top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

శ్రీ రామ శతకము


'Sri Rama Sathakam' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally

'శ్రీ రామ శతకము' తెలుగు పద్య శతకం

రచన : సుదర్శన రావు పోచంపల్లి


1.)శ్రీరాము డనగ దేవుడు

ఆరాము మనమున దలువ ఆర్తియు తొలగున్

శ్రీరాము దలచి నిత్యము

పారాయణ మనగ సలుప బాగెము రామా


2.)తలిదండ్రి మాట వేదము

చలిదాయ అభిజన జనన చరితయు నుండన్

పలుకగ సౌమ్యమె అనగను

కులమున శూరుడు అయినను కూరడు రామా


3.)దశరథ నందను డనగను

విశదపు పలుకులె నెపుడును వినగను నుండన్

కుశలమె దలచును పాళెము

అశనము లోటును కనకను అందరు రామా

4.)తనకును తానుగ దేవుడ

ననుచును తెలుపగ నెరుగడు నరులకు నెపుడున్

జనమున మానవ రూపమె

కనగను నుండును రఘుపతి ఘనతన రామా


5.)అమ్మల యందున గోముయు

తమ్ముల యందున అభిమతి తనరగ నుండన్

సమ్మత మొందగ జనులను

ఇమ్మహి పాలించె రఘుపతి ఇలలొ రామా


6.)ఇనకుల రాముడు అయ్యును

కనగను చంద్రుని సమభిధ కలిపియు బిలువన్

జనమున సంతస మనగను

వినగను అందమె అగునిక విపులన రామా


7.)మాయలు జేయడు రాముడు

సాయము జేయను దలుచును శత్రువు కైనన్

హేయపు పలుకుల నోపడు

జాయయు అయినను దరుమమె జగమున రామా


8.)ఎంగిలి ఫలములు బెట్టగ

సంగతి దెలిసియు శబరితొ సంతస మొందన్

పొంగెను మనమున భక్తికి

మింగుచు రుచిగని ఫలములు మిన్నని రామా


9.)సీతను కానన బంపుట

చేతను రాముడు మనమున చెదిరిన గూడన్

నీతికి నిలబడు విధముయె

జాతికి దెలుపను దలచెను జగమున రామా


10.)రాతిని నాతిగ జేయ

ఖ్యాతియు గలిగెను కపిరథు కనగను నింకన్

ప్రీతియు గలిగెను గౌతమ

నాతికి శిలయగు అడపొడ నాశము రామా


11.)ధావకు మాటలు వినగను

భావము చివుకగ రఘుపతి భార్యయు అనకన్

పోవగ బంపెను అడవికి

దేవరు గైకొని విడువను దేశము రామా


12.)పశుపతి ధనువును ద్రుంచియు

పశుపతి అంశజు ఎపుడును పాదము బట్టన్

దశకంఠు దునిమి సీతను

వశపర్చు కొనియు వెనుకకు వచ్చిన రామా


13.)ముగ్గురు తమ్ములు సుగుణులు

ముగ్గురు అమ్మలు అనురతి ముదమన గుండన్

తగ్గని యశముతొ రాముడు

మొగ్గెను ఏలగ పుడమిని మోదము రామా


14.)కులగురు ద్వేషిని గురువుగ

దలచియు రాముడు కదలెను దావము జేరన్

బలమగు రక్కసి మూకల

బలహీన బరచి దునిమెను బాగన రామా


15.)పదహారు వయసు ప్రాయము

పదమని కౌశికు ఒలయగ ప్రాంతర మరిగెన్

ముదల మనగ మునిఈయగ

కదలెను రక్కసి దునుమను కానన రామా


16.) దాసగు మంథర దునుముట

దోసము అనుచును భరతుని దొడ్డగు మనసున్

ఊసును మరువగ జెప్పెను

కోసల రాజగు రఘుపతి గోముగ రామా


17.)అంగజ హరు ధనువును అట

భంగము జేసియు కపిరథు భామను సీతన్

బెంగయు దొలుగగ మనసున

పొంగను హర్షము పొలతిని పొందెను రామా


18.)రాముడు సీతయు లక్ష్మణు

గోముగ గొలిచెడు హనుమయు గోసయు లేకన్

