top of page
Writer's pictureSivajyothi

శ్రావణ సంధ్య సమీరమ్



'Sravana Sandhya Samiram' - New Telugu Story Written By Sivajyothi

Published In manatelugukathalu.com On 20/08/2024

'శ్రావణ సంధ్య సమీరమ్' తెలుగు కథ

రచన: శివ జ్యోతి


చల్లని సాయంత్ర సమయం. వీధిలో పిల్లలు కేరింతలు కొట్టే సమయం. ఇళ్లల్లో ఆడవాళ్లు ముచ్చట్లు పెట్టే సమయం. పనులు పెద్దగా లేని మగాళ్లు వాకింగ్ కు వెళ్లే సమయం. రమ హాస్పిటల్లో నొప్పులు పడుతున్న సమయం. కాసేపటి తర్వాత రమతో ‘నీకు పాప పుట్టింది’ అని నర్స్ చెప్పింది. 


హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రమ పాపతో ఇంటికి వచ్చింది. ఎదురింటి నాలుగేళ్ల శ్రావణ్ అమ్మతో పాపని చూడటానికి రమ ఇంటికి వచ్చాడు. ముద్దుగా ఉన్న పాపని చూసి పాప చిన్ని చిన్ని వేళ్ళను పట్టుకొని మెల్లగా అటూ ఇటూ ఊపుతూ ముచ్చట పడ్డాడు. 


పాపకు సంధ్య అని పేరు పెట్టారు. ఐదు సంవత్సరాలు నిండి ముద్దు ముద్దుగా మాట్లాడుతూ నవ్వుతూ ఉండే సంధ్య అంటే ఆ కాలనీలో అందరికీ ఇష్టం. సంధ్య అందరిలోకెల్లా శ్రావణ్తో ఎక్కువ సేపు ఆట్లాడుతూ ఉండేది. స్కూల్ నుంచీ శ్రావణ్ ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉండేది. వారిద్దరూ ఆడుకుంటూ భోజనానికి కూడా వెళ్లేవారు కాదు. వాళ్ల తల్లులు కనీసం భోజనం చేసి వెళ్లండి రా అంటూ గోలపెట్టేవారు. మరుసటి సంవత్సరం సంధ్య కూడా శ్రావణ్ చదివే స్కూల్ లోనే చేరింది 


శ్రావణ్ సంధ్యని స్కూలుకు తన కూడా తీసుకెళ్లాడు. సంధ్య స్కూల్ మొదటి రోజని అమ్మ ఇచ్చి పంపిన చాక్లెట్ డబ్బాలో నుంచి చాక్లెట్లను తీసి వారి మాస్టారులకు తోటి పిల్లలకు శ్రావణ్ చెప్పినట్టు పంచి పెట్టింది. సంధ్యకు శ్రావణ్ ఆటలు నేర్పేవాడు. సమయం గడిచే కొద్దీ సంధ్య శ్రావణ్ను లూడో, క్యారమ్స్, చదరంగం ఆటలో ఓడించేది. 


శ్రావణ్ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడదాము రమ్మని పిలువగానే శ్రావణ్ కాసేపు వెళ్లి తిరిగి వచ్చి సంధ్యతో ఆడుకునేవాడు. సంధ్య తన ఎనిమిదో తరగతి సెలవులలో వయసుకు వచ్చింది. శ్రావణ్ ఇంటర్ పరీక్షలు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి డాక్టర్ చదవడానికి ప్రవేశ పరీక్ష కోసం రాత్రి పగలు తేడా లేకుండా చదివి సిద్ధమవుతున్నాడు. 


 శ్రావణ్ పట్టుదలకు ఫలితం దక్కింది. అతడికి ఢిల్లీ ఎయిమ్స్ కాలేజీలో సీటు వచ్చింది. శ్రావణ్ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పట్టలేనంత సంతోషాన్ని గుప్పిట పట్టుకుని మనసు నిండా మూట కట్టుకుంటున్నారు. వారు. శ్రావణ్ సంధ్యతో చెప్పి ఢిల్లీకి బయలుదేరాడు. మొదటి సంవత్సరంలో సంధ్య ఎలా ఉన్నావు అని అడుగుతూ వారం వారం ఫోన్ చేసేవాడు శ్రావణ్. రెండవ సంవత్సరం వచ్చేసరికి వారంలో ప్రతి రెండో రోజు చేసేవాడు. 


