top of page

సింగినాదం జీలకర్ర

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Singinadham Jilakarra ' New Telugu Story


Written By Dasu Radhika


రచన: దాసు రాధిక


కారు గరాజులోకి తీసుకొచ్చి ఆపాడు ఆనంద్. కుడి పక్కకు వెళ్లి కారు డోర్ తీసి నిలబడ్డాడు... ఒక అరవైఐయిదేళ్ల పెద్దావిడ అందులోంచి తన హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని దిగింది.


"వెల్కమ్ హోమ్ అమ్మా" అన్నాడు ఆనంద్ తల్లి వైపు వెలిగిపోతున్న మోహముతో, సంతోషము పట్టలేక...


" ముందు మీ నాన్న కు ఫోన్ చేసి చెప్పు రా, నేను క్షేమంగా చేరానని... కాసేపట్లో మాట్లాడుతా నేనె" అన్నది ఆనంద్ తల్లి శ్రీదేవమ్మ.


ఇంతలోకే కారు చప్పుడు కి గరాజు లోనుండి ఇంట్లో కి వెళ్లే తలుపు తెరుచుకొని, కోడలు పద్మ గబగబా వచ్చి పెట్టెలు లోపల పెట్టేందుకు తన భర్తకు సాయము చేస్తూ, అత్తగారిని పలకరించింది, " హాయ్ అత్తయ్య, బాగున్నారా, ప్రయాణం బాగా జరిగిందా" అని.


శ్రీదేవమ్మ బానే జరిగిందని నవ్వుతూ సమాధానము చెబుతూనే లోపలికెళ్లింది.

ముందుగా వచ్చింది భోజనాల గది, పక్కనే వంటిల్లు. అందుకని శ్రీదేవమ్మ కాళ్ళు కడుక్కోవాలంది. ఆనంద్ ఆమె కు ఇంట్లో వేసుకునే చెప్పులు చూపించి వేస్కోమన్నాడు.


"ఎంత తక్కువ తడి లోకి వెళ్తే అంత మంచిది" అన్నాడు ఆనంద్.


"అయినా నువ్వు కూడా ఇలా అయిపోయా వేంటమ్మా , ఇది నాన్న పద్ధతి కదా" అన్నాడు.


"కాదురా, ముందే తినే చోటికి వచ్చాం... అందుకే అడిగాను.. దొడ్డి దోవన ఇంట్లోకి జొరబడ్డట్లుందిరా, ఇంటి వాకిలేది?" అడిగింది శ్రీదేవమ్మ.

"ఇక్కడ ఇన్తేనమ్మా" అన్నాడు కొడుకు. అన్నింటికీ కలిపి అదే జవాబు...


"పిల్లలేరి పద్మా?" అడిగింది అత్తగారు.


"వస్తారత్తయ్య, ఎదిరింట్లో బర్త్డే పార్టీ కి వెళ్లారు. దిగబెట్టి వచ్చాను. తిరిగి క్యాటీ అంటే క్యాథరీన్.. మా ఎదిరింటావిడ తీసుకొస్తుంది" అని అన్నది పద్మ.


ఒక అర గంట లో భోజనము చేశారు ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ... శ్రీదేవమ్మ ఆ అరగంట లో ముందుగా కొంత సామాను బయటకు తీసింది... ఇండియా నుండి అందరూ తీసుకెళ్ళి నట్లే పచ్చళ్లు, పొళ్ళు, కొడుకు కుటుంబానికి ఇష్టమైన మిఠాయిలు, పిల్లలుకు ఆట వస్తువులు, కొన్ని సాంప్రదాయ దుస్తులు, కోడలడిగిన వంటింటి సామాన్లు...


కొడుకు ఆనంద్ అవన్నీ కిందికి తీసుకెళ్లాడు. అప్పుడు తన భర్త రామ్ కు ఫోన్ చేసి మాట్లాడింది. తర్వాత స్నానం చేసి కిందికి వెళ్ళింది.

"పద్మా! నేను వచ్చాను గా , నేను చేస్తాలే", అన్నది శ్రీదేవమ్మ.


"రేపొక్కరోజు ఆగండత్తయ్యా, ఎల్లుండి నుండి ఇక మీకు తప్పదు. ఆ రాత్రికే నా ప్రయాణం. ఈ లోపల మీకోసారి అన్నీ చూపిస్తాను ఇంట్లో, ముఖ్యంగా వంటింట్లో" అంది పద్మ...


ఇంతలో ఒక ఆడ గొంతు వినిపిచింది , " హాయ్ పాడ్స్" అని క్యాటీ పిలుపు...


ఇద్దరు పిల్లలూ కేరింతలు కొడుతూ లోపలికి దూసుకొచ్చారు. ఆనంద్ మీద కు అమాంతము ఎక్కేసి "డాడీ, ఇట్ వస్ ఎ గ్రేట్ పార్టీ(నాన్నా పార్టీ చాలా బావుంది)...." ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు.


"గుడ్ లక్ పాడ్స్ ఫర్ యువర్ ట్రిప్" అని వెళ్లిపోయింది క్యాటీ.


"పాడ్స్ ఏంటి పద్మా ... చక్కటి పేరు కదా" శ్రీదేవమ్మ కోపంగా చూసింది కోడలి వైపు...


"నేను మీకు చెప్పేదేముంది అత్తయ్యా, మీకు నా కంటే అమెరికా సంగతి బాగా తెలుసు గా... మీ పినమ్మ ఇక్కడే స్థిర పడి పోయారుగా"... అన్నది పద్మ నవ్వుతూ.


అప్పుడు కానీ పిల్లల దృష్టి నాయనమ్మ మీద పడలేదు.


ఆనంద్ వెంటనే పిల్లల తో "క్రిష్, చై, సే హై టు నాయనమ్మ" అన్నాడు.


"హాయ్ నానమ్మా" అన్నారు ఇద్దరూ.


"కృష్ణ ని క్రిష్, చైతాలి ని చై ఏంటి ఆనంద్?? ఆ క్యాటీ ఏమో పద్మను పాడ్స్ అని సంబోధించింది. అదంటే అమెరికన్, మనమెందుకు మన పేర్లు వాళ్ల లా పలకడం...?ఒక్క ఏడాదిన్నర లో మీరు పూర్తిగా మారిపోయారు రా... ఏదో ఉద్యోగం లో ఉన్నత స్థాయి కోసం వెళ్ళాలమ్మా అమెరికా అంటే సరేలే అనుకున్నా... నా చేతుల్లో పెరిగావు కదా, ఇక్కడ సంస్కృతి, పద్ధతులు నీకు నీ కుటుంబానికి అంట కుండా జాగ్రత్త పడతావనుకున్నాను రా... వేష భాషాలింతో అంతో మారుతాయని ఊహించినా...మనల్ని బట్టే మన పిల్లలు ఆనంద్, గుర్తు పెట్టుకో... కృష్ణ కు నాలుగేళ్ళు నిండి అయిదు వచ్చింది, చైతాలి కు ఏడు నిండి ఎనిమిది వచ్చింది... పిల్లలు కు ఈ వయసు లో అన్నీ తొందరగా వంట పడతాయి. అలా అని వాళ్లకు మన భాష, పద్ధతులు మనము నేర్పుకోక పోతే, వాళ్ళు ఎక్కడుంటే అక్కడివే నేర్చుకుంటారు.." అని మందులు వేసుకుంటూ, "ఆ సీసా ఇటివ్వు" అన్నది శ్రేదేవమ్మ ఆనంద్ తో...


"వాట్ అబౌట్ seesaw( పైకి కిందకి ఊగే బల్లకూర్పు, పార్కుల్లో ఉంటుంది)

-Seesaw అని ఏమంటోంది- అని అడిగాడు కృష్ణ...


"ఓహ్ క్రిష్, నానమ్మ కు బాటిల్ కావాలనడిగింది" అన్నాడు ఆనంద్...


"వై డాడీ షీ సేడ్ సీసా ఫర్ బాటిల్(బాటిల్ కి సీసా అనెందుకన్నది)" అన్నాడు కృష్ణ.


"వీడికి తెలుగు లో మాట్లాడితే అర్ధమైందిగా, ఆనంద్! ఇంట్లో పిల్లల తో తెలుగే మాట్లాడండి రా.. నువ్వు, పద్మ" అన్నది శ్రీదేవమ్మ.


"ఏదో ఈజీ గా అయిపోతుందని అన్నీ అలా చేస్తున్నామమ్మా, పని ఒత్తిళ్ల వల్ల" అన్నాడు ఆనంద్.


"మా నాన్న అలా అనుకుంటే నాకూ తెలుగు వచ్చేది కాదానంద్... నీకు చాలా సార్లు నీ చిన్నప్పుడు చెప్పాను, మీ తాతయ్య వృత్తి రీత్యా బొంబాయి, ఢిల్లీ లో ఎక్కువ కాలం ఉండడం వల్ల నాకు తెలుగొచ్చేది కాదు, మరాఠీ, పంజాబీ లో ధారాళంగా మాట్లాడేదాన్ని.


ఆ తర్వాత సరాసరి గుంటూరు వస్తే నా పరిస్థితి అయోమయం అంధకారం అయిపోయింది... అప్పటికీ పెద్ద బాల శిక్ష కొని, మీ తాతయ్య నా ఆరో తరగతి లో తన మిత్రుడి దగ్గరకు తెలుగు నేర్చుకోమని పంపారు ఒక రెండు నెలలు, ఆ సంవత్సరం వేసవి సెలవలలో... చాలా సార్లు చెప్పాను నీకు"...


"వాట్ ఆర్ యూ సేయింగ్ నానమ్మా(నువ్వేమంటున్నావు)

అని చైతాలి అడిగింది.


"యు అర్ టూ ఫాస్ట్( నువ్వు చాలా తొందరగా మాట్లాడుతున్నావు)..."


"ఆ, ఏమీ లేదు, సింగినాదం జీలకర్ర" అని శ్రీదేవమ్మ పద్మ, ఆనంద్ లకు ఇక పడుకుంటానని చెప్పి మేడ మీద కు వెళ్ళిపోయింది.


"డాడీ, వాట్ ఈజ్ సింగినాదం జీలకర్ర?( అంటే ఏంటి)" అని చైతాలి అడిగింది..


"నథింగ్" అన్నాడు ఆనంద్...


"క్రిష్, చై.. యూ మస్ట్ స్లీప్ నౌ( పిల్లలు మీరు ఇంక పడుకోవాలి) అని పద్మ అంటే, ఆనంద్ అన్నాడు, " ఇప్పుడే అమ్మ చెప్పింది గా పద్మా, తెలుగు మాట్లాడమని పిల్లల తో, అదే చేద్దాం... పది ఇంగ్లీష్ పదాలకు ఒక తెలుగు పదము పెట్టామనిపించి మాట్లాడడం మనకి అలవాటైపోయింది ఇక్కడికొచ్చాక అందరి లాగా... మా అమ్మ చూడు తెలుగు మాట్లాడేటప్పుడు ఇంకో భాష పదము రానివ్వదు..."


చైతాలి తన మంచమెక్కుతూ "నానమ్మ తెలుగు ఈజ్ హార్డ్, డాడ్ ఐ నో యువర్ తెలుగు (నానమ్మ తెలుగు కష్టంగా ఉంది, మీ తెలుగు నాకు తెలుసు నాన్న)" అన్నది.


ఆనంద్ దుప్పటి కప్పుతుంటే. "ఐ లైక్ సింగినాదం జీలకర్ర(నాకు నచ్చింది). ఇట్ ఈజ్ సో ఫన్నీ(చాలా తమాషాగా ఉంది)" అంటూ తండ్రికి ముద్దు పెట్టింది చైతాలి...

పద్మ ఆఫీసు పని మీద ఒక రెండు నెలలు యూరోప్ వెళ్ళింది, ఇంకో నలుగురు తోటి ఉద్యోగస్తుల తో పాటు. అందుకే అత్తగారు హైదరాబాద్ నుండి కాలిఫోర్నియా వచ్చారు, పిల్లల్ని, ఇంటిని చూసుకోవటం కోసం. పద్మ తల్లి ఒక నాలుగేళ్ళయింది కాలం చేసి. శ్రీదేవమ్మ ది ఒక నాలుగు నెలల పర్యటన. పద్మ వచ్చిన తర్వాత రామ్ కాలిఫోర్నియా రెండు నెలల కోసం వస్తే, ఇద్దరూ కలిసి ఇక్కడ ఒక వారం ఉన్నాక, అమెరికా లో ఉన్న తమ దగ్గర బంధువులు, మిత్రులను చుట్టబెట్టి, వెనక్కి వచ్చి రెండు వారాలు కొడుకు దగ్గర ఉండి తిరిగి ఇండియా వెళ్లే యోచన...


బెంగుళూరులో పెద్ద ఐటీ కంపెనీ లో స్థిరమైన ఉద్యోగము లో ఉండేవాడు ఆనంద్. పద్మ తో ఒక పదేళ్ళయింది పెళ్లయి... రెండేళ్ల క్రితం బెంగుళూరు నుండి కాలిఫోర్నియా కు వచ్చాడు ఆనంద్. పద్మ, పిల్లలు ఆరు నెలల తర్వాతొచ్చారు ... శ్రీదేవమ్మ అప్పుడు కుడా హైదరాబాద్ - బెంగుళూరు మధ్య తిరుగుతూ ఉండేది అవసరాన్ని బట్టి... ఇక పై ఈ రకంగా అమెరికా - ఇండియా తిరగాలో ఏమో.. అనుకుంటూ వచ్చింది మొదటి సారి అమెరికా.

"కృష్ణా, చైతాలి, ఎంటర్రా, గొడవ పడకండి" అని సర్ది చెప్తున్నప్పుడు ఆనంద్ వచ్చాడు ఆఫీసు నుండి ఇంటికి...

"ఏంటమ్మా.. ఏంటి" అంటే తల్లి " ఏమీ లేదు రా. వడ్లగింజ లో బియ్యపు గింజ.. కృష్ణ దాని పెన్సిల్ తీసుకొని ఇవ్వట్లేదు వెనక్కి, అది అందుకని వాడి కార్లు దాచేసింది వాడికి తెలియకుండా" అన్నది.


చైతాలి " జీసస్, వడ్ల గింజ లో .... వాట్ ఐస్ ఇట్? " ( మనము దేవుడా అన్నట్లు అమెరికా లో అందరూ మాటకు ముందు జీసస్ అంటారు. 'వడ్ల గింజ లో' ఏమంటోంది).

కృష్ణ కూడా ఒక నిమిషం గొడవ గురించి మర్చిపోయి, నానమ్మ వైపే చూస్తున్నాడు...


"మీన్స్ నథింగ్"( అంటే ఏమి లేదు) అన్నాడు ఆనంద్ కూతురి తో...


