top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

శ్రీఆంజనేయం

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'Srianjaneyam' New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

'శ్రీఆంజనేయం' తెలుగు కథ

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఒకనాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో కూడి ఘనసాంద్రమైన వృక్షచ్ఛాయలో విరాజమానుడై ఉన్నాడు. ఉన్నట్టుండి మహాదేవుడు ధ్యాన సమాధిలోకి జారుకున్నాడు. దీనిని గమనించి మహేశ్వరి నిశ్శబ్దంగా పరమేశుని ముఖాన్ని చూస్తూ కూర్చుంది. కొంత సమయం గడచిన తరువాత శివుడు సమాధి దశ నుండి బయటకు వచ్చి కన్నులు తెరచి పార్వతిని పరికించాడు. అప్పుడు పార్వతీదేవి “ స్వామీ! ఏల వున్నట్టుండి ధ్యాన సమాధిలో మునిగిపోయారు?” అని పతిని ప్రశ్నించింది. అందుకు పరమశివుడు ‘ దేవీ!! సర్వాంతర్యామి అవతారరూపుడై పుడమిపై పుట్టనున్నాడు. సర్వదేవతలు శ్రీవారితో కూడి అవనిపై ఆవిర్భవించే ప్రయత్నంలో ఉన్నారు. నేను కూడా నా స్వామిని సేవించుకోవాలని యోచిస్తున్నాను’ అని బదులు పలికాడు. దీనికి పార్వతి ఆశ్చర్యపడి ‘ దేవా! మీరు ఏ రూపంలో సర్వాంతర్యామిని సేవించదలచారో సెలవీయండి‘ అని కోరింది. శివుడు చిరునవ్వు నవ్వుతూ నేను వాయుదేవుని మూలంగా అంజనాదేవి గర్భంలో వానరునిగా అవతరింప నిశ్చయిచు కున్నాను’ అన్నాడు. ఇది విని పార్వతీదేవి ప్రసన్నత పొందింది. అమరుల రాజధాని అమరావతి. అమరాధిపతి ఇంద్రుడు కొలువు తీరి కూర్చున్నాడు. సర్వదేవతలు, దిక్పాలకులు, దేవగురువు బృహస్పతి తమ తమ ఆసనాలలో కొలువుకూరి సుఖాసీనులై ఉన్నారు. అపురూప సౌందర్యవతి, అప్సరోవనిత సభాసదులకు నేత్రానందం కలిగిస్తూ నాట్యం చేస్తోంది. తాళానుగుణంగా నాట్యాభినయాన్ని ప్రదర్శిస్తోంది. ఉన్నట్టుండి తాళానికి అనుగుణంగా పాదాలు కదలలేదు. అభాసు పాలైంది. ఇంద్రునికి ఆగ్రహం వచ్చి భూమిపై వానరం రూపంతో పుట్టమని శపించాడు. ఎన్నో విధాలుగా వేడుకొన్న పిదప ఆమెకు మానవిగా కానీ, వానరిగా కానీ సంచరించగల ఇచ్ఛాశక్తి అనుగ్రహించాడు అమరాధిపుడు. ఈ విధంగా శాపగ్రస్తయై కుంజరుని కుమార్తెగా జన్మించింది. కేసరి యనే వానరునికి ధర్మపత్ని అయ్యింది. ఆ దంపతులకు ఎన్ని సంవత్సరములు గడిచినా సంతానం కలగలేదు. దిగులు చెందిన అంజనను వాయుదేవుని పూజింపమని చెప్పాడు కేసరి. ఆమె ఆనందంతో సమీరుని కొలువసాగింది. కొంత కాలానికే వాయువు అగ్నినుండి తనకు సంక్రమించిన శివతేజమును మహేశ్వరుని ఆజ్ఞానుసారం అంజనకు అందజేసాడు. ఆమె గర్భం దాల్చింది. తదుపరి పది నెలలకు ఒక శుభ సమయంలో ఒక కొడుకును కన్నది. అతడే అంజనీ పుత్రుడు ఆంజనేయుడు. పవనుని అంశతో పుట్టాడు కనుక పావనిగా పేరు వచ్చింది. సాక్షాత్తు వృషభవాహనుడు సర్వాంతర్యామిని సేవించుకోవాలని