 తన కాలేజీ విశేషాలు అన్నీ చెబుతూ ఫ్రెండ్స్ గురించి లెక్చరర్స్ గురించి మాట్లాడేవాడు. సంధ్యను శ్రావణ్ బాగా చదవమని చెప్పేవాడు. సంధ్య ఇంటర్లో ఎంపీసీ తీసుకుంది. హాస్టల్ లో చేరింది. శ్రావణ్ ప్రోత్సాహంతో సంధ్య చాలా బాగా చదివింది 


 మద్రాస్ ఐఐటీలో సీటు సంపాదించింది. హాస్టల్ నుంచి సంధ్య ఇంటికి వస్తుందని తెలిసినప్పుడు సెలవు పెట్టి మరి ఇంటికి వచ్చేవాడు శ్రావణ్. ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళిపోయేవాడు కాలేజ్ వెళ్లిన తర్వాత దాదాపుగా ప్రతిరోజు సంధ్యకు కాల్ చేసేవాడు. 


 శ్రావణ్ కాల్ వస్తే ఒక్క ఉదుటన వచ్చి ఫోన్ అందుకునేది సంధ్య. 



సఖ్యమా ఓ స్నేహమా 

నీతో ఉన్నా నా జ్ఞాపకాలు సఖ్యమా


 నాదైన నీ సమయం సఖ్యమా

 మన ఇద్దరి సంతోష క్షణాలు సఖ్యమా


 స్నేహ సముద్రంలో కొట్టుకుపోయిన దుఃఖ కెరటాలు సఖ్యమా 


అని అడిగేవాడు. 


ఒక్కరోజు శ్రావణ్ కాల్ చేయడం ఆలస్యం అయితే గుబులుగా ఉండేది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కానీ ఒకరికొకరు బయట పెట్టలేదు 


 ఒకరిపై ఒకరికి ఉన్న వారి అభిమానం అనే మొగ్గ "విచ్చిన ప్రేమ" అనే పువ్వు అయింది- అని ఒకరికొకరు చెప్పాలని ఎంతో ఆరాట పడ్డారు కానీ ఎందుకో చెప్పలేకపోయేవారు. మరుసటి సంవత్సరం సెలవులకు వచ్చిన శ్రావణ్ సంధ్యను ఇదివరకు ఎన్నడూ తనని చూడని చూపులతో కొంటె మాటలతో కవ్వించ సాగాడు. 


సంధ్యకు అతని చూపులు మాటలు చాలా బాగా అనిపించేది. సంధ్య ఎంతో సిగ్గుపడిపోయేది. వారి ప్రేమను వ్యక్తపరచుకొని తమ హృదయాంతరంగాలలో ఒకరంటే ఒకరికి ఉన్న విశిష్ట స్థానానికి స్నేహం నుంచి ప్రేమ అనే పదోన్నతినిచ్చి పట్టాభిషేకం చేశారు. 


సంధ్య శ్రావణ్ కలిసి సినిమాకి వెళ్లేవారు, షాపింగ్ చేసేవారు, బీచ్ కి వెళ్లేవారు. "ఇది కాదా ఆనందం ఇదే కదా మరులొలికే మదన మంచి గంధం "అనుకున్నారు. 


 శ్రావణ్కి ఢిల్లీ ఎయిమ్స్ లోనే జాబ్ వచ్చింది సంధ్యకు తన మొదటి సాలరీలో నుంచి అందమైన ముత్యపు బంగారపు ఉంగరం తీసుకొచ్చాడు. ఇంట్లో సంధ్య నాన్నని అడిగి డబ్బులు తీసుకొని ఉంగరం కొంటానని చెప్పి శ్రావణ్కు వాచ్ కొనిచ్చింది. శ్రావణ్ తెచ్చిన ఉంగరాన్ని తనే కొన్నాను అని చెప్పి ఇంట్లో చూపింది. 


 ఒకసారి శ్రావణ్ బంధువుల పెళ్లికి తన అమ్మానాన్న ఇద్దరు వెళ్లారు. శ్రావణ్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. సంధ్య అలవాటుగా శ్రావణ్ని పలకరించడానికి వెళ్ళింది. వారి ఏకాంతం సంధ్యను తన వయస్సు గుర్తు చేసుకోమన్నట్టుగా, తన మనస్సు తెలుసుకోమన్నట్టుగా చెప్పింది. ఆ ఉద్వేగక్షణాన సంధ్యకు శ్రావణ్ మగసిరికి ముచ్చట పడాలనిపిస్తుంది. 


