top of page

శ్రీమతి డొక్కాసీతమ్మ గారి సంక్షిప్త చరితము - 2



'Srimathi Dokka Seethamma Gari Sankshiptha Charitham2/2' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 08/02/2024

'శ్రీమతి డొక్కాసీతమ్మ గారి సంక్షిప్త చరితము2/2' పెద్దకథ

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)




ఇక పార్ట్ 2 చదవండి


చేతి చలువ:


విజయనగరములో ముదునూరి కృష్ణంరాజుగారు ధనికుడు. వారి భార్య పద్మావతీదేవి. వారిది చూడముచ్చటైన జంట. వారిని చూసి విధికి కన్ను కుట్టినది. పద్మావతీదేవికి మనోవ్యాధి పట్టుకున్నది. ఏ మందూ పని చేయలేదు. భూతవైద్యులకు కొరకబడలేదు. డొక్కావారి ప్రసాదము, డొక్కశుద్ది చేయున‌ని విన్నారు. ఖాండవవన దహనముతో అగ్నిహోత్రునికి కడుపునొప్పి తగ్గింది. అటులనే అమ్మచేతి

భోజనముతో అనేకమందికి కడుపునొప్పి తగ్గినది.

 

పద్మావతీదేవిని సీతమ్మగారింటికి తీసుకు వచ్చిరి. అమ్మ అమృతహస్తములతో, వెన్నలాంటి మనసుతో, మృదు మధుర సంభాషణలతో అన్నము పెట్టెను. అవి పద్మావతికి సంజీవని వలె పనిచేసెను. ముత్యపుచిప్పలు స్వాతివానతో తెరుచుకొనును. పద్మావతి హృదయకమలము వికసించెను. వారు సీతమ్మ గారింట నాలుగు రోజులున్నారు. పద్మావతికి సంపూర్ణ ఆరోగ్యము చేకూరెను. 


అది వసంతఋతువు. చెట్లు చిగిర్చి పూలు పూసెను. మానసిక ఆహ్లాదము కొరకు కృష్ణంరాజుగారు భార్యాసమేతుడై గోదావరి ఒడ్డునకు వెళ్ళిరి. సాయం సంధ్యాసమయము. చల్లని పైరగాలి, సప్తాశ్వరథ రూడుడు పడమటి కొండలలోనికి వెళ్ళెను. శీతకిరణుడు వెన్నెల పందిరి వేసెను. కృష్ణంరాజు దంపతులు సీతమ్మగారింటికి వచ్చిరి. సీతమ్మ దంపతులు వారికి గౌరీశంకరులవలె కనబడిరి. 


ప‌ద్మావతీదేవికి పరిపూర్ణ ఆరోగ్యముగా చేకూరెను. కృష్ణంరాజు గారు అపరిమితానందము పొందిరి. 


తూర్పు తెలతెలవారనున్నది. కోయిలలు “ కుహుకుహు కుహు రాగములు పక్షుల కిలకిల రావములు శ్రావ్యముగా వినబడుచున్నవి. ”శన్యూషం సకల దోషనివారణం” అని కృష్ణంరాజు దంపతులు తొలికూడి కూయగనే లేచి సీతమ్మగారికి పాదాభివందనం చేసి స్వస్థలమునకు బయలుదేరారు. నది ఒడ్డున నావ కొరకు నిరీక్షించు సమయములో సూర్యోదయమైనది. అమ్మ హస్తము సర్వరోగ నివారిణి, మనస్సు సంజీవని పర్వతమని, వారు చెప్పుకొనుచుండిరి. 


అన్నదాన నియమ నిష్టాగరిష్ఠురాలు - సీతమ్మ: 


దక్షిణకాశీగా ప్రసిద్దిచెందిన “అంతర్వేది” గన్నవరమునకు చేరువలో గలదు. వశిష్ఠ నదీమ తల్లి, సాగరసంగమం చేసిన పవిత్ర స్థలమిది. మనువు కాలమున ఇచ్చట నృసింహ స్వామి దేవాలయము ఉండేదట. లక్ష్మీనరసింహస్వామి కోవెల ఇక్కడ వున్నది. ఇచ్చటి శ్రీచక్రం, గొప్పమహిమ కలది. సీతమ్మగారు ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళలేదు. 