ఇలా కపి రూపంలో జన్మించారు. అవతారపురుషునికి అసాధారణ సేవకునిగా చిరకీర్తిని పొందిన ఘనవానరుడు. అవతారమూర్తిని అనన్య సామాన్య రీతిలో సేవించిన భక్తాగ్రేసరుడు. భాగవతులందరిలోనూ ఉత్తమోత్రమైన భాగవతునిగా వినుతికెక్కిన విఖ్యాత చరితుడు. తన భక్తులను సతతం కాపాడి రక్షించే రక్షకుడు. సర్వవిద్యా సంవత్ప్రదాయకుడు. గాందర్వవేద విధుడు. మహావాజ్మి. సకలాభీష్టాలను సత్వరంగా అందించే మహిమాన్వితుడు ఆంజనేయుడు. బాల్యంలో ఒకనాడు ఆంజనేయుడు బాలభానుడిని, పండిన పండుగా భావించి ఉదయాచలం మీదకు ఉరికి మింగ బోయాడు. సరిగా అప్పుడు గ్రహణసమయం కావడం చేత రాహువు సూర్యుణ్ణి కబళించడానికి వస్తున్నాడు. అక్కడే వున్న ఆంజనేయుడు రాహువును చూచి మరో నల్లని పండని భావించి అతనిపైకి లంఘించినాడు. పావని బలానికి రాహువు తట్టుకొనలేక సురాధిపతి వద్దకు పరుగెత్తాడు. ఈ సంగతి విని ఇంద్రుడెంతో ఆశ్చర్యంతో వజ్రాయుధం తీసుకొని ఐరావతం ఎక్కి ఉదయగిరికి చేరాడు. వెంటనే ఆంజనేయుడు తెల్లగా ఉన్నవఐరావతాన్ని తెల్లని పండు గా భ్రమించి దాని పైకి దూకాడు. ఐరావతం జడిసి పారిపోతుండటం చూసి ఇంద్రుడు వజ్రాయుధం విసిరాడు. అది అంజనీ పుత్రుని ఎడమ బుగ్గకు వచ్చి తగిలింది. ఆ దెబ్బకు పవనసుతుడు తొలిమలపై తెలివి తప్పి పడిపోయాడు. ఇలా వజ్రాయుధంచే మూర్చిల్లిన ప్రియ పుత్రున్ని చూచిన వాయుదేవుడు, సదా చరాచర ప్రపంచమంతా సంచారం చేస్తూ వుండే సమీరుడు స్తంభించిపోగా సకల ప్రాణికోటికి జీవకళ జారిపోసాగింది. ఈ ఉపద్రవం నుండి జీవకోటిని రక్షించే సదుద్ధేశంతో దేవతా ప్రముఖులు, సప్తఋషులు, దివ్యశక్తుల బలిమిచే విధాత సన్నిధికి చేరి అంజలి ఘటించి “తండ్రీ! వాయుదేవుడు ఏ కారణం చేతనో సంచారాన్ని విరమించుకున్నాడు. జీవకోటి మృతప్రాయమైపోతోంది. నీచే సృజించబడిన సకల ప్రపంచము రుధుని యత్నము లేకుండగనే లయం పొందుతోంది. కాబట్టి ప్రాణికోటిని అనుగ్రహించమని ప్రార్థించిరి. వెంటనే చతురాసనుడు కన్నులు మూసుకొని దివ్యదృష్టి వలన సకలము గ్రహించెను. తను గ్రహించిన విషయాలన్నీ వారికి విశదీకరించి వారందరినీ తోడుకొని తొలిమల చేరెను. అప్పటికి వాయుదేవుడు చేష్టలుడిగి పడియున్న ఆంజనేయుని చెంత కూర్చొని ఉన్నాడు. వెంటనే వాయుదేవుడు లేచి విరించికి ఎదురుగా వచ్చి సాష్టాంగ నమస్కారము చేసి స్తుతించెను. అప్పుడు విరించి వాయుదేవుడిని చూచి “వత్సా! ఏల సంచారం విరమించావు? ఈ బాలుడా నీ పుత్రుడు..” అని పరామర్శ చేసి అచేతనుడై పడియున్న ఆంజనేయుని దేహాన్ని నిమిరి నవశక్తిని ప్రసాదించెను. దాంతో వెంటనే మారుతి కళ్ళు తెరచి చూచాడు. వాయుదేవుడు ఆనందించి యధాపూర్వం తన సంచారం ప్రారంభించాడు. జీవకోటికి పోయిన ప్రాణాలు మళ్ళీ వచ్చాయి. అప్పుడు పరమేష్టి సమీరుని మృధువుగా మందలించి, “ఈ వానర శ్రేష్టుడు మహావీరుడు. ఇతని వలన