" హౌ కెన్ ఎవెర్య్థింగ్ షీ సేస్ మీన్ నథింగ్?( ఆమె ఏమి మాట్లాడినా దాని అర్ధం ఏమి లేదు, అది ఎలా)" అన్నది చైతాలి.


ఈ లోపల శ్రీదేవమ్మ కృష్ణ కార్లు వాడికి వెతికి తెచ్చి ఇచ్చింది. ఆ రోజు కు పడుకున్నారు ఇద్దరూ.


ఆనంద్ తొమ్మిదింటికి కూతురిని బడి లో దింపి పని కెళ్ళి, మధ్యాహ్నం మూడింటికి మళ్ళీ కూతుర్ని ఇంట్లో దింపి ఆఫీసు కెళ్తే రాత్రి ఎనిమిదికి తక్కువ రాడు.

" నీ చొక్కా విప్పేసావే రా?" అంటున్న తల్లి గొంతు విని ఆనంద్ గడ్డం గీసుకుంటూ పిల్లల గదిలోకి వెళ్ళాడు... చైతాలి అప్పుడే స్నానాల గది లోకి వెళ్ళింది. వీడికి అది పక్కనుంటే నానమ్మ భాష అర్ధం చెప్పటానికి బావుంటుంది, లేక పోతే వాడి పని గోవిందా...


"చొక్కా..?" అని చూసాడు.


ఆనంద్ వచ్చి "షర్ట్" అన్నాడు ...


కృష్ణ వెంటనే చూపించాడు. తన చొక్కా పై పాలు పడ్డాయి. అందుకే విప్పేసాడు...


"అమ్మా, ఇలా అయితే కష్టం, నీకు అర్ధం అవ్వట్లేదు" అన్నాడు ఆనంద్,


"ఐ వాంట్ చొక్కా" (నాకు చొక్కా కావాలి) అన్నాడు కృష్ణ..


శ్రేదేవమ్మ కొడుకు వైపు చూసి 'ఇదే నువ్వన్నదానికి నా సమాధానం' అని కృష్ణ కు వేరే చొక్కా తీసి వేసింది...


చైతాలి స్నానమయి వచ్చి తన బట్టలు వేసేస్కోని "నాన్నమ్మా జడ" అనటం విన్నాడు ఆనంద్...


తల్లి వైపు చూసి చేత్తో "ధమ్స్ అప్( బొటను వేలు పైకెత్తుట)" అన్నాడు...


ఒక రోజు ఆనంద్ ఆఫీసు నుండి పిల్లల భోజనం సమయానికే వచ్చేసాడు. కృష్ణ అరుస్తున్నాడు " నానమ్మా బల్ల దగ్గర కూర్చున్నాము నేను, అక్క.. మాకు స్టమక్ లో రాట్స్ వచ్చాయి"( కడుపు లో ఎలుకలు).

ఆనంద్ పక పకా నవ్వాడు... "కృషులు, సే కడుపు లో ఎలుకలు పరిగెత్తుతున్నాయి" అని వాడి ని ముద్దు చేసాడు.


"వాట్ ఈజ్ బల్ల డాడీ (బల్లంటే ఏంటి నాన్న)" అని వాడు వాళ్ళ నాన్న ను పరీక్షించాడు.


ఇట్ ఈజ్ టేబుల్( ఆదీ టేబుల్) అని వాడే హుషారుగా చెప్పేసాడు.


శ్రీదేవమ్మ బల్ల దగ్గరకొచ్చి ఒరేయ్ ఆనంద్ "నాన్న" అని చెప్పరా వాళ్ళ కు, డాడీ వద్దురా" అన్నది.

పద్మ రోజూ మధ్యాహ్నం, రాత్రి ఫోను చేస్తోంది పిల్లలతో, ఆనంద్ తో మాట్లాడటానికి... పిల్లలు వాళ్ళ నానమ్మ దగ్గర నేర్చుకుంటున్న పాండిత్యమంతా తల్లి దగ్గర గొప్పగా ప్రదర్శిస్తున్నారు కూడా... అలా ఒక రోజు కృష్ణ తల్లి తో మాట్లాడుతుంటే శ్రీదేవమ్మ వాడి మాటలను రికార్డ్ చేసింది.


"అమ్మా, నేను కూడా బడికి వెళ్తాను అక్క తో"


" నేను నానమ్మా పాము పాఠము, ఇంకా వామన గుంటలు, హై డెన్ సీక్, ఓహ్.. పార్డన్ మీ(క్షమించు).. దాగుడుమూతలు ఆడుకుంటున్నాము" అని మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడి తిప్పుకొని తెలుగు లో చెప్పాడు...


పద్మ అవాక్కైపోయింది... అత్తగార్ని చాలా మెచ్చుకుంది. "సగం రోజులు పిల్లల కు బయట నుండి పిజ్జాలు తెప్పిచి పెడతాం మేము, ఉద్యోగ బాధ్యతల్లో పడి.. రెండు పూటలా అన్నం పప్పు, కూర అంటే అది పండగే" అన్నది పద్మ.


