#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #Sneham, #స్నేహం, #TeluguKathalu, #తెలుగుకథలు

Sneham - New Telugu Story Written By - Palla Venkata Ramarao
Published In manatelugukathalu.com On 25/03/2025
స్నేహం - తెలుగు కథ
రచన: పల్లా వెంకట రామారావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
'చింటూ' ఆరోజంతా బడిలో పరాకుగా గడిపాడు. కారణం తన నేస్తం 'బాలకృష్ణ' రాలేదు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చోవడమే కాదు అన్నీ కలిసే చేస్తారు. బడిలోనే కాదు సాయంత్రం గ్రౌండులో కూడా కలిసి ఆడుకుంటారు. అలాంటిది నిన్న గ్రౌండుకి రాలేదు. ఈరోజు స్కూలుకి రాలేదు. ఊరికేమైనా వెళ్లాడేమో అనుకున్నాడు.
బడి వదిలాక భారంగా ఇంటికెళ్లాడు. మరుసటి రోజు కూడా వాడు రాలేదు. ఎవరినడిగినా వాడి గురించి చెప్పలేక పోయారు. చింటూ ఇక ఆగలేకపోయాడు. బడి వదిలేదాకా ఉగ్గబట్టుకుని ఉన్నాడు. వదలగానే రివ్వున ఇంటికి పరిగెత్తాడు. అమ్మకి చెప్పి సైకిల్ మీద బాల ఇంటికి బయలుదేరాడు.
ఒక గంట గడిచాక తిరిగి వచ్చాడు చింటూ. వాడి ముఖంలో బాధ కనిపించడంతో "ఏమైంది నాన్నా! అలా ఉన్నావ్. 'బాల' దగ్గరికి వెళ్లావా?" అడిగింది వాళ్లమ్మ.
తలాడించాడు ఔనన్నట్లు.
"ఉన్నాడా వాడు? బడికెందుకు రాలేదూ?" మళ్లీ ప్రశ్నించింది.
చింటూ వాళ్లమ్మని చేతుల్తో చుట్టేస్తూ "వాడికేదో జబ్బు చేసిందంట, కాన్సరట, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలట" చెప్పాడు మెల్లిగా.
"అయ్యో ఇంత చిన్న వయసులోనే ఎంత కష్టం?" సానుభూతి చూపింది చింటూ తల్లి.
"అమ్మా! ఆ జబ్బు చేస్తే చనిపోతారా?" సందేహంగా అడిగాడు.
"లేదు నాన్నా! మంచి వైద్యం చేస్తే బ్రతుకుతారు" చెప్పింది.
"మరి దానికి డబ్బు ఖర్చు అవుతుంది కదా?" అన్నాడు.
"అవును చాలా కావాలి" చెప్పిందామె.
"పాపం వాళ్లు బీదవాళ్లమ్మా" జాలిగా అన్నాడు చింటూ.
ఆమెకు ఏమనాలో అర్థం కాలేదు.
"మనమేదైనా సాయం చేస్తే " అన్నాడు.
"చేస్తే ఒకసారి చేయగలం. మనమేం ధనవంతులం కాదుగా" అంది.
చింటూ ఆలోచనల్లో పడిపోయాడు.
రోజురోజుకు బాల ఆరోగ్యం క్షీణిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఉచితమే అయినా దూరంగా ఉన్న రాజధాని నగరానికి రాను పోను ఖర్చలను భరించే స్థితిలో లేరు బాలు తల్లిదండ్రులు.
చింటూకి ఈ విషయం భరించరానిదిగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. తనకు తెలిసిన వారందరినీ సలహాలు చెప్పమని అడిగాడు. ఆలోచించగా ఆలోచించగా చివరికి ఒక ఉపాయం తోచింది. వెంటనే తల్లి దగ్గరికి వెళ్లి తనకు సహకరించమని కోరాడు. తర్వాత తన బడికి కాస్త దూరంగా ఉన్న కొట్టు దగ్గరికి వెళ్లాడు. అక్కడ నారాయణ అనే వృద్ధుడు పిల్లలకు రకరకాల తినుబండారాలు అమ్ముతుంటాడు. అతడి అంగడి పక్క కొంత స్థలం ఖాళీగా ఉంటుంది.
చింటూ ఆ స్థలంలో తను దుకాణం పెట్టుకొంటాను అని అడిగాడు. దానికి అద్దె కూడా ఇస్తానని అన్నాడు. అయితే
చింటూ చెప్పిన కారణం విని నారాయణ ఉచితంగానే ఇచ్చాడు.
