సీత కాపురం
- Vemparala Durga Prasad
- 2 days ago
- 6 min read
#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #SeethaKapuram, #సీతకాపురం, #TeluguKathalu, #తెలుగుకథలు

Published In manatelugukathalu.com On 12/04/2025
సీత కాపురం - తెలుగు కథ
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
అది అరకు లోయలో ఒక అందమైన పల్లెటూరు. అరకు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఆ పల్లెటూరు లో పచ్చని చెట్ల మధ్యలో వున్న ఒక ఎలిమెంటరీ స్కూల్ లో కీర్తన వుద్యోగం చేస్తోంది. కీర్తన అక్కడకి ట్రాన్స్ఫర్ మీద వచ్చి రెండు సంవత్సరాలు అయింది. ఆ వూరు, ఆ వాతావరణం అక్కడి ప్రజల అమాయకపు ప్రవర్తన కీర్తనకి చాలా ఇష్టం. అందుకే విశాఖపట్నం నుండి దూరంగా వచ్చినా, అక్కడే ఉంటోంది. ఆమె, తన లాగే పనిచేసే మరో టీచర్ నవ్య తో కలిసి ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటోంది. ఆమె అమ్మ నాన్న విశాఖపట్నం లో వుంటారు. కీర్తన కి ఇంకా పెళ్లి కాలేదు.
ఆమె 2 రోజులు సెలవు మీద విశాఖపట్నం వెళ్లి, ఈ రోజు స్కూలు కి వచ్చింది. అటెండన్స్ అయిపోయాక, ఎప్పటి లాగే తన కుర్చీ పక్కనే కూర్చునే రాహుల్ అక్కడ కూర్చోక పోవడం తో వాడికోసం వెతికింది. వాడు బూరె బుగ్గల్తో చాలా ముద్దుగా ఉంటాడు. వాడికి ఆరేళ్ళు. వాడు అక్కడ రెండో తరగతి చదువుతున్నాడు. రెండేళ్ల నుండి వాడు ఆమె దగ్గర చదువుతున్నాడు. వాడంటే ఆమెకి చాలా ఇష్టం. వాడు చివర వరస లో కూర్చుని వున్నాడు. వాడి మొహం కొద్దిగా డీలాగా వుంది.
" ఏరా రాహుల్! అక్కడ వున్నావు? ఇలారా..ఇక్కడ కూర్చో” అని పిలిచింది.
టీచర్ పిలిచింది అని వచ్చేడు కానీ, వాడు అన్యమనస్కం గా ఉన్నట్లు గమనించింది.
“హోమ్ వర్క్ చేసేవా?” అని అడిగింది.
వాడు చేయలేదు అన్నట్లు తలా అడ్డంగా ఊపాడు.
" ఏమైంది వీడికి " అని మనసులో అనుకుని, మళ్ళీ వాడి దగ్గర ముందు రోజు నవ్య ఇచ్చిన హోమ్ వర్క్ చూసి, మళ్ళీ అది ఎలాగ చెయ్యాలో చెప్పి, చేయించింది.
కీర్తన సెలవు మీద వెళ్ళినప్పుడు, ఆమె క్లాసు పిల్లల్ని నవ్య చూసుకుంటుంది.
లంచ్ టైం లో పిల్లలు భోజనాలు చేసి, గ్రౌండ్ లో ఆడుకుంటుంటే, నవ్య, కీర్తన భోజనాలు కానిచ్చి, వరండాలో కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్లకి ఆ అరగంట సమయం బోలెడు కబుర్లు చెప్పుకోవడం అలవాటు.
ఇంతలో గేట్ దాటుకుని, ఒక స్త్రీ రావడం, ఆయా పార్వతి ఆమెకి ఎదురు వెళ్లడం చూసింది కీర్తన.
అప్పటి దాకా పిల్లల తో కీర్తన కి దగ్గర గా ఆడుతున్న రాహుల్ బిక్క చచ్చి పోయినట్లు అయిపోవడం గమనించింది కీర్తన.
వాడిని చెయ్యి పట్టుకుని, ఆయా,` ఆ స్త్రీ దగ్గర కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, వాడు బెదురు చూపులు చూస్తున్నాడు. ఆ వచ్చిన స్త్రీ వాడి కేసి ఆర్తి గా చూస్తూ, దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తోంది.
