#SanthalaSaragalaBalaram, #సంతలసరాగాలబలరామ్, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ,#TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
Sa Sa Ba - Santhala Saragala Balaram - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 18/11/2024
స.స.బ - సంతల సరాగాల బలరామ్ - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
"ఒరేయ్!... ఎస్.ఎస్.బి.” పిలిచాడు వారి మిత్రుడు కృష్ణమూర్తి.
ఒక్కక్షణం తర్వాత మరలా ఎస్.ఎస్.బి, కాస్త హెచ్చు స్థాయిలో పిలుపు.
హాలును చిమ్ముతున్న ఎస్.ఎస్.బి త్వరగా పెంటను ఓ మూలకు నెట్టి ద్వారాన్ని సమీపించి తెరిచాడు చిరునవ్వుతో.
"ఏం చేస్తున్నావురా!... వీరే మన మనోశాంతి ప్రదాతా స్వాముల వారు..." ఎడంచేత్తో తన ప్రక్కన వున్న ఎం.ఎస్.పి స్వాముల వారిని చూపించాడు అందంగా నవ్వుతూ కృష్ణమూర్తి.
"స్వాములూ!.... నమస్కారములు. దయచేయండి లోనికి" సుస్వాగతంతో పలికాడు ఎస్.ఎస్.బి.
స్వాములవారు, కృష్ణమూర్తి, ఇంట్లోకి ప్రవేశించారు. సూపర్ డిజైన్ తుంగ చాపను నేల పరిచాడు ఎస్.ఎస్.బి.
"స్వామీ! కూర్చోండి. ఒరే... నీవూ కూర్చోరా!" చెప్పాడు ఎస్.ఎస్.బి.
ఆ ఇరువురూ కూర్చున్నారు. స్వాముల వారు ఆ హాలు నాలుగువైపులా పరీక్షగా చూచారు.
"మీ గృహిణి కడు సమర్థురాలు కదూ బాలక!" చిరునవ్వుతో అడిగాడు స్వామీజీ.
ఎస్.ఎస్.బి, కృష్ణమూర్తి ముఖంలోకి ఓ వింతచూపు చూచి...
"ఆ...ఆ... నిజం స్వామీజీ.. అంతా వీడు.. నా ప్రాణమిత్రుడు కృష్ణగాడి మహిమే స్వామీ!"
కృష్ణమూర్తి నవ్వాడు.
ఎస్.ఎస్.బి ముఖంలో కోపం...
స్వాముల వారి ముఖంలో ఆశ్చర్యం....
"స్వామీజీ!... మా వాడికి నేనంటే వల్లమాలిన అభిమానం. అందుకే వాడు అంత గొప్పగా చెప్పాడు" చిరునవ్వుతో ఎస్.ఎస్.బి ముఖంలోకి చూచాడు కృష్ణమూర్తి.
"కృష్ణా!"
"స్వామీజీ!...."
"ఎస్.ఎస్.బి అనగా ఏమిటి?"
"స.స.బ"
"అనగా!"
"సంతల సరాగాల బలరామ్. ఇదే మావాడి పూర్తిపేరు స్వామీజీ"
"మిస్టర్ స.స.బ.. నిన్ను నేను సింపుల్‍గా అలా పిలవ వచ్చునా" అడిగారు స్వామీజీ.
"ఎలాగైనా పిలవండి స్వామీ. అది తమరి వసతి!"
"కృష్ణా!"
"స్వామీజీ!"
"వసతి ఏమిటి?"
"మావాడి భాషలో వసతి అంటే ఇష్టం అని స్వామీజీ. మీరు వాడిని మీ ఇష్టం వచ్చినట్లు అనగా స.స.బ గాని, ఎస్.ఎస్.బి అని గాని...." కృష్ణమూర్తి పూర్తిచేయకముందే....
"లేక సంతల సరాగాల బలరామ్‍గా అయిన పిలవవచ్చునంటావ్? కదూ" నవ్వాడు స్వామీజి.
