#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపు వెంకటసుబ్బయ్య, #Snehabandham, #స్నేహబంధం, #పల్లెకథలు
Snehabandham - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah
Published In manatelugukathalu.com On 15/11/2024
స్నేహబంధం - తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జయంతుడు విజయంతుడు అను ఇద్దరు ప్రాణ స్నేహితులు. జయంతుడి ఊరు కమలసాగరం, విజయంతుడి ఊరు విమలసాగరం. రెండూర్ల మధ్య దూరం ఒక పరుగు దూరం మాత్రమే. ఒకరికోసం ఒకరు ప్రాణాలను తృణ ప్రాయంగా ఇచ్చేకొనెంత గాఢ స్నేహం వారిది. అన్ని విషయాల్లో ఒకరికొకరు సహకరించుకొనేవారు. ఒకరి సమస్యల్లో మరొకరు జోక్యం చేసుకుని పరిష్కరించు కొనేవారు. ఒకరి ఆపద్సమయాల్లో ఒకరు పాల్గోని ఆదుకొనేవారు. అలాంటి ఆదర్శ స్నేహితులు ఇద్దరూ.
వీరి స్నేహం బాల్యం నుండి నిరాఘాటంగా కొనసాగుతున్నది. ఇద్దరు యవ్వనంలోకి వచ్చాక కారణాంతరాల వలన విజయంతుడు దేశాంతరాలకు పోవలసి వచ్చింది. అక్కడే వివిధ వృత్తులు చేసుకుంటూ రకరకాల ప్రవృత్తులు అనుసరిస్తూ సుధీర్ఘ కాలం పాటు అక్కడే ఉండిపోయాడు విజయంతుడు. జయంతుడు ఊరిలోనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఓ చక్కనైన అమ్మాయిని పెళ్లి చేసుకుని అన్యోన్యంగా జీవిస్తూ జీవితంలో స్థిరపడ్డాడు.
పదేండ్ల బహు కాలం ఎడబాటు తర్వాత తన ప్రాణ స్నేహితుని చూడడానికి సొంతూరు విమలసాగరం సాయంత్రం 3 గంటలకు వచ్చాడు విజయంతుడు. ఓ గంట పాటు ప్రయాణ బడలిక తీర్చుకొని మిత్రుని ఊరు కమలసాగరంకు తీరిగ్గా బయల్దేరాడు. కమలసాగరం సంతవీధిలో జయంతుడు ఏవో సరుకులు కొంటూ కనిపించాడు. విజయంతుడు వెనుకమల్లుగా పోయి మిత్రుని బిగియార కౌగిలించుకున్నాడు. హటాత్తు పరిణామానికి హడలిపోయి జయంతుడు వెనక్కి తిరిగి చూసి సంబ్రమాశ్చర్యాలతో మిత్రుని గాఢాలింగనం చేసుకున్నాడు.
కుశల ప్రశ్నల అనంతరం చెట్టాపట్టా చేతులు పట్టుకుని కొద్దిసేపు, భుజాలమీద చేతులు చేసుకుని కొద్దిసేపు జయంతుడి ఇంటికి పోతున్నారు. అలా పోతుండగా అంగడ్లో కూరగాయలు కొనుక్కుని ఒక అందమైన స్త్రీ పోతుండడం విజయంతుడికి కనిపించింది.
"మిత్రమా! ఇంత సౌందర్యమైన స్త్రీని నేనింత వరకు చూడలేదు. ఆహా! ఎంత అందమైన యువతి" అన్నాడు విజయంతుడు.
"ఔనా! అంత అందంగా ఉందా ఆవిడా మిత్రమా! నీకు నచ్చిందా!" అడిగాడు జయంతుడు.
"ఈమె ఎవరికి నచ్చదూ మిత్రమా! ఇలాంటి స్త్రీతో ఒక్క రాత్రి గడిపినా చాలు జీవితం ధన్యమైపోతుంది" పరువశంతో చెప్పాడు విజయంతుడు.
"నీకు ఆమెపై కోరిక ఉందా!”
"కోరిక ఉన్నా.. అది కలలో కూడా నెరవేరదు కదా మిత్రమా!"
"నెరవేరుతుంది. నా మిత్రుడి కోసం నేను ఏర్పాటు చేస్తాను"
"అలా జరిగితే నా కన్నా అదృష్టవంతుడు ఎవరూ ఉండరు "
మాటల్లోనే జయంతుడి ఇల్లు వచ్చింది. ఇద్దరూ ఇంటికి ఈశాన్య మూలన ఉన్న బావి నీళ్ళు చేదుకొని కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి పోయారు. మిత్రున్ని వరండాలో కూర్చోబెట్టి తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చి వంట గదిలోకి పోయి పది నిమిషాల తర్వాత వచ్చాడు జయంతుడు.
"మిత్రమా! నువ్వు స్నానం చేసి పడకగదిలో విశ్రాంతి తీసుకో! నేను భోజనం తీసుకుని వస్తాను" అని చెప్పి విజయంతుని పడగ్గదిలోకి పంపాడు జయంతుడు.
ఓ అరగంట తర్వాత అన్నం నీళ్ళు తీసుకొని విజయంతుడు ఉన్న గదిలోకి పోయాడు జయంతుడు.
"మిత్రమా! అన్నం తిని ఉండు, ఆ అమ్మాయి అర్థగంటలోపు వస్తుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు జయంతుడు.
విజయంతుడు భోజనం చేసి ఉత్కంఠగా ఉద్వేగంగా ఉత్సాహంతో అటుఇటు తిరుగుతూ నలువైపులా చూస్తూ గోడవైపు చూశాడు. గోడకు తగిలించిన ఒక చిత్రపటం ఉంది. ఆ పటంలో జయంతుడు, అతని భార్య కనిపించారు.
జయంతుడి పక్కన ఉన్నామెను చూసి నిర్ఘాంత పోయాడు. వీధిలో చూసినామే ఈమె అని గుర్తించాడు విజయంతుడు.
"ఎంతటి ఘోరమైన పాపం ఒడిగట్టుకో బోయాను!. సకాలంలో భగవంతుడు మేలుకొల్పాడు. దేవుడికి ధన్యవాదాలు. నా మిత్రుడు ఎవరూ చేయని త్యాగం చేసాడు. ఆహా! ఇంతటి స్నేహితుడు ఉండడం వలన నా జీవితం పునితమైంది. ఇక చాలు ఈ జీవితం." అనుకుంటూ వుండగానే జయంతుడి భార్య సుశీల గదిలోకి ప్రవేశించింది.
ఆమెకు భక్తిపూర్వకంగా నమస్కరించి "ఇప్పుడే వస్తాను" అంటూ దొడ్డి వాకిలి తెరుచుకొని బయటికి పోయాడు విజయంతుడు. ఇంటికి ఈశాన్య మూలన ఉన్న బావి దగ్గరికి పోయి తన దుష్ట తలంపుకు ప్రాయశ్చిత్తంగా అందులోకి దూకి ప్రాణార్పణ చేసుకున్నాడు విజయంతుడు.
ఎంతసేపటికీ రాకపోయేసరికి సుశీల బయటికి పోయి చూసింది. ఎక్కడా కనిపించక పోయేసరికి బావిలోకి తొంగి చూసింది. విజయంతుడు శవమై కనిపించాడు. ఆ దృశ్యం చూసి అవాక్కైపోయింది సుశీల.
"నా భర్త కోరికను నెరవేర్చలేకపోయాను. ఒక నిండు ప్రాణం పోవడానికి కారణం అయ్యాను. నేను బతికి ప్రయోజనం లేదు." అనుకొని తానూ అదే బావిలో పడి చనిపోయింది సుశీల.
ఉదయం కన్జీకటి ఉండగానే లేచి స్నానపానాదులు కానించడానికి బావి దగ్గరికి పోయాడు జయంతుడు. బిందెకు చేంతాడు బిగించి బావిలోకి వదిలి బిందె నీటిలో మునింగిందో లేదోనని బావిలోకి తొంగి చూశాడు జయంతుడు.
విజయంతుడి, సుశీలల ఇద్దరి మృతదేహాలు నీటిపై తేలి ఉండడం చూసి మాన్పపడిపోయాడు జయంతుడు.
"అయ్యో ఎంత పని జరిగింది! ప్రాణం స్నేహితుడు, ప్రాణాధికమమైన భార్య చనిపోయారే. వారిద్దరు పోయాక నేను దేనికోసం జీవించాలి. నేనూ వారి దారిలోనే పోతాను" అనుకుంటూ జయంతుడు కూడా ఆ బావిలోనే పడి జీవితాన్ని ముగించాడు.
విధి విచిత్రమైనది కదా!
-------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.
---------
ఈ కథ స్నేహం గాఢతను, పరస్పర విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. జయంతుడు మరియు విజయంతుడు అనే ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఉన్న స్నేహబంధం వారి జీవితాలను మార్చేసింది. వారి స్నేహం వారి మరణానికి కూడా కారణమైంది.
స్నేహం అనేది జీవితానికి చాలా అవసరమైనది. స్నేహితుల మధ్య పరస్పర విశ్వాసం మరియు గౌరవం ఉండాలి.
కథ బాగుంది