సంధ్య ఆ చిలిపి భావనలు శ్రావణ్కు తెలియకుండా ఉండడానికి తెగ కష్టపడుతుంది. సంధ్య మాటల్లో తడబాటు, ఆధారాల్లో అదురు, కంపించే శరీరం సంధ్య మనసులో అణగదొక్కుకున్న ఆ భావాలను అంతో ఇంతో శ్రావణ్కు చూపించేసినట్టుంది. 


అతను ఆమెకు దగ్గరగా అభిముఖంగా జరిగాడు. సంధ్య ఆధరాలను తన పెదవులతో బిగించేశాడు. కళ్ళు మూసుకుంటున్న సంధ్యను చూస్తూ ఉన్న శ్రావణ్ ఆమెను మరింత గట్టిగా తన కౌగిలిలో బంధించాడు. ఆపై జరగబోయే దాన్ని ఆపేస్తున్నట్టుగా సంధ్య అతడిని పక్కకు తోసేసింది. 


సంధ్య పక్కగా నిలబడి ఆమె చేతి వేళ్లను అందుకుని గిల్లుతూ తీయటి కబుర్లు ఎన్నో చెప్పాడు. సంధ్య అతడితో ఉన్నంతసేపు తన ఊహల రెక్కల గుర్రాన్ని ఎక్కి స్వారీ చేసేది. అతడు దూరంగా ఉన్నప్పుడు సంధ్య మది చిత్రంగా తన కట్టుబాట్లని ఛిద్రము చేసేది. 


సంధ్య ఊహలు తన మొహమాటాన్ని, సిగ్గు, కలవరం, భయాన్ని తలంపుకైనా తీసుకొచ్చేది కాదు. ఈ తర్జనభర్జనను, శ్రావణ్తో తన విరహాన్ని అంతం చేయాలని అన్నట్టుగా ఒక దృఢ నిశ్చయానికి వచ్చి అతనితో తన భావాలను చెప్పాలనుకుంది. 


 సంధ్య గురించి తెలిసిన వాడిలా శ్రావణ్ ‘మనం పెళ్లి చేసుకుందామా’ అని అడిగాడు సంధ్య కలవరపడి సరేనని ఒక్క క్షణం ఆగకుండా చెప్పింది. ఇంతలో అతని ఫారిన్ ఆఫర్ గుర్తొచ్చింది. రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పింది. అంతలోగా వారి ఇరువురు కెరీర్లో సెటిల్ అవ్వచ్చని గుర్తుచేసింది. శ్రావణ్ సరేనన్నాడు. 


 శ్రావణ్ “నీ భావాలే నా ఆలోచనలు కూడా నీ విరహం నేను కూడా భరించకున్నాను. మన ఆలోచనలు అంతరాలు లేకుండా ఒక్కటైనప్పుడు మనం కూడా ఒక్కటవ్వాలి” అని అన్నాడు. సిగ్గు పడింది. 


 అతడు ఆమెను చిలిపిగా చూసాడు. అంతలో సంధ్య ఆలోచనల్లో నువ్వు ఏం చేసినా నేను వద్దనననీ చెప్పాలనుకుంది. కానీ నిజంగా మనం ఒక్కటే అయ్యేది మాత్రం మన పెళ్లయ్యాకనే అని చెప్పి ఫక్కున నవ్వింది. అతడు సరేనని చెప్పి కవ్వించి తీరా ఇది న్యాయమేనా అంటూ విన్నవించుకుని చిన్నబుచ్చుకున్నాడు. సంధ్య నేను ఎప్పుడు సర్లే అని అన్నాను అని చెప్పి, పెళ్లయ్యాక ఈ అన్యాయానికి న్యాయం చేస్తాను అంటూ నవ్వేసింది. సంధ్య తరువాతి రోజు శ్రావణ్తో చెప్పి హాస్టల్ కి బయలుదేరింది. 


సంధ్యకు ఆ సమయంలో చెప్పలేని బాధ అనిపించింది. అతడికి ఆమె కొన్ని యుగాల దూరానికి వెళ్లిపోతున్నట్టుగా అనిపించింది. 15 రోజుల తర్వాత అతడు ఫారిన్ వెళ్ళిపోయాడు. అక్కడినుండి అతను తల్లిదండ్రులకి రోజు కాల్ చేసేవాడు. సంధ్య తల్లిదండ్రులతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు. సంధ్యకు మాత్రం ప్రతిరోజు వీడియో కాల్ చేసేవాడు. 


సంధ్య కొత్త చీర కట్టుకున్న, టైట్ జీన్స్ వేసుకున్న, ఏ చిన్న విషయమైనా, తనలో ఏ చిన్న మార్పైనా. శ్రావణ్కి కనిపించేలా ఆపాద మస్తకం చూపించేది. శ్రావణ్ గోముగా సంధ్య ఇంత నీ అందము నాకెప్పుడూ సొంతమవుతుంది అని అడిగేవాడు సంధ్య కిలకిలా నవ్వుతూ పెళ్లి దాకా ఆగండి సార్ అని అనేది. చూస్తూ ఉండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. 


 శ్రావణ్ తల్లిదండ్రులతో తను రాగానే సంధ్యతో పెళ్లి ఏర్పాట్లకు అనుమతి తీసుకున్నాడు. వారు సంధ్య తల్లిదండ్రులని వీరిద్దరి వివాహానికి ఒప్పించారు. పెళ్లి కుదిరింది. శ్రావణ్ సంధ్యకు ఫోన్ చేసి తిరుగు ప్రయాణానికి ఫ్లైట్ ఎక్కాడు. శ్రావణ్ని చూడబోతున్నానని ఆలోచనతో సంధ్య భూమి ఆకాశం ఏకమైనంత ఆనందంలో ఉంది. బయలుదేరేటప్పుడు 


రాగానే నిశ్చితార్థము, వారం రోజులలోనే పెళ్లి అని అనుకున్నారు. ఉంగరాలు తెప్పించారు. సంధ్య షాపింగ్ మొదలెట్టింది. బోటీకుల చుట్టూ తిరిగింది. చీరలకు బ్లౌజులు కుట్టించింది. మ్యాచింగ్ గాజులు కొనుక్కుంది. నగలు కొనుక్కుంది. 


పెళ్లిలో తన ఫ్రెండ్స్ వేసుకోవాలనుకున్న బట్టలను అందరికీ ఒకేలాగా డిజైన్ లో కొనిపెట్టింది. శ్రావణ్ ఫ్రెండ్స్ కి ఒకే రకమైన సూట్స్ కొన్నది. పెద్దవాళ్లు పెళ్లి పిలుపులు మొదలెట్టారు. హనీమూన్కి ఫ్లైట్ టికెట్స్ రిజర్వ్ చేసుకుంది. హోటల్స్ బుక్ చేసింది. హనీమూన్ కోసం తను కొన్న బట్టలని శ్రావణ్ కి ఫోటో తీసి పంపింది. 


ఫ్లైట్ ఒక అరగంటలో ఎయర్పోర్ట్ చేరుతుందని ఉన్న సమయంలో శ్రావణ్ కోసం సంధ్య ఇంకా ఆమె తల్లిదండ్రులు శ్రావణ్ తల్లిదండ్రులు అంతా ఎయిర్పోర్ట్ చేరారు. ఎయిర్పోర్టులో ఒక అనౌన్స్సర్ ఏదో చెప్తోంది. ఎయిర్పోర్ట్ అంతా కలకలం రేగింది. 


సంధ్య మరొక మారు ఆమె ఏమి చెప్తోందో విన్నది. అనౌన్స్సర్మాట విని సంధ్య కదల లేని దానిలా నుంచుంది. అందరికీ ఆ మాటలు అవగతం అయ్యి బోరుమని ఏడుస్తున్నారు. శ్రావణ్ వస్తున్న ఫ్లైట్ యాక్సిడెంట్కు గురి అయిందని, ప్రయాణికులు ఎవరూ మిగలలేదని, విమానం కాలి బూడిద అయిందని అనౌన్స్ చేశారు. 


సంధ్య కాలి కింద భూమి కంపించినట్టయింది. సంధ్య తల్లిదండ్రులు, శ్రావణ్ తల్లిదండ్రులు, సంధ్య ఒకరినొకరు పట్టుకొని ఒకరికొకరు సాయం అవుతున్నట్టు ఓదార్చుకుంటూ ఏడుస్తూ ఇల్లు చేరారు. ఇంటి దగ్గర వారి కారు కోసం ఎదురుచూస్తున్న బ్యాండ్ మేళం వాళ్ళు మంచి పాట అందుకున్నారు. వాళ్లని వారిస్తున్నట్టు కారు దిగిన సంధ్య నాన్న సైగ చేశాడు. వారికి ఇవ్వవలసిన పైకం ఇచ్చి వారిని తిరిగి పంపేశాడు. 


