top of page

సర్వేజనా సుఖినోభవంతు


'Sarvejana Sukhinobhavathu' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao

'సర్వేజనా సుఖినోభవంతు' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఇంటికి వచ్చిన శేఖర్ కి ఒక బాస్కెట్ లో పడుకుని వున్న కుక్కపిల్ల, దాని చుట్టూ కూర్చొని ఆశ్చర్యం గా చూస్తున్న తన కూతురు, కొడుకు కనిపించారు. ఎందుకో శేఖర్ కి ఒక్కసారిగా కోపం వచ్చింది.


“ఒరేయ్ వినయ్! ఎందుకు తీసుకు వచ్చావు ఆ కుక్కని? చదువు మానేసి దాని చుట్టూ కూర్చున్నారు, ఎక్కడ నుంచి తెచ్చావో అక్కడ వదిలేసి రా” అన్నాడు.


“నా మీద అరుస్తారెందుకు నాన్న, అమ్మ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చింది. దాని వంక ఒకసారి చూడండి. మీ వంక జాలిగా చూస్తోంది. దానిని పంపించేస్తారేమో అని..” అన్నాడు కొడుకు.


ఇంతలో వంట గదిలోనుంచి కాఫీ కప్పుతో వచ్చిన భార్య పార్వతి వంక చూసి, “మనం ఆఫీస్ కి వెళ్తే పిల్లలని చూసే దిక్కులేక ప్లే స్కూల్ లో సాయంత్రం వరకు వుంచుతున్నాం. యిప్పుడు ఈ కుక్క పిల్లని ఎందుకు తెచ్చావు?” అన్నాడు కాఫీ కప్పు అందుకుంటూ.


“నేను కావాలని తీసుకుని రాలేదు. మా ఫ్రెండ్ మూషి వుంది కదా.. తనకి ఎవ్వరో ‘రెండు మంచి జాతి కుక్క పిల్లలు వున్నాయి నీకు కావాలా, వద్దంటే రోడ్డు మీద వదిలేస్తాము’ అన్నారుట. దానితో మా ఫ్రెండ్ కి జాలి వేసి తన ఇంటికి తెచ్చుకుని నన్ను ఒకటి తీసుకోమంది. మూషి నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకనే ఒక కుక్కపిల్ల ని తీసుకుని వచ్చాను” అంది పార్వతి.

“అది సరే.. యిప్పుడు దానిని మనం ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఎక్కడ వుంచాలి” అన్నాడు శేఖర్.


“ఇంట్లోనే వుంటుంది. పాలు తప్ప యిప్పుడు అది ఏమి తినదు. గిన్నెలో పాలు పోసి వుంచి తలుపు వేసుకుని వెళ్ళిపోదాం. సాయంత్రం మనం వచ్చే వరకు ఇంట్లోనే తిరుగుతోవుంటుంది. మీకెందుకు.. నేను పిల్లలు దాని బాధ్యత చూసుకుంటాము. అప్పుడే దానికి బ్యూటీ అని పేరుకూడా పెట్టేసారు పిల్లలు” అంది.


“సరే కానీ, నన్ను మాత్రం లాగకండి దాని పనులలోకి” అన్నాడు శేఖర్.


ఒక పదిరోజులకే కొద్దిగా ఎదిగినట్టుగా వుంది కుక్కపిల్ల. పిల్లలిద్దరూ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే దానితో కొంతసేపు బంతి ఆట ఆడుతూవుంటారు. అయితే శేఖర్ మాత్రం ఒక్కసారి కూడా దానిని దగ్గరికి తీసుకోలేదు.


పార్వతి ఆఫీస్ కి వెళ్ళిపోయింది, పిల్లలు ఉదయం శేఖర్ లేచే టైముకే స్కూల్ కి వెళ్లిపోయారు. బ్యూటీ కి కావలిసిన పాలు, బిస్కట్స్ ప్లేట్ లో పెట్టేసింది. తనకి తెలుసు శేఖర్ బ్యూటీ పనులు పట్టించుకోకోడని.


