top of page

శివుడు విషము ఎందుకు త్రాగినట్టు

Updated: Aug 19, 2023


'Sivudu Vishamu Enduku Traginatlu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'శివుడు విషము ఎందుకు త్రాగినట్టు' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి


“సుందరయ్యా! శివుడు విషము ఎందుకు త్రాగిండంటావు?” కాలక్షేపానికి చెట్టు అరుగు మీద కూర్చున్న రాఘవయ్య అడుగుతాడు. సుందరయ్య, రాఘవయ్య ఒకటే వాడలో ఉంటారు- బాగా చదువుకున్న వారే- సమకాలికులు.


పైగా విశ్రాంత ఉద్యోగులు- భారతం రామాయణం ఔపోసన పట్టినట్లుగా మాట్లాడుకుంటుంటారు. కొంత మంది జనం కూడా చెట్టు క్రింద కూర్చుంటారు- వీళ్ళ కాలక్షేప మాటలు వాళ్ళకు విన సొంపుగా ఉంటుంది - రోజూ సాయంత్రము ఐదునుండి చీకటి పడే దాక రాఘవయ్య సుందరయ్యది దిన కృత్యము అన్నట్టు ఇద్దరు కలుస్తుంటారు.


సుందరయ్య అంటాడు “ఇందులో తెలియని దేముంది - సముద్ర మథనంలొ హాలాహలము పరమశివుడు కబళించుట అనాదినుండి జనము గ్రహించిన విషయమేకదా” అంటుంటె “పప్పులో కాలేశావు. అసలు విషయము చెబుతాను విను” అంటాడు రాఘవయ్య.


సీసం -

గణపతి వాహన గర్తాట ననగను

పశుపతి గళనాగు పట్ట జూచు

సామిది వాహన సహసాన దినజూచు

పశుపతి మెడలోని పాము నపుడు

చండిక వాహన చండక దినజూచు

నభవుని వాహన నంది ననగ

గజరిపు తలపైన గంగను జూచుచు

ఈశ్వరి జెందగ ఈర్ష నపుడు


ఆ.వె.-

చంద్రు డనగ శిరము చల్లగ నిలువగ

శివుని నుదిటి కన్ను శివము ఎత్త

పరమ శివుడు విషము పానము జేయును

సదన మందు పోరు సహన మనక


ఇప్పుడు తెలిసిందా సుందరయ్యా శివుడు విషము ఎందుకు త్రాగిండో” అంటాడు రాఘవయ్య, చెట్టు క్రింద కూర్చొని వీండ్ల మాటలు వింటున్న జనము వైపు చూస్తూ.


“వాళ్ళు మనకంటే తెలివిగల వాండ్లు లే, నువ్వైతె చెప్పు” అంటడు సుందరయ్య.


“సరె వినండి” అంటూ- గణపతి అంటె అందరికి తెలిసిన విషయమే కద. అతని వాహనము గర్తాట అంటె ఎలుక. పశుపతి అంటె శివుడు - గళనాగు అంటే మెడలోని పాము. సామి అంటే కుమార స్వామి ఆయనవాహనము సహసాన అంటే నెమిలి. చండిక అంటె పార్వతి ఆమె వాహనము చండక అంటే పులి. నభవుడు అంటే శివుడు ఆయన వాహనము నంది అంటే ఎద్దు. గజరిపు అంటే గజాసురుని శతృవు అంటే శివుడు ఈశ్వరి అంటే పార్వతి. ఈర్ష అంటే అసూయ శిరము అంటె తల. నుదురు అంటె నొసలు శివము అంటె పూనకము. పానము చేయు అంటే త్రాగు. సదనము అంటే ఇల్లు సహనము అంటే ఓపిక లేదా సహించుట.


దీని తాత్పర్య మేమిటంటే వినాయకుని వాహన మైన ఎలుకను శివుని మెడలోని పాము తిన జూస్తది. కుమార స్వామి వాహనమైన నెమలిని శివుని మెడలోని పామును దిన జూస్తది. పార్వతి వాహన మైన పులి శివుని వాహనమైన ఎద్దును తిన జూస్తది. శివుని నెత్తి మీద నిలిచిన గంగను జూసి సవతి ఐన పార్వతి అసూయ పడుతుంటది.


చంద్రుడు శివుని తలపైన చల్లగ ఉండగా నిప్పులు గ్రక్కే శివుని నుదిటి మూడవకన్ను పూనక మొచ్చినట్టు ప్రవర్తిస్తది. ఇటువంటి ఇంటిపోరు సహించ లేక శివుడు విషము త్రాగుతడట-”


ఇది వినగానే సుందరయ్యతో పాటు అందరూ పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుతారు.


“నేనూ ఒక మాట చెబుతాను రాఘవయ్యా” అనుకుంటు “విష్ణువు కొయ్యబారి పూరీలో ఎందుకున్నడనుకుంటావు” అంటుంటే సుందరయ్యతో “దీనికీ ఒక కథ ఉన్నదా చెప్ప”మంటాడు రాఘవయ్య.


