top of page

శ్రమతో నాస్తి దుర్భిక్షం

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #శ్రమతోనాస్తిదుర్భిక్షం, #SramathoNasthiDurbhiksham, #TeluguKathalu, #తెలుగుకథలు, # జానపదకథ


Sramatho Nasthi Durbhiksham - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 10/12/2024

శ్రమతో నాస్తి దుర్భిక్షం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


మిథిలానగరాన్ని రాజధానిగా ఉత్కళ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న మహరాజు చక్రధరుడు పాడిపంటలకు వ్యవసాయానికి ప్రాముఖ్యం ఇస్తున్నందున, అన్ని వృత్తుల వారు కష్టించి పని చేయడంతో రాజ్యంలో పంటలు సమృద్ధిగా పండి, కరువు కాటకాలు లేకుండా, ప్రజలు సుఖసంతోషాలతో జీవనం సాగిస్తున్నారు. 


 ప్రజలలో ఆధ్యాత్మిక భావన కలిగి, దేవాలయాలలో దేవతలకు సక్రమంగా పూజలు జరుగుతూ, దైవచింతనలో దానధర్మాలతో సఖ్యతగా ఉంటూ, ఆనందంగా రోజులు గడుపుతున్నారు. 


మహరాజుకు సంగీతంతో పాటు లలిత కళలంటే ఇష్టం. అందువల్ల రాజ్యంలోని గ్రామాలు పల్లెల్లో ఉన్న కళాకారులను, సాహస యువకులను ఆదరించి వారి ద్వారా యువతకు ఇష్టమైన విద్యలో శిక్షణ ఇప్పిస్తూ పర్వదినాల్లో రాజ సభా ప్రాంగణంలో వారి విద్వత్తుకు పోటీలు నిర్వహించి బహుమతులతో సత్కరించేవాడు. 


సంవత్సరంలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకోడానికి రాజ్యంలో సంచారం చేస్తుంటాడు. ఒకసారి మారువేషంలో గూఢచారులతో కలిసి పయనిస్తే మరొకసారి రాజ దుస్తులతో భటులతో మహరాజులా పర్యటన చేసేవాడు. 


 ఒకసారి సామాన్య వ్యక్తిలా మారువేషంలో ఒకరిద్దరు సైనికులతో పల్లె ప్రాంతంలో రాళ్లు గుట్టల మద్య పయనిస్తుంటే మహరాజు కూర్చున్న అశ్వం కాలికి గాయమై నడవలేకపోతోంది. 


సాధారణ దుస్తుల్లో వెంట ఉన్న భటులు గుర్రం కాలును పరిశీలించి, దాని కాలి గిట్టకు రాళ్ళు గుచ్చుకున్నందున రక్తస్రావం అయిందని, దగ్గరిలోని పల్లెలో జంతువులకు వైద్యం చేసే వైద్యులు ఉంటారని, అక్కడ అశ్వానికి చికిత్స జరపవచ్చని చెప్పడంతో మహరాజు అశ్వం దిగి పాద చలనం చెయ్యసాగేడు. 


 ఆ పల్లె రహదారి ఎత్తుపల్లాలతో మొనతేలిన శిలలు, ముళ్లపొదలతో కష్టసాద్యంగా ఉంది. అశ్వంతో పాటు మహరాజు చక్రధరుడు నడవలేక అతికష్టం మీద సంధ్యా సమయానికి ధర్మపురి అనే గ్రామానికి చేరుకున్నారు. 


 గ్రామం నడిబొడ్డున రచ్చబండ దగ్గర కొందరు గ్రామ పెద్దలు సమావేశమై ఆ ప్రాంతంలో సంభవించిన కరువు సమస్యలను చర్చించుకుంటున్నారు. గ్రామంలోకి కొత్తగా ప్రవేశించిన బాటసారులను చూసి ఎవరు మీరని ప్రశ్నించారు. 


 మేము రాజావారిని దర్శించుకోడానికి వెళ్తున్నామని, దారిలో అశ్వానికి గాయమై నడవలేక పోవడంతో కాలి నడకన వెళ్తుంటే సంధ్యా సమయమైనందున రాత్రికి మీ గ్రామంలో విశ్రమించి అశ్వానికి వైద్యం చేయించి ముందుకు సాగుతామని, మారువేషాలలో ఉన్న రాజభటులు

 వివరించారు. 


మీరు చాల దూరం నుంచి బడలికతో వస్తున్నారు. తప్పక మా గ్రామంలో మీకు ఆతిథ్యం లభిస్తుందని గ్రామ పెద్ద వారికి తాగునీరు, ఉడికించిన మొక్కజొన్న కంకులు, కంద మూలాలు ఆహారంగా ఏర్పాటు చేసారు. 


 రాజభోగాలతో భోజనం చేసే మహరాజు చక్రధరుడికి ఆ తిండి కష్టమైనా ఆకలి తీర్చుకోక తప్పలేదు. 


 పెద్ద వటవృక్షం కింద ఉన్న రచ్చబండకు ఒకవైపు శయనానికి తాటి ఆకుల చాపలు పరిచారు. మెత్తటి తూగుటుయ్యాల తల్పం మీద విశ్రమించే మహరాజుకు కఠినంగా ఉండే ఆకుల చాప మీద నిద్ర రావడం లేదు. కాయకష్టం చేసుకుని బ్రతికే పల్లె జనుల జీవన విధానం అవగతమైంది మహరాజుకు. 


