కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Sathyanarayana Swamy Vratham' Telugu Story Written By Lanka Sankara Narayana
రచన: లంకా శంకర నారాయణ
వ్రతం ఉద్దేశం సాంప్రదాయాన్ని పాటించడం.
ఆ సంప్రదాయపు ఉద్దేశం మనల్ని సత్య మార్గం వైపు మళ్లించడం.
రచయిత లంకా శంకర నారాయణ గారు ఈ కథలో వ్రతాలు చెయ్యొద్దనలేదు. అంతకంటే ముందు సత్యాన్ని అనుసరించాలని చెప్పారు.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మా అబ్బాయి, కోడలు, మనవరాలు అమెరికా నుండి వచ్చి వారం రోజులు అయింది. మా అబ్బాయి నాతో “నాన్నా! సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను. పంతులు గారికి చెప్పు” అన్నాడు.
“ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు రా” అన్నాను.
దానికి వాడు “ఒక గెట్-టు-గెదర్ లాగా ఉంటుంది” అన్నాడు.
“అయితే గెట్-టు-గెదర్ లాగానే ఏర్పాటు చేసుకుందాం, అంతే కాని వచ్చిన వాళ్ళని, సత్యనారాయణ స్వామిని ఇబ్బంది పెట్టడం ఎందుకు రా” అన్నాను.
“ఇందులో ఇబ్బంది ఏముంది నాన్నా” అన్నాడు.
“మరి ఇబ్బంది కాదా! మనం సత్యనారాయణ స్వామి వ్రతం జరిగేటప్పుడు చూస్తాము కదా, కొంత మంది పేపర్ చదువుకుంటారు, కొంత మంది గోళ్ళు గిల్లుకుంటారు, కొంత మంది ఫోన్లో యుట్యూబ్ చూస్తుంటారు. తీర్థ ప్రసాదాలు తీసుకోండి అనే వరకూ వాళ్ళలో చలనం రాదు” అన్నాను.
“ఈ సుత్తంతా ఆపు నాన్నా. నేను అమెరికా వెళ్ళేటప్పుడు వ్రతం చేసుకుంటానని మొక్కుకున్నాను. అందుకని చేసుకోవాలి. అయినా సత్యనారాయణ స్వామి వ్రత కథలో విన్నావు కదా, అనుకొని చేసుకోకపొతే సత్యనారాయణ స్వామికి కోపం వస్తుంది” అన్నాడు మా అబ్బాయి.
’ఓరి పిచ్చివాడా, భగవంతుడు, అమ్మ, నాన్న రక్షించే వారే కానీ శిక్షించే వారు కాదు. అయినా వీడి మాట ఎందుకు కాదనాలి’ అనుకొని, ‘రేపే పంతులు గారికి ఫోన్ చేస్తా’నని చెప్పాను. మరునాడు పంతులు గారికి ఫోన్ చేసాను. ఆయన ఫోన్ తీసి వ్రతానికి కావలసిన సామాన్లు మరునాడు వచ్చి చెబుతానని అన్నారు.
అలాగే మరునాడు వచ్చి “పేపరు పెన్ను తీసుకుని సిద్ధంగా ఉన్నారు కదా, ముందు ఇది చెప్పండి మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు” అని అడిగారు పంతులు గారు.
“ముగ్గురు’ అని చెప్పాను.
“అయితే ఫేషియల్స్ రాసుకోండి” అన్నారు.
“అలాగే ఎంతమంది ముప్పైకి పైపడ్డ మగవాళ్ళు ఉన్నారు”.
దానికి కూడా “ముగ్గురు” అని చెప్పాను.
“అయితే హెయిర్ డై కూడా రాసుకోండి” అన్నారు.
“ఇదేంటి పంతులు గారు! వ్రతం అంటే ముందుగా పసుపు కుంకుమ చెప్పేవారుగా” అన్నాను.
“ఆ రోజులు పోయాయండి. ఈ మధ్య ఒక వ్రతం చేయించడానికి 10 గంటలకి వెళితే ఆడవాళ్ళు ఫేషియల్ చేయించుకోడానికి, మగవాళ్ళు హెయిర్ డై వేయించుకోడానికి వెళ్లారు. వాళ్ళు వచ్చేసరికి 12 గంటలు అయింది. అందుకే ముందే చెబితే రెడీగా ఉంటారని చెప్పాను” అన్నారాయన. .
“ఇందులో ఫేషియల్ కి, హెయిర్ డై కి,సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధం ఏమిటి?” అని అడిగాను.
“దానికి ఆయన “ఫేస్ బుక్ అండీ బాబు. సత్యనారాయణ స్వామి వ్రతం మొత్తం ఫొటోలు వీడియోలు తీసి పూర్తయ్యే లోపలే ఫేస్ బుక్ లో పెడుతున్నారు. మరి ఫేస్ బుక్ లో ఎంతో మంది చూస్తారు కనుక అందంగా కనపడాలి కదా” అన్నారు.
