top of page
Writer's picturePratap Ch

సార్థకత


'Sarthakatha' - New Telugu Story Written By Ch. Pratap

'సార్థకత' తెలుగు కథ

రచన: Ch. ప్రతాప్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ప్రశాంతి వృద్ధాశ్రమం నాటికి స్థాపించి నలభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఉత్తమ వృద్ధాశ్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక " కృషి మిత్ర" అవార్డును నాకు బహుకరించింది. ఆ అవార్డు ప్రదానోత్సవ వేడుకలు ఆశ్రమం ప్రాంగణంలో అంగ రంగ వైభవంగా ఆ రోజు జరిగాయి. రాష్ట్ర సాంఘీక సంక్షేమ మంత్రివర్యులు, ఎం పి గారు, జిల్లా కలెక్టర్ గారు వచ్చి కార్యక్రమాలను ఆసాంతం వీక్షించారు. మున్సిపాలిటీ చైర్మన్, గ్రంథాలయ కమిటీ సెక్రెటరీ, డి ఎస్ పి వంటి అతిరథ మహారధులెందరో నాటి కార్యక్రమానికి విచ్చేశారు.


అందరూ సంస్థ స్వలాభాపేక్ష లేకుండా వృద్ధాశ్రమం నడుపుతున్న తీరుకు నన్నెంతో ప్రశంసిస్తూ వుంటే నా మనస్సెంతో సంతృప్తికి గురయ్యింది. కళ్ళు నిరంతరంగా వర్షిస్తునే వున్నాయి. ఈ జన్మకు ఇంతకంటే సార్థకత వుండదనిపించింది. అన్నింటి కంటే ముఖ్యంగా కొందరు సీనియర్ వృద్ధులు చేయూతతో వేదిక పైకి వచ్చి తమ ఆలనా పాలనా చూసే ఏ దిక్కు లేక అనాధలుగా జీవచ్ఛవాలుగా బ్రతుకుతున్న తమకు ఈ ప్రశాంతి సంస్థ ఏ విధంగా ఆదరించి, అక్కున చేర్చుకొని, తమకు జీవితాంతం తోడూ నీడగా నిలిచిన వైనానికి కృతజ్ఞత లర్పించుకుంటుంటే నా మనస్సంతా ఒక విధమైన అలౌకిక అనుభూతితో నిండిపోయింది.


సాటి మనిషికి చేయూతతో పాటు వారి బ్రతుకులకు భరోసా కల్పించే అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతునికి అనేక వేల కృతజ్ఞతాభివందనములు సమర్పించుకున్నాను. అయితే ఈ లక్ష్యానికి చేరుకునేందుకు నాకు దాదాపుగా నలభై సంవత్సరాలు పట్టింది. వివాహంతో పాటు ఇతర సుఖాలను, ఆనందాలను, భోగభాగ్యాలను త్యాగం చేయాల్సి వచ్చింది. ఇతరుల సంతోషంలోనే నా ఆనందాన్ని వెదుకున్నాను.


నేను తినకపోయినా, ఇతరులు ఒక ముద్ద తిని వారి కడుపులు నిండితే నా కడుపు నిండినంత సంతృప్తి పడ్డాను. కార్యక్రమం ముగిసాక ఆశ్రమం ప్రాంగణంలో వున్న నా కుటీరానికి వచ్చి అలసటతో సేద తీరాక నెమ్మదిగా గతాన్ని నెమరు వేసుకోసాగాను. సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం.. ఒక ప్రైవేట్ సంస్థలో అక్కౌంటెంట్ గా చిరు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. తల్లి తండ్రి, అన్నా తమ్ముళ్లు, అక్క చెల్లెళ్లు లేని అనాధను కాబట్టి ఆ భవ బంధాలు నాకు లేవు. అనాథాశ్రమంలో పెరిగి, బికాం పట్టా చేత పట్టాక ఉద్యోగ వేటలో ఆశ్రమం నుండి బయటకు వచ్చేసాను. వచ్చేసాను అనేకంటే బయటకు పంపించేసారంటే కరెక్ట్ గా వుంటుంది. అదే ఊరిలో ఒక చిన్న కంపెనీలో ఒక చిరు ఉద్యోగం దొరికింది. ఉదయం తొమ్మిది గంటల వేళ నా లూనా బండిపై ఆఫీసుకు వెళ్తుంటే డివైడర్ కు అవతలి వైపు ఒక పెద్దావిడ పడిపోయి వుంది. బండి ఆపి, రోడు దాటి తిరిగి వెళ్ళీ చూసేసరికి దాహం దాహం అంటూ మూలుగుతోంది. నేను వెంటనే ఒక మంచి నీళ్ళ సీసా కొని తెచ్చి కొంచెం కొంచెంగా ఆవిడతో తాగించాను. ఆ కాస్త సహాయానికే ఆవిడ ముఖంలో ఎంతో కృతజ్ఞత ప్రస్పుటమయ్యింది. నమస్కారం పెట్టేందుకు కాబోలు రెండు చేతులు కలిపి ఎత్తబోయింది కాని అంతలోనే శక్తి చాలక తల వాల్చేసింది.


