#SurekhaPuli, #సురేఖ పులి, #Siromani, #శిరోమణి #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
Siromani - New Telugu Story Written By Surekha Puli
Published In manatelugukathalu.com On 19/11/2024
శిరోమణి - తెలుగు కథ
రచన : సురేఖ పులి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సవ్యసాచి ముప్పైఐదవ పుట్టినరోజు గుడికి వెళ్లి పూజ చేయించుకున్నాడు.
“అమ్మా, ప్రసాదం తీసుకో” అంటూ భూదేవి కాళ్ళకు దండం పెట్టుకున్నాడు.
“ఈ ఏడాదైనా నీ పెళ్లి జరిగితే బాగుండును” అని ఆశీర్వదించింది.
చెల్లెళ్లిద్దరూ అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ప్రసాదం తీసుకున్నారు.
తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మోస్తూ ఓ వైపు చదువు సాగిస్తూ సవ్యసాచి ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు. ఆఫీసులో పదవి పెరిగింది. అయినా పెళ్లి ధ్యాస లేదు. ఆఫీసులో పని, ఇంట్లో అమ్మ తప్ప వేరే ధ్యాస లేదు. తల్లీ, చెల్లెళ్ళు కలిసి ఎలాగో అలాగా పెళ్లికి ఒప్పించారు. పెళ్లి చూపుల మాట దేవుడెరుగు, కనీసం అమ్మాయి ఫోటో కూడా చూడలేదు.
“అమ్మా, నువ్వు పెద్ద దానివి అవుతున్నావని, నీకు ఇంటి పనుల్లో సాయంగా ఉండాలని నేను పెళ్లికి ఒప్పుకున్నాను అంతే! పెళ్లి తరువాత ఆ అమ్మాయి విషయంలో నేనసలు జోక్యం చేసుకోను..” నిర్మొహమాటంగా కొడుకు తల్లితో అన్నాడు.
***
“అన్నయ్య.. నీకు ఈ వేళ శోభనం” అంటూ సిగ్గుతో, సంతోషంగా చిన్న చెల్లెలు చెప్పింది.
తలదించుకు కూర్చున్న శిరోమణి గడ్డం పట్టి తల పైకెత్తి కళ్ళలోకి చూస్తూ.. “నాకు ఈ వేషాలు నచ్చవు. శోభనం అని నువ్వేదో ఊహించుకోవద్దు. నేను నేనుగా బ్రతికాను, ఇక మీద కూడా అలాగే బ్రతుకుతాను. కేవలం అమ్మ కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను” గుక్క తిప్పుకోకుండా అనేసి శిరోమణి స్పందన ఏమిటో కూడా పట్టించుకోక వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
చెల్లెళ్లిద్దరూ అవాక్కయి అన్నయ్య కర్కశత్వాన్ని పలు కోణాల్లో వివరించసాగారు. శిరోమణి పూలజడ విప్పేసి, ముఖం కడుక్కొని మామూలుగా వుండిపోయింది. “అన్నయ్య మొదటి రోజే వదిన్ని తిట్టాడు”.. వార్త భూదేవి వరకు చేరింది.
సవ్యసాచి బెడ్ రూమ్ నీట్ గా వుంది. బెడ్ పైన గాని, చుట్టుపక్కల గాని పూల హోరు, అగరొత్తుల జోరు, మిఠాయిల అల్లకల్లోలం లేదు. శిరోమణి టేబుల్ పక్కనే వున్న కుర్చీలో కూర్చుంది. సవ్యసాచి పక్కనే వచ్చి నిలబడ్డాడు.
“సారి, మేడమ్! నాకు కోపం తొందరగా వస్తుంది. ఈ ఇంట్లో నీకు ఏదైనా అసౌకర్యంగా వుంటే నాతో డైరెక్ట్ గా చెప్పేయ్!” అన్నాడు.
శిరోమణి అతని వైపు చూసింది ‘మంచి పర్సనాలిటీ.. కేవలం అమ్మ కోసమే పెళ్లి చేసుకున్నాడా!’ మనసులో అనుకుంది.
