![](https://static.wixstatic.com/media/acb93b_59aeb24ea57e4aa7b561b8c1181deb22~mv2.jpg/v1/fill/w_940,h_788,al_c,q_85,enc_auto/acb93b_59aeb24ea57e4aa7b561b8c1181deb22~mv2.jpg)
'Srimathi status' - New Telugu Story Written By Mohana Krishna Tata
'శ్రీమతి స్టేటస్' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
మురళి సపరివారంతో కలిసి.. వెళ్ళాడు.. సినిమాకు కాదండోయ్!.. అతని పెళ్ళి చూపులకు..
అమ్మాయి ఎదురుగా తలదించుకుని కూర్చుంది.. ఎదురుగా మన హీరో.. పక్కనే తల్లి జానకమ్మ..
"నీ పేరేంటి అమ్మాయి?" అడిగింది జానకమ్మ.
"మాయ" అని జవాబు వచ్చింది..
"ఎంత వరకు చదువుకున్నావు?"
"డిగ్రీ చేశాను.. "
"ఇంకేమైనా వచ్చా?"
"వాట్సాప్ మెసేజ్ లు చదవగలను.. రాయగలను.. స్టేటస్ పెట్టగలను.. "
"అమ్మాయి భలే కామెడీ చేస్తుందే అమ్మా!"
"వంట వచ్చా అమ్మాయి?"
"వచ్చు"
"అమ్మాయి నచ్చిందే అమ్మ! పెళ్ళి చేసేయ్.. వెంటనే చేసేయ్.. "
"ఆలోచించుకో కన్నా!.. కావాలంటే అమ్మాయి తో విడిగా మాట్లాడు"
"అవసరం లేదు.. అందంగా ఉంది.. చదువు ఉంది.. నెమ్మదిగా ఉంది.. చాలు.. "
"అయితే.. శుభస్య శీఘ్రం" అనుకున్నారు..
***
పెళ్ళి ఉన్నంతలో బానే జరిగింది. ఎన్నో ఆశలతో జీవితంలోకి అడుగు పెట్టాడు మురళి..
కొత్త పెళ్ళాం.. మొదటి రోజు.. మురళి కి నచ్చిన వంకాయ కూర.. ఉల్లికాడల పులుసు.. టమాటో పప్పు.. తో డైనింగ్ టేబుల్ అంతా అలంకరించింది మాయ. చూస్తుంటేనే, నోరు ఊరిపోతోంది మురళికి.. ఆ సువాసనకు సగం కడుపు నిండిపోయింది. అన్నీ.. నచ్చిన పదార్ధాలు కళ్ళ ముందర.. తన అంత అదృష్టవంతుడు లేడని మురుసి పోయాడు..
"ఏమండి! తినండి! స్టార్ట్ చెయ్యండి.. "
మురళి దేనితో స్టార్ట్ చెయ్యాలో అర్ధం కాలేదు.. పప్పు కలిపాడు..
"ఒక్కసారి ఆగండి.. అంది మాయ.. ఒక ఫోటో తీస్తాను.. క్లిక్.. ఇప్పుడు తినండి.. వెంటనే స్టేటస్ అప్లోడ్ చేసేయాలి"
"స్టేటస్ అప్లోడ్ చేసేసాను.. ఇంక తినండి.. "
"వంటలు ఎలా ఉన్నాయండి?"
"సూపర్ గా ఉన్నాయి మాయ.. "
(స్టేటస్ అప్లోడ్ అయ్యిపోయింది.. )
"ఇది కూడా అప్డేట్ చేసేసావా?"
"అవునండి!"
చిన్న పిల్ల కదా! అనుకుని.. నవ్వుకుంటూ.. మురళి ఆఫీస్ కు వెళ్ళిపోయాడు..
ఇంతలో ఒక కాల్ వచ్చింది.. లిఫ్ట్ చేసాడు మురళి..
"అక్క! ఎలా ఉన్నావు? ఈ టైం లో ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నావా?"
"బాగున్నాను గానీ.. మీ ఆవిడా వంట బాగా చేసినట్టుంది.. తెగ నచ్చిందనుకుంటాను.. ఇప్పుడే స్టేటస్ చూసాను.. "
"మీదాకా వచ్చేసిందా.. న్యూస్.. అంతా సోషల్ మీడియా లో నీ మాయ చేసిన మాయ తమ్ముడు!"
ఇంతలో.. ఇంకో ఫోన్..
"నాన్నా! ఏమిటి ఫోన్ చేసావు?"
"ఇప్పుడే చూసాను రా! వంకాయ కూర.. ఉల్లికాడల పులుసు.. టమాటో పప్పు.. నచ్చాయంట కదా.. ఎంజాయ్ కన్నా"
ఇలాగ ఒక యాభై ఫోన్ కాల్స్ వచ్చాయి.. మురళి తల పట్టుకున్నాడు.. ఇక పై జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు..
మర్నాడు.. మార్నింగ్ టిఫిన్ చేసిన మాయ.. "తిని చెప్పండి.. ఎలా ఉందో?"
బాగుందని చెబితే.. వామ్మో.. ఆ ఫోన్ కాల్స్.. భరించలేను..
(టిఫిన్ అదిరిపోయింది.. అయినా.. బాగోలేదని చెబుతాను.. )
"బాగోలేదు మాయ.. ఉప్పు ఎక్కవైంది" అని విసుక్కున్నాడు.
(ఈసారి ఎవరు ఫోన్ చెయ్యలేరు.. అని ఆనందపడ్డాడు)
ఒక గంట లో.. అమెరికా నుంచి అన్నయ్య ఫోన్..
"ఒరేయ్! మొన్న వంటలు సూపర్ అన్నావు కదరా!.. ఇప్పుడేమిటి టిఫిన్ బాగోలేదంటావా? నీకు బుద్దుందా రా! కొత్త పెళ్ళాం తో ఇలాగానే అంటారు.. " అని వాయించేసాడు..
.. వెంటనే ఫోన్ పెట్టేసాడు మురళి.
కొంతసేపటికి అమ్మ నుంచి ఫోన్.. అమ్మ ఎప్పుడూ.. నన్ను ఏమి అనదు.. ఏదో అవసరమై ఉంటుంది.. అందుకే ఫోన్ చేసింది..
"ఒరేయ్ కన్నా! టిఫిన్ బాగోలేదన్నావంట!.. ఏమిటి రా ఇది.. అమ్మాయి నచ్చేపెళ్ళి చేసుకున్నావు కదా!.. కొన్ని రోజులు సర్దుకోలేవు?.. నా పరువు తీస్తున్నావు కదరా!"
"నీకు స్మార్ట్ ఫోన్ లేదు కదా.. అమ్మ!"
"నా కొత్త కోడలు కొని ఇచ్చింది రా ఆన్లైన్ లో"
"ఇది ఎక్కడ మాయ రా బాబు!" అనుకున్నాడు మురళి.
ఇంక వరుస పెట్టి ఫోన్లు వస్తూనే ఉన్నాయి.. తిట్ల మీద తిట్లు..
పెళ్ళాన్ని ఏమీ అనలేదు మురళి.. కొత్త కాపురం మరి..
ఈసారి ఇలాగ కాదు అనుకున్నాడు..
రాత్రి డిన్నర్ టైం.. మురళి గుండెలు దడ దడ కొట్టుకుంటున్నాయి.. అన్నం తినాలంటేనే భయం వేస్తోంది పాపం..
"ఏమండి!.. వడ్డిస్తున్నాను.. రండి.. "
"ఏమిటో ఈరోజు ఐటమ్స్?"
"బెండకాయ వేపుడు, సాంబార్ పెట్టాను.. "
వాసన అదురుతుందిగా.. అనుకున్నాడు మురళి.. అయినా సరే.. కంట్రోల్ చేసుకోవాలని అనుకున్నాడు..
ఈలోపు మాయ వంటింట్లో కి వెళ్ళింది.. మురళి ముద్ద కలిపి నోట్లో పెట్టుకున్నాడు..
మాయ.. సమాధానం కోసం చూస్తుంది.. స్టేటస్ కోసం రెడీ గా ఉంది..
"మురళి ఏమి మాట్లాడకుండా.. తినేసి వెళ్ళిపోయాడు.. "
(ఎక్కడ నుంచి ఫోన్ కాల్స్ రానందుకు సంతోషపడ్డాడు మురళి.. )
ఈలోపు ఒక వ్యాన్ ఇంటి ముందు ఆగింది..
ఎవరా! అని చూసాడు మురళి.. అందులోంచి ఒక పది మంది ఆడవాళ్లు దిగి.. ఇంటి వైపు వస్తున్నారు..
"వామ్మో! ఎవరు వీళ్లంతా?.. నేను ఏమి అనలేదు గా?"
సరాసరి ఇంట్లోకి వచ్చిన ఆడవాళ్లు..
"మురళి అంటే మీరేనా.. ?"
"అవును.. చెప్పండి అక్కయ్య!.. "
"మీ ఆవిడ వంట చేస్తే.. ఎలా ఉందని అడిగితే.. చెప్పకుండా ఆమెను అవమానిస్తావా? నీకెంత ధైర్యం?"
"ఇంతకీ మీరు.. ఎవరో.. ?"
"మహిళా సంఘము నుంచి వచ్చాం.. మీ శ్రీమతి స్టేటస్ అప్లోడ్ చేసింది.. చూసాం.. "
(మా శ్రీమతి కి ఇంత ఫాలోయింగ్ ఉందనుకోలేదు.. అనుకున్నాడు మురళి)
ఇంకోసారి ఇలా చేస్తే.. ఖబడ్దార్..
"అలాగే అక్కయ్య!"
మురళి బుర్ర అంతా పాడయిపోయింది..
"మాయ! ఒక కప్పు కాఫీ ఇస్తావా?".. అని అడగబోయి.. వద్దులే.. మళ్ళీ ఏం గోల వస్తుందో ఏమో!.. బయట తాగేస్తాను.. అనుకున్నాడు..
**************************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
![](https://static.wixstatic.com/media/acb93b_9147f3217674494696f7459cafee01a0~mv2.jpg/v1/fill/w_204,h_308,al_c,q_80,enc_auto/acb93b_9147f3217674494696f7459cafee01a0~mv2.jpg)
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Bagundi