'Srilakshmi' - New Telugu Story Written By BVD Prasada Rao
Published In manatelugukathalu.com On 24/03/2024
'శ్రీలక్ష్మి' తెలుగు కథ
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఫోన్ లో తన తల్లి దేవికతో మాట్లాడేక.. పడుకోవడానికి సమాయత్తమగు తున్నాడు అభిజిత్.
అంతలోనే అతడి ఫోన్ రింగవుతోంది.
ఆ కాల్ కు కనెక్ట్ ఐ.. ఫోన్ ను కుడి చెవి దరిన పెట్టుకోగానే..
"అభిజిత్ గారా.." అటు నుండి వినిపించింది.
కొత్త గొంతు! 'ఎవరా?' అనుకుంటూనే..
"యస్. ఎవరు.." తడబడ్డాడు అభిజిత్.
"నేను శ్రీలక్ష్మిని." అటు జవాబు.
"చెప్పండి." అభిజిత్ తికమకలో ఉన్నాడు.
"మీతో మాట్లాడాలి.. ఖాళీయేనా."
"మీరు ఎవరు." తేరుకోలేక పోతున్నాడు అభిజిత్.
శ్రీలక్ష్మి వెంటనే మాట్లాడ లేదు.
ఈ లోగా అభిజిత్ కుడి చేతి లోని ఫోన్ ను ఎడమ చేతి లోకి మార్చుకున్నాడు. ఆ వెంబడే దానిని తన ఎడమ చెవి దరిన పెట్టుకున్నాడు.
"నేను మీకు తెలియను. కానీ మీరు నాకు తెలుసు." మెత్తగా మాట్లాడుతోంది శ్రీలక్ష్మి.
"నేను తెలుసా." కనుబొమలు కలిపాడు అభిజిత్.
"నాతో మాట్లాడితే నేను కూడా మీకు తెలుస్తాను." చిన్నగా నవ్వుతోంది శ్రీలక్ష్మి.
మరింత ఇరకాటమయ్యాడు అభిజిత్.
"ఇంతకీ నా ఫోన్ నెంబర్ మీకు ఎలా తెలుసు." అడగ్గలిగాడు.
"మీ ఫోన్ నెంబరే కాదు.. మీ గురించి కూడా నాకు తెలుసు." చెప్పింది శ్రీలక్ష్మి.
"హుష్. ఎవరండీ మీరు." గింజుకుంటున్నాడు అభిజిత్.
"మీరు కొద్ది నిముషాల క్రితమే డిన్నర్ చేసొచ్చి మీ రూంలో ఉన్నారు.." చెప్పుతోంది శ్రీలక్ష్మి.
"ఓ మై గాడ్. నిజమే." అనేసాడు అభిజిత్ అయోమయంలో.
అటు నుండి శ్రీలక్ష్మి మాట్లాపి నవ్వడం అభిజిత్ కు తెలుస్తోంది.
"ఇంతకీ మీరు ఎక్కడ ఉండి నాతో ఫోన్ లో మాట్లాడుతున్నారు." అభిజిత్ ఒక్కమారుగా చుట్టూ చూస్తున్నాడు, తన రూంలో తను తప్ప ఎవరూ ఉండరని మరచి.
"మా ఇంటి నుండి." చెప్పింది శ్రీలక్ష్మి అప్పుడే.
"ఎక్కడ మీ ఇల్లు." అభిజిత్ నంగిరయ్యాడు.
"చెప్పాగా. నాతో మాట్లాడితే నా గురించి కూడా మీకు తెలుస్తుంది." చెప్పింది శ్రీలక్ష్మి.
అభిజిత్ తల తిమిరెక్కిపోతోంది.
మళ్ళీ ఫోన్ ను అటు నుండి ఇటు మార్చుకున్నాడు.
"నిద్ర వస్తోందా." అడిగింది శ్రీలక్ష్మి.
అభిజిత్ ఏమీ చెప్పలేకపోతున్నాడు.