స.స.బ ఇరువురి ముఖాల్లోకి పరీక్షగా చూచాడు ఆశ్చర్యంతో.
"బాలకా!..."
"స్వామీజీ!"
"నీ హితుడు నాకు చెప్పినాడు!"
"ఏం చెప్పాడు స్వామీ!"
"నీ వైవాహిక జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా కడు మనోహరముగా వున్నదని...." స్వామి వారి వదనంలో చిరునవ్వు.
"అయిననూ నీవు నాతో ఏదో సంప్రదించా లనుకొంటున్నాట. అది ఏమి?" అడిగారు స్వామీజీ.
"మావాడు మీతో చెప్పినది అబద్ధం స్వామీ!"
"అటులనా?"
"అవును స్వామి!... నా వైవాహిక జీవితము నరకముగా ఉంది."
"నరకమా!" స్వామివారి ముఖంలో ఆశ్చర్యం.
"అవును స్వామీ!..." దీనంగా చెప్పాడు స.స.బ.
"కాస్త వివరంగా నీ బాధలను చెప్పగలవా!" అడిగారు స్వామీజీ.
"చెప్తాను స్వామీజీ!"
"స్టార్ట్ బాలకా!"
కృష్ణమూర్తి పెదవులపై చిరునవ్వు....
స.స.బ, కృష్ణ ముఖంలోకి చురచురా చూచాడు. సుదీర్ఘ నిట్టూర్పును విడిచాడు.
"స్వామీ!...."
"చెప్పుము బాలకా!"
"నా బ్రతుకు కుడితిలో పడ్డ బల్లివలే వుంది స్వామీ!"
"వివరణ బాలకా!"
"నా భార్య వీడి మేనమామ కూతురు స్వామి. బి.ఎస్సీ వరకు చదివింది. పాసైంది."
"ఈ కాలపు ఆడపిల్లలు కడు సమర్థులు విద్యావంతులు. అన్ని రంగాల్లో వున్నారు. నీకు అవసరమైతే, అదే నీ సంపాదన చాలకపోతే, ఆమెను నీవు ఉద్యోగమునకు పంపవచ్చునుగా! అదియును గాక నీ హితుడు మాహాత్యాగి. తాను చేసికొనవలసిన అమ్మాయిని నీకు భార్యగా చేసినాడు. కృష్ణమూర్తి చాలా గొప్పవాడు బాలకా!.."
"స్వామీ! వారిరువురిదీ ప్రేమ వివాహం. నా ప్రమేయం ఏమీ లేదు" మెల్లగా చెప్పాడు కృష్ణమూర్తి.
"బాలకా!... అది నిజమా!"
"అవును స్వామీ!... మోసపోయాను"
"ప్రేమ... పెండ్లి. ఇందులో మోసమేమున్నది స.స.బ?"
"నేను అనుకొన్నది ఒకటి!... నాకు సంప్రాప్తించినది మరొకటి స్వామి. ఆ పిల్ల నిజ స్వరూపము నాకు వివాహానంతరం అర్థమైనది!" విచారంగా చెప్పాడు స.స.బ.
"మరి కాస్త వివరణగా నీ సమస్యను వివరింపుము స.స.బ"
"ఆ పిల్ల ఏ పనీ చేయదు స్వామీ. ఇల్లు చిమ్మడం, వంట చేయడం, గిన్నెలు తోమి, కడగడం, గుడ్డలు వుతికి ఆరబెట్టి, ఇస్త్రీ చేయడం... సర్వపనులూ నాచేతనే చేయిస్తూ ఉంది స్వామీజీ!" విచారంగా చెప్పాడు స.స.బ.
"ఆ పిల్ల ఎవరు స.స.బ"
"అదే నా భార్య!"
"ఆమె పేరు ఏమిటి?"
"మాణిక్యం!"
"చాలా మంచిపేరు. అంతటి అందమైన, సుందరమైన పేరు భార్యకు వుండగా ఆపిల్ల అని సంబోధించడం అసభ్యం కాదా స.స.బా!.... ఆడవారిని గౌరవించడం మన సాంప్రదాయం అని నీకు తెలియదా!..."
