విజయదశమి 2024 కథల పోటీలో విశిష్ట(ప్రత్యేక) బహుమతి పొందిన కథ

'Savathi Prema' - New Telugu Story Written By Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 25/12/2023
'సవతి ప్రేమ' తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“మన పెళ్లి అయి ఎనిమిది నెలలు అవుతోంది. మీరు ఈరోజు వరకు సుమిత్రని హాస్టల్ లో చేర్పించ లేదు. కనీసము అటువంటి ప్రయత్నము చేస్తున్నట్టు అనిపించటం లేదు. మీరు ఎందుకు తాత్సర్యము చేస్తున్నారో నాకర్థము కావడము లేదు” అని విరుచుకు పడింది జయరాం రెండో భార్య కోమలి.
“అదికాదు కోమలి.. మనకి సంతానము కలిగిన తర్వాత తప్పకుండ సుమిత్రని హాస్టల్ లో చేర్పిస్తాను. ఇంకా దానికి ఐదు సంవత్సరాలు నిండలేదు” అన్నాడు జయరామ్.
“సరే! అదీ చూద్దాము” అని విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది.
ఇంత చిన్న వయసులో సుమిత్రని హాస్టల్లో చేర్పించే దుస్థితి వస్తుందని ఊహించలేదు అని మధనపడుతూ గతములో జరిగిన విషాదము గుర్తు కొచ్చింది.
జయరామ్ భార్య నీరజ కుందనపు బొమ్మలా ఉండేది. అందానికి తోడు గుణవంతురాలు. పెళ్లయిన ఏడాదికే నీరజ సుమిత్రకి జన్మనిచ్చింది. జయరామ్ కి మంచి ఉద్యోగము, ఇంకా వారసత్వముగా లభించిన పది ఎకరాల పొలము వలన సంసారము చాల హాయిగా గడిపే వాళ్ళు.
భగవంతుడు శీతకన్ను వేసినట్టు విధి వక్రించింది. ఒక రోజు నీరజ తన స్నేహితురాలు ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమములో ప్రమాదం జరిగి నీరజ కారులోనే చివరి శ్వాస విడిచింది. సుమిత్రని ఆరు నెలలు పెంచేసరికి ఆడతోడు లేకుండా పిల్లలను పెంచడము కష్టము అని తెలుసు కున్నాడు జయరాం.
నీరజ బాబాయ్ గారు ఒకరోజు జయరామ్ ఇంటికి వచ్చి హితబోధ చేసారు ‘నీవు ఎన్నాళ్లు ఒంటరిగా ఉండి పాపని పెంచుతావు. నీకు ఇష్టము అయితే నా కూతురు కోమలిని వివాహము చేసుకో’ అని సలహా ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితిలో కోమలిని వివాహము చేసుకోవడము ఉత్తమమని ఒప్పుకున్నాడు.
“నీ కిష్టమేనా” అని కోమలిని అడిగాడు తండ్రి.
“నాకిష్టమే నాన్నా, కానీ నాదొక మనవి” అంది.
“ఏంటి చెప్పమ్మా” అని అడిగాడు తండ్రి.
“మా పెళ్లయిన తర్వాత సుమిత్రని హాస్టల్ లో ఉంచాలి” అంది.
జయరామ్ రెండు నిముషాలు ఆలోచించి సరేనన్నాడు. జయరామ్ కోమలి వివాహము నిరాడంబరంగా జరిగింది. మరుసటి సంవత్సరము కోమలి అమ్మాయికి జన్మనిచ్చింది. పాపకి ప్రభ అని నామకరణము చేసారు. సుమిత్ర, ప్రభని చాల బాగా చూసుకొనేది. కోమలి, జయరాంకి సుమిత్రని హాస్టల్ లో చేర్పించే విషయము గుర్తు చేసింది.
జయరామ్ తాను కోమలికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చి సుమిత్రని హాస్టల్లో ఉండి చదువు కుంటావా అని అడిగాడు. తల్లి తండ్రుల మనస్సు అర్థము చేసుకొని వెంటనే ఒప్పుకుంది సుమిత్ర. కాలచక్రములో ఇరువయి వత్సరాలు గడచిపోయాయి. ప్రభ ప్రేమించిన వ్యాపారస్తుని కొడుకు రమేష్ తో కోమలి ఘనముగా జరిపించింది. ఎటువంటి అరమరికలు లేకుండా ప్రభ రమేష్ ల సంసారము సాఫీగా సాగి పోయింది.
రమేష్ తండ్రి కాలము చేసిన తర్వాత రమేష్ వ్యసనాల బారిన పడి వ్యాపారము నష్ఠాల బాట పట్టింది. జయరామ్ కి గుండె పొటు వచ్చి అకస్మాతుగా ప్రాణాలు కోల్పోయాడు. ప్రభ పరిస్థితి క్షిణించిన సంగతి తెలిసి కోమలి ఇరుగు పొరుగు వారి సహాయముతో వృద్ధాశ్రమంలో చేరింది.
వృద్ధాశ్రమములో ఒకరోజు పొద్దున్నే కోమలి తన గదిలో పుస్తకము చదువు కుంటున్న సమయములో సహాయకుడు నారాయణ కంగారుగా వచ్చి, “కోమలమ్మగారు, మీకోసము పోలీసులొచ్చారు” అంటాడు.
కోమలి భయం భయం గా హాల్లోకి వచ్చి పోలీసులకి నమస్కారము చేస్తుంది.
“అమ్మా! నేను సుమిత్రని” అని సోఫాలో కూర్చోమని కాళ్లకి దణ్ణం పెట్టి పళ్ళు చేతిలో పెడుతుంది.
“సుమిత్రా! నిన్ను చూసి చాలా రోజులయ్యింది. నీవు కూడా రాలేదు” అంది కోమలి.
“నిజమే అమ్మా! నేను కాలేజీలో చేరిన తర్వాత కలవ లేదు. తర్వాత సివిల్స్ రాసి పోలీస్ ఆఫీసర్ గా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నాను” అంది సుమిత్ర.
“అమ్మా! ఈరోజునుంచి నీవు నా దగ్గరే ఉండాలి. నీ బట్టలు సర్దుకో” అని చెప్తే, కోమలి మాత్రము అపరాధ భావముతో, “నిన్ను చాల ఇబ్బంది పెట్టాను. నాకు ఇక్కడ బాగానే వుంది” అని నిరాకరిస్తుంది. “నేను నీకు సవతి తల్లిని, నిన్ను చాల విధాల కష్ట పెట్టాను” అంటుంది.
“అమ్మా లోకము దృష్టిలో నీవు సవతి తల్లివి. కానీ నా దృష్టి లో నీవు అమ్మవే. నాకు ఊహ తెలిసి నప్పటి నుంచి నీ దగ్గరే పెరిగాను. నిన్నే అమ్మా అని పిలిచాను. ఒక వేళ నా కన్న తల్లి ఉండగా నీవు నాన్నని వివాహము చేసుకున్నా కూడా నాకు పిన్నివే. నీవు వేరే ఆలోచన చేయకుండా నాతొ వచ్చేయి. నాకు మా అమ్మని దూరము చేసుకోవడము ఇష్టము లేదు” అని కోమలి చెయ్యి పట్టుకొని అడిగింది సుమిత్ర.
కోమలి మారు మాట్లాడకుండ సుమిత్రని అనుసరించింది.
----------------
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.
Comments