నరసింహస్వామి దేవాలయమునకు యాత్రలు బయలుదేరినవి. మేనాలో వెళ్ళుచుండగా దారిలో పెండ్లివారు కనబడిరి. వారు సీతమ్మగారింటికి మధ్యాహ్న‌ భోజనమునకు వెళ్ళవలెనని తమలో తాము చెప్పుకొనుచుండిరి. విన్నది సీతమ్మ తల్లి. మేనా వెనుదిరిగినది. దైవదర్శనా యాత్ర నిలిచిపోయెను. 


రెండు ఝాములవేళ భానుడు అగ్ని కిరణములు వెదజల్లుచున్నాడు. గాడ్పులతో అలసి, సొలసి వచ్చిన పెండ్లివారికి సీతమ్మతల్లి అర్ఘ్య, పాద్యాలను స్వయముగా యిచ్చినది. పంచభక్ష్య పరమాన్నాలతో షడ్రసోపేయమైన విందు చేసినది సీతమ్మ తల్లి. 


పెండ్లి వారు వెళ్ళుటకు తొందరపడిరి. గాయత్రీదేవిగా సూర్యోదయ కాలమున, మధ్యాహ్న కాలమున యవ్వన వయసుతో సావిత్రిగా, సాయంకాలము సరస్వతీదేవిగా జగన్మాత ప్రకాశించునని, ప్రచండభానుని కిరణములు మరొక ఝాము గడచిన చల్లబడునని, పైరగాలి తిరుగునని అమ్మ నచ్చజెప్పినది. 


మిట్టమధ్యాహ్నము పసుపు బట్టలతో ప్రయాణము అనర్థమని హితవు పలికినది. 


ఇసుకతిన్నెపై నడక మాటలు కాదని, మరొక ఝాము ఆపు చేసి విశ్రాంతి తీసుకున్నాక సాగనంపింది అమ్మ. 


క్షమాదేవత —“అమ్మ”. 


సీతమ్మగారింట వివాహము జరుగుచున్నది. సోదెమ్మ అనునామె ఒక చిన్నపిల్ల గొలుసు దొంగలించినది. పట్టుబడినది. గ్రామస్థులు ఆమెను బంధించిరి. త్యాగగుణమే దైవత్వము, త్యాగమూర్తి సీతమ్మగారు సోదెమ్మను విడిపించిరి. 


స్వార్థము రాక్షసత్వము. మానవునకు కోపమే ప్రథమ శత్రువు. స్వార్థమూర్తి సోదెమ్మకు కోపము తోడైనది. ఖలునకు నిలువెల్ల విషముండును. అసూయాపరులతో చేయి కలిపెను. పిచ్చికోతి కల్లు త్రాగినది. ఆపై తోక తెగినది అన్న చందమున సోదెమ్మ వ్యవహరించినది. సీతమ్మగారిపై మండి పడినది. అవాకులు, చవాకులు ప్రేలినది. చివరకు నర్సాపురం కోర్టులో సీతమ్మగారిపై పరువునష్టం దావా వేసింది. 


జడ్జిగారు వివేకమూ, విచక్షణ గలవారు. సూర్యకిరణాలని అరచేతితో ఆపలేము. గడప దాటని సీతమ్మ తల్లి కీర్తిప్రతిష్టలు గుప్పిటలో దాగివుండవు. జగద్విదితమైనవి. అందుచే న్యాయమూర్తి సీతమ్మగారిని కోర్టుకు పిలవలేదు. కోర్టు రికార్డులతో, సిబ్బందితో, న్యాయవాదులతో కలిసి గన్నవరము వచ్చెను. కచేరీ చావడి వద్ద విచారణ జరుపబడెను. సోదెమ్మ దోషిగా ఋజువయ్యెను. సీతమ్మతల్లి స్వాతిముత్యమంత స్వచ్ఛమైనదని నిర్ధారించెను. 


నిరుపేద అనాథ అయిన సోదెమ్మకు క్షమాభిక్ష ప్రసాదించమని సీతమ్మగారు న్యాయమూర్తిని కోరెను. 