రాముని రాజ్యము నందున

సేమమె ఎపుడును కనగను చెప్పగ రామా


19.) నీతికి రాముడు నిలువ

ఖ్యాతియు బెరిగెను పుడమిన కానగ నుండన్

సీతయు తోడుగ నిలువ

భ్రాతలు గూడను ఒరిమన భాగ్యమె రామా


20.)మొదటన నవ్వుచు బలుకును

వదనము నందున అమలము వసుమతి విభుడున్

కదనము నందున రాముడు

అదరడు బెదరడు అదియన అమరికె రామా


21.) పంటవ లతిసుత సీతయు

జంటగ రాగను రఘుపతి జంగల మరుగన్

వెంటను లక్ష్మణు డరుగగ

ఒంటరి సీతను దశానను ఒడుచె రామా


22.)ఇనవంశ మందు గనగను

ఇనకుల తిలకుడు రఘుపతి ఇలలో జూడన్

జనరంజకమన నేలెను

కనగను రాజ్యము సుఖమన కలుగగ రామా


23.)యుగములు మారిన రాముని

జగమున దలచెడి విధముగ జాగ్రత తోడన్

స్థగణము నేలెను రఘుపతి

నగరము గ్రామము ప్రజలును నయమన రామా


24.)బలమున రాముని మించిన

బలశాలనగను గనరన భరణిన జనులున్

ఇలలో రాముడె విష్ణువు

కలిమన జనముకు విభవమె కాంచగ రామా


25.)గుహుడను నిషాద రాజుయె

అహమన లేకను రఘుపతి అడుగగ త్వరితన్

సహనము తోడను పడవలొ

వహతీర మనగ తరించె వారిని రామా


26.)రాజగు గుహునితొ రాముడు

సాజము ప్రేమను కనగను సౌమిత్రనగన్

నైజము మెచ్చుచు గుహునిది

భాజన మంతయ అనుచును భ్రాంతితొ రామా


27.)హనుమయు దెలిపెను సీతకు

వినుమని రాముని వివరము వినయము తోడన్

ఘనుడగు రాముని సుగుణము

కనగను రూపము అటులనె కాంచగ రామా


28.)అందము నందున చంద్రుడు

అందరి కంటెను ఘనుడుగ అగుపడ నుండన్

మందస్మితుడును రాము

స్యందన మెక్కగ గనపడు సవితగ రామా


29.)రాముని గుడియన లేక

గ్రామము ఉండదు కనగను కారణ మనగన్

రాముడు రాజుగ ఉండియు

దేముని మాదిరి గనెనన దేశము రామా


30.)ఇనవంశ మందు రాజుల

కనగను మాటీయ మరచి కాదన రెపుడున్

వినగను కైకేయి వరము

అనగను రాముని అడవికి అంపిరి రామా


31.)సేతువు గట్టగ బూనగ

కోతుల తోడుగ ఉడుతల కోటియు రాగన్

చేతితొ దువ్వగ రాముడు

నూతన చారలు సమకొన నుండెను రామా


32.)పుణ్యజను డయ్యు రావణు

పుణ్యపు కార్యము లనగను పురమున జేసెన్

ధన్యుడు కులముల నూడిచె

అన్యులు మెచ్చని విధమును అడుగక రామా


33.)నవఖండ అధిపతయ్యియు

అవమాన మనక హనుమను అక్కున జేర్చన్

అవనిన అంతటి ప్రభువన

ఎవరును ఎచటను కనివిని ఎరుగరు రామా


34.)ఎందరొ రాజులు పుడమిని

ముందున ఏలిరి వినగను ముఖ్యులు అనగన్

అందరి కన్నను రాముడె

వందల రెట్లుగ అధికము వసుధను రామా


35.)రావణు డనగను అందరి

భావన భగదేవు డనగ బలపడి యుండన్

దీవినరాయుడన ప్రజల

దీవెన లందుచు మెలగెడి ధీరుడె రామా


36.) అనిలో తమ్ముడు మూర్చిల

కనగను యేడ్చుచు రఘుపతి కలతయు జెందెన్

హనుమను బంపెను సంజీ

వనగను దేగను హిమగిరి వనమున రామా


37.)పుత్రుల గోరేడి వ్రతము

పుత్రుల కొరకని దశరథు పూనియు జేయన్

పుత్రులు నలుగురు బుట్టిరి

మిత్రుని వంశము పొదలగ మిన్నగ రామా


38.)రాముడు భరతుడు లక్ష్మణు