“నాకు యింకా రెండు రోజులు మాత్రమే సెలవుంది; ఇంట్లో ఉంటాను. నేను చేసి పెట్టే పని, అంటే నీ షాపింగ్ వంటివి వుంటే చెప్పు… అని క్షణం పాటు జవాబు కోసం చూసి, “మనిద్దరం ఒకే గదిలో పడుకోకుంటే అమ్మతో చాలా గొడవ, అమ్మకు విరుద్ధంగా ఏమీ జరిగిన ఇల్లంతా గోలగోలగా ఉంటుంది. అందుకే; ఓకే... గుడ్ నైట్” అని మంచం ఎక్కాడు.
ఇంచుమించు సమ వయస్కురాలైన వధువు ‘భర్త’ అంటే ఇలా ఉండాలి అని కలల్లో ఎప్పుడూ తేలిపోలేదు. ఇంటి పెత్తనం వహించి చెల్లి, తమ్ముడు పెళ్లిళ్లు చేసిన కన్య; ప్రవరాఖ్యుడి వైపు దారి తీసింది. మంచం పైన తనకంటూ కొంచెం స్థలం వదిలిన భర్తకు శరీరం తగిలేలా పడుకుంది. నిద్ర కోసం తంటాలు పడుతున్న పురుషుడికి ‘చురక’ తగిలింది. స్త్రీ కోణంలో శృంగార సహజీవనానందం తెలుసుకున్నాడు.
***
ఇంటి పనులు, వంట పనులు, అత్తగారి సేవలు, శ్రీవారి ముచ్చట్లు తీరుస్తూ శిరోమణి ఉద్యోగానికి వెళుతూ కాలాన్ని సునాయాసంగా గడిపేస్తుంది. పుట్టినిల్లు వదిలి తనను నమ్ముకొని వచ్చిన శిరోమణికి ఆత్మబంధువై, ప్రతి పనిలోనూ సవ్యసాచి సహకరిస్తున్నాడు.
“శిరీ.. నేను దోసెలు వేసుకుంటాను, నువ్వు తొందరగా బయలుదేరు, నిన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తాను” అని హడావిడి చేశాడు సవ్యసాచి.
“దోసె పిండి కొంచెం పల్చబడ్డది సవ్యా, నీకు ఇబ్బంది.. నేనే వేసిస్తాను.”
“అంతగా దోసెలు రాకపోతే అమ్మ సాయం తీసుకుంటాను, లేకుంటే టీ, బిస్కెట్స్ తో నా బ్రేక్ ఫాస్ట్ అయిపోతుంది. పద.. పద.. వూ.. బయలుదేరు” అంటూ బైక్ స్టార్ట్ చేశాడు.
భార్య తన వృత్తికి సక్రమంగా వెళ్లాలనే సదుద్దేశం వున్నందుకు కష్టాలు లేకుండా కాలం నడుస్తోంది.
భూదేవి మనసులో చాలా రోజుల నుండి రొద పెడుతున్న మాటను ఇంటికి వచ్చిన కొడుకుతో అడిగింది
“సవ్యా.. నువ్వు నా పేగు కత్తిరించుకు పుట్టిన బిడ్డవు.. నీ పేరును కత్తిరించి, కురుచ చేసి పిలిచే హక్కు నాకు మాత్రమే వుంది. కోడలు నిన్ను ‘సవ్యా’ అంటుంటే నాకు ఒళ్ళు మండుతుంది. మన సంప్రదాయంలో ‘ఏమండీ’ అని పిలవాలని తెలుసు కదా.”
“అయ్యో, అందులో తప్పేంటమ్మా, నన్ను శిరోమణి ఎలా పిలిచినా అభ్యంతరం లేదు.”
“నీకు లేదేమో, నేను పెద్దదాన్ని.. నాకు నచ్చదు” తేల్చి చెప్పేసింది.
అమ్మ వేసిచ్చిన దోసెలు తిన్నాడు. ఇంకా భూదేవి సణుగుడు అయిపోలేదు.