ఆవిడ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ హఠాత్పరిణామానికి నాకేం చెయ్యాలో తోచలేదు. అటు ఇటు ఎంతో మంది తిరుగుతున్నారు కానీ ఎవ్వరూ ఆవిడని పట్టించుకోవడం లేదు. కర్తవ్యం స్పురించి ఆవిడని ఒక యాంబులెన్సు లో పడుకోపెట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. అక్కడ మార్చురీలో ఆవిడ భౌతిక దేహాన్ని భద్రపరిచాను. అక్కడి నుండి పోలీస్ స్టేషనుకు వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను. వాళ్ళు నా వివరాలు తీసుకొని విచారణ చేపడతామన్నారు. ఆ క్షణం నుండి నా మనస్సంతా ఏదో నిర్వేదంతో నిండిపోయింది. మనస్సంతా ఏదో తెలియని వెలితి, శూన్యత ఆవహించింది.. అనుక్షణం ఆ పెద్దావిడే గుర్తొచ్చేది. ఇద్దరి మధ్య ఏం ఋణానుబంధం వుందో ? తన ఆఖరి శ్వాస నా చేతుల్లో తీసుకుంది. జీవితం ఎంత విచిత్రమైనది ? కన్ను తెరిస్తే జననం. కనులు మూస్తే మరణం.. రెప్ప పాటు జీవితం.. పుట్టినప్పుడు ఒంటరిగా ఏమి తీసుకురాకుండా వస్తాం. పోయనప్పుడు తీసుకువెళ్ళేది లేదు.. మనం పోతే 10 మంది కన్నీరు పెడితే జీవితానికి అర్ధం.. ప్రేమతో జీవించు సాటి మనిషీ కి సాయ పడుతూ హాయిగా జీవించు. అన్న ఒక కవి మాటలు ఆ క్షణంలో గుర్తొచ్చాయి. ప్రతీ రోజు పోలీస్ స్టేషనుకు వెళ్ళి వారి విచారణ ఎంతవరకు వచ్చిందోనని తెలుసుకుంటున్నాను. ఒక వారం రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ నుండి కబురు వచ్చింది. ఆవిడ ఒక అనాథ అని, డబ్బు సరిగ్గా కట్టని కారణంగా అనాథాశ్రమం నుండి బయటకు పంపించేసారని, ఇక గత్యంతరం లేక చెట్టు కిందో, బస్ షెల్టర్ కిందో బ్రతుకుతూ, అందరినీ యాచించుకుంటూ తన జీవితం వెళ్ళదీసేదని చెప్పారు.


ఆవిడ అనాథే కావచ్చు కాని ఆవిడకు ఒక అనాథగా దహన సంస్కారాలు జరగకూదదని హావించి నేను వెంటనే వెళ్ళి అఫిడవిట్ సమర్పించి, ఆవిడ భౌతిక దేహాన్ని స్వాధీనం చేసుకొని నా శక్తి మేరకు శాస్త్రీయంగా దహన సంస్కారాలు జరిపించాను.