అటు శ్రీలక్ష్మి చెవి దగ్గరి ఫోన్ ను ముందుకు తెచ్చుకుంది. ఫోన్ స్క్రీన్ వైపు చూసింది. తిరిగి ఫోన్ ను చెవి దగ్గరికి చేర్చుకుంది.
"లైన్ లో ఉండి మాట్లాడరేమిటి." అంది.
"ఏం మాట్లాడాలి." అడిగాడు అభిజిత్.
"ఏదైనా మాట్లాడొచ్చు." కొంటెగా చెప్పింది శ్రీలక్ష్మి.
అభిజిత్ తెములుకోలేక అవస్త పడుతున్నాడు.
"అండీ.. ఏమైనా మాట్లాడండీ." ఈ మారు చిలిపిగా అడిగింది శ్రీలక్ష్మి.
చికాకవుతూనే.. "ఇంతకీ.. ముందు మీరు ఎవరో చెప్పండి." అడిగాడు అభిజిత్.
అర నిమిషం తర్వాత.. "మీరు ఇంత అమాయకులా." అంది శ్రీలక్ష్మి.
ఆ వెంబడే.. "నేను ఎవరో నా ఫోన్ నెంబర్ తో తెలుసుకోవచ్చుగా." హింట్ లా చెప్పింది శ్రీలక్ష్మి.
"అది ఎలా." తలగొక్కుంటున్నాడు అభిజిత్.
అటు శ్రీలక్ష్మి విస్మయంగా.. "అయ్య బాబోయ్. మీరు మరీ ఇంత ఇదా." అనేసింది.
ఆ వెంబడే.. "సర్లేండి. మీతో మాట్లాడాలన్న ఉత్సాహం, మూడ్ నాలో హుష్ అయ్యాయి. ఇంతటితో ఈ మాటలు ఆపుదాం. రేపు తిరిగి కలుద్దాం. బై. గుడ్ నైట్." అనేసి.. తన కాల్ కట్ చేసేసింది శ్రీలక్ష్మి.
అభిజిత్ నివ్వెరపోతున్నాడు.
చాలా సేపటికి నిద్ర పోగలిగాడు.
***
అభిజిత్ ఓ నిరుద్యోగి. తనున్న ఊరిలోనే డిగ్రీ చదువు పూర్తి చేసి.. ఉద్యోగ అవకాశాలకై మరిన్ని సరైన సదుపాయాలుంటాయని ఈ ఊరు వచ్చాడు. అద్దెకు ఓ రూం తీసుకున్నాడు. మంచి ఉద్యోగ లబ్దికై ఓ కోచింగ్ సెంటర్ లో చేరాడు.
తొలుత నుండి అభిజిత్ చొరవ మనిషి కాదు. తన పరిధి తనదిలా మెసులుతుంటాడు. అందుకే స్నేహితుల మాట అటుంచితే కనీసం కనీస పరిచయస్తులు ఒక్కరు కూడా తనకు లేరు.
అభిజిత్ కోచింగ్ సెంటర్ లో చేరిన కొత్తలో తనని సుధాకర్ అనే అతడు కలిసాడు.
అభిజిత్ ఉంటున్న అద్దె రూంలో షేరింగ్ విధంన తనను రూమ్మేట్ గా చేర్చుకోమని సుధాకర్ పదే పదే కోరాడు.
అభిజిత్ చివరాఖరన 'సరే' అన్నాడు.
అలా అభిజిత్ తో మెసిలిన సుధాకర్ చాలా మటుకు అభిజిత్ నైజం పసిగట్టాడు.
అభిజిత్ 'టచ్ మీ నాట్' విధంతో సుధాకర్ ఇమడ లేక పోయాడు. వేరే రూంకి మారి పోయాడు.
ఐనా అభిజిత్ పై సుధాకర్ కు ఈసడింపు లేదు. జాలి మాత్రం కలిగింది.
***
తెల్లవారింది.
అభిజిత్ నిద్ర లేచాడు. ప్రతి మారులానే తయారయ్యాడు. కోచింగ్ సెంటర్ కు వెళ్లాడు.
క్లాస్ బ్రేక్ లో..
సుధాకర్ కోరి అభిజిత్ ను కలిసాడు.