రాబోవు కాలంలో అనేక లోకోపకారాలు జరుగవలసి వున్నాయి. లోకకళ్యాణార్థం అవతరించబోయే ఆదిపురుషునికి సమర్థవంతుడగు సేవకుడుగా కీర్తి పొందుతాడు. దుష్టప్రవృత్తిగల అనేక వేల మందిని సంహరిస్తాడు. ఇటువంటి లోకోపకారికి మనం వరాలిచ్చి ఆశీర్వదిద్దాం” అన్నాడు. తొలిగా ఇంద్రుడి వజ్రాయుధం హనుమకు తగిలినా నిర్జీవుడు కాక నిలిచి వున్నాడు కావున హనుమంతుడయ్యాడు. ఇంక ముందుకాలంలో వజ్రాయుధం కూడా ఇతడి నేమి బాధించదు అని వరం ఇచ్చెను. తక్కిన దేవతాగణం ఉత్తమోత్తమైన వరాలనేకం ఇచ్చి గౌరవించారు. అజుడు బ్రహ్మస్త్రము వలన ప్రాణహాని కలుగని విధంగా ఒక అమోఘ వరం ఇచ్చి అసమాన దురంధరుడవు కాగలవని ఆశీర్వదించెను. వాయుదేవుడు మహానందంతో పావనిని చంకనెత్తుకొని అంజనాదేవికి అప్పగించి సంచారానికి సాగిపోయాడు. కొంతకాలమైన పిదప, ఒకనాడు హనుమంతుడు తన నివాస సమీపంలో ఉన్న మునుల ఆశ్రమాలలోకి పోయి బాల్య చేష్టలతో వారు ఆర బెట్టుకున్న వస్త్రాలను చించి ప్రోగులు పెట్టాడు. అందుకు మునులు కోపోద్రిక్తులై “అన్యులు తెలిపితే కానీ, నీ బలం నీకు తెలియదు” అని శాపం ఇచ్చారు. బాల్యచాపం వల్ల సంబవించిన దానికి చింతిస్తూ ఆంజనేయుడు మునులను ప్రసన్నం చేసుకొన్నాడు. విద్యాబుద్దులు నేర్పడానికి సూర్యుని వద్దకు పోయి అర్థించెను. అప్పుడు సూర్యుడు “వత్సా! ఆంజనేయా! నీ ప్రార్థన విన్నాను. కానీ నేను ఎప్పుడూ ఒక చోట నిలిచి ఉండేవాడిని కాను కదా! నిత్యమూ లోకాన్ని చుట్టి రావలసిన విధి కలిగిన వాడిని. నీకు నేనెట్లు విద్య నేర్పగలను? నా వేగంతో సమానంగా నీవు రాగలిగినప్పటికి నీ మనస్థితి నిలకడగా ఉండ సాధ్యపడదు కదా! దీనికేమి వుపాయం?” అని ప్రశ్నించాడు. హనుమంతుడు సమాధానం చెప్పలేదు. క్షణకాలంలో తన మేను పెంచి తొలిమల పై ఒకపాదం, మలిమలపై రెండవ పాదాన్ని ఉంచి “ఇక పాఠాన్ని ప్రారంభించండి గురువర్యా” అన్నాడు. ఈ అధ్బుత కృత్యానికి అబ్బురపడ్డాడు దినకరుడు. ఇలా కొంతకాలం సహస్రాంశుని శిష్యునిగా శిక్షణ పొంది సకల శాస్ర విజ్ఞాన వంతుడయ్యాడు. అందుకే నేటికీ సకల విద్యా సంపదల నిచ్చే దైవంగా నిలిచి వున్నాడు. దుష్టశిక్షణార్థం భగవంతుడు మానవవేషధాణ చేయబోతున్నాడు. కృతయుగం గతించింది. త్రేతాయుగం ప్రారంభమయ్యింది. శ్రీరామచంద్రునిగా అయోధ్యలో అవతారపురుషుడు ఆవిర్భవించాడు. ఆయనకు సహాయపడేందుకు మహా బలపరాక్రమంతో పాటు తెలివితేటలు కలవాడు కాబట్టి సూర్యపుత్రుడగు సుగ్రీవుడు తన మంత్రిగా నియమించుకున్నాడు. కిష్కిందకు రాజైన వాలి సుగ్రీవునకు అన్న. కొంతకాలానికి వాలి సుగ్రీవులకు పొరపొచ్చాలొచ్చి విడిపోయారు. వాలి మహాబలవంతుడు, అతడుసుగ్రీవుని సంపదనంతా స్వాధీన పరచుకొని చివరగా సుగ్రీవుని సతిని కూడా చెరపట్టి కిష్కింద నుండి తమ్ముడిని వెళ్ళగొట్టాడు. సుగ్రీవుడు వాలిని ఎదిరించలేక తన వర్గీయులందరినీ వెంటబెట్టుకుని ఋష్యమూక పర్వతం మీద నివాసం చేయసాగాడు. ఆంజనేయుని అండదండలతో అదను కోసం వేచి చూస్తున్నాడు. కాలం గడుస్తూ ఉంది. పితృవాక్య పరిపాలన నిమిత్రం శ్రీరామచంద్రులవారు సింహాసనాన్ని త్యజించి, అయోధ్యను వదలి, జానకీ లక్ష్మణులను వెంటబెట్టుకుని వనవాసం చేయుచుండెను. పంచవటి యందు నివసిస్తున్న సమయంలో రావణుడు సీతమ్మవారిని అపహరించాడు. సీతాన్వేషణ చేస్తూ రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సానువుల్లోకి ప్రవేశిస్తుండగా సుగ్రీవుడు గమనించి అమాత్యుడైన ఆంజనేయుని ముఖంలోకి చూసాడు. వాలి తనపైకి యుద్దానికి పంపాడేమోనని అనుమానించాడు సూర్యపుత్రుడు. సుగ్రీవుని భీతిని గమనించిన పావని, వారి సంగతి నేను విచారణ చేసి వస్తానని వానరవేషం విడిచి భిక్షుకవేషం ధరించి రామలక్ష్మణులకు ఎదురుగా వచ్చెను. ఋష్యమూక పర్వతాన్ని పరిశీలిస్తూ వస్తున్న రామలక్ష్మణులకు ఎదురుగా భిక్షుక రూపంలో వెళ్ళెను. భగవంతునికి భక్తునికి తొలిసంయోగం.. భిక్షుక వేషంలో భక్తుడు.. మానవ వేషంలో ఉన్న ఆది దేవున్ని, అవతార మూర్తిని ఆతృతతో ప్రశ్నించాడు. “మహానుభావులారా! ఎవరు మీరు?” దాశరధి సౌమిత్రి ముఖంలోకి చూచాడు. అన్నగారి ఆంతర్యం గ్రహించి లక్ష్మణుడు విషయాలన్నీ పూసగుచ్చినట్టు వివరించాడు. చివరగా భిక్షకుడి వివరాలడిగాడు. ఆంజనేయుజు భిక్షుకవేషం విడిచి వానరరూపం ధరించి భక్తితో నమస్కరించి సుగ్రీవుని స్థితినంతా తెలియ బరచెను. మరుక్షణంలో మారుతి రామలక్ష్మణులను సుగ్రీవుని ఎదుటకు తీసుకుని పోయాడు. వారు ఒకరి స్థితి మరియెకరికి చెప్పుకొని అగ్నిసాక్షిగా సఖ్యం చేసుకున్నారు. శపథము ప్రకారము రాముడు వాలిని వధించాడు. వానరసామ్రాజ్యం సుగ్రీవుని పరం చేసాడు. సుగ్రీవుని ఆజ్ఞతో ఆంజనేయుడు జానకీమాతను వెదుకుటకు దక్షిణదిశగా బయలుదేరాడు. సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి సీతజాడను తెలుసుకున్నాడు. రాముడు ఆనవాలుగా ఇచ్చిన అంగుళీయకాన్ని అయోనిజకు అందించాడు. సీతామాత అభిజ్ఞాన పూర్వకంగా శ్రీరామచంద్రులకు అందజేయమని చూడామణిని కపివీరుని చేతిలో పెట్టింది. ఎంతో ప్రేమగా చిరంజీవి కమ్మని ఆశీర్వదించింది. సామాన్య వానరునిగా అశోకవనాన్ని ధ్వసం చేశాడు. రాక్షసులను వధించాడు. ఇంద్రజిత్‌ బ్రహ్మాస్త్ర ప్రయోగానికి తలవంచినట్లు నటించాడు. బంధీగా దశకంఠుని ఎదుట నిలిచాడు. సభలో విభీషణుని వివేకాన్ని పరిశీలనగా చూశాడు. రావణుడు విధించిన శిక్షగా తోకకు నిప్పు అంటించి విడిచిపెట్టారు రాక్షసగణం. వాయుపుత్రుడు తన తండ్రికి పరమ మిత్రుడైన అగ్నిదేవుని అభ్యర్థించి లంకానగరం భస్మీపటలం చేశాడు. మెల్లగా సముద్ర తీరానికి చేరి, అగ్నితాపాన్ని చల్లార్చుకుని సాగరాన్ని దాటి తిరిగివచ్చి, శ్రీరామచంద్రుని చూస్తూ “ చూసాను సీతను” అని చల్లని వార్తను చెవిన వేశాడు. పొంగిపోయాడు రాముడు. ఆసనం నుండి లేచివచ్చి కౌగలించు కున్నాడు. సుగ్రీవుని ఆజ్ఞతో వానరవీరులంతా యుద్దానికి సన్నద్దులై బయలుదేరారు. వారధి కట్టారు. సాగరాన్ని దాటారు. లంకను చుట్టుముట్టారు. రాక్షసులందరినీ మట్టుపెట్టారు. మేఘనాధుని శరాఘాతానికి లక్ష్మణస్వామి మూర్చపోగా సంజీవిపర్వతాన్ని పెకలించుకుని వచ్చి సౌమిత్రి ప్రాణాలు నిలిపాడు. రామలక్ష్మణులను నాగపాశములచే బంధించగా గరుత్మంతుని పిలిచి వాటిని చిన్నాభిన్నం చేయించాడు. చిట్టచివరకు శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి, రావణుని పైకి విడిచాడు. దశగ్రీవుడు నేలకొరిగాడు. వివేకవంతుడైన విభీషణునుడికి లంకాధిపత్యం కట్టబెట్టాడు. అనల శుద్దయైన సీత చేతి నందుకున్నాడు. పుష్పకవిమానాన్ని ఎక్కి అయోధ్యకు వచ్చారు. పావన రాముడై ప్రజలను కాపాడి రక్షించాడు. హనుమంతునికి తత్త్వోపదేశం చేసి ఆంతరంగిక భక్తులలో చేర్చుకున్నాడు. ఎల్లప్పుడూ భగవంతుని నామస్మరణానందముతో సుఖించమని భక్తునికి అమోఘమైన వరాన్ని అనుగ్రహించాడు. అయోనిజ అనుగ్రహంతో చిరంజీవియై వర్ధిల్లుచుండెను. ధ్వాపరయుగంలో కూడా తన ఉనికిని చాటుకున్నాడు. మహాభారత సంగ్రామములో పార్థుని రథంపైన నిలిచి విజయునికి దిగ్విజయాన్ని ప్రసాదించి పెట్టెను. చిరంజీవిగా అమోఘమైన వరం పొందిన భక్తుడు ఆంజనేయుడు, కలియుగంలో ఈ నాటికీమన మధ్యనే అదృశ్యశక్తితో సంచారం చేస్తూంటాడని భక్తుల విశ్వాసం. భక్తశ్రద్దలతో పూజించిన వారిని సదా కాపాడి రక్షించే స్వభావశీలి.. ఈ యుగంలోనే గోస్వామి తులసీదాస్‌ వంటి మహాభక్తులకు హనుమంతుడు సాక్షాత్కరించినట్లు రామచరితమానస్‌ వంటి గ్రంథాల వలన మనం తెలుసుకోవచ్చు. ఎందరో కవులు ఆంజనేయోపాసన చేసి తమతమ కవితా వ్యవసాయాన్ని ఫలవంతంగా పండించు కున్నారు. రామరాజభూషణుడు అటువంటి వారిలో ఒకడు. హనుమత్కృపతో రామరాజభూషణుడు కవిగా కీర్తించబడ్డాడు. ఉపాసించే దేవతల గుణాలు ఉపాసకులందు ఫలిస్తాయని లోకవిశ్వాసం. రామరాజభూషణుడు శ్రీరామచంద్ర చరణారవింద వందన పవన నందన ప్రసాద సమాసాదిత సంస్కృతాంధ్ర భాషాసామ్రాజ్యుడు. కాళికారహస్యంలో ఆంజనేయుడు సర్వ విద్యాసంపత్ప్రదాయకః నవవ్యాకృతి పండితః అని స్తుతించ బడ్డారు. అందుచేతనే నేమో రామరాజభూషణకవి తనయందు సర్వ విద్యా సంపదను వాగధీశతను నిండుగా పండించుకొన్నాడు. ఆపదోద్దారకునిగా ఆంజనేయుడు అందరికీ సుపరిచితుడే! ఆయనని స్మరించిన వారికి ఆత్మధైర్యంతో పాటు అంతఃకరణం కూడా పరిశుద్ధం కాగలదు. ఆయన కృపకు పాత్రులైనవారికి భగవత్‌ కృప నిస్సంకోచముగా కలిగి తీరుతుంది. ---------------------------------శుభంభూయాత్---------------------------------------

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








170 views0 comments

Comments


bottom of page