నేనొక అనాథను కావడం వలనో ఏమో, అనాథలకు అందునా వృద్ధులకు జరుగుతున్న నిరాదరణను సహించలేక వారి కోసం ఏమైనా చేయాలని ధృఢంగా సంకల్పించుకున్నాను. సరిగ్గా అప్పుడే నా మనస్సులో ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాలన్న ఆలోచన పురుడు పోసుకుంది. వృద్ధాశ్రమాల సంఖ్య పెరగడానికి మొదటి మరియు ప్రధాన కారణం మారుతున్న ప్రజల జీవనశైలి. పూర్వం కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవి, అక్కడ పెద్దలను గౌరవించేవారు మరియు వారి పిల్లలు మరియు మనుమలు చూసుకునేవారు.

అయినప్పటికీ, అణు కుటుంబాల ప్రారంభంతో, వృద్ధులు తరచుగా తమను తాము రక్షించుకోవడానికి ఒంటరిగా మిగిలిపోతారు. పిల్లలు మంచి ఉద్యోగావకాశాల కోసం దూరమవుతారు, మరియు వృద్ధులు ఒంటరిగా మరియు నిర్లక్ష్యానికి గురవుతారు.

దీనికి తోడు చాలా మంది యువకులు ఉద్యోగాలు, తల్లిదండ్రులు ఒంటరిగా ఉండడంతో విదేశాలకు వలస వెళ్తున్నారు. దీని ఫలితంగా వృద్ధులకు సాంగత్యం మరియు సంరక్షణ లభించే నర్సింగ్ హోమ్‌లు పెరిగాయి. గతంలో, వయోజన పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం సర్వసాధారణం. అయినప్పటికీ, యువ తరాలు మరింత స్వతంత్రంగా మారడంతో, వారు తమ పెద్దలను చూసుకోవడం తమ కర్తవ్యంగా భావించడం లేదు.


దానికి అదనంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక ప్రగతి కారణంగా మానవుని సగటు ఆయు: ప్రమాణం పెరిగింది. ఎక్కువ కాలం జీవించే వ్యక్తులకు మరింత ప్రత్యేక శ్రద్ధ మరియు మద్దతు అవసరం కావచ్చు. అయితే భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉరుకులు, పరుగుల జీవితంలో, ఇటువంటి నైతిక, భౌతిక సహాయం వృద్ధులైన కుటుంబ సభ్యులకు అందించడం కష్టంగా మారుతోంది. ఉద్యోగం చేస్తూ అన్ని సరదాలను, కోరికలను పక్కన పెట్టి కొంత మిగుల్చుకున్నాను. వృద్ధులకు, అనాథలకు ఒక మంచి జీవితం ఇచ్చే సదాశయంతో నేను స్థాపించాలనుకున్న వృద్ధాశ్రమం ఆలోచనను ఆఫీసులో, నేనుండే కోలనీలో, తెలిసినవారికి వివరిస్తూ విరాళాలు సేకరించసాగాను. స్థానిక అధికారులకు, స్వచ్చంద సంస్థ ప్రతినిధులకు, రాజకీయ నేతలకు, కార్పొరేట్ కంపెనీలకు, ఇలా కాళ్లరిగేలా తిరిగి కాస్త కాస్త విరాళాలు సేకరించగలిగాను.


ఈ మహాయజ్ఞంలో నేను ఒక సమిధను అవడానికి, అవసరం అయితే నన్ను నేను పూర్తిగా సమర్పించుకోవడానికి కూడా నేను సిద్ధమే అయ్యాను అయితే నా ఆశయానికి అడ్డు తగిలేవారే, నన్నొక మోసగాడిగా చూసేవారే, డబ్బు సంపాదించుకోవడానికి వేసే ఒక దొంగ ఎత్తని నన్ను చీత్కారంగా చూసేవారే ఎక్కువగా వున్నా, అనాథ వృద్ధులకు ఏదో ఒకటి చెయ్యాలన్న నా ధృడసంకల్పం ముందు ఇవన్నీ వెలవెలపోయాయి.