గోముగ శత్రజ్ఞు డనుచు గోరుచు పేర్లున్

గాముల రేడుని వంశము

సేమము దలచుచు పలికిరి చెప్పగ రామా


39.)కనగను మదవతి సుమమును

అనగను మదిచెద రదయని అడుగను వినుచున్

గనిరాము డనెను లక్ష్మణు

వినుమది తలిదండ్రి పెనుచు విధమని రామా


40.)చదువులు అనగను నేర్చిరి

ముదముగ నలుగురు వసిష్ఠు మునికడ ననగన్

అదుపులొ ఉంటును వేదము

మొదలగు జదువులు జదివిరి మోదమె రామా


41.)జనకుని సభలో రాముడు

జనకుని కూతురు ధరణిజ జాయగ బొందన్

వినుసిగ దేవర ధనువు

క్షణమున విరిచియు జయించె క్ష్మాజను రామా


42.)అగునాదిత్యహృదయముయె

తగునని దెలిపెను అగస్త్యు తపనుని దల్వన్

పగతుని గెల్వగ వచ్చని

జగడము నందున రఘుపతి జయమని రామా


43.)శాంతపు చిత్తము రాముకు

కాంతల దిశకును మనసిడి కానడు జూడన్

ధ్వాంతము పగలును ధర్మమె

శాంతము తోడనె శరీరి శమమను రామా


44.)పసిపిల్ల లముసిము సినగు

రసమును సీతా రమణుడు రంజిల కుండన్

అసమాను లయిన పుత్రుల

దెసయన గాంచెను మునికడ దెలువగ రామా


45.)అనలము పరీక్ష అనగను

వినగనె ధరణిజ అటమట వీడక నపుడే

మనమున ధరణిని దలువ

క్షణమున తేరువు గనగను కదిలెను రామా


46.)జనకుని పొలములొ దున్నగ

కనబడె బంగరు బదరిక కాంతులు మెరయన్

కనకపు పెట్టెలొ పాపయు

అనగను సీతని జనకుడు అనెనిక రామా


47.)అవనిజ నశోక వనమున

లవముయు వసతియు గనకను లంకలొ నుంచన్

భువనపు సుందరి సీతయు

అవిధితొ కాలము గడిపెను అచటన రామా


48.)కానన రాముడు ఉండగ

తానును వచ్చియు భరతుడు తగదిచ టనగన్

రానని పాదుక లీయగ

మానిక మనచును భరతుడు మరలెను రామా


49.)లవకుశు లిద్దరు తనసుతు

లవటము దెలియక రఘుపతి లక్ష్యము విడకన్

అవనిజ అగుపడు వరకును

కవిదల జేసెను సుతులతొ కానగ రామా


50.)అజగవ మిరిచియు రాముడు

విజయము పొందియు అవనిజ వివహము బొందన్

భుజబల మెంతయొ దెలియగ

సుజనుడు అనిరిక సభికులు జూడగ రామా


51.)నడవడి జెడకను నడుచుచు

అడుగిడు టందున తడబడు అడుగులు లేకన్

బడబడ బలుకక సయిపుడు

పుడమిన రాముడె ఒడికము పురుషుడు రామా


52.)సీతకు రాముడె అజుడు

భ్రాతగ జూసును మరుదుల భావము నందున్

మాతగ అత్తల జూడను

చేతన జెందిన విధమన చెప్పగ రామా


53.)పిబరే రామర సంబన

సబబగు జిహ్వకు నొనరుచ సతతము అనగన్

అభయమె రాముని మంత్రము

విభవము గలుగును దలువగ విపులన రామా


54.)రాముని రాజ్యపు విధము

క్షేమము అగునిక ప్రజలకు క్షేత్రము నందున్

రాముని పాలన అనగను

దేముని వలనన శరణమె దెలియగ రామా


55.)సత్యము ధర్మమె వ్రతమన

నిత్యము రాముని విధమన నిక్కము గాగన్

ముత్యము కడిగిన విధమగు

సత్యము రాముని ప్రభుతన సహురిన రామా


56.)రాముని రాజ్యము అనగ

క్షామము నెరుగరు ఎచటను క్షాంతిని గనగన్

ఆమము గూడను గనరన

క్షేమము గుందురు సతతము గేహము రామా


57.)అమ్మయు తమ్ముడు వద్దన

సమ్మత మొందక కపిరథు సాగెను దీక్షన్