"రూంలోని సీలింగ్ ఫేన్ ను బాగుచేయించుకున్నావా." అడిగాడు.
అడ్డంగా తలాడించేడు అభిజిత్.
"అయ్యో. నేను నీ రూంను వదిలి పదిహేను రోజులయ్యాయి. అప్పుడే చెప్పాగా.. ఓనర్ కు చెప్పి ఫేన్ ను బాగు చేయించుకోమని. ఛ. నీకే కష్టంగా. వేసవి వేడి రోజు రోజుకు పెరుగుతోందిగా." అన్నాడు సుధాకర్.
అభిజిత్ ఏమీ అనడం లేదు.
సుధాకర్ నొచ్చుకుంటున్నాడు.
అంతలోనే తిరిగి క్లాస్ మొదలయ్యింది.
తర్వాత..
సాయంకాలం రూంకి తిరిగి వచ్చిన అభిజిత్.. నేటి నోట్స్ లను ఎనిమిందిటి వరకు పునశ్చరణ చేసుకున్నాడు.
డిన్నర్ కు వెళ్లి వచ్చాడు.
పక్క మీద నడుం వాల్చాడు.
తన సెల్ మోగుతోంది.
కాల్ కలిపి.. "హలో." అన్నాడు.
"ఎలా ఉన్నారు సార్." అటు నుండి శ్రీలక్ష్మి.
గొంతు పోల్చుకున్నాడు అభిజిత్. ఇబ్బందయ్యాడు.
"మీరా." అన్నాడు నిర్లిప్తతగా.
"ఆఁ. మరి. అన్నట్టు ఫోన్ నెంబర్ తో నేను ఎవరో తెలుసుకోడానికి ప్రయత్నించ లేదా." అడుగుతోంది శ్రీలక్ష్మి.
తల అడ్డంగా ఆడించాడు అభిజిత్. ఆ తర్వాత.. అది అటు కనిపించదని గ్రహించాడు.
"ప్రయత్నించ లేదు." చెప్పాడు.
"హమ్మయ్య. ఇకపై నేను సిమ్ లు మార్చనక్కర లేదు." గట్టిగానే నవ్వింది శ్రీలక్ష్మి.
అభిజిత్ లేచి కూర్చున్నాడు.
"ఏమిటిదంతా." విసుక్కుంటున్నాడు.
"కూల్ కూల్. మీలో చిరాకు ఉందా." చిత్రంగా అంది శ్రీలక్ష్మి.
అభిజిత్ ఏమీ అనలేదు.
"చిరాకు లాగే మీలోని చలాకీనీ బయట పడేయండి సార్." చెప్పింది శ్రీలక్ష్మి.
ఆ వెంబడే.. "దిగులు ఉన్న వారు డిప్రెషన్ లో పడతారు. మీరు అదే స్థితిన ఉన్నారు. మీది ఎమోషనల్ లోన్లీనెస్." అంది.
అభిజిత్ అయోమయమయ్యాడు.
"అర్ధం కాలేదు." చెప్పాడు.
"గుడ్. ఇక చొప్ప కబురులు ఆపి.. విషయం మాట్లాడుకుందాం." చెప్పింది శ్రీలక్ష్మి.
అభిజిత్ ఏమీ అనలేదు.
శ్రీలక్ష్మి కుదురు ఐంది.
"మాట్లాడుకుందామా." అడుగుతోంది శ్రీలక్ష్మి.
"ఏం మాట్లాడుకుందాం." అడగ్గలిగాడు అభిజిత్.
"మీ గురించే." మెత్తగా అంది శ్రీలక్ష్మి.
అభిజిత్ వెంటనే ఏమీ అనలేకపోయాడు.
అంతలోనే.. "మీ కుటుంబం గురించి చెప్పండి." అడిగింది శ్రీలక్ష్మి.
అభిజిత్ నిమ్మళం కాలేకపోతున్నాడు.
"హలో. 'అడగడానికి మీరెవరు' అని అనేయకండి. ప్లీజ్." చాలా మెత్తగా మాట్లాడింది శ్రీలక్ష్మి.