ఆఫీస్ కి వెళ్దాం అని షూ కోసం వెతుకుంటున్న శేఖర్ ని చూసి సోఫా కింద వున్న షూ ని నోటితో పట్టుకుని తీసుకుని వస్తున్న బ్యూటీని చూడగానే ‘ఓసిని.. నేను దేనికోసం వెతుకుతున్నానో దీనికి అర్ధం అయినట్టు వుంది’ అనుకుని దాని తల నిమిరాడు శేఖర్.


ఆమాత్రం ప్రేమకే అది వెంటనే తోక ఆడిస్తో శేఖర్ కాళ్ళ మీద తల పెట్టుకుని పడుకుంది. శేఖర్ కి ఎందుకో బ్యూటీ అంటే జాలి కలిగి ఒళ్ళోకి తీసుకుని సెల్ఫీ తీసుకుని భార్య పార్వతి కి వాట్సాప్ చేసాడు.


బ్యూటీకి టాటా చెప్పి యిల్లు తాళం వేసుకుని ఆఫీస్ కి బయలుదేరుతో ఈ రోజు సాయంత్రం బ్యూటీకి బిస్కట్స్, టవల్స్ బలం కి ఏదైనా మెడిసిన్ కొని తీసుకుని రావాలి. పాపం అది మమ్మల్ని నమ్ముకుని వుంది, అరవటం తప్పా ఏమైనా చెప్పగలదా ఏమన్నానా అనుకున్నాడు శేఖర్.


సాయంత్రం పెద్ద సూపర్ బజార్ కి వెళ్లి ఒక గంట సేపు వెతికి బ్యూటీకి కావలిసిన పరుపు, తినటానికి మంచి బౌల్, టవల్, దువ్వెన, ఆడుకోవాటానికి బంతి మొదలగునవి కొని యింటికి చేరుకున్నాడు శేఖర్.


పెద్ద సంచితో వస్తున్న భర్తని చూసి పార్వతి, “అమ్మయ్యా! కూరలు తీసుకుని వచ్చారా, నేనే ఫోన్ చేద్దామని అనుకున్నాను” అంటూ శేఖర్ చేతిలో సంచి అందుకుని టేబుల్ మీద గుమ్మరించింది.


“వుండు.. అవి కూరలు కావు బ్యూటీకి కావలిసిన వస్తువులు, రేపు ఒక చిన్న అల్మారా కొంటాను, దాని వస్తువులన్నీ దాంట్లో పెట్టు” అన్నాడు సోపాలో కూర్చొని.


“బాగానే వుంది మీ వరస, ఒక్కసారిగా బ్యూటీ మీద యింత ప్రేమ పుట్టుకొచ్చిందే” అంటూ నవ్వుతు, బంతిని తీసుకుని వెళ్లి బ్యూటీ ముందు పడేసింది. అది బంతిని నోటితో పట్టుకుని తీసుకుని శేఖర్ ముందు పడేసింది.


‘అది నీకే, ఆడుకో’ అన్నాడు శేఖర్ రెండు బిస్కెట్ ముక్కలు బ్యూటీ ముందు వేసి.


అదేమిటో యిన్నాళ్ళు పిల్లల చుట్టూ తిరిగిన బ్యూటీ యిప్పుడు శేఖర్ ని వదలకుండా వుంది. ఒక్కొక్కరు వచ్చిన వేళా విశేషం, శేఖర్ ఆఫీస్ లో ఒక ఇంజనీర్ ‘బీజీ కాలనీలో ఫ్లాట్స్ కడుతున్నాను అని, ఆరు ప్లాట్స్ లో ఒక్కటే మిగిలింది, మీరు తీసుకోండి, లోన్ ఆవి నేనే ఇప్పిస్తాను’ అన్నాడు. ‘సరే సాయంత్రం చూస్తాము’ అని చెప్పి, పార్వతి వాళ్ళ ఆఫీసుకి వెళ్లి భార్యని వెంట తీసుకుని బీజీ కాలనీలో ని అపార్ట్మెంట్ చూసాడు. తమకి యిస్తాను అన్న ఫ్లాట్ నచ్చడంతో వెంటనే పదివేల రూపాయలకి చెక్కు అడ్వాన్స్ గా యిచ్చి ఇంటికి వచ్చారు.