తమ్ముడు లక్ష్మణు తోడుగ

అమ్మహిసుతయును అరుగగ అడవికి రామా


58.)సుందర కాండము జదువను

అందును సుఖములు అధికము అనగను ఇంకన్

అందురు బీజము కాండము (బీజ కాండము)

అందరు జదివెడి మనువన అంజియె రామా


59.)హనుమయు దెలిపెను సీతకు

వినుమని రాముని గుణగణ వివరము లన్నిన్

జనకుని సుతయది వినగను

మనమున తృప్తితొ శ్రమమును మానెను రామా


60.)లంకలొ సీతను జూడగ

సంకట మనగను గనియిక శంకయు లేకన్

లంకను గాల్చగ బూనెను

లంకేశు భవనము మొదలు రగులగ రామా


61.)దినకర తనయుతొ రాముడు

కనగను స్నేహము ఘటించె కానన మందున్

జనకుని కూతురు వెదకగ

తనకును సాయము ఒనరుచ తగునని రామా


62.)దినకరు తనయుని భ్రాతను

రణమున జంపెను రఘుపతి లక్ష్యము తోడన్

కనగను వాలికి సోదరు

డనగను సుగ్రీవు నమతు డనెనిక రామా


63.)సీతను వెదకగ బూనగ

కోతుల శ్రేష్టులు హనుమనె కోరిరి అపుడున్

భీతియు లేకను పావని

దూతగ సింహళ కరిగెను దురమున రామా


64.)లంకను జేరిన హనుమయు

శంకను లేకను అసురుల జంపెను ఇంకన్

లంకను నాశము జేసెను

రంకెలు వేయుచు దిరిగెను రాజ్యము రామా


65.)అవనిజ అశోక వనమున

నవతతొ ఉండగ గనియెను నననముఖయ్యున్

జవమున జెట్టును దిగియిక

అవనిజ ముందర నిలిచెను అనుమయు రామా


66.)రాముని దలువను నిత్యము

సేమము గలుగిక సదనము సేగియు అనకన్

రాముడె దేవుడు అనగను

రాముని మించిన ప్రభువన రాడిక రామా


67.)తలువుము రాముని సతతము

దలువగ తొలుగును భయమన దప్పక నీకున్

తలచిన సిరులును గురియును

సులభపు మార్గము అదియెను చూడగ రామా


68.)నరుడుగ బుట్టియు రాముడు

హరిహయ నందను మరియును హనుమయు తోడున్

నరపాలు డయ్యు చెలిమనె

ధరణిజ జాడను వెదకను దడయక రామా


69.)రాముడు అడవికి యేగను

రాముని వీడగ దశరథు రాయడి తోనన్

రాముని దలచుచు గూలెను

రాముడె సర్వస్వ మనియు రాజిక రామా


70.)తలిదండ్రి మాట దాటను

వలదని తరలెను రఘుపతి వనమున జేరన్

వలదని జెప్పిన సీతయు

కలసియె తరలెను వెనుకన కాంతుతొ రామా


71.)సమజము కేగెడి ముందర

తమతమ నగలను సుకరము తగునని జేయన్

విమల చరితులును రాముడు

సమముగ సీతయు వదలిరి సదనము రామా


72.)అడవికి వచ్చిన భరతుడు

మడసిన దశరథు వివరము మల్లడి తోనన్

అడుగగ జెప్పెను రాముకు

అడిగెను రమ్మని వెనుకకు ఆత్రము రామా


73.)క్రతువుకు కొడుకన నలువగు

అతనికి కొడుకగు మరీచి అనగను ఇంకన్

అతనికి కాశ్యపు డనగను

అతనికి సూర్యుడు కొడుకని అందురు రామా


74.)ఖతిలక కొడుకన మనువగు

అతనికి ఇక్ష్వాకు కొడుకు ఆతని కింకన్

సుతుడన కుక్షియు కుక్షికి

సుతుడన దెలుపగ వికుక్షి జూడగ రామా


75.)సుతుడు వికుక్షికి బాణుడు

అతనికి అనరణ్యు డనగ అతనికి ఇంకను

సుతుడన ప్రుథువుయు ప్రుథువుని

సుతుడన జెప్పగ త్రిశంకు సువిదుడు రామా


76.)సుతుడన త్రిశంకు కెవణశు దుంధుమారుడు (లేదాయవణాశ్యుడు)