సుందరయ్య సీస పద్యము చదివి వినిపిస్తాడు.


సీసం--

దామోద రుండును దారువు అయెనన

ఏలన దెలుపగ ఎరుగ సతులు

ఇరువురు ఉండగ ఇబ్బంది అతనికి

నిలిచియు ఒకతన నిలువ దొకతి

శేషుడు ఉదధిలొ సేమము ఉండగ

పయనము జేయను పనికి రాడు

గరుడిని రమ్మన్న గనగను ఉరగము

దానిని దినజూచు ధర్మ మొదిలి,


ఆ.వె.-

ఇట్టి బాధ లుండ ఇందీవ రుండన

కొయ్య బారి పోయె కొసకు జూడ

పూరి యందు జేరి పూజలు బొందుతు

జగము నాథు డనుచు జనము గొల్వ


మరి నువ్వూ వివరించు సుందరయ్యా అంటుంటే సరె చెబుతాను విను అనుకుంటు----


“దామోదరుడు అంటె విష్ణువు, దారువు అంటే కొయ్య. సతులు అంటె భార్యలు, ఆయనకు ఇద్దరు- ఒకామే భూదేవి ఒకామె శ్రీదేవి. ఒకామె కదులదు- ఎవరామె అంటె భూదేవి. ఇంకొకామె శ్రీదేవి, ఆమె ఎప్పుడూ ఒకదగ్గర నిలువదు. శ్రీదేవి అంటే లక్ష్మి -- లక్ష్మి అంటే మనము అన్వయించుకునేది డబ్బు లేదా ధనము - ఆ ధనము ఎప్పుడూ ఒకచోట నిలువదు.


శేషుడు అంటే విష్ణువు పడుకునే పాము. ఉదధి అంటే సముద్రము. గరుడుడు అంటె విష్ణు వాహన మైన గరుడ పక్షి. ఉరగము అంటే పాము. ధర్మము అంటే ఇక్కడ విధులు అని అర్థము. ఇందీవరుడు అంటే విష్ణువు. ఇగ తాత్పర్యము చెబుత వినండి అనుకుంటు “విష్ణువుకు ఒకసారి ఎటో ఒక దిక్కు తిరిగి రావాలని మనుసున అనుకుంటె. భార్యలు ఇద్దరు సమయానికి ఒకామె ఇంట నిలువదు ఇంకొకామె అసలే కదులబోదు. శేషుణ్ణి రమ్మంటె సముద్రములో నిమ్మళంగ పడుకుంటడు-


పోనీ వాహన మైన గరుడుని రమ్మంటె ఆ గరుడ పక్షి తన సహజ గుణము వదలక ఆకాశము నుండి పోతున్నా భూమిపై పాము కనపడితె తిందామనుకొని దాని విధి మరిచి భూమి మీద వాలజూస్తది- ఇక విష్ణువు సమయానికి ఏదీ అనుకూలించక విసుగు జెంది కోయ్యబారి పోతాడు. పూరీలో జేరి జగన్నాథునిగ నిలుస్తడు. అతడే మనము పూజలు చేసే పూరీ జగన్నథుడు.”


వినగానే అందరూ నవ్వుతూ “అమ్మా మనకే కష్టాలనుకుంటే ఆ దేవుండ్లకు కూడా ఇబ్బందులుంటె మనము ఇక ఏ దేవుణ్ణి మొక్కాలె” అని నవ్వుతూ ఒకరి ముఖము ఒకరు చూసుకుంటారు.


“ఇక చీకటి పడుతుంది పద సుందరయ్యా” అంటూ లేచి ఇంటిదారి పడుతారు నవ్వుకుంటూ రాఘవయ్యా, సుందరయ్యా అక్కడికి వచ్చిన జనము వైపు చూస్తూ-


వాళ్ళూ “నమస్కారమండి పదిలంగ పొయిరండి” అని వీడ్కోలు పలుకుతారు. రోజూ ఇది షరా మామూలే. రాఘవయ్య సుందరయ్య రోజూ సాయంకాలము చెట్టు దగ్గరికి రావడము అరుగుమీద కూర్చోవడము జరుగుతుంది. జనము కూడా వీళ్ళను గొప్పవారిగా భావించి వాళ్ళు మొదటే వచ్చినా రాఘవయ్య, సుందరయ్య కొరకు అరుగు అట్లనే ఉంచుతారు కాని ఎక్కి కూర్చోరు-


జనానికి ఏది జెప్పినా అందులో పరిహాసముంటే కదలకుండా వినుకుంటు కూర్చుంటారు. అందుకే రాఘవయ్య సుందరయ్య అంటే వారందరికి గౌరవము.


సమాప్తం.


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Comments


bottom of page