“నువ్వు భర్తగా కొంచెం అధికారం చూపెట్టాలి. శిరీ.. శిరీ.. అని పెంపుడు కుక్కలా ఆమె వెంట నువ్వు తిరుగుతూ సొల్లు కార్చకు, అర్థమైందా?”
అమ్మకు ఏం చెప్పి నచ్చ చెప్పాలి. శిరోమణి పైన ఏ కారణం లేకుండానే అత్తపోరు-జులుం సాగిస్తూనే ఉంది. అయినా చూసి చూడనట్టు ఊరుకుంటున్నా.. శిరి కూడా అంతగా పట్టించుకోదు.
“అమ్మా.. ప్లీజ్.. శిరోమణి వలన వేరే ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు.. ఈ చిన్న చిన్న అర్థం లేని కారణాలతో మనసు పాడు చేసుకోకు” నచ్చచెప్పాడు.
అంతే, ముక్కు చీదేసి, అలిగి అన్నం మానేసింది. విధిలేక, పేగు బంధం మెలి పెట్టలేక అలక తీర్చాడు.
“ఏమండీ” అంటూ సంభోదన ప్రారంభమైంది.
‘ఏమేవ్, ఒసేవ్’ అని అనలేదు… ఎందుకంటే ‘శిరి’ తన మనసెరిగిన ప్రియురాలు, ప్రాణంతో సమానం!
***
శిరోమణి సమయానికి బస్ అందుకోలేకపోతే తాను వెళ్లవలసిన లోకల్ ట్రైన్ మిస్ అవుతుంది. ఒక దానికి మరొకటి లింక్! అందుకే శిరోమణిని ఇంటి నుంచి బస్ స్టాప్ వరకు వదిలి బస్సు ఎక్కిన తరువాత ఇంటికి వచ్చి తన పనులు చూసుకొని ఆఫీసుకు వెళతాడు. ఇది దినచర్య భాగమే.
ఇద్దరి సామరస్యం చూస్తుంటే కొడుకు దూరమై పోతున్నాడనే భూదేవి భావన! రోజురోజుకు ఆ భావన పెరిగి బాధకు దారి తీసింది. భార్య విలువను పెంచి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే దిగులు! గుండెలో గుండుసూది గుచ్చినట్టుగా ఉంది.
ఇంట్లో కూరలు తరిగే కత్తి మొండి బారిన క్రమంలో భూదేవి ఓ మధ్యాహ్నం వేళలో ఇంటి ముందు సైకిల్ పైన వచ్చిన కత్తులబ్బితో చాకు పదును పెట్టించింది. పదును తెలియక, భర్తకు దొండకాయ వేపుడు ఇష్టమని చకాచకా తరుగుతున్న శిరోమణి వేలు కసెక్కిన తెగి ‘అమ్మా’ అని బాధ స్పురించే భార్య కంఠం వినగానే సవ్యసాచి చప్పున శిరోమణి రక్తం కారుతూ గాయమైన చూపుడు వేలును తన నోట్లో పెట్టుకుని భార్య వైపు ఓదార్పుగా చూశాడు.
“సవ్యా, నీకేమైనా పిచ్చెక్కిందా? గాయమై రక్తం కారుతూ ఉంటే పసుపు రాసుకోవాలి, లేదంటే అయింట్మెంట్ పూసుకోవాలి, ఆవిడ రక్తం తియ్యటి చక్కెర పాకం అనుకున్నావా, నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్నవ్?”
అత్తగారి అదిలింపుకు చటుక్కున భర్త నోట్లో నుంచి వేలు లాక్కుంది. గబగబా సవ్యసాచి అయింట్మెంట్ తెచ్చి గాయమైన వేలికి పూసి ఫస్ట్ ఏడ్ బాండ్ చూట్టాడు. పక్కనే వున్న డైనింగ్ కుర్చీని లాగి కూర్చోబెట్టాడు.
“ఈ రోజు నువ్వు ఆఫీసుకు వెళ్లకు. కూర నేను చేస్తాను, కూర ఏం ఖర్మ వంటంతా నేనే చేస్తాను, ఎలా చేయాలో నువ్వు కొంచెం గైడ్ చేయి.”