అతనికి మాంధాత సుతుడు ఆతని కింకన్

సుతుడన సుసంధి అతనికి

సుతుడన దృవసంధి అనగ జూడగ రామా


77.) తనయుడు ధృవసంధ్కి భరతు

డనగను అతనికిని అశితుడనగను ఇంకన్

దనయుడు అశితుకు సగరుడు

తనయుడు సగరు కసమంజు తరములొ రామా


78.)అనగ సమంజసు కనగను

తనయుడు తపనుడు డనగను తరములొ జెప్పన్ (అంశుమంతుడు)

వినగను తపనుకు అనగను

తనయుడు అగునిక దిలీపు తగునన రామా


79.సుతుడు దిలీపుకును భగీ (భగీరథుడు)

రతుడన అతనికి కనగను రాజగు వాడున్

సుతుడు కకుత్సుడు కాగన్

అతనికి రఘువుయు సుతుడును అగునన రామా


80)సుతుడు రఘువుకు ప్రపుర్థుడు

అతనికి శంఖుడు సుతుడును అనగను వినగన్

అతనికి సుదర్శను డగును

సుతుడన అగ్నివర్ణు డతనికి సుతుడగు రామా


81.)సుతుడగ్ని వర్ణుకునుశీ ఘ్రవేదుడు

అతనికి మరువుయు సుతుడును అనగను ఇంకన్

అతనికిని ప్రశిష్యుడనగ

అతనికి అంబరిషు సుతుడు అనగను రామా


82.)సుతుడంబ రీషుకు నహుషు

అతనికి సుతుడన యయాతి అగునిక ఇంకన్

అతనికి నాభాగు డనగ

అతనికి సుతుడన అజుడని అనెదరు రామా


83.)అనగను అజునకు దశరథు

డనగను రాముడును భరతుడనగను ఇంకన్

గనగను లక్ష్మణ శత్రజ్ఞు

లనగను డశరథుకు తనయు లగునిక రామా


84.)సీతను రాముడు మరియు

ప్రీతిగ మాండవి భరతుడు ప్రియసఖి అనగన్

భాతిగ లక్ష్మణు డూర్మిళ

నాతిగ శత్రుఘ్ను శృతకీర్తి ననగను రామా


85.)నలుగురు సోదరు లనగను

అలరుల బోణుల వివహము అనగను జూడన్

నలువయు సహితము వేల్పులు

అలరులు జల్లగ నచటను అందమె రామా


86.)పరశువు రాముడపుడరిగి (పరశురాముడు)