 కొంత సమయం తర్వాత గ్రామపెద్దలు తమలో తాము చర్చించుకుంటూ తమ గ్రామ పరిసరాలలో కరువు సంభవించి పంటలకు పసువులకు నీటి సౌకర్యాలు లేక ఆకలితో అల్లాడుతున్నా మహరాజు తమ గ్రామాల వైపు రావడం లేదని, రాజాధికారులు కప్పం వసూలుకే తప్ప, తమ గోడు వినడం లేదని వాపోతున్నారు. ఈ బాటసారుల ద్వారా తమ గ్రామ కష్టాలు మహరాజుకు తెలియ చేయాలనుకున్నారు. 


 మరుసటి రోజు ఉదయం సామాన్య బాటసారుల్లా ఉన్న గూఢచార సైనికులు గ్రామంలోని జంతు వైద్యుడికి గాయపడిన అశ్వాన్ని చూపగా కాలికి గాయమైనందున ఆకుల తైలంతో పట్టీ వేయవలసి ఉంటుందని కొద్ది దినాలు ఆగవల్సిందని తెలియచేసాడు. 


గత్యంతరం లేక మహరాజు చక్రధరుడు ధర్మపురి గ్రామంలో బస చేయవల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో ఎందుకు కరువు సంభంవించిందని వాకబు చేయగా ధర్మపురి కొండవాలులో నీటి వసతులకు దూరంగా ఉన్నందున పంటలకు నీటి సౌకర్యం లేక బీడుభూమిగా మారిందని అర్థమైంది. 


 గ్రామం కొండవాలులో ఉండి వర్షాకాలంలో పడిన వర్షపునీరు కిందకు ప్రవహించి తర్వాత పంటలకు పసువులకు గ్రాసం సాగునీరు లభ్యం అవక పంటలు పండటం లేదని తెలుసుకున్నాడు మహరాజు. 


 గ్రామ ప్రజలకు సరైన పోషణ లేక బక్కచిక్కి కనబడు తున్నారు. పాడి పసువులు డొక్కలు లోపలికి పోయి బలహీనంగా గోచరిస్తున్నాయి. ప్రజల ముఖాలలో కళలేక విషాదంగా ఉంటున్నారు. గ్రామదేవతలకు పూజా కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదు. జనాలు నిస్తేజంగా కనబడుతున్నారు. 


 మహరాజుకు అసలు విషయం తెల్సిందేమంటె గ్రామంలో యువకులు పనిపాట్లు వదిలి సోమరిపోతులై శరీర శ్రమ చెయ్యడం లేదని తెల్సింది. మహరాజు చక్రధరుడు అశ్వం కాలిగాయం నయమవగానే రాజధానికి చేరుకుని, ధర్మపురి గ్రామంలో మార్పు తెచ్చి మిగతా పల్లె గ్రామాల మాదిరి పాడి పంటలతో కళకళలాడించాలనుకుని ధర్మపురి గ్రామ భూముల్లో పచ్చని పంటలు పండించిన వారికి బహుమతి ప్రదానం చెయ్యడం జరుగుతుందని ప్రకటించాడు. 


 గ్రామంలో పనీపాటా లేక సోమరిగా తిరిగే సునందుడు, మహరాజు ప్రకటించిన బహుమతికి ఆశ పడి ఏదో ఉపాయం ఆలోచించి ఎలాగైనా ధర్మపురి గ్రామంలోకి నీరు రప్పించాలను కున్నాడు. 


తన తోటి యువకులతో ఆలోచన చేసి వర్షాకాలంలో కురిసిన నీటిని కట్టడి చేసి ఒక చోట నిలవ ఉంచి పంట పొలాలకు సాగునీరు, జనాలకు తాగునీరు, పశువులకు గ్రాసం ఉండేలా నీటి ప్రవాహానికి రాళ్లు మట్టి సున్నంతో ఎత్తైన కట్ట నిర్మించాడు. భూమిలో చెరువు మాదిరి విశాలంగా పెద్ద గొయ్యి తవ్వేరు. దానికి కలుపుతూ కిందకు కాలువలు, చెట్ల మానులు, వెదురు బొంగులతో నీటిని ఊరిలోకి రప్పించారు. 


ఇప్పుడు ధర్మపురి గ్రామం పంట పొలాలతో పచ్చగా సస్యశ్యామలంగా కనబడుతోంది. పాడి పసువులు ఆరోగ్యంగా ఉండి పుష్కళంగా పాలు ఇస్తున్నాయి. ఫల పుష్ప వృక్షాలు నిండుగా గోచరిస్తున్నాయి. పక్షుల కిలకిలారావాలతో సందడిగా ఉంది. గ్రామ ప్రజల ముఖాల మీద ఆనందం కనబడుతోంది. 


 గ్రామాధికారి ద్వారా విషయం మహరాజు చక్రధరుడికి తెలిసి స్వయంగా ధర్మపురికి విచ్చేసి ఇంతకు ముందు తను చూసిన గ్రామ పరిస్థితి ఇప్పటి అభివృద్ధిని చూసి ఆనందించి సోమరిపోతు సునందుడిని, మిత్రులను అభినందించి గ్రామ ప్రజల సభలో ధనంతో సత్కరించాడు. 


 అప్పటి నుండి యువతలో స్ఫూర్తి కలిగి గ్రామ అభివృద్ధికి పాటు పడుతున్నారు. 


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


32 views0 comments

Comments


bottom of page