"నీకెందుకీ ఉద్యోగం పద్మా? ఇప్పుడే పిల్లలకు నీ అవసరం." అన్నది శ్రీదేవమ్మ.


"మీ అబ్బాయి కి చెప్పండత్తయ్యా" అన్నది పద్మ.


"కష్టం అమ్మా, కావాల్సినప్పుడు రావు ఉద్యోగాలు, కాలిఫోర్నియా లో ఒక్క సంపాదన మీద హాయిగా బతకలేము" అన్నాడు ఆనంద్ తల్లి అడిగితే.


"అదృష్టవశాత్తు పద్మ కు మంచి ఉద్యోగం, పదోన్నతి త్వరగా జరిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా మంచిది" అని శ్రీదేవమ్మ కు అర్ధమయ్యే లా చెప్పాడు ఆనంద్.


ఆ రోజూ ఆదివారం. ఆనంద్ మిత్రులు, వాళ్ళ పిల్లలు అందరూ సరా సరి ఇంటికొచ్చారు ఆనంద్ తో పాటు. పిల్లల్ని తీసుకొని పొద్దున్నే ఏదో హడావిడిగా పక్కనున్న పార్కుకెళ్లాడు ఆనంద్. తిరిగి రావటం ఒక పది మందొచ్చారు... అప్పటికప్పుడు పలావు చేసి పెట్టింది శ్రీదేవమ్మ. మామూలు గా "టేకవే" తెచ్చుకునే వాళ్ళు(హోటల్ నుండి పార్సిల్)... కానీ తల్లి కోపడుతుందని ఆ పని చెయ్యలేదానంద్. ముందు రోజే మినప సున్ని, కాసిని కజ్జికాయలు, కారప్పూసా చేసింది శ్రీదేవమ్మ. అవన్నీ ఆ పూట ఖర్చైపోయాయి.


సాయంత్రం అందరూ వెళ్ళాక కొడుకు తో సంభాషిస్తూ " పిల్లలా వాళ్ళు... కాదు... పిడుగులు. ఎంత అల్లరి చేశారు రా... తా చెడ్డ కోతి వనమెల్ల చేరిచిందని ... మన కృష్ణ క్కూడా కాస్థ నేర్పివేళ్ళారు. వీపు విమానం మోత మోగించేవాళ్ళు లేకపోతే సరి..." శ్రీదేవమ్మ వచ్చిన పిల్లల గురించి తల పట్టుకుంది.


"ఎప్పుడైనా కలుస్తామమ్మా. వదిలేయటమే. పిల్లల మీద అరవటమే చెయ్యరుగా ఇక్కడ, నీకు తెలుసు, ఇంకా విమానం మోత అస్సలు సాధ్యం కాదు గా, కాప్స్(పోలీసులు) వచ్చి మనల్నే ప్రశ్నిస్తారు"..


"అవును రా, వాళ్ళని భరించలేక అన్నాను".


"షీ ఈజ్ రీఅల్లీ ఫన్నీ" (ఈవిడ చాలా తమాషా మనిషి) అని కృష్ణ వాళ్ల అక్క తో మెల్లగా అన్నాడు... అలిసిపోయి పిల్లలు ఇద్దరూ పడుకున్నారు.

ఒక నెల గడిచిందిలా...


ఒక రోజు ఆనంద్ ఇంటినుండే ఆఫీసు పని చేసుకుంటూ మిగిలిన తన పనులు కూడా చేసుకున్నాడు ...ఇంటికి సంబందించిన ఎన్నో పనులు... ఆ రోజూ నానమ్మ ను పిల్లలు అన్నం పెట్టేటప్పుడే చూసారు. తన గదిలోనే ఉంది తలుపేసుకొని ... కృష్ణ మెల్లగా గది లోకి ప్రవేశించాడు ఆవిడకు తెలియకుండా... ఇంగ్లీషు లో మాటలు వినిపిస్తున్నాయి వాడికి...


"ఐ ఆమ్ ఇన్ అమెరికా విత్ మై సన్. ఐ హేవ్ స్టోప్పడ్ టేకింగ్ ఇంగ్లీష్ క్లాసెస్, ఐ ఆమ్ సారి Mr. Kumar. ఐ కెన్ రేకామెండ్ యువర్ డాటర్ టు మై ఫ్రెండ్ Mrs. John ఇఫ్ యూ లైక్"( నేను అమెరికా లో ఉన్నాను మా అబ్బాయి దగ్గర, నేను ఇంగ్లీష్ క్లాసులు తీసుకోవటం మానేసాను, క్షమించండి కుమార్గారు. మీ కూతురికి ఇంగ్లీష్ చెప్పమని నా స్నేహితురాలు Mrs.John కు సిఫారిష్ చేయగలను )అన్నది శ్రీదేవమ్మ...


కృష్ణ కు అర్ధం కాకపోతే గా... పరిగెత్తుకొని బయటకొచ్చి వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి "నానమ్మ కు ఇంగ్లీష్ వచ్చు నాన్న" అన్నాడు.


ఆనంద్ "నాకు తెలుసు" అన్నాడు. ఇల్లంతా శుభ్రం చేస్తున్నాడు. చైతాలి ను కూడా గది లోకి తీసుకెళ్లాడు కృష్ణ...


నానమ్మ ఇంకో ఫోన్ మాట్లాడుతోంది ఈ సారి, "ఇట్ ఈజ్ నాట్ ఈజీ రామ్ , టేకింగ్ అప్ క్లాసెస్ ఆన్లైన్. ఇఫ్ ఐ సే యెస్ టు కుమార్, ఐ నో మోర్ విల్ జాయిన్. (ఆన్లైన్ క్లాసులు తీసుకోవటం అంత తెలిక కాదు రామ్.నేను కుమార్ కూతురికి ఒప్పుకుంటే ఇంకా బోలెడు మంది వస్తారు )మీరొచ్చాక అస్సలు కుదరదు... కుమార్ అడిగినంత మాత్రాన మీరు నా తరఫున మాటిచ్చేస్తే ఎలా?"


"ఇట్ ఈజ్ ఒకే శ్రీ , యెస్ చెప్పు" అన్నాడు రామ్ పెళ్ళాం తో...


శ్రీదేవమ్మ ఫొన్ పెట్టెయ్యగానే "యు నో ఇంగ్లీష్?" అని కళ్ళు గొంతూ పెద్దవిచేసి అడిగింది నాయనమ్మను చైతాలి...

శ్రీదేవమ్మ నవ్వి "అవును" అన్నది.


"మీరు తెలుగు నేర్చుకోవాలి గా, నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా?" అని పిల్లలకు అర్ధమయ్యే లా జవాబిచ్చింది. ఒక్క నిమిషం ఆలోచించి వచ్చి అదే మాట తండ్రికి చెప్పారు ఇద్దరూ.


"మీ నానమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ ఇండియా లో. షీ ఈజ్ శ్రీదేవి మామ్" (ఆవిడ ను అందరూ శ్రీదేవి మాడం అంటారు) అన్నాడు ఆనంద్.


"తెలుగు లో చెప్పు ఆనంద్" అంటూ వచ్చింది శ్రీదేవమ్మ...

ఆ మర్నాటి నుండి ఇద్దరు పిల్లలు ఇంకా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు వాళ్ళ నాయనమ్మ తెలుగును... ఒక రోజు చైతాలి బడి లోని ఒక నలుగురు ఆంధ్రా పిల్లలు, వాళ్ల తల్లులోచ్చారు... వాళ్ళ పిల్లలక్కూడా చైతాలి తో పాటు తెలుగు నేర్పమని అడిగారు. ఒక గంట బడి నుండి ఇటొచ్చి ఇంటికెళ్తామని చెప్పారు. శ్రీదేవమ్మ తరఫున కృష్ణ, చైతాలి "ఒకే" అని చెప్పేసారు. మొదటిసారి వాళ్లు చాలా గర్వంగా భావించారు... వాళ్ల నానమ్మ ఆ అంటీల తో ఇంగ్లీష్ దంచేస్తూ మాట్లాడుతోంది. ఒక పక్క తెలుగు నేర్పుతుంది... రామ్ ఫోన్ చేస్తే కృష్ణ అడిగాడు వాళ్ల తాత ను, "నీకూ నానమ్మ లాగా తెలుగు ఇంగ్లీష్ రెండూ వచ్చా? అని... అటు రామ్, ఇటు శ్రీదేవమ్మ పకపకా నవ్వేశారు...

వారం రోజుల్లో పిల్లలు చిన్న చిన్న వాడుక పదాలు నేర్చేసుకొన్నారు. ఆ తర్వాత ఇంగ్లీష్ పదము లేకుండా చిన్న వాక్యాలు. శ్రీదేవమ్మకు తరచు సంభాషణల్లో సామెతలు ఇంకా కొన్ని అచ్చ తెలుగు పదాలు వాడటం అలవాటు. ఆవిడకు అది వెన్నతో పెట్టిన విద్య... పిల్లలు కొంత అర్ధం చేసుకునే వరకు వచ్చారు...


"క్రిష్ణా, అక్క చెప్తే వినాలి. నీకంటే పెద్దది... నువ్వు పట్టిన కుందేలు కు మూడే కాళ్లంటే ఎలా?" అన్నది ఒక సందర్భంలో శ్రీదేవమ్మ...


"ఒకే నానమ్మా! పెద్దల మాటలు ముత్యాల మూటలు" అని కిలకిలా నవ్వాడు కృష్ణ...


మిగిలిన పిల్లల కు నేర్పేవన్నీ వీడు ఏకసంతాగ్రాహి వలే వల్లెవేస్తున్నాడు. శ్రీదేవమ్మ కు బాగా ముద్దొచ్చేసాడు... ఆ రోజు రాత్రి పిల్లలకు బంగాళదుంప వేపుడు చేసింది... ఆనంద్ ఇంటికొచ్చాక " మేము బంగాళదుంప వేపుడు కంచం లో అన్నం తో పాటు నానమ్మ కలిపితే తిన్నాము నాన్న" అని పిల్లలు అతని ఒళ్ళో కూర్చొని చెప్పారు.


ఆనంద్ ఆ రోజు పడుకునేముందు తల్లి గది లోకెళ్లి " పద్మ వెళ్ళే ముందర కొంచెం గాబరా పడ్డాను, పిల్లల తో ఎలాగా, దిగులు పడి గోల చేస్టారేమో అని... కానీ నువ్వు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడు సూపర్ మామ్ అండ్ గ్రానీ(నాయనమ్మ) వి. థాంక్స్ అమ్మా" అన్నాడు ఆనంద్ తల్లి పక్కన కూర్చొని.

"ఏదో రకంగా నీకు సాయంగా ఉండగలిగితే అంత కన్నా మాకేం కావాలి రా" అన్నది శ్రేదేవమ్మ కొడుకు తో. "మీ నాన్న అక్కడ ఉన్నారనే దిగులు తప్ప... తెలుసుగా నీకు.. అక్కడ ఆయన చాలా బిజీ. రిటైర్ అయ్యాక కూడా చాలా వ్యాపకాలు పెట్టుకున్నారు... అవి వదిలిపెట్టి రెండు నెలలకు రమ్మని ఒప్పించటమే చాలా కష్టమైంది... వెళ్లి పడుకో నాన్నా! పొద్దు పోయిం'దన్నది శ్రీదేవమ్మ కొడుకుతో లాలనగా...

ఆ తర్వాత వచ్చిన శనాదివారాలలో ఆనంద్ మిత్రుడు తన ఇద్దరి పిల్లలను ఆనంద్ ఇంట్లో దింపి, ఆ దంపతులు అవసరమైన పని మీద పక్క ఊరికెళ్లారు. చైతాలి కు ఒక ఏడాది అటు ఇటు ఆ పిల్లలు. ఇల్లు పీకి పందిరేశారు నలుగురూ. నానమ్మ ఆటలు సాగలేదు...


వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీదేవమ్మ ఆనంద్ తో , "ఆ కుంకలు పిచ్చి అల్లరి చేశారు" అన్నది.


"కుంక అంటే?" చైతాలి, కృష్ణ ఇద్దరూ అడిగారు...


"ఇట్ సౌండ్స్ సో ఫన్నీ".. అన్నారిద్దరూ...

రెండ్రోజుల్లో పద్మ తిరిగి వచ్చేసింది... పిల్లల అమాంతం వాళ్ల అమ్మ మీదకు దూకారు... అదే రోజు ఆనంద్ పుట్టిన రోజు...


పద్మ ఆనంద్ కు ఎదో చిన్న కానుక ఇస్తూ "హ్యాపీ బర్త్డే డియర్" అంటే వెనకనుండి చైతాలి అన్నది, "అమ్మా అలా కాదు..."పుట్టినరోజు శుభాకాంక్షలు" అని చెప్పాలి...


అత్తగారు పిల్లలకు ఎన్ని పద్ధతులు నేర్పించారో అనుకుంది మనసు లో...


" నాన్నా, నువ్వు నానమ్మ కాళ్ల కు దణ్ణం పెట్టావా?" అని కృష్ణ అడిగితే పద్మ నిర్ఘాంత పోయింది... కళ్ళ నీళ్లొచ్చాయి పద్మ కు...


"అత్తయ్య, మా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్న విలువలు మా పిల్లలు కు నేర్పలేక పోతున్నాము అని లోలోపల తెలుస్తున్నా మా ఉద్యోగాలే ఒక విధంగా మా జీవితాన్ని శాసిస్తున్నాయని సరిపెట్టుకుంటున్నాము. కనీస ప్రయత్నము కూడా చేయలేదు మేము ఇప్పటివరకు... మీరు ఈ రెండు నెలల్లో పిల్లలు స్కూల్ లో ఒక సంవత్సరం లో కూడా నేర్చుకోలేనివి నేర్పించారు"... అంటూ అత్తగారిని గట్టిగా వాటేసుకుంది. "ఇక్కడే ఉండిపోండి మీరు" అన్నది ...


"మనసుంటే మార్గం ఉండదా పద్మా? మేము శాశ్వతము కాదు. మీరు మీ పిల్లల ను ఎలా చూడాలనుకుంటున్నారో ఆలోచించుకొని ఒక ప్రణాళిక ప్రకారం ఒక్క అయిదారేళ్లు కష్టపడితే వాళ్ళ పెంపకంలో ఇంక ఆ పై వాళ్లే తెలుసుకుంటారు...నేను శ్రీకారం చుట్టే ప్రయత్నం చేసాను... ఎల్లుండే మీ మావయ్య వస్తారు. వారం ఇట్టే గడిచిపోతుంది, మా పర్యటన కు మేము వెళ్తాము..."

ఆ మాట అనగానే పిల్లలు నాయనమ్మ కాళ్ల కు గట్టిగా చుట్టుకుపోయారు... చైతాలి దిగులు గా మొహం పెట్టి "నువ్వు లేకపోతే మాకు చందమామ కథలు, సుమతీ శతకము ఎవరు చెప్తారు?? ఇంకా చాలా తెలుగు నేర్చుకోవాలి గా నీలాగా మాట్లాడాలంటే...