గ్రామస్థులు సీతమ్మగారికి జేజేలు పలికిరి. ఎవరికో కాని కూడా పుట్టుకతో వచ్చిన చెడుబుద్ది పుడకలతో కానీ పోదు. తల్లి మాట వినరు. తండ్రికిచెడ్డ మాట వచ్చును. గురువుల హితవులు ఎక్కవు. అధికారులు విధింపు శిక్ష కూడా చెడు ప్రవర్తనను మార్చలేదు. భార్యాబిడ్డలు కనబడరు. 


కాని సోదెమ్మగారు, దొంగ సాక్షులు కూడా పశ్చాత్తాపపడిరి. క్షమాభిక్షకై సీతమ్మగారికి సాష్టాంగపడిరి. సీతమ్మగారి అనుచరులైరి. సీతమ్మగారి ప్రసన్నవదనము, హితవచనములు, ఆదర్శజీవిత శైలి, అపకారికి కూడా తప్పులు చూపకుండా ఉపకారము చేయునైజము చూసిన వారు సన్మార్గులుగా మారుట సహజమే కదా!


భూతదయ - సంజీవని హస్తము:


పాడి, పంట అన్నారు. గోమాతను కామధేనువుగా, ఎద్దును వెంకటేశ్వరునిగా భారతీయులు భావించి పూజిస్తారు. ఆవుపాలు సమీకృతాహారము. చంటి బిడ్డలకు తల్లిపాలతో సమానమైనవి. ఆవు తదితర పశువుల వలన లభించు పెంట- పంటలకు బలవర్ధక ఆహారము. 


ఆ రోజులలో పశువైద్యశాలలు లేవు. వాటికి “గాళ్ళు” అనెడి అంటురోగము వచ్చెను. పశుపోషణలో జోగన్నగారు అందె వేసిన చేయి. ఇరుగు పొరుగు గ్రామముల నుండి వచ్చిన బక్కచిక్కిన వందలాది గోగణములు గన్నవరము వచ్చినవి. అనుభవజ్ఞులైన జోగన్నగారి చేతివైద్యముతో స్వస్థత చేకూర్చుకొన్నవి. 


డొక్కా వారి పచ్చికబయళ్ళలో మేసెను. పవిత్రగోదావరి జలాలు త్రాగెను. పిక్క బలిసిన ఆవుల మందలు స్వస్థలములకేగెను. 


ఆదర్శరైతు జోగన్నగారు- సహధర్మచారిణి సీతమ్మగారు” 




ఆ రోజులలో కాలువ నీటి సౌకర్యములు లేవు. విద్యుత్‌, యంత్ర సహకార భూగర్భజల వినియోగము లేదు. రైతులు పశువుల సహకారముతో వ్యవసాయము చేసెడివారు. రైతు భుజాన కావడి, ఎద్దు భుజాన కాడి వుండెడివి. కోడి కూసినది మొదలు రైతులు పొలాలలో శ్రమించేవారు. కంది, పెసర, మినుము మొదలైన పప్పు దినుసులు, బుడుగా, జొన్న మొదలైన మెట్ట ధాన్యములు, ఇతర లఘుపంటలు పండెడివి. పశుపోషణ, వ్యవసాయములతో రైతులు రేయింబవళ్ళు కష్టపడేవాళ్ళు. 


మొట్ట మొదటిగా గన్నవరములో కొబ్బరి, మామిడి, ఇతర ఫలవృక్షములు నాటి, బ్రతికించిన రైతు జోగన్నగారు. బాడవలు, రొప్పుతో, డొంకలతో నిండివున్న గన్నవరము ఫలవృక్ష ఇతర పండ్ల తోటల ఉద్యానవనముగా మారుటకు మార్గదర్శకులు జోగన్నగారు. 


వార్ధక్యము:

సీతమ్మ గారికి ముసలితనం వచ్చినది. అనారోగ్యమూ పట్టుకున్నది. శక్తి సన్నగిల్లినది. చూపు మందగించినది. చెవులు దిబ్బడ వేసినవి. శరీర పటుత్వము తగ్గినది. ఓపిక నశించింది. అయినా ఓర్పు, సహనము, సేవా తత్పరతలలో మార్పు లేదు. జోగన్నగారు దాస, దాసీల సహకారముతో అన్నదానము కొనసాగించమనిరి. సీతమ్మగారి ఆత్మవిశ్వాసము సడలలేదు. స్వయముగా సేవ చేయుటలో వున్న తృప్తిని, అనుభూతిని మృదుమధుముముగా భర్తకు విన్నవించినదా యిల్లాలు. మనోధైర్యముతో అన్నదానము కొనసాగించిందా త్యాగమయి. 


విధి బలీయమైనది. బ్రహ్మ వ్రాత మార్చుట ఎవరి తరము కాదు. విధి వక్రించినది. 


సూర్యతేజస్సు తగ్గినది. పొగమంచు క్రమ్ముకున్నది. చెట్లు ఆకులు రాల్చినవి. జోగన్నగారు అస్తమించిరి. సీతమ్మగారికి వైధవ్యం వచ్చినది. పసుపు కుంకుమలు దూరమైనవి. గుండెలు దుఃఖభారముతో బరువెక్కినవి. లోకమంతయూ శూన్యముగా కనబడెను. జోగన్నగారి మరణవార్త దావానలము వలె వ్యాపించెను. వేలాదిమంది దుఃఖసాగరమున మునిగిరి. స్మశాన వైరాగ్యము అలుముకున్నది. 


సీతమ్మగారు ధీరోదాత్తురాలు. మానసిక దుర్బలత్వము ఆమెకు లేదు. మనసు దిటవు చేసుకొనెను. 

బాధను దిగమింగెను. గుండెలు చిక్కబట్టుకొనెను. కారణజన్మురాలు. కార్యదీక్షాపరురాలైనది. అన్నదాన వ్రతము కొనసాగించెను. సేవాదృక్పథముతో బాధను మరచిపోయెను. 




కవిత్రయములో నన్నయ్యభట్టు మొదటివారు. నారాయణభట్టు సమకాలీకులు. రాజరాజనరేంద్రనిచే పేరూరు, నందంపూడి అగ్రహారములు వారికి బహూకరింపబడినవి. సహస్రాబ్ది గడిచినను పేరూరులో మంచి నీటి బావి లేదు. 


సీతమ్మగారు నుయ్యి తవ్వించిరి. ఊరివారు వ్యతిరేకించిరి. కానీ సీతమ్మగారి బావిలో శుచి, రుచి గల త్రాగునీరు పడినది. ప్రజలు ఆనందాశ్చర్యానుభూతిని పొందిరి. ఊరివారు కూడా సీతమ్మగారి హస్తవాసిని పొగడిరి. 22 వ శతాబ్ధము లో కూడా సీతమ్మగారి బావి మాత్రమే అచ్చట మంచినీటి నుయ్యి. 


“విశ్వ విఖ్యాతి కీర్తిప్రతిష్ఠలు పొందిన లోకమాత సీతమ్మ”:

 

రవి అస్తమించని బ్రిటీష్‌సామ్రాజ్యమునకు రాజధాని లండన్‌ నగరము. సామ్రాజ్యాధిపతి ఎడ్వర్డ్‌ చక్రవర్తి. లండన్ నగరములో, రాజదర్భార్‌లో పట్టాభిషేక వార్షికోత్సవాలు చేయతలపెట్టెను. 1903 సంవత్సరము జనవరి మొదటి తారీఖున జరుగు వార్షికోత్సవమునకు రమ్మని సీతమ్మగారికి ఆహ్వనము పంపెను. సీతమ్మగారు గడపదాటని యిల్లాలు. అన్నదాన నియమములను మానలేదు. నిష్కామ

నిస్వార్థ, నిరాడంబర సేవా పరాయణురాలు. 


ఖండములు దాటి హెచ్చుకాలము పయనించి విందులు, వినోదములలో పాల్గొనునా? సున్నితముగా తన అశక్తతను తెలియజేసినది సీతమ్మ. 


