top of page
Writer's pictureMohana Krishna Tata

సీక్రెట్ ఏజెంట్



'Secret Agent' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 11/06/2024

'సీక్రెట్ ఏజెంట్' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కాంతం తన భర్తతో పాటు కాలనీకి కొత్తగా వచ్చింది. ముఖ పరిచయాలు ఉన్నా.. వేరే వారి ఇంట్లో విషయాలు తెలియక అసలు ఏమీ తోచేది కాదు కాంతానికి. మాములుగా అయితే, ఇంట్లో ఉండేది కాంతం, ఆమె భర్త మాత్రమే. ప్రతిరోజూ ఇంటిపనంతా ఆడుతూ.. పాడుతూ చేసుకున్నా, కాంతానికి బోలెడంత సమయం మిగుల్తుంది. కానీ, వేరే వారి ఇంటి విషయాలు తెలియక చాలా సతమతమయ్యేది పాపం. ఈ విషయాలు తెలుసుకోడానికైనా.. ఆ కాలనీలో పనిచేసే పనిమనిషి రత్తాలు కోసం కబురు పెట్టింది కాంతం. 


"రత్తాలూ.. ! రేపటినుంచి మా ఇంట్లో పనికి రావాలి.. " అంది కాంతం.

 

"లేదు అమ్మా.. ! ఇప్పటికే చాలా ఇళ్ళు ఉన్నాయి.. ఇంటికి వెళ్లేసరికి చాలా లేట్ అవుతోంది.. మా ఆయన కొత్తగా పని ఒప్పుకోవద్దని చెప్పాడు.. "


"అలా అనకు రత్తాలు.. ! నువ్వు ఏ టైం కి వచ్చిన పర్వాలేదు.. అంట్లు తోమేసి.. ఇల్లు తుడిచేస్తే చాలు.. "


"వేరే మనిషిని పెట్టుకోండి అమ్మగోరు... "


"లేదు.. లేదు.. ఈ కాలనీ లో నీకు చాలా పని అనుభవం ఉంది.. నువ్వు పని చేస్తేనే నాకు బాగుంటుంది.. కావాలంటే జీతం కొంచం ఎక్కువ తీసుకో.. "


"ఏమిటో అమ్మా.. ! మీరు మరీ ఇంతలాగ అడుగుతుంటే, ఏం చెబుతాను.. వస్తాను లెండి.. "


పనిమనిషి అంటే, ఒక సీక్రెట్ ఏజెంట్ అని ఏదో సీరియల్ లో చూసింది కాంతం. వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడా ఉండదని తెలిసి.. పనిమనిషిని పనిలో పెట్టుకుంది కాంతం. మర్నాడు రత్తాలు ఇంటి పని ప్రారంభించింది.. 


"మీ ఇంట్లో అంట్లు చాలా తక్కువే నమ్మా.. ఇల్లు కూడా చిన్నదే.. నా పని సులువే.. " అంది రత్తాలు.


"పోనిలే గానీ.. అలా పని ఆపి, వేడి వేడి గా కాఫీ తాగుదు.. రా.. "


"అలాగే అమ్మగారు.. ఇవ్వండి"


"నిన్న రాత్రి ఆ సందు చివర ఇంట్లో... అదే.. ఆ.. డాక్టర్ గారి ఇంట్లో.. ఏదో గొడవ అంటా కదా.. !"


"అవునమ్మా.. ! అతనేమో డాక్టర్.. రాత్రి ఎప్పుడో గానీ ఇంటికి రాడు.. అసలే కొత్తగా పెళ్లయింది.. పెళ్ళాం రోజూ లేట్ అవుతుందని గోల పెడుతుంది. నిన్న దాని గురించే పెద్ద గొడవ జరిగింది.. "


"ఓహ్.. అదా సంగతి.. ! డాక్టర్ మొగుడు అంతేగా.. ! ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు.. సెలవులు అవి ఉండవు. ఒక అచ్చట ముచ్చట సరిగ్గా ఉండదు. అందుకే, నేను డాక్టర్ సంబంధం వద్దన్నాను.. తెలుసా రత్తాలు.. ?"


"మీరు చాలా తెలివైన వారు అమ్మగారూ.. "


"ఏమనుకున్నావు నా గురించి మరి.. ! ఇది చెప్పు.. ఆ ఎదురింట్లో.. ఆ సాఫ్ట్వేర్ అబ్బాయి.. నిన్న చేతికి ఏదో కట్టు కట్టుకుని ఇంటికి వచ్చాడు... ఎందుకో.. ?"


"ఏమో నమ్మా.. రాత్రి ఆఫీస్ పార్టీలో బాగా తాగి, బండి నడిపి యాక్సిడెంట్ చేసాడంట... ఇంట్లో అనుకుంటుండగా తెలిసింది.. "


"అవును.. తాగే వాళ్లంటే, నాకు అసలు ఇష్టముండదు.. అందుకే, కట్నం ఎక్కువ ఇచ్చి.. పాడు అలవాట్లు లేని అబ్బాయినే పెళ్లి చేసుకున్నాను.. మా ఆయన మందుకి కిలోమీటర్ దూరం ఉంటారు తెలుసా.. ?"


"మీరు చాలా గ్రేట్ అమ్మగారు... ! నాకు లేట్ అవుతోంది.. వెళ్ళాలి"

"అలాగే వెళ్ళు... రేపు టైం కి వచ్చేయ్.. ! నీకోసం అంట్లు, నేనూ చూస్తూ ఉంటాము.. "


మర్నాడు ఉదయాన్నే ఫోన్ వచ్చింది.. అదీ రత్తాలు దగ్గర నుంచి.. 


"అమ్మా.. ! నేను అర్జెంటుగా ఊరు వెళ్లాల్సి వచ్చింది.. ఒక రెండు రోజులు పనిలోకి రాను.. కొంచం చూసుకోండి.. "


"పర్వాలేదే... ఏదో అర్జెంటు అంటున్నావు కదా.. !"


'అంట్లు తోముకోవడం నాకు ఇబ్బంది కాదు.. కానీ కాలనీ విషయాలు ఎవరు చెబుతారు.. ? నా గొప్పలు అందరికీ ఎలా తెలుస్తాయి.. ?' అని అనుకుంది కాంతం


రెండు రోజుల తర్వాత... రత్తాలు కోసం ఎదురు చూస్తోంది కాంతం.. మూడవ రోజు వచ్చింది రత్తాలు.. 


"ఒసేయ్ రత్తాలు.. ! మూడు రోజుల నుంచి నా చేతి కాఫీ మిస్ అయి ఉంటావు.. ఇదిగో ఈ పెద్ద కప్ తో కాఫీ తాగుదుగాని రా.. ఇలా కూర్చో"


"అర్ధమయింది అమ్మగారు... ఈ రోజు ఎక్కువ విషయాలు మాట్లాడాలి కదా... "


"నువ్వు చాలా తెలివైన దానివే రత్తాలు.. నాతో మాట్లాడుతుంటే, ఎలాంటి వారికైనా తెలివితేటలు ఇట్టే పెరుగుతాయి.. " అని గొప్పలు చెప్పుకుంది కాంతం.


"ఈ మూడు రోజులు చాలా విషయాలు జరిగాయి అమ్మగారు.. " అంటూ మొదలు పెట్టింది రత్తాలు.


"ముందు ఆ లాయర్ గారి ఇంట్లో మొన్న ఆ గొడవ ఏమిటో.. ?"


"అదా.. ! వాళ్ళ అమ్మాయి ఎవరినో వేరే కులం అబ్బాయిని ప్రేమించిందంట.. దానికి లాయర్ గారు అసలు ఒప్పుకోలేదు.. అసలే ఆయనకి కులం పట్టింపు చాలా ఎక్కువ.. "


"రోజులు ఇలాగే ఉన్నాయి.. మా ఇంట్లో మా నాన్న ఎవరిని పెళ్లి చేసుకోమంటే, నేను ఆయననే చేసుకున్నాను తెలుసా రత్తాలు... ?"


"మీరు చాలా గొప్పవారు అమ్మగారు.. ఇంకో కప్ కాఫీ ఇవ్వండి అమ్మగారు.. మాట్లాడుతుంటే, నోరు ఎండిపోతున్నాది.. "


"నువ్వు అలా చెబుతూవుండు... ఇలా నేను కాఫీ తెచ్చేస్తాను.. "


"ఒక మాట అమ్మగారు... మీ ఇంట్లో పని కన్నా.. మీతో మాట్లాడడానికే టైం ఎక్కువ పడుతోంది.. నాకు మీరు ఎక్కువ జీతం ఇవ్వాలమ్మా.. !"


"అలాగే లేవే.. ! నేను చూసుకుంటాను.. "


"ఇంకోమాట.. అమ్మ.. ! మీ గొప్పతనం అందరికీ చెప్పాలంటే, నాకు ఎక్కువ టైం అవుతుంది.. అందుకు నాకు కాఫీ తో పాటు టిఫిన్ కుడా పెట్టించండి.. "


"అలాగే లేవే.. ఇప్పుడే నీకోసం నాలుగు దోసెలు వేస్తాను.. "


"మీరు నన్ను అడిగినట్టే, వేరే వాళ్ళు మీ గురించి అడిగితే, ఏం చెప్పాలి అమ్మగారు.. ?"


"మా ఇంట్లో విషయాలు ఎవరికీ చెప్పకే రత్తాలు.. "


"మొన్న ఆదివారం.. మీ ఆయన మిమల్ని తిట్టిన విషయం నేను ఎవరికైనా చెప్పానా అమ్మగారు.. ?"


"నువ్వు ఎంత మంచిదానివే రత్తాలు... మా ఇంట్లో విషయాలు బయట చెప్పకుండా ఉండాలంటే, నీకు ఏం కావాలో చెప్పు.. ఇస్తాను"


"నన్ను కొంచం బాగా చూసుకోండి అమ్మగారు.. చాలు.. !"


"అలాగే అంటూ.. " పనిమనిషి ఇంట్లో ఉన్నంత సేపు జాగ్రత్తగా ఉండాలని అనుకుంది కాంతం.. 


*******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


90 views1 comment

1 Comment


కథ బావుంది

Like
bottom of page