“కత్తుల కోతలు మా ఆడవాళ్లకు మామూలే, ఇంతదానికి.. ఆఫీస్ మానేయాలా? నాకు ఎన్ని సార్లు వేళ్ళు తెగలేదు, చేతులు కాల లేదు; నన్ను వంట మాన్పించి, నువ్వు చేశావా? ఏదో సామెత చెప్పినట్టు పుడుతూ పుత్రులు; పెరుగుతూ శత్రువులు” భూదేవి కోపం ఆగలేదు.
ఇది వరకు ‘అమ్మ’ తోడిదే ప్రపంచం, కానీ ఇప్పుడు.. కొడుకు మారి పోయాడు. కాదు, కోడలు మార్చేసింది. ఏదో మందు పెట్టి, మంత్రం వేసి మాయ చేసింది. కోడలు చేసే ప్రతి పనిలో తప్పులు కనబడుతున్నాయి. చిన్న విషయాలకే గొడవ పెట్టుకోసాగింది.
ఇంటా-బయటా ఎంతో అనభావజ్ఞురాలైన అతివ, అత్తగారి ఈసడింపులను తొందరపడి భర్తకు విన్నవించుకోలేదు. కానీ సవ్యసాచి తొందరగా ఈ విషయాన్ని పసిగట్టాడు.
భూదేవి కొడుక్కి తాయెత్తు కట్టిద్దామని రహీమ్ బాబా గారి వద్దకు రమ్మన్నది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా! మొదటిసారి అమ్మ పై నోరు చేసుకున్నాడు.
అమ్మ కూడా ఒక స్త్రీ. సాటి స్త్రీని.. అందునా అమ్మ, చెల్లెళ్ళు ఏరికోరి ఎంపిక చేసిన శిరోమణి నా భార్యను.. కోడలిని ప్రేమగా మమకారంతో ఎందుకు చూడలేక పోతున్నది? అమ్మ తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి.
స్త్రీ బాల్యంలో తండ్రి పైన; యవ్వనంలో అన్నదమ్ముల పైన, వివాహితగా భర్త పైన; వృద్దాప్యంలో కొడుకులపైన ఆధారపడినట్లే పురుషుడు కూడా బాల్యంలో తల్లి పైన; యవ్వనంలో అక్కా చెల్లెళ్ళ పైన, వివాహితుడిగా భార్య పైన; వృద్దాప్యంలో కోడలిపై ఆధారపడతాడు. జగమెరిగిన సత్యమిది, ఈ వ్యతిరేక ఆలోచనలు ఎందుకు?
కలిసి జీవిస్తున్న క్రమంలో అర్ధాంగి అంటే ప్రేమ పెరిగి శాఖోపశాఖలుగా విస్తరించే ప్రక్రియలో తృప్తి వలన కలిగే సుహృద్భావంతో సదా వినమ్రుడనై ఉండాలనిపిస్తుంది. బయటకు చెబితే చిన్నతనంగా భావించే వారు నాలుగ్గోడల మధ్య భార్యలకు అడుగులకు మడుగులోత్తుతారు. కానీ నాలాంటి ‘కేర్ నాట్ మనిషి’ ఇంటా-బయట అన్ని వేళల భార్యకు అన్ని విషయాల్లోనూ సహకరించాలని అనుకుంటారు.
జీవిత కాలంలో కష్టాలు ఎక్కువ పాళ్ళల్లో చూసిన అమ్మ, శిరోమణిని అర్థం చేసుకోక పోతే.. ఖర్మ!
పురుషుడి భావి జీవితం కోసం శ్రమిస్తున్న స్త్రీ పట్ల గౌరవం చూపాలి. అమ్మ మనసులో శిరోమణి అంటే ఇష్టాన్ని పెంచాలి. ఎలా? ఇంట్లో సామరస్యం పెంచే మార్గాలు అన్వేషించాలి. సవ్యసాచి ఆలోచనలో పరిష్కారం కనిపించడం లేదు. బెటర్ ఆఫ్ సలహా తీసుకోవాలి.