అయితే ఒక వృద్ధాశ్రమం నెలకొల్పడానికి ఇది ఎంత మాత్రము సరిపోదని నాకు తెలుసు. అదృష్టవశాత్తు నాది ఎ నెగిటివ్ అనబడే రేర్ బ్లడ్ గ్రూప్ అవడం వలన మూడు నెలలకొకసారి రక్తం అమ్మి తద్వారా వచ్చే డబ్బు కూడా దాచిపెట్టుకున్నాను. రోజులు ఇలా నడుస్తుండగా నా జీవితాశయం సఫలీకృతం అయ్యే ఒక బంగారు అవకాశం నన్ను వెదుక్కుంటూ వచ్చింది. బొంబాయికి చెందిన ఒక వర్తకుడు తన ఒక్కగానొక్క కొడుకు కోసం కిడ్నీ దాతను వెదుకుతున్నాడు. ఆ అబ్బాయికి అతి రేర్ గ్రూప్ అయిన ఏ నెగిటివ్. గత ఆర్నెళ్ళుగా వెదుకుతున్నా మంచి ఆరోగ్యంతో వున్న ఒక్క దాత కూడా దొరకకపోవడంతో ఆ వర్తకుడు ఎంతో ఆందోళనతో వున్నాడు. దాత ఎంత అడిగినా కూడా తన మొత్తం వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు అయిన తన కొడుకు కోసం అడిగినదంతా ఇవ్వడానికి సిద్ధంగా వున్నాడతను.


విధి వైపరీత్యమో ఏమో ఆ నోటా ఈ నోటా ఆ కబురు నాకు అందింది. ఎలాగూ ముందు వెనుకలు లేనివాడిని, నేననుకున్న లక్ష్యం పూర్తయ్యాక ఈ భూమి మీద జీవించడానికి ఏ మాత్రం ఆసక్తి లేని వాడిని. ఈ అవకాశం వదులుకోదలచుకోలేదు. ఆ వ్యాపార సామ్రాజ్యాధిపతిని కలిసి యాభై లక్షలకు బేరం కుదుర్చుకున్నాను. డబ్బు నా అక్కౌంట్ కు ట్రాన్స్ఫర్ అవడం, వారం రోజుల లోపే కిడ్నీని దానం చేసేసాను. అనుకున్న మొత్తం కంటే ఎక్కువ సమకూరడంతో ఒక మూడు నెలల విశ్రాంతి తర్వాత వృద్ధాశ్రమం ప్రారంభించాను. ఆ ఊరికి శివారు ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాను. వివిధ స్వచ్చంధ సంస్థలను సంప్రదించగా మొదట ఒక అయిదుగురు వృద్ధులు అందులో చేరారు. మొదట ఉచితంగా సేవలు ప్రారంభించినా నా వద్ద వున్న మూల ధనం ఎంతో కాలం సరిపోదని గ్రహించి దానిని పెయిడ్ సర్వీస్ గా మార్చాను.

అయితే ఇంత అని రుసుమును నిర్ణయించకుండా వారు ఎంత ఇస్తే అంత తీసుకోవడం జరుగుతోంది. ఆ వృద్ధులకు చల్లని నీడనిచ్చి వేళ కింత తిండి పెడుతున్నా ఆ పెద్దవాళ్ళలో ఏదో అసంతృప్తి. వాళ్ళలో కొందరు తమ పరిస్థితిని తలుచుకొని మానసికంగా కుంగిపోతే, మరికొందరిలో విపరీతమైన కోపం, అసహనం కనిపించేవి.


అవన్నీ చూసాక వాళ్ళకు ఇంకేదో చేయాల్సిన అవసరం వుందనుకున్నాను. ఇతర వృద్ధాశ్రమాల నిర్వాహకుల కంటే భిన్నంగా ఆలోచించడం వలనే బహుశా నా సంస్థ ఇంత అభ్యున్నతి సాధించిందన్నది నా గట్టి నమ్మకం.

నిరంతరం నిర్వేదంలో ఉండే ఆ పెద్దవాళ్ళకు ఒక వ్యాపకం కల్పిస్తే తమ బాధల్ని మరిచిపోతారని భావించి, వారికి చిన్న చిన్న వస్తువుల తయారీలో శిక్షణ ఇప్పించాను.