కీర్తన కి ఆ దృశ్యం కొంత అసహజం గా అనిపించింది. ఒక్క సారి కూర్చున్న దగ్గరి నుండి లేచి, "పార్వతి!..ఇలా రా.." అంది.
ఆ పిలుపు కి పార్వతి కీర్తన వైపు చూసి, పరుగున ఆమె దగ్గరకి వచ్చింది.
"ఎవరు ఆమె?. రాహుల్ ని ఆమెకి ఎందుకు చూపిస్తున్నావు? "అని ప్రశ్నల వర్షం కురిపించింది.
" ఆమె, వాడి అసలు తల్లి అమ్మ గారు. దాని పేరు గౌరి. " అంది పార్వతి.
అదేమిటి రాహుల్ తల్లి సీత కదా. రెండేళ్లు గా చూస్తున్నాను. వాడి తల్లి సీత గాని, లేదా వాడి తండ్రి నానాజీ వాడిని స్కూలు కి దింపుతారు. స్కూలు వదిలేక వాళ్ళ లో ఎవరో ఒకరు వచ్చి తీసుకుని వెళతారు. నువ్వు ఏమి చెపుతున్నావో అర్ధం కావడం లేదు " అని గట్టి గానే అంది కీర్తన.
రాహుల్, ఇంతలో ఆ స్త్రీ చేయి వదిలించుకుని పారిపోయి క్లాస్ రూమ్ లోకి వెళ్లి దాక్కున్నాడు.
గౌరి అనబడే ఆ స్త్రీ బిక్క చచ్చి పోయి, కళ్ళలోంచి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటోంది.
నవ్య అప్పుడు కల్పించుకుంది. “నిన్న మొదటి సారిగా నేను ఆమెని చూసేను. ఆమె వాడి అసలు తల్లి అని నాకు చెప్పి, పార్వతి వాడిని నిన్న కూడా ఆమెని కలిపించింది” అంది.
కీర్తన కి విషయం అర్ధం కావడం లేదు. అయితే రాహుల్ ఎందుకు అంత డల్ గా వున్నాడో ఊహించింది. ఆ చిన్ని మనసు ని కొత్త సందేహాలతో తికమక పెడుతున్నారని అర్ధం అయింది.
“పార్వతీ, సీత కి చెప్పకుండా, ఎవరినీ వాడిని కలవనివ్వకు.” అంది.
ఆ మాటలకి గౌరి మొహం మాడిపోయింది. నెమ్మదిగా కదిలి, స్కూలు బయటకి నడుచు కుంటూ వెళ్ళిపోయింది.
పార్వతి మొహం గంటు పెట్టుకుని, చీపురు తీసుకుని వరండా ఊడవడానికి వెళ్ళిపోయింది.
మళ్ళీ స్కూలు టైం అవడం తో మధ్యాహ్నం క్లాసులు నిర్వహించడానికి నవ్య, కీర్తన క్లాసులోకి వెళ్లి పోయారు.
స్కూలు వదిలేక, కీర్తన, నవ్య కలిసి ఇంటికి వచ్చేసేరు. స్నానం చేసి, టీ తాగుతున్నారు మిత్రురాళ్లు ఇద్దరూ.
ఇంతలో గేట్ చప్పుడయింది.
సీత ఇంట్లోకి వస్తోంది. వస్తూనే ఏడుస్తూ కూలబడిపోయింది వరండాలో.
విస్తుపోయింది కీర్తన.
" అయ్యో ! ఎందుకు ఏడుస్తున్నావ్ సీత? " అంది కీర్తన. నవ్య కూడా అలాగే చూస్తోంది ఆమెని.
"ఏం చెయ్య మంటారు అమ్మగారు.. నా జీవితం కుదేలు అయిపోయేలా వుంది ". అంది.
అసలు ఏం జరిగింది? వివరంగా చెప్పు అంది కీర్తన.
తన కథ ఇలా చెప్పింది సీత:
“ నానాజీ మంచి అందమయిన యువకుడు. మేనకోడలు సీత కి వాడంటే చాలా ఇష్టం. సీతకి తల్లి తండ్రులు లేరు. మేనత్త, నానాజీ తల్లి అయిన తాయారమ్మ దగ్గరే ఉండేది.