కృష్ణ "అవును నానమ్మా, నా కార్లు నీకిచ్ఛేస్తా, నువ్వు ఇక్కడే ఉండు, మాకు బంగాళదుంప వేపుడు నచ్చింది" అన్నాడు...


ఆనంద్ తో శ్రీదేవమ్మ అన్నది, "చూసావా రా ?డబ్బు ముఖ్యమే కానీ అన్ని డబ్బు తో రావు నాన్నా... మనకి ఏది ఎంత కావాలో మనము తెలుసుకొని మన జీవితాన్ని మలుచుకోవాలి... నిజానికి ఉమ్మడి కుటుంబాలు పోయి అమ్మమ్మ, నాయనమ్మ, తాతల ప్రేమలు కరువైపోయాయి ఈ తరం పిల్లలకు. తల్లిదండ్రులకు కూడా సమయం లేదు వారి పిల్లల తో గడిపేందుకు... నీ పిల్లల కు ఇప్పుడు మన తెలుగు మాసముల పేర్లు, నక్షత్రాల పేర్లు, పండగల పేర్లు, రంగులు, కూరల, పండ్ల పేర్లు ఇంకా ఎన్నో తెలుసు. మీరిద్దరూ అవన్నీ వాళ్ళు మరువకుండా ఉండేందుకు ఏంచేయాలో అది చేయండి" అని లేచి "నీ పుట్టినరోజు కు నా చిన్న కానుక-- ఇదొక పోర్టల్, "తెలుగు జ్యోతి"...

నువ్వే ప్రారంభోత్సవం చేసి, నువ్వే దీన్ని నడుపు. కేవలం నీ పిల్లలకే కాకుండా ఆసక్తి గల తెలుగు వాళ్ల అందరికీ ఉపయోగ పడేటట్లు దీన్ని తయారు చేసాను...అక్షర మాల, గుణింతాలు నుండి ఒక హై స్కూలు విద్యార్థి కు కావలసిన పాఠ్యక్రమము సమకూర్చడం జరిగింది. ఇందులో చాలా మంది ముందుకొచ్చి పాల్గొన్నారు...

ఆనంద్ నూతన ఉత్సాహము తో ఆ పోర్టల్ ను 'క్లిక్' చేసి మొదలుపెట్టాడు. ఆ తరువాత తన మిత్రులందరిని పిలిచి ఆన్లైన్ మీటింగ్ పెట్టి దాని గురించి చర్చించి ఆ పోర్టల్ ను ముందుకెలా తీసుకెళ్ళాలో పలువురు ప్రముఖుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు...

రామ్ రాగానే పిల్లల ను, " హై చై, హై క్రిష్" అంటే "తాతా నా పేరు కృష్ణ" అని మనవడు, "నా పేరు చైతాలి" అని మనవరాలు నవ్వుతూ చెప్పారు.


"అమెరికన్స్ పిలవలేరు కాబట్టి అలా పిలుస్తారు..." అన్నారు.


"గట్లనా" అని కొత్త మాట వాడాడు రామ్. "ఏడ నేర్చినారు బిడ్డా గిదంతా?? పోరి పోరడు మస్తుగ చెప్పినారు బై" ...


పిల్లలు తికమక పడి పోయి నాయనమ్మ ను అడిగారు," తాత కు తెలుగు రాదా? ఇంగ్లీష్ తెలుగు రెండు వదిలేసి వేరే ఏదో అంటున్నారు..."


పద్మ ఆనందలు ఘొల్లుమని నవ్వారు...


శ్రీదేవమ్మ రామ్ వైపు చూసి పిల్లలను ఏడిపించింది చాలు అని సైగ చేసి మామూలుగా మాట్లాడమంటే అప్పుడు రామ్ ఇద్దర్ని దగ్గర తీసుకొని ముద్దుచేశారు.


పద్మ, ఆనంద్ ఒక రెండు రోజులు సరదాగా గడిపేందుకు దగ్గర లో ఉన్న హాలిడే రిసార్ట్ కు ఏర్పాటు చేస్తున్నారు... పిల్లలోచ్చి ఆరా తీస్తే వాళ్లను ఆశ్చర్య పరచాలని చెప్పలేదు పద్మ... ఆనంద్ ను అడిగారు పిల్లలు...


"ఎంలేదర్రా సింగినాదం జీలకర్ర, పోయి ఆడుకొండి" అన్నాడు ఆనంద్.

"ఓహ్, కమాన్ కృష్ణ, ఇట్ ఈజ్ నథింగ్( పద రా, ఏమి లేదక్కడ )" అన్నది చైతాలి తమ్ముడి తో...

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం

పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక

వయసు: 52 సం.

నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)

స్వస్థలం: తెనాలి

చదువు: BA English Litt., B.Ed

వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.

ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం

పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.

స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.

కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.

ఇటీవలే ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి , ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వారినుండి సర్టిఫికేట్ లు పొందాను.


Comments


bottom of page