top of page

సరస్వతీ విలాపం

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #Saraswathi Vilapam, #సరస్వతీవిలాపం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Saraswathi Vilapam - New Telugu Story Written By Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 26/04/2025

సరస్వతీ విలాపం - తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల


తూర్పు ని చీల్చుకుని వెలువడ్డాయి ఇనకరుడి కిరణాలు. భారత దేశం లో సూర్యోదయమయ్యింది. జర్మనీ లో కాలేదు. ఫ్రాంకఫర్ట్ ఎయిర్ పోర్ట్ లో చెకవుట్ అయ్యాక బయటికి వచ్చాడు శివాజి. కూల్ డ్రింక్ తాగి స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాడు. 


అప్పుడు వచ్చిన అనిల్ "ఏలా ఉన్నావు రా" అని పలకరించాడు. 


తెలుగు మాట విని ప్రాణం లేచి వచ్చింది శివాజి కి. 

విదేశి భాషలలో మాట్లాడి ఒక గ్రహాంతర వాసి లా అనుభూతి చెందాడు. 


ఇద్దరూ కారు లో యూనివర్సిటీ హాస్టల్ కి వెళ్ళారు. 

హాస్టల్ కి వచ్చాక ఇండియా కీ ఫోన్ చేసాడు. సమయం ఉదయం పదయింది ఇండియాలో. 


 ********

అనిల్ బెర్లిన్ యూనివర్సిటీ లో కంప్యూటర్స్ MS చేస్తున్నాడు. శివాజి మెకానికల్ ఇంజనీర్. ఉద్యోగం కోసమే జర్మనీ వచ్చాడు. 


ఆ రోజు జర్మనీ పారిశ్రామిక ప్రాంతమైన మ్యూనిచ్ వెళ్ళాడు. మెకానికల్ ఇంజనీర్ గా ఉద్యోగం లభించింది. అతని జీతం నెలకి 200 యూరో లు గా నిర్ణయించబడింది. అనిల్ మ్యూనిచ్ వెళ్ళి పోయాడు. వీకెండ్ లో బస్సు మీద బెర్లిన్ వెళ్ళే వాడు. ఇద్దరూ కలిసి సరదాగా వీకెండ్ గడిపేవారు. 


 ******

ఆ రోజు శివాజీ అనిల్ తో మాట్లాడుతూ, "రేపు వుట్టమ్ బర్గ్ లో సంస్కృత ప్రోఫెసర్ గారి ఉపన్యాసం ఉంది. అదీ కూడా ఆయన ఇండియన్ ట, వస్తావా?" 


"సరే వస్తాను". 


ఇద్దరూ కలిసి 8 గంటలు ప్రయాణించి, వుట్టమ్ బర్గ్ చేరుకున్నారు. Ancient yoga University బోర్డ్ చూడగానే శివాజి కి ఒళ్ళు పులకరించింది. 


"ఇక్కడికి ఎందుకు రా, ఏ పబ్ కో వెళ్ళే వాడిని కదా" అన్నాడు అనిల్ విసుగ్గా. 


"నోర్మూసుకుని రా "


 *******

ఉపన్యాసం జరిగే చోట ఆంగ్లం లో, జర్మనీ భాష లో బోర్డు ఉంది. 


"Essence of Upanishads by Mantri Pragada Sarma" 


అరగంట లో శర్మ గారి ఉపన్యాసం ప్రారంభమెనది. ఆయన ఉపన్యాసం వింటుంటే, యాజ్ఞవల్కుడే లేచి వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపించింది శివాజి కి. అనిల్ వాచీ చూసుకుంటున్నాడు. ఆ ఉపన్యాసం హాలు నైమిశారణ్యం లా తోచింది. 


"యతో వాచా నివర్తంతే 

అప్రాప్య మనసా సహా" 

అనే తైత్తిరియోపనిషత్ వాక్యం తో ప్రారంభించి, "సత్యమేవ జయతే" అనే ముండకోపనిషత్తును 

ముచ్చటిస్తూ, 

"సదేవ సోమ్యేదమగ్ర మసీత్" అనే చాందోగ్యాన్ని 

రుచి చూపించి, 

జాగృత్, స్వప్నం, సుషుప్తిల అవస్థా త్రయ సాక్షిత్వం

విశదీకరించే మాండూక్యాన్ని చెప్పి, 

అద్వైత భాస్కరుడి శంకరుడి బ్రహ్మ సత్యం, జగన్మిధ్యా 

ను మధ్య లో తల స్పర్శ చేసి, 


యథా నద్యః స్యందమానా స్సముద్రే

అస్తం గచ్ఛన్తి నామరూపే విహాయ |

తథా విద్యా న్నామరూపా ద్విముక్తః

పరాత్పరం పురుష ముపైతి దివ్యమ్‌ ||


ముండకోపనిషత్తు శ్లోకం తో ముక్తాయింపు ఇచ్చాడాయన. 


 ***********

శర్మ గారిని కలిసాడు శివాజి ఉపన్యాసం అయ్యాక. ఆయన తెలుగు వాళ్ళను కలిసినందుకు సంతోషించి తన ఇంటికి అల్ప హార విందుకు ఆహ్వానించాడు. 

శివాజి వీలున్నప్పడు కలుస్తానన్నాడు. 

 

 *********

రెండు వారాల తర్వాత 

మంత్రిప్రగడ శర్మ గారిని కలిసాడు శివాజి. ఆయన ఇంటి నిండా సంస్కృత గ్రంధాలు గాజు బీరువాల్లో ఉన్నాయి. 


