వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)
'Serial Chuda Velayera Part 1/2' - New Telugu Story Written By Allu Sairam
Published In manatelugukathalu.com On 08/11/2023
'సీరియల్ చూడ వేళాయెరా పార్ట్ 1/2' పెద్ద కథ ప్రారంభం
రచన: అల్లు సాయిరాం
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అప్పుడే ఆఫీసు నుండి యింటికి చేరుకున్న గోపాలం రెడీ అయ్యి రాత్రి భోజనం చేస్తూ, మూడు నెలల ముందు పుట్టింటికి వెళ్ళిన తన భార్య రాధకి ఫోన్ చేశాడు.
రాధ ఫోన్ లిఫ్ట్ చేసి అందంగా ఒక కవిత చెప్తుంటే “ఏంటోయ్! మంచి కవితలు చెప్తున్నావ్! ఏంటి సంగతి?" అని అడిగాడు గోపాలం.
“ఏమండోయ్ శ్రీవారు! బాగున్నారా?" అని సిగ్గుపడుతూ అడిగింది రాధ.
“నేను బాగున్నాను. సరే! నువ్వు యిక్కడికి ఎప్పుడు వస్తావ్ చెప్పు!" అని గోపాలం అడిగితే “వచ్చేస్తానండి! నేను వచ్చేస్తాను అంటుంటే, ఒకరోజు, రెండు రోజులు అంటూ అమ్మమ్మ నన్ను ఆపుతుంది!" అని ఉన్న విషయం చెప్పింది రాధ.
“ఏమంట? ఎందుకు ఆపుతుంది?" అని కోపంగా అడిగాడు గోపాలం.
“ఏంటండి? అలా మాట్లాడుతారు! అమ్మమ్మకి ఆనారోగ్యంగా ఉండడం వల్లనే కదా, నేను యిక్కడికి వచ్చింది!" అని రాధ సర్దిచెప్పబోతుండగా, గోపాలం మధ్యలో కలుగచేసుకుని “మీ అమ్మమ్మకి మూడు నెలల ముందు బాగోలేదు. యిప్పుడు బాగానే ఉంది కదా! పోనీ, మీ అక్కని రమ్మనొచ్చు కదా!" అని అన్నాడు.
“బావగారు ఆఫీసుకి వెళ్తారు కదా! అందుకే అక్క యిక్కడకి రావడం కుదరట్లేదు!" అని రాధ ఏదో చెప్తుంటే “ఆయన ఆఫీసుకి వెళ్తే, మరి నేను ఆవులు కాయడానికి వెళ్తున్నానా?" అని అదే కోపంలో అన్నాడు గోపాలం.
“అయ్యో స్వామి! నేనేం చెప్తున్నానంటే, బావగారు ఆఫీసుకి వెళ్లాక, పిల్లల్ని చూసుకోవడానికే అక్కకి టైం సరిపోతుంది!" అని మెల్లగా సముదాయిస్తూ అంది రాధ.
“అవును మరి! మనకి పెళ్ళయి ఆరు నెలలయింది. ఆ ఆరు నెలల్లో, మూడు నెలలు నువ్వు పుట్టింట్లోనే ఉంటే, మనకు ఎప్పుడు పిల్లలు పుడతారు?" అని రెట్టించిన కోపంతో అన్నాడు గోపాలం.
“ఇంత కోపం ఎందుకు? ఏమైంది యిరోజు మీకు? మళ్లీ మీ ఆఫీసులో మేనేజర్ తిట్టాడా ఏంటి?" అని నవ్వుతూ అడిగింది రాధ ఏదో గోపాలం మనసు చదివేసినట్టుగా.
“నా కోపం వెనుక ఉన్న కారణం నీకు నిజంగా తెలియదూ. ఆఁ?" అని గద్దించాడు గోపాలం.
“ఆయ్యా మహానుభావా! తెలుసు! అమ్మమ్మ పక్కనే ఉంది. మెల్లగా మాట్లాడండి. నేను రేపు బయలుదేరడం గురించి యిప్పుడే మాట్లాడుకుంటున్నాం. మధ్యలో మీరు ఫోన్ చేశారు!" అని అసలు విషయం చెప్పింది రాధ.
“ఏంటి? నువ్వు రేపు వస్తున్నావా? ఇప్పుడా ఆ విషయం చెప్పేది?" అని ఆనందంతో తబ్బిబ్బైపోతూ అన్నాడు గోపాలం.
“ఏంటండి యింత ఆనందం? నన్ను ఏదో సంవత్సరాల తరువాత చూడబోతున్నట్లు! క్రిందటి వారమే కదా, యిక్కడకి వచ్చి వెళ్లారు!" అని ఆశ్చర్యపోయి అంది రాధ.
“ఆ ఆనందం గురించి నీకేం తెలుస్తుంది. మనసులో ప్రేమ ఉంటే తెలుస్తోంది!" అని గోపాలం చెప్తుంటే, రాధ మధ్యలో కలుగజేసుకొని "అయితే, నాకు మనసు, ప్రేమ లేదంటారు. అంతేనా! యిక్కడ మరో నెలరోజులు ఉండి వస్తానులే!" అని కోపంగా అంది.
"యిప్పుడు నీకెందుకు అంత కోపం? నీకు నా మీద ఎంత ప్రేమో నాకు తెలియదా! రేపు నువ్వు యింటికి వచ్చేస్తావ్ కదా! అప్పుడు ఆ ఆనందం గురించి చెప్తాను!" అని అన్నాడు గోపాలం.
"రేపు చెప్పుదురులే గాని, యిప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది. రేపు ఉదయం ట్రైన్ కి రావాలంటే, యిప్పుడు నేను పడుకోవాలి. పడుకోవాలంటే, మీరు ఫోన్ కట్ చేయాలి!" అని రాధ చెప్తుంటే, గోపాలం వెంటనే “రేపు ఉదయం యిక్కడికి వచ్చేసరికి 6:30 అవుతుంది కదా. నేను స్టేషన్ కి రావాలా?" అని కంగారుగా అడిగాడు.
"ఏఁ రావాల్సిన అవసరం లేదు మహాప్రభో! క్రిందటిసారి యిలాగే మిమ్ముల్ని స్టేషన్ కి రమ్మంటే, మీ కంగారుతో ఏడు గంటల ట్రైన్ కి, మీరు మూడు గంటలకే స్టేషన్ కి వచ్చేసి, ట్రైన్ ఎక్కడుందని అడగడానికి, ట్రైన్ లో ఉన్న నాకు ఓ ముప్ఫైసార్లు మీరు చేసిన ఫోన్లకి, ట్రైన్ కోచ్ లో నిద్రపోతున్నవారు నిద్ర డిస్టర్బ్ చేసినందుకు, నిద్రలేచి మరీ తిట్టిన తిట్లు యింకా నాకు గుర్తున్నాయి. కాబట్టి, నేనే వస్తాను!" అని అనుభవపూర్వకంగా చెప్పింది రాధ.
"సరే! అయితే, నీ రాకకోసం నేను యిప్పుటినుండే వేయికళ్ళతో ఎదురుచూస్తాను. ఓకే. బై బై. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్!" అని ఫోన్ కట్ చేశాడు గోపాలం.
రాధ రేపు యింటికి వచ్చేస్తుందన్న వార్త విన్నప్పట్నుంచి గోపాలంకి ఆనందం కట్టలు తెంచుకుని, మనిషి మనిషిలా లేడు. రాత్రంతా రాధని కలలో ఊహించుకుంటూ ఊహాల్లో విహరిస్తూ, డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. మధ్యమధ్యలో లేచి, గడియారం వైపు చూస్తూ “అసలు ఈ గడియారం పనిచేస్తుందో? లేదో!" అని అనుమానం వచ్చి, గడియారం బ్యాటరీ చెక్ చేసి, తన మొబైల్ ఫోన్ లో, టివిలో అదే టైం ఉండడంతో గడియారాన్ని పగలకొట్టకుండా విడిచిపెట్టాడు.
అలాగే రాత్రంతా అటు యిటూ తిరుగుతూ, తెల్లవారు జామున నిద్రలోకి జారుకున్నాడు. గోపాలం కళ్లు మూసుకుని పడుకున్నా కుడా, తన రెండు చెవులని యింటి గేటు దగ్గర కాపలాగా పెట్టుకున్నట్లు, యింటి ముందు ఒక ఆటో వచ్చి ఆగగానే టక్కున నిద్రలేచాడు. తర్వాత కాలింగ్ బెల్లు మ్రొగింది. వెంటనే రాధ వచ్చేసిందేమో “యాహూ" అని బెడ్ రూం నుండి మెయిన్ డోర్ కి మధ్యలో మూడు గెంతులు గెంతేసరికి పన్నెండడుగుల దూరం కనిపించకుండా పోయింది.
ఎదురుగా రాధని ఊహించుకుంటూ గోపాలం తలుపు తీయగానే “అయ్యగారు! గిన్నె యిస్తే, పాలు పోస్తాను!" అని అనేసరికి "ఏంటి యిది? రాధ ఏంటి? పాలు పోయడం ఏంటి?" అని కొంచెం ఊహల్లో నుండి తేరుకుని సరిగ్గా చూసేసరికి ఎదురుగా నిల్చున్న పాలవాడు బిందెలో నుంచి పాలు తీసుకుని “గిన్నె యిస్తే పాలు పోస్తాను అయ్యా!" అని మళ్ళీ అదే చెప్పాడు.
అయితే యిదంతా తన భ్రమ అని అర్థం చేసుకున్న గోపాలం నాలుక కరుచుకుని, లోపలికి వెళ్లి గిన్నె పట్టుకుని వచ్చి, పాలు తీసుకుని, పాలవాడు చిల్లర యివ్వడానికి పిలుస్తుంటే, వినిపించుకోకుండా హడావిడిగా లోపలికి వెళ్ళిపోయాడు. రాధ వచ్చే సమయం కావడంతో నేరుగా వంటింట్లోకి వెళ్ళి, రాధకి సర్ప్రైజ్ గా తను ఈ మూడు నెలలలో ఎంతో కష్టపడి నేర్చుకున్న కాఫీ రెండు కప్పులలో ప్రేమగా కలిపాడు.
సమయం 7:00 అవుతుంది. “చూస్తుంటే, టైం గడిచిపోతుంది. కానీ, వస్తానన్న రాధ అంతటా లేదు, యింతటా లేదు. రాధ మళ్లీ హ్యాండ్ యివ్వట్లేదు కదా? లేకపోతే రాధ వస్తున్న ట్రైన్ కి యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా?" అని మనసులో అనుకుని కంగారు పడుతూ రాధకి ఫోన్ చేశాడు. రాధ ఫోన్ ఎత్తగానే “ఎక్కడున్నావు? ఉదయం 6:30 కి వచ్చేస్తానన్నావ్. ఏం యింకా రాలేదు? అసలు వస్తున్నావా? లేదా?" అని గ్యాప్ లేకుండా ప్రశ్నలు అడిగాడు.
“అదే యింకా తుఫాన్ రాలేదేంటా అని చూస్తున్నా! వచ్చేసింది. ట్రైన్ రెండు గంటలు లేటుగా వస్తుంది. అందుకే లేటు అయ్యింది!" అని చెప్పింది రాధ.
“ఏంటి, ట్రైన్ రెండు గంటలు లేటా? నేను స్టేషన్ కి వస్తానంటే వద్దన్నావ్. యిప్పుడు చూడు ఏమయ్యిందో?" ఏదో యింటి పక్క నుంచి భూకంపం వచ్చివెళ్ళినట్లు రియాక్షన్ యిచ్చాడు గోపాలం.
“మీరు స్టేషన్ కి రాకపోవడానికి, ట్రైన్ లేట్ అవ్వడానికి ఏంటి సంబంధం? ఒకవేళ మీరు వచ్చి కుడా ట్రైన్ లేట్ అయితే బాహుబలిలాగా ట్రైన్ ముందు నుంచి త్రాడు కట్టి లాగేస్తారా ఏంటి?" అని నవ్వుతూ అడిగింది రాధ.
“నేను వచ్చి ఉంటే, బాహుబలిలా ముందు నుంచి లాగేవాడినో? లేక 2.0 సినిమాలో రోబో చిట్టి మాదిరిగా ట్రైన్ వెనుక నుంచి నెట్టేవాడినో చూసేదానివి!" అని బలప్రదర్శన చేస్తూ అన్నాడు గోపాలం.
“అవునా బాబుగారు! అంటే, మా ఆయన సూపర్ మ్యాన్ అన్న మాట. మరీ అంత పవర్ ఉన్నప్పుడు, రైల్వే మినిస్టర్ కి చెప్పి, ప్రతిసారి ట్రైన్ లాగే ఉద్యోగం చేస్తే పొయే! ట్రైన్ ఇంజన్ ఆయిల్ ఖర్చు జీతంగా యిచ్చిన కుడా, ఎలా లేదన్నా నెలకో పదిలక్షల వరకు వస్తుంది. ఏమంటారు? వెంటనే బయలుదేరి స్టేషన్ కి రండి మరీ!" అని వెటకారంగా నవ్వుతూ అంది రాధ.
“లాగుతా! లాగుతా!! టైం వచ్చినప్పుడు అన్ని కలిపే బయటకు లాగుతా! తెలుసా? నీకోసం ప్రేమగా కాఫీ కుడా కలిపాను. అయినా, యిప్పుడు స్టేషన్ కి ఎలా వచ్చేది? ట్రైన్ రెండు గంటలు లేటు అంటే యిక్కడికి వచ్చేసరికి 9:30 అవుతుంది. నేను ఆఫీసుకి వెళ్లొద్దా?" అని నిరాశలో అమాయకంగా అడిగాడు గోపాలం.
“ఏఁ పర్వాలేదండి శ్రీవారు! మీరు చక్కగా ఆఫీసుకి వెళ్ళండి. మీరు తిరిగి వచ్చేసరికి మీ బంగారం మీ యింట్లో ఉంటుంది!" అని రాధ సర్దిచెప్తుంటే “బంగారం వస్తుంది సరే! మరీ నువ్వు యింటికి రావా?" అని విషయం అర్థం చేసుకోకుండా కంగారులో అన్నాడు గోపాలం.
రాధ పళ్ళుకొరుకుతూ "మిమ్మల్ని..! మీరు ముందు ఆఫీసుకి వెళ్లండి. నేను వచ్చేస్తా! బై!" అంటూ ఫోన్ కట్ చేసింది.
“ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపం?" అని అనుకుంటూ వేరే గత్యంతరం లేక ఎంతో ప్రేమగా కలిపిన రెండో కాఫీ కూడా తాగేసి, ఆఫీసుకి బయలుదేరాడు గోపాలం.
ఆఫీసుకి వెళ్లాడనే కానీ, గోపాలం మనసంతా రాధ మీదే ఉంది. ఎంత తొందరగా యింటికి వెళ్లి రాధని చూస్తానా అని తహతహలాడిపోతున్నాడు. నిమిషానికొకసారి చొప్పున రోజంతా గడియారం వైపు చూస్తూనే వున్నాడు. పోనీ! మేనేజర్ ని రెండు గంటల ముందు యింటికి వెళ్లడానికి పర్మిషన్ అడుగుదామంటే, మేనేజర్ మొదటికే చండశాసనుడాయో! పర్మిషన్ యివ్వకపోగా, యింకా ఎక్కడ గోలగోల చేస్తాడేమో అని అడగడానికి భయపడుతున్నాడు.
గోపాలానికి ఒక్కో క్షణం ఒక యుగంలా గడుస్తుంది. కంగారు తట్టుకోలేక రోజంతా తోక తెగిన నక్కలా, ఆఫీసు అంతా తిరుగుతుంటే, ఆఫీసులో తోటి ఉద్యోగులు విచిత్రంగా చూడసాగారు. చివరికి ఓర్పు నశించి ఏదయ్యితే అదయ్యింది అనుకుంటూ, రెండు గంటల పర్మిషన్ అడగడానికి మేనేజర్ క్యాబిన్ లోనికి వెళ్ళి “సార్!" అంటూ మేనేజర్ ముందు నిలబడ్డాడు గోపాలం.
“ఆఁ గోపాలం! నేనే నిన్ను..!" అని మేనేజర్ ఏదో చెప్పడం పూర్తికాకముందే, గోపాలం కంగారుగా "సార్! ఈరోజు మా ఆవిడ ఊరు నుండి వస్తుంది. స్టేషన్ కి వెళ్లి రిసీవ్ చేసుకోవాలి. మీరు పర్మిషన్ యిస్తే, నేను బయలుదేరుతాను!" అని దడదడలాడించేశాడు.
మేనేజర్ గోపాలాన్ని ఎగాదిగా చూసి “నేనే నిన్ను పిలుద్దామనుకుంటున్నాను. రేపు మన చైర్మన్ గారు ఇన్స్పెక్షన్ కి వస్తున్నారు. కాబట్టి, పెండింగ్లో ఉన్న అన్ని పైల్స్ ని ఆప్-డేట్ చేయాలి. ఈ పని నువ్వు సరిగ్గా చేస్తే నీకు ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు చెప్పు! ప్రమోషన్ కావాలా? పర్మిషన్ కావాలా?" అని మేనేజర్ భయపెట్టేసరికి, రెండు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ప్రమోషన్ కోసం రెండు గంటల ఫర్మిషన్ ఆలోచనల్ని ఆపి, పెండింగ్లో ఉన్న పైల్స్ పట్టుకుని "చఁ అనవసరంగా పర్మిషన్ అడిగాను. అడగకుండా సైలెంట్ గా ఉన్నా బాగుండేది. అడిగిన రెండు గంటల పర్మిషన్ రాకపోగా, యింకా రెండు గంటలు ఎక్కువ పనిచేయాల్సి వచ్చింది. అడిగి మరీ గుద్దించుకోవడమంటే యిదేనేమో!" అని నిట్టూరుస్తూ బయటికి వచ్చాడు గోపాలం.
గోపాలం చిరాకుగా "మేనేజర్ ఒక దరిద్రుడు! ఎప్పుడూ పర్మిషన్ అడిగినా ఆ బోడి ప్రమోషన్ ని అడ్డం పెట్టుకొని ఏదోక సోది చెప్తూనే ఉంటాడు. దరిద్రుడు!!" అని నొడుముకుంటూ తన సీట్లో కూర్చుని, కంప్యూటర్లో టైప్ చేయడానికి కీబోర్డ్ మీద దడదడ కొడుతుంటే, ఏదో డప్పులు కొట్టినట్లు వస్తున్న శబ్దానికి ఆఫీసులో ఉన్న వాళ్లంతా కీబోర్డు పగిలిపోతుందేమో అని గోపాలంవైపు భయంగా చూస్తున్నారు.
గోపాలం కొడుతున్న దంచి కొట్టుడుకి కీబోర్డ్ లో ఉన్న స్పేస్ కీ బటన్ ఎగిరి అవతలపడింది. ఆఫీసు ప్యూన్ రమేష్ ఆ స్పేస్ కీ బటన్ పట్టుకుని గోపాలం దగ్గరకి వచ్చి “ఏంటి సార్! ఉదయం నుండి చూస్తున్నా! గడియారాన్ని ఎవరో ఎత్తుకుపోతున్నట్టు నిమిషానికోసారి చూస్తున్నారు. ఏమయ్యింది సార్?" అని అడిగాడు.
గోపాలం కనీసం పైకి తలెత్తకుండా “అర్జెంటుగా నేను యింటికి వెళ్ళాలిరా. నన్ను ఏం మాట్లాడించకు!" అని అంటూ కీబోర్డ్ పై అదే వేగంతో కొడుతున్నాడు.
కాసేపు తర్వాత మేనేజర్ ముందు పైల్స్ పట్టుకుని ప్రత్యక్షమయ్యాడు గోపాలం. మేనేజర్ ఆశ్చర్యపోతూ గోపాలాన్ని చూస్తూ “ఒకరోజు పడుతుందనుకున్న పనిని రెండు గంటల్లో పూర్తి చేశావంటే, నువ్వు యిన్నాళ్లుగా సరిగ్గా పని చేయట్లేదన్నమాట!" అని అన్నాడు పైల్ ఓపెన్ చేసి తప్పులకోసం వెతుకుతూ.
"వామ్మో! యిదెక్కడ లాజిక్ రా సామి! యిక్కడ ఉంటే, మళ్ళీ ఏదో పని చెప్తాడురా బాబు!" అని మనసులో అనుకుంటూ “నేను వెళ్తున్నాను సార్!" అని అంటూ మేనేజర్ యింకా ఎంత చెప్పినా గోపాలం చెవికెక్కించుకోకుండా, అక్కడి నుండి గబగబా బయటకి వచ్చి, బైక్ తీసి యింటికి బయలుదేరాడు.
ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9:00 అయిపోయింది. బైక్ కూడా సరిగ్గా పార్క్ చేయకుండా, ఉక్కిరిబిక్కిరిగా పరిగెత్తుకొచ్చి తలుపు కొట్టాడు. ఉదయం ఫోన్లో చెప్పినట్టుగానే రాధ పట్టుచీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని, బాగా అలంకరించుకొని తలుపుతీసి గోపాలం ముందు నిలబడింది. గోపాలం గడిచిన మూడు నెలల విరహవేదన తన కళ్ళల్లోకి తెచ్చుకొని రాధని కన్నార్పకుండా అలా చూస్తూనే వుండిపోయాడు.
“చూసింది చాలు. లోపలికి రండి సార్!" అంటూ వయ్యారంగా నడుస్తూ లోపలికి వెళ్ళింది రాధ. ఒక్కక్షణం కూడా రాధ మీద నుండి తన చూపు మళ్ళించలేకపోయాడు గోపాలం.
రాధ నవ్వుతూ “ఏంటండి శ్రీవారు! ఏదో యిప్పుడే నన్ను కొత్తగా చూస్తున్నట్లు అలా చూస్తున్నారు. చూసేదేనా, చేసేదేమైనా ఉందా?" అని అడిగింది.
“ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావ్? ఇన్నాళ్లు జూలు విదిల్చిన సింహాన్ని జూ లో పెట్టడానికి ట్రై చేశారు. ఈరోజు బయటకు వచ్చిన ఆ సింహానికి, యి లేడి దొరికితే, ఏం చేస్తుందో! చూద్దువు గాని!" అని సింహంలా నడుస్తూ అన్నాడు గోపాలం.
“చాలు ఆపండి. మీరు! మీ సినిమా పంచ్ డైలాగులు! ముందు ప్రెషప్ అయ్యి వచ్చి, టిఫిన్ చెయ్యండి!" అంటూ గోపాలంని బాత్ రూంలోకి నెట్టింది రాధ కొంటెనవ్వు నవ్వుతూ.
ప్రెషప్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు గోపాలం. వేడివేడిగా వడ్డించింది రాధ. కూరలో కారం ఎక్కువైనా, పప్పులో ఉప్పు తక్కువైనా గోపాలం నోటికి ఏమీ కనిపించలేదు. రాధని చూస్తూనే అంత తినేశాడు. రాధ కూడా తినేసిన తరువాత గోపాలం గబగబా వెళ్లి చేతులు కడుక్కుని వచ్చి, రాధని అమాంతం అక్కడి నుండి ఎత్తుకొని వెళ్ళడానికి ప్రయత్నించగా “అయ్యో! ఉండండి. డైనింగ్ టేబుల్ మీద నుండి పాత్రలు కిచెన్ లో పెట్టి వస్తాను. లేకపోతే అవి పాడయిపోయి వాసన రావొచ్చు!" అని రాధ ఎంత చెప్పినా గోపాలం వినిపించుకోకుండా “పాడైపోయినా, సర్వనాశనం అయిపోయినా అనవసరం. ఇలా ఉంటే నేను పాడైపోతాను. ఇప్పుడు నిన్ను వదిలే సమస్య లేదు. ఇక ఆగడం నా వల్ల కాదు!" అంటూ రాధని బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళి, బెడ్ మీద పడేశాడు. తర్వాత మన్మధుడు ఆవహించిన గోపాలం, రాధ ప్రక్కన చేరి సరసలీలలు కానిచ్చాడు.
రోజు తొమ్మిది దాటాక యింటికి వచ్చే గోపాలం, ఒకరోజు ఆఫీసుకి మేనేజర్ రాకపోవడంతో తొందరగా ఆఫీసునుండి బయలుదేరి, ఆశపడి రాధ కోసం మల్లెపూలు తీసుకొని, ఇంటికి చేరుకునే సమయానికి రాధ టివిలో సీరియల్స్ చూస్తుంది. బోరుకొట్టింది కాబోలు, అందుకే సీరియల్స్ చూస్తుంది అనుకున్న గోపాలం, రాధ వెనకగా వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. సీరియల్ చూడడంలో తలమునకలైన రాధ ఒక్కసారిగా ఉలిక్కిపడి “అబ్బా! మీరేనా! ఉండండి. ఈ సీరియల్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది!" అని అంటూ మళ్ళీ యధావిధిగా టివిలో తలపెట్టేసింది.
రాధ నుంచి ఈ రియాక్షన్ ఊహించని గోపాలం నిరాశగా కుర్చీలో కూర్చొని షూ తీసుకుంటూ, రాధని గమనిస్తూ “రాధ! నువ్వు యింతకు ముందు సీరియల్ చూసేదానివి కాదు. ఇప్పుడు కొత్తగా సీరియల్స్ చూసే అలవాటు ఏంటి?" అని అడిగాడు.
“అబ్బా! ఉండండి. ఈ సీరియల్ చాలా బాగున్నాయండి!" అని కనీసం ప్రక్కకు కుడా చూడకుండా అంది రాధ.
"సరేలే! ఈ సీరియల్ అయిపోతే చుద్దాం!" అని అనుకుంటూ, ప్రెషప్ అవ్వడానికి లోపలికి వెళ్లాడు గోపాలం. కాసేపు తర్వాత తిరిగివచ్చి చూస్తే రాధ అలాగే తిష్ట వేసుకుని కుర్చీలో కూర్చుంది. ఆరున్నరకు మొదలుపెట్టి రాత్రి తొమ్మిదిన్నర వరకు గ్యాప్ లేకుండా ఒక సీరియల్ తర్వాత యింకో సీరియల్ చూస్తూ, సీరియల్ కి సీరియల్ మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ గ్యాప్ లో వేరే ఛానల్లో యింకో సీరియల్ కవర్ చేస్తూనేఉంది. ఎంతో ఆశతో ఆఫీసు నుండి యింటికి పరిగెత్తుతూ వచ్చిన గోపాలం, రాధ వింతప్రవర్తన చూసి అయోమయంలో పడ్డాడు. పుట్టింటికి వెళ్ళిన మూడునెలల్లో రాధ పూర్తిగా మారిపోయింది.
“సీరియల్ తర్వాత సీరియల్ అయిపోతున్నాయి. కానీ, నువ్వు యింకా అలానే కుర్చున్నావ్! తొమ్మిదిన్నర అవుతుంది. వంట ఎప్పుడు చేస్తావ్? ఎప్పుడు తింటాం?" అని ఎడ్వర్టైజ్మెంట్ సందులో అడిగాడు గోపాలం.
“అదేంటోనండి! ప్రతి సీరియల్ మన జీవితాల్ని పోలిన కథలలాగే అనిపిస్తుంది! అయినా, ఆల్రెడీ కూరగాయలు కట్ చేసేశాను. యిదిగో, యిదే చివరి సీరియల్. అయిపోతే చిటికెలో వంట చేసేస్తా!" అని రాధ చెప్పిన సమాధానానికి, అప్పటికే కడుపులో ఎలుకలు ముదిరి పందికొక్కులుగా పరిగెడుతున్న గోపాలానికి గట్టిగా కాలింది. అలిగినట్టు బెడ్ రూంలోకి వెళ్లి, దొంగచాటుగా రాధని చూస్తున్నాడు.
వెంటనే రాధ టక్కున లేచి, కిచెన్ లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి, బల్లిలా తలుపుకి వ్రేలాడుతూ సీరియల్ చివరిలో వచ్చే రేపటి భాగం వరకు చూసింది. రాధ చాలా బాగా వంటలు చేస్తుంది. కానీ, యిమధ్యన తను చేసిన వంటలు ఎందుకు మాడిపోతున్నాయో, కూరలో ఉప్పు, కారం ఎందుకు ఎక్కువ తక్కువ అవుతున్నాయో కారణాలు గోపాలానికి బోధపడ్డాయి.
అన్ని సీరియల్స్ అయిపోయిన తర్వాత చక్కగా గోపాలం తెచ్చిన మల్లెపూలు పెట్టుకొని, రెడీ అయ్యి బెడ్ రూంలో ఉన్న గోపాలం దగ్గరికి వెళ్ళింది. అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఉండదనట్టుగా, అప్పటికే, గోపాలం ఆకలితో పడుకుండిపోయాడు. రాధ ఎంతలేపినా గోపాలం లేవలేదు. ఇక, రోజు యిదే కథ జరగడం షరా మాములు అయిపోయింది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం
హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన
ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.
ఐదు బహుమతులు గెలుచుకున్నాను.
@seera4501 • 2 days ago
Manchi family story thammu. Nice
@KoliyaS • 2 days ago
Nice ra saii
Nice Story. Awesome 👍