పెళ్లి ఏర్పాట్లు కోసం చేసిన క్యాటరింగ్ వాళ్లకు, షామియానా వాళ్లకు, లైటింగ్ వాళ్లకు, ఒక్కొక్కరిగా పిలిచి వారికి ఇవ్వవలసిన డబ్బు ఇచ్చి తిరిగి పంపేశారు. బంధువులు ఒక్కొక్కరు తమ ఇల్లు చేరారు. కొన్ని రోజులు చాలా నిశ్శబ్దంగా ఎంతో భయంకరంగా గడిచాయి. నిదానంగా అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండడం అలవాటు చేసుకున్నారు. శ్రావణ్ ఇక లేడు అన్న విషయం వారు పూర్తిగా ఆకలింపు చేసుకున్నారు. 


శ్రావణ్తల్లిదండ్రులు ఇక ఆ వాతావరణంలో ఉండలేక తిరిగి తమ గ్రామానికి వెళ్లిపోయారు. సంధ్య ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. తన తల్లిదండ్రుల వారింపుతో ఇక వారి కోసమైనా బ్రతకాలని నిశ్చయించుకుంది. సంధ్య మెల్లమెల్లగా తన దైనందిన జీవితం వెళ్లదీయడానికి సిద్ధమవుతోంది. దానికి నిమిష నిమిషాన తనకు గుర్తు వస్తున్న శ్రావణ్ ను మనసులో ఉంచి మిగతా పనులు చేయడం మొదలు పెట్టింది. 


 అంతవరకు మూగనోము పట్టిన దానిలా ఉన్నా ఆమె ఒక్కొక్కరితో ఇప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అన్నట్టు ఒక్కో మాట మాట్లాడ సాగింది ఆఫీస్లో ఉద్యోగానికి చేరింది. తన జీవితం వెళ్ళదీస్తుంది. పది సంవత్సరాలు గడిచిపోయాయి. 


తనతో పని చేసే తోటి ఉద్యోగి సమీర్ ఈ పది సంవత్సరాలుగా సంధ్యను తను ఎంత ప్రేమించి ఎదురు చూశాడు అని చెప్పి సంధ్య తల్లిదండ్రులతో సంధ్యను తనకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. సంధ్య తల్లిదండ్రులు వయసు అయిపోతున్న సంధ్యను చూసి కలవర పడని రోజు లేదు బలవంతంగా సంధ్యకు పెళ్ళి చేయాలని నిశ్చయించి బ్రతిమలాడారు. సంధ్య సమీర్తో మాట్లాడి తను కేవలం తన తల్లిదండ్రుల కోసమే పెళ్లికి ఒప్పుకుంటానని పెళ్లి సింపుల్గా రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలతో జరగాలని తన శరీరంపై మనసుపై ఇంకా శ్రావణ్ ఒక్కడికే అధికారం ఉందని అతడిని మరచిపోవడం సాధ్యం కాదని చెప్పింది. 



సమీర్ సంధ్య చెప్పిన అన్నింటికి ఒప్పుకున్నాడు. ఏదో ఒక రోజు తను ఆమెపై చూపించే ప్రేమ శ్రావణ్ను మరిచిపోయేలా చేస్తుందని తనకు నమ్మకం ఉందని చెప్పాడు. సంధ్య అన్నట్టుగానే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సంతకాలు చేసి సమీర్ సంధ్య ఇంటికి తిరిగి వచ్చారు. 


గుమ్మం ముందు తాళం వేసిన తలుపులను చూస్తూ ఒకతడు అటుగా తిరిగి ఉన్నా ఎక్కడో చూసినతనిలా అనిపించి సంధ్య తండ్రి ఎవరు అని అడిగాడు. ఇటు తిరిగిన అతడిని చూచి శ్రావణ్ అని గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 


అందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులు అయ్యారు. సంధ్య పట్టరాని ఆవేశంతో పరిగెత్తుకెళ్ళి శ్రావణ్ను కౌగిలించుకుంది. ఇదివరకే శ్రావణ్ ఫోటో చూసి ఉండడం వల్ల శ్రావణ్ గురించి సంధ్య చెప్పి ఉండడం వల్ల సమీర్ అతడు శ్రావణ్ అని తేలికగానే గుర్తుపట్టాడు. పెళ్లి బట్టలలో మెడలో తాళితో ఉన్న ఆమెను తదేకంగా చూస్తూ ఉన్న సమీర్ను చూచి శ్రావణ్ మెల్లిగా సంధ్యను పక్కకు తోసినట్టుగా జరిపాడు. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియలేనంతగా ఆందోళనకు గురి అయిన సంధ్య కళ్ళు తిరిగి కిందపడిపోయింది. 