మొదట జపమాలలు, తర్వాత వంటింటి సామాగ్రి, ఆటవస్తువులు, అగ్గిపెట్టెలు, అగరువత్తులు ఇలా ఒక ఇరవై రకాల వస్తువుల తయారీలో వారికి శిక్షణ ఇప్పించాను. ఆ వస్తువులను నేను నిరుద్యోగులైన యువతకు ఇచ్చి వారికి కొంత కమీషన్ అప్పజెప్పే మీద వస్తువులను అమ్మించాను. ముడి పదార్ధాల ఖర్చులు మినహాయించి వచ్చిన లాభాలను ఆశ్రమ నిర్వహణకే వెచ్చించసాగాను.


నాణ్యత వుండడం, ధర తక్కువ అవడం వలన వాటిని కొనుక్కునేందుకు పేద, సామాన్య వర్గాలు ఉత్సాహం చూపించసాగారు. ఈ ఆశ్రమం గురించి ఆ నోటా, ఈ నోటా చుట్టుపక్కల ప్రాంతాలలోని వృద్ధులకు తెలియడంతో వారు వచ్చి తమకు ఏదో ఒక పని కల్పించమని అడిగారు. దానితో వారు చేయగలిగిన పనులలో వారికి శిక్షణ ఇప్పించాను. బయట నుండి వచ్చిన వారికి జీతం కూడా ఇవ్వసాగాను. ఒక మూడు సంవత్సరాల కాలంలో ఆ ఆశ్రమంలో చేరిన వారి సంఖ్య వందకు చేరింది.

ముందే చెప్పినట్లు స్వలాభాపేక్ష చూసుకోకుండా ఆశ్రమ నిర్వహణలో నూతన ఆలోచనా విధానం పాటించడం వలన ఆశ్రమం దినదినాభివృద్ధి చెంద సాగింది. ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే వారికి ఇది దేవాలయంలా ఉంది. మా అమ్మ ప్రశాంతిపేరిట ప్రశాంతి ఆశ్రమంగా రూపు దిద్దుకుంటున్న ఈ ఆశ్రమం ఇప్పుడు వృద్ధుల పాలిట ప్రశాంత వృద్ధాశ్రమంగా మారింది. ఇక్కడ బ్రహ్మకుమారీ అక్కయ్యలు ఇచ్చే రాజయోగ శిక్షణ, మెడిటేషన్, ఆధ్యాత్మిక తరగతుల కారణంగా ఇక్కడ శేష జీవితం గడుపుతున్న వారికి ఆధ్యాత్మిక తరగతులు ఒక మందులా పని చేస్తున్నాయి.. ఈ నేపధ్యంలో పెళ్ళి చేసుకోమని సమాజం నుండి వచ్చిన ఒత్తిళ్ళకు తల వంచి వృద్ధాశ్రమం పనులలో బిజిగా వున్నా కూడా మరొకవైపు తగిన వధువు కోసం ప్రయత్నాలు చెసాను. అయితే చిత్రంగా నేను ఎంచుకున్న పంధా నచ్చక, ఇరవై నాలుగు గంటలు కాటికి కాళ్ళు చాచుకున్న ఆ ముసలాళ్ళతో వేగడం, వారి కంపు మధ్య బ్రతకడం మా వలన కాదు, మీరు ఇదే బాటలో కనక సాగిపోవాలని నిర్ణయించుకుంటే మిమ్మల్ని కట్టుకొని మేమూ ఈ నరక కూపంలో బ్రతకలేము కాబట్టి ఈ సంబంధం చస్తే మాకు వద్దు అని తొంభై శాతం మంది అమ్మాయిలు ముఖాన్నే తలుపేసేశారు.

ఇక మిగిలిన పది శాతం, కావాలంటే ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం అయిదు వరకు కావలిస్తే ఆ ఆశ్రమంలో పడి ఉండండి. కాని అయిదు దాటాక ఆ ముసలివాళ్ళ కుళ్ళు కంపు అక్కడే వదిలేసి ఇంటికి రావాలి. ఇక అక్కడ ఎలాంటి ఎమర్జన్సీ వచ్చినా అటువైపు కన్నెత్తి చూడకూడదు. మమ్మల్ని మీ పనులలో సహాయం చేయమని అడగకూడదు అంటు చిత్ర విచిత్రమైన నిబంధనలు పెట్టి నన్ను వారిని వద్దనేలా చేసారు.