అర నిముషం తర్వాత.. "అమ్మ, అమ్మమ్మ, నేనే.. మా కుటుంబం." చెప్పాడు అభిజిత్.
"మరి నాన్న." అడిగి ఆగింది శ్రీలక్ష్మి.
"నా చిన్నప్పుడే చనిపోయారు." చెప్పాడు అభిజిత్.
"అయ్యో. సారీ. మీకు అన్నీ అమ్మే అన్న మాట.."
అడ్డై.. "లేదు లేదు. అమ్మమ్మ కూడా." చెప్పాడు అభిజిత్.
ఆ వెంబడే.. "ఆ ఇద్దరూ నన్ను గారాబంగా సాకుతున్నారు." చెప్పాడు.
'అది బాగా అతి ఐంది. అందుకే ఇలా అయ్యావు.' అనుకుంది శ్రీలక్ష్మి.
కానీ, బయటికి.. "గుడ్." అనేసింది.
"నాకు అన్నీ అమ్మ, అమ్మమ్మలే. చదువుకు మాత్రమే బయటికి వెళ్లే వాణ్ణి. మిగతాదంతా ఉన్నది వాళ్లిద్దరితోనే. వాళ్లిద్దరి పెంపరింగ్ బాగుంటుంది." చెప్పుతున్నాడు అభిజిత్.
అప్పుడే.. 'అయ్యో.. అదే నిన్ను బైతును చేసింది.' అనుకుంది శ్రీలక్ష్మి. జాలి పడుతోంది.
"మా ఊరిలో ఉండి ఉద్యోగం కై చేసిన ప్రయత్నాలు వరసగా విఫలం అవుతుండడంతో, నా కో స్టూడెంట్స్ ను చూసి.. వాళ్లలా బయటికి పోయి సరైనా కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగం పొందొచ్చని ఈ ఊరు వచ్చాను." చెప్పడం కొనసాగిస్తున్నాడు అభిజిత్.
వింటోంది శ్రీలక్ష్మి.
"అమ్మ, అమ్మమ్మల ఎడబాటుతో మరింత సతమతమైపోతున్నాను." దిగులవు తున్నాడు అభిజిత్.
"కూల్ కూల్." కల్పించుకుంది శ్రీలక్ష్మి.
ఆ వెంబడే.. "మరి. వాళ్ళనీ మీతో పాటు తెచ్చుకోవలసింది." అంది.
"మూడు నెలల కోసం వాళ్లు రాలేమన్నారు. పైగా అమ్మ నన్ను వెళ్లమని గట్టి ఒట్టు పెట్టింది. అందుకే వాళ్లని బలవంతం పెట్టలేకపోయాను." మెల్లిగా చెప్పాడు అభిజిత్.
"సరి సరే. ఇక్కడికి వచ్చింది ఓ ధ్యేయంతో కదా. ఉద్యోగం సంపాదించుకొని, మీ అమ్మ, అమ్మమ్మలను తెచ్చుకొని, ఎంచక్కా వాళ్లిద్దరితో మీరు ఉండే ఛాన్స్ మీకు ఉందిగా. దానిని సాధించండి." చెప్పింది శ్రీలక్ష్మి.
"ప్రయత్నిస్తున్నాను. కోచింగ్ లోని డిబేటింగ్స్ తో భయం అవుతోంది. ఈ మూడు నెలల కోచింగ్ ను ఎలా కానివ్వాలో." నొచ్చుకుంటున్నాడు అభిజిత్.
"నో నో. అదేమీ కాదు. మీలో చొరవ రావాలి. మీరే కోరి నలుగురుతో కలుస్తుండాలి. అందరితో తరుచు ఏదో ఒకటి మాట్లాడుతుండాలి. మీ పరిధిని విస్తరించుకోండి. మీకు అన్నీ సాధ్యమవుతాయి. ముఖ్యంగా మీలోని భయం పోతోంది. తద్వారా మీరు తప్పక నిలదొక్కుకో గలరు. అలానే ఈజీగా ఉద్యోగం పొందగలరు.." చెప్పుతోంది శ్రీలక్ష్మి.
అభిజిత్ వింటున్నాడు.