భక్తికి రామదాసు, కవిత్వమునకు పోతనామాత్యుడు, సంగీతమునకు త్యాగరాజు ఆంధ్రరాష్ట్రమున

ప్రథమశ్రేణివారు. రాజానుగ్రహమునకు పాకులాడలేదు. శిక్షకు భయపడలేదు. అటులనే నిరతాన్నధాత్రి సీతమ్మగారు కూడా సహజముగా స్పందించినది. పరోపకార పరాయణురాలు ఇంటి వద్దే వుండుటకు నిర్ణయించుకుంది. 


కానీ నర్సాపురం మేజిస్ట్రేట్‌, విశాఖజిల్లా కలెక్టర్‌ మరియు మద్రాసు గవర్నర్‌ జనరల్‌ కూడా తమ ఉద్యోగ భంగమగునని భయపడ్డారు. సీతమ్మగారి వద్ద రాజసత్కారము, రాజదండన పనికిరావు. కావున సీతమ్మగారిని ప్రాధేయపడ్డారు. 


త్యాగమయి సీతమ్మ తన చిత్తరువును ఇచ్చినారు. 


మహదానందముతో వారా ఫోటోను లండన్‌ తీసుకెళ్ళిరి. ప్రస్తుతము మనకు లభ్యమవుతున్న చిత్తరువు అదే. భరతుడు శ్రీరామపాదుకా పట్టాభిషేకము చేసెను. అటులనే ఏడవ ఎడ్వర్డ్‌ చక్రవర్తి కూడా పట్టాభిషేక వార్షికోత్సవ శుభముహూర్తమున లండన్‌ రాజదర్భార్‌లో మొదటి వరుసలో తన రాజహస్తములతో భక్తిగా సీతమ్మగారి చిత్రపటమును ఆవిష్కరించెను. 


భారతీయులను బానిసలుగా భావించు తెల్లదొరల ఏలికచే, అత్యున్నత స్థలములో, అతని ముఖ్య సమయములో అత్యంత గౌరవపురష్కారము లభించిన భరతనారీమణి సీతమ్మ తల్లి, భారతీయులందరికీ గర్వకారణము. 


భారతీయులాశ్చర్యపడిరి. ఆనందపరవశులైరి. తనువులు భక్తితో పులకరించెను. ఆబాలగోపాలము అణువణువు వుప్పొంగగా సీతమ్మ తల్లికి జేజేలు పలికిరి. ‘అపర అన్నపూర్ణ’ గా సీతమ్మగారి చిత్రపటము కాశీపుణ్యక్షేత్రమున పవిత్ర అన్నపూర్ణ ఆలయము నందు ఆవిష్కరింపబడెను. 


ముఖేఃముఖేః సరస్వతి యన్నట్లు జోగన్నగారు నిర్వహించిన కవి, పండిత, సంగీత, సాహిత్య, కళాగోష్ఠుల వలన సీతమ్మగారికి వివేకము, వినయము, విచక్షణ, విజ్ఞానము లభించినవి. పుట్టుకతో ఆప్యాయత, అనురాగము, ఆదరణ, సేవాతత్పరత, త్యాగనిరతి, దయాధర్మాది గుణములు

వచ్చినవి. రాజకీయములెరుగని, ఉద్యోగములు చేయని, వేదికలెక్కని, ఉపన్యాసములివ్వని గడపదాటని ఇల్లాలు సీతమ్మగారి చుట్టూ భూమాత పరిభ్రమించినది. పండితులు, పామరులు, మహారాజులు, సామాన్యులు సీతమ్మగారి జీవన శైలిని ఆదర్శముగా తీసుకున్నారు. 


పల్లెలు, పట్టణములు, పరగణాలు దాటి ఆమె కీర్తి కాశీపుణ్యక్షేత్రమున చిత్రపటరూపమున

నిలచివున్నది. సూర్యప్రభ తేజస్సుతో సముద్రములు, ఖండములు అధిగమించి లండన్ మహానగరమున చిరస్థాయిగా ప్రకాశించుచున్నది. 


కొండలలో, కోనలలో, కానలలో కూడా వారు వేగముగా పరిభ్రమించి ప్రశంసా పత్రరూపమున సీతమ్మ

తల్లి తలుపు తట్టినది. 