చింటూకి నిమ్మరసం, చీని పళ్లరసం తయారు చేయడం వచ్చు. వాళ్ళమ్మనడిగి తనకు కావలసిన వస్తువులన్నీ తీసుకొని పళ్ల రసాలు తయారుచేసి అమ్మడం మొదలు పెట్టాడు. విరామ సమయాల్లో, సాయంత్రం దుకాణం నిర్వహించడం మొదలుపెట్టాడు. దానిద్వారా వచ్చిన డబ్బుని తీసుకెళ్లి బాలకి ఇచ్చాడు.
మొదట బాల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయితే చింటూ పట్టుదల చూసి విధిలేని పరిస్థితుల్లో వారు డబ్బు తీసుకోవడానికి అంగీకరించారు. నెలనెలా వైద్యం చేయించుకోవడం వల్ల బాల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. అయితే పూర్తిగా నయం కావడానికి ఇంకా సమయం పడుతుంది. చాలా డబ్బు కూడా ఖర్చవుతుంది.
ఒకరోజు చింటూ దుకాణంలో పళ్ల రసం తాగడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చింటూను చూసి రకరకాల ప్రశ్నలు వేశాడు. తర్వాత అతను వెళ్లిపోయాడు. మరుసటిరోజు చింటూ నిర్వహించే దుకాణం గురించి, వాడు ఎందుకు నిర్వహిస్తున్నాడో కారణాలు వివరిస్తూ వార్తా పత్రికలో ఒక వార్త వచ్చింది. ముందురోజు చింటూ దుకాణానికి వచ్చిన వ్యక్తి ఆ పత్రిక విలేఖరి అన్నమాట.
కొద్దిరోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం చింటూ దుకాణం ముందు ఒక కారు ఆగింది. అందులోనుండి ఒక పెద్దమనిషి దిగాడు. సూటు బూటుతో ఉన్నాడు. ఆయన నేరుగా చింటూ దగ్గరికి వచ్చి "నువ్వు బాగా చీనీ రసం చేస్తావటగా.. ఒక గ్లాసు ఇవ్వు" అని అడిగాడు.
చింటూ అతనికి గ్లాసు అందించాడు.
అతను తాగి “చాలా బావుంది” అని మెచ్చుకుని డబ్బు ఇచ్చాడు. తర్వాత "మీ స్నేహితుడు బాల వద్దకు వెళ్దామా" అని అడిగాడు.
"బాల మీకెలా తెలుసు" అని అడిగాడు చింటూ.
పేపర్లో చదివాను అన్నాడు ఆయన. సరేనంటూ అతని కారులో ఎక్కి బాల ఇంటికి వెళ్లారు. ఆయన బాలని పరామర్శించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు.
తరువాత తన బ్యాగులో నుంచి చెక్కు తీసి ఇచ్చాడు. ఆయన ఎవరో కాదు ఆ జిల్లా కలెక్టర్. పేపర్లో చింటూ తన స్నేహితుడి కొరకు పడే తాపత్రయం వార్తగా వచ్చింది కదా! అది చదివి ఆయన ప్రభుత్వం తరఫున సాయం అందించారు. చింటూ లాంటి మంచి స్నేహితులు దొరకడం బాల అదృష్టం అంటూ మెచ్చుకున్నాడు. అంతేకాదు ముందు ముందు ఏ సాయం కావలసి వచ్చినా తనను కలవమని చెప్పి వెళ్లిపోయాడు.
బాల తల్లిదండ్రులు సంతోషంతో చింటూని
ఆలింగనం చేసుకున్నారు. ప్రభుత్వ సాయంతో బాల వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నాడు. స్నేహం కోసం తన శక్తికి మించి కృషిచేసిన చింటూని బాలల దినోత్సవం రోజున అవార్డు ఇచ్చి సత్కరించాడు కలెక్టర్.
మనం మంచి పనికి పూనుకుంటే ప్రపంచం కూడా సహకరిస్తుంది.
----------
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.
Veeraiah Katam
•4 hours ago
MANCHI KATHA
@HariKrishna-tk8is
• 2 hours ago
మిత్రమా రామారావు,ఒక మంచి కథ పిల్లలకు స్నేహం విలువను తెలుపుతోనే , వారికి జీవితంలో సహాయం చేసే ఒక మంచి గుణాన్ని తెలిపావు.అభినందనలు నా తరపున.