలేదు. మీమీద యెంత బెంగ పడ్డారో గ్రహించే ఉంటారు. అందుకే నేను పిల్లల పాఠశాలకి దగ్గరలో నాలుగు గదుల ఇల్లు చూసాను. మనమందరము కలసి అక్కడ ఉందాము. ఇంట్లో వంటకి కూడా వంటమనిషిని చూసాను. మీరు మాతోనే ఉండాలి” అని తన అభిప్రాయము బతిమాలే ధోరణిలో చెప్తాడు.
మాధవరావు, సరోజినమ్మ మారు మాట్లాడకుండా బయలుదేరుతారు.
--------------------------------------------------------------------------------------------------------------------------
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.
Comments