'Second Innings' - New Telugu Story Written By Ch. Pratap
'సెకండ్ ఇన్నింగ్స్' తెలుగు కథ
రచన: Ch. ప్రతాప్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
నారాయణరావు ముఫై ఎనిమిది సంవత్సరాల సర్వీసు తర్వాత రిటైర్ అయ్యి మూడు నెలలు కావొస్తొంది. సర్వీసులో ఉండగా పెద్ద హోదా, పనుల ఒత్తిడి, దర్జా దర్పం వెలగబెట్టిన అతనికి ఇప్పుడు రిటైర్మెంట్ జీవితం ఒక పనిష్మెంట్ గా అనిపిస్తోంది. ఆనాటి బిజి బిజి జీవితాన్ని ప్రస్తుత ఖాళీ, పని పాటు లేని జీవితం తో పోల్చుకొని ఒక విధమైన నిర్వేదానికి లోనవుతున్నాడు. తన కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళు రిటర్మెంట్ తర్వాత ఆరంభం అయ్యే సెకండ్ ఇన్నింగ్స్ తమకెంతో సంతృప్తిని కలిగిస్తోందని అంటుంటారు. మరి తన అ సెకండ్ ఇన్నింగ్స్ ఏమిటి మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యి పెవీలియన్ కు తిరిగి వచ్చినట్లు అవుతోంది అని నిరుత్సాహపడని రోజు లేదు.
భార్య అయితే ఎప్పుడూ ఒకే బిజీ లైఫ్ కు అలవాటు పడి వుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు వంటి ఆరోగ్యపరమైన సమస్యలు వేధిస్తున్నా ఉదయం ఠంచనుగా అయిదు గంటలకే నిద్ర లేస్తుంది. యోగా, ప్రాణాయామం ధ్యానం తప్పక చే స్తుంది. కాఫీ, టిఫిన్ పూర్తయ్యాక, ఒక గంట పూజ, మరొక గంట సద్గ్రంధ పఠనం, తర్వాత తాపీగా వంట చేస్తుంది. మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి తర్వాత కధలు, పుస్తకాలు, నవలలు చదువుతుంది. అయిదు గంటలకు అపార్ట్ మెంట్ లో ఉన్న ఆధ్యాత్మిక సంఘం సమావేశాలలో పాల్గొంటుంది. ఏడు గంటలకు వంట పూర్తయ్యాక, భక్తి టి వి లో ప్రవచనాలు వింటుంది.
తొమ్మిది గంటలకు ఈ టి వి న్యూస్ తర్వాత ఒక గంట ఈటీవీ లో పాత సినిమా చూసి పదిన్నరకు ఠంచనుగా పడుకుంటుంది. ఆవిడ ఉద్యోగం వున్నా లేకపోయినా అదే బిజీ లైఫ్ గడుపుతోంది. ఎప్పుడు నిర్వేదం గాని, బోర్ గాని ఫీలవదు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. తన జీవితం సర్వీసులో ఉండగా ఎంతో బిజీగా గడిచింది. ఎంత బిజీ అంటే భార్యా పిల్లలతో గడపడానికి కూడా సమయం చాలనంత. అయితే రిటైర్ అయ్యాక మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు అంతా ఖాళీయే. ఏం చెయ్యాలో తెలియదు. తను స్వతహాగా ఎవ్వరితో కలుపుగోలుగా మాట్లాడడు. ఎవరైన పలకరిస్తే ఒక్క మాటలో జవాబిచ్చి వెళ్ళిపోతాడు.
తమ ఫర్మ్ లో పని చేయమని ఎందరో ఆఫర్లు ఇచ్చినా ఒకరి కింద పని చెయ్యడమంటే జీవితమంతా దర్జాగా బతికి ఇంటెనకాల చచ్చినట్లే అని అంటాడు. ఏమీ చెయ్యాలనుకోడు, కాని టైం పాస్ కావడం లేదని అనుక్షణం ఫిర్యాదులు చేస్తుంటాడు.
