'Seetha Rams' written by Dasu Radhika
రచన : దాసు రాధిక
"రేపు శుక్రవారం సాయంత్రం మీటింగ్ పెట్టుకొని ప్లాన్ చేద్దాం బేబ్, లెట్ మీ గెట్ బ్యాక్ టు వర్క్ నౌ"... అని మళ్ళీ తన సాఫ్ట్వేర్ ప్రపంచం లోకి వెళ్ళిపోయాడు రమేష్. సీతకు బేబ్ అనే పిలుపు మహా చిరాకు కానీ రమేష్ ఎంత చెప్పినా బేబ్ పిలుపు ను మానడు...ఆధునాతనంగా ఉంటుందని రమేష్ ఉద్దేశ్యం...
"హేయ్ గుడ్ మార్నింగ్ డూడ్" అని ఒకళ్ళనొకళ్ళు రోజు తండ్రీ కొడుకులు-- రమేష్ మరియు శివ పలకరించుకుంటే సీతకు అరికాలి మంట నెత్తికెక్కుతుంటుంది...
విదేశీ పోకళ్ళు, భాష తో పిల్లలు ఇప్పుడే దొర బాబులు దొరసాన్లు అయిపోతే ఇంక పెద్దయ్యాక సంగతి వేరే చెప్పాలా??
నాన్నగారు పోయి డాడీ వచ్చింది, ఇప్పుడు వావి వరస పోయి డూడ్ లోకి దిగింది ఈ "యాపిల్" ప్రపంచం... అదేనండి ఐటీ పుణ్యామా అని ఈ లోకం...
ఐదేళ్ల ప్రాజెక్టు మీద ఆన్ షోర్ వెళ్లి మళ్ళీ ఇండియా వచ్చేసరికి సీత భర్త రమేష్ రామ్స్ గానూ మరియు సీత బేబ్ గానూ మారిపోయారు... శివ అనే పేరు తో ఏ రోజు పిలవలేదు అమెరికా లో పుట్టిన కుమారుడ్ని, వాడు డూడ్ గాడు!!!
సీత తల్లి భార్గవి కి మనవడి తో సంభాషించాలనే ముచ్చట ముచ్చటగానే మిగిలిపోయింది... ఇంగ్లీష్ కొంత అర్ధమైనా కొత్త ప్రయోగాలు, వాడుకలు ఆమెకు వంట పట్టలేదు... షిట్, హాట్, కూల్, OMG( ఓ మై గాడ్, LOL అలా వినిపిస్తూనే ఉంటాయి అందరి నోటా, నిన్న కాక మొన్న పుట్టిన చంటి వాడు శివ నోట కూడా...
ఇండియా తిరిగి వచ్చేసిన కూతురి దగ్గరే భార్గవి ఉంటోంది...ఒక రెండేళ్ల నుండి... ఊళ్లోని ఇల్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బు అల్లుడి చేతిలో పెట్టి కాలం గడుపుతోంది... రమేష్ తల్లి తండ్రి పెద్ద కొడుకు నరేష్ దగ్గర స్థిర పడిపోయారు...ఆర్మీ లో కర్నల్ అయిన నరేష్ కు పెద్ద బంగళా, నౌకర్లు, హోదాకు తగ్గ
ఆన్నీ ఆర్భాటాలు ఉండటం వలన వీళ్ళు అక్కడే ఉండి సంవత్సరం లో ఒక రెండు సార్లు చుట్టపు చూపు గా రమేష్ దగ్గరకు వచ్చిపోతారు...అమెరికా లో రమేష్ ఉన్నప్పుడు తరచు అక్కడికి వెళ్లి దేశం మొత్తం చూసొచ్చారు...
"వీడి డౌన్లోడింగ్ కార్యక్రమం పూర్తయినట్టుంది బేబ్" అని ఒక రోజు అల్లుడు సీత తో అంటుంటే భార్గవి ఆ మాటలు విని అర్ధం కాక తిక మక పడింది... "ఏంటోనమ్మ అల్లుడి భాషే అర్ధం కాదు... ఇంతకీ నా మనవడు ఏం చేసాడు?" అని వంటింట్లో నుండి బయటకు వచ్చిన సీతను అడిగింది... "బాత్రూమ్ లో ఉన్నాడు వాడు, పెద్ద పని చేసాడు , ఆయన అంతే, సాఫ్ట్వేర్ భాష తప్ప, మామూలుగా మాట్లాడరు, అయినా నీకెందుకమ్మా ఈ గోల?" అని మొగుడి మీద విసుకు తల్లి మీద చూపించింది సీత... భార్గవి తన గదిలోకి వెళ్తూ పెద్ద పనికి సాఫ్ట్వేర్ కు ఏంటి సంబంధమని బుర్ర బద్దలు కొట్టుకుంది...