“అంటే ఫేస్ బుక్ మీద ఉన్న భక్తే కాని ఫేస్ లో భక్తి ఉండదన్నమాట” అన్నాను.
“అన్నమాట కాదు ఉన్నమాటే” అన్నారు పంతులు గారు
“సరే ఇది చెప్పండి, చేసేది మీరా, మీ అబ్బాయా” అని అడిగారు పంతులు గారు.
“మా అబ్బాయే” అని చెప్పాను.
“అయితే మీ కోడలికి ఒక మడి నైటి ఆరేసుకోమని చెప్పండి”.
“ మరీ నైటీయా, చీరైతే సాంప్రదాయంగా ఉంటుంది కదండి” అన్నాను.
“చూడండీ! ఇప్పుడు చాలా మందికి చీర కట్టుకోవడం రాదు. మళ్ళీ కట్టటానికి ఎవరినైనా వెతుక్కోవాలి. మీకు వీలైతే ఒక పట్టుచీరని కట్టుకునేట్టు కాకుండా వేసుకునేటట్టు కుట్టించి పెట్టుకోండి” అన్నారు.
ఆ తరువాత పంతులు గారు మిగిలిన వస్తువులు కూడా చెప్పారు. రాసుకున్నాను.
పంతులు గారు వెళ్లే ముందు “అన్నట్లు సత్యనారాయణ స్వామి వ్రత కలశాన్ని మీ హాలు మధ్య ఉండేటట్లుగా యేర్పాటు చేయించండి. లేకపోతే ఈ ఫొటోలు వీడియోలు తీసేవాళ్ళు మన నెత్తి మీద, స్వామివారి నెత్తి మీద ఎక్కి తిరిగేస్తారు” అన్నారు.
సత్యనారాయణ స్వామి వ్రత కథలో వ్రతం చేస్తానని అనుకుని చెయ్యకపోతే స్వామికి ఆగ్రహం కలిగిందని విన్నాను. కానీ ఈ పరిస్తితులు చూస్తే వ్రతం చేస్తేనే స్వామి వారికి ఆగ్రహం కలుగుతుందేమో అని ఆలోచిస్తూ “పంతులు గారూ! వ్రతం ఇంకోసారి చేద్దాం. వెళ్ళిరండి” అని పంపేసాను.
అయినా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సత్యవ్రతం. "సత్యం వదా ధర్మం చెరా" అన్నారు. అంటే సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించు. నిజానికి ఈ సత్యవ్రతం సంవత్సరానికి 365 రోజులూ అందరూ ఆచరించ తగ్గ వ్రతం. సత్యనారాయణ స్వామి వ్రత కథలో స్వామి వారికి వ్రతం చెయ్యలేదని కోపం రాలేదు, సత్యానికి భంగం కలిగినందుకు కోపం వచ్చి ఉండచ్చని నేను అనుకుంటూ ఉంటాను.
పిల్లలను ధర్మ మార్గంలో పెంచి వారికి విద్యా బుద్దులు చెప్పించి సరైన సమయంలో వివాహం చేయడం తల్లి తండ్రుల సత్యవ్రతమైతే, మంత్రయుక్తంగా వివాహబంధం లో పట్టుకున్న చేతిని కడదాకా వదలకుండా ఆనందంగా కాపురం చేయడమేకాక వృద్ధాప్యంలో ఉన్న తల్లి తండ్రులకు సరైన సహకారాన్ని అందించడమే పిల్లల సత్యవ్రతం. అలాగే ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఇలా వివిధ రంగాలకి చెందిన వారందరూ, ధర్మానికి కట్టుబడి వారి వారి విధులను సక్రమంగా చెయ్యటమే సత్యవ్రతం.
సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అనుకొని చేయకపోతే స్వామి వారికి కోపం వస్తుందో లేదో తెలియదు కానీ, సత్యవ్రతం పాటించకపోతే తప్పక స్వామివారి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ఇది సత్యం.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
నా పేరు లంకా శంకర నారాయణ. నేను 1956 అక్టోబర్ 16 న జన్మించాను. మా స్వస్థలం అంధ్ర ప్రదేశ్ ఇండియా లోని బందర్. నేను హైదరబాద్ లోని రాష్ట్ర సహకార బాంక్ లొ పని చేసి 2014 లొ పదవీ విరమణ చేసాను. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరూ ప్రస్తుతం అమెరికా లొ ఉంటున్నారు.
Prashanthi l • 16 hours ago
Very nice story👏👏👏👏
Sree • 2 days ago
Very Good Shankar.