యజమానులు యిద్దరు కలిసి ఒకేసారి రావడం చూసి బ్యూటీ యిద్దరి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. శేఖర్ దానిని దగ్గరికి తీసుకుని, “పార్వతి.. మొదట్లో ఏదో అనుకున్నాను కానీ మన బ్యూటీ వచ్చి మన చేత యిల్లు కొనిపించింది”అన్నాడు.


“అవునండి, పాపం కొద్దిగా పెద్దది గా అయ్యింది, రేపు ఆదివారం మీ అటెండర్ ని పిలిచి, యిద్దరు బ్యూటీని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లి చూపించండి” అంది.


“అలాగేలే.. అహ్మద్ ని రమ్మంటాను” అన్నాడు శేఖర్.


యిట్టే ఏడాది గడవటం, కొత్త ఫ్లాట్ లో కి గృహప్రవేశం చేసుకుని వెళ్లడం జరిగిపోయాయి. బ్యూటీ కూడా పెద్దది అవడంతో బయట వరండాలో కట్టేస్తున్నారు. అదేమిటో ఆ కాలనీలో పది ఇళ్ల కంటే లేవు. శేఖర్ వాళ్ళ అపార్ట్మెంట్ కి మూడు వైపులా ఖాళీ స్థలాలు తప్పా ఇళ్లు అనేవి లేవు. శేఖర్ వాళ్ళ ఫ్లాట్ పక్కన ఒక యిల్లు వుంది, అందులో ఎవ్వరో ఖాన్ గారి ఫ్యామిలీ వుంది. వాళ్ళు ఎప్పుడో గాని బయటకు కనిపించరు.


“పార్వతి.. మన అపార్ట్మెంట్ లో మిగిలిన వాళ్ళు రాకుండానే మనం వచ్చి తప్పు చేసాము అనిపిస్తోంది. రాత్రి అయ్యే సరికి నిశబ్దంగా ఉండి భయం కూడా వేస్తోంది. ఏ దొంగలో వచ్చి తలపగలకొట్టి యిల్లు దోచుకుపోతారేమో” అన్నాడు.


“చూడండి.. మనము వచ్చేనట్టే మిగిలిన ఫ్లాట్స్ లోకి వస్తారు, అందాకా మన బ్యూటీ వుంది. మనకి భయం లేదు. ఎవ్వరైనా వస్తే పీకేస్తుంది” అంది పార్వతి భర్తకి ధైర్యం యిస్తో. తన మీద వీళ్ళు పెట్టుకున్న నమ్మకానికి బ్యూటీ గర్వంగా శేఖర్ వంక చూసింది.


శేఖర్ వాళ్ళతో పాటే వంకాయ, బీరకాయ, మొదలగు బ్రాహ్మణ వంటలు తినేది పాపం!


ఆదివారం నాడు బాగా హుషారుగా వుండి ఖాన్ గారి ఇంటివైపు చూస్తూ వుండేది. తరువాత తెలిసింది, ఖాన్ గారి భార్య మాంసాహారం పెట్టేది అని. అది తినేసి పతివ్రత లా మళ్ళీ పార్వతి పెట్టిన కూరా అన్నం తినేది. పోనీలే ఖాన్ గారి పెట్టే తిండితో బలమైన వస్తుంది అని సైలెంట్ గా వున్నాడు శేఖర్.


పిల్లలిద్దరూ స్కూల్ నుంచి మూడు గంటకల్లా వచ్చేసే వాళ్ళు. వాళ్ళని చూసి ఆనందంతో ఒకటే గంతులు వేసేది బ్యూటీ. పొరపాటున పిల్లలకంటే ముందు శేఖర్, పార్వతి ఇంటికి వస్తే గేటు వంక చూస్తో పిల్లల కోసం అరుస్తో వుండేది. దానికి ఎవ్వరు ముందు యింటికి వస్తారో కూడా తెలిసిపోయింది.