తెలుగు పదాలు, వాక్యాలు నాలుగేళ్ళ వయసుకు తగ్గట్టు శివకు పూర్తిగా రాలేదు కానీ ఇంగ్లీషు పదాలు ఇట్టే వాడేస్తున్నాడు వాడు... తండ్రి పుణ్యమా అని...
ఒక రోజు సీతని ఆడుకోటానికి రమ్మని పిలిచాడు... "బేబ్ మోమ్, షట్ డౌన్ యువర్ కిచన్", లెట్స్ లాగిన్ అండ్ ప్లే" , చూస్తే పీసీ ముందు కూర్చొని గేమ్ ఆప్ రెడి చేసి ఉంచాడు...సీతకు కోపం వచ్చింది కానీ, వాడిని ఏమనగలదు... ఇదంతా రమేష్ తప్పు...ఆ వయసు లో పిల్లలు పరిగెత్తాలి, చిన్న చిన్న ఆటలు తల్లి తండ్రి తో పాటు ఆరుబయట ఆడుకోవాలి... అంతే గానీ
నాలుగేళ్ల కుంక కు పీసీ అలవాటు చేయటమేంటి???
అమెరికా నించి తిరిగొచ్చాక రమేష్ కు ఆఫీసుకు వెళ్లకుండా ఇంటి నుండి పని చేసుకునే సౌకర్యం లభించినందుకు సంతోషించింది మొదట్లో... ఇప్పుడు విచారిస్తోంది సీత...
ఫ్రైడే రానే వచ్చింది. అనుకున్నట్టే రమేష్, సీత మీటింగ్ పెట్టుకున్నారు...దసరాల్లో ఎక్కడికైనా విహారయత్ర వెళ్లాలని సీత కోరిక... గట్టిగా మాట్లాడితే అరగంటలో అయిపోయేదానికి రమేష్ ఆఫీసు మీటింగ్ లాగా గంట లాగాడు... ఎక్సెల్ షీట్ లో ఖర్చు రాసి, అంతర్జాలంలో పర్యాటక ప్రదేశాల జాబితా తయారు చేస్తూ కూర్చున్నాడు... సీత కు ఆవలింతలొచ్చాయి, పగలంతా విశ్రాంతి లేదు, సాయంత్రం భోజనానికి సిద్ధం చేద్దామనుకున్న సమయము లో ఈ మీటింగ్ ఒకటి... బుద్ధి గడ్డి తిని ఆడిగాననుకుంది...
మర్నాడు వీకెండ్ కాబట్టి రమేష్ హాయిగా లంచ్ టైంకి లేస్తాడు కానీ సీత కు అదేమి కుదరదు...వీక్లీ ఆఫ్ లేదు... తనకు... అస్సలు ఏ లీవు లేదు...
"డూడ్" అని వాళ్ళ నాన్నను సంబోధిస్తూ శివ వచ్చి రమేష్ ఒళ్ళో కూర్చున్నాడు. "బేబ్ మోమ్, ఐ వాంట్ పిజ్జా ఫర్ డిన్నర్" అన్నాడు... "శివ, నిన్ను ... తెలుగు లో మాట్లాడలేవా? పిజ్జా లేదు గాడిద గుడ్డు లేదు... నోరు మూసుకొని పప్పు, పెరుగన్నం తినాల్సిందే... రమేష్, చూసావా వాడు ఎలా తయారవుతున్నాడో... ప్లీస్ రమేష్... మనం మన లాగా ఉందాం... పాత రోజులు గుర్తు చేసుకో... నువ్వు కూడా ఇలా లేవు. నా లాగానే ఉండేవాడివి... ఈ పాశ్చాత్య సభ్యత పిచ్చిలో పడిపోయావు...ఇంకో రెండేళ్లు పోతే శివ ఇంకేం మాట్లాడుతాడో ఊహించుకోటానికే భయంగా ఉంది"...