నానాజీ ఆ వూళ్ళో వ్యవసాయం చేస్తూ,వూళ్ళో వున్న కుర్రాళ్ళకి ప్రతినిథి లా చాలా చలాకీ గా వుండే వాడు. వాడి దేహ ధారుడ్యం, వాడి చెలాకీ తనం తెలిసిన చాలా మంది ఆడ పిల్లలు వాడిని ఆరాధన గా చూసేవారు.
పల్లెటూరు లోనే ఉండడం, పెద్దగా చదువుకోకపోవడం తో జీవితం మీద, పెద్దగా అభిప్రాయాలు ఏమీ లేకుండా రికా మికీ గా తిరుగుతూ వుండే వాడు. వాడికి వ్యవసాయ భూమి ఎక్కువ గా ఉండడం, డబ్బుకి లోటు లేక పోవడం చూసి, వూళ్ళో వాళ్ళ కులం లో వుండే ఆసాములు వాడికి పిల్లని ఇవ్వడానికి పోటీ పడే వారు.
మేనకోడలు సీత ని పట్టించుకునే వాడు కాదు. కానీ ఆ పిచ్చిది వాడంటే వెర్రి అభిమానం చూపించేది.
స్నేహితుల చెడు సలహాలతో గౌరి అనే అమ్మాయితో ప్రేమలో ములిగి తేలేడు నానాజీ.
పర్యవసానం గౌరి గర్భవతి అయింది. దాంతో ఊరి పెద్దలు పంచాయితీ పెట్టి గౌరిని నానాజీ మనువు ఆడాల్సిందేనని తీర్పు ఇచ్చేరు.
అలా నానాజీ గౌరి మెడలో తాళి కట్టేడు. స్వతహాగా గౌరి స్వభావం మంచిది కాదు. ఆమె కి డబ్బు, షికార్లు వ్యామోహం. పిల్లవాడు పుట్టిన ఏడాది తిరగ కుండా, వూళ్ళో మరో డబ్బున్న ఎవడితోనో లేచి పోయింది.
పెళ్ళాం లేచిపోయిన మొగుడు అని అందరూ ఊళ్ళో నానా రకాలు గా అంటూ ఉంటే,
అవమానం తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసేడు నానాజీ.
స్నేహితులు అతన్ని కాపాడేరు. తాయారమ్మ సీత చేత, వాడికి సపర్యలు చేయించింది.
నానాజీ అంటే పడి చచ్చి పోయే సీత ఎంతో ప్రేమగా వాడిని చూసుకుని మనుషుల్లోకి తెచ్చింది. మరో మూడు నెలలకి నానాజీ కి సీత ని భార్యని చేసింది తాయారమ్మ.
బావని, చిన్న పిల్ల వాడు రాహుల్ ని కంటికి రెప్ప లా చూసుకుని తన జీవితాన్ని నందన వనం చేసుకుంది సీత.
అలా 5 సంవత్సరాలు గడిచేయి. సీత కి పిల్లలు పుట్టక పోవడం తో రాహుల్ ని తన సొంత బిడ్డలా చూసుకుంటుంది ఆమె. వాడిని చిన్న పిల్లాడుగా వదిలి వెళ్లిపోవడం తో గౌరి గురించి అస్సలు తెలియదు వాడికి. సీతనే తన కన్నతల్లి అనుకుంటున్నాడు ఆ పిల్లవాడు.
ఇప్పుడు ఎక్కడ నుండి మళ్ళీ ఊడి పడిందో తెలియదు, ఆ గౌరి మళ్ళీ ఊళ్లోకి వచ్చింది. స్కూలు లో పనిచేసే ఆయా పార్వతి కి దూరపు చుట్టం ఆమె.
కామం తో కళ్ళు,మూసుకుని పోయి ఎవడితోనో వెళ్లి పోయిన గౌరి, వాడు మోసం చేసి వదిలేసేక, దిక్కు లేక మళ్ళీ ఊళ్లోకి వచ్చింది.
మళ్ళీ వూళ్ళో కి వచ్చిన గౌరి వూరికే ఉండ కుండా నానాజీకి దగ్గర అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకు ముందుగా తన కన్న కొడుకుని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.”
“అదమ్మా విషయం.. మీకు తెలుసు కదా, నా బావని, పిల్లవాడు రాహుల్ ని ఎలా చూసుకుంటున్నానో ” అంది సీత ఏడుపు మొహం తో.
