కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Seethakoka Chiluka' Telugu Story Written By Lanka Sankara Narayana
రచన: లంకా శంకర నారాయణ
రెండు వారాలు టూర్ వెళ్ళి ఆరోజు ఉదయమే ఇంటికి వచ్చాను. మా దూరపు బంధువు ఇంట్లో నామకరణం కార్యక్రమం ఉందని, భోజనానికి పిలిచారని మా ఆవిడ నాతో చెప్పింది.
ఉదయం గం.10 కి నేను మా ఆవిడ బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నామకరణం చెయ్యవలసిన మా బంధువు, ఆయన భార్య చాలా భాధపడుతున్నట్లు నాకనిపించింది.
అదే విషయం మా బంధువు ని అడిగాను.
దానికాయన “ఏమీలేదురా! అసలే ఆడపిల్ల పుట్టిందనుకుంటే నల్లగా ఉంది. పైగా ఒక కాలు వంకరగా ఉంది. డాక్టర్లు జీవితాంతం కుంటుతూనే నడవాలని చెప్పారు. అదే నా బాధ” అన్నాడు.
“దానికి బాధ ఎందుకురా?” అన్నా.
“అదేరా! ఈ పిల్లని ఎవరు పెళ్ళి చేసుకుంటారు?” అన్నాడు.
“ఎప్పుడో 25 సంవత్సరాల తరువాత జరగబోయే సంగతి గురించి నువ్వు ఇప్పుడే బాధపడుతున్నావా?” అన్నా.
ఈలోపల మా బంధువు భార్య సోదరుడు అక్కడికి వచ్చాడు. “బావగారూ, ఇలాంటి పాపను పెంచడం చాలా కష్టం. ఏదైనా శరణాలయం లో చేర్పించండి” అన్నాడు.
నాకు చాలా కోపం వచ్చింది. పిల్లలు నల్లగా పుట్టినా అంగవైకల్యం తో పుట్టినా అది వాళ్ళ తప్పు కాదుగా. అందుకే మా బంధువు వంక తిరిగి “నీకు కూడా ఇలాంటి ఉద్దేశ్యమే ఉంటే పాపను నాకియ్యి. నేను పెంచుకుంటాను” అన్నా.
దానికి మా బంధువు “అలాంటిదేమీ లేదులేరా” అని నామకరణ కార్యక్రమం మొదలుపెట్టటానికి లోపలికి వెళ్ళాడు.
ఆ తరువాత ఆపాప కొద్దికొద్దిగా పెరిగి పెద్దదవటం, అలాగే కుంటుకుంటూనే ఇంటిపనులు, బయటి పనులు చేస్తూ ఉండటం నేను చూస్తూనే ఉన్నా.
ఎప్పుడు రొడ్డు మీద కనబడినా “బావున్నారా బాబాయ్” అంటూ నవ్వుతూ పలకరించేది. ఒకరోజు కనిపించినప్పుడు కొంచెం బాధగా కనిపించింది.
నేను దాన్ని దగ్గరకు తీసుకుని “ఏమైందిరా?” అని అడిగా.
దానికి అది బాధగా “ఎందుకు బాబాయ్ ఇంట్లో అందరూ నన్ను ఒక గొంగళి పురుగు లాగా చూస్తారు?” అంది.
అప్పుడు నేను దాని వీపు తట్టి, “అమ్మా బంగారు తల్లీ! వాళ్ళందరూ నువ్వొక ‘గొంగళి పురుగు’ అనుకుంటున్నారమ్మా. కానీ అందులోనుంచే అద్భుతమైన సీతాకోక చిలుక పుడుతుందని ఆ మూర్ఖులకు తెలియదమ్మా! తప్పకుండా నువ్వు ఒకరోజు అందమైన సీతాకోక చిలుక లా మారతావు. అప్పుడు నిన్ను చూడటానికి వీళ్ళందరూ పరిగెత్తుకు వస్తారు” అన్నా.
ఆ తరువాత కొంతకాలానికి నేను ఉద్యోగరీత్యా హైదరాబాదు వచ్చేశా. కాలగమనంలొ ఇంకొక 20 సంవత్సరాలు గడిచి పోయాయి. మా దగ్గర బంధువు ఒకాయనకు హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పిటల్ లొ ఉన్నాడని తెలిసి విజయవాడ వెళ్ళా. హాస్పిటల్ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్ళా. హాస్పిటల్ చాలా పెద్దదే. రిసెప్షన్ లొ అడిగితే 5 వ ఫ్లోర్ కు వెళ్ళమన్నారు.
5 వ ఫ్లోర్ కారిడార్ లో నడుస్తూ ఉండగా ఎవరో ఒక అబ్బాయి వచ్చి “సార్! మిమ్మల్ని మా ఎం.డి గారు పిలుస్తున్నారు” అని చెప్పాడు.
“నన్నా?” అని అడిగా.
“అవును సార్. మిమ్మల్నే. నాతో రండి” అంటూ వాళ్ళ ఎం.డి గారి రూం లోకి తీసుకెళ్ళాడు.
ఎం.డి గారి గది లోకి వెళ్ళిన నాకు, “బాగున్నారా బాబాయ్?” అనే సుపరిచితమైన గొంతు వినిపించింది. నామకరణం రోజు అమ్మా నాన్నా ఎందుకు పుట్టిందిరా అని బాధపడిన అమ్మాయి ఈరోజు ఈ హాస్పిటల్ కు ఎం.డి. నా అని మనసంతా ఏదో తెలియని ఆనందంతో నిండి పోయింది.
“చాలా సంతోషంగా ఉందమ్మా” అన్నా.
“మీరే చెప్పారు కదా.. ఎప్పటికైనా సీతాకోక చిలుకగా మారతానని. మీఅశీర్వాదమే బాబాయ్” అంది.
“నా ఆశీర్వాదమేముందమ్మా! నీ కృషి, భగవంతుని అనుగ్రహం” అన్నా.
అలా మేము మాట్లాడుకుంటూ ఉండగా ఎవరో ఒక వ్యక్తిని వీల్ చైర్ లొ ఒక ఆవిడ తీసుకు వచ్చింది. బహుశా ఆయన భార్య అనుకుంటా.
“అమ్మా కోడలు పిల్లా! మీ మామయ్య కు రాత్రి నుంచీ కాళ్ళు, చేతులు, నోరు పని చేయటం లేదు. ఇంక మీ మామయ్య ను నువ్వే చూసుకోవాలి” అంది. నేను తల తిప్పి ఆయన వంక చూశా. ఎక్కడో చూసినట్లు అనిపించింది. కాసేపు ఆలోచించాక గుర్తుకు వచ్చింది. నామకరణం రోజు ఈ పిల్లని ఏదైనా శరణాలయం లో చేర్పించమన్నవాడు వీడే.
ఈలోపల డాక్టరు వాళ్ళకు రూం ఇప్పించి పంపించేసింది. నేను అప్పుడు డాక్టరుతొ “నాకు ఒక చిన్న సహాయం చెయ్యాలమ్మా” అన్నా.
“ఏంటి బాబాయ్?” అంది.
“వీడు ఇక జన్మలొ నడవకుండా, మాట్లాడకుండా ఏదైనా మందు ఇవ్వవే తల్లీ” అన్నా.
“నువ్వు ఎందుకు అలా అన్నావో నాకు అర్దమయింది బాబాయ్. కానీ నేను ఇంత చదువుకున్నది బాగుచేయటానికే గానీ పాడుచేయటానికి కాదుగా” అంది.
ఈ సీతాకోక చిలుక నాకు ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తోంది.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు కథ పేరు పైన క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నా పేరు లంకా శంకర నారాయణ. నేను 1956 అక్టోబర్ 16 న జన్మించాను. మా స్వస్థలం అంధ్ర ప్రదేశ్ ఇండియా లోని బందర్. నేను హైదరాబాద్ లోని రాష్ట్ర సహకార బాంక్ లొ పని చేసి 2014 లొ పదవీ విరమణ చేసాను. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరూ ప్రస్తుతం అమెరికా లొ ఉంటున్నారు.
Comments