ఉదయాన్నే లేచి కాఫీ తాగడం, పేపరు చూసి అందరిని తిట్టడం, రాజకీయ నాయకులను విమర్శించడం, బుద్ధి పుడితే దేవుడికి నమస్కారం, లేదంటే అదీ లేదు, లాప్టాప్ ముందు కళ్ళు నొప్పి పుట్టేవరకు చూడటం, తర్వాత సాఫాలో కునికిపాట్లు పడడం, ఈ మెయిల్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ స్పామ్ మెయిల్స్ డిలీట్ చెయ్యడం, ఎవ్వరూ తనను పట్టించుకుంటూ మెయిల్స్ పెట్టడం లేదని ఫిర్యాదులు చేయడం, తన కింది ఉద్యోగులను, స్నేహితులను, తన పై అధికారులను ఒక గంట పాటు తిట్టుకోవడం, మధ్యాహ్నం భోజనం, నిద్ర, కంప్యూటర్, టి వి లో అనేక సీరియల్స్ చూడడం, అర్ధరాత్రి నిద్ర పోవడం ఇదీ నారాయణరావుది దినచర్య. ప్రతీరోజూ ఇంతే.. రొటీన్.. రొటీన్.
భార్య భర్త సణుగుడు భరించలేక టైముకు వంటి పడేసి, తన బిజీలో తాను ఉంటుంది. తనను అసలు పట్టించుకోదు. అసలు తానొకడు, భర్త అనేవాడు అసలు ఇంట్లో వున్నాడన్న సంగతి ఒంట పట్టించుకోదు. అయితే ఈ వైఖరికి నారాయణరావు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాడు.
పిల్లలు అమెరికాలో ఉన్నారు. వారానికోసారి వీడియో కాల్స్ చేస్తుంటారు. మొదట్లో తను వారిపై విమర్శలు చేయడం, లేక అదే పనిగా తన బాధలను కంప్లయింట్స్ రూపంలో చెప్పడం చేసేవాడు. ఇక ఆయన బాధ భరించలేక ఆయనతో మాట్లాడటం మానేసారు. మాట వరసకైనా తమ వద్దకు రమ్మని అడగరు. తండ్రిని భరించడం వారి వలన కాదని వాళ్ళ అమ్మతో అనేకసార్లు అనడం స్వయానా నారాయణరావు విన్నాడు.
ఈ జీవితం ఇంత నిస్సారంగా గడుస్తుండగా, పక్క అపార్ట్మెంట్ లోకి కొత్తగా వచ్చిన ఒక కుటుంబంతో ఆకస్మికంగా జరిగిన పరిచయం నారాయణరావు జీవితాన్ని ఒక మలుపు తిప్పింది.
ఆ ఇంట్లో ఒక సాఫ్ట్ వేర్ జంట ఉంటుంది. ఆ అబ్బాయి తండ్రి వాళ్ళతో వుంటాడు. పిల్లలు ఉదయం ఎనిమిది గంటలకు అన్నీ అమర్చి వెళ్ళిపోతే తిరిగి ఏ రాత్రి ఎనిమిది గంటలకో ఇల్లు చేరడం. తండ్రి రామచంద్రం ఒక్కడే ఇంట్లో వుంటాడు.
ఒకరోజు ఏదో అవసరం పడి ఫ్లాట్ బెల్లు మోగించాడు రామచంద్రం. వెళ్ళి తలుపు తీసిన నారాయణరావుకు ఒక నమస్కారం చేసి, చొరవగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చోని తనతో సంభాషణ ప్రారంభించాడు. మొదట్లో నారాయణరావుతో నిప్పుల కొలిమిపై కూర్చున్నట్లు అనిపించింది. అయితే ఆయన సంభాషణా చాతుర్యం సమయం అసలు తెలియనివ్వకుండా చేయడంతో పాటు సోఫా నుండి లేవనివ్వలేదు.
అలా మొదలైన ఇద్దరి ఇంటెరాక్షన్ క్రమక్రమంగా ఎక్కువయ్యింది. వారంలో మూడు నాలుగు సార్లు కలుసుకొని రెండు మూడు గంటలపాటు సాగడం ఆరంభమయ్యింది. ఆ పరిచయం పెరిగి స్నేహంగా మారింది. ఇద్దరి కుటుంబ విషయాలు మాట్లాడుకునే దగ్గరితనం ఏర్పడింది ఇద్దరికీ. రామచంద్రం కధలు, వ్యాసాలు, బాగా రాస్తాడు. అంతర్జాలంలో అనేక వెబ్ పత్రికలు ఆయన రచనలు ప్రచురిస్తున్నాయి.