ధృఢవిశ్వాసంతో, చిత్తశుద్ధితో, ఎన్నో అడ్డంకులు, అధిగమిస్తూ అలుపెరుగని యోధుడిలా పోరాటం చేస్తున్న నేను ఈ దశలో ఈ వ్యామోహాలకు, ఆకర్షణలకు పడదలచుకోలేదు. కాబట్టి ఆ ప్రపోజల్స్ ను అన్నింటినీ సున్నితంగా తిరస్కరించేసాను. - మొదట్లో వందల సంఖ్యలో, తర్వాత పదుల సంఖ్యలో వచ్చిన సంబంధాలు, నాకు నలభై ఏళ్ళ వయసు వచ్చేసరికి రావడం మానేసాయి.


పెళ్ళి అనే బంధంలో చిక్కుకోనందుకు నాకు ఏ బాధ లేదు అయితే నా తర్వాత ఈ సదశయాన్ని ఎవరు ముందుకు తిసుకువెళ్తారు అని ఒక రాత్రి హఠాత్తుగా ఉదయించిన ప్రశ్నకు బదులుగా ఆ ఊరిలో వున్న ఒక అనాధాశ్రమంలో ఆరునెలల పసిగుడ్డును దత్తతకు తీసుకొని పెంచుకోసాగాను. నా ఆశయాలన్నింటినీ వాడికి ఉగ్గ పాలతోనే రంగరించి పోయసాగాను. ప్రశాంతి ఆశ్రమంతో నా కొడుకు దినదినాభివృద్ధి చెంద సాగాడు. ఆ ఆశ్రమంలో వున్న వృద్ధులే వాడికి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు అయ్యారు. వాడిలో అక్కడి వారు మరొక దినకర్( అంటే నన్ను) చూసుకోసాగారు. కాలచక్రం గిర్రున తిరిగింది. నాకిప్పుడు 65 ఏళ్ళు. ప్రశాంతి ఆశ్రమానికి 40 ఏళ్ళ వయస్సు వచ్చింది. ఒక్కరితో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో ఇప్పుడు రెండు వేలమంది వున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే ప్రసిద్ధమైన వృద్ధాశ్రమంగా మన ప్రశాంతి ఆశ్రమం పేరు గాంచింది. నిస్వార్ధ సేవకు గాను ఆశ్రమానికి, నాకు వచ్చిన అవార్డులు, రివార్డులు ఏన్నో ? అయితే అన్నింటికి మించిన ఆత్మ సంతృప్తి నాకు వుంది.

జీవితంలో కనీసం ఒక్కరి బ్రతుకులోనైనా వెలుగు నింపగలిగితే నీ జీవితానికి ధన్యత చేకూరినట్లే అన్న ఒక ఆధ్యాత్మిక వేత్త మాటలు నాకప్పుడు జ్ఞాపకం వచ్చాయి. నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కాని, కొన్ని వందల మంది జీవితాలలో నెలకొన్న కారు చీకట్లను దూరం చేసి వెలుగులు నింపేందుకు కనీసం నా వంతు కృషి చేయగలిగాను. ఈ జన్మకు సార్ధకత ఇంకేముంటుంది.


వచ్చే జన్మంటూ వుంటే, అందులో మనిషి జన్మ లభిస్తే నా సర్వ సుఖాలు వదులుకొని, నిస్వార్ధంగా మన కంటే తక్కువ అదృష్టవంతులకు సేవ చేసుకొనే అవకాశం లభించాలని మనస్పూర్తిగా భగవంతునికి ప్రార్ధన చేసి నాటికి నిద్రకు ఉపక్రమించాను. పక్కనే నా వారసుడు శుభకర్ ఎంతో నిశ్చింతగా గుండెలపైన చెయ్యి వేసుకొని నిద్రపోతున్నాడు.

***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.


221 views0 comments

Comments


bottom of page