"దానికి సభ్యత, భర్తను ఎలా చూచుకోవాలో, గౌరవించాలో తెలియదు స్వామీజీ!" విచారంగా చెప్పాడు స.స.బ.
"అయితే ఇప్పటి నీ నిర్ణయం ఏమిటి స.స.బ?"
"ప్రస్తుత నా పరిస్థితి అయోమయం. నా బాధలను నేను మాది ప్రేమ వివాహం అయినందున, నేను ఇంట్లో నౌకర్‍గా బయట ఇంట యజమానిగా చాలా భారమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఇంట్లో చాకిరీ అంతా చేసి, డబ్బా కట్టుకొని ఆఫీసుకు పరుగెత్తి, అక్కడ ఎనిమిది, పదిగంటలు వూడిగం చేసి పరుగెత్తుకొని ఇంటికి రావలసిన దుస్థితి స్వామీ నాది. దీనికి విమోచన మార్గాన్ని నాకు తమరు తెలియజేయండి!" దీనంగా అడిగాడు స.స.బ.
స్వామీజీ కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు స.స.బ ముఖంలోకి.
"ఇంతేనా ఇంకా ఏమైనా బాధలు వున్నాయా!" అడిగాడు స్వామీజీ.
"వున్నాయి స్వామీ!..."
"ఆ వివరాలేమిటో చెప్పు మరి?"
"పెండ్లికి ముందే తాను నాకు ఒక ఆంక్ష పెట్టింది స్వామీ. ఆవేశంతో సరే అన్నాను"
"ఆవేశం కాదు వ్యామోహం!... అదేమిటో చెప్పు...."
"వివాహానంతరం వేరు కాపురం, నా తల్లిదండ్రులకు దూరంగా వేరే వూరిలో కాపురం పెట్టాలని అంది"
"అందుకు నీవేమన్నావు?"
"దానిమీద పిచ్చితో సరే అన్నాను!"
"అదిగో మరలా కళంకిత భాష. నీ భార్య పేరు ఏమన్నావు?"
"మాణిక్యం"
"ఎప్పుడైనా ఆమెను గురించి చెప్పాలనుకొంటే మాణిక్యం అనే ఆ మృదుమధురమైన పేరును వాడు స.స.బా!"
స.స.బ దీనంగా స్వామి వారి ముఖంలోకి చూచాడు.
"సరే!... ఆసలు విషయం ఏమిటో చెప్పు" అడిగారు స్వామీజి.
"వారానికి రెండు మూడు రోజులు ఆమె బంధుజాలం తల్లితండ్రులు ఎవరో ఒకరు మేము తిరుపతిలో వున్నందున, తిరుమల వెంకన్న దర్శనం కోసం, మా ఇంటికి వస్తారు సామీ! వారిని రైల్వేస్టేషనులో రిసీవ్ చేసుకొని కొండను ఎక్కించి, స్వామి వారి దర్శనం చేయించి, వారికి సకల మర్యాదలు చేసి... తిరుగు రైల్వేస్టేషన్ చేర్చి రైలు ఎక్కించి వారికి పండ్లు, టిఫిన్ కొనిచ్చి, రైలు కదిలేవరకూ ప్లాట్‍ఫామ్ మీద నిలబడి వుండి, కాళ్ళు ఈడ్చుకొంటూ కొంపకు రావడం నాకు ప్రాణాంతకంగా వుంది స్వామీజీ... కష్టానికి కష్టం... డబ్బుకు డబ్బు ఖర్చు నా బ్యాంక్ అకౌంటులో పదిరూపాయలు ఉంది సామీ!... నలభై ఐదు వేలు అప్పు ఉంది సామీ!... పెండ్లి చేసుకొని తల్లితండ్రికి దూరమై ఇంతగా బ్రష్టుపడతానని నేను ఊహించలేకపోయాను. జీవితం మీద విరక్తి కలుగుతూ వుంది." కన్నీరుతో దీనంగా చెప్పాడు స.స.బ.
స్వామీజీ, కృష్ణమూర్తి జాలిగా చూచారు స.స.బ ముఖంలోకి.
"నాయనా స.స.బా!..."
"బాధపడకు.... ప్రతి సమస్యకు పరిష్కార మార్గం అంటూ ఒకటి వుంటుంది. నీవు ప్రధమంలో ఆమెకు దాసుడవైనావు. ఆమె నీ బలహీనతను గ్రహించి నీపై ఎక్కి సవారి చేయసాగింది. నీవు పరువుకు వెరిచి ఆమెను ఎదిరించి ఎదురు తిరగలేకపోయావు. బురదలో పడిపోయావు. నీవు నేను చెప్పినట్లు చెయ్యి. రేపు శనివారం కాలినడతో ఏడుకొండలు ఎక్కు. తలనీలాలు ఆ దైవానికి సమర్పించు. ఆ కలియుగ వరదులు, శ్రీమన్నారాయణుల వారిని దర్శించు. వారి ప్రసాదాన్ని సేవించు. నీ బాధలన్నీ ఆ దైవానికి చెప్పుకో. వారు తప్పక నీ సమస్యను పరిష్కరిస్తారు!" అనునయంగా చెప్పాడు స్వామీజీ.
లేచి నిలబడ్డారు స్వామీజీ, కృష్ణమూర్తులు. స.స.బ స్వామి వారికి నమస్కరించాడు.
"ఇష్టకాంమార్ధ్యసిద్ధిరస్తు!" కుడిచేతిని పైకెత్తి దీవించారు స్వామీజీ.
"చివరిమాట!" అన్నారు స్వామీజీ.
"చెప్పండి స్వామీజీ!"
"ఈ ఊరివాడు మీవూరి బ్యాంకులో పనిచేస్తున్నాడుగా!"
"అవును స్వామీ!... ఆ విషయం తమరికి ఎలా తెలుసు?" ఆశ్చర్యంతో అడిగాడు స.స.బ.
"ఈ కృష్ణుడు చెప్పాడులే!"
"మీ మాచ్యువల్ ట్రాన్స్ ఫర్, అతను ప్రయత్నిస్తున్నాడు. అది సఫలమౌతుంది. అత్తవారింట కోడలు, ఆ యింటి పద్ధతులన్నింటినీ కొంతకాలం వుంటే నేర్చుకో కలుగుతుంది. తన తత్వాన్ని మార్చుకుంటుంది. కానీ... నీ విషయంలో పెండ్లి చేసుకోవడం... వేరు కాపురం పెట్టడం వెంట వెంటనే జరిగిపోయాయి. నీ ఇంట అదే... మీ ఇంట, ఆమె తన పుట్టింట నడుచుకొన్న రీతిగానే నడుచుకొంది. తప్పు ఆమెది కాదు నీదే. తల్లిదండ్రులను విస్మరించి, అర్థాంగి మాటలు, అమృత గుళికలుగా భావించి ఆస్వాదించిన నీకు, తగినశాస్తి జరిగింది. ఇప్పటికైనా తల్లిదండ్రుల విషయంలో నీ మనోతత్వాన్ని మార్చుకో!... నీకు త్వరలో మంచి జరుగుతుంది.
నీవు నీ తల్లిదండ్రుల వద్దకు నీ ఇంటికి చేరుతావు. ఆ ఇంట మీ అమ్మతో కలిసి నీ ఇల్లాలు మారుతుంది. నీకు ఆనందాన్ని పంచుతుంది. నీకు కావలసింది ఆమె నుండి ఆశాశ్వత వ్యామోహపు ఆనందం. నీ తల్లిదండ్రులు ఆమె నుండి కోరేది మీ ఇంట ఆచార వ్యవహారాలు కుటుంబ గౌరవం. శ్రీ మన్నారాయణులు మీ దంపతులను నిండు నూరేళ్ళు సర్వ సౌభాగ్యాలతో చక్కటి సంతానంతో వర్ధిల్ల చేయుగాక! స.స.బ.... ఇక నేను బయలుదేరుతున్నాము" చిరునవ్వుతో చెప్పారు స్వాములవారు.