By command of his excellency the viceroy and governer- general in council this certificate is presented in the name of the gracious Majestey King Edward VII Emperor of India, to Dokka Sitamma of Gannavaram is recognition of her Wellknown charity. 

(Sd) Stocks

Chief secretary to the Government of Madras. 

Madras. 

First January 1903. 

కాలచక్రములో రేయింబవళ్ళు, జీవిత చక్రములో కష్టసుఖములు కావడికుండలవంటివి. కాలమెప్పుడూ ఒకేలాగా వుండదు. ఋతుచక్రము తప్పినది. వరుసగా వర్షఋతువులో వర్షములు పడలేదు. పంటలు పండలేదు. భూములు బీటలు వారినవి. ఆహార ధాన్యములుకు కొఱత వచ్చినది. పశుగ్రాసము కూడా

లేదు. కరువు వచ్చినది. అన్నదాన సత్రములు మూతపడినవి. అన్నదాతలు అన్నార్తులైరి. 

అందుచే సీతమ్మగారింట అన్నదానము పెరిగినది. అందుచే ధాన్యాగారము శూన్యమైనది. చేతిలో చిల్లిగవ్వ లేదు. బిడ్డల సహకారముతో ఇప్పటి వరకూ అన్నదానము మానలేదు. మరి పైన ఆ పరమేశ్వరుడు ఏమి చేయునో అని సీతమ్మ తల్లి ఆలోచించుచున్నది. 


సాక్షాత్తు పరమేశ్వరుడు ముసలి బ్రాహ్మణ రూపమున సీతమ్మ గారింటికి వచ్చెను. సీతమ్మ గారు తినలేదు. బిడ్డలకు పెట్టలేదు. పచ్చగడ్డితో మాత్రమే పచ్చడి చేసి పరమేశ్వరునకు అన్నము పెట్టినది. 


పరమాత్మ జఠరాగ్ని చల్లబడినది. బిక్షపతి కడుపు నిండినది. పీట నుండి లేచి కాలువ వద్దకు వెళ్ళి కాళ్ళు, చేతులు కడుగుకున్నారు. ముసలి బ్రాహ్మణుడు గుడేశ్వర ఆలయము వరకూ వెళ్ళినారు. 


సీతమ్మగారికి పీట క్రింద, రోలుక్రింద నిధి దొరికినది. ముసలి బ్రాహ్మణుడు మరి కనబడలేదు. 

శేషజీవితమంతయూ శివద్రవ్యమును అన్నదానమునకే వినియోగించెను. ఈశ్వరకటాక్షముచే వర్షములు కురిసెను. ఉత్తరాయణము వచ్చెను. వసంతఋతువు కూడా వచ్చెను. చెట్లు చిగిర్చెను. పూలుపూసెను. పిందెలు, కాయలు, ఫలములతో ప్రకృతి పుష్పకవిమానమైనది. 


1909 ఏప్రియల్‌ నెల 28 వ తారీఖున సీతమ్మతల్లి పంచప్రాణములు అనంతవాయువులో లీనమైనవి. 

రాచకురుపులు వేసినను ఆఖరి శ్వాస విడుపు వరకూ అన్నదాన దీక్షమానలేదు సీతమ్మ తల్లి. 

ఆమె ఆత్మ పరమాత్మ‌లో లీనమైనది. కీర్తిప్రతిష్టలు భావితరములకు స్ఫూర్తిదాయకముగా నిలచివున్నవి. 


” సీతమ్మ తల్లి అమరజీవి”. 


“ సీతమ్మ గారు మా అమ్మమ్మగారికి నాయనమ్మ”. 



గజతురగ సహస్రం గోకులం భూమిదానం !!

కనక రజత పాత్రం మాదినీ సాగరాంతం !!

ఉభయ కుల పవిత్రం కోటి కన్యా ప్రధానం !!

నభవతి భువుతుల్యం హ్యన్నదానేన నూనం !!

అన్నదాత సుఖీభవ!!!

ధర్మో రక్షిత రక్షతః !!!

శుభంభూయాత్‌


========================================================================

సమాప్తం

========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు. 



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.













203 views0 comments

Comments


bottom of page