***
కోడలు మూలంగా తల్లి పడే సంక్షోభాన్ని కొడుకు భార్యకు విన్నవించాడు. సవ్యసాచి మనసును అర్థం చేసుకున్న శిరోమణి చెప్పింది
“గాలితో పాటు దుమ్ము కూడా మనల్ని చేరుతుంది. దుమ్మును దులిపేసుకుంటాము. నేనంటే మీకు ఇష్టం వున్నా అత్తగారికి అయిష్టం. ప్రతీ పనిలో లోపాలు వెతుకుతారు. దీనికి రెండు పరిష్కారాలు, మొదటిది మీరు కూడా అనవసరంగా, అర్థం లేకుండా ప్రతీ విషయానికి నన్ను కోప్పడితే; ఇక నా పైన రుసరుసలాడెందుకు అవకాశాలు తక్కువ. మీకు కావలసిన ‘అమ్మ సంతోషం’ మీకు లభిస్తుంది.
కాదంటే మరో కొన్నాళ్ళు పోతే ఆవిడకు ఎలాంటి ఆలోచనలకు వ్యవధి దొరక్క, ఏ మాత్రం తీరిక లేని కాలక్షేపంతో సతమతమవుతారు. అంటే.. ఈ ఇంట్లో మరో చిన్ని సవ్యసాచి గాని మరో చిన్నారి శిరోమణి గాని మనకు తోడుగా రాబోతున్నారు. అత్తగారికి ‘నన్ను’ గురించిన ఆలోచనలు మరుగున పడతాయి.”
సవ్యసాచి తల శిరోమణి ఒడిలో వుంది. ఆమె కడుపును సున్నితంగా ముద్దు పెట్టుకొని “రెండో సలహా బాగుంది.. మొదటిది నాకే కాదు.. ప్రేమించే మనసున్న ఏ మగాడికి పనికి రాని చెత్త సలహా!! సవ్యసాచి నిర్మొహమాటానికి ‘థాంక్స్’ చెబుతూ భర్త తలను హృదయానికి హత్తుకుంది.
*****
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ ఇంటి పేరు: పులి
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.
ప్రస్తుత నివాసం బెంగళూరు విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.
Surekha Puli
@mdsaberali4905
• 1 hour ago
My Special wishes to the writer for this heart touching n heart broking story. It's a noway days Socio life Reflecting common MIRROR of youth... Hat off to SUREKHA madam I have unabarable heart pain due to my Son's same attitude who aparted with wifefrom us in the midnight leaving the own house n Bedridden Mother for their happiest life...Eexpecting more sensible Stories from you...
Divik G
•1 day ago
💝
మీరు అందించిన "శిరోమణి" కథ చాలా హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథ. సవ్యసాచి, శిరోమణి మధ్య మొదట కఠినమైన సంబంధం కనిపించినా, మెల్లగా ప్రేమ, అన్యోన్యత, పరస్పర గౌరవం పెరిగిన తీరు చక్కగా ఆకళింపు చేసుకుంది. కథలో మానవ సంబంధాల సున్నిత భావాలు, కుటుంబ బంధాలలో వస్తే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు హృద్యంగా చర్చించబడ్డాయి.
భూదేవి పాత్ర ద్వారా చూపించిన అత్తగారి పాత సంప్రదాయ భావజాలం, శిరోమణి పాత్రలోని నైతిక నిబద్ధత, సవ్యసాచిలోని సహనం, పరిష్కారాత్మక ఆలోచనలు పాఠకులను కదిలిస్తాయి.
ఈ కథ ఆధునిక వైవాహిక జీవితానికి, కుటుంబ సంబంధాల సామరస్యం కోసం ప్రతి వ్యక్తి చూపవలసిన మార్పులకు ఓ అద్దంగా నిలుస్తుంది. సురేఖ పులి గారి రచన అనుభవం, చక్కని మాటల నిర్మాణం, అభిప్రాయాలను వ్యక్తీకరించే తీరు ప్రశంసనీయంగా ఉంది.