 ఆమెను ఇంటిలోకి తీసుకుపోయారు. డాక్టర్ ఇంటికి వచ్చి పరీక్ష చేశాడు షాక్ వల్ల అలా అయ్యుంటుందని కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఎవరు ఏమి చేయాలో అర్థం కాక శ్రావణ్ సమీర్ రోడ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు తిరిగి వెళ్లిపోయారు. రోడ్డు చివరిదాకా వెళ్ళిన శ్రావణ్ ఇక ఆపై వెళ్లలేకపోయాడు. నుంచున్న చోటే నిస్తేజంగా, నిర్లిప్తంగా, నిరాశగా నిశ్చేష్టుడు అయ్యి నుంచుండిపోయాడు. 


 వెనకకు మరల లేదు. ముందుకు కదలలేదు. సమాజానికి వెరవలేదు. సంధ్యకు కాసేపటి తర్వాత మెలకువ వచ్చింది. వెంటనే తన ఆలోచన అనే వలయం తనని చుట్టేసినట్టుంది. 


 ఇప్పుడు ఆమె ఏమి చేయబోతోంది? ప్రాణంలో ప్రాణం అనుకున్న శ్రావణ్ దగ్గరకు వెళుతుందా? పదేళ్లుగా తనకు దక్కదని తెలిసిన సంధ్య కోసమే ఎదురు చూసి అగ్నిసాక్షిగా మనస్సాక్షిగా వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న సమీర్ దగ్గరకు వెళుతుందా? 


సమాధానం తెలియని ప్రశ్నలకు ఒక్కోసారి సృష్టి సమయం సమాధానం చెబుతుంది. ఆ సమాధానంతో కాసేపటి తర్వాత ధృడ నిశ్చయంతో వచ్చిన సమీర్ సంధ్య దగ్గరకు వెళ్ళాడు. ఆమె చేయి పట్టుకుని తన వైపుగా తిప్పుకున్నాడు. ఆమె గుండెలపై వేలాడుతున్న తాళిని భక్తితో పారవస్యంతో చేతిలోకి తీసుకొని చూస్తున్నాడు. 


 సంధ్య కంట్లో కన్నీళ్లఆగలేదు. ఆ తాళిని ఆమె మెడలో నుంచి తీసేసి తన జేబులో వేసుకున్నాడు. సంధ్య కృతజ్ఞతా భావంతో సమీర్ని తల ఎత్తి ఒక్కసారి చూసి నమస్కరించింది. మరుక్షణాన తనకోసం మరులు గొలుపుతూ ఎదురు చూస్తున్న శ్రావణ్ దగ్గరకు మంచు తెరలు తెరుచుకున్న దానిలా పరుగు తీసింది. 


 టక్కున వెళ్లి అతడి అక్కన చేరింది. తమ కలయికకి సమ్మతం తెలిపిన దానిలా ఆకాశం తన అక్షింతలని లక్షింతలు చేసి వానగా కురిపించి ఆశీర్వదించింది. శ్రావణ్ తను ఆ ప్రమాదంలో బ్రతికి బయటపడ్డానని, ఫ్లైట్ నుంచి దూరంగా విసిరేయపడ్డ తాను ఇన్నేళ్లు కోమాలో ఉన్నానని, ఎవరో కాపాడితే కోమాలోనుంచి బయట కొచ్చి ఇప్పుడు సంధ్య ఇల్లు చేరానని చెప్పాడు. సంధ్య ప్రశాంతంగా తలచి తన ప్రియమైన భావాల వారధికి సారధిగా వచ్చిన శ్రావణ్ గుండెలపై తన తల ఆనించి హత్తుకుంది. శ్రావణ సంధ్య సమీరాన్ని విడిచి అందం లోయల్లో ఆనందం అంచుల్లో హాయిగా నిదురించింది. 


***

శివ జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం:

నా పేరు శివ జ్యోతి . నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని. నాకు రచనలపై ఉన్న ఆసక్తితో కథలు రాయడం కవితలు రాయటం మొదలు పెట్టాను . నాకు సమాజంలో జరిగే అన్యాయాలను ఆసక్తికరంగా రాయడం అంటే ఇష్టము. నా రచనలు పాఠకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.


74 views0 comments

Commenti


bottom of page