సంవత్సరాలు గడిచాయి, పైన ఫ్లాట్స్ తో పాటు కాలనీలో కొత్త యిల్లు అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. శేఖర్ వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళకి బ్యూటీ అంటే ఇష్టం అయిపొయింది. ఒకరోజు అర్దరాత్రి బ్యూటీ ఒక్కటే అరుస్తోవుండటం తో శేఖర్ కి అనుమానం వచ్చి చేతిలో ఒక కర్ర పట్టుకుని తలుపు తీసాడు. అదేటైంకి పైన ఫ్లాట్స్ వాళ్ళు లేచి కిటికీలోనుంచి చూస్తున్నారు.


ఖాన్ గారి యింటి తలుపు ఇద్దరు దొంగలు పగలకొడుతు కనిపించారు. ‘యేయ్ ఎవ్వరా మీరు’ అంటూ కర్రతో భయపెట్టాడు శేఖర్. పై ప్లాట్ రెడ్డి గారి అబ్బాయి మెట్లు దిగి వచ్చి ఖాన్ గారి యింటి దగ్గర వున్న దొంగల మీద రాళ్లు విసరాడు. దానితో దొంగలు బయపడి పారిపోవడం తో అమ్మయ్య అనుకుని ఎందుకైనా మంచిది అనుకుని బ్యూటీని వదిలేసి వుంచాడు శేఖర్. అయితే ఆశ్చర్యం యింత గొడవ అవుతున్నా ఖాన్ గారు లేచి బయటకి రాకపోవడం.


తరువాత తెలిసింది ఆయన ఊరు వెళ్లినట్టు. ఒక రెండు రోజులు బ్యూటీని వాళ్ళ గుమ్మం లో కట్టేసాడు శేఖర్. ఖాన్ గారు ఊరు నుంచి వచ్చిన తరువాత సంగతి తెలుసుకుని, ఎప్పుడో ఒకసారి వేసిన మాంసం ముక్క తిన్న బ్యూటీ మా యిల్లు దొంగల నుంచి కాపాడింది అని మురిసిపోయారు.


ఆ రోజు నుంచి ఒక్కసారి అయినా బ్యూటీని పలకరించడం ఖాన్ గారికి అలవాటైపోయింది.


బ్యూటీ 14 ఏళ్ళ పుట్టినరోజు ఘనంగా వంకాయ కూర, పప్పు, ఉదయం బ్రేక్ ఫాస్ట్ దోశ తో ముగిసింది.


వానాకాలం మొదలైంది, ఆదివారం అటెండర్ అహ్మద్ వచ్చి బ్యూటీకి స్నానం చేయిస్తో, “సార్! బ్యూటీ కి పొట్టమీద పుండు పడింది చూడండి” అని పిలిచాడు. నిజమే గోళీ కాయంత ఎర్రటి పుండు కనిపించింది.


“యింక స్నానం ఆపి, దానికి ఈ స్కిన్ ఆయింట్మెంట్ రాయి, చూద్దాం. తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళదాం” అన్నాడు శేఖర్.


“మీ స్వంత వైద్యం మానేసి దానిని డాక్టర్ కి చూపించండి ముందు” అంది పార్వతి.


“మందు రాసాము, చూద్దాం, తగ్గకపోతే డాక్టర్ దగ్గర కి తీసుకుని వెళ్తాను లే” అన్నాడు.


ఆదివారం గడిచింది, సోమవారం సాయంత్రం శేఖర్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి, పిల్లలు, పార్వతి ముగ్గురు బ్యూటీ దగ్గర కనిపించడం తో ఏమైంది అన్నాడు కంగారు గా.


“హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమంటే బద్దకించారు, యిప్పుడు చూడండి బ్యూటీ వణికి పోతో మూలుగుతోంది, ఉదయం పెట్టిన అన్నం కూడా ముట్టుకోలేదు” అంది పార్వతి.


“యిప్పుడు ఏ హాస్పిటల్ ఉంటుంది డాగ్స్ ని చూడటానికి, రేపు ఉదయం అహ్మద్ ని రమ్మని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాను, ఈ రోజు క్రోసిన్ టాబ్లెట్ పౌడర్ చేసి పాలలో వేసి యివ్వు” అన్నాడు.

ఆఫీస్ డ్రెస్ మార్చుకుని, వెటర్నరీ హాస్పిటల్ మైంటైన్ చేసే ఇంచార్జి కృష్ణ కి ఫోన్ చేసి “రేపు మా డాగ్ ని తీసుకుని వస్తాను, నువ్వు కూడా ఆ టైముకి హాస్పిటల్ దగ్గర వుండు” అన్నాడు.


అహ్మద్ కి కూడా ఫోన్ చేసి “ఉదయమే ఆటో తీసుకుని రా, బ్యూటీని హాస్పిటల్ లో చూపిద్దాం” అని చెప్పాడు.


రాత్రి బ్యూటీ మూలుగుతో వుంటే నిద్రపోకుండానే గడిపారు శేఖర్ కుటుంబం.


“నాన్నా! నేను కూడా మీతో హాస్పిటల్ కి వస్తాను, ఈ రోజు కాలేజీ కి వెళ్ళను” అన్నాడు కొడుకు వినయ్.. అహ్మద్ రాగానే ఆటోలో బ్యూటీని బలవంతంగా ఎక్కించి, శేఖర్, వినయ్ వెనుక స్కూటర్ మీద హాస్పిటల్ కి బయలుదేరారు. హాస్పిటల్ కి వచ్చే సరికి, హాస్పిటల్ ఇంచార్జ్ కృష్ణ కూడా రెడీ గా వున్నాడు. దొడ్డి దారి నుంచి బ్యూటీని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అది గవర్నమెంట్ హాస్పిటల్ అవడం, అవి శేఖర్ పనిచేసే ఆఫీస్ కంట్రోల్లో వుండటంతో డాక్టర్ గారు ప్రత్యేక ఇంటరెస్ట్ చూపించి వెంటనే బ్యూటీని పరీక్ష చేసాడు.


“ఎన్ని సంవత్సరాలనుండి మీరు డాగ్ ని పెంచుతున్నారు?” అన్నాడు కుర్చీలో కూర్చుంటూ.


“ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి. వారం వరకు ఆరోగ్యంగానే వుంది. సడన్ గా సిక్ అయ్యింది” అన్నాడు శేఖర్ డాక్టర్ ఏమంటాడా అని ఆలోచిస్తో.


“సహజంగా డాగ్స్ లైఫ్ ఫోర్టీన్ ఇయర్స్. మీ డాగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వుంది అంటే మీరు చెప్పినట్టుగా శాఖాహరం తినడం వలన అనుకోవాలి. యిప్పుడు దానికి కాన్సర్ వచ్చింది. బహుశా యింకో వారం రోజులు కంటే బతకడం కష్టం” అన్నాడు డాక్టర్.

“మీ ఆఫీస్ స్టాఫ్ చెప్పాడు, మా సార్ వస్తున్నారు వాళ్ళ డాగ్ ని తీసుకుని అని. కాబట్టి మీకు ఒక సలహా, ఈ వారం రోజులు డాగ్ చాలా బాధ పడుతుంది. అది మీరు చూడలేరు. మా దగ్గర వదిలేయండి మిగిలిన విషయం మేము చూసుకుంటాం” అన్నాడు.


“బలేవారే డాక్టర్, మనుషులని అయితే అలాగే వదిలేసి వెళ్ళిపోతామా ఏ వైద్యం లేకుండా. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మీరు మా డాగ్ ని బతికించండి” అన్నాడు శేఖర్ వణుకుతో.


“సారి సార్, సహజంగా యిటువంటి మాట విని వాళ్ళ డాగ్ ని వదిలేయటం నా సర్వీస్ లో ఎంతో మంది ని చూసాను. అందుకే ఆ సలహా యిచ్చాను. నేను ఏదో డాగ్స్ కి పిచ్చ ఎక్కకుండా ఇంజక్షన్ యివ్వడం, చిన్న చిన్న కట్లు కట్టడం తప్ప, యింత పెద్ద జబ్బుకి వైద్యం చెయ్యలేను. నారాయణగూడా లో పశువులకి పెద్ద ప్రయివేట్ హాస్పిటల్ వుంది, అక్కడకి తీసుకుని వెళ్లి ట్రై చెయ్యండి” అన్నాడు డాక్టర్.


“సరే డాక్టర్” అంటూ భారంగా లేచి “పదరా అబ్బాయి” అన్నాడు కొడుకు తో. అంతా గమనించిన వినయ్, ‘బ్యూటీ కమాన్’ అని పిలిచాడు.


అంతే మరి.. అంత బలం ఎలా వచ్చిందో తెలియదు, ఒక్కసారిగా బల్ల మీదనుంచి దూకి వినయ్ వెంట నడిచింది.

నారాయణగూడ హాస్పిటల్ లో డాక్టర్ గారు పరీక్ష చేసి, “కాన్సర్ మొదటి స్టేజి లో వుంది. 15 సంవత్సరాలు నిండుతున్నాయి, యిప్పుడు ఆపరేషన్ చేసి బతికించినా యింకా ఎన్నాళ్ళు బతుకుతుందో చెప్పలేము” అన్నాడు డాక్టర్ కామేష్.


“డాక్టర్ గారు.. మా తాతగారికి డబ్భై ఏళ్ళు, హార్ట్ ఆపరేషన్ చేసారు. యిప్పుడు కూడా నన్ను తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటారు. మా బ్యూటీ కూడా మమ్మల్ని వదిలి పెట్టదు” అన్నాడు వినయ్.


“మీ అబ్బాయా, చిన్నవాడైనా పెద్ద నీతి భోధించాడు. నిజమే. మన ప్రయత్నం మనం చేద్దాం” అన్నాడు డాక్టర్.

అనారోగ్యం తో వున్న వాడు డాక్టర్ తో తనవాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో వింటున్నట్టు, బ్యూటీ కూడా వింటోంది ఏమో, మా అబ్బాయి వంక కృతజ్ఞతగా చూస్తో తోక ఆడిస్తోంది.

పిల్లాడి ఎంబీఏ ఫీజు కోసం దాచిన లక్ష రూపాయలు తీసుకుని వచ్చి హాస్పిటల్ లో కట్టాడు శేఖర్. ఆపరేషన్ అయ్యింది. దెబ్బతిన్న పార్ట్ తీసేసి కుట్లు వేసి ఒక వారం రోజులు హాస్పిటల్ వుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి తగ్గించారు.


డాక్టర్ కామేష్ బ్యూటీని డిశ్చార్జ్ చేస్తో శేఖర్ కి ఒక మాట చెప్పాడు. “డాగ్స్ మనుషులు బతికినంత కాలం జీవించాలని కోరుకోవడం ఆశ అవుతుంది. యిప్పటికి మీ డాగ్ ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే దాని జీవితం యిప్పుడు బోనస్ కాలం లో వుంది” అన్నాడు.


డాక్టర్ గారికి థాంక్స్ చెప్పి క్యాబ్ లో బ్యూటీని ఇంటికి తీసుకుని వచ్చారు శేఖర్, వినయ్.


వినయ్ ఎంబీఏ అయ్యింది, జాబ్ చేస్తున్నాడు, అమెరికా లో వున్న శేఖర్ కూతురు కి కొడుకు పుట్టాడు బ్యూటీకి యిరవై సంవత్సరాలు వచ్చాయి.


‘ప్రయత్నం చెయ్యి, ఫలితం నేను యిస్తా’ అన్న గీతలోని మాటలు నిజం అయ్యాయి.


సర్వేజనా సుఖినోభవంతు


శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










1 Comment


@saipraveenajeedigunta8361 • 9 minutes ago

Gunde Chala baruvu yekkindi

Like
bottom of page