సీత రాహుల్ ని యెంత ప్రేమగా చూస్తుందో కీర్తన కి తెలుసు. ఒక విధంగా, రాహుల్ కీర్తన కి అభిమాన శిష్యుడు. ఆలా వాడి తల్లిగా సీతని బాగా చూస్తూ ఉంటుంది కీర్తన. రాహుల్, తండ్రి నానాజీ దగ్గర యెంత గారాలు పోతాడో ఆమె చూస్తూ ఉంటుంది. ఆ తల్లి తండ్రులు ఇద్దరూ వాడిని ఒక యువరాజు లా చూసుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది ఆమె.
కీర్తన కి సీత బాధ అర్ధం అయ్యింది. తాను సమస్యని పరిష్కరిస్తానని, సీత ని ఊరడించి పంపించేసింది.
నానాజీ ని పిలిచి, సీత విషయం మాట్లాడింది. పిల్లవాడికి తల్లి తండ్రులు గా సీత, నానాజీ మాత్రమే తెలుసు అని, ఆ పసి మనసు లో అక్కర్లేని సందేహాలు తీసుకు రావద్దని హెచ్చరించింది.
నానాజీ లో కూడా మార్పు గమనించింది. ఎదురు దెబ్బలు తగిలేక, మైకం దిగి పోయినట్లుంది. అతను కూడా, సీత కి అన్యాయం చేయనని చెప్పేడు. ముఖ్యంగా పిల్ల వాడు రాహుల్ అంటే నానాజీ కి వల్లమాలిన అభిమానం. వాడి కోసమయినా గౌరిని మర్చి పోవాలని చెప్పింది కీర్తన. సరే నన్నాడు నానాజీ. కానీ, పల్లెటూరు వాళ్ళు, వాళ్ళ చాపల్యపు పద్థతులు అంటే ఒకింత భయం కీర్తన కి.
ఆ విషయం లో మరింత సీరియస్ గా పని చేయాలని నిర్ణయించుకుంది.
మరునాడు ఆదివారం. ఊళ్ళో పంచాయితీ పెద్దల తో విషయం చర్చించింది. కొందరు మాత్రం..” దానిదేముంది పిల్ల వాడు గౌరి కి కన్న కొడుకు కదా” అని సాగదీసారు. కానీ కీర్తన వాళ్లకి గట్టి గా సమాధానం ఇచ్చింది.
"అంత కన్న తల్లి అయితే, చంటి పిల్ల వాడిని అనాథలా వదిలేసి, కట్టుకున్న మొగుడిని కాదని ఎవడితోనో ఎందుకు లేచి పోయింది? "అని గట్టిగా అడిగింది. దాంతో వాళ్ళు నోరు మూసుకున్నారు.
పరిష్కారం చెప్పింది. వాళ్ళు సరే నన్నారు.
ఆ సాయంత్రం గౌరి ని వూరు వదిలి వారం రోజుల్లో వెళ్లి పోవాలని తీర్మానం చేసేరు పెద్దలు.
ఊరి పెద్దల ఆదేశాల మేరకు, మరో వారం రోజుల్లో ఆమె వూరు వదిలి వెళ్లి పోక తప్పలేదు.
***
ఆ రోజు బడి లో పాఠాలు చెప్తున్న కీర్తన గుమ్మం దగ్గర అలికిడి కి తిరిగి చూసింది.
సీత వచ్చింది. " నమస్కారం అమ్మ! " నా సమస్య తీరింది.
ఆ దెయ్యం వూరు వదిలి వెళ్లి పోయింది. మీ మేలు మర్చి పోలేను." అంది.
తల్లిని ఆనందంగా చూస్తున్న రాహుల్ తల్లి కేసి, టీచర్ కేసి మార్చి మార్చి చూస్తున్నాడు.
ఆ పసివాడికి అమ్మ ఆనందం ఒకటే తెలుసు.
“నాదేముంది. భగవంతుడి దయ, వూళ్ళో పెద్దల తీర్పు" అంది నవ్వుతూ కీర్తన.
ఆమె కి కూడా సీత జీవితం ఏ మలుపులు తిరుగుతుందో, రాహుల్ నష్ట పోతాడేమో అనే భయం ఇప్పుడు తొలగి పోయింది.
సమాప్తం
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.
Comments