గరువము తోడను రఘుపతి గాంచుచు అడిగెన్

దరమము విష్ణుది విరువను

కరమున బట్టగ కుజపతి కదియెను రామా


87.)వివహము జరిగిన పిదపను

అవనిజ రాముడు అనుజులు అంటను రాగన్

అవిఘడు దశరథు డరిగెను

అవసధ సుతులును స్నుషలతొ అనగను రామా


88.)తనదగు రాజ్యము రాముకు

తనరగ ఈయగ దశరథు తలువగ నుండన్

విననది మంథర కైకకు

వినగను జెప్పెను వలదను విషయము రామా


89.)వినగను మంథర మాటలు

కినుకతొ కైకేయి ప్రభువు కికనన జెప్పెన్

తనసుతు భరతుకు రాజ్యము

చనుమాన మనుచును దెలిపె చయ్యన రామా


90.)శాలిని మాటలు వినగను

కూలెను దశరథు డపుడిక కుందుచు అనియెన్

ఏలగు పదునాలు గొరుస

కాలము రాముని పనిగొన కానన రామా


91.) ఇచ్చిన మాటను తప్పక

కచ్చిత మనగను రఘుపతి కానన మునకున్

సచ్చరితుగనిక నిలువగ

అచ్చెరు వనకుము అడవికి అరుగగ రామా


92. కొత్తగు కోడళ్ళు ముగురు

అత్తల కనగను ఒరిగని ఆశీర్వ చనల్

గుత్తగ బొందిరి నలుగురు

ఉత్తము లనగను మెలుగుచు ఉండిరి రామా


93.)నలుగురు కొడుకులు మనసిడి

విలువలు పెద్దల కనుచును వినయము తోడన్

దలుచుచు అంజలి ఒనరిచి

నలుగురు వధువుల వెనుకన నరిగిరి రామా


94.)అడవికి ఒచ్చిన భరతుడు

విడమర్చి దెలిపె దశరథు వీగిన విషయం

కడుగను వగచెను రాముడు

కడకును తర్పణ మిడిచెను కలతతొ రామా


95.) కలశజు డగస్త్యు వసతి వి

మలచరి తులనగ రఘుపతి మరియును జూడన్

దెలియగ సీతా లక్ష్మణు

ఒలయుచు ప్రణతిడె మునిగని ఒప్పగ రామా


96.)పంచవటియనెడు చోటున

అంచిత సోదరు లిరువురు అచలజ తోడన్

మంచిగ ఆశ్రమ మనకని

పించగ గట్టిరి నిలువను ప్రియమన రామా


97.)యశమును గలిగిన రాజగు

దశరథు మువ్వురు గృహిణులు దారలు అనగన్

విశదము కౌసల్య సుమిత్ర

వశమన కైకేయనగను వధువులు రామా


98.)కానన మందున గాంచియు

భానుకులజుడును ధరణిజ భాసిత మనగన్

జానుగ పౌలస్తి ముఖము

కానగ రాముతొ వివహము కాంక్షణె రామా


99.)అదిగని లక్ష్మణు డపుడును

మదిచెడి దానివి ముకుచెవి మాపగ దలచెన్

తుదకది ఏడ్చుచు లంకకు

కదలెను రావణు దెలుపుట కనగను రామా


100.)లంకలొ ఉండిన కాలము

శంకయు దీర్చను కపిరథు శాంతము తోడన్

అంకతి పరీక్ష గోరగ

జంకక సీతయు అగినికి సరియనె రామా


101.)అనలము పునీత సీతను

కనగను రాముకు దెలిపెను కంజజు డపుడున్

జనకజ సీతను ఏలగ

కనుమిక నీవును హరివని ఖానుకు రామా


102.)జయమును బొందిన రాముడు

రయమున జేరెను అయోధ్య రాగను అపుడే

నయమన రాజ్యము ఏలుచు

దయగల రాజుగ నిలిపెను ధర్మము రామా


103.)ఇమ్ముగ ఏలను రాజ్యము

నమ్మక మగుచును అనుజులు నయమన నుండన్

అమ్మలు ముగ్గురి దీవన

ఇమ్మహి నందున రఘుపతి ఇంపను రామా


104.)కనెనన కవలల సీతయు

ననగను వాల్మీకి ఉటజననగను నుండన్

అనగను లవుడును కుశుడును

ఘనతయు జెందిరి ఇరువురు గానగ రామా


105.)అశ్వపు యజ్ఞము జేయగ

అశ్వము లవకుశు లిరువురు అనగను బట్టన్

అశ్వము విడువను గోరగ

అశ్వము వీడక దలచిరి అనికిని రామా


106.)ఇద్దరు తమ్ములు ఓడగ

యుద్ధము జేయను రఘుపతి యుక్తితొ బలుకన్

యుద్ధము జేయను కవలలు

కొద్దిగ నైనను జడువక కోరిరి రామా


107.) తనయులు తండ్రియు తలపడ

జనకజ కదియును దెలియగ జానకి అపుడున్

కనగను రాముని వగవుతొ

తనయుల వలదనె తగవన తండ్రితొ రామా


108.) మనమున తల్లిని గోరెను

జనకజ పయశము భరించ సాహస మనగన్

తనకిక లేదని దెలుపుచు

జనెనిక తలివెంట గదిలి చదలుకు రామా


***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.

513 views0 comments

Comments


bottom of page