శ్రీమతి రాజీనామా
- Mohana Krishna Tata
- Sep 7, 2023
- 3 min read

'Srimathi Rajeenama' - New Telugu Story Written By Mohana Krishna Tata
'శ్రీమతి రాజీనామా' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"సుధా! తొందరగా రా! ఒకసారి.."
"ఏమిటండి.. !"
"చూడు.. టీవీ లో ఏదో వంటకం చూపిస్తున్నారు.. అది చెయ్యి.. ఈ సండే.."
"చాలునండి సంబరం.. టీవీ లో చేసేవన్నీ చేస్తే.. నా పని అంతే! ఇంక.."
"చూడు.. ఆ అమ్మాయి ఎంత అందంగా ఆ వంటకం చేస్తుందో.. పక్కనున్న ఆ యాంకర్ ఎంత బాగా చేయిస్తుందో! చూడు.. అయిపొయింది.. కర్రీ.."
"రుచి అద్భుతం అంటా! అమ్మాయి చెబుతుంది.. చెయ్యవే!"
"మీరు మరీనూ.. బాగోలేకపోయినా.. బాగున్నట్టు బిల్డప్ ఇస్తుంది ఆ అమ్మాయి.."
"పోనీ.. నువ్వు బాగా చేయొచ్చుగా.."
"ఇంతకుముందయితే.. వంటల ప్రోగ్రాం ఎప్పుడో గాని వచ్చేవి కాదు.. ఇప్పుడు వంటల కోసమే కొన్ని వందల ఛానెల్స్ వచ్చేసాయి.. మా ఆడవారిని చంపడానికి.."
"అలగనకే సుధా!.. నీకు కూడా అనుభవం వస్తుంది గా.."
"అంతగా కావాలంటే వంట మనిషి చేత చేయించుకోండి.."
"వంటమనిషి నీ అంత రుచిగా.. శుచి గా చేస్తుందా! చెప్పు.."
"ఎంత పొంగించినా.. నేను పొంగనంతే!.."
"మాట్లాడి.. మాట్లాడి గొంతు తడి ఆరిపోయింది.. కొంచం కాఫీ నీళ్లు ఇస్తావా?"
"ఇప్పటికి ఇది ఐదవ సారి కాఫీ తాగడం.. నా వల్ల కదండీ!"
"కాఫీ ఇవ్వడానికి అంత ఫీల్ అయితే ఎలా మరి.. సుధా!"
మర్నాడు మార్నింగ్.. భర్త మూర్తి లేచి.. “సుధా! కాఫీ..” అన్నాడు.. మళ్ళీ ఇంకొంచం గొంతు పెంచి.. “కాఫీ” అని మళ్ళీ అరిచాడు..
కాఫీ మటుకు రాలేదు.. పెళ్ళాం మాటా వినిపించలేదు..
మూర్తి మెల్లగా.. మంచం మీంచి లేచి.. ఇల్లంతా వెతికి చూసాడు.. ఎక్కడా.. లేదు.. భార్య సుధా..
హాల్ లో టీవీ టేబుల్ మీద గాలికి రెప రెప లాడుతున్న కాగితం మూర్తి కంట పడింది..
ఆత్రుత తో వెళ్ళి.. చదవడం మొదలుపెట్టాడు..
శ్రీమతి రాజీనామా.. అని సుధ సంతకం పెట్టి ఉంది..
కంగారు పడి వెంటనే.. వాళ్ళ అత్తగారికి కాల్ చేసాడు మూర్తి..
"అత్తయ్యగారు.. నిన్న సాయంత్రం నుంచి సుధ కనిపించట్లేదు.. అక్కడకు ఏమైనా వచ్చిందా?"
"ఇందాకలే వచ్చింది నాయనా!" అని కోపంగా అంది అత్తగారు తాయారు..
"కొంచం ఫోన్ ఇస్తారా.. మాట్లాడతాను.. "
"నీతో మాట్లాడదంట బాబు.. "
"చాలా కోపంగా, నీరసంగా ఉన్నాది పిల్ల.. ఎంత బయపెట్టావో.. "అని అత్తగారు విసురుగా మాట్లాడింది.
"నేను బయల్దేరి వస్తున్నాను.. "
మూర్తి కార్ తీసుకుని.. వెంటనే.. బయల్దేరాడు..
కొంతసేపటికి అత్తగారింటికి చేరుకున్నాడు మూర్తి.
"ఏవయ్యా అల్లుడు! ఎలాగున్నావు?” అంటూ ఎదో ఫార్మాలిటీ గా పలకరించింది తాయారు.. "
"చూస్తున్నారు కదా!.. ఎలా ఉన్నానో.. కంగారుగా.. ఉంది నా జీవితం.. " అన్నాడు మూర్తి.
"ఉండదు మరి.. అందర్నీ.. భయపెట్టేస్తుంటే.. "
"నేనా! భయపెట్టానా?.. ఎవరిని?"
"ఎవరినో అయితే నేనెందుకు అంటాను చెప్పు.. మీ ఆవిడనే.. "
"సుధా! ఇక్కడకు రావమ్మా"
లోపలనుంచి సుధ మెల్లగా.. ఇష్టం లేనట్టుగా వచ్చింది..
"ఇప్పుడు చెప్పవయ్యా! నా కూతురు చేత అంత చాకిరీ చేయిస్తున్నావు ఏమిటయ్యా? ఎంత సుకుమారంగా పెరిగింది నా కూతురు.. నీ గొంతెమ్మ కోరికలతో బెదర గొట్టేస్తున్నావు.. అడ్డమైన టీవీ ఛానెళ్ల లో వచ్చేవి చేసి పెట్టాలా? కాఫీ మంచినీళ్ళ లాగా తాగడం ఏమిటయ్యా?
సెలవొస్తే చాలు.. ఇంటికి ఫ్రెండ్స్.. చుట్టాలు వస్తారంట కదా!.. పైగా కొన్నావుగా ఇల్లు రైల్వే స్టేషన్ కి.. బస్టేషన్ కు పక్కనే.. అందరు దిగి.. సరాసరి మీ ఇంటికే వచ్చేస్తుంటారు మరి.. అందరికి మా అమ్మాయి వండి వార్చాలా? కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటుంది.. ఇక్కడే ఉంటుంది.. తర్వాత వస్తుంది.. "
"సుధ తో నేను మాట్లాడతాను.." కొంచం తగ్గిన గొంతుతో అన్నాడు మూర్తి
"సుధా! నాతో మాట్లాడు.. నువ్వు లేకుండా.. నేను ఉండగలనా చెప్పు? రాత్రి నిద్రపట్టదు.. పగలు ఏమి తోచదు.. నిన్ను ఏమి అనను.. నీ రాజీనామా ను వెనక్కు తీసుకో.. నువ్వు చెప్పినట్టే చేస్తాను..
కాఫీ నువ్వు ఇచ్చినప్పుడే తాగుతాను.. ఇల్లు సిటీ అవుట్‌స్కర్ట్స్ లో తీసుకుందాం.. అప్పుడు నో ఫ్రెండ్స్.. నో బంధువులు..
నీకు కుదిరినప్పుడే స్పెషల్ వంటకాలు చెయ్యొచ్చు..
నాకు నువ్వు కావాలి.. నీ ప్రేమ కావాలి.. సుధా.." అని కాళ్ళు పట్టుకునేంత పని చేసాడు మూర్తి
చిన్న చిరునవ్వుతో.. సుధ కార్ ఎక్కి కూర్చుంది..
****************************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments