'Sikhandi' written by P. Purnima
రచన : పి. పూర్ణిమ
తన ఆలోచనలతో పోటీ చేస్తూ వేగంగా దూసుకుపోతుంది రైలు బండి. కదులుతూ తన వెంటే పరిగెడుతూ తనని ఓడించలేక ఆగిపోతున్న చెట్ల వంక చూస్తూ తన గతం లోకి వెళ్ళింది సిరి..
“ఒరేయ్ శ్రీ.. ఈ రోజు మా ఇంట్లో ఎవరూ లేరు రా. నీకు ఇదే మంచి సమయం. వచ్చేయి!” అంటూ శ్రీ చెవిలో చిలిపిగా,మెల్లిగా చెప్పింది సౌమ్య. పదమూడు ఏళ్ల శ్రీ లోలోపల సంబరపడిపోతూ ఇంటికి పరుగు తీసాడు.నవ్వుతూ సైకిల్ వేసుకొని సౌమ్య వెళ్లిపోయింది.
గబ గబ బీరువా నుంచి తీసిన వస్తువులు చప్పుడు కాకుండా తీసి తన స్కూల్ బ్యాగ్ లో పెట్టేసి,సైకిల్ మీద ఎక్కి ఇంటి అరుగు మీద రుబ్బుడు రోలు లో పిండి రుబ్బుతున్న అమ్మ తో ‘సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా!’ అని అరుస్తూ వెనక్కి కూడా చూడకుండా వెళ్లిపోయాడు.
వెనకాలే ‘ఇప్పుడు ఎందుకు రా?’ అని అరుస్తున్న అమ్మ మాటకి సమాధానంగా ‘చదువుకోవడానికి.. గంటలో వచ్చేస్తా’ అంటూ సైకిల్ స్పీడ్ గా పోనిచ్చాడు. పది నిమిషాలు పట్టే దారి అది. కానీ శ్రీ స్పీడ్ కి నాలుగు నిమిషాల్లో చేరిపోయాడు.
సౌమ్య తన కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది. రాగానే గబ గబా మెట్లు దిగుతూ సైకిల్ దగ్గరికి పరుగు తీసింది. పొడవుగా ఉన్న తన పట్టు లంగాని చేతులతో కాస్త పైకి ఎత్తి… ఆయాస పడుతూ “ఇంత ఆలస్యం ఏమిటి? అమ్మా వాళ్ళు వచ్చేస్తారు ..అంటూ శ్రీ చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది సౌమ్య.
“ఆగు సౌమ్యా!” అంటున్న తన మాట వినకుండా పరిగెడుతూ పట్టుకెళ్లింది. ఆయాస పడుతూ ఇద్దరు సౌమ్య గదిలో వున్న మంచం మీద కూర్చున్నారు ....
“అన్నీ రెడీ నా…”
“ఓ...ఎప్పుడో! నువ్వే ఆలస్యం” అంది సౌమ్య.
ఒక్కసారిగా వచ్చిన ట్రైన్ హారన్ కి కిటికీకి ఒరిగి ఆలోచిస్తూ పడుకున్న శ్రీ(సిరి) ఉలిక్కి పడి లేచింది. కిటికీ నుండి బయటకి తొంగి చూసింది. తను దిగాల్సిన చోటు వచ్చేసింది అని గుర్తుకు వచ్చింది.
స్టేషన్ అంతా గోల గోలగా వున్నారు. ఆ ఫ్లాట్ ఫామ్ వంక చూస్తూ వుంటే పరిగెడుతూ వచ్చి పదేళ్ల క్రితం తను ఎక్కిన సంఘటన గుర్తు వస్తుంటే తన పెదవులపై చిన్న నవ్వు! అది ఎందుకు అని తనకి కూడా అర్ధం కాలేదు. ముందుకు వస్తున్న తన జుట్టుని ముని వేళ్ళతో వెనక్కి సర్దుతూ ముందుకు కదిలింది. ఇల్లు పక్కనే అవ్వడంతో ఆటో వాళ్ళు అడుగుతున్నా వద్దు అని సమాధానం ఇస్తూ నడుస్తూ వెళ్ళింది. దారిలో అందరూ తనని చూస్తూ నవ్వుకోవడం, గుసగుసలు పెట్టుకోవడం వినిపిస్తూనే ఉన్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా చిరునవ్వే సమాధానంగా వెళ్తోంది సిరి. నీలిరంగు పెయింట్ వేసిన తలుపుని చూసి తట్టబోయి చెయ్యి వెనక్కి పెట్టుకుంది. మళ్ళీ తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న మెమెంటో వంక చూస్తూ పిడికిలి బిగించి తలుపు తట్టింది. తెరవని తలుపుల వంక చూస్తూ మళ్ళీ తట్టింది. ఈసారి తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు తీసిన ఆమె తన వంక కింది నుండి పై వరకు చూస్తూ “ఏవండీ!” అంటూ లోపలికి పరుగు తీసింది.
శ్రీ చిరునవ్వుతో లోపలికి అడుగు పెట్టింది. అందరూ శ్రీ ని చూసి కుర్చీలోంచి లేచారు. శ్రీ అందరి వైపు చిరునవ్వుతో చూసింది. అందులోంచి వాళ్ళ అక్క పరిగెడుతూ వచ్చి శ్రీని హత్తుకుంది. సిరి హత్తుకునే లోపే అక్క స్వరంలో అవరించిన ఏడుపుతో “ఏమయింది అక్కా!” అంటూ భుజాలను పట్టుకుని అడిగింది సిరి.
“అమ్మ చనిపోయింది రా…” అంటూ బోరు మంది అక్క. సిరి ఒక్క సారిగా కుప్ప కూలిపోయింది..అందరూ వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ గొడవలోనే వున్నారు. పెద్ద అన్నయ్య, చిన్న అన్నయ్య ఇద్దరూ ఆస్తి పంపకాల గురించి గొడవ పడుతున్నారు. వాళ్ళ ముందుకు వెళ్లి “అమ్మ చనిపోయిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు?” అని పెద్దన్న చొక్కా పట్టుకుని అడిగింది సిరి. తన నుంచి ఏం సమాధానం లేదు. “ఎందుకు ఇలా చేసావు?” అని అరుస్తోంది సిరి, ‘అమ్మా! నీ చివరి చూపు కూడా చూడలేదు’ అని...
అంతలో అక్కడేవున్న తన బాబాయ్ లేచి…”నేనే చెప్పొద్దు అన్నాను” అని గంభీరంగా అన్నాడు..
“ఎందుకు బాబాయ్? నేను మిమ్మల్ని ఎం అన్నాను..ఎందుకు చెప్పలేదు?”
“నువ్వు వస్తే బంధువులందరి ముందు మేము తల వంచుకొవాలి.,.” అదే గంభీరమైన స్వరముతో అన్నాడు బాబాయ్.
“అవును. నేను వస్తే మీరు తల వంచుకోవాలి కదా! మరిచి పోయాను....కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా మంచం మీద పడి వుంటే పట్టించుకోని కొడుకుని చూస్తే మీకు తల వంపు కాదు” అంటూ పెద్ద అన్న వైపు చూసింది.
“రోడ్డు మీద వెళ్ళే ఆడపిల్లని ఏడిపించి జైలుకి వెళితే తల ఒంపు కాదు..” అంటూ చిన్న అన్న వైపు చూసింది.
“మీకు అలాంటి క్షణాల్లో నేను గుర్తు వచ్చాను. కానీ ఈ క్షణం లో రాలేదు కదా..హ్మ్మ్..అంతేలే..
ఆస్తి పంపకాలులో “ఇదిగో నీ వాటా! ఇది తీసుకొని వెళ్ళిపో. మళ్ళీ ఇక ఇలా ఇంటి వైపు రాకు!” అంటూ తన ముందు ఆస్తి కాగితాలు పెట్టి చుట్టూ చూస్తున్నాడు. తన చూపులకి అర్ధం, అర్థమయ్యింది సిరికి. చుట్టూ జనాలు బిల్డింగ్ ఎక్కి చూస్తున్నారు..
“మానవత్వం లేని మీ లాంటి మనుషులకి, ‘అసలు ఆస్తి’ అంటే ఏమిటో తెలీదు” అంటూ అమ్మ గదిలోకి వెళ్ళి బీరువా తలుపు తీసి అమ్మ పెళ్లి చీర తీసింది. ఆ చీరని తాకుతుంటే అమ్మ తనతో “గొప్ప వాళ్ళుగా మారడానికి లింగ భేదం, కుల మత బేధాలు అడ్డు రావు కన్నా! నువ్వు నలుగురి మెప్పు పొందినప్పుడు నీ జీవితానికి విలువ వుంటుంది. నీ జన్మ సార్థకం అవుతుంది” అని చెప్పి ఆమె ఒడిలో పడుకున్న తన తల నిమురుతూ చెప్పిన సంగతి గుర్తు వచ్చింది..సిరి కంట్లో కన్నీళ్లు చెమ్మగిల్లాయి .. ఆ చీరని గుండెకి హత్తుకుని, అందులో తన నాట్యానికి మెచ్చి ఇచ్చిన రాష్ట్ర స్థాయిలో వచ్చిన బహుమతిని అందులో మడత పెట్టీ బ్యాగ్ లో పెట్టుకొని, ముందు గదికి వెళ్ళి “నా వాటా నేను తీసుకున్నాను. ఇక వచ్చి మిమ్మల్ని అవమాన పరచను. వెళ్తున్నా!” అంటూ ముందుకు కదిలింది. అదంతా చూస్తున్నా సిరి వదినలు గుసగుసలు చెప్పుకుంటూ నవ్వుకున్నారు.
ఆ నవ్వులు వింటూ ముందుకు కదిలిన సిరి, తలుపు దగ్గరికి వెళ్లి వాళ్ళ వంక చూస్తూ “వదినలూ! రేపటి కాలంలో మీకు మా అమ్మ లాంటి రోజు రాదు అని అనుకోకండి” అంటూ చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయింది.
మళ్ళీ వెళ్లి ట్రైన్ ఎక్కింది. ఒక అమ్మాయి కింద వర్షానికి పడిన నీటికి తన పట్టు లంగా తడవకుండా పైకి పట్టుకొని నడుస్తోంది. అదంతా కిటికీ నుండి చూస్తున్న సిరికి మళ్ళీ గతం గుర్తు వచ్చింది.
‘సౌమ్య పేరుకు తగ్గట్టే ఎంతో మంచిది. చిన్ననాటి నుండి కలిసి చదువుకున్నాం. నా ప్రియ నేస్తం..నన్ను అర్ధం చేసుకొని ఆ రోజు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మంది’ అని ఆలోచిస్తూ ఆ రోజు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంది.
“ఇదిగో సిరీ! నువ్వు కూర్చో ...అమ్మ ఆషాడ మాసం అని గోరింటాకు పెట్టింది. చూడు ఎంత బాగా పండింది” అని తన అరచేతిని చూపిస్తూ ఆత్రుతగా చూస్తున్న శ్రీ వంక చూస్తూ “ఇదిగో కుంకుమ నీళ్ళు. నువ్వు గోరింటాకు పెట్టుకుంటే అందరికీ నీ గురించి తెలిసిపోతుంది. అందరూ ఎగతాళి చేస్తారు కదా! ఈ కుంకుమ రంగు కడిగేస్తే పోతుంది కానీ వున్నంత సేపు అచ్చం గోరింటాకులానే వుంటుంది” అని శ్రీ చేతులకి అద్ధి..తను బ్యాగ్ లో తెచ్చుకున్న అమ్మ చీరని కట్టి ,అద్దం లో చూసుకుంటూ మురిసి పోతున్న క్షణంలో ఒక్క సారిగా గది తరుపులు తెరుచుకున్నాయి. సౌమ్య అమ్మ నాన్న వాళ్ళని అలా చూసి “ఏం చేస్తున్నారు” అని సౌమ్య చెంప మీద గట్టిగా లాగి కొట్టాడు సౌమ్య నాన్న. “నువ్వు ముందు ఇంటి నుంచి పోరా!” అని బయటకి నెట్టేసాడు శ్రీని .
శ్రీకి ఏం చేయాలో అర్ధం కాలేదు. ‘తన డ్రెస్ లోపలే ఉంది . తను ఇప్పుడు ఇలా చీరలో ఇంటికి వెళితే అందరికీ తన గురించి తెలిసిపోతుంది. ఎలా?’ అని ఆలోచిస్తూ ‘నాన్న ఏం అంటాడు’ అని ఆలోచిస్తూ, ఏడుస్తూ ‘ఎప్పటికైనా తెలియక తప్పదు కదా!’ అని ధైర్యం చేసి ఏడుస్తూ బయల్దేరింది సిరిగా మారిన శ్రీ. రోడ్డు మీద అందరూ నవ్వుతున్నా ఏం చేయలేక, అలాగే తల కిందికి దించుకొని ఇంటికి వెళ్ళింది.
తలుపు తీసి చూసిన నాన్న కొట్టాడు. అన్నలు అక్కలు తిడుతున్నారు. అమ్మ ఒక్కతే వాళ్ళతో వాదిస్తోంది. ఇంట్లోకి రావద్దు అనే నాన్నతో వాదించి, ఇంట్లోకి అయితే తీసుకొని రాగలిగింది కానీ అర్ధరాత్రి నాన్న చంపెయ్యడానికి పూనుకున్నాడు అని గ్రహించలేక పోయింది. నాన్న నన్ను చంపడానికి కత్తి పట్టుకొని వచ్చే వరకు తెలియలేదు నిన్నటి వరకు నన్ను ముద్దు చేసిన నాన్నకి నన్ను చంపేంత కోపం వచ్చేసింది అని. అమ్మ అది చూసి నాన్నని ఆపుతూ తన గోరింటాకు చేతులకి వున్న బంగారు గాజులు తీసి నా చేతిలో పెట్టి దూరంగా పారిపో' అని నెట్టేసింది.
అవి పట్టుకొని ప్రాణ భయంతో పారిపోయిన నేను అమ్మ గాజులతో నాకు ఇష్టం అయిన నాట్యం నేర్చుకొని నాలాంటి వాళ్ళతో బ్రతుకుతూ సమాజంతో యుద్ధం చేస్తూ ఇప్పుడు ఇలా...కానీ అమ్మకి నా విజయం చూపలేక పోయా అని ఆలోచిస్తూ అమ్మ చీరని గుండెలకు హత్తుకొని లోపలే కుమిలి పోయింది సిరి..
తన లాంటి వారిని తన లాగానే ముందుకు నడపాలి అనే దృడ సంకల్పంతో ముందుకు కదిలింది (శిఖండి )సిరి..
ఆ శిఖండి..అబ్బాయిలా మారి శారీరిక యుద్ధాన్ని మొదలు పెట్టింది....నా కథలో శ్రీ(శిఖండి)అమ్మాయిలా మారి ఎంతో మంది తన లాంటి వారిని తనలా ముందుకు నడపాలి అనే దృడ సంకల్పంతో సమాజంతో మానసిక యుద్ధం మొదలు పెట్టింది..
***శుభం***
ความคิดเห็น