"వేయిట్ బేబ్ ... నేను డేటాబేస్ తయారు చేస్తున్నా మన ట్రిప్ కోసం" అన్నాడు రమేష్... సీత అక్కడినుండి లేచి వెళ్ళిపోయింది...
కరుణ సెలవులకు ఇంటికొచ్చింది... సీత ఫ్రెండ్ కూతురు... శివ కంటే పదేళ్లు పెద్దది.
టెన్త్ చదువుతున్న కరుణ ను హాస్టల్ లో వేసి సీత ఫ్రెండ్ మరియు వాళ్ళ ఆయన జర్మనీ కెళ్లారు ప్రాజెక్ట్ మీద... కరుణ చదువు దెబ్బ తింటుందని ఇండియా లోనే వదిలేసి వెళ్లారు... గార్డియన్ గా సీతను ఉండమన్నారు... ఇటువంటి విషయాల్లో రమేష్ తో ఏ చిక్కూ లేదు...
రమేష్ తో ఉన్న చిక్కల్లా తన మూలములను మరచి మిగిలినవన్నీ గొప్ప అనుకోవడం ... పెళ్ళాన్ని బేబ్ అంటే ఫ్యాషన్, కంప్యూటర్ పదాలను వాడుక లో ఎంత వాడితే అంత గొప్ప, ఇంకా చెప్పాలంటే గొప్ప కాదు "కూల్"... దాని అర్ధం సీతకు తెలీదు...
"హై ఆంటీ" అని కరుణ పిలుపుకు సీత ఉలిక్కిపడి తల పైకెత్తి చూసింది... ఖాళీ దొరికినప్పుడల్లా సీతకు బొమ్మలు వేయటం చాలా ఇష్టం, అప్పుడప్పుడు తన పెయింటింగ్స్ ను ఊళ్ళో నిర్వహించే ప్రదర్శనలకు పంపుతుంటుంది ... "థాట్స్ కూల్" అన్నది కరుణ సీత గీస్తున్న డ్రాయింగ్ ను చూసి... "కరుణ, నాకు అర్ధమయేటట్లు మాట్లాడు... అన్నింటికీ కూల్ అంటే అది ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు... అంటూ డ్రాయింగ్ సరంజామాను అలమర లో పెట్టి నవ్వుతూ కరుణ వంక చూసింది సీత...
ఆ రోజు సాయంత్రం కాలనీ లో బర్త్డే పార్టీ...రమేష్ కొలీగ్ రెండేళ్ల కొడుకు పుట్టినరోజు... సీత చక్కగా చీర కట్టుకుంటే, రమేష్ వద్దని డ్రెస్ వేసుకోమన్నాడు... ఈ మధ్యే మొగుడి పోరు పడలేక తప్పనిసరిగా కొనుక్కున్నది కొన్ని లేటెస్ట్ ఫాషన్ లో ఉన్న డ్రెస్సులు... రమేష్ దగ్గరుండి కొనిపెట్టాడు...
ఆకుపచ్చని క్రోప్ టాప్ తో కూడిన తెలుపు లాంగ్ స్కర్ట్... జుట్టు కట్టుకుంటే హెయిర్ బ్యాండ్ తీసేవరకు గొడవ చేసాడు మొగుడు... అందరిలాగే జుట్టు విరబోసుకోవాలన్నాడు...
"నౌ యు లుక్ హాట్" అన్నాడు రమేష్ సీత తో... "భగవంతుడా, ఏంటిది? ఐదేళ్లు అమెరికా లో ప్రాజెక్ట్ మీద వెళ్ళొస్తే మనిషి ఇంత మరిపోతాడా? తన పెళ్లినాటికి రమేష్ ఒక మోస్తరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు... ఈ కళలేమి లేవు అప్పట్లో... ఆ తర్వాత పెద్ద కంపెనీ లో చేరటం, బయటకెళ్లే అవకాశం రావటం అన్నీ వెంటనే జరిగిపోయాయి... ఆ అమెరికా గాలి, నీళ్లు బాగా వంటపట్టాయి....ఏం చేస్తాం"... అని బాధ పడటం తప్ప ఎలా దారికి తెచ్చుకోవలో తోచట్లేదు సీతకు...
పార్టీ కు 30 మంది ఫ్రెండ్స్ వచ్చారు... పెళ్లయి ఆరేళ్ళు నిండినా సీత ఆ డ్రెస్సులో కాలేజికెళ్లే వనిత లాగా మెరిసిపోతోంది. అస్సలే చక్కటి రూపం, ఆకర్షించే ఆకృతి... బొమ్మ లాగా ఉంది...
...రమేష్ ఫ్రెండ్స్ లో ఒకళ్ళిద్దరు బ్యాచిలర్స్ సీతను తదేకంగా చూస్తూ ఉన్నారు... "షీ ఈజ్ హాట్", " షీ ఈజ్ కూల్" అంటూ కామెంట్స్ చేశారు...రమేష్ మురిసిపోయాడు...మొత్తానికి పార్టీ పూర్తయి రాత్రి పదకొండింటికి తిరిగి ఇంటికి వెళ్లారు... లోపలికి వెళ్తూనే సీత ఏడ్చింది... "డూడ్, బేబ్ మోమ్ ఏడుస్తోంది...ఎదో ప్రాబ్లెమ్... ట్రబుల్ షూట్ చెయ్యి" అని శివ అంటుంటే ఈ సారి సీత కాదు, కరుణకు షాక్ కొట్టింది... ఇంత చిన్న పిల్లాడా ఇలా అంటోందని రమేష్ అంకుల్ వంక చూసింది... "నాకు నిద్దరోస్తోంది డూడ్, రేపు పొద్దున నాకు అపడేట్ ఇవ్వు బేబ్ మోమ్ ఎందుకు ఏడుస్తోందో" ... సీత వైపు తిరిగి ఓదార్పుగా " జస్ట్ చిల్ బేబ్ మోమ్" అంటూ మంచమెక్కి వెంటనే పడుకున్నాడు శివ...
సీత అప్పటికి నైటీ వేసుకుని ఏడుస్తూ పడుకుంది... కరుణ కాసేపు చూసి పక్కగది లో పడుకుంది...
రమేష్ బట్టలు మార్చుకుంటూ సీతతో " పార్టీ ఫన్నంతా పోయింది బేబ్... ఏమైంది"... అన్నాడు... "వినలేదా మీ ఫ్రెండ్స్ చేసిన కామెంట్స్?" అని అడిగింది భర్తను... "అదా... Lol"(లాఫ్ ఔట్ లౌడ్ అని ఐటీ భాష)... పెద్దగా నవ్వాడు..."పరాయి మొగవాళ్ళు నన్ను చూసి చేసిన కామెంట్స్ కూడా నీకు పట్టవా, అంత నవ్వుతున్నావు"...అని సీత బాధ పడింది... "నీకెలా చెబితే అర్ధం అవుతుంది రమేష్"...
"చాలా లేట్ అయింది, పడుకో, ఇంకా ఏమైనా ఉంటే నాకో మెయిల్ పెట్టు... రేపు ఖాళీ గా ఉన్నప్పుడు చదివి నీకు రిప్లై పెడతా" అన్నాడు... "నాకు పిచెక్కుతోంది"... అన్నది సీత... అప్పటికే రమేష్ పడుకున్నాడు, ఒళ్ళు తెలీదు అతనికి...
తెల్లారేసరికి రమేష్ తల్లి తండ్రి ప్రత్యక్షమైనారు... సీతను చూడగానే వాళ్లకు ఏం జరుగుతోందో అర్థమైపోయింది...శివ లేచిన వెంటనే " బేబ్ మోమ్ యు అర్ హాట్" అన్నాడు... రాత్రి పార్టీ లో బాగా విన్నాడు వాళ్ళ నాన్న స్నేహితుల నోట ఆ మాట, ప్రయోగించేశాడు!
అక్కడున్న అందరూ ఖంగు తిన్నారు... భార్గవి ఖంగారు పడుతూ," ఏమైంది సీత, జ్వరమొచ్చిందా? అనేసరికి సీత తల పట్టుకుంది, కళ్లనీళ్లు కారిపోతూ...
"ఏంటి రమేష్ ఇది? బంగారం లాంటి పిల్లను తెచ్చి నీకు ఇచ్చి పెళ్లిచేస్తే, ఇదేనా నువ్వు చేస్తోంది? " "నరేష్ తర్వాత పదేళ్లకు పుట్టావని చేసిన గారాబం వల్ల నువ్వు ఇలా ఉన్నావు"... అని రమేష్ తల్లీ తండ్రి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొడుకును వాయించేస్తున్నారు...
"హేయ్ ఓల్డ్ డూడ్" అని శివ మాటకు రమేష్ స్పందించాడు - "నో శివ, ఆయన నీ గ్రాండ్ ఫాదర్, మీ తాత" అన్నాడు... "చూసావా రమేష్, మన పిల్లలు మనల్నే వెక్కిరిస్తారు, తప్పు ఎవరిది? వృత్తి పేరుతో నీవు నీ కాపురం లో సృష్టించుకున్న అలజడి కి నువ్వే సమాధానం చెప్పాలి... మన భారతీయులు వేలమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో ఉన్నారు,
వాళ్ళందరూ నీ లాగే మారిపోయారా? ఎక్కడికి ఎలా రావాలో, ఏది కట్టుకోవాలో ఎలా మసులుకోవాలో మా కోడలు సీతకు బాగా తెలుసు... నీ కన్నా సీత ఎంతో ప్రౌఢ"...
కరుణ మధ్యలో మెల్లగా మాట్లాడింది--"రాత్రి ఆంటీ నిద్దరమాత్రలు మింగబోయింది... "రమేష్ అంకుల్ని ఎంత లేపినా లేవలేదు" అని రమేష్ తల్లి తండ్రి వైపు చూస్తూ చెప్పింది...
"ఓ షిట్!" అన్నాడు రమేష్ వెంటనే... అంత కన్నా ప్రతిస్పందన ఏమి రాలేదు... రోజు వాడే పదమే అది, ఏముంది అందులో!
ఇంత లో రమేష్ వాట్సాప్ లో రాత్రి పార్టీ ఫోటోలు పంపారు స్నేహితులు...తన భార్య సీత తో వాళ్ళు తీసుకున్న ఫోటోలు తనకే పంపించి అసభ్యకరంగా వ్రాతపూర్వకముగా వాళ్ల వాంఛను తెలియపరిచారు... రమేష్ కు చెమటలు పట్టాయి... తగలాల్సిన చోటే తగిలింది... వెంటనే తెలుసుకున్నాడు, వాళ్ల తో పాటు అక్కడ తాగి తాను తప్పుచేశాడు...
"మనదైన దాన్ని పదిలంగా చూసుకోవాలి రమేష్... దాన్ని ఇతర్లతో పంచుకుంటే మన ఉనికికే ప్రమాదం... రాత్రి సీతకేమైనా జరిగుంటే...
"OMG" అన్నది భార్గవి సీతను దగ్గరకు తీసుకొని...
"మీ అన్న ఆర్మీ లో ఉన్నంతమాత్రాన మీ వదిన ఎలా నడుచుకుంటుందో, వచ్చి చూడు... క్రమ శిక్షణా బద్ధమైన జీవితము గడుపుతూ ఒకళ్లకొకళ్ళు మర్యాద ఇస్తూ తమ చుట్టూ ఉన్నవాళ్ళతో ఎలా మసులుకోవాలో అలా మసులుకుంటారు.."
"రాత్రి కొంచెం ఎక్కువైంది నాన్న , అందుకే అలా జరిగింది"... అన్నాడు రమేష్ తల దించుకుని... "ఏంటిరా ఎక్కువయ్యేది? మీ అన్న కది మామూలే మరి... ఆర్మీ లైఫ్ లో పార్టీలు, మందు సర్వ సాధారణం...వృత్తి జీవితాన్ని తన లివింగ్ రూము లోకి రానివ్వడు మీ అన్న... కర్నల్ నరేష్ ప్రపంచానికి...కుటుంబము తో తాను రాధాకృష్ణ పెద్ద కొడుకు గానే ఉన్నాడు ఈ రోజుకి, నేను నేర్పిన విలువలుతో...
అదే రా నీలో లేనిది"...
"ఐ ఆమ్ సారీ బేబ్" అని రమేష్ అన్నాాడు...
"ముందు ఆ పిలుపు మానుకో" అని ఎప్పుడులేనంత గట్టిగా గాండ్రించింది సీత...
నీ తో వెకేషన్ వెళ్లినప్పుడు నువ్వు కొన్న డ్రెస్సులు వేసుకొని, నీ కిష్టమైనట్లు ఉంటాను...అంతే కానీ మీ కొలీగ్స్ తో ఎంతవరకు ఉండాలో అంత వరకే నువ్వూ ఉంటే, నా దాకా రాదు, ఎటువంటి గొడవ ఉండదు రమేష్" అని పెద్దవాళ్ళ ప్రోత్సాహం తో సీత తన మనసు లో మాటను మొగుడు తో చెప్పింది...శివ ను జాగ్రత్తగా పెంచకపోతే, ఇంకో రెండేళ్ళ చాలు, వాడు చేయి జారి పోవటానికి, ఇది వెనకటి కాలం కాదు"...
"సీత, వాళ్ళ అమ్మ ఎప్పుడైతే వాట్సాప్ మెసేజులకు ఎప్పటిలాగే స్పందించలేదో, మీ అమ్మకు అప్పుడే అనుమానం వచ్చింది... ఒక నెల నుండి రావాలనుకుంటే, ఇప్పుడొచ్చాము, కరెక్ట్ టైమ్ కోచ్చాము లే" అన్నాడు తండ్రి...
"ఓహ్ షీట్" అనే మాట ఈ సారి భార్గవి వంతయింది... ఏంటో అని అందరూ ఆవిడ వంక చూసారు... "రాత్రి గోలలో పాల సంచి బయట తలుపుకు పెట్టలేదు కదా, పాలు వేయలేదివాళ... వెంటనే కనక తెచ్చుకోకపోతే దొరకవు..." అంటూ చెప్పులేసుకొని బయలుదేరింది...
"ఐ ఆమ్ పిస్డ్ ఆఫ్ డూడ్"(నాకు పిచ్చి విసుగ్గా ఉందని దాని అర్ధం, అసభ్యకరమైన వాడుక) అని శివ అంటే సీత వాడి చంప మీద ఒకటి వేసింది... "ఇలా తయారయ్యాడు వీడు...పిల్లలు చిలకపలుకులు పలుకుతారని ఊరికే అన్నారా? వాడు రోజూ వినే మాటలే వాడూ మాట్లాడతాడు మరి...
ఇందాకే విన్నారుగా మా అమ్మ పాండిత్యం... ఆవిడకు కూడా అంటుకున్నది...అంట్ల భాష"... అని ఆవేశపడిపోయింది సీత...
"నెల రోజుల్లో వాడి భాష మార్చి వాడ్ని దారిలో నువ్వే పెట్టాలి రమేశ్"... అని సీత అంటుండగా శివను ఎత్తుకుని ఓదార్చాడు రమేష్...
"నాన్నా అనాలి, డూడ్ కాదు" అని మొదటి పాఠం కొడుకుకు నేర్పాడు... "ఆమ్ ఐ రైట్ సీతమ్మా, మాయమ్మ? సీత మూతి బిగించింది... సరే సీతాలు అని పిలుస్తాలే, ఒకే నా?? అదీ ఇంట్లోనే... నా ఆఫీసు రూమ్ లోనే నేను రామ్స్, లివింగ్ రూమ్ లో కాదు... మనం రేపే మీటింగ్ పెట్టుకుందాం సీత, ఈ సారి అంశం మన శివ" అంటుండగానే సీత చిందులు తొక్కింది...ఇంకో సారి మీటింగ్ అన్నావంటే మర్యాద దక్కదు"... గోడ గడియారం 9 గంటలు కొట్టేసరికి అందరూ కాలకృత్యాలు పూర్తి చేసుకోటానికి ఎవరి గదుల్లోకి వాళ్ళు నిష్క్రమించారు...
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం
పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక
వయసు: 52 సం.
నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)
స్వస్థలం: తెనాలి
చదువు: BA English Litt., B.Ed
వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.
ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం
పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.
స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.
కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.
ఇటీవలే ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి , ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వారినుండి సర్టిఫికేట్ లు పొందాను.
కథ చాలా సరదాగా, మంచి సందేశంతో ఉంది.
Seetarams kadha IT prapancha mayalo kottukupothunna prajaneekaaniki kanuvippu.