ఎప్పుడూ పుస్తకాలు, పేపర్లు చదవడం, అందులో పాయింట్లు ఏరి ఒక కొత్త రచనలు చెయ్యడం, వాటిని పత్రికలకు పంపడం, ప్రచురితమైన వటిని ప్రింట్ చేసి ఫైల్స్ లో భద్రపరచడం, సాహిత్యం ఇష్టం వున్నవారితో సాహిత్య చర్చలు జరపడం అతనికి దినచర్య. మొత్తం మీద మానసికంగా చాలా ఉత్సాహంగా వుంటాడు.
ఒకరోజు శ్రీమతి ఇచ్చిన కమ్మని కాఫీ ఆస్వాదిస్తుండ గా రామచంద్రం, నారాయణరావుకు కౌన్సలింగ్ మొదలెట్టాడు.
"మనం ఇంతకాలం పిల్లల కోసం సర్వం త్యాగం చేసి బ్రతికాం. ఇప్పుడు మన కోసం మనం బతకడం మొదలెట్టాలి. దేవుడి దయ వలన పిల్లలు ఏ బాధలు లేకుండా చక్కగా చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటూ, లక్షణంగా పెళ్లిళ్లు చేసుకుని సంతోషంగా ఉంటున్నారు. మనం కూడా పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకుండా బ్రతుకుతున్నాం.
ఈ వయస్సులో లేనిపోనివన్నీ ఊహించుకొని చింతలతో బ్రతకడం కంటే తెలివితక్కువతనం మరొకటి ఉండదు. అయినా మీరెందుకింత అసంతృప్తితో వుంటున్నారో అర్ధం కావడం లేదు. నిజానికి ఈ జీవితపు ఆఖరు అంకంలోనే మనం ఉల్లాసభరితమైన కొత్త జీవితం ప్రారంభించాలి. ఇన్ని రోజులు మనం బాధ్యతల వల్ల చేయలేకపోయిన పనులు, మన మనస్సుకి నచ్చిన పనులు చేసుకునే అవకాశం ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో లభించిందనుకోవాలి.
మన చుట్టూ వున్న వాతావరణానికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవడంలోనే వివేకం వుంది. కాలం మారుతోంది. అందుకనుగుణంగా మనం కూడా మారుదాం. "
రామచంద్రం మాటలతో నారాయణరావులో జ్ఞానోదయ మయ్యింది. ఇంతకాలం నుండి అతడేం తప్పు చేస్తూ వస్తున్నాడో అతనికిప్పుడు అర్ధమయ్యింది. రామచంద్రం మాటలు ఒక కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగించాయి.
ఆ రోజంతా ఆలోచిస్తుంటే తనకేం ఇష్టమో ఎంతకాలం నుండి మనసు పొరలలో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల పొరల నుండి బయటపడ్డాయి. బాల్యంలో, యవ్వనం లో అతనేం చేస్తే మనస్సుకు సంతోషం, తృప్తి కలిగించేవో అన్నీ గుర్తుకొచ్చాయి. చందమామ కధలు, అపరాధ పరిశోధన డిటెక్టివ్ కధలు, శ్రీ శ్రీ సాహిత్యం, యద్దనపూడి నవలలు, నటశేఖర కృష్ణ సినిమాలు, ఆత్రేయ పాటలు, కె వి మహదేవన్ సంగీతం, విశ్వనాథ్, బాలచందర్ దర్శకత్వం వహించిన సినిమాలు, వెంకటేశ్వర స్వామి గుడి, పత్రికల కోసం రాసిన లేఖలు, వ్యాసాలు, కథలు, ఇలా ఒకటేమిటి ఎంతో వైవిధ్యభరితమైన అభిరుచులు నారాయణరావు కు వుండేవి. రామచంద్రం మాటల స్పూర్తితో ఒక్కొక్కటే బయటకు తీయసాగాడు.
ఆర్నెల్లలో నారాయణరావు జీవన శైలి మారిపోయింది. అతనికి ఇప్పుడు అసలు సమయం సరిపోవడం లేదు. ఎప్పుడూ ఏదో చే నే వుంటాడు. మనస్సు ఎప్పుడూ ఉల్లాస భరితంగా, నూతనోత్తేజంతో ఉంటాడు.
అతని సెకండ్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే ఎంతో సంతృప్తిని ఇస్తోంది.
***
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.
Comments