"ఓరే వస్తానురా!... స్వాములవారు చెప్పినట్లు చెయ్యి" చెప్పాడు హితుడు కృష్ణమూర్తి.
"మంచిదిరా!..." అన్నాడు స.స.బ.
స్వామీజీ, కృష్ణమూర్తి ఇంటనుండి బయటికి నడిచారు. శనివారం రోజు స.స.బ ఉదయం ఐదు గంటలకు లేచి శుచుడై ఏడుకొండలు ఆ తండ్రి నామస్మరణతో ఎక్కాడు. తలనీలాలు సమర్పించాడు. శ్రీ వెంకటాచలపతుల వారిని దర్శించాడు. ఆనందంగా క్రిందికి దిగి వచ్చాడు.
మరుసటి దినం సోమవారం... ఆఫీసుకు వెళ్ళాడు. తన స్నేహితుడు అశోక్ నవ్వుతూ అతన్ని సమీపించాడు.
"ఏమిటి సోదరా!... చాలా ఆనందంగా వున్నావు?" అడిగాడూ స.స.బ.
"మిత్రమా!... నా ప్రయత్నం ఫలించింది. నెల్లూరి నుండి నేను ఇక్కడికి ట్రాన్స్ ఫర్ నీవు నెల్లూరికి అదే మీ వూరికి ట్రాన్స్ ఫర్. ఇదిగో హెడ్ ఆఫీస్ ఆర్డర్స్." నవ్వుతూ ఆర్డర్ కాగితాన్ని అశోక్ స.స.బకు అందించాడు.
ఆర్డర్‍ను చూచి స.స.బ ఆశ్చర్యపోయాడు. అతని స్వామీజీ చెప్పిన మాటలు. వారి దీవెన గుర్తుకు వచ్చాయి. పరమానందంగా ఆ ఆర్డర్ పేపరును హృదయానికి హత్తుకొన్నాడు స.స.బ. (సంతల సరాగాల బలరామ్)
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
చక్కటి కుటుంబ కథ. ఇది కుటుంబ జీవనంలోని సవాళ్లను, వివాహ జీవితంలోని సంబంధాల పరిమాణాన్ని, వ్యక్తుల మధ్య సమన్వయం అవసరాన్ని ఎంతో హృద్యంగా చర్చించింది.
హీరో భార్యతో ఉన్న వివాహ సంబంధం, పెండ్లి తర్వాత ఎదురైన సమస్యలు, కుటుంబ సభ్యుల నుండి దూరంగా వుండటంతో ఏర్పడిన ఒంటరితనం, తన జీవితంపై వచ్చిన విరక్తి వంటి అంశాలను స్వామీజీ సలహాలతో పరిష్కరించుకుంటాడు. స్వామీజీ నడిపిన మార్గం అతనికి దిశానిర్దేశం చేస్తుంది, తన సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం, కుటుంబ సంబంధాలను పునరుద్ధరించడం అతని జీవితానికి మార్గదర్శకం అవుతుంది.
ఈ కథలో కథానాయకుని జీవన సంఘర్షణలను, స్నేహితుడి ప్రాముఖ్యతను, ఆత్మవిశ్వాసం తోడ్పాటును, దైవంలో విశ్వాసం జీవితం పై మార్గదర్శనం చేయగలదని చూపించడం చాలా చక్కని అంశం. చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి రచన శైలి అనుభూతులను ప్రతిఫలించే విధంగా ఆకట్టుకుంది.
ఇది మంచి కుటుంబ కథగా, తెలుగు కథా ప్రియుల హృదయాలను గెలుచుకుంటుంది. మంచి కథను పంచినందుకు ధన్యవాదాలు!