"మీరు జర్మనీ కి ఏలా వచ్చారు?" 


"అదో పెద్ద కధ, వినే ఓపిక ఉందా?" 


"తప్పకుండా గురువు గారు" 


శర్మ గారు ప్రారంభించారు. 

"మాది అమలాపురం దగ్గర చిన్న పల్లెటూరు. మా నాన్నగారు పౌరోహిత్యం చేసేవారు. ఆయనకి లౌక్యం లేక పోవడం తో ఆదాయం అరకొర గా ఉండేది. నేను డిగ్రి వరకూ చదివాను. సంస్క్రతం మీద ఆసక్తి తో ఎం. ఏ చేసాను. చదువు కు తగ్గ ఉద్యోగం రాలేదు. 


ప్రభుత్వం కూడా ఉన్న సంస్కృత పోస్టులు తగ్గించింది. పొట్ట కూటి కోసం ట్యూషన్లు చెప్పాను. దరిద్ర బాధ కొనసాగుతునే ఉంది. 


ఒక రోజు ఆకలి బాధ తట్టుకో లేక తిల దానం పట్టాను. "

ఆ మాటలంటూ శర్మ గారు కళ్ళు తుడుచుకోవడం చూసాడు శివాజి. 


తిలదానం పట్టానని మిగిలిన బ్రాహ్మణులు నాన్న గారిని వెలివేసినట్టు చూసేవారు. ఆ ఏడాది గోదావరి పుష్కరాలు వచ్చాయి. పుష్కరాలకి వెళ్ళిన నాన్న గారు తిరిగి రాలేదు. ఆత్మహత్య అని కొందరు, గోదావరి ఒడి ఎక్కువ అని చాలా కాలం చర్చించు కున్నారు.


నేను ఆంధ్రా వదిలి ఉత్తర భారతదేశం వచ్ఛాను. గీతా ప్రెస్ గోరఖ్ పూర్ లో ప్రూఫ్ రీడర్ గా చేరాను. అప్పుడే ఒక జర్మన్ తో పరిచయమయ్యింది. ఆయన మా ప్రెస్ లో భగవద్గీత కొనడానికి వచ్చాడు. 


నా సంస్కృత పరిజ్ఞానానికి ముచ్చట పడీ నన్ను జర్మనీ కి తీసుకువచ్చి ఒక యూనివర్సిటీ లో ఉద్యోగం ఇప్పించాడు. తరువాత నా ప్రతిభ తో ప్రోఫెసర్ నయ్యాను. 

జీవితం తృప్తి గా ఉంది"


"ఇప్పడు మీరు ఇండియా కీ ఏదైనా చెయ్యవచ్చు కదా"


"ఇప్పడు ఎవరికీ భాష మీద శ్రద్ద లేదు. తెలుగే సరిగా నేర్చుకోరు. అంతా డబ్బు వెనుకే భ్రమణం, సెన్సెక్స్ స్మరణం. చూద్దాం భవిష్యత్తు లో ఏం జరుగుతుందో "


భారమైన హృదయం తో ఆయన దగ్గర సెలవు తీసుకున్నాడు శివాజి. 

 *******


శర్మ గారు మూడేళ్ళ తర్వాత ఇండియా వచ్చారు. సంస్కృత విద్యా బోధన ప్రారంభించారు. కొంతమందైనా ఆ ప్రాచీన విజ్ఞాన గంధాన్ని ఆస్వాదిస్తారని. విజ్ఞాన యాత్ర తనతో ఆగకూడదని. 


శర్మ గారి ఆరోగ్యం పాడయ్యింది. తన తర్వాత ఎవరు ఈ బాధ్యత తీసుకుంటారని ఆయన మధనపడుతున్నారు. ఒక సారి హార్ట్ ఎటాక్ వచ్చింది. రెండో సారి వస్తే బతకడం కష్టమన్నారు డాక్టర్! చనిపోయే లోగా ఎవరైనా సరైన వ్యక్తి వస్తే బాగుండుననుకున్నారు. 


రెండేళ్ల తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. గతం లో తను జర్మని లో ఉండేవాడినని, ప్రస్తుతం ఇండియా లో స్థిరం గా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నా నన్నాడు. 


శర్మ గారు సంతోషించి తన సంస్కృత విద్యా వ్యాప్తి, భవిష్యత్ ప్రణాళిక వివరించారు. 


ఆ వ్యక్తి సంతోషం గా అంగీకరించి, సంస్కృత నిధి ఏర్పాటు చేసాడు. 


ఆ వ్యక్తి తన చేతిని శర్మ గారి చేతుల్లో పెట్టి భవిష్యత్ కి భరోసా ఇచ్చాడు. 


అతని చేతుల్లోనే శర్మ గారు ప్రాణాలు విడిచాడు. 

టీవి నుండి ఉపనిషత్ శ్లోకం వినిపిస్తోంది. 


ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై

తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః


శర్మ గారి పాంచభౌతికం పంచ భూతాలలో కలిసినా ఆ జ్ఞాన జ్యోతి ఎందరికో వెలుగు చూపుతోంది. 


జర్మనీ నుండి తిరిగి వచ్చి, సంస్కృత వ్యాప్తి కి పూనుకున్న ఆ వ్యక్తి ఎవరో కాదు! 


శివాజి! 


 సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






Comments


bottom of page