"మీరు ఉద్యోగం సంపాదించుకుంటే.. మీ అమ్మను, అమ్మమ్మను మీరు భలేగా సంతోషపర్చగలరు. మీకు అదో గొప్ప థ్రిల్ కాగలదు అబ్బా." చెప్పడం ఆపింది శ్రీలక్ష్మి.
"అంతేనంటారా." అడిగేసాడు అభిజిత్.
"ముమ్మాటికి. ప్రయత్నించండి. మీకే తెలుస్తోంది." చలాకీగా చెప్పింది శ్రీలక్ష్మి.
"తప్పక అలానే చేస్తాను." తేలికవుతున్నాడు అభిజిత్.
"గుడ్. గుడ్. చెప్పింది చేతల్లో చూపండి." హుషారవుతోంది శ్రీలక్ష్మి.
"ఇంతకీ మీరు ఎవరో చెప్పండి." అడిగాడు అభిజిత్.
శ్రీలక్ష్మి వెంటనే ఏమీ అనలేదు.
తిరిగి తిరిగి అభిజిత్ అడుగుతూంటే.. "నేను ఎవరో మీకు తెలియాలన్నా.. ఇక మీదట నేను మీతో మాట్లాడాలన్నా.. మీరు ఉద్యోగం పొందేకే." చెప్పేక వెంటనే కాల్ కట్ చేసేసింది శ్రీలక్ష్మి.
అభిజిత్ చలించాడు.
***
అభిజిత్ పట్టుతో మారాడు.
ఉద్యోగం పొందాడు.
ఉద్యోగంలో చేరుటకు కావలసిన వాటిని సర్దుకుంటూ..
"నాతో మీరు రండి." అన్నాడు తన అమ్మ, అమ్మమ్మలతో.
"లేదు. మేము రాం." చెప్పింది దేవిక.
అభిజిత్ మారాం చేసాడు.
"లేదు బాబూ. నీ అంతట నువ్వు మెసలుగలవు. ఆ నమ్మకం మాకు కలిగింది." నిండుగా చెప్పింది దేవిక.
"అదెలా." అడిగాడు అభిజిత్.
"శ్రీలక్ష్మి మూలంగా." చెప్పింది దేవిక.
"ఆమె.. ఆమె నీకు ఎలా తెలుసు." అభిజిత్ విస్మయమయ్యాడు.
"ముందు ఆమె ఎవరో నువ్వే చెప్పాలి." నవ్వుతోంది అమ్మమ్మ.
"ఆమె.. ఆమె.. ఎవరో. నాతో ఫోన్ లో మాట్లాడేది. నిజమే తనే నాలోని మార్పుకు కారణం." చెప్పాడు అభిజిత్.
ఆ వెంబడే.. "ఆ రోజు తర్వాత నుండి.. ఆమె నుండి ఫోన్ కాల్ లేదు. ఆమెతో మాట్లాడడానికి నేను ఎన్నో మార్లు ఎంత ప్రయత్నించినా ఆమె ఫోన్ కలవ లేదు." దిగులయ్యాడు.
"ఆమె ఆ సిమ్ లను తగలెట్టేసింది." చెప్పింది అమ్మమ్మ.
"నీకు ఎలా తెలుసు." సర్రున అడిగాడు అభిజిత్.
"ఆ శ్రీలక్ష్మి.. నీ అమ్మేరా." చెప్పేసింది అమ్మమ్మ.
నివ్వెరపోయాడు అభిజిత్.
"నువ్వు కోచింగ్ కై వెళ్తున్నప్పటి నీ చేష్టలతో 'నా పెంపకమే నిన్ను అవస్త పరుస్తోంద'ని నేను గుర్తించగలిగాను. దాంతో నేను 'శ్రీలక్ష్మి' అవతారం ఎత్తాను. గొంతు పలచ పర్చి పడుచులా మాట్లాడేను. నువ్వు మారేలా మల్చుకోగలిగాను." చెప్పుతోంది దేవిక.
అభిజిత్ మెల్లి మెల్లిగా తమాయించుకుంటున్నాడు.
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments